Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

Thursday, June 26, 2025

టూడీ

సోహం మెలుకువ తెచ్చుకుంటున్నాడు.

నీలి వెలుగు మిణుకుమిణుకుమంటూ అతని శరీరమంతా పరుచుకుంటోంది. 

కళ్ళు విప్పి అటూ ఇటూ కదిపి చూసాడు. కుప్పలా పడున్న శరీరాన్ని కూడగట్టుకుని మూటలా దగ్గరకి జరుపుకున్నాడు. సోహం వొళ్ళంతా నారింజవర్ణం వచ్చి చేరింది. సున్నాల్లో చుక్కలు పెట్టినట్టున్న కళ్ళు గిరగిరా ఇటూ అటూ తిరిగి చూశాయి. రోజు మొదలయింది. 

సోహం ప్లనేరియాలో ఎడమ చివర ఉన్న ఇంట్లో ఉంటాడు.  ఇల్లంటే పెద్దదేమీ కాదు. షట్కోణం మీద త్రికోణం పెట్టినట్టుంటుంది. అప్పుడప్పుడు సోహాన్ని అతని స్నేహితురాలు లిన్నా ఏడిపిస్తూ ఉంటుంది.. 'అది షట్కోణం కాదు పెద్ద త్రికోణాన్ని మొయ్యలేక తెగసాగిపోయిన చతుర్భుజ'మని. ఇంట్లో నేలంతా గుండ్రంగా గుండ్రగుండ్రంగా వృత్తాలుంటాయి. అవన్నీ నీలి ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఒకవైపున్న ఫ్రిజ్ లోంచి  కనిపించే నియాన్ పసుపు సమోసాలు తప్ప ఆ ఇంట్లో ఇంకేమీ ఉండవు. చెయ్యడానికి పనీ ఉండదు. సోహం పనంతా రోడ్డు మీదే.. 

ప్లనేరియాలో ఉన్న త్రికోణాలూ, గీతలూ, గుండ్రాలూ, గీతలూ వగైరాలు ఎక్కడైనా సొట్టలు పోతే వాటిని సోహం సాపు చేస్తూంటాడు. మూటలాంటి అతని శరీరం వాటిని నునుపు చేస్తూ పోడానికి బాగా సదుపాయంగా ఉంటుంది. రోజంతా అలా దొర్లుకుంటూ దార్లో ఎక్కడైనా వంకర త్రిభుజమో, సాగిపోయి వాలిపోతున్న అష్టభుజో కనబడగానే తాపీగా శరీరాన్ని దానికేసి తోస్తూ, పాముతూ.. సరిచేస్తాడు. 'రోజూ ఇదే పనా!' అని అప్పుడప్పుడు విసుగనిపించినా తను సర్దకపోతే ప్లనేరియా గతేమిటో తెలుసు కాబట్టి గర్వంగానే పనిచేస్తూంటాడు. 

అయితే ఎప్పుడైనా త్రిభుజాలు అతుకుల దగ్గర విడిపోతేనో, గుండ్రాలు నేలకి అంటి పైకి రానంటేనో మాత్రం పెద్ద చిక్కొచ్చి పడ్డట్టే! లిన్నా రావాల్సిందే. 

లిన్నా సమకోణ త్రిభుజాకారపు శరీరంతో, అంచులంట నీలిరంగులో వెండిమెరుపులు  కలిపి పూసినట్టు మెరుస్తూ ఉంటుంది. లిన్నా కదిలినప్పుడల్లా అంచులు చమక్కుమంటాయి. ఆ రంగుని రెండు కళ్ళూ తిప్పి వింతగా చూస్తాడు సోహం. 


పాడైపోయిన, విడిపోయిన ఆకృతుల్ని లిన్నా చకచకా సరిచేస్తూంటే చూడడం సోహానికి మరీ మరీ ఇష్టం. ‘తను సొట్టలు తీయగలడంతే.. బాగుచెయ్యాలంటే ఎంత పనితనం కావాలి!’


లిన్నా కష్టపడి పని పూర్తిచేసి అయిపోయిందన్నట్టు ఒళ్ళంతా గాఢనీలం రంగులో విరుచుకుంటుంది. అలాగే హుందాగా జారుకుంటూ గ్లో నూడుల్ కేఫ్ కి వెళ్ళిపోతుంది. తన వెనకే దొర్లుకుంటూ సోహం కూడా అక్కడికే చేరుకుంటాడు. 


గ్లో నూడుల్ కేఫ్ లో సోహానికి ఇష్టమైన నియాన్ సమోసాలుంటాయి. అవంటే లిన్నాకి చిరాకు. 


“ఇవే పొద్దస్తమానం తింటూంటే ఎప్పుడో ఒకప్పుడు నీ ఒళ్ళు కూడా అతుకులు విడిపోయి పగిలిపోతుంది. అప్పుడు నేనే బాగుచెయ్యాలి! ఇప్పటిదాకా ఒక్క బ్లాబ్ ని కూడా బాగుచెయ్యలేదు నేను. నువ్వే ఫస్ట్! చూసుకోమరి..” అని ఏడిపిస్తూ ఉంటుంది. పరవాలేదన్నట్టు కళ్ళు తిప్పి, ఓమీ తెచ్చిచ్చిన సమోసాలు బొజ్జ మీద పెట్టుకుని తనలో కలిపేసుకుంటాడు సోహం. 


లిన్నాకి మింట్ స్క్వేర్ లు చాలా ఇష్టం. తను కేఫ్ లోకి రాగానే ఓమీ అలమరలోంచి మింట్ చదరాలు తెచ్చి పెడుతూంటాడు. లిన్నా నాజూకుగా ఒకటో రెండో తీసుకుని కడుపుకి పెట్టేసుకుంటుంది. 


ఓసారెప్పుడో కేఫ్ లో అలమరా అంచు బద్దలై విలువైన స్టార్ కేండీలు దబదబా ఒలికిపోయాయి. అప్పటికప్పుడు లిన్నా వచ్చి బాగుచేసింది. అందుకని లిన్నా అంటే గౌరవం ఓమీకి. ఎవరి జోలికీ పోని సోహం అంటే కూడా ఇష్టమే కానీ, బోలూ వస్తే మాత్రం చిరాకుపడతాడు. వస్తూనే బోలెడు అల్లరి చేస్తాడు కూడాను. సోహం, లిన్నా రావడమేంటి ఎక్కడున్నా తనూ ప్రత్యక్షమైపోవలసిందే. స్టార్ కేండీ తప్ప ఇంకేమీ ముట్టుకోడు బోలూ.


ముగ్గురూ కేఫ్ లో తిని, కబుర్లు చెప్పుకుని ఇంటిదారి పట్టారు. కేఫ్ గుమ్మందాకా వచ్చినవాడే ఏదో గుర్తొచ్చినట్టు బోలూ వెనక్కిళ్ళి ఓమీ పల్స్ చెక్ చేసి వచ్చాడు. విసుక్కుంటూనే బోలూని దగ్గరకి రానిచ్చాడు ఓమీ. పల్స్ చెకర్ బోలూని ప్లనేరియాలో ఎవరూ కాదనడానికి వీల్లేదు. అంత ముఖ్యమైనపని మరి. ప్లనేరియాలో ఉండేవారు దభేలున కింద పడిపోకుండా ఉండాలంటే పల్స్ కొట్టుకుంటూ ఉండాలి కదా! 


బోలూ పేరుకి తగ్గట్టే చక్కగా గుండ్రంగా గులాబీరంగుకి బంగారమద్దినట్టు ధగధగలాడుతూ హడావిడిగా పరుగులు తీస్తూంటాడు. ఎక్కడా క్షణమాగడు, ఎదురుపడ్డ వాళ్ళు ఎవరి పల్సయినా చూడకుండా వదలడు. 


