Monday, December 21, 2020

మంచి వెన్నెలవేళ

కార్తీక మార్గశిరాలు నాపేరన గుత్తి కట్టేసుకోవాలనిపించేంత అరుదైన జ్ఞాపకాలూ, అనుభవాలూ ఉన్నాయీ కాలంలో! 

దాదాపు పదేళ్ల క్రితం మార్గశీర్షంలో అనాలోచితంగా మొదలుపెట్టి రాసుకున్న  నెల్లాళ్ళ తిరుప్పావై కథా కుసుమాలు నా ప్రయాణంలో ఒక మైలురాయి. అయితే ఈ రాతల్లో నాదంటూ ఏమీ లేదు. మహానుభావుల కవిత్వానికి నా పైత్యం జోడించి అల్లినవే.  మున్నుడి నుండీ ముగింపు దాకా మెరిసిన వాక్యాలన్నీ  పురాకవిత్వం నాలో ఇంకి ప్రతిఫలించిన వెలుగులైతే, ఓగులన్నీ అచ్చంగా భవదీయురాలివి. 

"అరసికాయ కవితా నివేదనం శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ"  అని వాపోతాడో కవి. రసజ్ఞత లేనిచోట మాట్లాడవలసిన గతి పట్టించవద్దని బ్రహ్మకే మొరపెట్టుకోవడమన్నమాట. నా భాగ్యానికి అచ్చంగా నాదైన బ్లాగు ముంగిట్లోకొచ్చి చదివి వెళ్లే రసజ్ఞులైన అతిథులూ, సద్విమర్శకులూ దొరికారు. గొప్ప నేస్తాలు కుదిరాయి. 

అప్పటి తిరుప్పావై కథలని ఈ మార్గశిరంలో కూర్చి మాలకట్టే ప్రయత్నం చేసాను. e-book రూపంలో కాస్త ముస్తాబు చేసాను. ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

అడగగానే కవర్ పేజీ కోసం నా బాల్యమే రూపుకట్టినట్టున్న బొమ్మనిచ్చిన శ్రీ కేశవ్ వెంకటరాఘవన్ గారికి శిరసా నమస్సులు. కన్నయ్య కథలంటూ మురిసి తన బ్లాగులో అతిథిగౌరవమిచ్చిన వేణూ శ్రీకాంత్ గారికీ, పుస్తకం పని ఎందాకా వచ్చిందని నన్నంటిపెట్టుకుని ఆసక్తిగా ఎదురుచూసిన వంశీకృష్ణకీ, శ్రీనిధికీ ప్రేమపూర్వక ధన్యవాదాలు.  

జీవనమాధుర్యమే తానైన మురళీ మనోహరునికి ఏమివ్వగలను! కృష్ణార్పణం. 


Saturday, August 8, 2020

సవతు

నిద్రపట్టని రాత్రుల్లో ఇదొకటి. శరీరంతో పాటూ మనసుకూడా మొరాయిస్తోందివాళ. 

జరిగినవన్నీ నెమరేసుకుంటే ఉన్నట్టుండి చిన్నప్పుడు కాగితాలు కుట్టి రాసుకున్న డైరీ గుర్తొచ్చింది. నిజాయితీగా రాసుకున్న అక్షరాలు ఎవరిదో మూడోకన్ను చదివి నిలదీస్తుందని రూపాలు మార్చేసుకోవడం ఎంత అన్యాయం! మనతోపాటు పుట్టిన స్వచ్ఛతని నెమ్మది నెమ్మదిగా చేతులారా దూరంచేస్తాం. 

*****

కొత్త ఏడాది మొదలవుతూనే ఎక్కడివాళ్ళక్కడ ఆగిపోయాం. ఆర్నెల్లయినా ప్రపంచం ఇంకా తలకిందులుగానే వేలాడుతూండడంతో ఏం చేద్దామని తర్జనభర్జనలు. పట్నం వదిలి ఊరెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాక, కలిసి కాకుండా ముందువెనుకలుగా బయల్దేరుదామనుకున్నాం. అతిజాగ్రత్తే కానీ అవసరమే అనిపించింది. కర్మకాలి ఇద్దరం ఒకేసారి మంచాన పడితే ఊళ్ళో పెద్దవాళ్ళకి ఇబ్బంది కదూ. బల్లకట్టు ఒక్కొక్కరే దాటినట్టు జరగాల్సినపని మరి. 

నేను ముందు బయల్దేరాను. ఇంతోటి గంట ఫ్లైట్ దిగగానే రెండువారాలు హోటల్ లో ఉండి అప్పుడు ఊరెళ్ళాలి. బయలుదేరేముందు ఆదిత్య చదువుతున్న పుస్తకం లాక్కుని హేండ్ బేగ్ లో వేసుకున్నా. అమాంతం నా పీక కొరికేయాలనిపించినా నోరెత్తని మనిషికి అప్పుడప్పుడు అలాంటి శిక్షలు వేస్తూండాలి. 

హోటల్ రూమ్ దాటని మొదటివారం మామూలుగా గడిచిపోయింది. ఆ వారాంతంలో పుస్తకం తిరగేసా. నూటా పది పేజీల నవల అది. చదివి ఆలోచనల్లో ఎప్పుడు నిద్రపోయానో మరి. ఉదయాన్నే ఆదిత్య ఫోన్ తో లేచాను. 

మొహం కడుక్కుంటూ చెప్పాను.. నవల చదివానని. తను మొదటి పదిపేజీల దగ్గరే ఉన్నానన్నాడు. టాపిక్ మార్చేసాను. ఫోన్ పెట్టేసేముందు అడిగాడు.. "ఇంతకీ నవల ఎలా ఉంద"ని. "బావుంది. చదువుతావు కదా.. అప్పుడు మాట్లాడుకుందా"మని కట్ చేసాక పెదవి కొరుక్కున్నాను. తను కచ్చితంగా చదివేసాడని అర్ధమయిపోయింది. చెప్పెయ్యొచ్చుగా.. ఏదైనా అనొచ్చుగా! ఉహుఁ.. నేనే బయటపడాలి. ఆదిత్య బుర్ర లోపల ఎలా ఉంటుందో నేనూహించగలను. చిక్కులుపడిన వైర్లు చిట్లి పొగలు కక్కుతూ ఉంటాయి. బయటికి తొణకడు! 

రెండురోజులయింది. ఆ నూటపదిపేజీలూ నన్నొదలడం లేదు. చదువుతూ సగంలో ఉండగా ఒకసారి ఆదిత్య పక్కనుంటే బావుండుననిపించింది. పూర్తయ్యాక నాకీ ఏకాంతం అవసరమనిపిస్తోంది. 'ఒంట్లో బానే ఉంటే పర్లేదు వచ్చేయమ'ని ఊరినుండి ఫోన్లు. నాకిలా ఒక్కర్తినే ఉండిపోవాలనిపిస్తోంది. 

