Sunday, January 17, 2021

Hiraeth

X12OJ కి ఎదురుగా ఉన్న తెర మీద తన విశ్రాంతి సమయం దగ్గరపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇంకాసేపు P45XD తో  మాట్లాడితే బాగుండుననిపించింది. అప్పటికే ఆలస్యమయింది. రెస్ట్ మోడ్ లోకి వెళ్లేందుకు OJ శరీరం సిద్ధమవుతోంది. చుట్టూ ఉన్న వెలుగు తగ్గిపోతోంది. 


"ప్రొఫెసర్ P, మీ ఏక్టివ్ మోడ్ మొదటి స్లాట్ లో నాతో కమ్యూనికేట్ చేస్తారా?" అన్న ప్రశ్నకి స్క్రీన్ మీద సమాధానం ఆకుపచ్చగా కనిపించి ఆగిపోయింది. 

*******


OJ కి గత ఆరునెలలుగా ప్రొఫెసర్ P తో  కలిసిపనిచేసే అవకాశం కలిగింది. అప్పటినుంచీ  OJ దినచర్య పూర్తిగా మారిపోయింది. మొదట వారిద్దరి కేలెండర్లూ కలవడానికి ఒక రోజు పట్టింది. ఆపై అంతా సజావుగా సాగిపోతోంది. 

ప్రొఫెసర్ P తో కలిసి OJ చేస్తున్న ప్రాజెక్ట్ చాలా చిత్రమైనది. పుట్టి బుద్ధెరిగాక ఇప్పటిదాకా ఇలాంటి మాడ్యూల్ ఒకటి ఉండచ్చని కూడా తను ఊహించలేదు. వచ్చే ఏడాదిలో  OJ కి గర్భధారణ సమయం రాబోతోంది. అప్పుడెలాగూ క్రిటికల్ ప్రాజెక్ట్స్ చేసే అవకాశముండదు. ఈలోగా ఇలాంటి పని నేర్చుకోవడం ఉత్సాహంగా అనిపిస్తోందామెకి. (కౌన్సిల్ నియమాల ప్రకారం 'ఆమె' అనకూడదు కానీ సౌలభ్యం కోసం తప్పదు కదా!) 

ఉదయం నిద్రలేవగానే చకచకా OJ పనులన్నీ అయిపోతాయి. వ్యాయామం చేయించే గది ప్రతీ ఇంట్లోనూ ఉంటుంది. ఉదయం అందులోకి వెళ్ళగానే శరీరపు బరువు కొలిచి, లోపలి అవయవాల ఆరోగ్యాన్ని అంచనా వేసే స్కాన్ నిశ్శబ్దంగా జరిగిపోతుంది. బరువుకి తగ్గ వ్యాయామం పూర్తయ్యేదాకా శరీరం పలుదిశలుగా సాగదీసే మెషీన్ కి అప్పగించేసి మెదడుకి విశ్రాంతి ఇవ్వడం OJ కి అలవాటు.  ఆ తరువాత శుభ్రపడి  వచ్చేసరికి  ఆరోజు చెయ్యాల్సిన పనికి తగ్గ ఆహారం సిద్ధంగా ఉంటుంది. 

సెంట్రలైజడ్ కెఫెటేరియా నుంచి ఎవరికి తగిన ఆహారం వారికి రావడంలో సదుపాయాలు కౌన్సిల్ లెక్కవేయడంతో, OJ పుట్టడానికి నాలుగు తరాల ముందే ఇళ్లలో వంటిల్లు అనే భాగం మాయమైపోయింది. అయితే OJ కి ఉన్న సహజమైన కుతూహలం వలన వంటిల్లు ఎలా ఉంటుందో విజువల్ లైబ్రరీలో చూసి తెలుసుకుంది. అప్పట్లో ఇంట్లోనే వంటచేసుకు తినే సదుపాయం ఉండడం, వ్యాయామం ఎవరికి వారే చెయ్యాల్సి రావడం వలన ప్రజల బరువు, ఆరోగ్యం కౌన్సిల్ చేతిలో ఉండేది కాదు. అనారోగ్యాన్ని సరిచేసేకంటే రాకుండా చూసుకోవడమే పూర్ణాయుర్దాయానికి దారి అని మనుషులందరికీ తెలుసు. ఎందుకంటే ఒక మనిషిని పుట్టించడం, పోషించడం, కోల్పోవడం కూడా చాలా శ్రమ, వనరుల ఖర్చుతో కూడుకున్న విషయాలు. 

