ఊఁ.. రిక్షా ఎక్కి సర్దుకు కూర్చున్నారా..? పదండి. రివ్వురివ్వున పరుగులు తీస్తూ కోట దాటి, డెంకేషావలీబాబా మసీదు దగ్గర కుడి వైపు డౌన్లోకి తిరిగిపోతాం. అలాగే జిడ్డువారి మేడ దాటొచ్చి గుమ్చీ దాటి అలా ముందుకొచ్చేయడమే! దార్లో వెంకటేశ్వరస్వామి కోవెల కుడిచేతివైపు కనిపిస్తుంది చూడండీ.. రిక్షాలోనే చెప్పులు విప్పేసి ఓసారి దణ్ణం పెట్టేసుకోండి. అయ్యకోనేరు గట్టుమీద ఇంకాస్త ముందుకొచ్చాక మళ్ళీ కుడిచేతివైపే గణపతి గుడి . అది దాటగానే కుడివైపు రిక్షా స్టాండు. ఎడమ వైపు నిష్ఠల వారి లైబ్రరీ. అక్కడిదాకా వచ్చాక చేతిలో ఉన్న పర్సూ, పిల్లాడూ, కాళ్ళదగ్గరున్న సామానూ జాగ్రత్తేం! రిక్షా డౌన్లోకి దిగుతుంది మరి! రిక్షా అబ్బికి తెలిసినా దారి చెప్పడం మన ధర్మం. "ఎడం చేతివైపు డౌన్లోకి పోనీ బాబూ" అని చెప్పాలి. టర్నింగ్ తిరిగేటప్పుడు తాడు తో హేండిల్బార్ కి కట్టి ఉన్న బెల్ ని లాగి టంగ్ టంగ్ మనిపిస్తాడు. బావుంటుంది.
డౌన్లోకి దిగాక "రెండో రైటు రెండో రైటు.."
"పాలెపారి ఈదేనామ్మా. తెలుసు తల్లే.."
"కుడిచేతి వైపు లైట్ పోల్ ముందు ఇల్లు.."
"......"
"ఆ.. ఇలా ఆపేయ్.." అదేంటో అంత బాగా చెప్పినా అతను కచ్చితంగా పక్కనున్న ధవళవారింటి దగ్గరే.. ఆపుతాడు. ఇంటి ముందు రిక్షా ఆగడం ఎంత గొప్ప విషయమసలూ.. ఆగాక ఎవరో ఒకరు బయటికొస్తారు. తొంగి చూస్తారు. మనం దిగి డబ్బులిచ్చేలోపే "ఎవరూ.. " అని ప్రశ్న వినిపిస్తే "నేనే.. పక్కింటికి. ఇక్కడాపేసాడు" అని చెప్పాలి. ధవళ మామ్మగారికి కళ్ళు సరిగా ఆనవు కదా పాపం.
"ఉంకో రూపాయిప్పించడమ్మా, బోల్డు దూరవుఁ లాగినానూ.."
"అంతా డౌనే కదా!" అనాలి మనసులో జాలిగా ఉన్నా కూడా.. లేదంటే అమ్మ మన వీపు చీరేస్తుంది.
"బోనీ బేరం తల్లే.." సాయంత్రం ఏడయినా ఇదే చెప్తాడు. అదేవిటో మరి!
స్వర్గానికెన్ని మెట్లు..? రెండే రెండు. అప్పట్లో స్వర్గమని ఒప్పుకోకపోయినా ఇప్పుడు విలువ తెలిసొస్తోందిగా! ఆ మెట్లెక్కి పాలపిట్టరంగు కటకటాల లోపలివైపు గడియ ఎడమ చేతి వేళ్ళతో లాఘవంగా తీయడం సాధనతో పొందిన విద్య. తీసుకుని లోపలికెళ్ళామా.. సన్నటి వరండా. చెప్పులు విప్పేసి పంచపట్టులోకెళ్ళి అక్కడ చెక్క సోఫాలో కూలబడడమే. కాళ్ళు కడుక్కోమని నాయనమ్మ అరిచేదాకా..