బోలూని తనింట్లో విడిచిపెట్టి చీకటిపడుతోందని ఇంటికి బయల్దేరారు లిన్నా, సోహం. కొత్త డిస్కో ఫ్లోర్ చూసి కాసేపు డాన్స్ చేసి వెళ్లమని బలవంతపెట్టాడు బోలూ. బయటినుంచే చూసేసి బావుందన్నారు. మెరుస్తూ ఎర్రగా బోలూ లాగే గుండ్రంగా ఉంటుంది వాడి ఇల్లు కూడా. ఇంటి మీద బోలెడు బొమ్మలేస్తూ చెరిపేస్తూ ఉంటాడు బోలూ.  లిన్నా ఇల్లు తనకిష్టమైన మింట్ స్క్వేర్ లాగే ఉంటుంది. 


‘తన ఇల్లు మాత్రమే తనలా ఎందుకు లేద’ని ఆ రోజు రాత్రి నిద్రలోకి జారుకుంటూ ఆలోచించాడు సోహం. తనకో ఆకారముంటే కదా! 


***


“హిక్..” తల అదిరిపోయినట్టయింది సోహం కి.. ఉన్నట్టుండి మెలుకువొచ్చేసింది.


తెల్లారిపోయిందప్పటికే. కలలో ఏం జరిగిందో గుర్తుచేసుకోడానికి ప్రయత్నిస్తూ ఒళ్ళు కూడగట్టుకోబోయాడు. 


మళ్ళీ “హిక్..” 


తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా వంకర్లు పోయినట్టు తోచిందో క్షణం. కళ్ళకేమీ తిన్నగా ఉన్నట్టు కనబడడం లేదు! చుట్టూ అన్నీ వంకర్లు టింకర్లుగా.. అర్ధం పర్ధం లేనట్టు తోస్తున్నాయి. 


లేచి చుట్టూ చూసాడు. పెద్దగా వెక్కిళ్లు మొదలయ్యాయి. చుట్టూ ఉన్న ఆకృతుల వంకర్లు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అతిప్రయత్నం మీద జారుకుంటూ తోసుకుంటూ  లిన్నా ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే లిన్నా తనవైపు పరుగులు పెడుతూ వస్తోంది. 


“ఏమయింది?” ఆందోళనగా అడిగింది సోహాన్నే పరీక్షగా చూస్తూ.. 

మళ్ళీ పెద్దగా వెక్కిళ్లు పెట్టాడు. ఆకాశంలో ఒకదాని వెంట ఒకటిగా వెళ్తున్న పక్షులు కలిసి గుండ్రంగా గిరికీలు కొట్టడం మొదలెట్టాయి దెబ్బకి. 


“నీకేదో అయింది!” భయంగా సోహాన్ని చూస్తోంది లిన్నా. 


“ఏం చేద్దామిప్పుడు? ఈ వంకర్లు చూసావా? ప్లనేరియా అంతా సాపు చేసుకోవాలి! చూడెలా వంకర్లు వంకర్లు పోయిందో.. బోలూని పిలిచి నా పల్స్ చూడమందామా?” వెక్కిళ్లు ఆపుకుంటూ ఏడుపుమొహం పెట్టాడు సోహం. 


“ఉహుఁ.. నువ్వు.. వెంటనే సాధుసాధు గారి దగ్గరికి వెళ్ళు!” 

“ఎవరది?”


“వైబ్ గార్డెన్ లో ఉంటారు. ప్లనేరియాలో ఎవరికైనా అంతుచిక్కని సమస్య వస్తే ఆయన దగ్గరకే వెళ్తారు.” త్వరపెట్టింది లిన్నా. 


***


సాధుసాధు అంచులు పాదరసంలా మిలమిలా మెరుస్తున్నాయి. రెండు కళ్లూ సగానికి మూసుకుని ఉన్నాయి. సోహం చెప్పేది శాంతంగా విన్నారాయన. 


“వెక్కిళ్లు రాగానే ఏమవుతుంది?”

“హిక్.. క్క్…” 


సాధుసాధు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వెలిగి విచ్చుకున్నాయి. ఆయన కూర్చున్న చదరం వంకర్లు టింకర్లుగా తయారయ్యింది. సోహానికి జరుగుతున్నదేమిటో ఆయనకి స్పష్టంగా అర్ధమయింది. 


“నువ్వు వేరే లోకం గురించి ఆలోచిస్తున్నావా?” సోహాన్ని సూటిగా ప్రశ్నించారు. 


అదేమిటన్నట్టు చూసాడు సోహం. మరోసారి వెక్కిళ్లు రాబోతూంటే బలవంతంగా ఆపుకున్నాడు. అసలే బ్లాబ్ లాంటి శరీరం విపరీతంగా కదిలిపోతోంది. లోపల్నుంచి నీలిరంగులు ఉండుండి విరజిమ్ముతున్నాయి. 


“నువ్వు వెక్కిళ్లు పెట్టినప్పుడల్లా.. ప్లనేరియా బయటికి నెట్టబడుతున్నావ్.”

“అక్కడెవరున్నారు? నేనెందుకెళ్తున్నాను?”


“అప్రస్తుతం. అలా దాటివెళ్లేందుకు నీకింకా సమయం రాలేదు, నీ శక్తి సరిపోదు.” చెప్పారు సాధుసాధు 


“ఇప్పుడు నేనేం చెయ్యాలి?” 


సోహం ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వజ్రంలా మెరుస్తున్న వస్తువొకటి అందించారు.


“ఇదేంటి?”

“దీన్ని కర్వ్ కీపర్ అంటారు. నీ దగ్గరే ఉంచుకో..” 


దాన్ని అందుకోగానే సోహం వెక్కిళ్లు తగ్గుముఖం పట్టాయి. కర్వ్ కీపర్ ని అటూ ఇటూ తిప్పి దగ్గరగా తెచ్చుకున్నాడు. చుట్టూ ఉన్న వంకర్లన్నీ నెమ్మదిగా యథాస్థితికి చేరుకుంటున్నాయి. 


“నాకిలా ఎందుకు జరుగుతోంది?” వదలకుండా సాధుసాధుని అడిగాడు సోహం.  

“ఆలోచనలే ప్లనేరియాలో మార్పులకి కారణం. నేనేమిటి? ఇక్కడెందుకున్నానని ప్రశ్నలు వేసుకుని ఉంటావ్..” 


“మామూలే కదా ఆ ప్రశ్నలు!” కాదా అన్నట్టు అనుమానంగా అడిగాడు సోహం.  


“ఆలోచించకూడదా అయితే?” మళ్ళీ తనే ప్రశ్నించాడు. 


“ఆలోచనల్ని ఎలా ఆపుతావు? వాటిని లోలోపలే సాపు చేసి ఒక దారికి తెచ్చుకోవాలి. నీకు చేతనైన పనే కదా?” నవ్వారు సాధుసాధు. 


“అదే ఎలా?” ఏడుపుమొహం పెట్టాడు సోహం 


కాసేపు మౌనంగా ఆలోచించి “నీ పేరేమిటి?” అనడిగారు సాధుసాధు


అదేం ప్రశ్నన్నట్టు చూసాడు సోహం.  


“నీ పేరు నువ్వే లోపల్లోపల తలుచుకుంటే నీ ప్రశ్నల వంకర్లు పోతాయి. ఎప్పుడైనా ఇంకా ఇబ్బంది కలిగితే కర్వ్ కీపర్ కాపాడుతుంది. అయితే గుర్తుంచుకో..  ఇది నిన్ను ఇక్కడ పట్టి ఉంచనూ గలదు, లేదా అమాంతం అటువైపు విసిరేయనూ గలదు. జాగ్రత్త!” మృదువుగా స్థిరంగా చెప్పారు సాధుసాధు. 


