Showing posts with label ధనుర్మాసం. Show all posts
Showing posts with label ధనుర్మాసం. Show all posts

Monday, December 21, 2020

మంచి వెన్నెలవేళ

కార్తీక మార్గశిరాలు నాపేరన గుత్తి కట్టేసుకోవాలనిపించేంత అరుదైన జ్ఞాపకాలూ, అనుభవాలూ ఉన్నాయీ కాలంలో! 

దాదాపు పదేళ్ల క్రితం మార్గశీర్షంలో అనాలోచితంగా మొదలుపెట్టి రాసుకున్న  నెల్లాళ్ళ తిరుప్పావై కథా కుసుమాలు నా ప్రయాణంలో ఒక మైలురాయి. అయితే ఈ రాతల్లో నాదంటూ ఏమీ లేదు. మహానుభావుల కవిత్వానికి నా పైత్యం జోడించి అల్లినవే.  మున్నుడి నుండీ ముగింపు దాకా మెరిసిన వాక్యాలన్నీ  పురాకవిత్వం నాలో ఇంకి ప్రతిఫలించిన వెలుగులైతే, ఓగులన్నీ అచ్చంగా భవదీయురాలివి. 

"అరసికాయ కవితా నివేదనం శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ"  అని వాపోతాడో కవి. రసజ్ఞత లేనిచోట మాట్లాడవలసిన గతి పట్టించవద్దని బ్రహ్మకే మొరపెట్టుకోవడమన్నమాట. నా భాగ్యానికి అచ్చంగా నాదైన బ్లాగు ముంగిట్లోకొచ్చి చదివి వెళ్లే రసజ్ఞులైన అతిథులూ, సద్విమర్శకులూ దొరికారు. గొప్ప నేస్తాలు కుదిరాయి. 

అప్పటి తిరుప్పావై కథలని ఈ మార్గశిరంలో కూర్చి మాలకట్టే ప్రయత్నం చేసాను. e-book రూపంలో కాస్త ముస్తాబు చేసాను. ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

అడగగానే కవర్ పేజీ కోసం నా బాల్యమే రూపుకట్టినట్టున్న బొమ్మనిచ్చిన శ్రీ కేశవ్ వెంకటరాఘవన్ గారికి శిరసా నమస్సులు. కన్నయ్య కథలంటూ మురిసి తన బ్లాగులో అతిథిగౌరవమిచ్చిన వేణూ శ్రీకాంత్ గారికీ, పుస్తకం పని ఎందాకా వచ్చిందని నన్నంటిపెట్టుకుని ఆసక్తిగా ఎదురుచూసిన వంశీకృష్ణకీ, శ్రీనిధికీ ప్రేమపూర్వక ధన్యవాదాలు.  

జీవనమాధుర్యమే తానైన మురళీ మనోహరునికి ఏమివ్వగలను! కృష్ణార్పణం. 


Tuesday, December 17, 2013

రాజహంస - ౨

నేలపై పారాడుతూ వెతుకుతోంది ఇళై. ప్రాతస్సంధ్యావందనం పూర్తి చేసుకుని, దేవతార్చన మందిరానికి అటుగా వెళ్తున్న కులశేఖరుడు కుమార్తెని చూసి ఆగాడు. దీక్షగా మూలమూలలా వెతుకుతోందా అమ్మాయి.

"ఏం వెతుకుతున్నావమ్మా?"
"ఉహూ.."
"నాకు చెప్పు.. నేనూ వెతుకుతాను." తానూ మోకాళ్ళమీద కూర్చుని పచ్చలు తాపడం చేసిన నేలపై ప్రతిఫలిస్తున్న ఆ చిన్నారి మోముని చూసి మురుసుకుంటూ అడిగాడు.
"ఉహూ..."
"ఏవిటమ్మా?"

లేచి నిలబడింది. ఇంకా ఆమె కళ్ళు నేలని వెతుకుతూనే ఉన్నాయి. కులశేఖరుడు ఆమెనే చూస్తున్నాడు.

"నిన్న సాయంత్రం రంగడికి బొమ్మల పెళ్ళి చేసి మేనా ఇలా తీసుకొచ్చాం నాన్నగారూ. పవళింపు వేళ చూద్దును కదా.. స్వామి తురాయి కనిపించలేదు. ఎక్కడ పడిపోయిందా అని నిన్నటి నుంచీ ఈ దారంతా వెతుకుతున్నాను."
"తురాయి కోసమా!"
"అదేమీ అలాంటిలాంటిది కాదు."
"పరవాలేదు. ఇంకోటి చేయిద్దాం కదా!"
"అదేమీ మామూలుది కాదు.. " ఇళై మొహంలో బోలెడు విచారం. కులశేఖరుడి మనసు నొచ్చుకుంది.
"పోనీ కాస్త తెల్లారాక చూద్దాం."
"..."
"ఏవిటమ్మా అంత గొప్పదనం! " లాలనగా అడిగాడు.
"శ్రీరంగం నుంచి వచ్చిన భట్టరు గారిచ్చిన తురాయది. అక్కడ స్వామిని కల్యాణానికి అలాంటిదానితోనే ముస్తాబు చేస్తారట."
"అలాగా! అయ్యో.. వెతికిస్తాను తల్లీ. దొరుకుతుందిలే. లేదా శ్రీరంగం నుంచే మరొకటి తెప్పిద్దాం." అనునయంగా పలికాడు.
"మరొకటి తెచ్చినా అది భట్టరుగారిచ్చినది కాదుగా!" మోము చిన్నబుచ్చుకుంది.

మాట మార్చకపోతే పిల్ల బావురుమంటుందేమో అనిపించిందతనికి. 

"అది సరే కానీ అమ్మా.. శ్రీరంగనాథుడి బొమ్మ గీస్తున్నావు కదా! పూర్తయిందా మరి?"
"ఓ.. మీ మందిరంలో పెట్టించనా?" ఉత్సాహంగా అడిగింది.
"తప్పకుండా.. కానీ బొమ్మ నాకు ఇచ్చేస్తే.. నీకు ఉండద్దూ?" ముచ్చటగా చూసుకున్నాడు బిడ్డని.
"నాకు బొమ్మెందుకు? రంగడే కావాలి." 

ఉలిక్కిపడ్డాడు. ఇళై కళ్ళు నిర్మలంగా తననే చూస్తున్నాయి. 

తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం
రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితేక్షణా

సౌశీల్యం, సౌందర్యం, నడత, కులము.. అన్నిటా రాఘవునకు తగినది వైదేహి మాత్రమే! ఇళై కనిపించలేదు ఆతని కళ్ళకి.. ఆ క్షణాన తను జనక మహరాజైపోయాడు.

దేవతార్చనవేళని సూచించే తూర్యనాదాలు కులశేఖరుని మైమరపుని చెదరగొట్టాయి.

***

"దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా.."

మేఘగంభీరంగా పలుకుతోంది కులశేఖరమహరాజు కంఠం. ముమ్మారు చప్పట్లు కొట్టి దేవతామూర్తులున్న కోయిలాళ్వార్ తలుపులు నెమ్మదిగా తెరిచాడు. చేతులు జోడించి, దీపకాంతిలో జాజ్వల్యమానంగా వెలుగుతున్న సీతారామలక్ష్మణులని తేరిపార చూసుకున్నాడు. క్షణకాలం అతని కనుబొమలు ముడివడ్డాయి. క్షణకాలం మాత్రమే..

"నవరత్నమాల కనిపించడం లేదా!!" అమాత్యులు ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు.
"రాముని మెడలో ఆభరణం కనిపించకపోవడమే చిత్రంగా ఉంది!"
"నెమ్మదిగా అంటారేం మహారాజా! ఘోరాపచారం.. ఎలా జరిగి ఉంటుందా అని."
"ఇదేదో మాయలా ఉంది." నిట్టూర్చాడు కులశేఖరుడు.
"మాయా మంత్రమూ కాదు. ఎవరో ఇంటిదొంగల పనే!" ముక్తకంఠంతో చెప్పారు మంత్రులు.
"ఇంటిదొంగలా!!"
"అవును మహాప్రభూ.. చెప్తే మీరు కోపగించుకుంటారు కానీ.. అడ్డూ అదుపూ లేకుండా వచ్చిపోయేవారిలో ఎవరో.." 

"రామచంద్రప్రభో!" చెవులు మూసుకున్నాడు కులశేఖరుడు.

