Thursday, December 2, 2010

వంకాయ - వీరతాళ్ళు


కొండల్లో బంగారుకొండ మేరుపర్వతం అంటారు కదా!
అలాగే కూరల్లో రాజాకూర వంకాయని పలువురి అభిప్రాయం.
ఆ పలువురిలో నేను మొదటిదాన్ని,వంకాయనబడు శాకరాజానికి అరివీరాభిమానిని కూడా..

ఈ వంగ ప్రేమ ఈనాటిది కాదు. మా తండ్రి తాతల నుంచి సంక్రమించిన ఆస్థి. మా నాన్నగారు వంకాయకి వీరాభిమాన సంఘం స్థాపించిన మహానుభావుడు. ఆయన అదేదో ఎస్వీకృష్ణారెడ్డి సినిమాలో చూపించినట్టు ఫ్రిజ్జ్ లో వంకాయలు, బయట ఆయన బైక్ డిక్కి లో వంకాయలు ఉండగా, మూకుట్లో వేగుతున్న వంకాయల ఘుమఘుమని ఆస్వాదిస్తూ.."మణీ, ఇవాళ వంకాయ మెంతి కారం పెట్టి చేస్తానన్నావూ?"అని అతి సహజంగా ప్రశ్నించి వంకాయలు కొనడానికి బొంకుల దిబ్బకి, డిక్కీలో వంకాయలు కూరల బుట్టలోకి వంచి ఖాళీ చేసి మరీ వెళ్తూంటారు.
(బొంకులదిబ్బ అంటే మా ఊళ్ళో కూరగాయలమ్మే చోటు లెండి. దాని పుట్టు పూర్వోత్తరాలు మన వంకాయణంలో వద్దు.)

చేసిన పాపం చెప్తే పోతుందంటారు. చిన్నప్పుడు వంకాయని పెద్దగా ఇష్టపడే దాన్ని కాదు. అప్పట్లో నాతో మా నాన్నగారు అనేవారు "భానుమతి పాట, వంకాయ కూర ఆస్వాదించాలంటే ఓ వయసు రావాలే" అని.  "భానుమతి ముందు నచ్చిందా.. వంకాయని ముందు ప్రేమించావా?" అని నన్ను యక్షప్రశ్నలు వెయ్యవద్దని మనవి. నాకు వయసొచ్చేసింది. ఓ శుభ ముహూర్తంలో వంకాయతో ప్రేమలో బొక్క బోర్లా పడిపోయా.

ఇహ మా తాతగారు వంకాయని మహరాణిలా చూసుకొనేవారు. పసిపాపని ప్రేమించినంతగా ప్రేమించేవారు. ఆయన బొంకుల దిబ్బకి వంకాయ కోసమే వెళ్ళేవారు, వంకాయ కొననిదే ఇంటికి వచ్చేవారు కాదనడంలో అతిశయోక్తి లేనేలేదు.

ఏ ఎస్ పీ గారని మా ఊళ్ళో ఓ గణిత ఘనాపాఠి ఉండేవారు.. ఆయన వీధిలో కనిపించిన ప్రతిసారి మా నాన్నగారిని అడుగుతుండేవారట. "ఏమోయ్.. మీ అయ్యకి వంకాయంటే మహపిచ్చేం..? జీతంలో సగం పెట్టి వంకాయలే కొంటున్నాడురా..మీ అమ్మ తిట్టదా?" అని. ఆ వెర్రి బ్రాహ్మడికేం తెలుసు మా నాయనమ్మ కూడా వంగ ప్రేమికురాలేనని. అదొక్కటే ఆ దంపతులకి నిర్వివాదాంశమని.

ఏ ఎస్ పీ గారికి కొరుకుడుపడని ఇంకో లెక్కేమిటంటే..కాకరకాయలు , బెండకాయలు, కొత్తిమీర, కరివేపాకు,అల్లం, పచ్చిమిర్చి కూడా కొనేసాక అప్పుదు వంకాయలు కొనేవారు మా తాతగారు. ఇందులో సూక్ష్మమేమిట్రా అంటే.. ఆయన కొనే తెల్లటి పెద్ద పెద్ద పచ్చడి వంకాయలని వైరు బుట్టలో మిగిలిన కూరల పోగు మీద ముచికలు కిందకి, తల పైకి ఉండేలా గుచ్చి అసలు నలగకుండా ఇంటికి చేర్చేవారు. అంత ప్రేమ వంకాయంటే ఆయనకి.

అలా సంక్రమించిన పుట్టింటి సదాచారాన్ని భక్తి శ్రధ్ధలతో పుణికిపుచ్చుకొని, నేను సైతం అమెరికాలో దొరికే పలురకాల వంకాయలు యధాశక్తి కొంటూ, వండి వడ్డిస్తూ, తిని తరిస్తున్నాను.

విహారి ని వీలైతే ఓ మాంఛి ఇటాలియన్ పిల్లని వెతుక్కోమని చెప్పాలి. వాళ్ళొక్కళ్ళకే వంకాయంటే కాస్త భక్తి ఉంది. వాళ్ళ ఎగ్ ప్లాంట్ పర్మెసాన్ మన వంకాయ-కారం పెట్టిన కూరంత బావుండకపోయినా, వంకాయ బజ్జీల్లా బాగానే ఉంటుంది. కనీసం వంకాయతో ఓ క్లాసిక్ ఉండి ఏడ్చిందిగా వాళ్ళ జీవితాలకి. సంబంధం కలుపుకోవచ్చు. ఏమంటారు?  వంగదేశమనే పేరు చూసి బెంగాలీ పిల్ల బుట్టలో పడనివ్వనండోయ్. అది వంకాయని కాస్తా "బంకాయ" అనేసిందా.. నా మనసు కకావికలం అయిపోతుంది.

