Saturday, January 14, 2012

భోగ్యమైన రాసలీల ~ కాత్యాయనీ వ్రతం - 30

పుచ్చపువ్వల్లే వెన్నెల కాసిన వేళ... మృదు మోహన మురళీ రవళి విని గోపికల మది ఝల్లన పొంగిన వేళ.. గొల్లపల్లెలో పడుచులందరూ చేతిలో ఉన్న పని విడిచి, కాలుచేయాడక.. నిశ్చేష్టితులై.. తృటిలో తేరుకుని వంశీకృష్ణుని చేరేందుకు.. మొగలి పొదవైపు నాగకన్నియలు పరుగులు తీసినట్లు, చరచరా పరుగులు తీసిన వేళ.. వీడిన సిగలతో, చెమటలో తడిసి కరిగి కుంకుమ ఎదలోయల్లోకి పారుతూండగా, జారిన పయ్యెదలతో, తడబడు అడుగులతో, తమ ప్రియుని.. మాధవుని వెదకే కనులతో, బంధాలను విడిచి బృందావని చేరారు. కృష్ణచంద్రుని కన్నార్పక చూచే కలువభామల వలే తనను పరివేష్టించిన గోపాంగనలను చూచి నల్లనయ్య నవ్వాడు.

"భామినులారా! ఇంత రాత్రివేళ ఎలా వచ్చారు? దారిలో అడవి పురుగూ బూచీ ఉంటాయే.. మీకు భయం కలుగలేదూ! మీ ఇంట్లో వారు ఏమనుకుంటారో! మురళీగానం విన్నారు కదా.. ఇంక మరలి వెళ్ళండి." అని పలికిన కృష్ణుని పలుకులు ఆ గోపతరుణుల మనసులలో మునుపు నాటిన సుమశరుని విరికోలలకంటే పదునుగా గుచ్చి గాయపరచినవి.

"కృష్ణా! మనోహరా! నిను కోరి కాత్యాయనీ వ్రతమొనర్చి, నీ పిల్లన గ్రోవి పాటకు మైమరచి.. బంధాలన్నీ తెంచి నిన్ను చేరాము. ఇదంతా నీ సంకల్పమే కదూ! ఇప్పుడు నువ్వే మమ్మల్ని వెనుతిరిగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నావే! నీకిది న్యాయమా? ఈ విశ్వంలో ఏ ప్రాణికైనా సంతత ప్రేమోద్దీపకుడవు! మదనుడైనా కన్నార్పక చూసే భువనమోహన సౌందర్యం నీది. నిను కోరి వచ్చిన వనితలను చులకన చేస్తావా?" అతివలు బేలగా అడిగారు.
"అయ్యో!  పరపురుషుని కోరి వచ్చారే! మీకిది తగునా?" పగడాల పెదవిపై తర్జని ఆన్చి తప్పు వలదన్నాడు మాధవుడు.

"కృష్ణా! సర్వ భర్తవు! అగ్ని వలే దేనిని దహించినా మాలిన్యము అంటని వాడవు. తామర తేనియ రుచి మరిగిన తేటిని వేరే విరులు ఆకర్షించునా? మా మనసు నీ యందే లగ్నమై ఉన్నదన్న నిజం గ్రహించి, నీ చిరునగవు వెన్నలల కొరకు చకోరాలమై నీ ముందు నిలచిన మమ్మల్ని ఆత్మారాముడవై స్వీకరించవలసినదని" వేడుకున్నారు ఆ గోప వనితలు.

మదనకీలకు మరుగుతున్న వారి నిట్టూర్పులను తన చల్లని చూపులతో, స్పర్శతో శాంతింపజేసాడు యదునందనుడు. చుక్కల మధ్య నిండు జాబిలి వలే ప్రకాశిస్తూ గోపికలతో కలసి బృందావనిలో విహరించసాగాడు. ఆటలలో అకస్మాత్తుగా అల్లరికృష్ణుడు మాయమయ్యాడు. అది గ్రహించిన గొల్లపడుచులందరూ కలవరపడుతూ నలుదెసలా గాలించనారంభించారు. మోహావేశితలై, గద్గద స్వరంతో చెట్టునూ, పుట్టనూ ప్రశ్నించనారంభించారు.

"మన్మథుని శరాలకు మమ్మల్ని ఎర చేసిన ఆ మాధవుడు మాయచేసి ఈ నట్టడివిలో వీడిపోయాడు. ఇది న్యాయమా? ఓ పున్నాగమా! పురుషోత్తముడైన కృష్ణుని చూసావా? ఓ తిలకమా! ఘనసారమా! మా మనోహరుని  చూసారా? ఓ వెదురు పొదా! నీ వెదురుతో చేసిన వంశిని చేతబూనిన ఆ అల్లరివాడిని నువ్వేమైనా చూసావా? ఓ చందన వృక్షమా! చల్లని మా స్వామి నీకు కనిపించాడా!