"రామ రామ!! ఎంత పొరబడ్డారు. ప్రాయశ్చిత్తం లేని పాపం సుమా నిర్దోషులని అనుమానించడం!" అతని గొంతులో ఆవేదన.
"లేదు మహారాజా.. మా మాట నిజమని నిరూపిస్తాం.. రాజమందిరంలో విడిది చేసిన భాగవతులని సోదా చేస్తే విషయం బయటపడుతుంది." మంత్రులు గట్టిగా చెప్పారు.

క్షణాల్లో బిలబిలమంటూ వచ్చిన సైనికులు స్వాములని చుట్టుముట్టి రాజు ఎదుట నిలిపారు. 

"ఇదిగో ఈ దొంగస్వాముల మూటలో దొరికింది ప్రభూ!" సేనాధిపతి చేతిలో నవరత్నమాల!

"ప్రభో! మాకే పాపం తెలియదు. కులశేఖర పెరుమాళ్.. న్యాయం కాదిది!" స్వాములు ఆక్రోశించారు.

"కళ్ళకి కనిపిస్తున్న నిజాన్ని కాదని ఎలా బుకాయిస్తారు?" మంత్రులు అక్కసుగా అడిగారు.

కులశేఖరుడు సాలోచనగా మంత్రుల వైపు చూశాడు. 

"కళ్ళకి కనిపించేదంతా నిజం కాదని నేను నిరూపిస్తాను."  క్షణకాలం యోచించి స్థిరంగా చెప్పాడు. 

***

రాజాజ్ఞ మేరకు ఓ కుండ, బుసలు కొట్టే ఓ కోడెనాగు తెప్పించబడ్డాయి. పాములవాడు ఆ కుండలో నాగుని విడిచిపెట్టి వాసెన కట్టాడు. మంత్రులు ముఖాలు చూసుకున్నారు. 

"భాగవతులు నేరం చెయ్యరని రామచంద్రప్రభువు పాదాల సాక్షిగా నమ్ముతున్నాను. నా నమ్మకం అబధ్ధమైతే... ఈ నాగు కాటు వేస్తుంది." ప్రకటించాడు కులశేఖరుడు.

మంత్రులు గుసగుసలాడుకున్నారు. కాలనాగు కాటువేయక ఏం చేస్తుందిలే అని నవ్వుకున్నారు. స్వాములవైపు గేలిగా చూశారు. ఇంతలో హాహాకారాలు మిన్నంటాయి. 

కులశేఖర మహరాజు ఆ కుండకి ఉన్న గుడ్డ విప్పి చెయ్యి పెట్టాడు! 

ఆయన పెదవులు రామనామం పలుకుతున్నాయి. ముఖం ప్రశాంతంగా ఉంది. క్షణాలు గడుస్తున్నాయి. మంత్రులు జావకారిపోతున్నారు.

మణికంకణ శింజితం వినిపించేంత నిశబ్దం. కుండలో నుండి చెయ్యి బయటకు తీశాడు. పరమాశ్చర్యం.. పాము కాటు వెయ్యలేదు! మంత్రుల శిరస్సులు వాలిపోయాయి. 

కులశేఖరుడు స్వాముల వైపు తిరిగి చేతులు జోడించాడు. 

"అపచారానికి మన్నించండి. రాముని బంటుల బంటుల పరిచారకుల బంటులకి బంటుని నేను.. మీ పాదరేణువుని."

తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య
భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ

***

ఋతువులు మారుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి. దృఢవ్రతుడికి యౌవరాజ పట్టాభిషేకమైంది. ఇక శ్రీరంగం ప్రయాణమే అని సంబరపడ్డాడు కులశేఖరుడు.

***

శ్రీరంగమెళ్ళేటి బుల్లి గోసాయీ
ఇచ్చటికి శ్రీరంగమెంత దూరమ్మూ...

అద్దాల మంటపాలాకు తోటల్లూ
అల్లదిగొ శ్రీరంగ గాలిగోపురమూ... 

ఇళై పాడుతోంది. ఆమె చేతిలో తంబురని ఆ సన్నని వేళ్ళు సుతారంగా మీటుతున్నాయి. కవాటంలోంచి వస్తున్న పిల్లతెమ్మెరలు ఆమె పాటని వినివెళ్తున్నాయి. 

"అమ్మాయీ.. శ్రీరంగమెళ్ళాలని ఉందా?" ఆర్ద్రంగా ఉంది కులశేఖరుని గొంతు.

ఇళై తలవంచుకుంది. ఆ అమ్మాయి మనసంతా శ్రీరంగనాథుడిని నింపుకుందన్న సత్యం కులశేఖరుడికి ఏనాడో తెలుసు. 

తెలవారుతూనే చాటింపు వేయించాడు. 

"శ్రీశ్రీశ్రీ కులశేఖర చక్రవర్తి శ్రీరంగ దివ్యక్షేత్రానికి వారి సుపుత్రికా సమేతంగా వెళ్తున్నారనీ.. ఇష్టమైన వారు కూడా రావచ్చనీ.." రాజ్యం నలుమూలలా చాటింపు వేయబడింది.

తమ రాజు శ్రీరంగ క్షేత్రానికి వెళ్తే ఇక వెనక్కి వచ్చేదుండదు. దృఢవ్రతుడింకా పద్దెనిమిదేళ్ళ చిరుతప్రాయంలోనే ఉన్నాడు. సువిశాలమైన చేర దేశాన్ని, సామంత దేశాలనూ సంరక్షించేంతటి సామర్ధ్యమింకా వచ్చి ఉండదని మంత్రుల అభిప్రాయం. ఉపాయం ఆలోచించారు. 

సరిగ్గా రాజుగారు ప్రయాణానికి సిధ్ధమయేసరికి ఓ మహాపండితుడు వారి శిష్యబృందంతో సహా తరలివచ్చాడు. ప్రయాణం వాయిదా పడింది.

మర్నాడూ చాటింపు వేయబడింది. మర్నాడు మరో సాధువుల గుంపు ఎదురొచ్చింది.

మూడో నాడు రామకథ గానం చేస్తూ మరొకరొచ్చారు.

ప్రతీ రోజూ దేశంలో చాటింపు వెయ్యబడుతూనే ఉంది. ఆటంకాలొస్తూనే ఉన్నాయి. ప్రతి రేయీ నిద్రపోయేముందు కులశేఖరుడు "రంగయాత్రా దినే దినే.." అని నిట్టూరుస్తూనే ఉన్నాడు.

***

ఇళై యౌవనసౌరభాలద్దుకుంటోంది. క్షణానికి ముప్పిరిగొన్న సంతోషంతో ఆ పిల్ల మోము కళకళ్ళాడుతుంది. ఇంతలోనే ఏదో చెప్పలేని బెంగతో కళవళపడుతూ ఉంటుంది. ఆటలు ఆడడం లేదు. గొంతు విప్పి పాడడం లేదు. తల్లి చూసేసరికి, చటుక్కున నీరునిండిన కళ్ళని తుడుచుకుని మామూలుగా ఉండే ప్రయత్నం చేస్తోంది. తండ్రి మోములోకి ఆమె చూడనే చూడదు. పొడిపొడిగా మాటలాడి మరలిపోతుంది.

"ఎవరు దోచుకున్నారో ఈమె మనసు?" ఇదే అంతుచిక్కని ప్రశ్న.

పలువిధాల ప్రయత్నించగా ఇష్టసఖులు గుచ్చి గుచ్చి ప్రశ్నించగా ఇళై పెదవి విప్పింది.. "రంగా..." అని.

"రంగనాథుడిని వరించిందా?!" కోటా పేటా ఏకమై ఆశ్చర్యపోయాయి. ఏమాత్రం తొణకనిది తండ్రిగారొక్కరే.

***

ఇక ప్రయాణం తప్పలేదు. ఇళై ని వెంటబెట్టుకుని సపరివారసమేతంగా ముందుగా వేంకటాచలానికి చేరారు. అటునుంచి ఆ దివ్య ధామాన్ని విడిచి పెట్టలేక పెట్టలేక శ్రీరంగానికి ప్రయాణం కట్టారు. శ్రీరంగనాథుడికి పిల్లనిచ్చి పెళ్ళి చేసేంత భాగ్యం దక్కినందుకు పరవశించిపోయాడు కులశేఖరుడు. 

సీతాకల్యాణమంత వైభవంగా జరపాలని సన్నాహాలు చేసారు. కన్యాదానసమయం ఆసన్నమైంది.

