ఆ పాడుబడిన దేవాలయం ఆవరణలోగడ్డి కోసుకుంటున్న పిల్లలు, గరికచెక్కలు విదిలించి, పచ్చికతో తట్టలు నింపుకుని.. ఇళ్ళదారి పట్టారు. పగలంతా తాము దాచుకున్న తిండికోసం వెతికి, పరుగులు పెట్టిన ఉడుతలు.. అలసి కలుగుల్లో చేరాయి. మునిమాపున బోసిపోయినట్టూ ఒంటరిగా మిగిలిందా కోవెల.
కూలిన రాతిగోడలు, ఒరిగిపోయిన శిల్పాలు.. పలుచని శిథిల సౌందర్యరేఖల్ని నిశ్శబ్దంగా చీకటిలోకి ప్రసరిస్తున్నాయి. మొండిగోడల్లోంచి మొలుచుకొచ్చిన మొక్కలు ఏటవాలుగా జీమూతాల్లా నీడలు కమ్ముకుంటున్నాయి. ఎండుటాకుల నడుమ సరసరా జారుతూ త్రాచులు యథేచ్ఛగా మసలుతున్నాయి.
చుట్టుపక్కల కోసు దూరంలో జనసంచారమనే మాటే లేదు. కొండకు ఆనుకునున్న ఆ మైదానం.. ఒంటరిగా ముసలిగువ్వలా ముడుచుకున్న ఆ కోవెల..
పగటిపూట గడ్డికోసుకునే వాళ్ళు, పశువులకాపరులూ ఆ ప్రాంగణంలో తారట్లాడతారు. సందెవేళ దాటాక.. కీచురాళ్ళ సంగీతానికి కంపించి ఎగిరే మిణుగురుల వెలుగూ, వెన్నెలకారున జాబిలి రేకా.. ఆ రాతిగోడలని తడుముతుంటాయి. కొన్నేళ్ళ క్రితందాకా ఓ భక్తుడి పుణ్యాన గర్భగుడిలో నూనెదీపం వెలిగేది. ఇప్పుడంతా చీకటే..
గాలికెరటాల్లో తేలి జీబుజీబుగా అల్లుకుంటున్న ఆ ఊరి కథలని.. వినేదెవరు?
మప్పితంగా తలూపే పసరికా.. బెరుగ్గా తిరిగే చెవులపిల్లులూ... అంతే.
***
నూరు గడపలున్న ఆ ఊరు పేరుకు చిన్నదే కానీ, ఆ కొసాకూ కలిసున్న పొలమూపుట్రా కలుపుకుంటే పెద్దదన్నట్టే. తూర్పున కనుచూపుమేరలో ఏనుగులు మొద్దునిద్దరోతున్నట్టూ కొండలవరుస. పగటి పూట ఆలమంద అటుగా వెళ్తే.. కొండనానుకుని నందివర్ధనాలు పూచినట్టూ కనిపిస్తాయా పశువులన్నీ.
కొండల్లో ఎక్కడో మొదలై ఊరిచివరి గుట్ట దాకా పారుతున్న కొండవాగుని పాలధారంటారు. గుట్టమీద చిన్న ఆంజనేయస్వామి కోవెల.
ఆ ఊరి పేరు 'కొచ్చెర్ల'. రాయదుర్గానికి నూరుకోసుల దూరంలో, అమాత్యపరంపర ఏలుబడిలో ఉంటున్న గ్రామమది.
గ్రామణి రామరాజుకి ముత్తాతగారైన, కొమ్మయమంత్రి రామన్న గారు విజయనగర ప్రభువుల ఆస్థానమంత్రివర్గంలో ఒకరు. ఆయన వాస్తునిపుణులు. రాయదుర్గం కోటనిర్మాణం ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. ఆయన సేవలకు బహుమానంగా విజయనగరప్రభువు అపార ధనకనకవస్తువాహనాలతో పాటుగా, రామన్నగారి సొంతూరైన కొచ్చెర్లలో ఆయన ఇష్టదైవమైన ప్రసన్న వేంకటేశ్వరస్వామికి కోవెల కట్టించి ఇచ్చారట. శిల్పసౌందర్యానికి, వాస్తుకళకీ పెట్టింది పేరై మహాసుందరంగా ఉంటుందా దేవాలయం.
ఊరిని అడవిలో కలుపుతున్నట్టుండే హద్దు చదును చేసి, తటాకం తవ్వించి కోవెల నిర్మించి, దానికి అవసరమైన మాన్యాన్ని సదుపాయం చేశారు. తరాలు గడిచి రామరాజు హయానికి వచ్చేసరికి ఊరు రూపురేఖలు మారినా కోవెల ప్రాభవం నానాటికీ పెరుగుతూ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులనీ, బాటసారులని కూడా ఆకర్షిస్తూనే ఉంది.
రామరాజు చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. వార్ధక్యంతో కదలలేని తాతగారు, తల్లీ సంరక్షణలో పదహారేళ్లకే గ్రామపరిపాలన బాధ్యతలని భుజానవేసుకోవలసి వచ్చింది. పదిహేడు నిండవస్తుండగా రాయచూరు మంత్రి అయిన తిమ్మన ప్రగ్గడ కుమార్తె ఇందుమతిని వివాహమాడాడు. ఆమె ఈడేరుతూనే రామరాజింట అడుగుపెట్టింది.
***
ఇందుమతి చక్కనిది. బుద్ధిమంతురాలు. ఇంటెడు దాసీజనమున్నా వంటింటి పనీ, పెరటితోట సంరక్షణా స్వయంగా తానే చూసుకునేది. అత్తగారికి ఇందుమతంటే వల్లమాలిన వాత్సల్యం.
ఏడుమల్లెలెత్తు సుకుమారి కాదామె. పాలకడవలు అలుపులేకుండా చంకనేసుకొచ్చేది. ధాన్యం దంచి సన్నబియ్యం జాగ్రత్త చేసేది. కాయగూరలమడులకి సునాయాసంగా పాదులు తవ్వేది.
