వెచ్చని నిద్ర దుప్పటి కప్పేసుకొని, రాత్రంతా కమ్మని కలలు కన్న తరువాత, బధ్ధకపు పొరలు నెమ్మదిగా విడేలా పాదాలు ఒత్తుతూ, "అమ్మలూ, లేమ్మా.." అని ఓ మేఘ గంభీరమైన గొంతు లాలనగా మేలుకొలపడం కంటే శుభోదయం ఏముంటుంది?
"ఊ.. " కళ్ళు తెరవకుండా ఇంకో మాట కోసం ఎదురుచూసేదాన్ని.
"ఇలా ఆరయ్యే దాకా పడుకుంటే ఎలా? రేపటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. నాలుగయ్యేసరికి లేవాలి. ఏం?" కనురెప్పల వెనుక నెలగంటు ముగ్గు మెరిసి, కళ్ళు తెరిచి చూద్దును కదా..! ఊర్ధ్వపుండ్రాలు రూపం దాల్చినంత పవిత్రంగా, చందన తరువులా తాతగారు.
ఒక రోజు కాదు, ఒక నెల కాదు. పదిహేను వసంతాలు చిరునవ్వు మేల్కొలిపింది నన్ను.. సూర్యకిరణం కంటే ముందు.
కమలా ఫలాలు తిన్నారా? నాగపుర్ కమలాలని పెద్దగా ఉండేవి. ఆ పండు ముచిక దగ్గర ఓ చిన్న రంధ్రం చేసి, లోపలి తొనలు నెమ్మదిగా వేలితో బయటికి లాగేస్తే, నారింజ రంగు పండు దొన్నె (cup) లా మిగిలిపోతుంది. దానిలో మట్టి ప్రమిద నెమ్మదిగా దించి, వత్తి వేసి, నూనె పొసి వెలిగించి ఓ పళ్ళెం లో పెట్టి తాతగారు అందిస్తే, అపురూపంగా తీసుకెళ్ళి ఆ నారింజ వెలుగుల దీపాన్ని వాకిలి కిటికీ లో పెట్టే దాన్ని. వీధి మొత్తానికి నాదే అందమైన కార్తీక దీపం. గాలికి కొండెక్కకుండా తెల్లవార్లూ ప్రభలు విరజిమ్మేది అది. కార్తీక మాసం పూర్తయిందా.. వీధి సద్దుమణిగేది. మా లోగిలి నిద్రలేచేది. ప్రతి మార్గశీర్షాన వేళ తప్పకుండా.. కాత్యాయనీ వ్రతానికి సిధ్ధమయిన గోపకాంతలా.
నాలుగో గంటకి లేచి చన్నీళ్ళ స్నానం చేసినా వణుకు ఎందుకు రాదంటే.. 'నూతి నీళ్ళు వెచ్చగా ఉంటాయట!' అని నమ్మడం వల్ల. "శ్రీశైలేశ దయాపాత్రం.." అని తాతగారి గొంతు కంచు గంటలా మ్రోగేసరికి దేవతార్చన సన్నిధి గడపలో ఎందుకు కూర్చోవడం అంటే.. అది భక్తి కాదు, ఆ మాత్రానికి ముక్తి రాదు. అది బధ్ధకం, లాజిక్ అంటని పసితనం కనుక, దానికి నిబధ్ధత మారు పేరు కనుక. 'మనోహరమైన ముప్పై తమిళ పాశురాలతో అర్చించి, గోదాదేవి రంగనాధుడిని భర్తగా పొందిందట.' అని విని, ఆవిడ అక్కడెక్కడో శ్రీరంగంలో ఓ చక్కని ఇంట్లో, కులాసాగా కాపురం చేసుకుంటూ ఉండేదని నమ్మేదాన్ని. ఫొటోకి, చిత్ర పటానికి తేడా తెలియకపోవడం తెలివితక్కువతనమే కావచ్చు. తలుచుకుంటే నేను నాకే నవ్వుతెప్పించే చిన్నతనం అది.
అ, ఆ లు గుర్తున్నంత స్పష్టంగా, ఆ రోజు విన్న ప్రతి పద్యం పొల్లుపోకుండా గుర్తుందంటే, నేను ఏకసంతాగ్రాహిని అని కాదు. తెల్లవారు ఝాము చలిలో, ముడుచుకు కూర్చున్న పదేళ్ళ పిల్లకి చందనపు వాసన, కర్పూర గంధం, చామంతులు, గులాబులు, మరువం, నంది వర్ధనాల సుగంధపు మేళవింపు, 'చలి గాలికి వణుకుతున్నాయేమో!' అన్నట్టు సుడులు తిరుగుతూ, సుగంధం విరజిమ్మే అగరు పొగల నడుమ, నిశ్చలంగా వెలిగే దీపశిఖల మధ్య, శేష పర్యంకం మీద ఉజ్వలప్రభలు చిమ్ముతూ వేంచేసిన ఇంటివేలుపుల తీరు, వంట గదిలోంచి వీచే నైవేద్యాల భోగ్యమైన ఘుమ ఘుమల నేపధ్యం లో.. అందమైన శ్లోకాలు .. డెభ్భై వసంతాలొస్తున్నా వన్నె చెదరని ఓ గంభీరమైన ,శ్రుతి బధ్ధమైన, స్పష్టమైన, గొంతులో వింటే ఎలా మరిచిపోగలదు? పంచలో రాతి స్థంభానికే కంఠతా వచ్చేసి ఉంటాయ్, నేనెంత?