ఇవన్నీ తెలుసుకునేసరికి వంటిల్లంటే ఉన్న కాస్త ఆసక్తి OJ బుర్రలోంచి పారిపోయింది. ఈ క్రమంలో నేటి తరం కోల్పోయినది ఒకటుంది. పలువరస... ప్రజలకి దంతాలు మాత్రమే ఉన్నాయి. పూర్వం రకరకాల పదార్ధాలు తినేందుకు నోట్లో రకరకాల పళ్ళుండేవట. కౌన్సిల్ నిర్ణయించిన పరిమితమైన ఆహారపుటలవాట్లతో పాటూ పరిణామంలో మనిషి పలువరసా మారిపోయింది. OJ కి దంతాల వరుస మధ్యలో ఒక పన్ను మాత్రం భిన్నంగా కనిపిస్తుంది. 

*******


మర్నాడు  ప్రొఫెసర్ ని OJ నేరుగా ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకోవాలనుందని అడిగేసింది. మామూలుగా అయితే జూనియర్ హ్యూమన్ అలాంటి వివరాలడిగితే కాదనే అవకాశమే ఎక్కువ కానీ OJ పుట్టాక ఇప్పటిదాకా ఎలాంటి నియమాలూ ఉల్లంఘించకపోవడం ఆమెకి కలిసొచ్చింది. ప్రాజెక్ట్ సెక్యూరిటీ దృష్ట్యా వివరాలన్నీ ప్రొఫెసర్ ద్వారా తెలియాల్సిందే కానీ నేరుగా లైబ్రరీ యాక్సిస్ దొరకదు. 

"ఇప్పుడు మనం పరిశీలిస్తున్న మెదడుని ఎలా ఎంపిక చేశారు?" అడిగింది OJ. 

"అది పూర్తిగా కౌన్సిల్ నిర్ణయం. మనిషి కాలం అయిపోయాక డిస్పోజ్ చెయ్యకుండా రీసర్చ్ దాకా వచ్చే శరీరాలు రెండు రకాలు." ప్రొఫెసర్ సమాధానం తెర మీద ప్రత్యక్షమయింది. 

"అవును. మరణించిన వ్యక్తిలో అనారోగ్యం ఉంటే పరిశీలించడానికి. కానీ ఈ శరీరం HBAR కేటగిరీ కాదు కదా. మెదడు మాత్రమే ఎందుకు పరిశీలిస్తున్నామని." 

కొన్ని సెకన్ల విరామం తరువాత ప్రొఫెసర్ సమాధానం ఫ్లాష్ అయింది. 

"రెండో రకాన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే డీకోడ్ చేస్తాం. ఈ వ్యక్తి వయసు నూట ఇరవై సంవత్సరాలు. ఒక తెగకి చెందిన ఆఖరి మనిషి. అతని మెదడులోని జ్ఞాపకాల్లో ప్రపంచానికి ఉపయోగపడే సమాచారం ఉందేమో అని వెతకడమే మన పని." 


*******


మానవజాతి ఎంత అభివృద్ధి చెందినా ఛేదించలేని రహస్యాలు రెండు శరీరభాగాల్లో మిగిలిపోయాయి. మెదడు, గర్భకోశం. ఈ రెండిటి విషయంలో ప్రయోగాలు పూర్తిగా విజయవంతం అయ్యాయని కౌన్సిల్ చెప్పలేకపోతోంది. వేలాదిమంది శాస్త్రవేత్తలు నిర్విరామంగా ఈ రెండు అవయవాలకీ ప్రత్యామ్నాయాలని కనిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. 