చీకటివేళల్లో బూచులతో పాటూ లోపలదాగునవెన్నో బయటికొస్తాయి. అలాంటిదేదో నాచేత ఆ రచయిత్రికి ఫోన్ చేయించింది. ఆవిడ గొంతు ఇంకా చెవుల్లో మోగుతోంది. 

*****

"నేనే మాట్లాడుతున్నా. ఎవరూ?" అని అడిగారావిడ. 
"మీ నవల చదివి ఫోన్ చేస్తున్నానండీ." ఆగిపోయాను. చాలాబావుంది అనడం మరీ ఏదోలా ఉంటుందేమోనని.. 
"అవునా.." ఆవిడా ఆగిపోయారు. 

"మిమ్మల్నోసారి కలవొచ్చా?" అప్రయత్నంగా అడిగాను. 

*****

హోటల్ క్వారంటైన్ పూర్తయ్యాక ఒక చిన్నపని చేసుకుని బయల్దేరుతానని ఆదిత్యకి చెప్పాను. ఎప్పట్లానే ఎలాంటి ప్రశ్నలూ లేవు. జాగ్రత్తలు మాత్రం చెపుతూంటే నాకు కచ్చి పెరిగిపోయింది. ఆటోలో ఉదయాన్నే బయల్దేరి మువ్వలవానిపాలెం చేరాను. దారిలో చాలాచోట్ల, ఆవిడ చెప్పిన వీధికి అటుచివర  కూడా బేరికేడ్లు. నంబర్ సరిచూసుకుని గేటుతీసుకు లోపలికి వెళ్తూ ఏభై ఏళ్ల క్రిందటి ఇల్లని అంచనా వేసుకున్నాను. 

బెల్ కొట్టిన కాసేపటికి ఆవిడ వచ్చి బయటి గ్రిల్ తీసి దారిచ్చారు. మాస్క్ తీయకుండానే ఎడంగా నిలబడ్డాను. గ్రిల్ వేసిన పొడవాటి వరండాలో కుర్చీలున్నాయి. అక్కడే కూర్చోడం మంచిదనిపించింది.  ఫేన్ వేసి కూర్చోమని, మంచినీళ్లు తెస్తానని లోపలికెళ్ళారు. అక్కర్లేదని ఉండాల్సిందనుకుంటూ చుట్టూ చూస్తూండగానే ఆవిడ వచ్చారు. 

టేబుల్ మీద పెట్టిన నీళ్ళగ్లాసు అందుకోకుండా నా బేగ్ దాని పక్కనే పెట్టి, మొహంలోకి తేరిపారా చూసాను. మెలికలుతిరిగిన అగరుధూపాలని వర్ణించిన మనిషి ఈవిడేనా! ఉక్కిరిబిక్కిరైపోయేంత ప్రేమని అక్షరాల్లో ఒలకబోసినది ఈవిడా! 

"ఎండగా ఉంది." అన్నారు జనాంతికంగా 
"అవునండీ. థాంక్స్.. వస్తాననగానే రమ్మన్నందుకు, అదీ ఇలాంటి సమయంలో." 
"నేను బయటికెళ్లను. చెప్పానుగా.. మీకు పరవాలేదంటే నాకేమీ ఇబ్బందేం లేదు." ప్రశాంతంగా చెప్తున్న ఆమెనే చూస్తున్నాను. వెలిసిన కళ్ళ కింది గీతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
"నేనూ రెండువారాలు హోటల్ రూమ్ దాటలేదండి." 

మౌనం. అలా కూర్చుంటే చిత్రంగా నిన్న రాత్రి పట్టని నిద్ర బాకీ తీర్చేందుకు ముంచుకొచ్చేస్తుందేమో అనిపించింది. మాస్క్ తీసి బేగ్ ముందు అరలో పెట్టాను. 

"అమ్మాయిలకి అర్ధమవుతుంది." అన్నారు అస్సలు సంబంధం లేని మాటతో మొదలెట్టి. నాకది గుచ్చుకుంది. గాజుగ్లాసు బద్దలైనట్టు, అది గుచ్చుకుని ఏడ్చేస్తే బావుండుననిపించినట్టు చెప్పలేని బాధ. 

"ఎందుకలాంటి నవల రాసారు?" అడిగేసాను. 

"రాసి ఉండకపోవల్సిందా?" 

"ఎందుకు రాసారు? అబ్బాయిలు.. మగవాళ్ళు కూడా చదువుతారు కదా అనిపించలేదా మీకు?" నా గొంతు అదోలా కీచుపోతోంది. 

"నిజమే.." సులువుగా ఒప్పేసుకున్నారు

"ఆదిత్య చదువుతున్న పుస్తకం నాతో తెచ్చుకుని చదివాను. అప్పటికే తను చదివేసి ఉంటాడు. లేదూ రేపెప్పుడో చదువుతాడు. నా రహస్యాలన్నీ మీ రూప బయటికి చెప్పేసినట్టు అనిపించింది. నేను దాచుకున్నవన్నీ.." 

ఏమీ మాట్లాడకుండా నావైపే చూస్తూ కూర్చున్నారు. ఒక రహస్యభాషలో ఆవిడని నేను నిలదీస్తున్నాను, కోప్పడుతున్నాను, ఏడుస్తున్నాను. సరియల్ గా ఉంది. చాలాసేపు అలాగే ఉండిపోయాం. నెమ్మదిగా తెప్పరిల్లి "లోపలికొస్తావా.." అన్నారు. వద్దని నా హేండ్ బేగ్ లోంచి మంచినీళ్ల బాటిల్ తీసి తాగాను. 

ఒళ్ళో ఉన్న కొంగుచివర చేతుల్లోకి తీసుకుని ఒకసారి సవరించుకున్నారు. నెమ్మదిగా వివరించడం మొదలుపెట్టారు. సర్దిచెప్పేధోరణి కాదది. సోలొలోక్వి.. తనతో తానే ప్రకాశంగా మాట్లాడుతూ నన్ను విననిచ్చినట్టు. 

"నవల రాయాలనుకోలేదు. రాయగలనని కూడా మర్చిపోయాను. ఎప్పుడో కాలేజీ మేగజైన్ కి రాసినవే. రావుగారు వెళ్ళిపోయాక ఆలోచించేందుకు నాకు బోలెడు సమయం చిక్కింది. క్లిషేగా వినిపించేవన్నీ నిజాలని అర్ధమవుతూ వచ్చాయి. చాలా మామూలు జీవితం నాది.. అతనితో. పెళ్లి, పిల్లలు, అన్నీ మామూలే. అందరితోనూ భలే సరదాగా ఉండేవారు. చాలా లోతైన గొప్ప మనిషి. నామీద ఎలాంటి కంప్లైంటూ ఉండేదికాదు." 

"రూప.." అడ్డుపడి అడిగాను. 