"ఇయం సీతా మమ సుతా..." అని జనకమహరాజు ఆ సీతామహాలక్ష్మి చేతిని రామచంద్రుడికి అందించినట్టు.. కులశేఖరుడు తన కుమార్తె ను 'కులశేఖర వల్లి ' అనే పేరిట కన్యాదానం చేసాడు. ఇళై కులశేఖరవల్లిగా రంగనాథుని పెండ్లాడింది.

కూతురి అత్తవారింట్లో ఎన్నాళ్ళుంటారు ఎవరైనా..? ఇక భవబంధాలొద్దనుకున్నాక.. రాజ్యానికి వెళ్ళాల్సిన పనీ లేదు. మరి ఎక్కడికెళ్ళాలి? ఏదీ కులశేఖరుడి చిరునామా?

చేరదేశాధిపతి కులశేఖరుడు.. రాజ్యాన్నీ, బంధాలనీ త్యజించి వేంకటాచలం చేరుకున్నాడు. శ్రీ వేంకటేశ్వరుడి గర్భగుడి ఎదుట నిలబడ్డాడు. 

వేయికళ్ళైనా చాలని, కోటి జన్మలు కాంచినా తనివితీరని సౌందర్యమది. ఎలా వదిలి వెళ్ళడం? ఆ ఆనందధామాన్ని ఎలా విడిచి వెళ్ళడం? సాధ్యమా? సాధ్యమేనా?

"పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాణ్బేనే.. " అని కులశేఖరుడు చేతులెత్తి కోరుకున్నాడు.

"ఇదిగో.. ఇలా నీ వాకిట మెట్టునైనా చాలు. నీ పగడాల మోవిని చూస్తూ ఉండిపోతాను." అర్ధించాడు.

కరుణించాడు పరమాత్మ. తిరుమలలో గర్భగుడి మెట్టు "కులశేఖర పడి" అయింది.

======================

ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే
తమహం శిరసా వందే రాజానం కులశేఖరం

చీకటి పడగానే పాలబువ్వ తినిపించినంత మురిపెంగా తాతగారు గరిపిన 'ముకుందమాల'... పలుకు తేనెలంటే అతిశయోక్తి కాదు. నలభై మణిపూసలు! కులశేఖర మహారాజు శ్లోకాల మాలలల్లి వేంకటేశ్వరునికి అర్పించాడట. వాటిని వల్లెవేస్తూ పొగడదండలా గుబాళించింది నా చిన్నతనమంతా. ఆ రాజు గారి కథని.. ఇలా కాస్త నా ఊహ జోడించి మీతోనూ పంచుకుందామని. 

కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం
అద్యైవ మే విశతు మానస రాజహంసః
ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే?

కృష్ణా.. ఎరనెర్రని తామరలవంటి నీ పాదాలు.. ఆ పాదసౌందర్యమనే పంజరంలో నా మానస రాజహంసని ఇప్పుడే.. తక్షణమే బంధించనీ. ప్రాణాలు ఈ గూటిలోంచి పయనమయ్యే క్షణం దాకా ఆగితే.. కఫవాతపిత్తాలు నా కంఠాన్ని మూసేస్తాయేమో! ఈ క్షణమే నిన్ను స్మరించనీ..

కృష్ణార్పణం

Monday, December 16, 2013

రాజహంస

చిరచిరలాడించే చుఱుకుటెండ. గుండిగలతో సేవకులు మోసుకొస్తున్న చల్లని నీళ్ళు ఎన్నైనా చాలడం లేదు.. ప్రాసాదం చుట్టూ వేలాడదీయబడిన వట్టివేళ్ళ చాపలపై ఇలా చల్లితే అలా ఆవిరైపోతున్నాయి. లోపలి గదులలో వట్టివేళ్ళ సువాసనలు, కవాటాలకి ఆవల వార ఏపుగా పెరిగిన మరువపు గుబాళింపులూ కలగలిసి గాలిలో తేలివస్తున్నాయి. 

రత్నపీఠం పై కూర్చున్నాడతను. ముత్యాల బాహుపురులు, రత్నకంకణాలతో విరాజిల్లుతున్న ఆతని చేతులు జోడించబడి ఉన్నాయి. చారుచక్షువులు అరమోడ్పులైపోయినాయి. ఎదురుగా కూర్చున్న ఆచార్యులవారి వైపే ఆతని దృష్టి, మనసూ లగ్నమై ఉన్నాయి.

"సువేలాద్రిపై నుంచి లంకలో ఉన్న రావణుడి మీదకి దూకాడండీ సుగ్రీవుడు.. హుమ్మని హుంకరిస్తూ రావణుడికి శృంగభంగం చేసి చక్కా వచ్చాడు. వచ్చాడా.. 'ఆహా! ఎంత గొప్ప పని చేశావూ..!" అనలేదు రామచంద్రుడు.

త్వయి కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ

'నీకేమైనా అయితే... సీతను పొంది మాత్రం నేనేం చేసుకోను!' అని విలవిల్లాడాడు. 'నీకేమైనా అయితే..' అనేది కూడా ఎంతో ఓగాత్యపు మాటలా అనిపించింది ఆయనకి. తప్పక, స్నేహితుడి దుందుడుకు పనికి గింజుకుంటూ అన్నాడు. అది స్వామీ మైత్రి అంటే!! కడవలకి కడవల నవనీతం తిన్నదేమో కృష్ణుడు.. రాముడైతే నిలువునా నవనీతమే కదూ! రూప దాక్షిణ్య మనోహరుడని అందుకే అంటారు.  

తన్మయంగా చెప్తున్నారు ఆచార్యులవారు. ద్వాదశోర్ద్వపుండ్రాలతో భాసిస్తున్న మేనూ, శ్రావ్యమైన కంఠస్వరమూ వారి పై నుండి చూపరుల దృష్టిని మరలనివ్వవు. వారు మాట్లాడితే శిశుర్వేత్తి పశుర్వేత్తి.. అంతే! ఇక కథ మొదలుపెట్టారంటే దానికి చిలవలు పలవలూ పిట్టకథలు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. వారు ఏ నవరాత్రుల్లోనో రామకథ చెప్తారంటే..  పురాణశ్రవణానికి దూరాభారమనుకోకుండా బగ్గీలూ, బండీలూ కట్టుకుని పిల్లపిల్లాద్రీ తరలి వస్తారు. 

"సత్పురుషుల మైత్రి అలా ఉంటుందన్నమాట! అంతటి మసృణిమ ఉండాలనమాట స్నేహానికి! అంత చిక్కని స్నేహం... రామసుగ్రీవులది.. జయ జయ జానకీ వల్లభా! జయ దశరథ నందనా! ఆచార్య తిరువడిగళే శరణం." పురాణ కాలక్షేపం ముగించారు ఆచార్యులవారు.

అక్కడే కాస్త దూరంలో కూర్చున్న అమాత్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకరి వైపొకరు చూసుకుని ఇవాళ్టికి గండం గడిచిందన్నట్టూ నిట్టూర్చారు. రత్నపీఠం మీద నుంచి చివాలున లేచి ఆచార్యులకి సాష్టాంగ పడ్డాడు రాజచంద్రుడు.
***

అతని పేరు కులశేఖరుడు. చేరదేశాధిపతి. తిరువంజిక్కుళం రాజధానిగా రాజ్యం చేస్తున్నాడు. తండ్రి దృఢవ్రతుడి కోరిక మేరకు  దేశాలన్నీ జయించి రాజ్యవిస్తరణ గావించిన శూరుడు. విల్లవర్, మలయర్, వానవర్, పంజువెట్టవాయర్ రాజవంశీకులందరూ ఆతని సామంతులు. అతని చేతిలో ఓడిన పాండ్యరాజు మెచ్చి పిల్లనిచ్చాడు.

అంతటి కులశేఖర మహరాజు పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళ్తే..

కృష్ణనిర్యాణమై కలి ప్రవేశించిన కొత్తలవి. ఇంకా పూర్వవాసనలు పోలేదు. ధర్మదేవత మూడోకాలు మెడ్డుతూ ఉంది. ఏతావాతా ప్రజలింకా సంతోషంగానే బ్రతుకుతున్నారు. కోళపట్టణంలో మహారాజు దృఢవ్రతుడు, నాదనాయకీ దంపతులకి 'మాసి' నెల శుక్లద్వాదశి నాడు, పునర్వసు నక్షత్రాన కుంభరాశిలో కులోద్దీపకుడు పుట్టాడు. "కులశేఖరుడ"ని నామకరణం చేశారు. జాతకర్మలు చేయించిన రాజపురోహితులు 'రాచబిడ్డ కారణ జన్ముడ'న్నారు. 