“ఒకటి అడగొచ్చా? అక్కడ.. ఏముంటుంది?” 

అర్ధమైందన్నట్టు నవ్వారు సాధుసాధు. నవ్వినప్పుడల్లా వృత్తాకారపు అంచులు మృదువుగా వెలుగుతున్నాయి. 


“పువ్వులు ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూసావా?” 

“బోలూ ఇంటి మీదున్నాయి. చూసాను.” 


“అడ్డుగానూ, నిలువుగానూ ఉండే రేకులు పై వైపుకి కూడా విచ్చుకుంటే ఎలా ఉంటుందో ఊహించగలవా?”

“విచ్చుకోడమంటే? పై వైపు? హహ్.. అదెలా సాధ్యం?” 


“కళ్ళు మూసుకుని ఊహించుకో.. వేరే లోకంలో పువ్వులు విచ్చుకుంటాయి. మూడో డైమన్షన్..”

“సమోసా కూడానా?” ప్రశ్న అడిగేసాక నవ్వొచ్చింది సోహానికి. 


“సమోసా మూడు పలకలుగా ఉంటుంది. దాన్ని తినచ్చు కూడా..” 

“అంటే?” ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోయాడు సోహం. 


“ఇప్పుడు సమోసానేం చేస్తున్నావు? నీ బొజ్జకి అణుచుకుంటున్నావు. అది నీలో కలిసిపోతోంది. అక్కడైతే నోట్లో పెట్టుకుని తినచ్చు. రుచి తెలుస్తుంది..” 


సాధుసాధు చెప్తున్న మాటల్ని వింటూ ఊహించుకుంటే గమ్మత్తుగా అనిపించింది సోహానికి. ‘ఇప్పుడు సమోసా బొజ్జలోకి వెళ్తే వెచ్చదనం, శక్తి రావడం తెలుస్తుంది. రుచి తెలుస్తుందా? అదెలా ఉంటుంది?’ 


“పువ్వులు పూస్తాయి.. సమోసా తినచ్చు.. ఇంకా?”

“ఇప్పటికిది చాలు..”


“నాకు.. భయమేస్తోంది.” కొంచెం బెదురుగా అన్నాడు సోహం. 

“భయమేమీ అక్కర్లేదు. జాగ్రత్తగా ఇంటికెళ్ళు.” 


***


“వేరే లోకమా!” అరిచినంత పని చేసింది లిన్నా. 

“హుష్షు.. అరవకు..” దాచుకున్న వజ్రం తీసి లిన్నాకి చూపించాడు. 


“ఇదేంటి? ఏముంటాయట అక్కడ? ఎందుకిలా జరిగింది?” ఆసక్తిగా అడిగింది సోహంని.. 

“నువ్వు బోలూ గాడికి చెప్పనని మాటిస్తేనే చెప్తాను.” 

చెప్పనన్నట్టు కదిలి ఒట్టు పెట్టింది లిన్నా. 


“సమోసా మూడు కోణాలతో ఉంటుందట.” 

“నాలాగ?” 

“ఉహు.. ఉబ్బుగానట.. దాన్ని అక్కడివాళ్లు తింటారట.” 

“ఎలా? ఎందుకూ?”

“అదేం ప్రశ్న? రుచిగా ఉంటుందట.” 

“రుచా? అదేంటి?” అయోమయంగా అడిగింది లిన్నా 


“రుచంటే రుచే.. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పటిది చాలు.” 

“ఇంతకీ ఇదెందుకు జరిగిందో కనుక్కున్నావా? ఇలా గీతలన్నీ వంకర పోయీ పోయీ విరిగిపోతే నేను బాగుచేసుకోలేక చావాలి!” భయంగా ఆందోళనగా చెప్పింది లిన్నా.. 


“ఆఁ.. ఆలోచనల వలన అని చెప్పారు.”

“నాకుండవా ఏంటి ఆలోచనలు?”

ఏమోలే అన్నట్టు దొర్లి ఊరుకున్నాడు సోహం. 


ఇద్దరూ ఇంటిదారి పట్టారు. ఆరోజు కేఫ్ దగ్గర కూడా ఆగలేదు. 


***


“ఒకవేళ.. మూడో డైమెన్షన్ కే వెళ్ళామనుకో.. నువ్వేం చూడాలనుకుంటున్నావ్?” లిన్నాని అడిగాడు సోహం.  

“పక్షులు.. నిలువుగా, గుండ్రంగా ఎగరడం కాకుండా అవి ఎగిరి ఎక్కడికైనా పారిపోతే ఎలా ఉంటుందో చూడాలి.”


ఈ ఆలోచనల ధాటికి ఏ క్షణం ఏమవుతుందో అన్నట్టు లిన్నా చెప్పేది వింటూ వజ్రాన్ని గట్టిగా అదుముకున్నాడు. 


“ఇంకా.. గుచ్చుకునే చెట్లు చూడాలి.”

“గుచ్చుకునేవా? ఎలా?” ఆశ్చర్యపోయాడు. 


“ఏమో.. అనిపించిందంతే.. ఒక గదిలో ఇంకో గది ఉంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకీ అక్కడుండేవాళ్ళకి మనమెవరో తెలుస్తుందా?”

“వాళ్ళు ఆలోచిస్తే తెలుస్తుందేమో! నాకు తలనొప్పొస్తోంది. చాలింక..” అన్నాడు సోహం. 


***


“లైటాపేస్తున్నాను.. బయటికెళ్ళొచ్చాక బొమ్మలేసుకోవచ్చు పద టింకూ..” 


“ఉహు.. యూ గో..” నేల మీదకి వాలి కాగితాల మీద శ్రద్ధగా గీస్తున్నాడు.  


“నిన్ను వదిలేసెక్కడికి? డిన్నర్ బయట చేద్దాం పద. సమోసా తిందామా? అక్కడికి రష్మి, వాళ్ళ అమ్మా నాన్నా వస్తున్నారు..”


“నిజంగా?” తలెత్తి చూసాడు తల్లివైపు.


వాడిని త్వరపెట్టి కార్ పార్కింగ్ దగ్గరకి లాక్కెళ్ళింది. టింకూ కాగితాలు ఒక చేత్తో, డ్రాయింగ్ పేపర్ల పుస్తకం మరో చేత్తో పట్టుకుని బయల్దేరాడు. 


“వచ్చాక గీసుకోవచ్చంటే!” కార్లో కూర్చోబెడుతూ ముద్దుగా విసుక్కుంది అమ్మ 

“ఏం గీస్తున్నావ్ టింకులూ..” వాళ్ళు కూర్చున్నాక కార్ రివర్స్ చేస్తూ అడిగాడు నాన్న 


“లిన్నా ఇంటికి వెళ్తోంది.. పక్షులు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాయి..” వెనక నున్న బూస్టర్ సీట్ లోంచి ముద్దుగా సీరియస్ గా చెప్పాడు టింకూ.. 


“లిన్నా నీ ఫ్రెండా?”

“కాదు..  సోహం కి ఫ్రెండ్..”

“ఎక్కడికెళ్తోంది ఇంతకీ.. “ 

“లిన్నా ఇల్లు షైనీ మింట్ టవర్. అక్కడికి..” 


“నీకేమైనా అర్ధమయిందా?” అమ్మని అడిగాడు నాన్న నవ్వుతూ.. 

“ఏదో కార్టూన్ లో చూసుంటాడు. బొమ్మలే బొమ్మలు! పోన్లే.. గోడల జోలికి రాకుండా కాగితాల మీద గీసుకుంటే చాలు.”


***

కార్ లోంచి దిగుతూనే పుస్తకంలోంచి చిన్న చిన్న కాగితం ముక్కలు నేల మీద పడిపోయాయి. ఏడుపు లంకించుకున్నాడు టింకూ.. 