"నేనేనేమో.. నేనే. రావుగారికి నాకూ ఒక సన్నని గీత అడ్డుండేది. అది చెరిపేయడానికి నాకు అహం, అతనికి భయమేమో. ఇల్లంతా నేనే అయి తిరుగుతూ కూడా అతని గది బయట ఆగిపోవాల్సి రావడం ఎంత నరకమో తెలుసా. ఆ గదిలో ఆయన ఊహలుండేవి, మాటలుండేవి, కవితలుండేవి. బహుశా ఏ ఊహా ఊర్వశి ఉండేదో!" నవ్వారు. 

"వెళ్లి గుండెలమీద కూర్చుని నిలదీయాలనిపించలేదా?" నా మాటల్లో నాకే కసి వినిపిస్తోంది. 

"మీ ఆదిత్యని నువ్వు అడగగలవా? నీ కలలేమిటని? నీ మనసులో ఏముందని?" 

"వీళ్ళెందుకింత కాంప్లెక్స్ గా ఉండాలి? మనలో మనకే... ఒకరి బాధ ఇంకొకరికి ఎందుకు అర్ధం కాదు? చూస్తున్నారుగా పిట్టల్లా రాలిపోతున్నారు బయట.. ఎంత జీవితమని!" గింజుకున్నాను. 

"ఫియర్ ఆఫ్ లూజింగ్.." నిర్లిప్తంగా చెప్పారు. 

"లూజింగ్ వాట్??" 

"తెలీదమ్మా.. వాళ్ళందరూ అలాగే ఉంటారేమో. మనలో మాత్రం కొందరికే ఆ లోటు కనిపిస్తుంది. వెళ్లి అడిగి బద్దలుకొట్టుకోలేం. అలా అని ఆ దూరం భరించలేం." 

"మీ ఇద్దరూ ఎప్పుడూ ఏ విషయంలోనూ గొడవపడలేదా? అతిమామూలు జంటలా గొడవలు, కలిసిపోవడాలు.." 

"మామూలు కాదని ఎవరన్నారు? ఆ మధుమాలతి నాటే జాగా కోసం రెండురోజులు వాదించుకున్నాం. టీ గటగటా తాగేస్తే అరిచా.. వేడి లేదని చెప్పొచ్చు కదా అని. ఎవర్నైనా భరించచ్చు కానీ మీలాంటి మొండిమనిషితో కష్టం అని ఎన్ని వందలసార్లు అన్నానో! తల్చుకుంటే నన్ను నేనే కోసేసుకోవాలనిపిస్తుంది. నువ్వన్నట్టు ఎంత జీవితం.. ఇప్పుడు పదేళ్లుగా ఒక్కర్తినే బతికున్న మొండితనం నాదే మరి." 

"మీకు రావుగారంటే చాలా ఇష్టం." అంటూంటే నాకు ఆదిత్య కళ్ళముందు కదిలాడోసారి. 

"ఇష్టమే.. అందుకే కదా బాధ. తన అభిరుచుల్లో, ఆశల్లో ఎక్కడా నేను సరిపోననిపిస్తే బాధ కాదూ?" 

"అనుమానముందా?" అడిగాక నాలిక్కరుచుకున్నాను. 

"ఉహు.. నీకు లేనట్టే." నవ్వారావిడ. చూడడానికీ బానే ఉన్నారు. నేను ఈ వయసుకి ఈమాత్రంగానైనా ఉంటానా అని ఆలోచించుకున్నాను. 

"నాకు దొరికిన మనిషి.. ఆదిత్య చాలా స్థిరమైనవాడు. బోలెడు తెలిసినవాడు. ఒక్కోసారి నాకిన్ని తెలియకపోతే మా జీవితం సులువుగా గడిచిపోతుందేమో అనిపిస్తుంది." ఆలోచిస్తూనే చెప్పానావిడకి. 

"వేల ఏళ్లుగా మారుతూ వస్తున్న మనుషులం. మనతోపాటూ మానవసంబంధాలూను. ఇదీ అని చెప్పుకోలేని వెలితి. అందునా ప్రేమించావో అది మరీ బాధ. కళ్ళలో కళ్ళుపెట్టి చూస్తూ కూచోలేం కదా. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ ఒక స్తబ్దత. అందులోంచి పారిపోడానికి కలిసి చేసే పనులు, విడివిడిగా వ్యాపకాలు. వీటితోపాటూ తెలియకుండానే బంధంలో పడే సహజమైన బీటలని చూసి భయం." 

ఉలిక్కిపడ్డాను. బీటలు సహజమా!!

"ఆ పసుపు బిల్డింగ్ కనిపిస్తోందా.. అందులో ఎనిమిది కుటుంబాలుంటాయి. ఒక్కరైనా సంతోషంగా ఉండి ఉంటారా అనుకుంటాను ఇక్కడ కూర్చున్నప్పుడల్లా.." వేలుపెట్టి చూపిస్తూ చెప్పారు. 

"మీ నవలలో రూప ఆ వెలితిని అనుభవించినప్పుడల్లా, ఈవిడకేం తక్కువయిందీ అని తిట్టుకునేదాన్ని." నవ్వుతూ చెప్పాను. 

"అయితే బాగానే రాసానన్నమాట.." ఆవిడ కళ్లలో అదోలాంటి మెరుపు. 

"చెప్పండి.. రావుగారు చదివి ఉంటే? మీ ఇద్దరిమధ్యా ఆ తెర తొలిగిపోయేదా? మీకు కావలసింది ఇదీ అని ఆయనకి అర్ధమై ఉండేదా?" 

"ఉహు.. ఆయనకి అర్ధంకానిది ఉంటుందని నేననుకోను. కానీ ఏ ఇద్దరిమధ్యా అయినా కొంత దూరం తప్పదు. బలమైన వ్యక్తిత్వాలమధ్య ఉండే సహజమైన దూరమది. కాదని ఛేదిస్తే దగ్గరతనాన్ని తెచ్చిపెట్టుకున్నట్టుంటుంది. నా సమస్యలకి, ఇన్సెక్యూరిటీస్ కి తనని పరిష్కారం చూపించమనడం తప్పు." 

"నామాటకి మీరు సమాధానం చెప్పలేదు. మీ రూప మనసులో మాటలు ఆయనే చదివి ఉంటే?" 

"ఆయనా నవల రాసుండేవారేమో. టూ లేట్..." నవ్వుతూ చెప్పారు. 

"మీరు రావుగారికి సరిపోరని ఎందుకు అనుకున్నారు? నాకంటే కారణముంది." ఆవిడ కళ్ళలోకి చూస్తూ అడిగాను. 