రెండువేళ్ళ సందులోంచి తెల్లటి ముగ్గు వదులుతూ, ముంగిట్లో క్షణాల్లో రంగవల్లికలల్లేసే ఆడపడుచుకి ఏం వరం ఇవ్వాలన్నా లక్ష్మి వెనుకంజ వెయ్యదు గాక వెయ్యదు. ప్రతి రాత్రి వీధిలో పోటీలు పడుతూ, పడుచులు వేసే చుక్కల ముగ్గులు ఒక అందమైతే, నెలగంటు ముగ్గులు ఇంకో విలక్షణమైన చక్కదనం. రెండు గీతలు ఒకే సారి గీస్తూ, ముగ్గు వేసి అమ్మ నన్ను అబ్బురపరిచేస్తే, నాయనమ్మ గుప్పెట్లో ముగ్గుని, వేళ్ళ సందులోంచి అలవోక గా జారుస్తూ, నాలుగేసి గీతలు సృష్టించి నాకు మాయాజాలికురాలిలా కనిపించేది. "ఎలా వేస్తావ్ నాయనమ్మా?" అని అడిగిన ప్రతి సారీ విసుక్కోకుండా, ముగ్గు పక్కన ఓ గీత విడి గా గీసి చూపించేది. నేను చూసిన చిత్రం నెమరువేసుకొనే లోపు ఆ గీత ఓ చెరుకు గడ గానో, ఓ వెదురు బాణం గానో, ఓ పొంగలి కడవ గానో మారిపోయేది. నవ్వేసి వీధిలో మిగిలిన ముగ్గులు చూసి రావడానికి తుర్రుమనేదాన్ని. ఇంకాస్త పెద్దయ్యాక నాయనమ్మతో పోరాడి జనవరి ఒకటి నాడు రంగుల ముగ్గుకి అనుమతి సాధించేదాన్ని. ముగ్గు వేసేసి, నేస్తాలతో వీధులన్నీ చక్కర్లు కొట్టి వచ్చేలోపు, ఆ ముగ్గు పక్కన ఓ చిన్న ఈనెల ముగ్గు ప్రత్యక్షమయ్యేది. ఓసారి విసుక్కుని 'పోన్లే' అని నాయనమ్మని క్షమించేసేదాన్ని. చెప్పొద్దూ.. ఒకటో తారీకు మునిమాపు వేళకే, పేడనీళ్ళతో ముంగిలి అలికి, నా వర్ణ కావ్యాన్ని రూపు మాపేసి, వైకుంఠ ద్వారాల ముగ్గు వేసేస్తే కాని దానికి నిద్ర పట్టేది కాదు. ప్రతి ఏడూ జరిగే తంతే అయినా నాయనమ్మ- మనవరాళ్ళ పోరు తప్పేది కాదు ఆ రోజున.
తెల్లవారు ఝామున దేవతార్చన పూర్తయ్యాక , నడుముకు చుట్టి ఉన్న పై కండువా తీసి దులిపి, కప్పుకొని బయటకు వస్తూ రేడియో పెట్టేవారు తాతగారు. ముందు రోజు పూలు కట్టించుకొచ్చిన తామరాకులు దాచి, శుభ్రం గా తుడిచి వాటిలో వేడి పొంగలి పెట్టేది నాయనమ్మ. భక్తి రంజనిలో వినిపించే తిరుప్పావై పాశురం, దానిని మృదుమధురం గా వివరించే శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు తాతగారి ప్రవచనం వింటూ తింటేనే, పొంగలికి రుచి. అమృతవల్లీ సుందరం పాడే వారు తెలుగు అనువాదాన్ని.
"మేలుకో ఓ సిరీ! శాతోదరీ! మేలుకో ఓ నీళ! పరిపుర్ణురాలా! మేలుకో నవకిసలయాధరా.. కలశోపమపయోధరా.." అని చెలిని మేల్కొలిపి యమునకి / కావేరికి స్నానానికి తీసుకొని పోయి వచ్చి, కృష్ణుడిని మేల్కొలిపి, పొగిడి, బ్రతిమాలి సాధించారట భామినులు, పర ను, పరమాత్ముడిని కూడా.
" అర్ధులమూ.. అనుగులమూ.. అంజలింప వచ్చినాము అడిగిన వరమిడుదువని అనురాగపు గనివనీ.. ఒక అమ కొమరుడవై, వేరొకామ ఒడిలో దాగి.. పరవశమున పాడి పాడి విరహమెల్ల మరతుము, పర వాద్యము కరుణింపుమూ.. పరమానందమొసగుమూ." పాట గోదాదేవిని కనులకు కట్టిస్తే, ఆ పదాలు గోవిందుని, గోకులాన్ని ఎదుట నిలబెట్టేవి.
ఒకరోజు తాతగారడిగారు. "ఈ తెలుగు అనువాదం రాసినదెవరో తెలుసా? అమ్మలూ!"
"ఎవరు?" కళ్ళతోనే అడిగా.. నేతి ముద్దలాంటి కూడారు పాయసం గొంతు దిగుతోందాయె అదే క్షణంలో.
"మల్లీశ్వరి చూసాం గుర్తుందా! ఆ సినిమాలో పాటలు రాసినాయనే. కృష్ణ శాస్త్రి గారు.. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారంటారు."
"కోతి బావకు పెళ్ళంటా.. ఆ సినిమా యేనా?" నిర్ధారణ కోసం అడిగాను.
"ఆ..మనసున మల్లెల మాలలూగెనే.." అందించారింకో పాటను.
"ఎక్కడుంటారు ఆయన? వైజాగ్?" అదే పెద్ద దూరాన ఉన్న ఊరాయె నాకు అప్పట్లో.
పైకి వేలు చూపించి " కీర్తిశేషులయ్యారు" చెప్పారు.
"అంటే?"
"ఎప్పుడో ఆయన రాసిన పాటలు విని, ఆయన లేనప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూన్నాం చూడూ. అదీ కీర్తిశేషులవడం అంటే."