పున్నాగ కానవే  పున్నాగవందితు దిలకంబ కానవే తిలకనిటలు
మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని
ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు
జందన కానవే చందన శీతలు గుందంబ కానవే కుందరదను

నల్లని వాడు పద్మ నయమబులవాడు కృపారసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలచాటున లేడుగదమ్మ చెప్పరే!

ఓ మల్లికలారా! మా కృష్ణుని గురుతులు మీకు చెప్తాము. అతడు నల్లని వాడు. పద్మనేత్రముల కృపారసమ్ము చిందించేవాడు. నవ్వుమోమున రాజిల్లు వాడు. నెమలిపింఛం అలంకరించుకున్న నీలాలకురుల సొగసుకాడు. మా మానధనం కొల్లగొట్టి మీ పొదల వెనుక దాగి ఉన్నాడేమో చెప్పరూ!

ఓ పాటలీ లతలారా! ఓ ఏలకీ లతలారా! మాధవీ వల్లికలారా! వాని బంధించి మాకు అప్పగించరూ! ఓ చూతమా! వాని చూసావా! ఓ కేతకీ, ఓ కోవిదారమా! మీ సురభిళ వీచికలతో మమ్మల్ని ఇంకా హింసింపక నల్లనయ్యను పట్టివ్వరూ! "అని బృందావని కలియతిరుగుతున్న గోపికల ఎదుట జగన్మోహనుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నిలిచాడు.

ఎదుటపడిన ప్రియుని నిందించేదొకతె. తన చూపుల తీవెలతో అతని చుట్టి కనులు మూసి ఆతని రూపు హృదయమందు నిలిపి ఆనందపులకాంకితయైనది వేరొకతె. కోపము నటించేదొకతె. వాలుచూపుల వయ్యారి ఒకతె. గ్రక్కున కావలించేదొకతె. చేయి పట్టేదొకతె. గాటపు వలపున చుంబించేదొకతె. "నీ ఎడబాటున నేను మరణించలేదేలా!" అని కన్నీరై కరిగేదొకతె. "విడిచిపోకుమా!"యని కాళ్ళను బంధించేదొకతె. "ప్రాణేశ్వరా!" అని ఎలుగెత్తి పలవరించేదొకతె. "కృష్ణా!" అని ఆతని మోము తడిమిచూసేదొకతె.

"మగువలూ! మీరు చెప్పిన మాటే! ఎదురుచూసి కష్టపడి దక్కించుకున్న ఫలము బహు తీయన!" అని మనోహరంగా నవ్వాడు కృష్ణుడు. ఆ పిదప గోపభామినుల చేరి వేయి బంగరురేకుల తామరలో వెలిగే కర్ణికవలే ఒప్పారుతూ రాసలీలల తేలియాడాడు కృష్ణ స్వామి. లావణ్యవీణ మీటినదో లేమ. వల్లకి పలికించినదో తరుణి. అచ్చరలు పూవులవాన కురిపించగా, గంధర్వాదులు మోహవివశులవగా, చుక్కలు చంద్రుని సరసన చేరి మక్కువతో చూస్తూండగా గోపసుందరులతో కలసి రసనాట్యమాడాడు.

ఆపై గోపీసమేతుడై జలక్రీడలకు ఉపక్రమించాడు. గోపికలు నీటిలో నిదురిస్తున్న రాయంచలను అదల్చి తామరలను కోసి సిగలో తురుముకున్నారు. తామరాకులపై తపోనిద్రలో ఉన్న చక్రవాకాలను "తమ సొగసులకు సాటి రాలేరు పొమ్మని" వెక్కిరించారు. నీట మునిగి మోము మాత్రమే చూపి చందమామను పరిహసించారు. దోసిళ్ళతో వారు చిమ్మిన నీటి ముత్యాలు వినీలదేహంపై మెరుస్తూ ఉండగా.. ఆడు ఏనుగుల మధ్య చేరి జలకాలాడుతున్న మత్తేభం వలే కృష్ణమూర్తి కనువిందు చేసాడు.



నీళ్ళలో ఆటలాడి, అలసి.. పొద్దు పొడిచే వేళ బయటకు వెడలి సేదదీరుతున్న గోపకాంతల ఒడిలో చేరి ఒకడే వేయి కృష్ణులై, ఒకరికి ఒక కృష్ణుడై ఆత్మాభిరాముడై గోపీవల్లభుడు వినోదించాడు. వేయి కొలనులలో ప్రతిబింబించినా గగనాన దినమణి ఒక్కడే కదూ!