దేశాటన చేస్తూ అటుగా వచ్చాడు ఓ సాధుపుంగవుడు. బంగరు ఉయ్యాలలో బజ్జుని, చిన్ని నవ్వులు చెంగలిస్తున్న ఆ బుడతడి ముఖం చూసి అబ్బురపడ్డాడు. చిగురెర్రని పిల్లవాడి పాదాలవైపు చూశాడు. పాపడు గాల్లోకి కాళ్ళు తన్ని చేతులతో అందుకుంటున్నాడు. పాదరేఖలు ప్రస్ఫుటంగా గోచరమయ్యాయి సాధువుకి. క్షణం తీక్షణంగా చూసి తలపంకించాడు. ఏదో అవగతమై ఆయన మోమంతా నవ్వు పులుముకుంది. "వైకుంఠపురం వదిలి వచ్చావా పెనుమాణికమా.." అని నవ్వగానే చటాలున చేతులందించాడు కులశేఖరుడు. 

ఎత్తుకుని బిడ్డ చేతులని కళ్ళకద్దుకుని, రాణికి అందించి దృఢవ్రత మహరాజుతో చెప్పాడు సాధువు.. "రాజా! నీవెంతటి భాగ్యశాలివి! నీ కడుపున కారణజన్ముడు పుట్టాడు. విష్ణువక్షస్థలాన అలరారే కౌస్తుభమే నీ కులశేఖరుడు."

దృఢవ్రతుడి మేను గరిపొడిచింది. హృదయం ఉప్పొంగింది.

"మహానుభావా! ఎంత గొప్ప విషయం చెప్పారు! నా చిరంజీవి పట్ల మీ ఆశీర్వాదం ఎన్నటికీ ఇలాగే ఉండాలి. వాడు దేశాలేలాలి." అంటూ చేతులు జోడించాడు.

"శుభం! చిరంజీవి భక్తిసామ్రాజ్య చక్రవర్తి అవుతాడు." అని దీవించాడా సన్యాసి.

ఆ రాత్రి దృఢవ్రతుడి మనసు మనసులో లేదు. సుక్షత్రియ వంశాన్ని ఉద్ధరించి, రాజ్యవిస్తరణ చేసి పుత్రపౌత్రాభివృద్ధి చెయ్యాల్సిన కుమారుడు భక్తిమార్గం పట్టడమేమిటి! తెల్లారుతూనే అమాత్యులతో మంతనాలు జరిపాడు. 

"ప్రభూ! తమకు తెలియనిదేముంది. వేసే ఎరువుని బట్టే పైరు, పెంచే తీరుని బట్టే బిడ్డలు. మనకి ముందే విషయం తెలిసింది కనుక.. జాగ్రత్త పడదాం." అని ధైర్యాన్ని నూరిపోసారు. 

కులశేఖరుడు తండ్రి మనసునెరిగి వేదవేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు, సంస్కృతమూ తమిళమూ నేర్చాడు. కత్తిసాము, మల్లయుధ్ధం, అశ్వారోహణ గజారోహణాలూ, యుధ్ధవిద్యలలోనూ ఆరితేరాడు. ధనుర్విద్యా సాధన చేస్తున్న కులశేఖరుడిని చూసిన ప్రతిఒక్కరూ అలనాటి కోదండ రాముడిని చూడలేని లోటు నేడు తీరింది కదా అనుకునేవారు. 

చిననాటి నుండీ కులశేఖరుడికి రామ అన్న రెండు అక్షరాలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలూ.. గుండెచప్పుళ్ళూను. దృఢవ్రతుడు భయపడ్డట్టూ కులశేఖరుడు రాజ్యమొద్దనలేదు. రాజ్యవిస్తరణ చెయ్యననలేదు. క్షాత్రధర్మాన్ని విడనాడలేదు. రాముడు బాటే ఈ రాజు ది కూడా.. తండ్రి మాట జవదాటలేదు. చుట్టుపక్కల దేశాలన్నీ జయించి ఏకఛత్రం కిందకి తెచ్చి జనరంజకంగా పాలించనారంభించాడు. అదిగో.. ఆ సందర్భంలోనే పాండ్య రాకుమారిని పరిణయమాడాడు. ముత్యాల్లాంటి పిల్లలిద్దరు. కొడుకు పేరు మళ్ళీ దృఢవ్రతుడే. కూతురు ఇళై. 

రాజ్యమొద్దనలేదు కానీ తన భగవద్భక్తినీ, భాగవత భక్తినీ వదులుకోలేదు. ఏ వేళలో అయినా సాధువులూ, భక్తులు, పండితులూ, వైష్ణవస్వాములూ నిరభ్యంతరంగా రాజప్రాసాదంలోకి వచ్చి కులశేఖరుడిని చూడవచ్చు. అపరాత్రైనా ఎవరైనా వచ్చారని తెలిస్తే వాళ్ళ మంచీ చెడూ చూసి, వారే పుణ్యక్షేత్రాలు చూసి వచ్చారో అడిగి విశేషాలు తెలుసుకుని కానీ నిద్రపోయేవాడు కాదు. ఇది చూసి మంత్రులు భయపడుతూ ఉండేవారు. దేశాన్నేలే రాజుకి రక్షణ లేకపోతే ఎలా! కూడదని వారించారా, "అమాత్యవర్యా... రాముడున్నాడు. నా రక్షణకొచ్చిన చిక్కేమీ లేదు. వచ్చేది రాముడు పంపినవారే కదూ! అపచారం!!" అని ముక్కున వేలేసుకుని నొచ్చుకునేవారు రాజుగారు. చేసేదేముందింక! అడ్డూ ఆపూ లేకుండా వచ్చి పడే కాషాయగుడ్డల వాళ్ళనీ, నిలువు నామాల వాళ్ళనీ చూస్తే వారికి కారం రాసుకున్నట్టుండేది.

ఇది చాలదన్నట్టూ ఓ నాడేం జరిగిందంటే.. మధ్యాహ్నభోజనానికి ముందు పురాణశ్రవణం రాజుగారి రోజువారీ కార్యక్రమాల్లో ఒకటి. ఆచార్యులవారొచ్చి వెళ్తూండేవారు. రోజూ చెప్పినట్టే రామాయణంలో ఓ ఘట్టం వర్ణిస్తున్నారు. రాజుగారు శ్రధ్దగా వింటున్నారు.

"అలా సీతా లక్ష్మణసమేతంగా జనస్థానం చేరాడు రాఘవుడు. ఓనాడు దండకారణ్యంలోకి వ్యాహ్యాళికి వచ్చిన శూర్పణఖ ఆ బొమ్మరిల్లులాంటి పర్ణశాలని చూసింది. అక్కడో అందగాడిని చూసింది. అతనేమైనా సామాన్యుడా! పుంసాం మోహనరూపాయ.. అని చెప్తారు కదా! మన్మథ మన్మథుడు.. పురుషులకే మోహం కలిగించేంత సౌందర్యమాతనిది. చుప్పనాతి మనసు పడింది. నేరుగా వెళ్ళి తననేలుకోమంది. రాముడు నేను ఏకపత్నీవ్రతుడినన్నాడు. 'అల్లదిగో.. అక్కడ మా తమ్ముడున్నాడు. నాకేమీ తీసిపోడు.' అని సాగనంపాడు. లక్షణులవారేమో సాక్షాత్తూ బుసలు కొట్టే ఆదిశేషుడేనాయె.. 'హాత్తెరీ.. ' అని ముక్కూ చెవులూ కోసి పారేశాడు. పరిగెత్తుకు వెళ్ళిందయ్యా శూర్పణఖ. నేరుగా అన్నగారి దగ్గరకేమీ వెళ్ళలేదు. ముందు తన బంటుల్ని తోలింది. బంటులంటే అల్లాటప్పా వాళ్ళేం కాదు. దండకారణ్యంలో ఉండే మహర్షులనీ, మునులనీ నానాబాధలూ పెడుతూండేవారు.

తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వ రాక్షసాన్
ఖరం త్రిశిరసం చ ఏవ దూషణం చ ఏవ రాక్షసం

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఖర దూషణ త్రిశిరులనే ముగ్గురి నాయకత్వంలో అక్షరాలా పద్నాలుగు వేలమంది రాక్షసులు.. భీకరాకారులు.. మాయాయుధ్ధంలో ఆరితేరిన రక్కసులు బిలబిలమంటూ దిగిపోయారండీ.."