'కొత్త పుస్తకాల వాసనకి ఇంచుమించు సరిసాటి కొత్త బట్టలది' అని నేను ఢంకా మీద దెబ్బ కొట్టి మరీ చెప్పగలను. దర్జీ గుండ్రం గా చుట్టి ఇచ్చిన పరికిణీ తెచ్చి, దులిపి వేసుకుంటే అదీ పండగ. భోగి నాడు భోగిపళ్ళ సంబరాల గురించి, తెలుగు వారు ఎవరికీ ఎవరూ గుర్తుచెయ్యక్కర్లేదు. జ్ఞాపకాల్లో భోగిపళ్ళలో కలిసి జారిన పైసల గలగలలు వినబడని వాళ్ళుండరేమో. సంక్రాంతి నాడు ఉదయం అమ్మతో కలిసి పసుపు, కుంకుమలు పంచిపెట్టడానికి కొత్త బట్టలు వేసుకొని బయలుదేరేవాళ్ళం. పసుపు , కుంకుమ అమ్మ ప్లేట్ లో వేస్తే తాంబూలం అమర్చి పెట్టడం నా వంతు. కనుమ స్నానం, గంగిరెద్దుల వాళ్ళు"అయ్యవారికి శుభోజ్జయం కలగాలి" అని దీవిస్తూ బసవన్న చేత దీవింపచేసి, పాత బట్టలు దాని మూపున వేయించుకొని, దక్షిణ పుచ్చుకొని వెళ్ళడం ఎంత సంబరం అసలు!
'ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహముల'ని గాలిలో ప్రశ్న వదిలి చేతులు దులిపేసుకోలేను. 'నాకొద్దు ఆ జ్ఞాపకాలు, కాలచక్రాన్ని గిర్రున వెనక్కి తిప్పలేని బాధ నాకొద్దు.' అనాలనిపించినా అనలేను. మార్పు సహజం, అభిలషణీయం. ఆనాటి బడిపంతులు కొడుకు, ఈనాటి క్షణం తీరిక లేని సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు మరి! రోలు, రోకలి, తిరగలి, కొడవలి, గొడ్డలి, సైకిలు.. మాయమయిపోయిన సుఖమైన జీవితాలకు అక్కర్లేని పిండి వంటలు, నేతి పొంగళ్ళు తినాలని కాదు. జిహ్వకి, కంటికి కొత్త రుచులు తప్పనీ కాదు. కొత్త వింతే, కాని నాకు పాత రోత మాత్రం కాదు. క్షణం తీరిక లేని పరుగులో, ఎప్పుడైనా ఆటవిడుపుకి ఆగినప్పుడు.. తెలుగు పద్యం, వేణు గానం, పూర్ణం బూరెలు ఇలాంటి డెలికసీ లని అనుభవించే అభిరుచి పాడయిపోకుండా ఉంటే చాలు.
'పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు' కదా! నేను తాతగారి తీపి గురుతుని. నా తరువాత, నేను తీపి గురుతులని మిగుల్చుకోవాలంటే ఎంత ప్రయత్నం చెయ్యాలో.. కథలు, రుచులు, కబుర్లు, పాటలు.. ఎన్ని అందించాలో నా విహారి కి..
Thursday, December 23, 2010
Sunday, December 12, 2010
ఓ గుక్కెడు అమృతం పోద్దురూ!
క్షీర సాగరాన్ని ఒళ్ళు పులిసిపోయేలా మథనం చేసిన దానవులకే దిక్కులేదు. ఇక అమృతం గురించి మనం ఆశించడం, సావిత్రిని దగ్గర నుంచి ఓ సారి చూడాలనుకోవడం లాంటిది. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారి పక్కింట్లో పుట్టాలనుకోవడంలాంటిదీను. అతిఅత్యాశ. 'దేవతలకి సాటి కాకపోవచ్చు కాని రాక్షసులకి తీసిపోయామా?' అని నన్ను వివాదంలోకి లాగొద్దు దయచేసి. సరిలేరు మనకెవ్వరూ! ఏదైనా వస్తువు/విషయం దొరకలేదా? అయితే పోరాడి సాధించాలి. లేదా మరిచిపోవాలి. కాని మధ్యే మార్గం ఇంకొకటుందని మనుష్య జాతే కనిపెట్టింది. అదే విశ్వామిత్ర సృష్టి.
"అమృతం సరిపడా లేదు. వెళ్ళండహో.." అని జగన్మోహిని డిక్లేర్ చేసేసాక, ఆశ చావని మన పూర్వీకుడొకడు పొంచి ఉండి, అమృతం లక్షణాలన్ని గమనించాడు. బంగారు భాండం లోంచి నేరుగా దేవతల దోసిళ్ళలోకి వెళ్ళిపోవడం వల్ల రంగు, వాసన కనిపెట్టగలిగే అవకాశం లేకపోయింది కాని, తాగాక దేవతల మొహం చూసి దాని శక్తి ఎంతటిదో తెలుసుకున్నాడు.
తన సువాసనతో కళ్ళని అరమోడ్పులు గావించగలిగేది. నాలికకి తగులుతూనే నరనరాలను ఉత్తేజపరచగలిగేది. గొంతు దిగడమే ముఖ పద్మాన్ని వికసింపజేసి, మన తలకాయ వెనుక విష్ణుచక్రం వెలిగించినంత తేజస్సు, చైతన్యంకలిగించేది. కడుపులో చేరి ఆగిపోకుండా తన శక్తిని ఆక్సిజన్ లా, దావానలంలా మిగతా శరీరభాగాలకు అందించేది. తన పరోక్షమున , 'పత్రమున దాగిన అగ్నిశిఖవోలే' దాగని విరహబాధని కలిగింపజేసేది. ఎదురుచూపుల చివర, కనుపట్టిన క్షణాన మహా వీర గొప్పానందం కలిగింపజేసేది. ఆదుర్దా, అపనమ్మకం, తలనొప్పి ఇలాంటి కంటికి కనిపించని రోగాలెన్నోకుదిర్చేది. "జయమ్ము తథ్యమని" ఏ వెర్రి కుంకనైనా నమ్మించి, కదనరంగాన దూకేలా చేసే శక్తి ఉన్నది అమృతమని తెలుసుకున్నాడు. కాస్త ఇటూ అటూ గా అంతే మహత్తరమైన ద్రవాన్ని తయారుచేసి "కాఫీ" అని నామకరణ సంస్కారం జరిపించి, విందులో అందరికి తలా చెంబెడు కాఫీ పోసాడు.