"మేమిద్దరం కలిసి చదువుకున్నాం. పెళ్లికి ముందే తన ఇష్టాయిష్టాలన్నీ నాకు తెలుసు. తెలుసు కదా.. చాలామంది బయటికి మాట్లాడరు. నీలో ఇది నచ్చిందీ అని చెప్పరు. వాళ్లకి కావాల్సింది టోటల్ పేకేజ్. నన్ను చెప్పమంటే రావుగారి ఎడమ మోచేతిని కూడా వర్ణించి చెప్పగలను. కాకరకాయ వేపుడు రెండేసి ముక్కలుగా అన్నంలో కలుపుకుని ఎంత చక్కగా తినేవారో చెప్పగలను. ఆయనో.. కావాలంటే ఇష్టమైన పుస్తకాన్ని తొంభైనాలుగోసారి అంతే ఇష్టంగా మళ్ళీ చదువుకోగలరు.. అంతే. ఏళ్ళు గడిచేకొద్దీ ఒకరికొకరం అలవాటు పడిపోతాం. ఆడపిల్లలం కదా.. మనకి అప్పుడప్పుడు పట్టలేని ప్రేమొస్తుంది. అలా ఒక్కటంటే ఒక్క సందర్భంలో కూడా పట్టలేనితనం బయటకి చూపించని మనిషిని ఆ ఒక్క కారణానికి ఏం నిందిస్తాం? గింజుకుని గింజుకుని కొన్నాళ్లకి సర్దుకుని.. మళ్ళీ మామూలే.. కానీ.." 

"ఊఁ.." 

"జీవితం ఒకే చక్రంమీద నడిపేరోజొస్తే అప్పుడు మనం మిగలకూడదు. వాళ్ళకే ఆ బాధ వదిలేయాలి. మనచేతిలో ఉందా చెప్పు?" 

"రూప అందుకే..." అంటూ ఏదో మెరుపు మెరిసినట్టు ఆగిపోయాను. 

నవలంతా రూప ఆలోచనలుంటాయి కానీ.. చివరికి మిగిలిపోయేది తను కాదు! టీ వడగట్టుకుంటూ షెల్ఫ్ లో కూర్చున్న రెండో కప్పు వైపు అతను చూసే చూపుకోసం రూప అదే ఇంట్లో ప్రతి రోజూ ఎదురుచూస్తుంటుంది.

"టూ గుడ్! " అప్రయత్నంగా అన్నాను. ఆవిడ మొహంలో అదే నిర్లిప్తత. 

*****

వీధి గేటుకి ముందున్న మొక్కలదగ్గర కాసేపు ఆగిపోయాం. 

"ఇంతకీ రావుగారు ఆర్టిస్టా?" బయటికి దారితీస్తూ అడిగాను. 

"లోపలి వచ్చుంటే తెలిసేది." అన్నారావిడ నవ్వుతూ.. 

"వద్దులెండి. కొన్ని ఊహించుకుంటేనే బావుంటుంది." చెయ్యూపుతూ బయటికొచ్చేసాను. 

*****

దారంతా రూప నా కళ్ళముందు కదులుతోంది. 

రంగుల మిశ్రమాలు ఒలికి అతను వేసిన బొమ్మ అలుక్కుపోయినప్పుడు అదృశ్యంగా నవ్వుకున్న రూప.. 
ఆ వేళ్ళు దిద్దిన బొమ్మలో తనకి తాను కనబడక జీవితమంతా వెక్కిళ్లుపెట్టిన రూప.. 

Monday, January 20, 2020

హంపి

'ఎవరిదలఁచు చుంటివే?' యని యడిగిన
'నెవరుగలరు నాకు భువి?' నటంచు,
గోలుగోలుమనుచు గొంతెత్తియేడ్చి యా 
యింతి మమ్ముఁగూడ నేడిపించె! 

వందలయేళ్ళనాటి వైభవాన్ని తల్చుకు వెక్కిళ్లు పడుతున్న హంపిని చూసొద్దామని నువ్వు..  ఎప్పటిలాగే నీ వెనుక నేను.. 

"అప్పుడు పుట్టి ఉంటే?" అని పురాస్మృతులని తరచి తడుముతూ... నా దారి దీపానివి.. నీ వెనుకే నేను.. 

********

"కమలాపురం! కామలాపురం ఇది.. తిరుమల రామచంద్ర చెప్పలేదూ? విజయనగర ప్రభువుల పూజాకమలాలు ఇక్కడి నుంచే వెళ్లేవట. ఆ చెఱువు ఎక్కడో?" అంటూ మట్టిదారుల రోజులకి చెయ్యిపట్టుకు తీసుకుపోయావు. కాళ్ళు నేలమీదే ఉన్నా ఊహలు మబ్బు పొత్తిళ్లలోనే. 

ఓం ప్రథమమని కాలుపెట్టిన హంపీ విరూపాక్ష దేవాలయానికి "రాయలవారూ రాణులూ వచ్చేవారు కదూ?" అని తలవాకిట నా ఆలోచనలకి కొక్కేలు తగిల్చి ఆపై నువ్వేదో చెప్తున్నావు. నాకేమీ పట్టలేదింక. 

'హేమకూటానికి దారి ఇదే..' అని దారిలో భటుడొకడు చెప్పాడనుకో. చరిత్రకి సాక్ష్యాలుగా మౌనంగా నిలిచిన ఆ కొండరాళ్లలో ఏం వెతుకుతాం? కదంబమాల ఎరుగుదుం. కదంబమాలలా గోపురాలా! మన నాగరాజులా... నేర్చుకునేందుకు వచ్చిన కుఱ్ఱ శిల్పులు చెక్కినవంటావా? మరి ఎక్కడా పిల్లి బొమ్మ కింద మల్లి అని రాయలేదే! వెతికాను. అంతలేసి బండలు, ఆపైన చెక్కిన మెట్లు! ఎలా సాధ్యమో, ఆ కాలానికి ఎంతలేసి మనుషులో! గుట్ట మొగలో రాతి మంటపాలు. కూలిన కోటల్లో తిరిగినా కలగని వింత అనుభూతి. బహుశా చూడవచ్చే వారికి, గుర్రాలకి విశ్రాంతిగృహాలుగా ఊహించుకుంటే ఆరోజుల తీరు కొద్ది కొద్దిగా ఊహకి అందుతుంది. విరూపాక్షుని కోనేటి మెట్లు, పూల అంగళ్ళు, కోవెల దారులు... వినే చెవులకోసం ప్రతీ రాయీ కథలెన్నో దాచుకుని ఎదురుచూస్తున్నట్టు కనబడడం మొదలయింది. 

చిన్నికృష్ణుడి కోవెలొకటి.. ముక్కలు చెక్కలైపోయింది. మిగుళ్ళూ తగుళ్ళూ ఎక్కడో దాచిపెట్టారట. సున్నపు కట్టు మధ్య అస్థిపంజరాల్లా పొడుచుకొచ్చిన ఇటుకల రాజగోపురం చూస్తే నొప్పేసింది. భోరుమంటానని తెలిసి నా తీరుమళ్లించేవాడివి నువ్వు. "అచ్చం మీ పద్మనాభం కుంతీమాధవస్వామి కోవెలలా లేదూ?" అని ఆశ్చర్యపోయావు. మా పుట్టినింటి గజపతుల పీచమడిచాడీ కృష్ణదేవరాయలు! పోనీలే... ఈ ఊరిపేరూ విజయనగరమేగా. ఆ సామ్యానికి నెమ్మదించాను. ఆలయం ఎదురుగా బజారు ముందు శంఖుచక్రాలు తీర్చిన రాతి హుండీ! ఏనుగులు కదిపినా కదిలేలా ఉందా దానిపై మూత? పక్కనే ఎక్కడైనా కుండీలు కూడా కనిపిస్తాయేమో అని వెతికాను. అశ్వదళాన్ని పెంచేందుకు రాయలవారు దిగుమతి చేసుకున్న మేలుజాతి గుర్రాల పిల్లలకి పాలుపట్టే రాతి కుండీలుండాలెక్కడో! విస్తరించిన కృష్ణబజారు ఆనవాళ్లు కనుచూపుమేరా కనిపించాయి. రత్నాలు రాసులు పోసినారిచట? ఇక్కడ కాదట. ఇది తిరనాళ్ల బజారే! 