వాడిని ఊరుకోబెట్టి అవన్నీ ఏరి ఇచ్చాడు నాన్న. అక్కడే నేల మీద కూర్చుని ఆ కాస్త వెలుగులోనే అన్నీ సర్దుకున్నాడు టింకూ. ఇంతలోనే కాగితాలన్నీ సరిచూసుకుని అరిచాడు.. 


“డైమండ్ కర్వ్ కీపర్ ఏదీ!! నో…” 


***

Sunday, April 24, 2016

నువ్వు = నేను?

నీ ఒక్కో ప్రశ్నా వేల డాలర్ల విలువైనది. దోచిపోసినా తీరని ప్రశ్నలు కాదో!

గతవారం 'రాముడూద్భవించినాడూ రఘుకులమ్మునా..' అన్నానో లేదో, 'రాముడ్లాంటి వాడు కావాలీ, అక్కర్లేదూ కూడా.. కదా?' అని ఓ ములుకు వేసిపారేశావ్. 

కావాలా, అక్కర్లేదా? 'సీతా అండ్ హర్ షివల్రీ' అని ఉపన్యసిస్తే ముక్కున వేలేసుకుంటారో, ముక్కుకోసేస్తారో కానీ నువ్వన్నది మాత్రం నిజం. కన్న కొడుకుగానో, విల్లువిరిచే శౌర్యంగానో రాముడు కావాలిగానీ మరోలా అక్కర్లేదు మా ఆడవాళ్ళకి. భరించలేం. 

'త్రిభిః వ్యాప్తః రాఘవః' - కావాలి మాకు. 'త్రిభిః వ్యాప్నోతి' రాఘవుడున్నాడు చూడూ.. ఈ కాలంలో అసంభవం. దొరికితే మహద్భాగ్యం అనుకో! అది వేరే సంగతి. 

అలా చూడకు. టీకా చెప్తున్నా చెప్తున్నా. తేజస్సూ, యశస్సూ, కాంతి.. ఈ మూడిటిచే వ్యాపించేవాడు రాఘవుడట. అలాగే ధర్మార్ధకామాలను వరుసగా ముప్పూటలా ఆచరించేవాడట. ఈ టెంపరేచర్ కీ, టెన్షన్ లకీ, అన్నిటా దిక్కుమాలిన పీర్ ప్రెషర్ కీ.. మూడోది సరే, మొదటి రెండూ అయినా సాధ్యమా చెప్పు! 

సిలికాన్ వాలీలో ఆడ పనివాళ్ళకోసమని ఎగ్ షురెన్స్ వచ్చి మూడేళ్లవుతోందా.. వెన్నెల రాత్రులనీ, వెచ్చని కౌగిళ్ళనీ ఎవడబ్బ ఇన్ షూర్ చెయ్యగలడోయ్ బంగారూ?

పిల్లాడు రైన్ కోట్ పోగొట్టుకున్నాడని తిట్టిపోసాను. వాడిలోకంలో వాడున్నాడని 'ఆర్ యూ లిజనింగ్ టు మీ ?' అని బలవంతాన పీక్కొచ్చిమరీ తిట్టాను. వాణ్ణటు స్కూల్లో దింపేసి చూద్దునా అలమరలో మూలన పచ్చ రైన్ కోట్! చటుక్కున తలదించేసుకునే ఉంటాను. 'వింటున్నాడు కదా అని తిట్టాను. పాపం..' అని నీకు చెప్పుకుంటే వెటకారంగా నవ్వుతావా! స్కాఫ్!! ఓ పంటిగాటు తప్పించుకుంది నీ భుజం, ఆఫీస్ లో ఉండబట్టి. 

'నువ్వో అద్భుతమైన తల్లివేకానీ, చదువబ్బే సమయాల్లో పిలకాయల్ని బయటకి లాక్కురావడం కుదర్దు పో.. బడివిడిచేవేళకి రా. అప్పుడు చెప్పుకో నీ క్షమాపణలు.' అందా సిండీ మహాతల్లి.

'అలా పిల్లల్ని తిట్టామని స్కూల్లో చెప్పకండెప్పుడూ! రేప్పొద్దున్న లేనిపోనివన్నీ. అమెరికాలో పిల్లల్ని పెంచుతున్నామని మర్చిపోతున్నారు మీరు. అయినా పిల్లలు మనలా మనసులో పెట్టుకోరేమీ. ఇంతకీ వాడికి సారీ చెప్పారా?' అంది సుచిత్ర. సలహా చెప్పేవాడికి సమస్య చెప్పుకున్నవాడు లోకువ. 

ఎక్కడున్నాం మనం? ఎందుకొచ్చాం? పవర్ కట్ కీ, పొల్యూషన్ కీ పారిపోయొచ్చామా? వద్దొద్దు.. చిక్కుముళ్ళు వేసుకున్నది మనమేనని తెలిసీ ప్రశ్నించడానికి నేను వెర్రిదాన్నేం కాదు. లెట్స్ నాట్ గో దేర్. 

'పర్లేదమ్మా.. నీ క్షమాపణలు నేను ఆమోదించాను.' అని ఇంగ్లీష్ లో క్షమించాడు కొడుకు.

వస్తువు పారేస్తే అసహనం. లంచ్ బాక్స్ వెనక్కొస్తే కోపం. 
కూచుని మొహంలోకి చూస్తూ మాట్లాడలేని హడావిడి. 
'అన్నీ ఉన్నా అంచుకు తొగరే తక్కువ మీ పిల్లాడికి..' అంటున్న రిపోర్ట్ కార్డ్ చూస్తే బాధ. 
తాపీగా పిల్లల పెంపకాన్ని బోధించే సాటితల్లుల గొంతులు.. దూరదర్శన్ లో వ్యవసాయదారుల కార్యక్రమంలో... అర్ధమైంది కదా? ఆ టోన్ లో వినిపిస్తూంటే ఛిరాఖు.

తీరాచేసి వాడికి నేనేం చెయ్యగలుగుతున్నానని ఆలోచన రాగానే,  సేవింగ్స్ అకౌంట్ గుర్తొచ్చి నామీద నాకే అసహ్యమేసింది. బాల్యానికి ఖరీదు కట్టినందుకు. 

అప్పట్నుంచీ.. మనసు దొలిచేస్తోంది. ఉహూ.. వాడిగురించి కాదు. నేను దిద్దుకునే అవకాశముందింకా అక్కడ.

మనగురించి ఆలోచిస్తున్నాను. 

నీ స్పర్శకి పులకలుతేలే రోజులు పోయాయని, నిరుటి హిమసమూహాలని గుర్తుచేసుకుని ఏడుస్తూంటాను కదూ! 
మెకానికల్ గా తేనె మోసుకొచ్చే తేనెటీగలే ఆఫీసుల్నిండా! తల్చుకుంటే భయమేస్తోంది. ఎక్కడికి ఎవాల్వ్ అవుతున్నాం?

ఆర్గానిక్ కూరల్లా, ఆర్గానిక్ రోజులు ఎక్కడైనా అమ్మితే కొనుక్కొచ్చేసుకుందాం. 
డెడ్ లైన్లు, అప్రైజల్ లూ లేని పని. 
సాహిత్యసమావేశాలక్కర్లేని వాలుకుర్చీ, పుస్తకాల బీరువా రోజులు. 
సున్నిపిండితో చర్మం మెరిసే ఆరోగ్యాలు.

సర్లే.. కారణాలు వెతుక్కుని జీవితాన్ని తిట్టుకోడమెందుకుకానీ, అసలు నిజం చెప్పేస్తున్నా. 

వీటన్నిటికంటే ముఖ్యంగా.. మనం నడిచొచ్చిన దారిలో అప్పటి నేనెక్కడో జారిపోయానేమోనని చిన్న అనుమానం. 
గట్టిగా అంటే, ఔననేస్తావేమోనని చెప్పలేదిన్నాళ్ళూ.