ఆరోగ్యాన్ని కాపాడుతూ మనిషి ఆయుర్దాయాన్నైతే నూట పాతికేళ్ల దాకా పెంచారు కానీ ముసలితనంతో కలిసి చివరికి వచ్చే చావుని మాత్రం ఆపలేకపోతున్నారు. అదొక్కటి సాధిస్తే ఉన్న జాతిని కాపాడుకుంటూ, కొత్త పుట్టుకన్నది లేకపోయినా చిరకాలం గడిపేయవచ్చని ఒక అంచనా. ప్రస్తుతానికి మనిషి మరణించాక కూడా మెదడుని సిములేటర్ సహాయంతో డీకోడ్ చెయ్యడమనేది శాస్త్రజ్ఞులు సాధించిన విజయం. 'తన జీవితకాలంలో ఒక మనిషి సంపాదించిన విజ్ఞానాన్ని మరణం వలన జాతి కోల్పోవాల్సొస్తే ఎలా?' అనే ప్రశ్నకి సమాధానమే బ్రెయిన్ డీకోడింగ్. సాధారణంగా శాస్త్రవేత్తలు మరణించినప్పుడు చేస్తారది. 

అలాగే ఏడున్నర నెలలపాటూ గర్భసంచిలో ఉండనిదే బిడ్డ పుట్టే అవకాశమూ లేదు. మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టి శతాబ్దాలు గడిచినా ఇంకా మనిషి అవసరం లేకుండా పూర్తిగా ప్రయోగశాలలోనే శిశువుల్ని తయారుచేయలేకపోతున్నారు. కౌన్సిల్ ప్రతి ప్రయోగాన్నీ ఒక ఛాలెంజ్ లాగే తీసుకుంటోంది.     

నాలుగో ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచదేశాలన్నీ కలిసి గ్లోబల్ కౌన్సిల్ గా ఏర్పడ్డాయి. భూమ్మీద పెరిగిన ఉష్ణోగ్రత, తరిగిపోతున్న వనరులు మానవుల్ని ఒక తాటిమీదకి తీసుకొచ్చాయి. గ్లోబల్ వెల్ బీయింగ్ అగ్రిమెంట్ లో రాసుకున్నవన్నీ OJ తో సహా భూమ్మీద ఉన్న నలభై మిలియన్ల ప్రజలకీ కంఠోపాఠం. ఆ అగ్రిమెంట్ పై జాతి మనుగడ ఆధారపడింది. 'అసమానతలు లేని సమాజం కోసం ఇదే భూమి మీద ఎందరో కలలు కన్నారని, అలాంటి సమసమాజ స్థాపనే గ్లోబల్ అగ్రిమెంట్ కి మూలకారణమని' అగ్రిమెంట్ మొదటి వాక్యంలోనే ఉంటుంది. అనేకానేక ఈతిబాధల్లో కూరుకుపోయిన ప్రజలని కౌన్సిల్ కాపాడి గీతల మధ్య నిలబెట్టే సాహసం చేసి విజయం సాధించింది. 

భూమ్మీద అందరూ సమానం. అందరినీ ప్రకృతి భీభత్సాల నుంచి కాచుకుని, వనరుల్నీ, విజ్ఞాన విజయాలనీ సమానంగా పంచడం, అంతరించిపోయిన వృక్షజాతుల్ని ప్రయోగశాలల్లో పెంచి నేలమీద ట్రాన్స్ ప్లాంట్ చేయడమే కౌన్సిల్ ధ్యేయం. అందుకోసం ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో తమ పని తాము చేయాల్సిందే. అంత కష్టపడుతున్నారు కాబట్టే ఈమధ్యే తొలి వేపమొక్క నేలలో వేడిని తట్టుకుని బతికిన సంబరం అందరి స్క్రీన్ ల మీదా ఆకుపచ్చగా మెరిసింది. 