                            *********************************


కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం

క్రీ. శ. 776 నలనామ సంవత్సర కర్కాటక (ఆషాఢ) మాసంలో, పూర్వ ఫల్గునీ నక్షత్ర యుక్త శుభసమయాన, శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే విష్ణుభక్తునికి తన పెరటి తోటలో ఒక తులసి మొక్క పాదులో, చైతన్యం గల ఒక అపరంజి బొమ్మ కనిపించింది. విష్ణుచిత్తులు ఆ పసికందును దైవప్రసాదంగా భావించి పుత్రికా వాత్సల్యంతో "కోదై" (గోదా) అని ఆమెకు పేరుపెట్టి పెంచుకోసాగారు. 'కోదై' అంటే తమిళంలో కుసుమ మాలిక.

విష్ణుచిత్తులకు ప్రతిరోజూ పరమభోగ్యములైన పుష్పమాలికలను వటపత్ర శాయికి సమర్పించి ఇంటికి రావడం అలవాటు. మగువలకు మాల్యధారణ బహుప్రీతిపాత్రమైనది కదా! ఆ సుకుమారి తండ్రి చూడకుండా, ఆ మాలలను అలంకరించుకుని, అద్దంలో చూసుకుని చప్పుడు చేయక మరల బుట్టలో ఉంచివేసేది. కొన్నాళ్ళకు పూవులదండలో చిక్కిన కేశమును చూచి విష్ణుచిత్తులు కుపితులై ఆమెను నిందించారు. ఆ వేళ మాలలు సమర్పించలేదు.

ఆ రాత్రి ఆయన కలలో కనిపించిన వటపత్రశాయి "ఆ చిన్నది ముడిచిన మాలలే తనకు ముద్దని" చెప్పగా విని విష్ణుచిత్తులు ఆమె మానవమాత్రురాలు కాదని, లక్ష్మీస్వరూపమని గ్రహించి ఆ నాటి నుండీ గోదా ముడిచిన మాలలనే స్వామికి సమర్పించేవారు. అందుకే ఆమెకు "ఆముక్తమాల్యద" అని పేరు.

యుక్త వయసు వచ్చిన ఆమె రంగనాధుని పతిగా వరించి ఆతని పొందేందుకు ధార్మికులనడిగి "భాగవతంలో" ప్రస్తావించబడిన "కాత్యాయనీ వ్రతాన్ని" విల్లి పుత్తూరునే రేపల్లెగాను, తన చెలులనే తోటి గోపికలుగాను, విల్లిపుత్తూరు వటపత్రశాయినే కృష్ణునిగానూ భావించి ముప్పది దినముల వ్రతమాచరించింది. ఆ సమయంలో రోజుకొక పాట చొప్పున కృష్ణునికి పూవులదండ వలే సమర్పించింది. ఆ పాటలే "తిరుప్పావై". ఉపనిషత్ సారమంతా అందమైన పాటల రూపంలో అందించిన గోదా వ్రత పరిసమాప్తి కాగానే రంగనాధుని కల్యాణమాడి ఆతనిలో ఐక్యమైనదని చరిత్ర. ఈ ముఫ్ఫై దినముల కాత్యాయనీ వ్రతమును శ్రధ్ధగా చేసిన వారు, చూసిన వారు ఇష్ట కామ్యార్థములను పొందగలరని ప్రతీతి.


* సదా వెన్నంటి ఉండే ఆచార్య కటాక్షాన్ని పొందిన నా పున్నెం ఈనాటిది కాదు.
  కృష్ణ రసాన్ని గరిపిన తాతగారిని తలచుకుంటూ "కృష్ణార్పణం".

27 comments:

  1. శ్రీ ఆరుద్ర గారు వ్రాసిన పాటలోలా

    "కోనేట యువతులు స్నానాలు చేయ కోకల దొంగ మొనగాడటే
    పడతులకపుడు పరమార్థ పదము భక్తిని నేర్పిన పరమాత్ముడే
    నవనీత చోరుడు నందకిశోరుడు
    అవతార పురుషుడు దేవుడే...
    చెలి...అవతార పురుషుడు దేవుడే..."....