మధ్యలో ఖాళీ జాగా విడదీస్తున్న రెండు వాటాల ఇల్లు. అచ్చం ఒకేలా ఉండే రెండు వాటాలు! వీధిలోకి కిటికీ ఉన్న గది పిల్లలది. వేసవి కాలపు ఆటలు, పాటలు, బొమ్మల పెళ్ళెళ్ళు, ఆ మూల పాత జాజికాయ పెట్టెలో దాచిన రంగు రంగుల బొమ్మల బట్టలు , గాజుముక్కలు, ఎన్నికల అభ్యర్ధులు పంచిన రంగుల పాంప్లెట్లతో కుట్టి రాసుకున్న పుస్తకాలు, బద్దలైన ఆకాశనీలపు "తిరుపతి - పద్మావతి" గాజుల కోసం నేస్తంతో తగువులూ, వెక్కెక్కి ఏడవడాలూ, నారింజతొనలు పంచుకు తింటూ ఆడిన చింతగింజలు, వైకుంఠపాళీలు. చందమామలు, బాలమిత్రలూ, విస్ డమ్ లూ .. డిటెక్టివ్ నవలలూ.. అది దాటాక నవలలు, వారపత్రికలూ మడతమంచం మీద బోర్లా పడుక్కుని కాళ్ళూపుతూ చదువుకున్న జ్ఞాపకాలు.. ఇక్కడే.. ఈ గదిలోనే పదిలం! ఇంతేనా..? రహస్యమొకటి చెప్పనా.. గదికి కిటికీ ఉంది చూడండీ. ఆ కిటికీ ఎన్ని జతల కళ్ళు పంపిన ఆశలరాయబారాలను తలుపు వెనుక దాగి చూస్తున్న చారుచకోరనేత్రకు చేరుతున్నాయని తెలియనివ్వకుండా నిర్దాక్షిణ్యంగా రెక్కచాటు చేసిందో తెలుసా..?! అదన్నమాట ఆ గది ప్రత్యేకత!
పడగ్గది లో భోషాణం వెనుక దాచిన ఖాళీ అమృతాంజనం సీసాలు, చెక్క బీరువా కిర్రుమనకుండా తీసి అమ్మ చూడకుండా వేసుకెళ్ళిన కొత్తబట్టలు, బట్టల కింద మొగలి పొత్తులూ, పొగడదండలూ, సబ్బు రేపర్లూ దాచిన పరిమళం.. టైం మెషీన్ అంటే జ్ఞాపకాల తేరు. అంతే కదూ! అన్నట్టు కుమిలి చాకలి తెచ్చిన బట్టల మూట ఆ భోషాణానికీ, బీరువాకీ మధ్య ఉన్న మూలనే దింపించేవారు. ఎవరూ చూడకుండా ఆ మూటని కావలించుకు వాసన చూడాలనిపించేది. నవ్వకండేం. మీకు మాత్రం.. మంచం పై అమ్మ పరిచిన చాకింటి దుప్పటీ మీద మొదట మీరే పడుకోవాలనిపించదూ? పోటీ వస్తే తమ్ముడ్ని నిరంకుశంగా తోసేయాలనిపించదూ?
ఆ గదిలో గోడకి చెక్కబద్దలమధ్య బిగించిన పెద్ద అద్దం వేలాడుతోంది చూసారూ.. అదే.. అమ్మకి తెలియకుండా తిలకం తెచ్చుకు మనవేఁ బొట్టుపెట్టేసుకోవాలని ప్రయత్నించిన రోజు జరిగిన భీభత్సానికి ప్రత్యక్షసాక్షి. తిలకం సీసా చేయిజారి ఆరోజు తిన్న చీవాట్లు అన్నీ ఇన్నీనా.. అమ్మో! అంతేనా.. పదారు కళలూ నింపుకుంటున్న లేలేత వయసుని మొదటగా చూసినది ఆ అద్దమే. ఎన్ని కొత్త బట్టలు వేసుకున్న సంబరాలను చూసిందో. ఎన్ని సార్లు పూల జడలనూ, జడగంటలనూ.. నాకు చూపించే ప్రయత్నం చేసిందో. "ఒప్పుడు సూసినా.. అద్దం ముందలే నిలుసుంతారూ.. సూసిన కొద్దీ పెరిగిపోద్దేటమ్మా అందవూఁ..!!" అని చీపురు పట్టుకుని ధడాలున తలుపు తోసుకుని గదిలోకొచ్చి బండారం బయటపెట్టేసిన అప్పల్నరసని ఏం చేసినా పాపం లేదు కదూ!
