క్షీర సాగరాన్ని ఒళ్ళు పులిసిపోయేలా మథనం చేసిన దానవులకే దిక్కులేదు. ఇక అమృతం గురించి మనం ఆశించడం, సావిత్రిని దగ్గర నుంచి ఓ సారి చూడాలనుకోవడం లాంటిది. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారి పక్కింట్లో పుట్టాలనుకోవడంలాంటిదీను. అతిఅత్యాశ. 'దేవతలకి సాటి కాకపోవచ్చు కాని రాక్షసులకి తీసిపోయామా?' అని నన్ను వివాదంలోకి లాగొద్దు దయచేసి. సరిలేరు మనకెవ్వరూ! ఏదైనా వస్తువు/విషయం దొరకలేదా? అయితే పోరాడి సాధించాలి. లేదా మరిచిపోవాలి. కాని మధ్యే మార్గం ఇంకొకటుందని మనుష్య జాతే కనిపెట్టింది. అదే విశ్వామిత్ర సృష్టి.
"అమృతం సరిపడా లేదు. వెళ్ళండహో.." అని జగన్మోహిని డిక్లేర్ చేసేసాక, ఆశ చావని మన పూర్వీకుడొకడు పొంచి ఉండి, అమృతం లక్షణాలన్ని గమనించాడు. బంగారు భాండం లోంచి నేరుగా దేవతల దోసిళ్ళలోకి వెళ్ళిపోవడం వల్ల రంగు, వాసన కనిపెట్టగలిగే అవకాశం లేకపోయింది కాని, తాగాక దేవతల మొహం చూసి దాని శక్తి ఎంతటిదో తెలుసుకున్నాడు.
తన సువాసనతో కళ్ళని అరమోడ్పులు గావించగలిగేది. నాలికకి తగులుతూనే నరనరాలను ఉత్తేజపరచగలిగేది. గొంతు దిగడమే ముఖ పద్మాన్ని వికసింపజేసి, మన తలకాయ వెనుక విష్ణుచక్రం వెలిగించినంత తేజస్సు, చైతన్యంకలిగించేది. కడుపులో చేరి ఆగిపోకుండా తన శక్తిని ఆక్సిజన్ లా, దావానలంలా మిగతా శరీరభాగాలకు అందించేది. తన పరోక్షమున , 'పత్రమున దాగిన అగ్నిశిఖవోలే' దాగని విరహబాధని కలిగింపజేసేది. ఎదురుచూపుల చివర, కనుపట్టిన క్షణాన మహా వీర గొప్పానందం కలిగింపజేసేది. ఆదుర్దా, అపనమ్మకం, తలనొప్పి ఇలాంటి కంటికి కనిపించని రోగాలెన్నోకుదిర్చేది. "జయమ్ము తథ్యమని" ఏ వెర్రి కుంకనైనా నమ్మించి, కదనరంగాన దూకేలా చేసే శక్తి ఉన్నది అమృతమని తెలుసుకున్నాడు. కాస్త ఇటూ అటూ గా అంతే మహత్తరమైన ద్రవాన్ని తయారుచేసి "కాఫీ" అని నామకరణ సంస్కారం జరిపించి, విందులో అందరికి తలా చెంబెడు కాఫీ పోసాడు.
ఇథియోపియాలో పుట్టిందని చెప్పబడుతున్న ఈ ద్రవరాజం కాకి లాంటిది - నిద్రను పోగొడుతుంది. గాలి లాంటిది - ప్రాణ శక్తి ని నింపుతుంది. పెళ్ళాం లాంటిది. లేని వాళ్ళూ బతుకుతారు. కాని ఉన్నవాళ్ళు కాస్త సుఖంగా బతుకుతారు. ఇదిగో, ఫెమినిజం అనకండి మళ్ళీ. ప్రతిదానిలోను సాధకబాధకాలుంటాయ్. ఒప్పుకుంటాను. డికాషన్ చక్కగా కుదిరి, సరైన పాళ్ళలో పాలు, పంచదార పడి, వేడి గా పొగలు కక్కుతూ, చూడచక్కని శుభ్రమైన పాత్రలో అందించబడ్డ కాఫీ, సీతమ్మ వారంత అనుకూలవతి అయిన భార్య. శూర్పనఖ మీకు తెలుసు.