    మీ ధనుర్మాస వ్యాస దీక్షతో నా వ్యాఖ్యా దీక్ష కూడా జయప్రదంగా జరిగేలా చేసిన మీ అందమైన తెలుగు వ్రాతకి, మీ అద్భుతమైన వ్యాస పరంపరకి, అవి వ్రాసిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

    మకర సంక్రాంతి శుభాకాంక్షలతో

    ~లలిత

    ReplyDelete
  2. దేవగన్నేరు లాంటి మీ టపాకు నా వ్యాఖ్య కాగితం పువ్వులా ఉంటుందేమో..రాయలేక పోతున్నాను రాయకుండా ఉండలేక పోతున్నాను..భక్తి, ముక్తి అన్నింటికీ మించి భావుకత..మీ కలం కలకాలం ఇలా సాగుతూనే ఉండాలని మనసారా కోరుకుంటూ...మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..

    ReplyDelete
  3. సుస్మితా...

    ఎప్పటినుంచో చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పకపోతే ఇంకోసారి చెప్పే సందర్భం రాదేమో - అదీ ఇలా అందరి ముందూ (అంటే మీ బ్లాగ్ముఖంగా)- ఒక వేళ సందర్భం వచ్చినా మీ వ్యాస పరంపర చదవడం వల్ల తొలగిపోయిన మనోమలినాలు మళ్ళీ అంటి ఈ మాట మీకు చెప్పనీకుండా చేస్తాయేమో అన్న భయం తో - ఇదిగో - ఇప్పుడు ఇలా చెప్పేస్తున్నాను.

    నాకిష్టమైన శ్రీయుతులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని, దేవులపల్లి వారిని ప్రత్యక్షం గా చూసే తరం లో పుట్టలేదని ఎక్కడో బాధ వుండేది నాకు. కానీ ఇప్పుడు ఇలా మీ బ్లాగ్ చదివే అవకాశం, మీతో మాట్లాడే వీలు కలిగాక మీతో సమకాలికురాలినయినందుకు గర్వ పడుతున్నాను. ఎప్పటికైనా మీ విజియనగరం వెళ్లి మీరు పుట్టిన భూమిని తాకి వచ్చే అవకాశం కలగాలని ఆశిస్తున్నాను - ఎందుకంటే అప్పుడు రాబోయే నా పిల్లల తరానికి - ఇదిగో ఇంత అందం గా తెలుగు వ్రాసే ఆవిడ నాకు తెలుసు, ఆవిడ పుట్టిన వూరు వెళ్లాను - అని చెప్పుకోవడానికి.
    నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టు మా మున్నుగాడు మీ బ్లాగ్ గురించి చెప్తే - తెలుగులోభాష లో వున్న అందాన్ని తెలుసుకోవడానికి - అదీ మీ బ్లాగ్ చదివి - ఈ వేసవి శలవులలో తాను కొంచెం "శీత కన్నేసిన" తెలుగు పాఠ్య పుస్తకాలని తెరుస్తానన్నాడు. వాడికి ఇష్టమైన పి. జి. వొడ్ హౌస్ పుస్తకాల మీద "ఆన" అన్నాడు :)

    మనః పూర్వక శుభాభినందనలతో...

    ~లలిత

    ReplyDelete
  4. గత ముప్పై రోజులుగా క్రంమం తప్పక మీరు చేసిన ఈ "కాత్యాయనీ వ్రతం" మాకు సాహితీ సంబరంగా మారి ప్రతిరోజు అలరించింది. ఈ వ్రతం ఇంత త్వరగా సమాప్తం కావడం కొంతవిలితిగానే అనిపిస్తుంది.

    త్వరలో "నాచ్చియార్ తిరుమొళి" ని కూడా సీరీస్ గా రాస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  5. ఏమి చెప్పమంటారు. చాలా బాగుంది. అద్భుతంగా వ్రాసారు అన్నా వెలితిగానే ఉంటుంది. చాలా మాట్లు కామెంటు పెడదామని కూడా ఆగిపోయాను, ఔచిత్య భంగం అవుతుందేమో నని. ఎంత చక్కగా మొదలు పెట్టారో అంతా చక్కగాను పూర్తి చేశారు. శుభాభినందనలు.
    ధనుర్మాసం గురించి చాలా తెలుసుకున్నాము. ధన్యవాదాలు.
    తెలుగు భాష లోని సౌందర్యం అంతా మీ భావుకత, ఊహ, కల్పన లలో కనిపించింది. మీరిలాగే మరెన్నో రచనలు చేయాలని కోరుకుంటూ న్నాను.
    అన్నట్టు లలిత గారి వి కొన్ని , అప్పుడప్పుడు భైరవ భట్ల కామేశ్వర రావు గారివి కామెంట్లు కూడా చాలా బాగున్నాయి. టపాకు తగ్గ కామెంట్లు. వారికి కూడా అభినందనలు.