ఇథియోపియాలో పుట్టిందని చెప్పబడుతున్న ఈ ద్రవరాజం కాకి లాంటిది - నిద్రను పోగొడుతుంది. గాలి లాంటిది - ప్రాణ శక్తి ని నింపుతుంది. పెళ్ళాం లాంటిది. లేని వాళ్ళూ బతుకుతారు. కాని ఉన్నవాళ్ళు కాస్త సుఖంగా బతుకుతారు. ఇదిగో, ఫెమినిజం అనకండి మళ్ళీ. ప్రతిదానిలోను సాధకబాధకాలుంటాయ్. ఒప్పుకుంటాను. డికాషన్ చక్కగా కుదిరి, సరైన పాళ్ళలో పాలు, పంచదార పడి, వేడి గా పొగలు కక్కుతూ, చూడచక్కని శుభ్రమైన పాత్రలో అందించబడ్డ కాఫీ, సీతమ్మ వారంత అనుకూలవతి అయిన భార్య. శూర్పనఖ మీకు తెలుసు.
కాఫీ - అందలి రకాలు, గుణగణాదులు, మంచి చెడులు చెప్పడం నా వ్యాపారం కాదు. నేను చెప్పేదంతా నా 'కప్ ఆఫ్ కాఫీ' గురించే. నాయనమ్మ కాలంలో కాఫీ కంచు గ్లాసులతో తాగేవారట. కాఫీగత ప్రాణులకి సమయానికి కాఫీ అందకపోతేనో, అందిన ద్రవం కాఫీని పోలకపోతేనో ఆ గ్లాసులు ఎగిరి, నభోమండలానికి చేరి, గ్రహశకలంలా జారి కాఫీ ఇచ్చిన వారికి ప్రాణహాని తలపెడుతూ ఉండేవట. దక్కిందే ప్రాణం, తొక్కిందే నక్క అని స్టీలు గ్లాసుల లోకి మారిపోయారట. చెప్పొద్దూ! అందం అంటే - పొగలు కక్కే ఫిల్టర్ కాఫీని నింపుకొని, సరిపడిన స్టీలు కప్పులో ఠీవిగా నిలబడిన తళతళ్ళాడే స్టైన్ లెస్ స్టీలు గ్లాసుదే.
చేతికి గాజుల్లా, కళ్ళకు కాటుకలా,
నుదుటికి తిలకంలా, కాఫీకి స్టీల్ గ్లాసూ..
నేను నమ్మిన నిజాలు చెప్పనా? ఆంజనేయుడు, భీముడు, కోడిరామ్మూర్తి పెద్దయ్యాక కాఫీ తాగిన దాఖలాలు ఉన్నాయో, లేదో నాకు తెలియదు కాని, వారి వారి తల్లులు ఉగ్గులో కాఫీ పోసి ఉంటారు ఖచ్చితంగా. కుంభకర్ణుడిని నిద్ర లేపాల్సిన క్షణానికి లంకలో కాఫీ నిండుకొని, పాపం అంత ప్రయాసపడి ఉంటారు. రంభా ఊర్వశులకి పూలహారాలు ఇచ్చేబదులు, పొగలు కక్కే కాఫీ ఎదురుగా పెట్టి నాట్యపోటీ పెట్టవలసింది విక్రమార్కుడు. కాఫీ చల్లారిపోతోందని తొందరగా నాట్యం ముగించి వచ్చిన వాళ్ళకి, నాట్యం మీద శ్రధ్ధ లేనట్టేగా!నలభీమ పాకంలోను, గంధర్వ గానంలోను, మన్మధ బాణంలోను, కృష్ణుడి అతిమానుష చేష్టల్లోను, ఐన్ స్టీన్, రామానుజంల తెలివిలోను సీక్రెట్ ఇంగ్రేడియంట్ కెఫిన్ అని నా గాఢమైన అనుమానం. అంటే వాళ్ళు రోజూ లోటాల లెక్కన కాఫీ తాగేవారని కాదు. అవసరమైనప్పుడు వారు వాడుకున్న ఆపద్బాంధవి కాఫీయేనేమో అని. చెడు పర్యవసానాలు పెద్దగా లేని, సత్ఫలితం ఉన్న ఉత్ప్రేరకం 'కెఫిన్' మాత్రమే మరి.
'వెయ్యేల? అసలు ప్రపంచంలో మనుషులని రెండు రకాలుగా విభజించెయ్.. కాఫీ తాగే వాళ్ళు, తాగని వాళ్ళు 'అని విసుక్కుంటారేమో! అమ్మమ్మమ్మా, అలా ఎలా కుదురుతుంది! కాఫీ పరంగా మనుషులు రెండు రకాలు. దానికి న్యాయం చేసే వాళ్ళు, అన్యాయం చేసే వాళ్ళు.
కాఫీ తాగాలి కాబట్టి తాగే వాళ్ళు, ఎలా ఉన్నా తాగేసే వాళ్ళు, కాఫీ పేర రకరకాల ద్రావకాలు తయారు చేసేవాళ్ళు, మా ఇంట్లో కాఫీ తాగమని బలవంతం చేసే వాళ్ళు రెండో రకం. కాఫీ అనే మాట సమ్మోహనమైన శబ్దాల్లో ఒకటని నమ్మే వాళ్ళు, తాగిన ప్రతి కప్పు కాఫీని ప్రేమించేవారు, కాఫీ పొడి, వేడి నీళ్ళలోంచి చిక్కటి డికాషన్ ని ఫిల్టర్ లోంచి "లిక్విడ్ ఏంజల్స్" ని దింపినట్టు దింపే నైపుణ్యం ఉన్నవాళ్ళు, స్వర్గం అంటే కాఫీ కప్పులో ఉంటుందని నమ్మేవాళ్ళు, కక్కుర్తికి, బలవంతానికి లొంగని నిష్ఠాగరిష్ఠులే కాఫీకి న్యాయం చేసే పుణ్యాత్ములు. ఇక తాగని వాళ్ళు ఏ వర్గానికి చెందుతారో నేనెప్పుడూ అలోచించలేదు. రెండో రకంలో వేయడానికి నాకేం అభ్యంతరం లేదు కూడా! మా అత్తగారు చెప్పే ఓ సామెత గుర్తొస్తోంది నాకు. చెప్పేదయితే చెప్పేదాన్నిగా. గుర్తొచ్చిందన్నానంతే!