కాఫీ - అందలి రకాలు, గుణగణాదులు, మంచి చెడులు చెప్పడం నా వ్యాపారం కాదు. నేను చెప్పేదంతా నా 'కప్ ఆఫ్ కాఫీ' గురించే. నాయనమ్మ కాలంలో కాఫీ కంచు గ్లాసులతో తాగేవారట. కాఫీగత ప్రాణులకి సమయానికి కాఫీ అందకపోతేనో, అందిన ద్రవం కాఫీని పోలకపోతేనో ఆ గ్లాసులు ఎగిరి, నభోమండలానికి చేరి, గ్రహశకలంలా జారి కాఫీ ఇచ్చిన వారికి ప్రాణహాని తలపెడుతూ ఉండేవట. దక్కిందే ప్రాణం, తొక్కిందే నక్క అని స్టీలు గ్లాసుల లోకి మారిపోయారట. చెప్పొద్దూ! అందం అంటే - పొగలు కక్కే ఫిల్టర్ కాఫీని నింపుకొని, సరిపడిన స్టీలు కప్పులో ఠీవిగా నిలబడిన తళతళ్ళాడే స్టైన్ లెస్ స్టీలు గ్లాసుదే.
చేతికి గాజుల్లా, కళ్ళకు కాటుకలా,
నుదుటికి తిలకంలా, కాఫీకి స్టీల్ గ్లాసూ..
నేను నమ్మిన నిజాలు చెప్పనా? ఆంజనేయుడు, భీముడు, కోడిరామ్మూర్తి పెద్దయ్యాక కాఫీ తాగిన దాఖలాలు ఉన్నాయో, లేదో నాకు తెలియదు కాని, వారి వారి తల్లులు ఉగ్గులో కాఫీ పోసి ఉంటారు ఖచ్చితంగా. కుంభకర్ణుడిని నిద్ర లేపాల్సిన క్షణానికి లంకలో కాఫీ నిండుకొని, పాపం అంత ప్రయాసపడి ఉంటారు. రంభా ఊర్వశులకి పూలహారాలు ఇచ్చేబదులు, పొగలు కక్కే కాఫీ ఎదురుగా పెట్టి నాట్యపోటీ పెట్టవలసింది విక్రమార్కుడు. కాఫీ చల్లారిపోతోందని తొందరగా నాట్యం ముగించి వచ్చిన వాళ్ళకి, నాట్యం మీద శ్రధ్ధ లేనట్టేగా!నలభీమ పాకంలోను, గంధర్వ గానంలోను, మన్మధ బాణంలోను, కృష్ణుడి అతిమానుష చేష్టల్లోను, ఐన్ స్టీన్, రామానుజంల తెలివిలోను సీక్రెట్ ఇంగ్రేడియంట్ కెఫిన్ అని నా గాఢమైన అనుమానం. అంటే వాళ్ళు రోజూ లోటాల లెక్కన కాఫీ తాగేవారని కాదు. అవసరమైనప్పుడు వారు వాడుకున్న ఆపద్బాంధవి కాఫీయేనేమో అని. చెడు పర్యవసానాలు పెద్దగా లేని, సత్ఫలితం ఉన్న ఉత్ప్రేరకం 'కెఫిన్' మాత్రమే మరి.
'వెయ్యేల? అసలు ప్రపంచంలో మనుషులని రెండు రకాలుగా విభజించెయ్.. కాఫీ తాగే వాళ్ళు, తాగని వాళ్ళు 'అని విసుక్కుంటారేమో! అమ్మమ్మమ్మా, అలా ఎలా కుదురుతుంది! కాఫీ పరంగా మనుషులు రెండు రకాలు. దానికి న్యాయం చేసే వాళ్ళు, అన్యాయం చేసే వాళ్ళు.