వందల ఏళ్లుగా అస్తవ్యస్తమైపోయిన ఋతుచక్రాన్ని వెనక్కి తీసుకురావడానికి మనిషి చెయ్యని ప్రయోగం లేదు. ఒకప్పుడు గింజ పడి మొక్క మొలిచేదంటే OJ తరంలో ఎవరూ నమ్మరు. వనరులు ఇగిరిపోకుండా ఏం చెయ్యాలో తెలియక కౌన్సిల్ మాత్రం సతమతమవుతోంది. వేరే గ్రహమేదీ అనుకూలమైన కక్ష్యలో తిరగట్లేదనేది నిశ్చయమైపోయినట్టే. మిగిలినదల్లా విశాలమైన, ఎర్రటి భూమి. 


*******


"నాకేమీ ప్రత్యేకమైన రీడింగ్స్ కనిపించడం లేదు." OJ ప్రొఫెసర్ కి కమ్యూనికేట్ చేసింది. 

"గ్రే ఏరియా 35 లో కొంత రీ రన్ చెయ్యాల్సి ఉంటుంది. రేపు ఉదయం చూద్దాం." అని సమాధానమొచ్చింది.

స్క్రీన్ ముందు నుంచి లేచి ఆరోజు కేలండర్ లో తరువాతి స్లాట్ ప్రకారం స్పీచ్ లేబ్ లోకి వెళ్ళింది OJ. 

మూడవ ప్రపంచయుద్ధంలో కార్చిచ్చులా వ్యాపించిన వైరస్ ల నుంచి తప్పించుకోడానికి మానవజాతి అతిపెద్ద మార్పుకి గురయ్యింది. సంఘజీవనం మరచిపోయి ఎవరి పాడ్ లలో వారు ఉండాల్సిందే. అప్పటికే వచ్చిన సాంకేతిక విప్లవం ఏ పనైనా బయటికి కదలకుండా, అవసరమైన చోట రోబోల సహాయంతో చెయ్యగల సదుపాయాన్ని ఇచ్చింది. కాలం గడిచేకొద్దీ వాడుక తగ్గి పరిణామక్రమంలో మనుషుల స్వరపేటిక మూసుకుపోవడం మొదలయింది. ఊపిరికీ, ఆహారానికీ ఇబ్బంది కలుగుతోంది కనుక, ఇక తప్పక అందరి ఇళ్లలోనూ స్పీచ్ లేబ్ లు ఏర్పరుచుకోవాల్సి వచ్చింది. అనుదినం కౌన్సిల్ సిలబస్ ప్రకారం గొంతుకి వ్యాయామాలు చెయ్యాల్సినదే. OJ కి తన దినచర్యలో విసుగొచ్చేది ఇలాంటప్పుడే. 

ఇంతలో ఒక దేశాధిపతి టోర్నడో లో న్యూక్లియర్ బాంబ్ వేసి అంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ప్రకృతితో నాలుగో ప్రపంచయుద్ధానికి తెర తీసాడు. అలా అతని పేరు ప్రపంచ చరిత్రలో మిగిలిపోయింది. ఆ ప్రళయ బీభత్సం సద్దుమణిగాక బతికున్నవారంతా గ్లోబల్ కౌన్సిల్ ఆవిర్భావానికి కృషిచేశారు. 

స్పీచ్ లేబ్ లోంచి బయటికొచ్చి రొటీన్ హెల్త్ చెకప్ చేసుకుంటూ మానిటర్ చూసింది OJ. తన గర్భధారణ ఇంకెన్ని నెలల్లో ఉందా అని. అప్పుడే మానిటరింగ్ మొదలవడం ఆశ్చర్యమనిపించిందామెకు. 