అసలు వంకాయ-టమాటో కూర చిరంజీవి - రాధ కాంబినేషన్ లాంటిదని మహ ముచ్చటపడ్డాడో వంకాయ ప్రియుడు. .. వంకాయ-కొత్తిమీర కారం "అబ్బబ్బబ్బో.. " అని ఆనందభాష్పాలు  రాల్చనిదెవరు? వంకాయకి ఉండే సహజమైన, సున్నితమైన రుచి కాస్తా పులుసులో పడి ఏమారిపోతోందే అనిపించినా.. మా అత్తగారు వండే వంకాయ పులుసు కూర కూడా బ్రహ్మాండమే సుమా!
గొప్ప మా అత్తగారిది కాదు. ఆవిడ వండిన లేత వంకాయది.

14 comments:

 1. Idi chadivaka, enno mahavankayalu, annitiki vandanamulu analani anipistundi. Sehabhaash adirindi!!

  ReplyDelete
 2. Saardhaka naamadheyamu vankaya, "ONE"kay.. ippatiki eppatiki Vankay Number one :)

  ReplyDelete
 3. Wonderful. I am a great fan of "vankaya". :)

  ReplyDelete
 4. nktr saya

  vankaya vanti kuru kalade lankapathi vairi vanti.......
  eppudo mana peddalu chepperu

  I am the biggest fan of vankaya kothimiri karam.

  ReplyDelete
 5. Idi Naa kadha... Raasina Vallaki thanks.. Maa aavida peru Mani. Naaku Kottimeera Kaaraaram Pettina Vankaayante Istam..

  NKTR

  ReplyDelete
 6. Mee attagaariki urgent gaa oka laptop gift ivvalanundi naaku... :)

  ReplyDelete
 7. గుత్తి వంకాయని గురుతు చేయడం మరిచారు. ఈ మధ్యే అఖండాఖిల వంకాయ సారస్వత సమితి" అని మహా గొప్ప సమితి స్థాపించారు. వంకాయని టమాటాతో కలపాలా, ఆలు గడ్డ లతో కలపాలా, గుత్తి వంకాయ చేయాలా అని అందరూ కొట్టుకుని ఆఖరుకి ఏకాభిప్రాయం కుదరక ఎవరి వంకాయల్ని వారే వండుకున్దామని సమితిని భూస్థాపితం చేసారు. మళ్ళీ ఈ సమితి ఎక్కడుందని వెతికేరు. ఏదో మాట వరసకి అన్న..

  ReplyDelete
 8. నేను కూడా వంకాయకి వీరాతి వీర అభిమానిని. వంకాయతో చేసినన్ని రకరకాల కూరలు, రుచులు మరే కూరగాయతో కుదరవు. అందుకే అన్నారు
  వంకాయను ప్రేమించుమన్నా
  రుచుల బేధం తెలుసుకోరన్నా.

  జైజై వంకాయ

  ReplyDelete
 9. అది వంకాయని కాస్తా "బంకాయ" అనేసిందా.. నా మనసు కకావికలం అయిపోతుంది.

  -------------------------
  lolz

  ReplyDelete
 10. kompa deesi meedi vijayanagaramaa??

  naa puttinooroo ade!

  ReplyDelete
 11. @ అపర్ణ గారు,
  అవునండీ! నేను, ఆ.సౌమ్య (వివాహభోజనంబు మాయా శశిరేఖ) ఇద్దరం విజయనగరం వాళ్ళమే.

  ReplyDelete
 12. Excellent. Maa intlo maa naannagariki vankayalantey bahu ishtam....naakkoodaa anukondi! Mee blog raase Teri adbhutam ANSI!

  ReplyDelete
 13. ఇది నేను మిస్ అయ్యానే...నాకు వంకాయ ఆంటే మహా ప్రాణం. మీ కుటుంబంలో లాగే మా కుటుంబంలోనూ వంకాయ అభిమాన సంఘాలున్నాయి.

  మా పెద్దనాన్నగారు MRcolleg లో economics లెక్చరర్. ఆయనకి వంకాయ ఆరోప్రాణం. పాఠం చెబుతూ ఏ ఉదాహరణ చెప్పాలన్నా వంకాయని వాడేవారుట అందుకని ఆయనకి వంకాయ మేషారని పేరు.

  నాకూ ఇంచుమించు అంతే ప్రాణం. వంకాయ కన్నా ఎక్కువ ఇష్టమైనది బీరకాయ. శ్రీకృష్ణుడుకి రుక్మిణి పై ప్రేమ, గౌరవం ఉన్నా సత్య అంటే మక్కువ ఉన్నటు నాకు బీరకాయ పట్టపురాణి అయినా వంకాయ అంటే మక్కువ. :)

  ReplyDelete
 14. వంకాయవంటి కూరయు
  పంకజముఖి సీతవంటి భామామణియున్
  శంకరుని వంటి దైవము
  లంకేశుని వైరి వంటి రాజును గలరే

  ఒకరకంగా నన్ను వెంటనే పట్టేసిన చాటువులలో ఒకటి.

  ReplyDelete