గది వదలక తప్పదా.. సరే.. ముందు పంచ పట్టుకి.. రండ్రండి. ఈ చూరు కింద నేను రాసిన పేర్లు చూసారా? నాదీ, తమ్ముడిదీ. ఎప్పుడో నాలుగో తరగతిలో రాసినవన్నమాట. అప్పుడంత ఎత్తుకెలా రాయగలిగానా..! తావీజ్ మహిమ. అన్నీ చెప్పేస్తారేంటీ? పంచలో దూలం పట్టుకుని వేలాడుతూ బావ, పొడవెదగాలని కసరత్తులు చేసేవాడు. "వెధవయ్యా.. కసరత్తులు చేస్తే ఎదిగిపోర్రా.. చదువు.. చదువు.. పొట్టిగా ఉన్నా లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి కాలేదూ!" అని వినిపించే చురకలకి పాపం, మొహం ఎంత చిన్నబుచ్చుకునేవాడో! మనమేం చేస్తాం. పంచపట్టున ఈ స్థంభం చూసారా.. ఇంటికి వెల్ల వేయించిన తరువాత నాల్రోజులు మాత్రమే దీని రంగు తెలుపు. బర్రెదూడల్లా స్థంభం చుట్టూ తిరుగుతూ సున్నం రాల్చేసి, పెచ్చులు పీకేస్తూ ఉంటే ఎంత బావుంటుందో! ఎవరూ చూడకుండా చెయ్యాలది.. ష్ష్...
ఈ చిన్న గది ఉందే.. దీన్ని పంచ గది అంటారన్నమాట. మామూలుగా అయితే తాతగారి పుస్తకాల భోషాణం, టీవీ, అలమరలో పుస్తకాలు, పెన్నులూ అవీ ఉంటాయి. దసరాకి మాత్రం బొమ్మల కొలువు ఈ గదిలోనే. ఎదురుగా ఈ పంచలోనే పేరంటాళ్ళు కూర్చుంటారు. పసుపు సువాసన, పట్టుచీరల గరగర, గాజుల గలగల, పూల గుబాళింపులు.. కబుర్లు, నవ్వులు. శివశంకరీ పాటలో ఎంటీఆర్ ఒక్ఖడే ఐదుగురైనట్టూ.. లక్ష్మీదేవి పేరంటాళ్ళ గుంపులుగా మారి వచ్చేసినట్టుండేది. సంక్రాంతికి పసుపూ కుంకుమ తెచ్చి పంచే వారికోసం రెండు పళ్ళాలు ఇక్కడే సోఫా బల్ల మీద పెట్టేవాళ్ళం. పళ్ళెం నిండగానే అమ్మని పిలవాలి. తాంబూలం లో దక్షిణ మనం తీసేసుకున్నాకే లెండి. హ్హహ్హా..
రెండు వాటాలకీ మధ్యనున్న ఖాళీ జాగా చూసారా.. దాన్ని పందిరి అంటారు. వేసవిలో కొబ్బరి మట్టలు కొట్టించి పందిరి నేయించేవార్లెండి. అందుకన్నమాట ఆ పేరు. పగలంతా బోలెడు ఎండ వస్తుందా.. ఊరగాయలకీ, అప్పడాలకీ, వడియాలకీ మంచిదట. మనక్కాళ్ళుకాల్తాయ్ కానీ. తూర్పు గోడ విశ్వనాథవారితోనూ, పడమటి గోడ ధవళవారితోనూ పంచుకున్నాం కదా.. మన టీవీ ఏంటినా ఆ మాత్రం వాళ్ళ మేడల మీద పెట్టరేంటీ. కానీ ఏ కాకైనా వాలిందా.. ఏంటెనా కర్రతో కదుపుతూ "కనిపిస్తోందా.. వస్తోందా.. ఇప్పుడు.. ఇప్పుడో.." అని మనం మేడెక్కి అరవాలి. ఎన్ని కష్టాలసలు! తూర్పు గోడకి వరుసగా పేర్చిన కుండీలు అమ్మ ఆస్తి. పువ్వుల మీద చెయ్యి వేసామా.. వీపు సాపే! గులాబి అంట్లకి పేడ గోరింట పెట్టేది. చిగుళ్ళు బాగా వస్తాయట. అది చూసి "ఈ మొక్కకి పూచిన గులాబీలు నేను పెట్టుకోను గాక పెట్టుకోను." అని శపథం పూనేదాన్ని. పదిరోజులు గడిచేసరికి పన్నీరు గులాబీ ఘుమ్మున పూస్తే శపథాలా ఏమన్నానా.. పుణికేసి తురిమేసుకోవడమే! తెల్లచామంతులు, కాణీ చామంతులు, చిట్టి చామంతులు, ఊకబంతి, ముద్దబంతి, సీమ బంతి సరేసరి. తులసైతే వనమే! "కుండీల్లోనే తోట పెంచేస్తోంది మీ కోడలు!" అని ఎవరైనా మెచ్చుకుంటే "ఆ.. పొద్దస్తమానం పన్లు మాని సేవలు చేస్తే పూయవూ..!" అని సన్నాయి నొక్కేది నాయనమ్మ. అన్నట్టు చుట్టూ పచ్చపచ్చగా తోరణంలా అల్లేసిన ఈ మనీప్లాంట్ నేను తెచ్చినదే.. మనీప్లాంట్ అడిగి తేకూడదు. కొట్టుకొచ్చేయాలట. హ్హహ్హహా.. అవును. మీరు అనుకుంటున్నది నిజమే!