తలెత్తి చూసినా తనివితీరని ఎత్తులో ఎక్కడో ఉన్నతంగా కూర్చున్న నారసింహుడి ఒళ్ళోని లక్ష్మిని దాడి చేసి ఎత్తుకుపోయారట. ఆమే హంపీ ఐశ్వర్యానికి చిహ్నమనిపించింది. ముష్కరులు రాతిని కూడా ఇనుప గుళ్ల ఫిరంగులతో పేల్చి నాశనం చేసేసారు. మనసు కెలికినట్టు, రుద్రభూమిలో తిరుగుతున్నట్టు... నిర్వేదమేదో మనసుకి ఇంకుతోంది. ఇంతా ఇక్కడికొచ్చి పోగువేసుకు వెళ్ళేది ఇదేనా? 

పిళ్లారి గీతాలలో 'లంబోదర లకుమికరా..' అని సరిగమలు నేర్పే బొజ్జ గణపయ్య, ఆ పురందరదాసు పాడిన అంబాసుతుడు ఇక్కడి కొండమీది కడలేకాళ్ (సెనగగింజ) వినాయకుడే! ఇంకాస్త చిన్నగా ఉన్న సాస్వీరేళ్ వినాయకుడి బొజ్జ నిజంగా ఆవగింజలా నున్నగా గుండ్రంగా ఉంది! సెనగగింజని మాత్రం నుజ్జు నుజ్జు చేసేసారు! హంపీ చేరాక మొదటిసారి అనిపించింది.. నిజంగా దేవుడుండి అడ్డుకోరాదా ఈ విధ్వంసాన్ని అని. 

గాజుల గలగలలు ఏ రాతిలోనైనా ప్రతిధ్వనించేలా ఉంటుందని ఊహించిన అంతఃపురాన్ని చూసేందుకు వెళ్తే... పగిలిన రాతిముక్కలున్నాయి. రాతి పునాది మీద మొదలు నరికిన ఐశ్వర్యచిహ్నాలున్నాయి. సమూలంగా నాశనం చేయడమెలాగో తెలిసిన జాతొకటి కిరాతకంగా బొబ్బలు పెట్టినట్టు వినిపిస్తోందక్కడి గాలి. ఆశ చావక ఒక చెట్టు మొదలు తడిమి అడిగాను గుర్తుందా? ఈ చెట్టు వయసెంతుంటుందీ అని. ఫిరంగుల రణగొణల్లో, కాసులు దోచే ఆత్రంలో ఇనుపపాదాలు తొక్కకుండా విడిచివెళ్లిన పసిమొక్కేదో ఇంతయి ఉంటుందా అనే ఆశ. అయితే మాత్రం... దానికి జీవితమంతా తన వేళ్లే సంకెళ్లయిన ఒంటరితనమేగా? పాపం ఏమంటుంది? బావురుమని తెగిపడిన నల్లపూసల సౌరు కథలుగా వినిపిస్తుందా? చిందిన రక్తాన్ని, ఖణేల్మన్న యముని మహిషపు లోహఘంటల మ్రోతని వర్ణిస్తుందా? విని తట్టుకునే దిటవున్న గుండెలా మనవి? 

విశాలమైన మైదానమొకటి మిగిలింది.. అక్కడక్కడా కూలిన రాతిగోడలు. ఒకవైపు ఖజానా, మరోవైపు జనానా. ఆపై కలువపూవు మేడ. ఎన్ని వీణలు మోగిన విశ్రాంతి మందిరమో! కూతవేటు దూరాన పట్టపుటేనుగుతో కలిపి మొత్తం పదకొండు ఏనుగులకి మహలొకటి. ఆ పట్టపుటేనుఁగు... రాజ్యలక్ష్మిని, సాహితీ సరస్వతిని, పరాశక్తిని తనపై ఆరోహణ గావించుకున్న భాగ్యశాలి! ఒళ్ళు గరిపొడిచింది. ముచ్చటైన గుమ్మటాలని చూస్తే అక్కడినుంచి కదలబుద్ధవలేదు. కరి మకరి సంవాదం, తుంగభద్ర సుడులలో మొసళ్లు... మనసు పరివిధాల కొమ్మచ్చులాడుతోంది. 

ఎంత యాకఁలి గొనియున్న నిదిగొచూడు! 
దయిత కరణీముఖంబును దలఁచుచుండి
తినమనసురాని కుంజరమునకు వాడెఁ 
దొండమున యందె తామరతూండ్లపిడుచ 

తన ఆడుదాని ముఖం గుర్తొచ్చి ఆకలేస్తున్నా తినలేక, ఆ ఏనుగు తొండం చివర పట్టుకున్న తామరతూండ్ల పిడచ ఎండిపోయిందట. 

ప్రాసాదంలో పనిచేసే పరిచారకుల విడిది గృహమొకటి విస్తారమైన చావిడిలా తరగనంత మేర పరుచుకునుంది. ఒక్క క్షణమాగి ఆలోచిస్తే.. ఎందరికి ఉపాధి, ఎంత స్వయంప్రతిపత్తి అని ముచ్చటేసింది. వర్తమానపు కొలతల్లో చరిత్రని కొలిచే సాహసం చేయకూడదు. కొందరు మనుషులు అటువెళ్లకపోతే బావుండునని మొక్కుకున్నాను. "రాణీగారు స్నానం చేసి, పూజాగృహానికి వెళ్లి, వస్తూ ఏనుగులకు ఏ వెలక్కాయలో తినిపించి వెనక్కొచ్చేసరికి పొద్దు గడిచిపోతుంది." అని నవ్వుకున్నాం కానీ, కోట గోడలు ఆపలేని విపత్తు వస్తే బతికుండగానే కనిపించగల నరకపు మెట్లు ఆ రాణీవాసపు ముంగిల్లోనే ఉంటాయి.  "మల్లీశ్వరి రాణివాసానికి ఇక్కడికే వచ్చింది." నమ్మకంగా చెప్పావు. అవును.. హజార రామస్వామి మందిరం కనిపించేలా గవాక్షమెక్కడో వెతుక్కుని నిలబడే ఉంటుంది. మమతలెరిగిన మేఘమాలని బతిమాలుతూ...  