న్యూయార్క్ లో "ది పల్ప్ అండ్ ది బీన్" అనే కాఫీ షాప్ లో పది షాట్స్ ఎస్ప్రెస్సోని, 20 ఔన్సుల కప్ లో " పోర్న్ ఇన్ ఏ కప్" ముద్దు పేరుతో అమ్ముతున్నారట. మెను లో పేరు 'డెసి' అయినా సరే ఈ ముద్దుపేరెందుకయ్యా అంటే, ఈ కాఫీని సేవించడం ,కాఫీ ప్రియులు మాత్రమే చెయ్యగలిగిన సాహసమట. అంత కెఫిన్ తాగితే నేను రాకెట్ లా దూసుకుపోతానేమో న్యూయార్క్ వీధుల్లో. దీనిని నలభై ఏళ్ళ పైబడిన వారికి అమ్మరటండోయ్. నాకెంత సమయం ఉందంటారా! యేడాదికి ఓ సారి తాగినా పది రాకెట్ లు వదలచ్చు నేను. హ్హహ్హహ్హా..
ఓ దేవ రహస్యం చెప్పనా? నాకు కాఫీ అంటే ఇంత ప్రీతి ఉందని ఎవరితోను చెప్పను. ఎవరడిగినా అలవాటులేదని చెప్తాను. ఎందుకంటే నా కాఫీకి కర్త , క్రియ నేనే అవ్వాలి. ఇక నా పుస్తకం, నా కాఫీ పంచుకోవలసిన పరిస్థితే వస్తే , నేను అవతారం చాలించే రోజు వచ్చేసినట్టే.
*మొత్తం ముప్పైనాలుగు కాఫీలు. లెక్క చూసుకోండి. (తక్కువైతే నేను తాగేసినట్టే.)

Wednesday, December 8, 2010
చినుకులు
ఉదయం నిద్ర లేచి కిటికిలోంచి చూసేసరికి వర్షం పడుతూ ఉండడం ఒక పెద్ద గొప్ప అనుభవం.
వర్షం తడిపిన మట్టి వాసన ముక్కుకి గుడ్ మార్నింగ్ చెప్తుంది.
మసాబు వెలుగు కళ్ళకి చలువ అద్దాలు పెట్టుకున్న ఎఫెక్ట్ కలిగిస్తుంది.
చిరుచలికి మెడమీది నూగు నిక్కబొడుచుకొని మెదడుని మేల్కొలిపి శరీరాన్ని బజ్జోమంటుంది.
మొత్తానికి వర్షం బధ్ధకాన్ని రాజేసి మనల్ని దుప్పట్లో దాచేస్తుంది.
ఎన్ని గుర్తొస్తాయో..! ఇన్ని దాటి అప్పుడే ఇంత దూరం వచ్చేసామా అని ఎంత ఆశ్చర్యం కలుగుతుందో..!
అనుభవం, అనుభూతి రెండు వేర్వేరు పదాలు. వర్షం పడడం అనుభవం.. దాని పర్యవసానాలు అనుభూతులూను.
ఉదయం నిద్రలేచేసరికి వాన పడుతూ ఉంటే ఎన్ని లాభాలుండేవో నన్ను అడగండి చెప్తాను.. స్కూల్ కి "బేడ్ వెదరాలిడే " అనబడు బేడ్ వెదర్ హాలిడే ఇచ్చేవారు. ఇప్పట్లా స్నో (మంచు కాదు స్నో) తెగ కురిసిపోతున్నా.. ఉదయానే కూలి పనికి పోయే మేస్త్రిలా పలుగు,పారా తీసుకోని, చలికి కొయ్యబారిపోతూ కార్ ని తవ్వి వెలికితీసుకొని, విజయగర్వంతో రోడ్ మీద జారుకుంటూ, ఎవడొచ్చి మన కార్ ని ముద్దెట్టుకుంటాడో అని గుండెలు అరచేతిలో పెట్టుకొని, బతుకు జీవుడా అనుకుంటూ ఆఫీస్ కి వెళ్ళాలా ఏమిటి? ఎంచక్కా ఇంకో అరగంట దుప్పట్లో గువ్వ పిట్టల్లా మసిలి అప్పుడు లేవచ్చు.
స్నానం చెయ్యనిదే అమ్మ చద్దెన్నం, ఆవకాయ కాదుకదా, గ్లాసెడు పాలు కూడా మన మొహాన పొయ్యదని భయం ఉందనుకో! పరవాలేదు.. బకెట్ లో సబ్బు కలిపి నురగ వచ్చే దాకా ఆడుకొని.. ఆ నీళ్ళు బడ బడా శబ్దం వచ్చేలా పారబోసి మొహం మాత్రం కడుక్కొని బట్టలు మార్చేసుకొని వచ్చెయ్యొచ్చు. వర్షం పడుతూ ఉంటే మనమేం చేస్తాం? చస్తామా? తప్పేం లేదు. ఒక్క రోజు స్నానం చెయ్యకపోతే నష్టమేం లేదు.
చూరునుంచి ధారలు ధారలుగా కారుతున్న వాననీటి సంగీతం ఏ మహానుభావుడి స్వరరచనో కదా..!
అది వింటూ అమ్మ పెట్టిందేదో తినేసి ఆ ధారల్లో చెయ్యి కడుక్కోవడముందే. అదీ అనుభూతి అంటే.