నువ్వు ప్రేమించాలి.. నేను నీ ప్రేమను ఆస్వాదించాలి.
నేను ప్రేమిస్తే నువ్వు కిక్కురుమనకుండా ప్రేమించబడాలి. 

ఇరవై పౌండ్ల బియ్యంబస్తా నువ్వు మోసుకొస్తూంటే, కూరలసంచీ నేను తీసుకొచ్చినప్పుడు సమానత్వాన్ని నిస్సిగ్గుగా విడిచిపెట్టేశాను నేను. 
నా పీఎమ్మెస్ భరించినవాడికి కూడా హార్మోన్లుంటాయనీ, చిరాకులుంటాయనీ కన్వీనియెంట్ గా మర్చిపోయాను.

బుజ్జి డయల్ ఉన్న నాజూకైన వాచ్ నాది.. నీ సమయమంతా నాదే కావాలని పేచీ చాలా సార్లే.
'ఆడపిల్ల' అనే టైటిల్ ని గర్వంగా ధరిస్తూ, నీ భుజాలమీద నా బరువు చాలాసార్లే మోపాను.

అయినా సరే ఇదంతా నీకు తెలియడానికి వీల్లేదు. టీ కప్పుతో పకోడీల ప్లేట్ జోడిస్తే నీకర్ధమవ్వాలంతే. 

ఇంతకీ.. పసుపు రైన్ కోట్ లాగా, నీ మనసు కూడా అలమరలోనే ఉంది కదూ? 

Saturday, July 5, 2014

నేను

సమస్య.. తాళం వేసానా? కుడా ఎడమా.. ఎటు తిప్పాను?

ఉహూ.. ఎప్పుడూ నాలుగడుగులు వేసాక ఇదే అనుమానం.. ఎప్పుడూ ఉండేదే. ముందుకే పోదాం. పదండి ముందుకు పదండి తోసుకు.. ఎవర్ని తోసుకునీ..

'రా రా చిన్ననా.. రారోరి చిన్నవాడ..' ఎమ్మెస్. 'రా రా ముద్దులాడ.. రారోరి..'

నెహ్రూ తలవంచి 'హూ యామై? నీ ముందు నేను మియర్ ప్రైమ్మినిస్టర్నన్న..' ఎమ్మెస్. అనడూ మరి! ఎమ్మెస్.. బంగారానికి తావి? 

వీధి చివర చెత్త. ఉదయం తీసేస్తారు. శుభ్రంగా... అందంగా వీధి. అలంకరించుకుని.. దేనికి? మళ్ళీ చెత్త పోయించుకోడానికి.

"వొంకాయలున్నాయమ్మా.. లేటైపోనారియ్యాల.." 

నిన్నా వంకాయ కూరే. ఇవాళ పులుసు? అయినా ఇలాంటి వంకాయలు పులుసేంటీ! నవనవలాడుతున్న బీరకాయలూ, వంకాయలూ, ఆనపకాయలూ జువనైల్ గా పులుసులు వండకూడదని రూల్ పాస్.. ఎవరు చేస్తారు? నెహ్రూ? చక్కగా పోపులో వేసుకోవాలి.. కావాలంటే అల్లం పచ్చిమిర్చి.. కొత్తిమీర.. కరివేపాకు.. స్.. ఆవాలు, ఉప్పు నిండుకున్నాయ్. ఇంక కొనుక్కోడమెందుకు. నిండి పొర్లిపోతున్నప్పుడు. 

"తోటకూర అడుగైపోనాదమ్మా.. బెండకాయిలేసుకోండి. కేజీ పాతికి."

అప్పట్లో మా ఊళ్ళో దొండకాయలు వందల్లెక్కన అమ్మేవారంటే అతగాడికి వింత! 'నిజమా!' అని ఆల్చిప్పల్లాంటి కళ్ళు అపనమ్మకంగా.. పొగరేం ఆల్చిప్పలున్నాయని! 

మల్లాది హీరోయిన్లా వీధి మలుపులో లెండింగ్ లైబ్రరీకి వెళ్ళి మేగజైన్ తెచ్చుకుని.. ఎవరైనా నన్ను రోజూ చూస్తున్నారా? 

సడన్ గా ఓనాడెప్పుడో దారి కాసి "మీరు చదువుతారాండీ! ఐ లవ్ రీడర్స్.. బుక్ వర్మ్స్.."
ఛీ పురుగా.. చెయ్ తీయ్.. మా ఆయనకి చెప్పానంటే.. 

షట్.. షట్.. వంట చెయ్యాలి. పక్కింట్లోంచి లాక్కొచ్చి చిన్నాకి స్నానం. ఎప్పుడు నేర్చుకుంటాడు! షాపుకెళ్ళి ఆవాల్స్ కొనుక్కుని, ఇంటికెళ్ళి వంట చెయ్యాలి.

***

"మీ టీచరే చీర ఇస్తారని చెప్పావ్! పంచెలూ అవీ పట్టుకుపోయి తగలెట్టెస్తే.." అమ్మ విసుగు..

"మొన్న చీర కట్టుకున్నావేమో కదే. స్కూళ్ళోనూ.. ఇప్పుడు పంచె దేనికీ? ఆ నాటకం కాదా?" పోకచెక్క దంచుతున్న వాసన.. అమాన్ దస్తాలో..  ముసిలీ నువ్వు నోరు ముయ్యవే.. 

అప్పుడు స్కూల్లో.. కానీ ఇప్పుడు కలక్టరేట్ లో. అంతా.. అంతా మారిపోయింది! నాటకంలో నేను సరస్వతిని కాను.. హ్.. 

తెల్లచీర.. టీచర్ గారిది. మెత్తగా జారిపోతూ.. మంచి వాసనొస్తూంది. అది కట్టుకుని, తెల్లటి పేపర్ కలవపువ్వు. పట్టుకుని, కూర్చుంటే స్టేజ్ మధ్యలో.. 

"కలక్టరేట్ లో నాటకానికి నువ్వు రామలింగడి వేషం వెయ్యాలి. ఆ డైలాగులు కూడా వచ్చు కదా! నీకు ఈజీనే. లత సరస్వతి వేషం వేస్తుంది. ఏం?" 

ఆవిడ మొహంలోకి చూస్తే ఏడుపొచ్చేస్తుంది. 

లత.. తెల్లగా.. కొత్తగా వచ్చిన లత.. సరస్వతి. ఏం.. ఆ చీర నేను కట్టుకోకూడదా! నల్ల సరస్వతి.. మొద్దు సరస్వతి.. కలక్టరేట్ లో బాగోదు. 

వెక్కిళ్ళు.. వెక్కిళ్ళు.. క్.. రామలింగడు ఎలాగైనా ఉండొచ్చు.

***

"సరిత కజిన్ ని రిసీవ్ చేసుకోడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. షీ ఈజ్ ప్రెట్టీ. ఎంత పెద్ద జడో తెలుసా! వాళ్ళింట్లో దింపాను. నిన్న డిన్నర్ కి వెళ్ళాం అందరం. షీ లుక్స్ బ్యూటిఫుల్. నీకు చూపిస్తాను. మేన్.. అయామిన్ లవ్.." 

పవన్ మొహం.. వెలిగిపోతోంది. హేపీ ఫర్ హిమ్. రియల్లీ? ఛా..!

రేపెప్పుడో తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. ముందు ముందు వాళ్ళిద్దరి ప్రేమా.. ఘాటూ.. ఘాటు ప్రేమా.. చూడాలి. జడ పెద్దది ఉంది కనుకా.. ప్రెట్టీ కనుకా ప్రేమించేసాడా! ప్రేమకి జడ, అందం.. కేటలిస్టులా? కారణాలా? పాపం ఆ అమ్మాయ్ అందంగా ఉన్నంత మాత్రాన మంచిది కాకూడదనేముందిలే!! ఛీ.. తప్పు. 