కాఫీ తాగాలి కాబట్టి తాగే వాళ్ళు, ఎలా ఉన్నా తాగేసే వాళ్ళు, కాఫీ పేర రకరకాల ద్రావకాలు తయారు చేసేవాళ్ళు, మా ఇంట్లో కాఫీ తాగమని బలవంతం చేసే వాళ్ళు రెండో రకం. కాఫీ అనే మాట సమ్మోహనమైన శబ్దాల్లో ఒకటని నమ్మే వాళ్ళు, తాగిన ప్రతి కప్పు కాఫీని ప్రేమించేవారు, కాఫీ పొడి, వేడి నీళ్ళలోంచి చిక్కటి డికాషన్ ని ఫిల్టర్ లోంచి "లిక్విడ్ ఏంజల్స్" ని దింపినట్టు దింపే నైపుణ్యం ఉన్నవాళ్ళు, స్వర్గం అంటే కాఫీ కప్పులో ఉంటుందని నమ్మేవాళ్ళు, కక్కుర్తికి, బలవంతానికి లొంగని నిష్ఠాగరిష్ఠులే కాఫీకి న్యాయం చేసే పుణ్యాత్ములు. ఇక తాగని వాళ్ళు ఏ వర్గానికి చెందుతారో నేనెప్పుడూ అలోచించలేదు. రెండో రకంలో వేయడానికి నాకేం అభ్యంతరం లేదు కూడా! మా అత్తగారు చెప్పే ఓ సామెత గుర్తొస్తోంది నాకు. చెప్పేదయితే చెప్పేదాన్నిగా. గుర్తొచ్చిందన్నానంతే!
న్యూయార్క్ లో "ది పల్ప్ అండ్ ది బీన్" అనే కాఫీ షాప్ లో పది షాట్స్ ఎస్ప్రెస్సోని, 20 ఔన్సుల కప్ లో " పోర్న్ ఇన్ ఏ కప్" ముద్దు పేరుతో అమ్ముతున్నారట. మెను లో పేరు 'డెసి' అయినా సరే ఈ ముద్దుపేరెందుకయ్యా అంటే, ఈ కాఫీని సేవించడం ,కాఫీ ప్రియులు మాత్రమే చెయ్యగలిగిన సాహసమట. అంత కెఫిన్ తాగితే నేను రాకెట్ లా దూసుకుపోతానేమో న్యూయార్క్ వీధుల్లో. దీనిని నలభై ఏళ్ళ పైబడిన వారికి అమ్మరటండోయ్. నాకెంత సమయం ఉందంటారా! యేడాదికి ఓ సారి తాగినా పది రాకెట్ లు వదలచ్చు నేను. హ్హహ్హహ్హా..
ఓ దేవ రహస్యం చెప్పనా? నాకు కాఫీ అంటే ఇంత ప్రీతి ఉందని ఎవరితోను చెప్పను. ఎవరడిగినా అలవాటులేదని చెప్తాను. ఎందుకంటే నా కాఫీకి కర్త , క్రియ నేనే అవ్వాలి. ఇక నా పుస్తకం, నా కాఫీ పంచుకోవలసిన పరిస్థితే వస్తే , నేను అవతారం చాలించే రోజు వచ్చేసినట్టే.
*మొత్తం ముప్పైనాలుగు కాఫీలు. లెక్క చూసుకోండి. (తక్కువైతే నేను తాగేసినట్టే.)
హ హ బాగున్నాయి అమృతం విశేషాలు !
ReplyDeleteఎందుకంటే నా కాఫీకి కర్త , క్రియ నేనే అవ్వాలి. ఇక నా పుస్తకం, నా కాఫీ పంచుకోవలసిన పరిస్థితే వస్తే
------------------------
అదేటండి అలా అనేసారు ఏమో కదా వేరే వాళ్ళు మీ కన్నా బాగా చెయ్యొచ్చేమో :)
Brilliant!
ReplyDeleteUnfortunately, coffee is not my cup of tea :(
http://vasundhararam.wordpress.com/2007/08/17/%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%82-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B0%BE%E0%B0%AB%E0%B1%80-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF/
ReplyDeleteతోటి 'కాఫీప్రియ 'ని పరిచయం చేసినందుకు, ఎగిరి గెంతులేస్తూ ధన్యవాదములు. :) మరి ఈ ఇంతి ఇంటి కాఫీ, ఆ ఇంట్లో రుచి చూపించారా?