ఎంత సేపయినా చందమామలు, ఆంధ్ర ప్రభలు చదువుకోనిస్తారు. వర్షంలో తడవకుండా ఇంటి పట్టున మనం ఉండడమే పెద్దవాళ్ళకి కావలసినది. పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదివేసాక, నెమ్మదిగా జారుకొని నేస్తాలని చేరుకున్నామా! బోలెడు చెయ్యచ్చు వర్షంలో. పడవలు, కత్తి పడవలు మన పేర్లు రాసి పందాలు వేసి వదలచ్చు. పిడతలు, బుల్లి బకెట్లతో వాన నీళ్ళు పట్టి పారపొయ్యచ్చు.(తాగచ్చు కూడా..! ) కొంచెం వాన వెలిసిందా.. వీధిలో మిగిలిన దోస్తులేం చేస్తున్నారో చూసి , మేసే గాడిదలేమైనా మిగిలిపోతే చెడిపెయ్యొచ్చు. మన ఎకౌంటులో ఓ పది పైసలేమైనా ఉంటే ఇంతమందీ పోలోమని రోడ్డు మొదట్లో ఉన్న పాన్ షాప్ లో బిస్కెట్లు, గోల్డ్ ఫింగర్ లు కొనేసుకొని కాకెంగిలి చేసుకు పంచేసుకోవచ్చు. ఆ బురదలో హవాయ్ చెప్పులతో తపతపా అడుగులేసుకుంటూ ఇంటికి వచ్చాక మన గౌను వెనక ఏర్పడ్డ నల్లటి పోల్కాడిజైన్ చూసి ఇంట్ళో మన నడ్డి బద్దలగొడతారు. దురదృష్టం ఏమిటంటే, ఆ బురద చిందులు పడతాయని ముందు అసలు ఊహించం. 'ప్చ్..వట్టి కాళ్ళతో వెళ్ళొచ్చేసే వాళ్ళమే!' అని తరువాత పశ్చాత్తాపపడతాం.
ఇంకాస్త వయసొచ్చాక - వర్షం, రోజుకి కొత్త రంగులద్దేది.
వాన పడ్డ రోజు ఇంట్లో కూర్చోని హౌసీ, బేంక్ (మోనోపలీ),అంత్యాక్షరి ఆడడం, వేడిగా వేరుశనక్కాయలో,పకోడీలో తినాలనిపించడం, నేస్తాలతో దుప్పటి కప్పుకు కూర్చోని గాసిప్ మాట్లాడుకోవడం.
వర్షం బధ్ధకం కాదు, కొత్త కొత్త కోరికలు నేర్పేది.
చినుకులు చూస్తూ మనసుకు నచ్చిన వాళ్ళతో ముచ్చట్లు, గిల్లి కజ్జాలు.. అబ్బో..
మనసైన వాళ్ళో, వరసైన వాళ్ళో దాపుల్లో ఉంటే చెంగలువలు పూసితీరుతాయ్ మనసులో..
దొంగచూపులు, దోర నవ్వులని దాటి, కళ్ళు కలిపి కబుర్లు చెప్పే ధైర్యం చినుకులు, చలి ఇస్తాయంటే నమ్ముతారా?
మా అమ్మమ్మ గారింటికి వెళ్తే దొరికే అపురూపమైన వస్తువులేమిటంటే.. అమ్మమ్మ కుట్టే సంపెంగల జడ, చేసి పెట్టే గులాబి పువ్వులు (చెట్లకి పూసేవి కాదు.. వేడి వేడి చట్రానికి పూసేవి..హ్హాహ్హాహ్హా), పనస తొనలు, బెండకాయ ముక్కలు వేసిన చారు, అప్పన్న దర్శనం,చిట్టి గారెలు. వర్షాకాలంలో వెళ్ళామా ఇంక కళ్ళకి విందే! జడివాన మొదలయిన క్షణంలో మెరుపు మెరిసినంత వేగంగా విరబూసి పలకరించే తెలతెల్లని చెంగలువలు. ఏం సువాసన.. ఏం అందం.. మరి రావు కదా! అపురూపమైన వస్తువుని చూస్తే 'మళ్ళీ ఎప్పుడా?' అనే బాధ చిన్నప్పుడు ఉండేది కాదు. దొరికినపుడు అనుభవించేయ్యడమే. ఇప్పుడో! అది దాచుకోవాలనో, సొంతం చేసుకోవాలనో తపన, స్వార్ధం. ఈ గుంజాటనలో అసలు విషయం అనుభవించలేకపోతున్నామనే ధ్యాస ఉండదు.
ఇన్ని బంగారు క్షణాలు ఖర్చుపెట్టేసుకొని, పెద్దరికం ముసుగేసేసుకొని, డాలర్లు సంపాదిస్తున్నామా?
కనీసం నా పిల్లలు వర్షం లో తడిసి ఇంటికి వస్తే అయినా మనసుకు తశ్శాంతి కలుగుతుందేమో!

Tuesday, December 7, 2010
స్వామికి లేఖ
ఈ పాటికి మాల వేసుకొని ఉంటావ్. ఎలాంటి భావోద్వేగంలో ఉన్నావో, లేదా నిశ్చలంగా జరుగుతున్నది చూస్తున్నావో మరి. కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల సార్లు తీసుకున్న నియమమే అయినా మన దగ్గరకి వచ్చేసరికి కొత్త, వింత కదూ? నీకు చెప్పేన్ని విషయాలు నాకు తెలీదు. నిన్ను నడిపించేంతటి దాన్నో, వెన్నుతట్టేంతటి దాన్నో కాదు. దినచర్యలో మార్పుకి నువ్వెలా సర్దుకుంటావో, తత్తరపడతావో అని నా స్వభావసిధ్ధమైన మాతృ హృదయం కొంచెం బెంబేలు పడుతోంది. ఓ ఉత్తరం కొంచెం భారంతీరుస్తుందని అనిపించింది.
నీకు నేను ఏంకర్ ని కాదు, నువ్వే నాకు ఔట్ లెట్ వి ఏమో..! ఎప్పటిలాగే.
చాలా మార్పులుంటాయేం? ఇష్టమైనవి వదిలేసుకోవడం, కష్టమైనవి ఆచరించడం..కేవలం మన స్థాయి ని మనం అంచనా వేసుకోవడమేనంటావా? "నేనిది చేస్తే నాకది ఇస్తావా?" అని ఎక్కడో కొండమీద కొలువున్న దేముడిని అడగడానికి కాదు.'నా దైనందిన జీవనంలో మార్పు కోసం' అన్నావు. మార్పు మాత్రమే కాదు. ఈ మండలం అయ్యేసరికి నువ్వు ఎన్నో తెలుసుకుంటావనిపిస్తుంది. చేస్తున్న పనిని, ఆచరిస్తున్న విధానాన్ని మనస్పూర్తిగా విశ్వసించు.ఆరాధించు. ఇది మాత్రం గుర్తుంచుకో. తప్పదు కాబట్టి అని కాదు. నువ్వు కోరుకున్నది కనుకా కాదు. ఇది విధానం. దాన్ని ఆచరించడం నీ విధి కాబట్టి.