సంజెచీకట్లు ముసురుకోగానే చందనమూ, పచ్చిపసుపూ పాలలో కలిపి ఒంటికి రాసుకుని పన్నీటి స్నానం చేసేది.. సరిగంచులో, సంపంగికావులో.. కామవరాలో.. మనసుకు నచ్చిన వలువలు సింగారించుకుని, అల్లీ అల్లని కురుల్లో జాజులు, దవనం తురుముకునేది. భోజనాలయ్యాక, ఎర్రగా కాగినపాలలోయాలకులూ, చిటికెడు జాజికాయ పొడీ కలిపి రవంత కుంకుమపువ్వు వేసి, మగనికి తీసుకువెళ్లేది.
మిద్దె మీద ఉయ్యాలలో కూర్చుని తోటని, కొలనులో కలువలనీ.. వాటిమధ్యకు దిగివచ్చిన చందమామనూ చూస్తూ .. ఇందుమతితో కబుర్లు చెప్పుకోవడమంటే రామరాజుకి ఇష్టం. పెరటితోటలో పూవులేమి పూచాయో, ఈసారి బెండనారు ఎక్కడ వేయాలో.. తువ్వాయి ఎంతల్లరి చేస్తోందో.. ఆమె మాట్లాడుతుంటే అతను ఊఁ కొడతాడు. వేసంగి ఎప్పుడు మొదలవబోతోందని అంచనా వేస్తున్నారో, విజయనగర ప్రభువులేమంటున్నారో, బహమనీ రాజ్యపు వార్తలేమిటో.. ఊరి బాగోగులేవిటో అతను చెబుతుంటే ఆమె వింటుంది. ఆమె మనసెరిగి అతడు, అతని మక్కువకి తగినట్టు ఆమె.. ఇదీ వారి దాంపత్యం.
అత్తవారింట అడుగుపెట్టి ఏడేళ్లయినా ఇందుమతికి పిల్లలు కలగలేదు. జ్యోతిష్కులకి ఇద్దరి జాతకాలూ చూపించాడు రామరాజు. వారు త్వరలోనే వారింట బిడ్డడు పారాడబోతున్నాడని జ్యోస్యం చెప్పి, గ్రహదోష నివారణార్ధం ఆలయపునరుద్ధరణ, సంతాన వేణుగోపాలహోమం చేయించమని సలహా ఇచ్చారు.
***
హేమమాలి ఆజానుబాహువు, చురుకైనవాడు. విజయనగరరాజుల ఆస్థానశిల్పి దమ్మనభద్రుడికి దూరపు చుట్టరికపు అల్లుడి వరస, ప్రియశిష్యుడు. దమ్మన తన ఒక్కగానొక్క కుమార్తె పుష్పని, హేమమాలికి ఇచ్చి పెళ్ళిచేసి అతడిని ఇల్లరికం అట్టేపెట్టేసుకున్నాడు. వారికో ఆడపిల్ల.. ఆరునెల్లది.
పుష్పంటే తండ్రికి పంచప్రాణాలు. మనవరాలు, చంటిపిల్లైతే తాత గుండెలమీదే ఆడుకుంటూ పెరుగుతోంది. తన దగ్గర విద్యలో మెళుకువలు నేర్చుకుని, వినయవిధేయతలతో మెలిగే అల్లుడిని చూసి దమ్మన మురుసుకోని క్షణముండదు.
పెళ్ళై ఏణ్ణర్ధం దాటినా, పుష్పకి తన భర్తతో మాట్లాడే చనువు రాలేదు. అలా అని హేమమాలి కోపిష్టేమీ కాదు. నెమ్మదస్తుడు, బాధ్యతెరిగినవాడు. మామగారంటే భక్తిశ్రద్ధలు.. ఎప్పుడూ ఆయన వెంబడే తిరుగుతుంటాడు. ముమ్మూర్తులా తండ్రిని పోలినట్టుండే పుష్పని చూసినప్పుడల్లా క్షణకాలం అతనికి రాజసంగా మాట్లాడే మామ గుర్తొస్తాడన్నమాట వాస్తవం. పుష్పకి ఏం కావాలన్నా తండ్రే అపురూపంగా తెప్పించిపెట్టేవాడు. అలాంటి వస్తువుల్లో తనూ ఒకడినని హేమమాలి ఉద్దేశ్యం. చనువుగా భార్యని దగ్గరకి పిలువలేడు. నచ్చితే పొగడడు.. నొచ్చితే తెగడడు. అన్నిటికీ సర్దుకుపోవడమే అతని స్వభావం.
అందరిలా నవ్వుతూ తుళ్ళుతూ తామిద్దరం ఉండడంలేదని పుష్పకి తెలుసు. కానీ.. వంకపెట్టడానికి వల్లకాని సుగుణాలరాశి ఆమె మగడు.
స్నేహితులతో కలిసి వీధరుగుల్లో కూర్చుని, కబుర్లు చెప్పేటప్పుడు హేమమాలి.. కొండవాగేదో బిరబిరా పొంగినట్టు నవ్వుతాడు. చంటిది పుష్ప చేతుల్లోంచి తనమీదకి దూకాలని ప్రయత్నించినప్పుడల్లా గిలిగిచ్చకాయలా నవ్వుతాడు. కండువా తెచ్చిచ్చి 'భద్రం..' అని గుమ్మం వెనుక నిలబడ్డ భార్యని చూసి హార్దంగా పెదవివిచ్చుతాడు. పాపాయిని ఉయ్యాలలో వేశాక, దీపపువత్తిని పుష్ప మామూలు కన్నాతగ్గిస్తుంటే.. సోగ పున్నాగలు గుప్పుమన్నట్టు ముసినవ్వు రువ్వుతాడు. అయినా పుష్పకేదో బెరుకు. గలగలా మాట్లాడలేదు... ఇది కావాలీ అని అడగలేదు. ఇద్దరిమధ్యా ఏదో కనిపించని తెఱసెల్లా ఉన్న భావన.
చంటిపిల్ల ఎదుగుతున్నకొద్దీ.. పుష్ప చిర్రుబుర్రులాడడం మొదలెట్టింది. కూతురి ప్రవర్తనకి అల్లుడు ఇబ్బంది పడడం, ముభావంగా గడపడం దమ్మన గమనించాడు.
దమ్మన తెలివైనవాడు. ఆ దంపతులకి ఏకాంతం, స్థానమార్పూ అవసరమని గ్రహించాడు. ఇద్దరినీ పిలిచి కొచ్చెర్ల ప్రయాణం కట్టమన్నాడు.
"రామరాజుల వారు, మన ప్రభువులకి ప్రియమిత్రుడూ.. సలహాదారూ. వారి ఊళ్ళో ఆలయోద్ధరణ చేస్తున్నారట. రంగమండపనిర్మాణం జరిపిస్తున్నారట. నన్నే రమ్మంటిరి. ప్రభువుల అనుజ్ఞా అయింది. ఉన్నట్టుండి ఏదో నీరసం. ప్రయాణాలు చేసే వయసైపోయిందేమో అనిపిస్తోంది. మా హేమమాలి వస్తాడని చెప్పాను. ఏడాది పని ఉండచ్చేమో బహుశా. మనశిల్పుల్లో కావలసివారిని తీసుకుని, మీ ముగ్గురూ బయల్దేరండి. కొత్త ఊరు చూసినట్టు కూడా ఉంటుంది." అని చెప్పాడు.
'చంటిపిల్లతోనా..' అని సంశయిచించిన కూతురితో ఏమీ పరవాలేదని.. నమ్మకమైన దాసి ని ఇచ్చి, బళ్ళు సర్దించి అత్తవారింటికి పంపినంత హడావిడితో బయల్దేరదీశాడు.
***
ప్రసన్న వేంకటేశ్వరుని ఉత్సవాలు జరపడానికీ, ఆస్థానానికీ వీలుగా విశాలమైన మండపం.. సకలశోభలతోనూ నిర్మించేందుకు ప్రధానస్థపతిగా హేమమాలి తాంబూలమందుకున్నాడు.
పగలంతా ఆలయం దగ్గరే గడిపినా, చంటిపిల్ల కోసమని పొద్దుగూకేసరికి ఇల్లుచేరుతున్నాడు. కొత్త ఊరిలో పుష్పకీ తోచుబాటు అయిపోతోంది. దాసి ని వెంటబెట్టుకుని ఒకట్రెండుసార్లు ఇందుమతిని చూసివచ్చింది కూడాను. ఇందుమతి కలుపుగోలుతనం పుష్పకీ, అరమరికల్లేని పుష్ప మనస్తత్వం ఇందుమతికీ బాగా నచ్చాయి.
మంటప నిర్మాణం ఎంత చురుగ్గా జరుగుతోందో, తన ఊహకు అందనంత అందంగా ఎలా రూపుదిద్దుకుంటోందో.. రామరాజు నోట విన్న ఇందుమతి, పుష్పదగ్గర ఆమె భర్తని అభినందించింది. దానితో పుష్పకి ఆలయం చూడాలని మనసుపుట్టింది. బహుశా ఆమె తన మగడిని పెదవి విప్పి కోరిన మొదటికోరిక అదేనేమో.
గుమ్మానికి లోపలగా నిలబడి పుష్ప నెమ్మదిగా అన్నమాట విని బయల్దేరుతున్నవాడు కాస్తా క్షణకాలం ఆగిపోయాడు. ఆమెవైపోసారి చూసి, తలపంకించి వెళ్ళిపోయాడు. అవుననా, కాదనా.. ఏమనో అర్ధంకాలేదామెకి.
***
ఆ రాత్రి పిల్లని ఉయ్యాల్లో వేసి, జారిన జుట్టుముడి సవరించుకుంటున్న పుష్పకి వెనకనుండి అలికిడి వినిపించి తుళ్ళిపడింది. మంచం మీదనుండి లేచి కండువా కప్పుకుంటున్నాడు హేమమాలి. ప్రశ్నార్థకంగా అతనివైపు చూసింది.
దాసి ఉండే గదివైపు చూపించి.. చెప్పి తనతో రమ్మనమని సైగచేశాడు.
***
ఊరువదిలి మైదానం దిక్కుగా చకచకా నడుస్తున్న భర్తవెనుకే పరుగులుగా నడుస్తోంది పుష్ప.
కదులుతున్న శిల్పంలా ఉన్న అతని దృఢమైన వీపు, కుడిచేతితో వెనుకవైపుకి కనిపించేలా పట్టుకున్న కాగడావెలుగులో సగం మెరుస్తూ కనిపిస్తోంది. భుజాలమీదకి పడుతున్న అతని గిరజాలు వింతగా కదులుతున్నాయి. రెపరెపలాడుతున్న పైటతో.. ఒక అడుగు పూర్తిగా నేలని తాకకముందే రెండో అడుగుకోసం త్వరపడుతూ అతని వెనుక ఆమె పరుగు.. అడవివాగు జడిలా ఉంది.
నడకాపి ఆమెకి అడ్డుతొలగి నిలబడ్డాడతను. ఠక్కున ఆగిందామె. అతనిని దాటి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి చేష్టలుడిగిపోయింది. విశాలమైన మైదానం అంచున వెన్నెలకొండలు పటం కట్టినట్టు.. దేవతలు కట్టుకున్న బొమ్మరిల్లులా.. మానవమాత్రుల సృష్టికాదన్నట్టున్న ఆ దేవాలయం. తేటగాలి మోసుకొచ్చే అడవిసంపెగల పరిమళం మత్తెక్కిస్తూ .. ఇది భూలోకం కానేకాదన్నట్టనిపించింది.
బండల మధ్యనుంచి అతి జాగ్రత్తగా తనచేతిని పట్టుకునడిపిస్తున్న అతనితో మాట్లాడాలనిపించడంలేదామెకి... తనలో ఉబుకుతున్న ఉద్వేగం స్పర్శద్వారా అతనికి అందిస్తోంది.
సగం చెక్కిన శిల్పాలు.. తోరణాలూ.. కాగడా వెలుగులో పరిశీలనగా చూస్తోంది.
"ఈ రాళ్ళదెంత దురదృష్టమో.. వెన్నెల్లో అడవిని చూస్తూ, బొమ్మల్లా నిలబడగలవేకానీ, ఈ పచ్చిగాలి పీల్చలేవు, ఆ కోనేట మునకలేయలేవు." అతని మాట విని చురుగ్గా కళ్ళలోకి చూసింది.
ఆ వెన్నెల రాత్రి.. మినుకుమనే నక్షత్రాలు గుసగుసలాడుకుంటుంటే.. జాబిలితో దోబూచులాడుతూ.. యధేచ్ఛగా కోనేట్లో ఈతలు కొట్టారు. అలసి గట్టున సోలిపోయారు. చందనవృక్షాన్ని అల్లుకున్న గోధుమత్రాచులా.. సుడిగాలిలో తలిరాకులా.. రసయజ్ఞపు సమిధలాగా.. పలురూపులుదేరిందామె. ఆమె మిసమిసలన్నీ అద్దుకుని పరిమళించాడతడు.
అలసిన తనను రెండుచేతుల్లోనూ పొదువుకుని ఊరివైపుగా నడుస్తున్న అతనికి మరింతగా హత్తుకుపోయిందామె.
***
ఉలి శబ్దాలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోతోంది. హేమమాలి ఆధ్వర్యంలో శిల్పులు బండరాళ్ళకి ప్రాణం పోస్తున్నారు.
అతడు శిల్పాన్ని చెక్కే తీరు మహాముచ్చటగా ఉంటుందని తోటిశిల్పులు కూడా చెప్పుకుంటారు.
ఎంచిన రాయిని పరిశీలనగా చూసి, హెచ్చైన భాగాలన్నీ సుత్తితో కొట్టిపడేస్తాడు. ప్రియమైనవారి సంకెలలు ఛేదిస్తున్నంత బలంగా.. ఏకాగ్రతతో చేస్తాడాపని. ఉలిని లయబద్ధంగా నడుపుతూ, చెక్కుతూ.. కొంత రూపం ఏర్పడ్డాక.. సన్నని ములుకుల్లాంటివీ, సూదుల్లాంటివీ, వంపుతిరిగినవీ రకరకాల కొరముట్లు సరిచూసుకుని, అప్పుడు నగిషీ మొదలుపెడతాడు. ఉలిని పట్టుకున్న వేళ్ళమధ్యలో సన్నని గుండ్రటి ములుకు ఇరికించుకుంటాడు... ఉలిదారిని చదునుచేస్తూ రేఖలని మరింత సున్నితంగా మలుస్తున్న ఆ ములుకు విన్యాసం చూడాల్సిందే. ఆ రాతిలో బందీగా ఉన్నదెవరో అతని అదృశ్యచక్షువుకే కనిపిస్తుంది. ఆ ఉలి చప్పుడు, ఏ యక్షిణినో విముక్తి చేసేందుకు గాలిలో దాక్కున్న శత్రువుతో వీరుడు చేస్తున్న యుద్ధకోలాహలంలా వినిపిస్తుంది.
స్థంభానికి ఆనుకుని త్రిభంగిగా నిలబడిన ఆ శిల్పం ఆపూటే పరిపూర్ణత దిద్దుకుంది. అలసి వాలిపోయాడు హేమమాలి. ఇంటికి ఎలా చేరాడో.. సోయి లేదతనికి.
***
ఆలయానికి జనంతాకిడి హెచ్చయింది. దాదాపుగా పూర్తికావొస్తున్న నిర్మాణపు నగిషీలని, పనితనాన్నీ చర్చించుకుంటున్నారందరూ.
అతని మనసులో ఏదో అలజడి. ఇంకా కొరత ఉన్నట్టు ఆ శిల్పసుందరినే తదేకంగా చూస్తున్నాడు. మునిమాపువేళ కావస్తుండగా.. చకచకా తనకు తోచిన మార్పులు చేసి సంతృప్తిగా ఇంటికి బయలుదేరాడు. అతను వెనుతిరిగిన గడియకు అస్తమిస్తున్న సూర్యకిరణం ఆ సుందరిపై వాలింది.
***
మర్నాడు మంటపాన్ని చూసి మరలుతున్న సుకర్మ అనే స్వర్ణకారుడు.. ఆ శిల్పాన్ని చూడడం తటస్థించింది. సంజె నారింజ కిరణాలు ఆ శిల్పంపై తారట్లాడుతూ అతని దృష్టిని ఆకర్షించాయి. క్షణమాగి తనుచూస్తున్న దృశ్యాన్ని మరింతగా మనసులో ముద్రించుకునే ప్రయత్నం చేసాడు.
***
"నీకో బహుమతి.." అంటూ రామరాజు ఇందుమతి మెడలో నగ అలంకరించాడు. ఎప్పట్లానే వారి పెరటికొలనులో కలువల మధ్య చంద్రవంక విహరిస్తోంది.
"చిలుకతాళి!!" ఆశ్చర్యంగా చూసుకుని సంబరపడిందామె.
జిగజిగ మెరుస్తున్న నగకి.. వెడల్పాటి పతకం. మరకతాలు పొదిగిన రెండు చిలుకలు కెంపులముక్కులు ఆనుకుని ఉన్నాయి. చిలకలు చెక్కిన పతకం చుట్టూ బంగరు ఆకుల కట్టు.
"ఎంత అందంగా ఉందిది! ఎక్కడిదీ?" తానే అడిగింది.
"సుకర్మ అని.. కన్నడదేశపు స్వర్ణకారుడట. తీర్థయాత్రలు చేస్తూ మన కోవెల చూడడానికి వచ్చాడు. అతను చదివించుకున్నాడు." చెప్పాడు రామరాజు.
"అతన్ని ఉండమని చెప్పరాదూ? మన కోవెలలో దేవేర్లకి ఆభరణాలు చేయిద్దాం. ఎంత నాజూకైన పనితనం!!" మెచ్చుకుంది ఇందుమతి.
***
ఇందుమతి కోరికమేరకు రామరాజు సుకర్మ బసచేస్తున్న సత్రవుకు మరిన్ని బహుమానాలతో కబురుపంపాడు.
ఇందుమతి కోరికమేరకు రామరాజు సుకర్మ బసచేస్తున్న సత్రవుకు మరిన్ని బహుమానాలతో కబురుపంపాడు.
ఉబ్బి తబ్బిబ్బైన సుకర్మ అప్పటికి సంతోషించినా, సన్నగా మొదలైన ఆలోచనొకటి అతనిని నిలబడనివ్వలేదు. ఓ నిర్ణయానికి వచ్చాక అతని మనసు కుదుటబడింది. నాణాలమూట అంగీ మడతల్లో దాచుకుని రాజుగారింటికి దారితీశాడు.
***
ఉయ్యాలలో నిద్రపోతున్న పాపని ఓమారు చూసుకుని, మగడింకా రాలేదేమా అనుకుంటూ సావిట్లో దీపపు వత్తిని సరిచేసింది పుష్ప.
పెరటివైపు అలికిడి విని పిల్లి వంటింట దూరుతోందేమో అని అటు వెళ్లి వచ్చేలోగా, వీధిలో చప్పుడు. 'పాపాయీ.. మీ నాన్నొచ్చేసారు.' అంటూ బయటికొచ్చేలోగా.. వీధరుగుపై ఉన్న కిటికీ తలుపు ఓరగా తీసి, వస్తువేదో కిటికీలోంచి దబ్బున లోపలికి విసిరేశారెవరో.
భయపడి 'ఎవరూ..' అని అరిచింది. కలకలానికి దాసి పరిగెత్తుకొచ్చింది. ఆ వస్తువేమిటా అని పరిశీలనగా చూశారిద్దరూ. అది నాణాలమూట! ఆశ్చర్యంతో నోటమాట రాలేదు.
గభాలున వీధిలోకి పరిగెత్తి చూస్తే, మలుపు తిరిగిపోతూ ఎవరిదో ఆకారం లీలగా కనిపించింది.
***
పుష్ప చెప్పినమాట విని విస్తుపోయాడు హేమమాలి. జరిగినది చెప్పి, ఆ డబ్బు రాజుగారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారా దంపతులు.
***
పుష్ప చెప్పినమాట విని విస్తుపోయాడు హేమమాలి. జరిగినది చెప్పి, ఆ డబ్బు రాజుగారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారా దంపతులు.
తెల్లవారేసరికి వచ్చి నాణాలమూట తనముందు పెట్టిన శిల్పిని చూసి ఆశ్చర్యపోవడం రామరాజు వంతయింది.
"ఇది ఆ సుకర్మకి పంపిన డబ్బులా ఉన్నట్టుందే?!" మూటకి ఉన్న కుచ్చులని తిప్పిచూస్తూ ప్రకాశంగా అన్నాడు.
"చిత్రంగా ఉంది. మొన్న స్వర్ణకారుడొకడు మాకో ఆభరణం బహూకరించాడు. ఆ పనితనానికి మెచ్చి బహుమతిచ్చిన సొమ్మిది. కోవెలకి సంబంధించిన పనులేమైనా పురమాయించచ్చని కొన్నాళ్ళాగమన్నాము కూడా.. కనుక్కుందాం." అని చెప్పాడు.
రామరాజు పంపిన సేవకుడు వట్టిచేతులతో వెనక్కి వచ్చాడు.. సత్రంలో చెప్పాపెట్టకుండా సుకర్మ మాయమయిపోయాడనే వార్తతో! ఎవరైనా అతని దగ్గరున్న సొమ్ముకోసమని దాడిచేసారేమో అని చుట్టుపక్కల ఊళ్ళదాకా, అడవిలోనూ వెతికించాడు రామరాజు. ప్రయోజనం లేకపోయింది. జరిగినదేవిటన్నది వారిద్దరి ఊహకు అందకుండా మహాచిత్రంగా అలాగే మిగిలిపోయింది.
***
శ్రీరంగనాథుడిని సేవించుకుని ప్రాకారాలమధ్య వింతలూ విడ్డురాలూ చూస్తూ తిరుగుతున్న సుకర్మకి, తనలాగే తీర్థయాత్రలు చేస్తున్న తన మిత్రబృందం కనిపించింది. వాళ్ళలో తన చిన్ననాటి నేస్తం బిట్టిదేవుడు కూడా ఉండేసరికి, సుకర్మకి మహదానందమయింది. ఊరి కబుర్లు, దారిలో వారువారు తిరిగిన ప్రదేశాల విశేషాలూ చెప్పుకుంటూ బసకి చేరారు.
మరునాడు తెలవారకమునుపే సుకర్మ, బిట్టిదేవుడితో కలిసి కావేరీస్నానానికి వెళ్ళాడు. స్నేహితుడితో మనసువిప్పి మాట్లాడేందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు సుకర్మ.
"గెళియా.. ఆర్నెల్లయిందిగా ఊరొదిలి. రేపు మాతో కలిసి వచ్చేయకూడదా?" ఇసుకతిన్నె మీద కూర్చుంటూ అడిగాడు బిట్టిదేవుడు.
"ఇంకా కాశికి పోవాలి బిట్టి.."
"దేవుడెక్కడ లేడు? మన దేశంలో ఈ కావేరి లేదా? ఆ రంగడు లేడా? తిరిగింది చాలుకానీ.. రెండేళ్ళనాడు విజయనగర ప్రభువులని కలిసి, కొలువు అడుగుదామని ఆశపెట్టావు.. ఏదీ?" ఆక్షేపించాడు బిట్టి.
"దేనిమీదకీ దృష్టిపోవట్లేదు. అంత జబ్బుచేసి నా భార్య పోయాక, మనసు కలతయింది. పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతానని మొక్కాను. పాపం చెయ్యనని, పాపకారి సొమ్ము ముట్టననీ ఒట్టుపెట్టాను."
"ధైర్యం చిక్కబట్టుకో. పోయినవారితో పోలేం కదా! మళ్ళీ చక్రంలో పడితిరగడమే. అయినా పాపమేంటి.. పుణ్యమేంటి? న్యాయంగా ఉంటే పొట్టగడిచే రోజులా ఇవి? అబద్ధాలాడని సాని, కల్తీచేయని కంసాలి ఉన్నారంటే రంగడు, విరుపాక్షుడూ కూడా నమ్మరు." నిష్కర్షగా అన్నాడు బిట్టి, స్నేహితుడితో.
"నువ్వన్నది నిజమే.. సొమ్ముచూస్తే పాడుబుద్ధి తప్పదు. అందుకే కొన్నాళ్ళిలా గడవనీ. నేను చేసిన పాపాలే నా ఇల్లాల్ని తీసుకుపోయాయి. కడిగేసుకోనీ. ఇకపై జన్మలో తెలిసి తప్పుచేయనని విరూపాక్షుని మీద ప్రమాణం చేసానో లేదో.. నన్ను పరీక్షించాడు స్వామి."
"ఏమైంది?" ఆశ్చర్యంగా అడిగాడు బిట్టి.
"విరుపాక్షదేవరు దర్శనమయ్యాక, కొచ్చెర్ల ప్రసన్న వెంకటేశ్వరుడిని చూడబోయాను. చిన్నఊరే కానీ మహబావుంది. స్వామి రూపైతే నేత్రోత్సవమే! ఇన్ని దేవస్థానాలలో ఎక్కడా లేని సదుపాయాలూ, వసతులు.. రామరాజ్యమే అనుకో. అక్కడి రాజుగారు మంటపమొకటి కట్టిస్తున్నాడు.. పిల్లల్లేరని పూజలు చేసేందుకట. మన విజయనగరప్రభువులు పంపిన శిల్పి ఒకడు పనిచేస్తున్నాడక్కడ. అతను చెక్కినదే ఓ శిల్పం ఉంది కదా.. రెండుకళ్ళూ చాలవు బిట్టీ!"
బిట్టిదేవుడు ఆసక్తిగా ఊఁ కొడుతున్నాడు.
"ఏదో మాయ ఉందందులో! ఆ బొమ్మ మెడలో ఎంచక్కని పతకమున్న నగ. పుట్టుకతో వచ్చిన బుద్ధి కదా.. ఆ ఊరి కంసాలిని పరిచయం చేసుకుని, రాత్రికి రాత్రి ఆభరణం తయారుచేసాను. అచ్చం అలాగే.."
"చేసి..?"
"చేశాకే వచ్చిందా బుద్ధిమాలిన ఆలోచన. రాజుగారికివ్వాలని. ఇచ్చి వచ్చాను. మెచ్చుకుని బోలెడు బహుమతులిచ్చారాయన."
"ఇంకేమీ?"
"సరే, నేను సత్రానికి తిరిగొచ్చాక వెనకే మనుషుల్ని పంపి చెప్పారు.. రాణిగారికి నా పనితనం నచ్చిందని. కొన్నాళ్ళాగి కోవెల్లో దేవుళ్ళ నగలు కూడా చేసి వెళ్ళాల్సిందనీ.."
"భలే అవకాశంలే.. అట్నుంచి విజయనగర ఆస్థానంలో కూడా చోటు దక్కేది కదా!"
"ఆ భోగమంతా సరే. నాకు మనసొప్పలేదు. ఆ శిల్పి చెక్కిన నమూనా వల్లే కదా నాకీ డబ్బు వచ్చింది.. నిజం చేప్పేసి, డబ్బు వెనక్కి ఇచ్చేసి.. రాజుగారు అప్పటికీ ఉండమంటే ఉందామనుకున్నాను. రాజుగారింటికెళ్ళాను. తోటలో.. రాణీగారు కనిపించారు."
"రాణిని చూసావని పీకపట్టుకున్నారా?" ఉత్కంఠ ఆపుకోలేకపోతున్నాడు బిట్టి.
"అబ్బే.. చెప్పాగా చిన్న ఊరని. తెరకట్లు లేవు."
"మరి?"
"ఆవిడ.. ముమ్మూర్తులా ఆ యక్షిణిలా ఉంది.."
"అయితే! ఆ శిల్పి.. ఆమెకు.. "
"ఏమో.. పైవాడికెరుక. నాకెందుకో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. పాలకుండలో విషంచుక్క పడ్డట్టనిపించింది. డబ్బు శిల్పి ఇంట్లో జారవిడిచి ఉన్నపళాన ఊరు విడిచి ఇలా వచ్చేశా.." చెప్పేసి తేలికపడ్డాడు సుకర్మ.
"డబ్బిచ్చేశావా!! నీ తస్సాదియ్యా.. నిజంగా సత్తెకాలపువాడివే!" నిరాశగా నవ్వాడు బిట్టి.
మౌనంగా ఉండిపోయాడు సుకర్మ.
"పోన్లే.. వచ్చేసి మంచిపనే చేసావ్. నీ ఆభరణం వల్ల విషయం బయటపడితే, ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు .. మగడో.. మారుమగడో.. ఎవరో ఒకరిచేతిలో చచ్చేవాడివి." బిట్టి తీర్మానించాడు.
***
రాజుగారికి తన భర్త వెళ్ళి నాణాల మూట ఇచ్చేసాక, పుష్ప ఇందుమతి దగ్గరకి వెళ్ళింది. జరిగిన విషయాన్ని రకరకాలుగా చర్చించుకున్నారిద్దరూ..
సుకర్మ చేసిచ్చిన ఆభరణం చూపించింది ఇందుమతి.
"హమ్మయ్యో!! ఏమి చేతాళం! ఇంత అందమైన ఆభరణాన్ని చేసిచ్చి, అసలెందుకలా పారిపోయాడు! డబ్బు మా ఇంట్లో ఎందుకు పడేశాడో ఊహక్కూడా అందట్లేదు కదా!" పుష్ప ఆ చిలుకతాళిని అటూఇటూ తిప్పి పరిశీలిస్తూ అంది.
"అదే.. ఎవరైనా అతన్ని తీసుకుపోయి ఉంటారని అనుమానం. కానీ ఏ ఆచూకీ దొరకలేదు. పైవాడికెరుక.." నిట్టూర్చింది ఇందుమతి.
"ఏమైతేనేం.. మీకు ఈ ఆభరణం భలే బావుంటుంది! కెంపులైతే దానిమ్మగింజల్లా ఉన్నాయిగా! మెరిసిపోతున్నాయ్.." చనువుగా ఆమెకు అలంకరించింది పుష్ప.
***
రంగమంటప ఆరంభోత్సవానికి ముహూర్తం నిశ్చయించారు. అదేరోజు సంతాన వేణుగోపాలహోమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
పూర్తయిన నిర్మాణాన్ని, ఏర్పాట్లనూ చూసేందుకు విచ్చేసిన రామరాజుకి, ఒక్కో అడుగునా చెక్కిన కథలు, విశేషాలూ వివరిస్తూ.. తన పనితనాన్ని సగర్వంగా చూపిస్తున్నాడు హేమమాలి.
పురాణగాథలు, పశుపక్ష్యాదులు.. దేవతామూర్తుల శిల్పాలను చెక్కిన ఆ మంటపానికే శోభనిస్తూ , త్రిభంగిగా నిలబడిన ఇందుమతి శిల్పాన్ని చూసి రామరాజు మ్రాన్పడిపోయాడు. దాన్ని ఆశ్చర్యంగా భావించి.. మౌనంగా చిరునవ్వుతో పక్కగా నిలబడి ఉండిపోయాడు శిల్పి. రాజు తేరుకుని.. ఆమె మెడలో చెక్కివున్న ఆభరణాన్ని చూసి కనుబొమ ముడివేసాడు. నిశ్చలంగా తననే చూస్తున్న హేమమాలి కళ్ళలో ఎలాంటి తడబాటూ, బెదురూ లేవు. రామరాజు తలపంకించి నిశబ్దంగా ముందుకు సాగిపోయాడు.
***
"ఎల్లుండే కదూ.. ఉత్సవం?" భర్తను అడిగింది పుష్ప.
అవునన్నాడు.
"మనమోసారి.. ఈలోగా, కోవెల చూసొద్దామా?" చిరునవ్వు దొంతరల్లో సిగ్గును అదిమిపెట్టి కోరింది.
"అక్కడంతా హడావిడి. వస్తానంటే ఇప్పుడు వెళదాం.. చూసిరావడానికి." ఆమె మనసు చదివి నవ్వాడు.
సిగ్గుగా తలదించుకుని నవ్వేసింది.
ఆ రేయి తిరిగిన ప్రదేశాలు పట్టపగలు చూస్తుంటే వింతగా ఉన్నాయామెకి. పరధ్యానంగా నడుస్తోంది పుష్ప. అడిగీ రానంటే ఏమైనా అనుకుంటాడేమోనని వచ్చింది కానీ, ఆమెకు పెద్దగా ఆసక్తిలేదన్నది మాత్రం నిజం.
పరాకుగా చూస్తున్నదే.. ఇందుమతిని పోలిన శిల్పం దగ్గర ఆగిపోయింది. ఆమెవైపే చూస్తూ నిలబడ్డాడతను..
"ఇది.."
"నీకు నచ్చకపోయినా తప్పదు.. " చిన్నగా నవ్వాడు.
అర్ధంకానట్టు చూసింది.
"అదే.. ఇలా అమ్మాయిల బొమ్మలు చెక్కడమా అని నువ్వు అలిగినా.."
"కాదు.. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటేనూ.." నమ్మలేనట్టు రెప్పవేయకుండా చూస్తోందామె.
"అవునా! మీ తండ్రిగారి ముద్ర కనిపిస్తుందేమోలే నా శిల్పాల్లో కూడా.." సాలోచనగా అన్నాడు.
"ఈ ఆభరణం.." పుష్పకింకా నమ్మశక్యం కావట్లేదు.
"వెలితిగా అనిపిస్తే చివర్లో వేసిన చిలుకతాళి. చేయించుకుందాం.. నీకు నచ్చితే." నవ్వాడు.
***
"త్వరగా నిద్రపోవాలి. ఉదయాన్నే మంగళ స్నానం.. హడావిడి కదా." మిద్దె మీద కూర్చున్న రామరాజు పక్కన కూర్చుంటూ చెప్పింది ఇందుమతి.
"మంటపం అద్భుతంగా ఉంది." అన్యమనస్కంగా చెప్పాడతను.
"పూర్తయ్యాక చూద్దామని.. మీరు రమ్మన్నా రాలేదు." సంజాయిషీ ఇస్తూ అతని భుజం మీదకి వాలింది.
అక్కడక్కడా మబ్బుతునకలు తేలుతున్న ఆకాశాన్ని చూస్తూ "అక్కడో శిల్పం అచ్చం నీలానే ఉంది." అని చెప్పబోయాడామెతో.
తనను ఆనుకుని కూర్చున్న ఆమె మెడలోని పతకంతో పాటుగా వేసుకున్న ముత్యాలహారం చిక్కులుపడి ఉంది.
అతని మాట అప్రయత్నంగా వాయిదా పడింది.
అతని మాట అప్రయత్నంగా వాయిదా పడింది.
***
"ఈ ఊరు మీకు బాగా నచ్చింది కదూ?" భర్తను అడిగింది పుష్ప.
"అవును.."
"నేను నచ్చలేదు కదా?"
"అదేం పోలిక?" ఆశ్చర్యంగా ఆమెవైపు తిరుగుతూ అడిగాడు హేమమాలి.
"ఏమో.. ఇక్కడికొచ్చాక నన్ను చాలాబాగా చూసుకుంటున్నారు. నేనే నచ్చిఉంటే మనూర్లో కూడా నాతో ఇలాగే ఉండేవారు కదా? మనం వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ మామూలైపోతామా?"
"ఇక్కడే ఉండిపోదాం." ఆమె చుట్టూ కౌగిలి బిగిస్తూ చెప్పాడు.
పుష్పకి ముచ్చెమటలు పట్టేసినట్టనిపించింది.
"నేను మీకు నిజంగా నచ్చానా? నాన్నగారి కోసం చేసుకున్నారు కదూ?" అపనమ్మకంగా, దుఃఖాన్ని అదిమిపెడుతూ అడిగింది.
"పోనీ.. బొమ్మలు చెక్కడం మానేసి ఏ కట్టెలో కొట్టనా?" ఆమెని వదిలి తలకింద రెండుచేతులూ పెట్టుకుని వెల్లకిలా పడుకుని అడిగాడు.
అతని పెదవులని అరచేతితో మూసింది. ఆమె మనసులో చేరిన అసలైన అనుమానం అతనిదాకా చేరనేలేదు. అపార్ధం దానిపని అది చేసుకుపోయింది.
***
నిండోలగంలో రాజదంపతుల చేతులమీదుగా సన్మానమందుకునేందుకు ముందుకువచ్చారు - హేమమాలి, పుష్ప.
రామరాజు బంగారు పళ్ళెరంలో కానుకలందిస్తూ సూటిగా అతని కళ్ళలోకి చూసాడు. హేమమాలి కళ్ళలో అదే స్వచ్ఛత.. అచ్చం ఇందుమతి కళ్ళలా.
ఉలికిపడి తొట్రుపడుతున్న రామరాజు చేతుల్లోంచి పళ్ళెం జారిపోకుండా పట్టుకుని, శిల్పికి ఆదరంగా అందించింది ఇందుమతి. పక్కనే ఉన్న పుష్ప తనవైపే చూస్తుండడం గమనించి నవ్వింది. హేమమాలి చూపు.. వినమ్రంగా రామరాజు చేతులనూ, ఇందుమతి పాదాలనూ తాకింది.
ఈ సందడిలో ఇందుమతికి మంటపాన్ని పరిశీలనగా చూసే అవకాశమే రాలేదు. పుష్ప ఏమీ జరగనట్టు ఉండడానికి ప్రయత్నించింది.
రామరాజు మనోవ్యధ చెప్పనినలవి కాదు. అసలిది ఎలా సాధ్యం?
సుకర్మ ఏమయినట్టు? ఆ ఆభరణం తనకే ఎందుకివ్వాలి?
తనకు జరుగుతున్నది సూచించడానికా?
ఆ నాణాలని సరిగ్గా శిల్పి ఇంట్లోనే ఎందుకు విడిచిపెట్టాలి? అవి అతడు తనకెందుకు తెచ్చి ఇవ్వాలి?
ఆ శిల్పాన్ని చూసిన ప్రతీవారూ.. ఇందుమతిని చూడగానే ఏమనుకుంటారు??
***
"నాలా ఉండడమేవిటి?" బిత్తరపోయి చూసింది ఇందుమతి.
"అవునమ్మా.. అచ్చం మీలానే ఉందా బొమ్మ! దొరగారు చేయించారనుకుంటున్నారందరూ.."
చీకటిపడ్డాక.. ఇందుమతి ఆ వార్త తీసుకొచ్చిన దాసీతోనే కలిసి ఆలయం దగ్గరకి వెళ్ళింది.
అతి దగ్గరిపోలికలు.. తనను బాగా ఎరిగినవారికి, తానేనేమో అనిపించేంత పోలికలు!! తనని చూడకుండా శిల్పి చెక్కనేలేడని నమ్మేంత సారూప్యం! ఏం మాయ ఇది? నిజానిజాలు తనకు తెలుసు.. మరి భర్తకు? లోకం అతన్ని ప్రశ్నిస్తే?
అన్నిటికంటే ఎక్కువగా.. తన మెడలో ఆభరణాన్ని చూసుకుంటే భూమి ఉన్నచోటే కుంగిపోతున్న భావన. తనప్రమేయం లేకుండానే తనని దూరంగా నెట్టేసినంత వేదన.
***
గత కొన్నాళ్లుగా భర్త ముభావంగా ఉండడానికి కారణం అర్ధమయింది ఇందుమతికి. వచ్చేపోయే అతిథులతో కోలాహలంగా ఉన్న ఉత్సవ వాతావరణంలో.. తనతో మాట్లాడే తీరికలేదనుకుంది కానీ, ఇలాంటి కారణమొకటి ఉండచ్చని ఏమాత్రం ఊహించలేకపోయింది.
రామరాజు మౌనం ఆమెను కోసేస్తోంది. కన్నీళ్ళు చెక్కిళ్ళు మీదకు జారకుండానే ఆవిరైపోతున్నాయి. నిస్త్రాణగా జారిపోయింది.
***
మిట్టమధ్యాహ్నం.. ఎర్రటి ధూళి లేచిందా కోవెల ప్రాంగణంలో..
గూడుబళ్లు విజయనగరం వైపు నడుస్తున్నాయి. బండిలో కూర్చుని పిల్లను జోకొడుతున్న పుష్పనే చూస్తున్నాడు హేమమాలి.
పొలిమేర దాటుతుండగా గుండె మెలిపెట్టినట్టయిందతనికి. ఆకాశంలో ఊదారంగు మేఘమొకటి తేలుతున్నట్టు కనిపించింది.. భ్రమలా.. అపనమ్మకంలా..
***
మంటపంలో శిల్పాన్ని.. పగలగొట్టించేశారనే వార్త సుడిగాలిలా వ్యాపించింది.
ఇందుమతి ఇంకెప్పుడూ మిద్దె ఎక్కనేలేదు.. తోటలోకి రానూలేదు.. జ్యోస్యం నిజం కానేలేదు.
పుష్పను చూసినప్పుడల్లా ఆమె భర్తకు.. అనుమానం మాయముసుగు వేసుకుని నట్టింట్లో తిరుగుతున్నట్టనిపించేది.
ఇక రామరాజు.. కాలం రాసిన రాతని చెరిపేయాలని అనునిత్యం వృధాప్రయత్నం చేస్తూ గడిపేశాడు.
పుష్ప మాత్రం.. ఆ రాత్రి కొండసంపెంగల మత్తులో తన ఉపిరెందుకాగిపోలేదా అని ఆలోచిస్తుండేది.
***
ఏళ్ళు గడిచినా పగళ్లూ - రాత్రులూ ఆ రాతిగోడలను యథాప్రకారం పలకరిస్తున్నాయి.
ఆ కోవెల.. రాక్షసి-తంగడిలో ఒరిగిపోయింది. అపార్ధం మాత్రం ఇప్పటికీ బతికేవుంది.
***