వెనుక వాటా పంచలో రేడియో ఉంటుంది. ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం అన్నమాట. సుప్రభాతం మొదలుకుని సైనిక మాధురి దాకా అన్నీ వినదగినవే, వినాల్సినవే! ఆ పంచ ఒడ్డున కూర్చుని నాయనమ్మ కూరగాయలు తరిగేది. అరిటి పువ్వు ఒలిచేది. చిక్కుడుకాయలు బాగుచేసేది. అరిటి దూట చక్రాలు తాపీగా తరిగేది. చల్ల చిలికి వెన్న తీసేది. ఓ పిల్లి అక్కడే కాసుకు తిరిగేది.. ఏ సుశీలో "నీ మది చల్లగా" నిదురపొమ్మందని కదా అని మోమాటానికి పోయి రెప్పకొడితే ఇంతేసంగతులు. ఈ పంచ ఒడ్డునే ఇంటిల్లిపాదీ కూర్చుని ఉదయాన్నే గుండుగ్లాసులతో కాఫీలు తాగేవారు. ఒక కాలు జాపుకుని, స్థంభానికి ఆనుకు కూర్చుని అమ్మ నాకు జడవేసేది. చిక్కు తీస్తే ఏడుపు, ఒంటి జడ వేయనంటే ఏడుపు, రిబ్బన్లతో గాఠ్ఠి గా బిగించి వేస్తే మరో ఏడుపు.. ఏతావాతా అమ్మ పెట్టే రెండూ పెట్టాల్సిందే! అప్పుడెలాగూ ఏక ఏడుపే!
భోజనాల గది, వంటిల్లు.. ఉహూఁ.. ఇప్పుడు ప్రవేశం లేదు. ఘుమఘుమలు మాత్రం గుమ్మంలోంచే యధేచ్ఛగా పీల్చేసుకోవచ్చు. ఈ పంచలో చిన్న గది ఉందే.. అది "మనత్తుకినియానై" సన్నిధి. మనోహరుడు.. మా ఇంటి రాముడి కొలువు! తీరుగా తిరునామాలు దిద్దిన నల్ల చేవ తలుపులు. వైకుంఠద్వారాలు తెరుచుకున్నంత ఠీవిగా అవి ఫెళ్ళున తెరుచుకోగానే మసక చీకటి పొరలను చీల్చే దీపశిఖల కాంతిలో మెరిసే శేషతల్పం. కొలువైతివా రంగ శాయీ..! వయ్యారి జానకీబాలతో రామచంద్రుడు, కుడివైపున సౌమిత్రి. ఉహూ.. ఆంజనేయుడుండడు. మా రాముడు వనవాసానికి వెళ్ళి ఇక్కట్లు పడ్డ వాడు కాడట. పెళ్ళిపచ్చలారని యువరాజట! మైథిలీ మనో విహారి! "పాపం హనుమన్న లేకుండానా..?" అంటే, "అదేవిటమ్మలూ! మనం లేవూఁ... రాంబంటు అంశ!" అనేవారు తాతగారు.