నువ్వు అమ్మ, దీక్షామాల విహారి. అంత ప్రేమించు. అంత అనుభవించు. అంత ఆనందించు.
భక్తి, మోక్షం, కట్టుబాటు, పూజలు ఇలాంటివన్నీ మనుషుల భావోద్వేగాలకి పర్యాయపదాలని నా అభిప్రాయం. అవి మనం సృష్టించుకున్నవే. మనని ఏలుతున్నాయ్ ఈ రోజు. పసిపాపకి ఏం కట్టుబాట్లు, కోరికలు ఉంటాయ్ చెప్పు? స్వఛ్ఛమైన పాల మీద బతుకుతాడు. రుచులు అక్కర్లేదు. నిద్ర వస్తే ఎక్కడైనా పడుకుంటాడు. అలా పాకుతూ ఏ సోఫా వెనుకో, గోడ వారనో..భోగాలక్కర్లేదు. అమ్మ ఒడి, అమ్మ ప్రేమ, అమ్మ లాలన, అమ్మ స్మరణ.. వేరేమనిషి వాడికి అక్కర్లేదు. 'అన్యథా శరణం నాస్తి' అంటాడు కాబట్టే అమ్మ వాడిని వదలదు. వదిలి మనలేదు. ఇది కాక సౌభాగ్యమిదికాక వరము ఇంకేముందని అనిపించదూ, ఇలాంటి బంధం ఏర్పడితే? ఆత్మ - పరమాత్మే కానక్కర్లేదు. తండ్రి-కొడుకులు, స్నేహితులు, ఆలుమగలు యే ఇద్దరి మధ్య కల్మషం లేని ప్రేమ ఉంటుందో, ఆ బాంధవ్యం విజయవంతం, ఆనందదాయకం అవుతుంది. ఇదేం కొత్త విషయం కాదు గా.. కాస్త ధైర్యం రావడానికి చర్వితచర్వణమంతే! 'single soul dwelling in two bodies' అనే నీ మాటకి అర్ధం ఇదేకదూ?
ఇలాంటి మచ్చలేని బంధానికి కోటిరూపాలు .. భక్తి, ప్రేమ, కర్తవ్యం, దేశ భక్తి, ద్వేషం.. ఇలా ఎన్నో.. "ద్వేషమేమిటి మధ్యలో" అంటావా? వాలి, రావణుడు, కంసుడు, శిశుపాలుడు,గాడ్సే.. ఎంచుకున్న దారి అదే. గమ్యం ఏదైనా కానీ,వారు ఎంచుకున్నది మనస్పూర్తి గా నమ్మారు. సాధించారు. అది చూడు.
పుట్టడం అందరం అలాంటి మానసికస్థైర్యంతోనే పుడతాం.అంత కల్మషం లేని స్థితి నుంచి కల్లబొల్లి మాటలు, కుళ్ళు కుతంత్రాలు, ఎత్తులు, పైఎత్తులు నేర్చుకుంటాడు మనిషి. తప్పేంలేదనుకో.. ఇవల్యూషనరీ థియరీ, ఆ పై మనుగడకై పోరాటం. ఒకటేమిటి? ఈ ఝంఝాటాల్లొ పడి కొట్టుకొని విసుగొచ్చి "దేముడా! ఎందుకిలా జరుగుతోంది? సుఖం, శాంతి లేవా నా ఖాతా లో? " అని ప్రశ్నిస్తాం. ఆడదానికైతే పిల్లల్ని ఇస్తాడు. మగాడికి ఇదిగో... ఇలాంటి దీక్షలూను. ఈ రెంటికీ పోలికేమిటనకు. బోలెడు నేర్చుకోడానికి అవకాశాలు ఇవి. నేర్చుకోవడమా.. 'హమ్మయ్య..గడిపేసాం రా బాబూ!' అనుకోవడమా.. మన ఇష్టం.
మన కర్మానుసారంగానే నడుస్తాం కాని, నీకెందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే.. నువ్వు తృష్ణ ఉన్నవాడివి, యోగభ్రష్టుడివి. ఇప్పుడు నీకు దన్ను ఇవ్వడం, నీకు చెప్పాలనిపించడం కూడా నా కర్మ పరిపాకానికేనేమో. నీ వల్ల నాకేం రాసి ఉందో.. నిన్ను చూసి నేనేం నేర్చుకోవాలో.. ఏమో..! ఏ నావదేతీరమో..!
నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తాను.
నీ అనుమతి లేకుండానే ఈ ఉత్తరం నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను.
కీర్తి కండూతి అని నవ్వుకోకు. ఇదోక మైలురాయి అని అనిపించడం వల్ల మాత్రమే.
ఈ ఉత్తరం ఇంకొకరికి అర్ధం అవుతుంది, పనికి వస్తుందని మాత్రం అనుకోను.
నీకెంతవరకు సాంత్వన , ధైర్యం, జవాబు ఇచ్చిందో, ఏమిచ్చిందో నువ్వే చెప్పాలి.
పి.ఎస్.: మనం రాసుకొనే ఉత్తరాల్లో సంబోధన, సంతకం అవసరం రాకపోవడం నిజంగా వరమే తెలుసా! ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో. I hate dilemma.

Thursday, December 2, 2010
వంకాయ - వీరతాళ్ళు
కొండల్లో బంగారుకొండ మేరుపర్వతం అంటారు కదా!
అలాగే కూరల్లో రాజాకూర వంకాయని పలువురి అభిప్రాయం.
ఆ పలువురిలో నేను మొదటిదాన్ని,వంకాయనబడు శాకరాజానికి అరివీరాభిమానిని కూడా..