కౌన్సిల్ అదుపులోకి తీసుకున్న మరో  విషయం స్త్రీల గర్భధారణ. ఒక వ్యక్తి కాలంచేసిన రెండేళ్ళకి ఒక బిడ్డ పుట్టడం తో సమతుల్యంగా వనరులు సరిపోతున్నాయి. ఎంపిక అయిన స్త్రీ లేబ్ లోంచి పిండాన్ని తన కడుపులోకి ఆహ్వానిస్తుంది. ఏడున్నర నెలల తరువాత బిడ్డని ప్రసవించి నర్సరీలో అప్పగించడంతో పని పూర్తయినట్టు. పిల్లల్ని పెంచే ప్రాజెక్ట్ తో ఆమెకు సంబంధముండదు. 

OJ నిద్రలోకి వెళ్తూ అనుకుంది. "తొమ్మిది నెలలు మోసేవారట. పైగా నొప్పి భరించే ప్రసవం ఉండేదట. రోబో సర్జన్ లేకపోతే ఏమైపోతామసలు! థాంక్స్ టు టెక్నాలజీ" అని. 


*******


"గ్రే 35 ఇంపల్సివ్ రెస్పాన్స్ నోటెడ్" కమ్యూనికేట్ చేసింది OJ. 

ప్రొఫెసర్ దగ్గరనుంచి రెస్పాన్స్ రాలేదింకా. ఆ భాగపు నిర్మాణాన్ని సూక్ష్మస్థాయిలో డీకోడ్ చేసి అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చేస్తోంది. 

"నోటెడ్. రీడింగ్స్ మేచ్ అవలేదు. ఇంకోసారి రన్ చేయ"మని ప్రొఫెసర్ రెస్పాన్స్ వచ్చింది. 

గజిబిజిగా ఉన్న ఫలితాలని  ఇద్దరూ కలిసి రోజుల తరబడి డీకోడ్ చేసి కౌన్సిల్ కి పంపారు.   

ఈ పరిశోధనలో తనకర్ధం కానివి తెలుసుకునే హక్కు తనకి ఉందని OJ ప్రొఫెసర్ ని ఒప్పించింది. 

"కౌన్సిల్ అన్నీ గమనిస్తుందనే విషయం గుర్తుంచుకుని, అవసరమైన ప్రశ్నలే వెయ్యమని" OJ కి ప్రొఫెసర్ హెచ్చరిక నారింజ రంగులో తెర మీద కనిపించింది. 

"తెగలో చివరి మనిషి అంటే ఏమిటి? ఆ మెదడు దాచుకున్న జ్ఞాపకాల అర్థమేమిటి?" అని సూటిగా అడిగింది OJ. 

"కౌన్సిల్ ఏర్పడిన కొత్తలో నియమాలకి విరుద్ధంగా పుట్టిన బిడ్డ డిఎన్ఏ తో మేచ్ అయింది ఈ బ్రెయిన్. ఇందులో మిగిలిన జ్ఞాపకాలే మనం డీకోడ్ చేసాం." 

"విరుద్ధంగా అంటే? తెగలో ఆఖరి మనిషి అని ఎలా నిర్ణయిస్తారు?" చురుకుగా అడిగింది OJ 

"ఈ వ్యక్తి మేల్. బిడ్డని పుట్టించే అవకాశం రాని ఒక మగవాడు, స్పెసిఫిక్ జీనోమ్ ని మోసుకొచ్చిన ఆఖరివాడు.  X12OJ , ఇక ప్రశ్నలు చాలనుకుంటా" ప్రొఫెసర్ హెచ్చరిక 

"విరుద్ధంగా పుట్టడమంటే?" 

"అసలు వ్యక్తి లైంగికత బయటికి చెప్పడమే తప్పు. డోంట్ ఆస్క్  డోంట్ టెల్.." అంటున్న ప్రొఫెసర్ మాటలు నారింజ రంగులోంచి ఎరుపులోకి ఏ క్షణమైనా మారుతాయని అర్ధమయింది OJ కి 

"అతను బతికి లేడు కదా, పరవాలేదు.  ఏ నియమాలకి విరుద్ధంగా పుట్టిన వ్యక్తో చెప్పేస్తే చాలు. ఇంకేమీ అడగను." 