"అమాత్యా... యుధ్దభేరీ మ్రోగించండి." కంచు గంట లా మ్రోగింది కులశేఖరుని గొంతు. ఉలిక్కి పడ్డారు ఆచార్యులవారు. 

కులశేఖరుని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళలో ఎర్రజీర. అమాత్యులు అయోమయంగా చూస్తున్నారు. రాజుగారు స్పృహలో లేరు. 

"ఏంటలా చూస్తున్నారు! పద్నాలుగు వేలమంది రాక్షసులు వచ్చేస్తున్నారు. పిలవండి మన సామంతులని.. మోహరించండి సైన్యం.. తక్షణం యుధ్ధానికి సర్వసన్నధ్ధం చెయ్యండి." అని చరచరా నడుస్తూ అస్త్రాగారం వైపు సాగిపోతున్నాడు. వెంట అమాత్యులు పరుగులు పెడుతున్నారు. ఆచార్యులవారికేం చెయ్యాలో పాలుపోలేదు. ఆలోచిస్తూ వెనుకే తానూ నడుస్తూ.. 

"మహాప్రభో.. కులశేఖర చక్రవర్తీ! రాముడొచ్చేశాడు. యుధ్ధంలో గెలిచి వచ్చేశాడు.." అని పొలికేక పెట్టారు. 

టక్కున ఆగినవాడే  వెనక్కైనా తిరక్కుండా.. సందేహంగా "నిజమా!" అని ప్రశ్నించాడు.

"ముమ్మాటికీ నిజం! రాక్షసులని చీల్చి చెండాడి మరీ వచ్చేశాడు. 

త్వం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం
భభూవ హృష్టా వైదేహీ భార్తారం పరిషస్వజే 

రాక్షసులందరినీ చంపి దండకారణ్యంలో మహర్షులకి వాళ్ళ పీడ వదల్చివేశాడు. అలా శత్రుసంహారం చేసి వచ్చిన రాముడుని చూసి.. ఆనందంతో ఆలింగనం చేసుకుంది సీతాకాంత. " 

కులశేఖరుడు ఆగి సంతోషంగా నవ్వాడు. ఈ విపరీతధోరణికి అమాత్యుల గుండెల్లో రాయి పడింది. ఏవిటిదన్నట్టూ మొహాలు చూసుకున్నారు.

జనరంజకంగా పరిపాలిస్తున్న తమ రాజు ఏమైపోతాడో అనే బెంగ వారిలో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ భక్తి అనే వెర్రి ఒక్కటి తగ్గించే మార్గం వెతికితే చాలు.. రాజు తమవాడే! ఉపాయమాలోచిస్తూ తర్జన భర్జనలు పడసాగారు.

పులి మీద పుట్రలా మర్నాడే మరో ప్రమాదం వచ్చి పడింది. 

"అమాత్యా.. నేను శ్రీరంగం వెళ్ళిపోతున్నాను. ఇదిగో ఈ స్వాములతో కలిసి.. ఇకపై రాజ్యభారం మీదే!" తులసి పూసలూ, నారవస్త్రాలతో నిలబడి చెప్తున్న కులశేఖరుడిని చూసేసరికి వారికి మతి పోయింది.

ఒక మంత్రి క్షణమాలోచించి పొంగిపొరలుతున్న ఆ భక్తి సాగరానికి అడ్డుకట్ట వేశాడు.. తాత్కాలికంగా.

"తప్పకుండా మహాప్రభూ! కానీ.. చిన్ననాటి నుండీ ప్రతీ విషయంలోనూ రామచంద్రుడిని అనుసరిస్తున్న మీరు.. ఈ ఒక్క విషయానికీ ఆయన చూపిన బాటని ఉల్లంఘిస్తున్నారే!"

"రాముడిని ఉల్లంఘించడమా!!" ఆశ్చర్యపోయాడు రాజు.

"కుశలవులిద్దరినీ పట్టాభిషిక్తులని చేసి కానీ, రాముడు వైకుంఠానికెళ్ళలేదు ప్రభూ!"

"నిజమే! లోకరక్షణార్ధం సీతమ్మనే విడిచిపెడతానన్నాడు రామచంద్రప్రభువు. నా ప్రజలనెలా విడిచి పెట్టను! దృఢవ్రతుడిని నన్ను మించినవాడిని చేసి.. అప్పుడు నేను శ్రీరంగం వెళ్ళిపోతాను." 

అప్పటికి ముప్పు తప్పింది. మంత్రులు చర్చించుకున్నారు.. ఈ వైష్ణవస్వాముల బెడద వదిలిస్తే కానీ తమకు రాజు దక్కడని నిర్ణయించుకున్నారు.. కులశేఖరుడికి వారిపై ఏవగింపు కలిగించాలని పన్నాగం పన్నారు.

***

అదేమిటో.. తరువాయి భాగంలో..
 

Saturday, January 14, 2012

భోగ్యమైన రాసలీల ~ కాత్యాయనీ వ్రతం - 30

పుచ్చపువ్వల్లే వెన్నెల కాసిన వేళ... మృదు మోహన మురళీ రవళి విని గోపికల మది ఝల్లన పొంగిన వేళ.. గొల్లపల్లెలో పడుచులందరూ చేతిలో ఉన్న పని విడిచి, కాలుచేయాడక.. నిశ్చేష్టితులై.. తృటిలో తేరుకుని వంశీకృష్ణుని చేరేందుకు.. మొగలి పొదవైపు నాగకన్నియలు పరుగులు తీసినట్లు, చరచరా పరుగులు తీసిన వేళ.. వీడిన సిగలతో, చెమటలో తడిసి కరిగి కుంకుమ ఎదలోయల్లోకి పారుతూండగా, జారిన పయ్యెదలతో, తడబడు అడుగులతో, తమ ప్రియుని.. మాధవుని వెదకే కనులతో, బంధాలను విడిచి బృందావని చేరారు. కృష్ణచంద్రుని కన్నార్పక చూచే కలువభామల వలే తనను పరివేష్టించిన గోపాంగనలను చూచి నల్లనయ్య నవ్వాడు.

"భామినులారా! ఇంత రాత్రివేళ ఎలా వచ్చారు? దారిలో అడవి పురుగూ బూచీ ఉంటాయే.. మీకు భయం కలుగలేదూ! మీ ఇంట్లో వారు ఏమనుకుంటారో! మురళీగానం విన్నారు కదా.. ఇంక మరలి వెళ్ళండి." అని పలికిన కృష్ణుని పలుకులు ఆ గోపతరుణుల మనసులలో మునుపు నాటిన సుమశరుని విరికోలలకంటే పదునుగా గుచ్చి గాయపరచినవి.

"కృష్ణా! మనోహరా! నిను కోరి కాత్యాయనీ వ్రతమొనర్చి, నీ పిల్లన గ్రోవి పాటకు మైమరచి.. బంధాలన్నీ తెంచి నిన్ను చేరాము. ఇదంతా నీ సంకల్పమే కదూ! ఇప్పుడు నువ్వే మమ్మల్ని వెనుతిరిగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నావే! నీకిది న్యాయమా? ఈ విశ్వంలో ఏ ప్రాణికైనా సంతత ప్రేమోద్దీపకుడవు! మదనుడైనా కన్నార్పక చూసే భువనమోహన సౌందర్యం నీది. నిను కోరి వచ్చిన వనితలను చులకన చేస్తావా?" అతివలు బేలగా అడిగారు.
"అయ్యో!  పరపురుషుని కోరి వచ్చారే! మీకిది తగునా?" పగడాల పెదవిపై తర్జని ఆన్చి తప్పు వలదన్నాడు మాధవుడు.

"కృష్ణా! సర్వ భర్తవు! అగ్ని వలే దేనిని దహించినా మాలిన్యము అంటని వాడవు. తామర తేనియ రుచి మరిగిన తేటిని వేరే విరులు ఆకర్షించునా? మా మనసు నీ యందే లగ్నమై ఉన్నదన్న నిజం గ్రహించి, నీ చిరునగవు వెన్నలల కొరకు చకోరాలమై నీ ముందు నిలచిన మమ్మల్ని ఆత్మారాముడవై స్వీకరించవలసినదని" వేడుకున్నారు ఆ గోప వనితలు.

మదనకీలకు మరుగుతున్న వారి నిట్టూర్పులను తన చల్లని చూపులతో, స్పర్శతో శాంతింపజేసాడు యదునందనుడు. చుక్కల మధ్య నిండు జాబిలి వలే ప్రకాశిస్తూ గోపికలతో కలసి బృందావనిలో విహరించసాగాడు. ఆటలలో అకస్మాత్తుగా అల్లరికృష్ణుడు మాయమయ్యాడు. అది గ్రహించిన గొల్లపడుచులందరూ కలవరపడుతూ నలుదెసలా గాలించనారంభించారు. మోహావేశితలై, గద్గద స్వరంతో చెట్టునూ, పుట్టనూ ప్రశ్నించనారంభించారు.

"మన్మథుని శరాలకు మమ్మల్ని ఎర చేసిన ఆ మాధవుడు మాయచేసి ఈ నట్టడివిలో వీడిపోయాడు. ఇది న్యాయమా? ఓ పున్నాగమా! పురుషోత్తముడైన కృష్ణుని చూసావా? ఓ తిలకమా! ఘనసారమా! మా మనోహరుని  చూసారా? ఓ వెదురు పొదా! నీ వెదురుతో చేసిన వంశిని చేతబూనిన ఆ అల్లరివాడిని నువ్వేమైనా చూసావా? ఓ చందన వృక్షమా! చల్లని మా స్వామి నీకు కనిపించాడా!

పున్నాగ కానవే  పున్నాగవందితు దిలకంబ కానవే తిలకనిటలు
మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని
ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు
జందన కానవే చందన శీతలు గుందంబ కానవే కుందరదను

నల్లని వాడు పద్మ నయమబులవాడు కృపారసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలచాటున లేడుగదమ్మ చెప్పరే!

ఓ మల్లికలారా! మా కృష్ణుని గురుతులు మీకు చెప్తాము. అతడు నల్లని వాడు. పద్మనేత్రముల కృపారసమ్ము చిందించేవాడు. నవ్వుమోమున రాజిల్లు వాడు. నెమలిపింఛం అలంకరించుకున్న నీలాలకురుల సొగసుకాడు. మా మానధనం కొల్లగొట్టి మీ పొదల వెనుక దాగి ఉన్నాడేమో చెప్పరూ!

ఓ పాటలీ లతలారా! ఓ ఏలకీ లతలారా! మాధవీ వల్లికలారా! వాని బంధించి మాకు అప్పగించరూ! ఓ చూతమా! వాని చూసావా! ఓ కేతకీ, ఓ కోవిదారమా! మీ సురభిళ వీచికలతో మమ్మల్ని ఇంకా హింసింపక నల్లనయ్యను పట్టివ్వరూ! "అని బృందావని కలియతిరుగుతున్న గోపికల ఎదుట జగన్మోహనుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నిలిచాడు.

ఎదుటపడిన ప్రియుని నిందించేదొకతె. తన చూపుల తీవెలతో అతని చుట్టి కనులు మూసి ఆతని రూపు హృదయమందు నిలిపి ఆనందపులకాంకితయైనది వేరొకతె. కోపము నటించేదొకతె. వాలుచూపుల వయ్యారి ఒకతె. గ్రక్కున కావలించేదొకతె. చేయి పట్టేదొకతె. గాటపు వలపున చుంబించేదొకతె. "నీ ఎడబాటున నేను మరణించలేదేలా!" అని కన్నీరై కరిగేదొకతె. "విడిచిపోకుమా!"యని కాళ్ళను బంధించేదొకతె. "ప్రాణేశ్వరా!" అని ఎలుగెత్తి పలవరించేదొకతె. "కృష్ణా!" అని ఆతని మోము తడిమిచూసేదొకతె.

"మగువలూ! మీరు చెప్పిన మాటే! ఎదురుచూసి కష్టపడి దక్కించుకున్న ఫలము బహు తీయన!" అని మనోహరంగా నవ్వాడు కృష్ణుడు. ఆ పిదప గోపభామినుల చేరి వేయి బంగరురేకుల తామరలో వెలిగే కర్ణికవలే ఒప్పారుతూ రాసలీలల తేలియాడాడు కృష్ణ స్వామి. లావణ్యవీణ మీటినదో లేమ. వల్లకి పలికించినదో తరుణి. అచ్చరలు పూవులవాన కురిపించగా, గంధర్వాదులు మోహవివశులవగా, చుక్కలు చంద్రుని సరసన చేరి మక్కువతో చూస్తూండగా గోపసుందరులతో కలసి రసనాట్యమాడాడు.

ఆపై గోపీసమేతుడై జలక్రీడలకు ఉపక్రమించాడు. గోపికలు నీటిలో నిదురిస్తున్న రాయంచలను అదల్చి తామరలను కోసి సిగలో తురుముకున్నారు. తామరాకులపై తపోనిద్రలో ఉన్న చక్రవాకాలను "తమ సొగసులకు సాటి రాలేరు పొమ్మని" వెక్కిరించారు. నీట మునిగి మోము మాత్రమే చూపి చందమామను పరిహసించారు. దోసిళ్ళతో వారు చిమ్మిన నీటి ముత్యాలు వినీలదేహంపై మెరుస్తూ ఉండగా.. ఆడు ఏనుగుల మధ్య చేరి జలకాలాడుతున్న మత్తేభం వలే కృష్ణమూర్తి కనువిందు చేసాడు.



నీళ్ళలో ఆటలాడి, అలసి.. పొద్దు పొడిచే వేళ బయటకు వెడలి సేదదీరుతున్న గోపకాంతల ఒడిలో చేరి ఒకడే వేయి కృష్ణులై, ఒకరికి ఒక కృష్ణుడై ఆత్మాభిరాముడై గోపీవల్లభుడు వినోదించాడు. వేయి కొలనులలో ప్రతిబింబించినా గగనాన దినమణి ఒక్కడే కదూ!





                            *********************************


కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం

క్రీ. శ. 776 నలనామ సంవత్సర కర్కాటక (ఆషాఢ) మాసంలో, పూర్వ ఫల్గునీ నక్షత్ర యుక్త శుభసమయాన, శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే విష్ణుభక్తునికి తన పెరటి తోటలో ఒక తులసి మొక్క పాదులో, చైతన్యం గల ఒక అపరంజి బొమ్మ కనిపించింది. విష్ణుచిత్తులు ఆ పసికందును దైవప్రసాదంగా భావించి పుత్రికా వాత్సల్యంతో "కోదై" (గోదా) అని ఆమెకు పేరుపెట్టి పెంచుకోసాగారు. 'కోదై' అంటే తమిళంలో కుసుమ మాలిక.

విష్ణుచిత్తులకు ప్రతిరోజూ పరమభోగ్యములైన పుష్పమాలికలను వటపత్ర శాయికి సమర్పించి ఇంటికి రావడం అలవాటు. మగువలకు మాల్యధారణ బహుప్రీతిపాత్రమైనది కదా! ఆ సుకుమారి తండ్రి చూడకుండా, ఆ మాలలను అలంకరించుకుని, అద్దంలో చూసుకుని చప్పుడు చేయక మరల బుట్టలో ఉంచివేసేది. కొన్నాళ్ళకు పూవులదండలో చిక్కిన కేశమును చూచి విష్ణుచిత్తులు కుపితులై ఆమెను నిందించారు. ఆ వేళ మాలలు సమర్పించలేదు.

ఆ రాత్రి ఆయన కలలో కనిపించిన వటపత్రశాయి "ఆ చిన్నది ముడిచిన మాలలే తనకు ముద్దని" చెప్పగా విని విష్ణుచిత్తులు ఆమె మానవమాత్రురాలు కాదని, లక్ష్మీస్వరూపమని గ్రహించి ఆ నాటి నుండీ గోదా ముడిచిన మాలలనే స్వామికి సమర్పించేవారు. అందుకే ఆమెకు "ఆముక్తమాల్యద" అని పేరు.

యుక్త వయసు వచ్చిన ఆమె రంగనాధుని పతిగా వరించి ఆతని పొందేందుకు ధార్మికులనడిగి "భాగవతంలో" ప్రస్తావించబడిన "కాత్యాయనీ వ్రతాన్ని" విల్లి పుత్తూరునే రేపల్లెగాను, తన చెలులనే తోటి గోపికలుగాను, విల్లిపుత్తూరు వటపత్రశాయినే కృష్ణునిగానూ భావించి ముప్పది దినముల వ్రతమాచరించింది. ఆ సమయంలో రోజుకొక పాట చొప్పున కృష్ణునికి పూవులదండ వలే సమర్పించింది. ఆ పాటలే "తిరుప్పావై". ఉపనిషత్ సారమంతా అందమైన పాటల రూపంలో అందించిన గోదా వ్రత పరిసమాప్తి కాగానే రంగనాధుని కల్యాణమాడి ఆతనిలో ఐక్యమైనదని చరిత్ర. ఈ ముఫ్ఫై దినముల కాత్యాయనీ వ్రతమును శ్రధ్ధగా చేసిన వారు, చూసిన వారు ఇష్ట కామ్యార్థములను పొందగలరని ప్రతీతి.


* సదా వెన్నంటి ఉండే ఆచార్య కటాక్షాన్ని పొందిన నా పున్నెం ఈనాటిది కాదు.
  కృష్ణ రసాన్ని గరిపిన తాతగారిని తలచుకుంటూ "కృష్ణార్పణం".

Wednesday, December 14, 2011

ఒకసారి ఏం జరిగిందంటే..

అదో పల్లెటూరు. దాన్ని ఒరుసుకుని ప్రవహించే ఓ నల్లని నది. ఆ పక్కనే కొండల వరుస. ఆకాశంలో సాయంకాలం ఎగిరి వెళ్తున్న దేవతలకి ఆ ఊరు "పక్కకి తిరిగి పడుకున్న అందమైన పడతి జడలో మెరిసే నాగరంలా" కనిపిస్తుందట. ఆ ఊరి రంగు బంగారపు రంగు. "ఊరికి రంగేవిటా?" అనేగా మీ ప్రశ్న? ఇళ్ళకి చేరుతున్న గోవుల గిట్టలు రేపే నారింజ ధూళి చిమ్మచీకటయ్యేదాకా గాల్లో తేలుతూనే ఉంటుంది మరి! ఒకటా రెండా.. ప్రతీ ఇంటికి ఓ మంద పశువులుండాల్సిందే!

పాడీ, పంటా సమృధ్ధిగా ఉండే ఆ పల్లె పేరు "రేపల్లె". ఆ పక్కన పారుతున్నది "యమున". ఆ పల్లెలో వీచే గాలిలో నిత్యం తేలే ఓ దివ్య సుగంధం! అవును మరి! వెన్న కమ్మదనం, పున్నాగ పువ్వుల ఘుమఘుమలూ, ఆ ఊరి పడుచులద్దుకునే కస్తూరీ, జవ్వాది పరిమళాలూ.. ఇవన్నీ చాలవన్నట్టు ఆ ఊరి రాజుగారింట్లోంచి సతతమూ వీచే కర్పూర వీచికలూ కలిస్తే గాలి మత్తెక్కక మానుతుందా?

ఆ ఊరి రాజుగారింట్లో కర్పూరానిది ఉప్పుతో సమానమైన వాడుక. "రాచబిడ్డ"కి వాళ్ళమ్మ దిష్టి తీసి హారతివ్వని పూట లేదు మరి! ఎందుకా! నెమ్మదిగా అడుగుతారేం? అతను మహ అందగాడట!! అతనిది నీలిమేఘపు రంగు. అందమంటే అలాంటి ఇలాంటి అందం కాదు! అందానికే మోహం కలిగి, మనసు మరిగి మతి తప్పేంత సమ్మోహనుడట! అదొక్కటేనా? ఓ పాల నవ్వు నవ్వుతాడట! మల్లెలు చిన్నబోయేలా, వెన్నెల తెల్లబోయేలా.. అతని నవ్వు ఎంత బావుంటుందంటే, ఆ ఊరి పడుచులందరూ పాల కడవల్లో, నీళ్ళ బిందెల్లో, అద్దాల్లో, వాళ్ళ చేతుల మణి కంకణాల్లో.. ఇవన్నీ సరిపోక ఒకరి కళ్ళల్లోకి ఒకరు తమ ప్రతిబింబాన్ని చూసుకుని అతనిలా నవ్వుదామని నిత్యం సాధన చేస్తూ ఉంటారట! అయితే వాళ్ళకి ఆ నవ్వు పట్టుబడకపోవడానికి కారణమేవిటో తెలుసా! ఆ నవ్వులో వేరొకరికి చేతకాని 'ఓ చిన్న తుంటరితనం' ఉంటుంది. తుంటరితనం అతనికి కట్టుబానిస! అతను చేసే పనుల్లో, పలికే పలుకుల్లో, నవ్వే నవ్వులో సదా వెన్నంటి వచ్చే దాసానుదాసుడు ఆ 'కొంటెతనం'!

అతనికి ఇంకో విద్య వచ్చు, తెలుసా! పిల్లనగ్రోవి ఊదుతాడట. చిత్రమేమిటంటే అతను మురళిని మ్రోగిస్తూ ఉంటే వినేవారికి ఆ మాధుర్యానికి కళ్ళు తెరవలేని మత్తు కమ్మేస్తుందట! అలా అని మురళీధరుణ్ణి చూడకపోతే ఎలా..? అందుకని ఏకకాలంలో ఆ వేణుగానం వింటూ, కళ్ళు తెరిచి అతన్ని చూడడం ఎవరికి సాధ్యమవుతుందో అని పందాలు కాసుకుంటూ ఉంటారట ఆ ఊళ్ళో. గెలిచినవాడు లేడిప్పటికి!

అతని అందానికే వాళ్ళమ్మ దిష్టి తిసేస్తోందనుకుంటున్నారేమో! కాదు.. కాదు! అతను బోలెడు బలమున్నవాడట! ఆ ఊరికి రాక్షసుల బెడద కొంచెం ఎక్కువే, పాపం! ఆడపిల్ల రూపంలోనూ, బండి రూపంలోనూ, కొంగలాగా, ఆవులాగా.. ఇలా రకరకాల మారు వేషాల్లో బోలెడుమంది రాక్షసులు వచ్చి అతని చేతుల్లో ప్రాణాలు విడిచారట. పాపం, తల్లి మనసు కదా! అందుకని ఎటు నుంచి ఏ కీడొస్తుందో అని కొడుకుని చూసి బెంగపడుతూ, అతని అందానికి మురిసిపోతూ మెటికెలు విరుస్తూ ముప్పూటలా దిష్టి తీస్తూంటుందన్నమాట!

మరి ఇంత అందగాడి వెంటపడేవాళ్ళేమైనా తక్కువా? అబ్బే! ఊరందరి కళ్ళూ అతని మీదే! ఆ ఊరి ఆడపిల్లలందరికీ అతనంటే తగని మక్కువ. ఇంట్లో కట్టడి చేస్తున్నా, పెడచెవిన పెట్టి నది ఒడ్డునా, తోటల్లోనూ అతను మురళీగానం చేస్తూంటే పరుగున వెళ్ళి వింటూ ఉండేవారట! అతగాని ఊహల్లో మైమరిచిపోతూ నిత్యకృత్యాలన్నీ అవకతవకలుగా చేసేస్తూ ఉండేవారట. చల్ల చిలికేవేళ అతను గుర్తొస్తే, ఆ చల్లలో వెన్న ఏర్పడి మళ్ళీ కరిగిపోయేదాకా చిలికీ చిలికీ ఆ ఊరి భామలందరి నడుములూ బహుసన్నమైపోయాయట. "ఏ క్షణంలో అతను ఎదురుపడతాడో!" అని ఎప్పుడూ వాళ్ళందరూ అలంకారాలు చేసుకుని, పువ్వులు ముడుచుకుని గంధపు కుప్పెల్లా, నిత్యమల్లె చెట్లలా, బంగారుబొమ్మల్లా మెరిసిపోతూ ఉంటారట!