ఈ వంగ ప్రేమ ఈనాటిది కాదు. మా తండ్రి తాతల నుంచి సంక్రమించిన ఆస్థి. మా నాన్నగారు వంకాయకి వీరాభిమాన సంఘం స్థాపించిన మహానుభావుడు. ఆయన అదేదో ఎస్వీకృష్ణారెడ్డి సినిమాలో చూపించినట్టు ఫ్రిజ్జ్ లో వంకాయలు, బయట ఆయన బైక్ డిక్కి లో వంకాయలు ఉండగా, మూకుట్లో వేగుతున్న వంకాయల ఘుమఘుమని ఆస్వాదిస్తూ.."మణీ, ఇవాళ వంకాయ మెంతి కారం పెట్టి చేస్తానన్నావూ?"అని అతి సహజంగా ప్రశ్నించి వంకాయలు కొనడానికి బొంకుల దిబ్బకి, డిక్కీలో వంకాయలు కూరల బుట్టలోకి వంచి ఖాళీ చేసి మరీ వెళ్తూంటారు.
(బొంకులదిబ్బ అంటే మా ఊళ్ళో కూరగాయలమ్మే చోటు లెండి. దాని పుట్టు పూర్వోత్తరాలు మన వంకాయణంలో వద్దు.)
చేసిన పాపం చెప్తే పోతుందంటారు. చిన్నప్పుడు వంకాయని పెద్దగా ఇష్టపడే దాన్ని కాదు. అప్పట్లో నాతో మా నాన్నగారు అనేవారు "భానుమతి పాట, వంకాయ కూర ఆస్వాదించాలంటే ఓ వయసు రావాలే" అని. "భానుమతి ముందు నచ్చిందా.. వంకాయని ముందు ప్రేమించావా?" అని నన్ను యక్షప్రశ్నలు వెయ్యవద్దని మనవి. నాకు వయసొచ్చేసింది. ఓ శుభ ముహూర్తంలో వంకాయతో ప్రేమలో బొక్క బోర్లా పడిపోయా.
ఇహ మా తాతగారు వంకాయని మహరాణిలా చూసుకొనేవారు. పసిపాపని ప్రేమించినంతగా ప్రేమించేవారు. ఆయన బొంకుల దిబ్బకి వంకాయ కోసమే వెళ్ళేవారు, వంకాయ కొననిదే ఇంటికి వచ్చేవారు కాదనడంలో అతిశయోక్తి లేనేలేదు.
ఏ ఎస్ పీ గారని మా ఊళ్ళో ఓ గణిత ఘనాపాఠి ఉండేవారు.. ఆయన వీధిలో కనిపించిన ప్రతిసారి మా నాన్నగారిని అడుగుతుండేవారట. "ఏమోయ్.. మీ అయ్యకి వంకాయంటే మహపిచ్చేం..? జీతంలో సగం పెట్టి వంకాయలే కొంటున్నాడురా..మీ అమ్మ తిట్టదా?" అని. ఆ వెర్రి బ్రాహ్మడికేం తెలుసు మా నాయనమ్మ కూడా వంగ ప్రేమికురాలేనని. అదొక్కటే ఆ దంపతులకి నిర్వివాదాంశమని.
ఏ ఎస్ పీ గారికి కొరుకుడుపడని ఇంకో లెక్కేమిటంటే..కాకరకాయలు , బెండకాయలు, కొత్తిమీర, కరివేపాకు,అల్లం, పచ్చిమిర్చి కూడా కొనేసాక అప్పుదు వంకాయలు కొనేవారు మా తాతగారు. ఇందులో సూక్ష్మమేమిట్రా అంటే.. ఆయన కొనే తెల్లటి పెద్ద పెద్ద పచ్చడి వంకాయలని వైరు బుట్టలో మిగిలిన కూరల పోగు మీద ముచికలు కిందకి, తల పైకి ఉండేలా గుచ్చి అసలు నలగకుండా ఇంటికి చేర్చేవారు. అంత ప్రేమ వంకాయంటే ఆయనకి.
అలా సంక్రమించిన పుట్టింటి సదాచారాన్ని భక్తి శ్రధ్ధలతో పుణికిపుచ్చుకొని, నేను సైతం అమెరికాలో దొరికే పలురకాల వంకాయలు యధాశక్తి కొంటూ, వండి వడ్డిస్తూ, తిని తరిస్తున్నాను.
విహారి ని వీలైతే ఓ మాంఛి ఇటాలియన్ పిల్లని వెతుక్కోమని చెప్పాలి. వాళ్ళొక్కళ్ళకే వంకాయంటే కాస్త భక్తి ఉంది. వాళ్ళ ఎగ్ ప్లాంట్ పర్మెసాన్ మన వంకాయ-కారం పెట్టిన కూరంత బావుండకపోయినా, వంకాయ బజ్జీల్లా బాగానే ఉంటుంది. కనీసం వంకాయతో ఓ క్లాసిక్ ఉండి ఏడ్చిందిగా వాళ్ళ జీవితాలకి. సంబంధం కలుపుకోవచ్చు. ఏమంటారు? వంగదేశమనే పేరు చూసి బెంగాలీ పిల్ల బుట్టలో పడనివ్వనండోయ్. అది వంకాయని కాస్తా "బంకాయ" అనేసిందా.. నా మనసు కకావికలం అయిపోతుంది.
అసలు వంకాయ-టమాటో కూర చిరంజీవి - రాధ కాంబినేషన్ లాంటిదని మహ ముచ్చటపడ్డాడో వంకాయ ప్రియుడు. .. వంకాయ-కొత్తిమీర కారం "అబ్బబ్బబ్బో.. " అని ఆనందభాష్పాలు రాల్చనిదెవరు? వంకాయకి ఉండే సహజమైన, సున్నితమైన రుచి కాస్తా పులుసులో పడి ఏమారిపోతోందే అనిపించినా.. మా అత్తగారు వండే వంకాయ పులుసు కూర కూడా బ్రహ్మాండమే సుమా!
గొప్ప మా అత్తగారిది కాదు. ఆవిడ వండిన లేత వంకాయది.
Subscribe to:
Posts (Atom)