నల్లరాతిలో చాళుక్యుల నగిషీ పనితనపు నమూనా గోపురాలు, చిన్న చిన్న ఆరాధనా విగ్రహాలు, నాగిని ప్రతిమలు, వీరగల్లు, సతిగల్లు, యాళి, సప్తాశ్వరథి, చిలుక తత్తడి రౌతు, లింగాకృతులు, పక్షులు, రోళ్ళు, కల్వం, పనిముట్లు... ఆఖరికి గుర్రప్పిల్లలకు పాలు పట్టే కుండీ కూడా కనిపించింది! అన్నీ దొరికాయి.. తవ్వకాల్లో. పీలికలు చీలికలైన మానవత్వమెక్కడో పాతాళానికి జారిపోయి ఉంటుంది.

చనిన యోవనంబు వెనుకకు రాదు; జీ 
వంబు చూడ శాశ్వతంబె కాదు;
ఒక్క నాఁడువోలె  నొక్క నాడుండదు;
జనులకింత కటికతనము లేల? 

చినచేపను పెదచేప.. చినమాయను పెనుమాయ! 

మాయమత్తు పూసుకుని ఉత్సాహం తలదాల్చి ముందుకెళ్లి చూస్తే సభామంటపం! నవరాత్రి మంటపం!! కత్తిపట్టి నిలిచిన విశ్వనాథనాయకుని బొమ్మచెక్కిన మంటపం! సాక్షాత్తూ సాహితీసమరాంగణ సార్వభౌముడి సభామంటపం! మనసు చిందులేసి ఇంకెక్కడికీ పోకుండా నీ చేయి ఆసరాతో అడుగు ముందుకే వేసాను. అష్టదిగ్గజాలు.. అన్నమాట బయటికి పలికి మొహాలు చూసుకునే ధైర్యం మనకి లేదని బాగా తెలుసు. రాజులసొమ్ము రాళ్ళపాలు కావొచ్చుగాక. సుకవి నివాసం కాలప్రభావానికి కూలిపోనిది. అక్షరమన్నారెందుకే. 

నిలిచిపోయిన కీర్తికాయం ఈ అవశేషాలలో మిగిలినందుకు గుడ్డిలో మెల్లనుకోవాలా? విద్యారణ్యస్వామి ఆశీస్సులతో బుక్కరాయలు పరిగెత్తగలిగినంత మేరా ఆదిశేషుడు గండి చేస్తే బుక్కసాగరమయిందట కదా! కథని కొట్టిపారేసినా అక్కడ నుంచి తవ్వించిన తురతకాలువ నుంచో, నేరుగా తుంగభద్ర నుంచో రాతి తూఱలతో నీరు మళ్లించిన స్నానవాటిక, అది కూడా సభాస్థలి కాస్త దూరాన! ఆ నల్లఱాయి మెట్ల అమరిక చూస్తే నోరు అలా వెళ్ళబెట్టాల్సిందే! స్నానాలకు, నిరంతర అన్నపానాదులకి కట్టించిన వంటిళ్ళు, వసారాలు, సదుపాయాలు, అక్షరాలా వేయి రామచిత్రకథలతో హజార రాముని సన్నిధి, భద్రమైన కోటగోడల వెనుక జనజీవితం. శిబి ప్రముఖులుం బ్రీతిన్యశఃకాములై యీరే కోర్కెలు? - కేవలం కీర్తి కాముకులై రాజులు ఇవన్నీ చేసి ఉంటారా? రాజ్యభారం భుజాలపై పడ్డాక స్వాతంత్ర్యపు గాలి పీల్చడం కష్టమని - చిన్నాదేవితో రాయలవారు చెప్తున్న దృశ్యం కళ్లకి కట్టింది. 

సాక్షాత్తూ విజయనగర సామ్రాజ్య పట్టమహిషి, రాణీ వార్ల స్నానవాటికని చూసే అవకాశం అప్పట్లో నేనే మల్లీశ్వరినో, పోనీ గందోళినో అయితే తప్ప ఉండేది కాదేమో కానీ, ఇప్పుడందరికీ ప్రవేశముంది. కట్టడానికి వాడినది సున్నమో, వెన్నో అర్ధం కానంత నగిషీ పనితనం!! ఛిద్రమైన అందమే ఇంత అద్భుతంగా ఉందే!! సంగీత సల్లాపాలతో, కలరవాలతో, కేళీవిలాసాలతో మత్తెక్కి ఉండేదేమో ఆ గాలి. పూల తివాచీలను, పునుగు జవ్వాది మైపూతలను, చందనపు నలుగులను, పన్నీటి జలకాలను ఊహించుకుంటే తప్పేమిటి? ఊహలకి అదుపేముంది! గాలికంటే తేలిక, చవక. 

కోపంతో బుసలు కొట్టడం 
గుసగుసలు మాట్లాడడం 
ముఖం చిట్లించడం 
చేతిగాజులు గలగల్లాడించడం 
ఓ కుసుమ వృక్షమా! నిన్ను చూసైనా 
కన్నెపిల్లలు నేర్చుకుంటే ఎంతబావుంటుంది! 

అన్నట్టు పువ్వులు రాల్చిన చెట్లెన్నో ఆ స్నానవాటిక ముంగిల్లో ఉపశమనంగా కనిపించాయి. ఆ స్నానాల ఇంటి చుట్టూ మెడబంటి కందకమొకటి ఉంది.. అది దాటుతూంటే మరీ మరీ "సొంత ప్రదేశమిది!" అన్న భావన. చెప్తే పెదవి బిగించి నవ్వుతావుగానీ.. 

ఐదువందలు - అంటే అంతేగా అనిపిస్తుంది. పలకమీద గీసే గీతలయితే అంతే. అదే జీవితకాలంలో లెక్కించుకుంటే ఎన్నెన్ని తరాలు, ఆచారాలు, అలవాట్లు, నుదుటిరాతలు. 

ఎన్నిగంటలు, పూటలూ చూసినా సరిపోదని విన్న విఠలుడి సన్నిధికి నడిచిపోతూ ఉంటే కుడిచేతివైపు ఆకర్షించిన గజ్జెల మంటపాన్ని ఎంత చూస్తే తనివి తీరుతుంది! నాట్యానికి అనువైన వేదిక! ఆ భంగిమలు చెక్కిన ఆ స్తంభాల సొగసు చూడాల్సిందే. అప్పటికే దారంతా చూసిన మంటపాలన్నీ ఒక ఎత్తు.. గజ్జెల మండపమొక ఎత్తు. చుట్టూ పచ్చదనంతో, చెదరని వన్నెతో ఎంతసేపు కూర్చున్నా, పరిశీలనగా చూసినా ఇంకా ఒలికే సౌందర్యానికి దాసోహమవ్వక ఏం చెయ్యగలం! కుదిరేగుంబె మంటపం దాటి పుష్కరిణిలో నీడలు చూసుకుని విఠలుడి కోవెల చేరే దారికిరువైపులా రాళ్ల కుప్పలైన రత్నాల అంగళ్లు. మైలు పొడవున రెండంతస్తుల బజారు. ఎవరు చెప్తారక్కడి బేరసారాల కబుర్లు? ఎవరు చూపిస్తారు మనకా మిలమిలలు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా రాజ్యం సుభిక్షమని, ప్రజలు సంతుష్టులని అర్థమవడానికి. సామాన్య జీవితమెంత సుఖంగా గడిచేదో ఊహించుకోడానికి! కడుపుకి తిండి, మనసుకి ప్రేమ దొరికేదని సంబరపడడానికి. ఎక్కడినుంచి ఎక్కడికి జారిపోయాం! పురోగమనమంటే ఇదైతే అక్కర్నేలేదు కదా!  