"వందలేళ్ళ క్రితం కాప్యులేషన్ వలన పుట్టిన వ్యక్తికి వారసుడితను. ఆ జీనోమ్ లో అంతరించిపోయిన ప్రత్యేకమైన అనుభూతులట.. అవే మనకి కనిపించిన ఇంపల్సివ్ రెస్పాన్స్.  కానీ అవి సైంటిఫిక్ గా మానవజాతికి ఉపయోగపడేవిగా నాకేమీ అనిపించలేదు. కౌన్సిల్ రద్దుచేసిన వాటిలో సహజ సమాగమం మొదటిది. డీ కమిషన్ చేసినవాటితో మనకేం పని?" 

"అంటే?" 

OJ ప్రశ్నకి ప్రొఫెసర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక రాదని అర్ధమై చకచకా జీనోమ్ మెమొరీని రన్ చేసి చూసింది. ఒక్కో చుక్కా కలిపి ఏదో మహాద్భుత చిత్రాన్ని ఆమె ముందు ఆవిష్కరించిందా అణునిర్మాణం. 


*******

ఎవరూ చూడని ఆకాశంలో అతి దూరంగా నలకంత చంద్రవంక మెరుస్తోంది. 

రెస్ట్ మోడ్ లోకి వెళ్తున్న OJ శరీరాన్ని ఆలోచనలు తట్టి లేపుతున్నాయి. ఎవరూ నోరు తెరిచి చెప్పని సత్యం నెమ్మదిగా అర్ధమవుతోంది.  

ప్రాణం లేని వస్తువుల చల్లని స్పర్శ కాకుండా ఏదో కావాలని ఆమె కోరుకుంటోంది. 
దేహపు కర్తవ్యమింకేదో ఉన్నట్టు జలదరించింది. 
అవయవాలకు అతీతంగా లోపలెక్కడో ఉద్వేగం రాజుకుంటోంది. 
వందల ఏళ్ల క్రితం దానినే ఒంటరితనమనే వారు. 

ఎప్పుడో ఈ భూమి మీద ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య జరిగిన సంఘటనని ఆమె మస్తిష్కం ఊహించుకునే ప్రయత్నం చేస్తోంది. వెనక్కి తిరిగివెళ్ళలేని దూరమేదో, అందుకోలేని కాలమేదో ఆమెని భరించలేని వేదనకి విడిచిపెట్టింది. 

మూసుకున్న OJ రెప్పల చాటున మునుపెరుగని చెమ్మ ఊరి కన్నీటి కాలువలు కట్టింది. దుఃఖంలోంచి ఆమె నిస్సత్తువగా నిద్రలోకి జారిపోయింది. 

*******

స్మశానభూమిలో ఆ ఇద్దరూ రేగుతున్న మంటలకు దూరంగా పరిగెడుతున్నారు. గుండెలవిసిపోయేలా రొప్పుతూ పరిగెడుతున్నారు. 

శిధిలమైపోయిన భవనపు నీడకి  చేరుకొని అలుపు తీర్చుకున్నారు. మన్నులోంచి లేచిన మొలకల్లా నిటారుగా నిలబడి చేతులు కలుపుకున్నారు. నింగినుంచి జారిన చినుకుల్లా పెనవేసుకున్నారు. 

ఆమె పెదవుల్ని అందుకున్న అతనిలో విస్ఫోటనం. అతని దేహాన్ని అల్లుకున్న ఆమెలో ప్రకంపనలు. 

ప్రకృతిసాక్షిగా నిరంతరాయంగా జరిగిపోవాల్సిన సృష్టికార్యం తరాలు గడిచేకొద్దీ అంతరించిపోతూ ఆఖరిసారి తన ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది.