Monday, June 29, 2015

ముగ్గురు కొలంబస్ లు

చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి చెప్పానాయనతో.. "నాకు ఈవిడ మరీ నచ్చేస్తోంది.." అని. ఆవిడ డా.సోమరాజు సుశీల. ఆ పుస్తకం "ముగ్గురు కొలంబస్ లు".
 
అమెరికా ట్రావెలాగ్ అంటే చర్వితచర్వణమే! ఈ దేశమూ పెద్దగా మారినదేమీలేదు. పాతికేళ్ళనాటి "పడమటి సంధ్యారాగం" లో చూపించిన పాల డబ్బాలే ఇవాళ్టికీ కనిపిస్తాయి. పిల్లల కార్టూన్ 'బార్నీ'తో సహా ఏమార్పూ లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. తేడా ఉంటే గింటే డాలర్ విలువలోనూ, స్వేచ్ఛ పలురూపాల్లో రెక్కలు విప్పుకోవడంలోనూ ఉందేమో అంతే. ఇక భారద్దేశంతో అనుసంధానించే విధానాల్లో కొత్తగా వచ్చిన మార్పులంటే వీవోఐపీ ఫోన్లూ, ఫేస్ టైములు. అంతకంటే ఏముంటాయ్ అమెరికా కబుర్లలో?

పోనీ, రోజువారీ జీవితాల్లో మార్పులంటే "మేవొచ్చిన కొత్తల్లో గేస్ రేటూ, క్రితం ఉగాదికి వేపపువ్వూ.." అని తులనాత్మకంగా ఏకరువు పెట్టచ్చేమో కానీ, చుట్టపుచూపుగా వచ్చి వెళ్ళినవారి పరిశీలనా, పరిశోధనా ఏముంటాయ్ కనుక. వలసపక్షులకి రెట్టింపు మంది రమారమిగా ఒక్కసారైనా వచ్చివెళ్ళుంటారు. అలాంటి అమెరికాకి చుట్టపుచూపుగా వచ్చివెళ్ళి కథలు రాస్తే, చిత్రమేముందిలే అని తీసిపారేయలేం కదా.. ఎందుకంటే రాసినది ఇల్లేరమ్మ కాబట్టి! మల్లెపూలు మాలలు కట్టడాలూ, నాన్నని సాధించి సినిమాకి తీసుకెళ్ళడాలూ.. కొంపగుండవాటలూ ఎవరెరుగనివని.. అవి ఇల్లేరమ్మ కబుర్లు కాబట్టే బావుంటాయి. అందుకే ఆవిడ చెప్పిన అమెరికా కబుర్లు ఎలా ఉంటాయో చూద్దామనిపించింది.

"అమ్మా వచ్చావా.." అని సంబరపడే కూతురు కాదు అక్కడున్నది. "నీతో పాపం మన పిచ్చి బామ్మా, నాన్నా ఎలా వేగుతున్నారో.." అని ఠకీమని అనేసే ఘటం శైలు. "మీ నాన్న గొప్పలూ, బామ్మ గొప్పలూ మీ వూళ్ళో ఇంకెవరికైనా ఇంగ్లీషులో చెప్పుకో. ఎవరు ఎవరితో వేగుతున్నదీ మా వూళ్లో ఎవర్నడిగినా తెలుగులో చెప్తారు." అని ఠకీఠకీమనే ఇల్లేరమ్మగారిక్కడ. పంచ్ కింగులమని భుజాలు చరుచుకునేవాళ్ళెవరైనా ఉంటే ఇల్లేరమ్మతోనో, వాళ్ళ చెల్లెలు చిన్నారితోనో అరనిమిషం మాట్లాడమని సలహా ఇస్తాను నేనైతే. గర్వభంగమంటే ఏవిటో ఎంచక్కా తెలిసొస్తుంది. వాళ్ళ వారసత్వమే పుణికిపుచ్చుకుంది శైలజ కూడా! ఆ అమ్మాయికి అమెరికాలో పీహెచ్డీ రాబోతోంది. అదీ వేడుక.

'చిత్ర'హింసలు పెట్టే భర్తగారినీ, ఆ ప్రత్యేకసృష్టిని కన్న తల్లిగార్నీ వెంటనేసుకుని, కూతురి పీ హెచ్డీ కాన్వకేషన్ చూడ్డానికి..  అమెరికా సంయుక్తరాష్ట్రాలకు పయనమయ్యింది మన ఇల్లేరమ్మ. అసలు కంటే వడ్డీ ముద్దైతే, ఇక చక్రవడ్డీ ఇంకా ముద్దు కదా.. ముసలవ్వగారు కూడా సంబరంగా బయలుదేరారు. ఆవిడ వీల్ చైర్ సదుపాయం పుణ్యమా అని ప్రయాణం మహా సుఖంగా జరిగిపోయింది.. మిష్టర్ అండ్ మిసెస్ ఇల్లేరమ్మకి కూడా.

"జామ చెట్టున్నవాళ్ళకి దాని కొమ్మలు పట్టుకు వూగవచ్చని తెలీదు. తెలిసిన వాళ్ళకి జామచెట్లు వుండవ్." ఇంతకంటే తేలిగ్గా జీవితాన్ని నిర్వచించడం మహారచయితలెవరికైనా చేతనవుతుందాండీ? ఇల్లేరమ్మ పట్టుమని పన్నెండేళ్ళైనా లేని వయసులోనే ఈ జామచెట్టు థియరీని అలవోకగా చెప్పేసింది. ఇప్పుడు అరవైల్లోకొస్తూ చెప్పిన కొత్తసూత్రమేవిటంటే.. "కాలం గడిచీ ఆయుర్దాయం మెట్లెక్కినకొద్దీ పైకి చూస్తే ఎవరూ ఉండరు. పక్కన కూడా ఎవరూ వుండరు. అంతా ఒంటరితనమే." నిజమేస్మీ! ఇంతా చేసి ఇంత వైరాగ్యం దేనికంటే "నీకిది ఇష్టం అని చేసాం. ఫరవాలేదు ఒక్కరోజులో కొంపలేం మునిగిపోవులే" అని బతిమాలి బోయినం పెట్టి అమెరికా పంపేవారెవరూ కనబడక. మాట వింటుందని ఆఖరిచెల్లెలు బుజ్జికి ఫోన్ చేసిమరీ ఆతిథ్యం పుచ్చుకున్నాకే హైదరాబాద్ వదిలారావిడ. మార్గమధ్యంలో మద్రాసులో గ్రాండ్ స్వీట్స్ కి వెళ్ళి, మరో పెట్టెనింపుకుని మరీ ఫ్లైటెక్కారు. అమెరికాలో దొరకనివెన్నో ఉంటాయి. గుమ్మంలో దింపుకున్న సూట్కేసుల్లోంచి జెట్ లాగ్ తీరీతీరకముందు.. "ఇదిగో అమ్మాయీ.." అంటూ బయటకి తీసే ఓ సన్నంచుచీరో, ఓ మిఠాయిడబ్బానో.. అదీ అమ్మచేత్తో..  ఆ తీపి వేరు.

లండన్ మీదుగా ఝామ్మని వాషింగ్టన్ ఏర్పోర్ట్ లో దిగారు ముగ్గురూ.. "టూరిస్టులొస్తే బంతిపువ్వుల మాలలేసి వెల్కమ్ లు చెప్పడానికి మనం దండలేసేది డాలర్లకి కదా.. మనకలాంటివేం ఉండవులే.." అని ఆర్ధికసూత్రాన్ని చిటికెలో వివరిస్తారామె. అలా బంతిపూల మాలలేయించుకోకుండానే పుత్రికారత్నం ఇంటికి చేరుకున్నారు. ఆపై అన్నిటికీ "నో నో.." అనే ఏణ్ణర్ధం మనవరాలూ, "మా ఆవిడంటే ఎవరూ? శైలూనా.." అని మప్పితంగా మాట్లాడే అల్లుడు... శైలజ ఇల్లూ, గార్డెనూ, ఇరుగూపొరుగూ, ప్రొఫెసర్ గారూ.. ఈ విశేషాలన్నీ ఇల్లేరమ్మగారి కబుర్లలో చదవితేనే సరదా.

"ముగ్గురు కొలంబసులు" పుస్తకంలో ఆ ముగ్గురూ.. వారు ఎవరిని చూడ్డానికైతే ఎగిరివెళ్ళారో ఆ ముగ్గురూ కాకుండా.. మరికొంతమంది అడుగడుగునా కనిపిస్తూ ఉంటారు. అందరికంటే ముఖ్యంగా ఇల్లేరమ్మా వాళ్ళమ్మ. "అమ్మ చూపించని ప్రేమా, మొగుడు ఇవ్వని గౌరవం ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు." అని చెప్తూ.. అమ్మ అప్పుడే ఎందుకెళ్ళిపోయినట్టూ.. విసుక్కుంటే పడేవాళ్ళెవ్వరూ లేరుకదా అని చింతిస్తారు ఇల్లేరమ్మ గారు.


"ఇలా తిన్నారంటే వేసవి సెలవులయ్యేటప్పటికి కళ్ళూ ముక్కూ పూడుకుపోయి, పూర్ణబ్బూరెల్లా అయిపోతారు నాకేం.." అని నలుగురాడపిల్లల్ని బెదిరించే ఇల్లేరమ్మ అమ్మగారు. "పిచ్చిపప్పూ, పిచ్చి కూరావేసుకుని అన్నం.. నిమ్మకాయలంత మావిడిపళ్ళు రెండు.." అని తిన్నవన్నీ లెక్కచెప్పిన ఇల్లేరమ్మ బేచ్.  "అబ్బా ఇన్నెందుకమ్మా. కన్ఫ్యూజను.. ఎలా తినాలీ.." అని విసుక్కునే ఇల్లేరమ్మ గారి కూతురు! మూడుతరాల్ని తలుచుకుని భలే ఆశ్చర్యమనిపించింది. క్షణకాలం పాటు.. ముగ్గురు కొలంబసులతో పాటూ ఆవిడా ఉండి, నలుగురూ వచ్చుంటేనా అని ఆలోచించుకుని నవ్వుకున్నాను.

ఇక ఏణ్ణర్ధం వయసున్న "ఉమారాజా..!" సాధారణంగా కథల్లో పాత్రలపట్ల మనకి అభిమానమో, ఆకర్షణో కలిగిందంటే, వాళ్ళని మనం రోజువారీ మాటల్లోనో, పనుల్లోనో తలుచుకున్నామంటే ఆ రచయితకి అంతకంటే గర్వమేముంటుంది! వంటింట్లో దప్పళం మరిగినప్పుడు అప్పదాసునీ, తాంబూలం నోటపెట్టుకుంటూనే 'బంగారు మురుగు' బామ్మనీ ఎలా గుర్తుచేసుకుంటామో.. బంగాళా ఉల్లిఖారం వండుకున్నప్పుడల్లా ఇల్లేరమ్మ నాన్ననీ, "అచ్చ బంగారాలే..ఇన్నోటి చదువులే..!" అని గారం మాటలు వినగానే ఇల్లేరమ్మా వాళ్ళమ్మనీ తలుచుకుంటాం. "నో.. " అన్నప్పుడూ, ఎవరైనా అంటే విన్నప్పుడూ కూడా ఇంకొన్నాళ్ళపాటు ఉమారాజా గుర్తొస్తుంది. సొంత పిల్లలు కాకుండా మనకి వేరెవరైనా నిజాయితీగా ముద్దొచ్చారూ అంటే, అది కథల్లో పిల్లలేను.

"అత్తగారూ - బగారా బైంగనూ", "అత్తగారూ - మంచినీళ్ళ జగ్గూ".. భానుమతి అత్తగారి కథల్లో శీర్షికల్లా ఉన్నాయి కానీ, ఇల్లేరమ్మ అత్తగారి కబుర్లు ఇవి. డైనింగ్ టేబుల్ మీద వాటర్ జగ్ వైపు భక్తిగా చూస్తూ, అష్టాదశ శతకల్లోనూ నోటికొచ్చినవన్నీ వల్లెవేసుకుంటూ ఉంటారావిడ. ఆ భక్తికి కారణం విని నవ్వుతోపాటూ బోలెడు ముచ్చటేసింది కూడా.. ఇంతకంటే సెక్యులర్ భక్తి ప్రపంచంలో ఇంకెవరికీ ఉండదేమో! మనవరాలు పీ హెచ్డీ పట్టా అందుకున్న సందర్భంలో "ఇదింత కష్టపడి ఇంత మంచి డిగ్రీ సంపాయించబట్టి కదా మనందరం ఇక్కడికొచ్చాం. మా అమ్మకన్న సంతానంలో ఎవ్వరూ విమానం ఎక్కలేదు. ఏ దూరదేశమూ వెళ్ళలేదు. ఈ వయసులో నాకీయోగం పట్టింది." అని కళ్ళద్దుకుంటారా పెద్దావిడ. మునిమనవరాలి ముద్దు ముచ్చట్లూ, మనవరాలి పట్టభద్రురాలవడం.. ఇంకేం కావాలి! భానుమతి అత్తగారికైనా పట్టిందా జపాను యాత్రా యోగం!

"అమ్మా నేను పుట్టినప్పుడేవయిందే.." అనో, "నాయనమ్మా, మనింట్లో దొంగాడు ఎలా పడ్డాడూ.." అనో అడిగి మరీ చెప్పించుకోమూ..  అలాగే, ఇల్లేరమ్మ అమెరికా కబుర్లూను. చదివినవారికి చదివినంత. ఇక మిగుళ్ళూ తగుళ్ళూ మాట్లాడుకుంటే.. "ఇల్లేరమ్మ కతలు" పుస్తకానికి వేసినట్టే "ముగ్గురు కొలంబసులు" కీ మంచి బొమ్మలు వేశారు అన్వర్. శీర్షికల సంగతి చెప్పేదేముందీ.. ఇల్లేరమ్మ ఆ విషయంలో అందెవేసిన చెయ్యి కాదో! మచ్చుకి.. "బెజవాడలో రసగుల్లాలా..", "పూర్వభర్తలూ అపూర్వ అత్తగార్లూ..".  పుస్తకం అయిపోయాకకూడా ఆశ చావక, శ్రీరమణ వెనకమాటైనా ఉంటుందేమో అని వెతుక్కున్నాను. . ఈ పుస్తకానికి అదొక్కటే లోటు. జగమెరిగిన జంపాల చౌదరి ముందుమాటతో పాటూ, పుస్తకప్రచురణకి వెన్నంటే ఉన్న శ్రీరమణ కూడా రాసి ఉంటే బావుండేది. "ఇల్లేరమ్మ కతల" కి శ్రీరమణ వేసిన "చలవపందిరి", ఈ కథలకి కూడా విస్తరించి ఉంటే మరింత అందగించేది.

పదిహేనేళ్ళ క్రితం ప్రయాణపు కబుర్లివి.. ఇవాళ్టికి కూడా వసివాడకుండా ఉన్నాయంటే ఇల్లేరమ్మ చాకచక్యమే! నా వరకూ ఇది ట్రావెలాగూ కాదు. కథలూ కావు. ఇల్లేరమ్మ కబుర్లు. చెణుకులూ, చురకలూ కలగలిపిన కులాసా కబుర్లు. "కన్యాశుల్కం" భట్టీయం వేసినవారికి "పతంజలి సాహిత్యం" మరింత నచ్చినట్టూ, "ఇల్లేరమ్మ కతలు" చదువుకున్నవారికి "ముగ్గురు కొలంబస్ లు" మరీ నచ్చేస్తుందనుకుంటా!

పుస్తకం మూసేస్తూ మరోమాట అన్నాను.. "పెరట్లో ఇల్లేరమ్మ అనే జామచెట్టుందని, వాళ్ళింట్లోవాళ్ళకి తెలుసనే అనుకుందాం.." అని. నవ్వారాయన.

(డా. సోమరాజు సుశీల రాసిన "ముగ్గురు కొలంబస్ లు" ప్రముఖ పుస్తకవిక్రయశాలల్లోనూ, కినిగెలోనూ లభ్యం.)