అతిప్రయత్నం మీద కదిలి విఠలుని సన్నిధిని, సంగీత మంటపాన్ని, రాతిరథాన్ని.. ఇంకా మిగిలిన ఆశల్లా అక్కడక్కడా కనిపించిన రంగుల చారికలని చూస్తుంటే అర్ధం కాని ఉద్వేగం. చిత్రాతిచిత్రమైన ఆ శిల్పకళని చిలవలుపలవలుగా వర్ణించాడొక చిరంజీవి. అదిగో రాయల్ని తూచిన తులాదండమన్నాడు. వెఱ్ఱివాడా.. రాయలేడీ? తూచే సొమ్మేదీ? చప్పట్లు కొట్టిన ప్రజ ఏరీ? గొడుగుపాలుడిలా నాకో, నీకో ఒకరోజు ఈ సామ్రాజ్యం దక్కితే అణుమాత్రమైనా మిగలని మనసుతో ఏం చెయ్యగలమోయీ అని అడిగితే? రాతి గట్టుని ఆనుకుని మొలిచిన సువర్ణగన్నేరుని చూస్తుంటే చటుక్కున తట్టింది. ఎలాంటిదో, కుంటిదో, గుడ్డిదో.. కునిష్టిదో నా ఈ జీవితం చాలా చిన్నదని. సగం దూరం నడిచొచ్చేశామని.. యాత్రాఫలశృతి ఇదేనా? 

హంపి ఒక పురాస్వప్నం, సడలిపోయిన శిల్పసుందరి, దొంగలు పెళ్ళగించిన మణిమంజూష. తెలుగు లెస్సన్న కృష్ణరాయలవారి రాజధాని. మన దురదృష్టానికి మిగుల్చుకున్నదేదైనా ఉంటే అవి కాసిని అక్షరాలు! దొంగలెత్తుకపోనివి కనుక. 

*********

ఐదువందల సంవత్సరాల క్రితం ఆ నేలపై నడిచిన నాగరికతల ఆనవాళ్లు ఇలా వెతికితే దొరికేవి కాదు. విరిగిన ముక్కల్ని అతికించుకుని ఊహల్లో ప్రహేళిక పూరించడమే. అయితే ఒక దారుంది. సైద్ధాంతిక ప్రమాణమేదీ లేకపోయినా అక్షరాలలో పొదిగిన ఆనవాళ్లు కొన్నున్నాయి. కృష్ణదేవరాయలు తనకంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనని మాలిక అల్లాడు. ఆముక్తమాల్యద. మరి ఆయన గతించిన కాలాన్ని ఎలా ఊహించాడు? విల్లిబుత్తూరుని, మధురని, జనసామాన్యాన్ని అతి సునిశితంగా పరికించి ఎలా అక్షరబద్ధం చేసాడు? ఎంత కల్పనే అయినా, అప్పటికి రచించి ఉన్న శాస్త్రాల ఊనికతోనే రాసిన ప్రబంధమైనా, రాయలవారి కాలంనాటి హంపీ ప్రాభవం ఆముక్తమాల్యదలో తొణికి ఉంటుందని అనుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. హంపీ నగరాధీశుడి ఊహ ఎంత గొప్పదో కావాలంటే చూడు.. 
పొట్నూరు దగ్గర కృష్ణదేవరాయల విజయస్తంభముంది. ఆకాశమార్గాన సింహాచలస్వామి తిరనాళ్ళకి వెళ్లొచ్చే దేవతలు ఆగి, ఆ స్తంభంపై రాసిన అక్షరాలు చదివే ప్రయత్నం చేస్తారట. స్పష్టంగా లేని తాళపత్రం చదవాలంటే నల్లని మసి పూసి చదవడం అప్పటి అలవాటేమో.. దేవతలు గజపతి పరాజయమనే నల్లనిరంగు పూసి విజయస్థంభాన్ని చదువుతారట! అలాంటి ప్రబలరాజాధిరాజ వీరప్రతాప రాజపరమేశ్వరార్థదుర్గానటేశ సాహితీసమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయలవారి కాలానికి మా సింహాచలం మీదుగా వెళ్దాం రా.. 

నీలాల కోయిలలు, మరకతాల చిలుకలు, కెంపుల కలశాలు, ముదురుపచ్చల ఏనుగుల చెక్కడపు పనితో మణిమయ సౌధాలతో నిండిన తీరైన వీధులు. వివాహానికి నొసట కట్టిన బాసికమంత నిట్టనిలువుగా వీధుల అమరికతో ఆ ఊరు. ఎఱ్ఱని బొండాల కొబ్బరిచెట్లు మణిమయాలైన రహదారులకి ఇరువైపులా బారులు బారులుగా ఉన్నాయి.  

వీధుల్లో ఒల బావులు ఉండేవి. బొడ్డుటొఱ దాకా వచ్చిన నీళ్లలో తిరిగే చేపల్ని అందుకునేందుకు ఇంటి చూరుల్లోకి సాగిన కొమ్మల దాగి లకుముకి పిట్టలు రివ్వురివ్వున దూకుతున్నాయట. వీధుల వెళ్లే అంగనలతో ఆ ఇళ్ళు పొంచి ఉండి పూలచెండులాడుతున్నట్టు మనోహరంగా ఉంటుందా దృశ్యం. 

ఉద్యానాలలో చెంగలువల కొలనులో స్త్రీలు పసుపు పూసుకుని స్నానం చేసి, కోవెలలో స్వామికి అభిషేకజలం కడవలతో మోసుకుపోతారు. నీటితో భారమైన కడవలు నడుముకి అన్చి, పూజార్థమై చేతిలో పట్టుకున్న కలువలు ఆ కడవనీటిలో తొణికిసలాడుతుండగా వనాల లోపలిదారులగుండా స్వామిని చేరుతారు. తోవ పొడవునా దివ్యప్రబంధాలు వల్లెవేస్తూ, పాడగములు ధరించిన చక్కని పాదాలతో నడచి వెళ్తారట. 