అలా గడుస్తూండగా శరదృతువు వచ్చింది. ఆకాశంలో మేఘాలు తెల్లని పువ్వుల్లా, తేలికైన, స్వచ్చమైన మనసుల్లా తేలుతున్నాయి. రాత్రుల్లో వెన్నెల చాందినీకి కట్టిన ముత్యాల్లా నక్షత్రాలు మెరుస్తున్నాయి. పండి ఓరగా వాలిన వరిచేలలో, గాలి వీచినప్పుడల్లా గలగలమని వినసొంపైన సడి పుట్టేది. చేలల్లో వాలిన చిలుకలు అదిలించగానే గోలగోలగా ఎగిరిపోయేవి. కొలనుల్లో కలహంసలు కిక్కిరిసి తామరలకి చోటు లేకుండా చేసేసాయి. చామంతులూ, బంతులూ విరిసి పసిడిహారతుల్లా మెరుస్తున్నాయి. ఇంత మనోహరమైన రోజుల్లో ఆ ఊరి పడుచులకి ఒకటే బాధ! మన్మథ తాపం. చెరుకు వింట మన్మథుడెక్కుపెట్టిన నల్ల కలువల బాణాలు నేరుగా ఆ వెర్రి గొల్ల పడుచులకి గుచ్చుకునేవి.

విరహబాధ తట్టుకోలేని పడుచులంతా యమునలో జలకాలాడుతూ, గుసగుసగా ఒకరి చెవిలో ఒకరు తమ బాధ చెప్పుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, వేళాకోళం చేసుకుంటూ నల్లనయ్య గురించి కలలు కంటున్నారు. పిల్లనగ్రోవి మ్రోగేసరికి ఒళ్ళుమరిచి ఆ దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ బాధకి ఉపాయం ఏదైనా ఉంటే బాగుండునని తలవని ఆడపిల్ల లేదు.

ఒకనాడు ఉదయం పల్లెలో పెద్దలందరూ ఆడపిల్లలనందర్నీ సమావేశపరిచారు. "ఎందుకో? ఏం చెప్తారో? కారణమేంటో?" అని వాళ్ళందరూ గుసగుసలాడుకుంటున్న ధ్వని తుమ్మెదల గుంపు ఝుమ్మని ఎగురుతున్నట్టు వినిపిస్తోంది. ఓ ముసలి గొల్ల లేచి పువ్వుల దండలా ఓ వైపు నిలబడిన పడుచుల్ని చూసి చెప్పనారంభించాడు. "అమ్మాయిలూ, మీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. నేనూ, మిగిలిన పెద్దలూ ఇందాకే మన పల్లె చివర ఉన్న మునిపల్లెకి వెళ్ళి వచ్చాం. అక్కడి మునీశ్వరుడు చెప్పిన మాటలివి. రాబోయేది హేమంత ఋతువు. మార్గశిరమాసం మంచి కాలమట. ఈ నెలలో ఆడపిల్లలు కాత్యాయినీ దేవిని పూజిస్తే మంచిదట. మంచి వర్షాలు కురిసి, పాడీ పంటా సమృధ్ధి చెందుతుందట."

"ఈ పెద్దాయన ఒకరూ, మంత్రాలకి చింతకాయలు రాలతాయా? అయినా మనకిప్పుడేం తక్కువైందని? అబ్బో, ఈ పూజలూ పునస్కారాలూ మన వల్ల అయ్యేవేనా? ఇళ్ళల్లో పనులో!" ఇలా అమ్మాయిలందరూ గుసగుసలు ప్రారంభించారు.

వాళ్ళ ఉద్దేశ్యం, మాటలూ తెలియని వాళ్ళు కాదు కదా పెద్దలు. అమ్మ పుట్టిల్లు మేనమామ ఎరుగడా? పండిన మీసం చాటున నర్మగర్భంగా నవ్వుకుని పెద్దాయన చెప్పాడు.. "అంతే కాదమ్మాయిలూ, ఈ వ్రతం శ్రధ్ధగా, సక్రమంగా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయట."

"కోరికలన్నీ అంటే.." ఓ పిల్ల కొంటెగా అడిగి ముందున్న అమ్మాయి వెనక్కి నక్కింది.
"ఆహా.. అన్ని కోరికలూ అంటే అన్ని కోరికలూ.. సురభికి కాసుల పేరూ, నర్మదకి మువ్వల పట్టెడా, మల్లికకి జడ నాగరమూ, ప్రియంవదకి దంతపు బొట్టుపెట్టె, మృణాలినికి సంపెంగ రంగు పట్టు చీరా.. నీకు కోరిన మొగుడూను" ఘొల్లుమని నవ్వారు పడుచులందరూ. ఇందాకా ప్రశ్న వేసిన కమలిని సిగ్గుగా నవ్వుతూ వెనక్కి జరిగింది. సభ తీరిన పెద్దవాళ్ళూ ముసిముసిగా నవ్వుకున్నారు.
"అలా కాదు పెద్దయ్యా, మా చేత వ్రతం చేయించేదెవరనీ?" సందేహం వెలిబుచ్చింది మృణాలిని.
"ముందు మీరంటూ సిధ్ధపడితే, అన్నీ జరుగుతాయి. సురభీ, ప్రియంవదా, ఉత్పలా, కావేరి.. ఇంత మంది ఉన్నారు మీలో అన్నీ తెలిసినవారూ, చదువుకున్న వారూను. మీలో కొందరు ఓ సారి మునిపల్లెకి వెళ్ళి కనుక్కుంటే విషయాలూ, విధానమూ మీకే తెలుస్తాయి. అన్నీ మేమే చెప్పాలంటే ఎలాగర్రా.. మీరే ఉత్సాహంగా అన్నీ తెలుసుకోవాలీ, చెయ్యలీ కానీ!" ఉత్సాహపరిచాడు పెద్దాయన.

ఆడపిల్లలందరూ ఒకరి మొహాలొకరు చూసుకుని, గోలగోలగా అభిప్రాయాలూ, సందేహాలూ, అనుమానాలూ వెలిబుచ్చుకుని, తమలో తామే సమాధానాలు చెప్పుకుని ఒక అంగీకారానికి వచ్చారు.
"సరే పెద్దయ్యా.. హేమంతం వచ్చేసరికి సిధ్ధంగా ఉంటాం. అందరం కాత్యాయనీ వ్రతం చేస్తాం. మంచి పనికి వెనకాడేదేముంది?" అని స్థిరంగా చెప్పింది సురభి.

హేమంతం వచ్చేసింది. తెలవారితే వ్రతారంభం. యమున ఒడ్డున స్నానానికి కలుద్దామని, అక్కడే కాత్యాయనీ దేవికి పూజ చేసుకోవాలని.. ముందు రోజే అమ్మాయిలందరూ కలిసి నిర్ణయం చేసుకున్నారు. హేమంతమంటే మాటలా! చలి వణికించేస్తోందప్పుడే! అంత తెలవారు ఝామున లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలంటే కష్టం.. మంచు కత్తిలా కోసేసే యమున నీళ్ళలో మూడు మునకలు వెయ్యాలని తలుచుకుంటేనే అందరికీ వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. అదే మాట అంది ఉత్పల. ఖస్సుమని ఒంటికాలిన లేచింది కమలిని. "గారెలు తినాలని ఉందంటే అవి గాల్లో పుట్టవు, అమ్మడూ! మనమే వండుకోవాలి. కోరినవి దక్కాలంటే ఆ మాత్రం కష్టం తప్పదు. మరో మాట లేదు. వేకువ ఝాముకి ఘడియ ముందే నేను మీ ఇంటికి వచ్చి లేపుతాను."అంది చేతులు తిప్పుకుంటూ.
"ఏనుగులు మీద పరిగెట్టినా లేవని దానివి! నువ్వా సుద్దులు చెప్తున్నావ్, కమలినీ!?" వెక్కిరించింది సురభి.
"ఏం కాదు. రేపు చూడండి. ఉత్పల ఒక్కర్తినే కాదు మీ అందరినీ నేనే లేపుతాను." ఉడుక్కుంటూ చెప్పింది కమలిని.
"అబ్బా..ఆగండే! చిటికె వేస్తే తెలివొస్తుంది సురభికి. సురభీ! నువ్వే రేపు మా అందరినీ నిద్ర లేపాలి. నీదే పూచీ. మనం లేవడం ఆలస్యమయి పొద్దు పొడిచిందా.. వ్రతానికి ముప్పు!" హెచ్చరిస్తూ చెప్పింది ఉత్పల.
"సరేనర్రా.. ఇళ్ళకి వెళ్ళి హాయిగా నిద్రపోండి. నేను కోడికూతకి రెండు ఘడియల ముందే లేస్తాను. పక్కనే కమలిని ఇల్లు కదా.. ఇద్దరమూ మిగిలిన వాళ్ళని లేపుతాం." చెప్పింది సురభి.
అందరూ ఇంటిదిక్కు పట్టారు.



*ఇప్పటికి ఇంతే. మిగిలిన కథ రేపు.


(బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి.)