"వీణ వచ్చట.." 

నాకు రాదుగా! మండుతోందెందుకు!! మ్... వీడు నన్ను ప్రేమించాలా? వీడికి వండి పెడుతూ, బట్టల్లేకుండా వీడు.. స్టాప్

*** 

'రంగులే రంగులు..అంబరానంతట..
స్వరం నిజం సగం వరము అమరం..
వరం వరం వరం చెలియ ప్రణయం..'

ఓహ్.. లవ్..లీ!! 'భానోదయం' కాదని చెప్పాలా పాట అయ్యాక? గుణసంధా, సవర్ణ దీర్ఘమా? సుమం.. ప్రతి సుమం సుమం.. 

నవ్వకపోతే బావుండు. నవ్వితే మరీ బావున్నాడు. 

"బాగా ఆర్గనైజ్ చేసారండీ. అంతా మీరే చూసుకున్నారని మీ కజిన్ చెప్పింది." 
చెయ్యి మెత్తగా లేదు. వెచ్చగా.. షేక్ షేక్ షేక్ హేండ్.. 

"రీయూనియన్ ప్లాన్ చేసుకుందామని నాలుగేళ్ళ నుంచీ అనుకుంటున్నా ఇప్పటికి అయింది. మీ హెల్ప్ తో.. మంచి మెనూ.. అరేంజ్మెంట్స్.." 
 నవ్వకూ.. కింది పళ్ళు గొగ్గుపళ్ళు..!!  అక్క క్లాస్ మేటంటే నాకంటే ఎన్నేళ్ళు... 

"సరేనండీ.. నైస్ మీటింగ్ యూ! థాంక్యూ!" 

ఇంకో పాట పాడరూ.. అని చెయ్యి పట్టుకుంటే! యే పాట? నచ్చింది గాళ్ ఫ్రెండూ.. నవ్వింది మల్లె చెండూ.. మల్లెచెండులా ఎవరున్నారిక్కడ? ట్రాష్..

***

"ఐ కెన్ బీ మై సెల్ఫ్ అరౌండ్ యూ..  చాలా సుఖంగా, కంఫర్టబుల్ గా గడిచిపోతుంది నీతో.." 

రింగ్ మెరుస్తోంది.. ఆవిరి. దాహం.. నోరు ఆర్చుకుపోతోంది.
ఒకటీ రెండూ... ఏడు రాళ్ళు మెరుస్తూ.. ఏడు జన్మలా!
భుజం చుట్టూ చెయ్యి.. బావుంది.
దాహం.. బాటిల్ లో నీళ్ళు గొంతు దిగుతూంటే.. 

వేణువా వీణియా.. ఏవిటీ రాగమూ.. 

బుగ్గమీద.. వెచ్చగా మీసం గుచ్చుకు.. క్లిప్ లో చిక్కుకున్నట్టు.. కింది పెదవి.. క్లిప్ క్లిప్..

***

చల్లగా ఏమైనా తినగానే కదులుతుంది. తాడు..? ఏమో. అదో వాడో.. చల్లగా నీళ్ళు.. చల్లగా ఐస్క్రీమ్.. చల్ల చల్లగా..

"కోడలు వడిలిపోయింది. ఆడపిల్లేనేమో! మగపిల్లాడైతే రంగుతేలుతారంటారు." 

రంగూ.. రూపం.. చిక్కదనం అంటే లావా!! వికారంగా.. మరీ వికారంగా.. ఉబ్బిపోతూ.. పిగిలిపోతూ.. ఫట్ అని పగిలి..

"నొప్పిగా ఉందా? సెవెన్ డైలేట్ అయిపోయిందట.. మరో రెండు చాలు."  ఆల్చిప్పల్లో ఆందోళన

దేనికి? నా కోసమా? దాని కోసమా? మగపిల్లాడైతే బాగుండు. ఎలా ఉన్నా పర్లేదనా? నిజం చెప్పు.. ఆడపిల్లైతే.. ఆ కళ్ళొస్తే.. ఇలా నాజూగ్గా ఉంటే.. మండుతుందా? నా కూతురే కదా! నా.. 

మ్.... నే..ను చచ్చిపోతే! వాళ్ళమ్మ పోలిక రాలేదంటారు. మరో ఆడది నా చీరలు, గ్రీటింగ్ కార్డ్ లూ, ఉత్తరాలు.. లోపల్లంగాలూ.. ఛ.. బాత్రూమ్ లో బట్టలు తడిపి వదిలేసాను. వాసన.. 

చేతివేళ్ళని బిగించి పట్టుకుని.. ఓదార్పు.  మంట.. పెదాలు పొరలొచ్చేస్తున్నాయ్.. కొరికి కొరి..కి..

***

"తోటకూర అడుగైపోనాదమ్మా.. బెండకాయలేసుకోండి. కేజీ పాతికి"

చివర్లు గిల్లేసిన బెండకాయలు తోసేసి... లేతవి, సన్నవి, పొడవుగా ఉన్నవి ఏరి, మళ్ళీ గిల్లి..  ఏరకుండా కొనేవాళ్ళకి కూరగాయలు ఋణపడిపోతాయేమో! థాంక్యూ అని పులుసులో ముక్కలు.. 

"జిబ్బి ఇంగోమ్మా.. బేక్కానీండి." 

తొందర తొందర.. సొట్టగా ఎదిగిన బెండకాయొకటి.. నన్నే చూస్తోంది. నేనొక బెండ మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి..
***

'వాగీశ గౌరీశ వాసవాద్యమర పరివారాభివందిత పదం.. పద్మనాభం..
భోగీంద్రశాయినం..'

'శా..' అని ఎంత సొగసుగా పలుకుతాడో!! కుళ్ళొచ్చేస్తుంది..

కంఫర్ట్ మాత్రమేనా!

"ప్చ్.. నీకు అర్ధం కాదు. నీకెలా చెప్పాలో నాకర్ధం కాదు." 

మంచివే ఎంచుకుంటాం. మంచంటే అందమేనా? అందంగా లేకపో..

"ష్.. విను.."

లొంగదీసేసుకుంటాడు.. మత్తు.. వీడు మత్తు.. చీకటంటే బావుంటుందందుకే. నేను నాకు కనిపించను. వీడు మాత్రం మెరుస్తూనే ఉంటాడు. అణువణువునా మెరుస్తాడు.. 

వీణ మీటుతున్నట్టు.. మెట్లు మెట్లుగా శరీరం.. భోగీంద్ర శాయినం.. పురుకుశల దాయినం.. దేవుణ్ణి తల్చుకోకూడదేమో.. తప్పు. మ్.. మొగలి పరిమళం..

"వింటున్నావా.." 

చెవులు మూసుకుంటే.. నేను మాత్రమే ఉండి.. ఆ గాడ్రేజ్ బీర్వా, వీడూ, సైడ్ టేబుల్ మీద క్లాక్, ఫోనూ.. అన్నీ మాయమైపో... ష్...

"ఐ.. లవ్.. యూ..." 

చెవి తమ్మె మీద వేడి ఊపిరి. అంతే. ఎప్పుడూ ఇంతే.. నేనుండను. నేను మిగలను. 

"నాకు.. నువ్వు పర్ఫెక్ట్.. ఇలా.." 

ఆ వేళ్ళ మధ్యలో నా వేళ్ళు చిక్కుకుని.. క్రుకెడ్ పజిల్ ముక్కల్లా.. కలిస్తే పూర్తై.. నేనింతే..

Saturday, December 7, 2013

ఐ... మీ... అహం బ్రహ్మాస్మి



"సాన్ జే..?" షీట్ ప్రొటెక్టర్ లోంచి కనిపిస్తున్న కాగితం దగ్గరకి తీసుకు చూసి పిలిచింది డవానా.