అంగనల సంగతలా వుండగా వారాంగనలెంతటి వారో విను. సన్యాసుల హృదయాన్నైనా ఝల్లనిపించేంత రూపసులు. సరే, అరుగుల మీద కూర్చుని పాచికలాడడం వారికి వినోదం. ఎవరొచ్చినా మొగమెత్తి చూడరు. కోవెలకి వెళ్లొచ్చే భగవత్ కైంకర్యపరులయితే మాత్రం ఠక్కున లేచి మొక్కుతారు! వారి కడగంటి చూపుకోసమే దేవేంద్రుడు కూడా ఆ దేవాలయ పరిచారకత్వం కోరుకుంటాడట. ఆలయపు సమయాలలో వినబడే శంఖారావానికి బెదిరి పాచిక జారవిడుస్తూండగా కొప్పుజారెనా.. అది ముడిచే సొగసైన తీరు చూసి తీరవలసిందే. 

కప్పురవిడెము నిరంతరమూ పరిమళించే నోట పలువరుస వెన్నెలలు వెలిగేందుకు... ఒక్క శాలిధాన్యపు బీజంతో దంతధావనం చేసుకుంటారట. పసుపు రాసుకుని తెల్లని వస్త్రంతో రుద్దిచూసినా పసిమి వారి ఒంటిని వదిలిపెట్టదు. పరిమళ లేపనాలు పల్చగా రాసుకుని జలకమాడుతారు. ఎంతటి ధనవంతుడైన విటుడొచ్చినా, గుణగణాదులు తెలియనిదే అతనిని చేరనివ్వరు. పూర్వపు చెలిమి గుర్తుంచుకుని ధనము లేకపోయినా మంచివాడిని ఆదరిస్తారు. అంతఃపురకాంతలకి సరితూగే వనితలు వారు. చక్కగా కృతి చెప్పగల విద్యావతులు. 

ఆ ఊరి యువతులు నవనాగరీకులు. చిలుము పడుతుందని బంగారం పెట్టుకోరు. వారికి ఆభరణాలంటే మేలిమి ముత్యాలే! పూవులు ముడిస్తే కురులు తడుస్తాయని సాంబ్రాణి ధూపంతోనే సువాసనలు అద్దుకుంటారు. పునుగు జవ్వాదితో ఒళ్లు జిడ్డు తేలుతుందని కస్తూరి మాత్రమే అలుముకుంటారు. సన్నని జిలుగు చీరలే తప్ప ఇంకొకటి కట్టరు. 

ఆ ఊరి అమ్మాయిలు తమ ఇంటివెనుక కొలను ఒడ్డున రతనాల మెట్ల మీద పసుపుకొమ్ము అరగదీసుకుంటారు . పెరటి హంసలు ఆ పసుపు చాయల్లో దొర్లి రెక్కలన్నీ బంగారువర్ణానికి తిప్పుకున్నాయట. 

సంపెగపూల తోమాలలా విరగకాసిన అరటిపళ్ళ గెలలు, పోకచెట్లని అల్లుకున్న తమలపాకు తీగలు, పాకాలూరే చెరకు తోటలు, సస్య కేదారాలు, వాలుగచేపలు మిక్కుటంగా తిరిగే కలువల బావులు అక్కడి సర్వసాధారణ దృశ్యాలు. 

దేవాలయంలో వెలసిన కృష్ణుని మెడలోని తులసీమాలికల చల్లదనం, అక్కడి పొంగళ్ల కమ్మదనమూ, అట ఆడిన ఆటవెలదుల కొప్పుల ముడిచిన చెంగలువల సౌరభమూ కలిసిన గాలి అక్కడ తిరుగాడుతూ ఉంటుంది. 

పురవీధుల్లో తిరిగే మదపుటేనుగులది మరొక గమ్మత్తైన వ్యవహారం. మావటీలని లెక్కజేయకుండా అడ్డొచ్చినవారి మీద విజృంభిస్తూ శత్రువులపై ప్రయోగించిన శక్తుల్లా ఉంటాయవి. అస్తమానము పైన మన్ను ఎత్తి పోసుకోవడమొక ఆట. ఆ గజాలను ఏ చెట్టుక్రిందైనా నిలిపితే పైనున్న పక్షుల ముక్కుల చిక్కిన గింజలు ఆ ఏనుగులపై రాలేవట. ఆపై తొండాలతో నీరు జల్లుకుంటే ఆ గింజలు మొలకెత్తి నడిచే పర్వతాలలా కనుపట్టేవి. 

ఇక బాహ్లిక పారశీక శకధారా ఆరట్ట ఘోట్టాణ దేశాలనుండి తెప్పించిన గుర్రాలు రెండందాలా రౌతులనే ఇబ్బందిపెడతాయట. పరిగెట్టేప్పుడు కురచై కాళ్ళు నేలకి తాకి భయమూ, గుర్రం పైకెక్కేటప్పుడు రెండంకవన్నెలు అంటే రెండు రికాబులు ఎక్కితే కానీ సామాన్యుడెవడూ వాటిని అందుకోలేనంత ఎత్తుగా ఉండి రౌతుకి అవమానం కలుగుతుంది. 

ఆ ఊరి కాపులు, మేము నాగలి పట్టి దున్నడం వల్లే కదా రాజు రాజరికపు సుఖాలు అనుభవిస్తున్నాడు అని దున్ని కొండలు కోట్లుగా ధాన్యరాశులని పండిస్తారు. కోమట్ల దానజలాలు కాలువలుగట్టి అంగడిలో స్తంభాలు చిగుర్చుతున్నాయట. అసలు వింత, రతనాల అంగళ్ళు. నవరత్నాలు ఎంత ఎత్తు రాశులంటే... త్రిశంకుస్వర్గం దాకా ఆ అంగడిలో పోసిన పోగులేనట.

రాజు ప్రజలని పీడించి పన్ను తీయడు. చెప్పుడు మాటలు వినడు, పొగడ్తకి లొంగడు. తన పరాక్రమానికి తానే గర్వించి ఒకరిని తక్కువచెయ్యని సత్పురుషుడు. 

ఆ రాజ్యంలో మనలాంటి సామాన్యులు బోలెడుమంది ఉంటారు కదా..  వారి జీవితం నల్లేరు మీద బండి నడక. మన ఊహకి కూడా అందని భాగ్యమది. 

*********

చూడూ... కాలానికి లొంగక ఈ భూమ్మీద మిగిలినవి రెండే! అక్షరమూ, ప్రేమ. 

వాటికి పట్టం కట్టిన రాయలరాజ్యంలో పుట్టే ఉంటామా? అనుమానమే లేదు. హజార రామాలయంలో ఉత్సవానికి నీ చేయి పట్టుకు వడిగా నడుస్తున్నట్టనిపిస్తోంది. నువ్వు దిద్దిన నా గోరింట చేతులు జోడించి జీవనమాధుర్యాన్ని ఆస్వాదించే అవకాశమిచ్చిన కాలస్వరూపుడికి మొక్కుతున్నట్టుంది. 


తనివి దీఱకుండఁ గనుఁగొనఁదగి యుండి, 
మనసు మనసుగలిసి, మంచి తనము 
నూని, సుఖము దుఃఖమొకటిగ మనువారి 
పొందుగనుట పెద్దపున్నెమిలను