ఇలా రండి. ఇది వెనక వరండా.. దక్షిణపు గాలి ఎంత చల్లగా వీస్తోందో చూసారా? అందుకే తాతగారు వేసవి సెలవుల్లో ఇక్కడ కూర్చోబెట్టి సంత చెప్పేవారు. పదండి పెరడు చూసేసి వచ్చి ఇక్కడ కూర్చుందాం. నీళ్ళ కుండీలు, స్నానాల గదీ ఎడంవైపు. అదిగో నూతి గట్టు మీదకి వాలి కొబ్బరి చెట్టు. ఆ వెనుక మరొక చెట్టుంది కదా. వెనుక చెట్టువి నీళ్ళ బొండాలు. ఈ ముందు చెట్టు కాయలకే తీయని కొబ్బరి ముక్క ఉంటుంది. ఎంత రుచో మాటల్లో చెప్పలేం. ఊరికే ఓ పచ్చిమిరపకాయా, చింతపండు, ఉప్పు, రవంత పసుపు వేసి కచ్చాపచ్చా రుబ్బి విస్తట్లో వేసే కొబ్బరిపచ్చడి వేలితో నాక్కుంటే అద్దీ రుచి! కొబ్బరి చెట్టు మొదలుకి గోనెసంచిలో ఉప్పు వేసి కట్టేవారు.. కాపు బావుంటుందని! స్నానాల గది గోడనానుకుని బచ్చలి, పొట్ల తీగె, చంద్రకాంతం పూవులు, నిత్యమల్లి. బియ్యం కడిగిన నీళ్ళు పోసుకుని పచ్చగా నవనవలాడే కరివేప.
మధ్యాహ్నం వేళ నూతి గట్టున కొబ్బరిచెట్టు నీడలో కూర్చుని పుస్తకం చదూకుంటే ఎంత బావుంటుందో తెలుసా..! "రావే లోపలికీ.. మొహం తిరిగి పడతావ్. ఇల్లంతా వదిలేసి నూతిగట్టున చదువులేంటీ?" అని అమ్మ అరుస్తుందనుకోండీ. ఆట్టే పట్టించుకోకూడదు. విశ్వనాథవారింటి వైపు గోడకానుకుని నందివర్ధనం చెట్టు.. ఆ గట్టు మీదెక్కితే వారమ్మాయితో కబుర్లు చెప్పుకోవచ్చు. మిట్టమధ్యాహ్నం కాకుల్లా తిరుగుతున్నామని వీధి తలుపు తాళం వేసినా మన స్నేహబంధం మహ జిడ్డు. ఇలా పెరట్లో గోడ దగ్గర వేలాడుతూ కబుర్లు చెప్పేసుకోవడమే! ఇహ తలంట్లు, నూతిలో కవ్వు తీయించడం, కొబ్బరికాయలు దింపించడం గురించి చెప్తే.. ఈ రోజు సరిపోదు. పదండి పదండీ..
వరండా.. ఓ పక్క తాతగారి కరణీకం బల్ల. ఓరోజు "భగవద్గీత నాకెందుకూ.. పెద్దవాళ్ళకి కదూ!" అని విసుగ్గా అన్నానని "పదమూడేళ్ళ అమ్మలు కోసం.." అని మొదటి పేజీలో రాసి అచ్చమైన అందమైన తెలుగులో నాకోసం, అచ్చంగా నాకోసమే ఇదే బల్ల దగ్గర కూర్చుని భగవద్గీతను తెనిగించారాయన. నా పుణ్యం ఖర్చైపోయిందేమో.. ఓ రోజున ఆ హంసని పైవాడు రివ్వున ఎగరేసుకుపోయాడే అనుకో.. నాకిక్కడేం లోటని!?
ఆ కాగితాలను తడుముతూ ఉంటే.. తాతగారి గోరంచు పంచె కుచ్చెళ్ళలో కూర్చున్నట్టూ.. ఆయన యజ్ఞోపవీతానికి బంధం వేసుకున్న పగడపు ఉంగరాన్ని విప్పే ప్రయత్నం చేస్తున్నట్టూ.. వెనక వరండా గుమ్మంలో.. ఇదిగో ఇక్కడే.. కూర్చుని ముకుందమాల సంత చెప్పుకుంటున్నప్పుడు, గాలి ఆయన ఒంటి చందనపు పరిమళం అద్దుకుని నా వైపు వీచినట్టూ ఉండదూ..నాకిక్కడేం లోటని!?