గట్టున బిక్కుబిక్కుమంటూ నిలబడ్డ నావైపు చూసి '.. నువ్వా..!' అన్నట్టు తలూపింది.   కిందటివారం నేను చేసిన భీభత్సం స్విమింగ్ స్కూల్ చరిత్రలో మరో దశాబ్దకాలం నిలిచిపోతుంది మరిపూల్లో విహరిస్తున్న నల్లకలువలా నవ్వి రమ్మని సైగచేసింది. మేకపోతు గాంభీర్యం పులుముకుని నీళ్ళలోకి దిగిపోయాను. మేకలకి ఈతొచ్చా?

                                                                        ***
పెళ్ళి చూపుల్లో శశిని చూడగానే అనిపించింది.. ఇంతందగాణ్ణైన నా పక్కన నిలబడడానికి కాటుక కళ్ళమ్మాయ్ చాలని. మరీ మింగేసేంత బ్యూటీ ఎవడిక్కావాలి?
పిక్చర్ పీపుల్ వాడి క్యూపన్ చూడగానే విజిలేసి చెప్పాను శశికి.. వీకెండ్ పోట్రైట్ తీయించుకుందామని. "పోట్రైటా?!" తెల్లమొహమేసింది. వారం రోజులై శశికి నేర్పుతున్న 'అమెరికా జీవనవిధానం' అనే సబ్జెక్ట్ లో ఎన్నెన్ని టాపిక్కులో! శుక్రవారం సాయంత్రం ఆకుపచ్చ చుడీదార్ లో సిధ్ధమై, కారెక్కుతున్న తనని చూస్తే సరిగ్గానే ఎంచుకున్నానని మరోసారి అనిపించింది. పరవాలేదు. బానే ఉంటుంది.
"నాకంటే నువ్వే బావున్నావ్.." బుంగమూతి పెట్టింది ఫ్రేమ్ గోడకి తగిలించగానే.
"అఫ్కోర్స్.." ఒప్పేసుకున్నాను.
"నేను యెలో చుడీదార్ వేసుకోవలసిందేం.." ఫొటోలో నేను వేసుకున్న యెలో స్ట్రైప్డ్ నల్ల టీ షర్ట్ వైపు చూస్తూ అంది.
"ఉహూ.. నీకు యెలో బాగోదు శశీ."
"..."
"ఇంకా డార్క్ గా కనిపిస్తావ్."
"ఎంత బావున్నావో సంజూ.." ఫోటోని కళ్ళార్పకుండా చూస్తూ చెప్పింది.
నవ్వాను తెలుసన్నట్టూ..
"నేను మేకప్ వేసుకోవలసిందేం.."
"నిజమే.. కనీసం లిప్ స్టిక్.." నిజాయితీగా చెప్పాను.


                                                                         ***
మాగన్నుగా నిద్రపడుతోంది. అప్పటిదాకా ఒంటికి తగులుతున్న మెత్తదనం నెమ్మదిగా దూరం జరిగి జరిగి... మిస్సింగ్. మొరాయిస్తున్న కళ్ళని బలవంతంగా తెరిచాను. బాత్రూమ్ తలుపు ఓరగా తీసి ఉంది. లైట్ వెలుగులో అద్దంలో చూసుకుంటూ పెదాలకి ఏదో పూసుకుంటోంది. టైం చూస్తే పన్నెండున్నర! మరో నిమిషంలో లైట్ ఆరిపోయింది.
"లిప్ స్టిక్కా? చీకట్లో దేనికీ?" దగ్గరకి లాక్కున్నాను.
"ఉహూ.. గుడ్నైట్"

                                                                          ***
"అమెరికాలో కాళ్ళులేకపోయినా బతికేయొచ్చు కానీ కార్ లేకపోతే బతకలేం." గంభీరంగా చెప్పాను.
"మనకుందిగా?"
"అదే డ్రైవింగ్ రాకపోతే... " సర్దిచెప్పాల్సి వచ్చింది.
"నిజమే సంజూ.. నిన్ను ప్రతీచిన్న పనికీ ఇబ్బంది పెట్టక్కర్లేదు కదా.."
మూడురోజుల్లో పూనమ్ తో కలిసి వెళ్ళి లెర్నర్స్ పర్మిట్ తెచ్చేసుకుంది. "పోన్లే.. వీకెండ్ నేర్పుతాన"ని అభయమిచ్చాను.
"కుడి వైపు ఉన్న పెడల్ ని 'Gas' అంటారు.. దాని పక్కనే.. "
"స్కూల్ గ్రౌండ్ వైపు వెళ్దామా?" రివర్స్ చేస్తూ అడిగింది.
"ఓయ్.. ఓయ్..."
"పూనమ్ నేర్పుతోంది సంజూ. తనది పాతకారే కదా అనీ. పేరలల్ పార్కింగ్ చేతకావట్లేదింకా.. " స్టాప్ సైన్ దగ్గర నా చేతిలో కాఫీ తొణకలేదు.

***
"దిక్కుమాలిన అమెరికాలో గాలి పీల్చినా ఊరిపోతాం బాబూ...!" వేలాదిమంది ఎన్నారై మహిళల ఆక్రోశానికి శశి గొంతు కలిపింది.
"Jog baby.. Jog.."
"ఉహూ.. లాభం లేదు. కాళ్ళరిగిపోతున్నాయ్ కానీ, అరపౌండ్ కూడా తగ్గట్లేదు." పిటపిట్లాడుతున్న జీన్స్ ని కుర్తీతో కవర్ చేసి బయలుదేరింది.
"ఇదిగో.. red velvet cake flavored కొవ్వు ఒంట్లో పేరుకుపోతోంది ఎక్కడికక్కడా.." frozen yogurt కప్పులో రెండు స్పూన్స్ వేసి తెస్తూ చెప్పింది.
"కొన్ని శరీరతత్వాలంతే." నా tight abs గర్వంగా ఇంకాస్త లోపలికెళ్ళాయ్.

                                                                         ***
"స్విమింగా? నాకు సైనస్ ఉంది." నిర్దయగా రానన్నాను.
"హ్హుహ్హుహూ... సంజూ..."
"నా కార్డియో నాకు చాలు."
"నాకోసం రావొచ్చుగా.."

                                                                        ***
"పూల్ కెళ్దాం వస్తావా?" రోబ్ చుట్టబెట్టుకుంటూ హాల్లోకి వచ్చింది.
"మన పూల్లో లైఫ్ గార్డ్ ఉండడు." ఆదివారం ఉదయం సోఫాలోంచి కదలమనడమంత క్రైమ్ మరోటి ఉండదు.
"అక్కడే పడుకుందువులే. పూనమ్ వాళ్ళూ యెలో స్టోన్ పార్క్ కి వెళ్ళారు.. లేకపోతే ప్రతివారం నిన్ను రమ్మంటున్నానా?"
"నీకు సాయం పూల్ లో దిగాలా? నో వే!!"
"అక్కర్లేదు. లేమ్మా సంజూ.. ప్లీజ్." భుజాలు నొక్కుతూ వెనక నిలబడింది. ట్రిక్స్ తెలిసిపోయాయ్ అమ్మడికి. ఇంకాసేపా సుఖాన్ని అనుభవించి ఐపాడ్ పట్టుకు లేచాను.

                                                                        ***
రోబ్ విడిచి పూల్లోకి దిగుతోంది శశి.
దీన్సిగతరగా... అమెరికా స్విమ్ సూట్లు బావుంటాయేం! సీగ్రీన్ ఏమైనా మంచి కలర్.
పూల్ నాలుగడుగులేం కాదూ... ఇటు నాలుగూ.. అటు ఆరు? ఆరేనా..?
'సారొస్తారొస్తారూ...' ఓయబ్బో... ఈదేస్తోందీ!!
అరగంట సేపు ఇలా కూర్చోవడం కష్టమే కానీ... ఈదడం సులువే అయుండచ్చులే. నాకు విసుగొచ్చేదాకా ఈదింది.