ReplyDeleteచాలా కాలం తర్వాత లేఖిని తీసి మీకోసం వ్యాఖ్య రాస్తున్నాను. మరుగున పడిపోయిన నా బ్లాగు కి వచ్చి అద్భుతమైన వ్యాఖ్య రాసిన మీకు మరియు నా బ్లాగు ను మీకు పరిచయం చేసిన వూకదంపుడు గారికి అనేక ధన్యవాదములు. మీరు వ్రాసిన కాఫీ కధ చదివితే 20 షాట్స్ ఎస్ప్ర్రెస్సో (ESPRESSO) తాగిన కిక్ వచ్చింది. పైగా కాఫీ కోసం తపించి జపించే వారు మరొకరున్నరానే సంతోషం నన్ను ఈ రాత్రి నిద్రపోనివ్వదేమో..అమృతం కురిసిన రాత్రి లా ఈ వేళ నాపై కాఫీ వాన కురిసి నన్ను మళ్ళీ భావోద్వేగానికి గురిచేసింది. తెలుగు బ్లాగుల లోకం లో మళ్ళీ విహరించాలి చాలా కాలమైంది. ప్రస్తుతం నా కవల పిల్లలతో కాఫీ కూడా తాగే తీరికలేనంతగా మునిగి తేలుతున్నాను.
ReplyDelete'ఊకదంపుడు గారికి ' పెద్ద గ్లాసెడు చిక్కని కాఫీ బాకీ నేనూ,వసుంధరా. :)
ReplyDeleteహబ్బ కా ఆ ఆ ఆ ఫీ ఈ ఈ ఈ ఆ పేరు వింటేనే బోర్ కొడుతుంది నాకు. :(
ReplyDeleteకానీ బాగా రాసావే!
coffe is not my cup of tea...కొత్తపాళీగారూ ఇది నా డవిలాగు. నేనెప్పుడూ మ స్నేహితుల దగ్గర వాడుతుంటా. మీరు కూడా నా పార్టీనేనన్నమాట. :)
సౌమ్యా, నచ్చిందా.. సంతోషం.
ReplyDeleteనీలా కాఫీ నచ్చనివాళ్ళని "కాఫీ కి న్యాయం చేసే వాళ్ళ" సరసన ఎందుకు చేర్చానో అర్ధం అయిందా? ఓ సామెత గుర్తు రావాలే నీకిప్పుడు! రాకపోతే ఛాటింగ్ లో చెప్పుకుందాం.. ఏం?
అవునండీ కాఫీ విషయం పక్కన పెడితే, ఎకవుంటేంట్ నయినా..ముప్పయి నాలుగు, పదీ
ReplyDeleteలెక్క తెలీలేదు..తేలలేదు .సారీ...
@ ఎకవుంటెంటు గారు..మరే! 'పది ' నా వయసుకి దారి. 'కాఫీలు ' పోస్టులో మొత్తం కాఫీలూను.
ReplyDeleteమొత్తం ముప్పై ఆరు. రెండు తాగేసినట్టున్నారు. ఆ అమృతం ఆ పాలతోనే. వెధవది ఎలా చేసినా ఇక్కడి పాలల్లో ఏదో లోపం. ఇంకా చేసేదిలేక రెడ్ బుల్ తాగి బతుకుతున్నా..
ReplyDeleteఅవునండీ, ఆరోజే పుచ్చుకింటిని వాయినం :)
ReplyDeleteనాకు బ్రహ్మానందమైంది కూడానూ... ఈ కాఫీ తాగని వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే ఒక కంఠం ఇక్కడ ఉందని ... అది మీరనీ... :)
కాఫీ...ఆ పదవే భలే నచ్చేస్తుంది నాకు...
ReplyDeleteఅది లేకపోతే బతకలేకపోవటం లేదు కానీ అదొక pleasure trip లా అప్పుడప్పుడూ తాగుతూ వుంటా...
మొత్తానికి బావున్నాయి అమృతం కబుర్లు
మంచి కాఫీ లాంటి టపా :)
ReplyDeleteమా తాతమ్మ గారు, కాఫీ గింజలను బంగారం కన్నా జాగ్రత్తగా దాచుకొనేవారుట. వాటిని పొడిగొట్టి ఒక బట్టలో వుంచి ఉడకబెట్టి, డికాషన్ తయారు చేసేవారుట.
ఆహా ఏమి రుచి, అనమా మైమరచి.
ReplyDelete