పూల్లోంచి వస్తూ.. "షవర్ చేసొస్తా.. " అంటోంది.  'నే సందెవేళ జాబిలీ...' ఛా..  లంచ్ టైం అవుతోంది సందెవేళేంటీ... ఆకలి దంచేస్తోంది.

                                                                     ***
"Weekly twice?" దోసకాయ పప్పు కలుపుతూ అడిగాను.
ప్రశ్నార్ధకంగా చూసింది.
"స్విమింగ్ క్లాసులు"
"మొదటి సీజన్ రెండు క్లాసులు తీసుకున్నాను కదా సంజూ. చెప్పానేమో. ఇప్పుడు ఫ్రీస్టైల్ వచ్చేసింది కనుక ఒకటే తీసుకుంటున్నాను."
"ఓహో.. సో.. ఆదివారం మన అపార్ట్మెంట్ పూల్ లోనా?"
" .. సమ్మర్ వచ్చిన దగ్గర్నుంచీ పూనమ్, నేనూ మన పూల్ ని వాడేసుకుంటున్నాం. apartment amenities ఉన్నదెందుకూ..? నైన్ పౌండ్స్ తగ్గాను తెలుసా సంజూ.. మొత్తం! బెండకాయ... వేసుకో కొంచెం."

                                                                     ***

"Hey San.. jay..! I'm Joey. Is this your first class?" సూపర్ వైజరనుకుంటా పలకరించాడు. డవానా కి నా ప్రాణాలనప్పగించిన అప్రాచ్యుడు. ఉహూ.. తిట్టట్లేదు. మూడో నంబర్ లేన్ లో నన్ను దింపి వెళ్ళిపోయాడు.
సరిగ్గా డిజిటల్ క్లాక్ లో పదకొండయింది. ఆదివారం కోలాహలమంతా స్విమింగ్ స్కూల్లోనే ఉన్నట్టుంది. 'శశి టెన్నిస్ ప్రాక్టీసుకెళ్తున్నానని నమ్మేసి ఈదేసుకుంటూ ఉంటుంది.. హ్హుహ్హహ్హా...' అని మనసులో నవ్వుకుంటున్నానా.. పక్క లేన్ లో బికినీలేసుకుని ఇద్దరూ, షార్ట్ వేసుకుని ఒకడూ, సింగిల్ పీస్ పువ్వుల సూట్ వేసుకుని మరొక పిల్లా దిగారు.. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి.
నీళ్ళలో మునగమని, నీళ్ళ కింద బబుల్స్ వదలమనీ, బోర్లా తేలమని నా పొట్టకింద చెయ్యి పెట్టి చక్కిలిగిలిపెట్టింది డవానా. పైగా ఉపన్యాసం కూడానూ.. "భయం సహజం. I totally understand . నీరు మనకెంత అవసరమో... అదే నీరు మనని భయపెడుతుంది. I can help you come over that fear."  దీని చాదస్తం!!

నాతో పాటూ డవానా దగ్గర నేర్చుకుంటున్న మిగిలిన ముగ్గురూ బాగా బెదురుగొడ్లు. పక్క లేన్ లో లిలీపుట్ స్విమర్స్ కి రైమ్సూ చప్పట్లూ.. కోలాహలం. టైమ్ పాస్ కి చూస్తున్నా.. చూస్తున్నా..
"Humpty Dumpty sat on a wall.. Humpty Dumpty had a great fall.... " పక్క లేన్ లో గట్టున కూర్చున్న ఏడునెలల పిల్లా డుబుంగున పూల్లో దూకేసింది. హమ్మనీ!! వాళ్ళమ్మ అందుకుంది. విజయగర్వంతో అటూ ఇటూ చూస్తోందీ పిల్ల.... వేలెడంత లేదూ..!
"Attention Parents and Swimmers.. We've got a little swimmer getting her first ribbon today! Give her a big hand... Mithayee Paul!!" అరుస్తున్నాడు జోయీ. ఇందాకా బుడుంగున మునిగితేలిన బుడత పిల్లకి పాకడం సరిగా రాదు కానీ రిబ్బన్ కొట్టేసిందా?
డవానా నన్ను "Last turn!" అని పిలిచేసరికి వీరావేశమొచ్చింది. ఆఫ్టరాల్ నాలుగడుగుల పూల్ లో తేలలేనా? ఊపిరి బిగించి మునిగి కాళ్ళు కదిపాను శరవేగంగా... అంతే..

                                                                       ***

రెండో వారం స్విమింగ్ క్లాస్ తక్కుతూ తారుతూ దిగ్విజయంగా పూర్తిచేసుకుని ఇంటికొచ్చాను. లంచ్ పూర్తయింది.
"సంజూ... "
"..."
" ఏదైనా మాట్లాడు సంజూ..." లవ్ సీట్ ఇరుకయ్యింది.
"అద్సరే కానీ... ఈతెందుకు?"
"..?"
"అదే స్విమింగ్.. ఎందుకూ?"
"లావైపోతున్నాను కదా! నువ్వేమో.. యంగ్ అండ్ హేండ్సమ్.. " గుండెల మీద సున్నాలు చుడుతూ బాణాలేసేస్తోంది.
"నన్నెందుకూ నేర్చుకోమన్నావు?" టీవీ ఆపేద్దామనిపించింది.
"సైనస్ అన్నావు కదా.. వద్దులే."
"ఉహూ.. నాలుగైదు సార్లడిగావు."
"మరేమో.. కొడుకు పేరు సోమలింగమా అని నవ్వకూడదు."
"ఉహూ..."
"స్విమింగ్ స్కూల్ కీ చిన్న చిన్న పిల్లలొస్తారు సంజూ.. Aqua babies అనీ.. ఆర్నెల్ల వయసు నుండీ అనుకుంటా జాయిన్ చేసుకుంటారు."
" .."
"మన బేబీని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అనీ.."
"దానికి నేనెందుకూ? నువ్వు ఈదేస్తున్నావు కదా సాగరకన్యలాగా.." నిష్టూరం పలికించకుండా ఉండలేకపోతున్నాను.
"అబ్బా... పూల్ లో దిగడానికి పేరెంట్స్ కి ఈత రావక్కర్లేదు. మన బేబీకి స్విమింగ్ వచ్చేసరికి మనక్కూడా వస్తే భలే బావుంటుంది కదా అనిపించింది."
"........"
" పిల్ల ఉంటుంది సంజూ... మొన్నెప్పుడో చూసాను. దేశీ పిల్లే! లడ్డూ లా ఉంది. పేరేదో విచిత్రంగా ఉందిలెద్దూ.. భలే యాక్టివ్."
"మిఠాయీ పాల్?" బయటికి చెప్పలేదు.

                                                                      ***
"అవునూ.. లిప్స్ కి ఏం రాస్తున్నావేంటీ?"
"ఏమీ లేదూ...." గారాలు పోయింది.
"బావున్నాయ్ నిజంగా." నా పెదాలకంటే.. అనబోయి ఊరుకున్నాను.
"తేనె రాస్తేనూ... బావుంటాయని చదివా ఎక్కడో."
"అర్ధరాత్రి రాసుకోవాలని కూడా చదివావా...?"
"ఉహూ.. నైట్ రాసుకు పడుక్కోమన్నారు కానీ..." కిలకిలా నవ్వేసింది.
శశి బావుంటుంది. చాలా...

                                                                    ***

November 2013, TANA పత్రికలో ప్రచురితం. 
Photo Courtesy : TANA