    మీకు మీ కుటుంబ సభ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. వేయి కొలనులలో ప్రతిబింబించినా గగనాన దినమణి ఒక్కడే కదూ!...చాలా చక్కగా చెప్పారండి.

    మీరు తెలుగులో వర్ణించిన విధానం చాలా చాలా చక్కగా ఉందండి. తిరుప్పావై ద్వారా పూర్వుల జీవనవిధానాన్ని చదివిన తరువాత అప్పటివారి జీవనవిధానం ఎంతో గొప్పగా ఉండేదని, వారు భోగభాగ్యాలతో తులతూగేవారని కూడా తెలుస్తోంది.

    మేము కొంతకాలం క్రిందట యాత్రలకు వెళ్ళినప్పుడు .....శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారు ... విష్ణుచిత్తులవారికి పసిపాపగా కనిపించిన తోట ఉన్న ప్రదేశం ( ఇప్పుడు అక్కడ ఒక దేవాలయం ,తోట కూడా ఉన్నాయి. ) , మరియు వటపత్ర శాయి దేవాలయం చూశామండి. ఈ రెండు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. చాలా గొప్పగా ఉన్నాయండి..

    ReplyDelete
  7. నిర్విఘ్నంగా వ్రతం సంపూర్ణమైనందుకు శుభాకాంక్షలు. దానిలో మమ్మలనందరినీ భాగస్వాములను చేసినందుకు కృతజ్ఞతలు.

    మీ టపాల పరంపర చదువుతూంటే అడుగడుగునా నాకు విశ్వనాథవారి గోపికాగీతలే గుర్తుకువచ్చాయి. గోపికాగీతికల చివరన అతనంటారూ,

    గుంపులుగాగ పోవగను గోపకులాంగన లందులోపలన్
    వెంపరలాడి దొంగగ బ్రవేశమునందితి స్వీకరింతుపో
    గుంపును గుంపుగా ననుచు గొల్లవు వెఱ్ఱివటంచు లెక్కకుం
    దింపకువే వికుంఠపురి తెర్వుము ద్వారము లాశ్రితావనా!

    విశ్వనాథ శ్రీకృష్ణుడితో యిలా విన్నవించుకుంటున్నారు. "గోపస్త్రీలందరూ గుంపుగా నిన్ను చేరేందుకు వెళుతూ ఉంటే, ఆ గుంపులో నేను దొంగలా చేరి వారితో పాటు వచ్చాను. ఎందుకంటే, నువ్వో అమాయకపు గొల్లపిల్లాడివి కదా, మొత్తం గుంపుగుంపంతటినీ నీ దగ్గరకు చేర్చుకుంటావని. కృష్ణా! నన్ను విడిచిపెట్టకు. దయచేసి వైకుంఠ ద్వారాలు నాకుకూడా తెరువు!"

    మీ టపాలు చదువుతూ ఉంటే నాకూ అలానే అనాలనిపించింది.
    మీ తాతగారికి సహస్ర నమస్సుమాంజలి.

    సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  8. అయిపోయిందాండి? హమ్మయ్య! నెనరులు. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు.

    ReplyDelete
  9. అల నల్లనయ్యపై ఎల గోపికల అనురాగాన్ని పరమ రమణీయంగా నేత్ర పర్వంగా వాక్చిత్రాల్లో బంధించారు. పూర్వీకుల పథమే అని వినయించినా అలతి పొందిక పదాల్లో రూపించారు. కొంటె కృష్ణుడి వెన్నల వెన్నెల వన్నెల మాటున ధీర గంభీరుడూ... ధీరోదాత్తుడూ అయిన సీతాపతిని కూడా స్మరింపజేశారు. ధనుర్మాసపు గొబ్బిళ్ళలా రధం ముగ్గుల్లా ఎంతందంగా తీర్చి దిద్దారో.

    ReplyDelete
  10. హ్మ్.. గోదా దేవి ఎలాగైతే శ్రీవిల్లిబుత్తూరు నే రేపల్లె గా భావించి తిరుప్పావై రచించిందో.. మీరూ ఈ బ్లాగ్ లో అలాగే అందర్నీ కలుపుకుని ఇంకోసారి కాత్యాయినీ వ్రతం చేసినట్టున్నారు.


    అద్భుతం! మీతో పాటు, నేనూ భోగి నాటికి అన్ని టపాలూ చదివి వ్రత సమాప్తం గావించాను.

    మీకు హృదయపూర్వకం గా చప్పట్లు!


    అయితే రేపేం మొదలుపెట్టబోతున్నారు ? :)

    ReplyDelete
  11. వావ్ ! కోవా గారు చాలా బావుంది అనేది చాలా చిన్న మాట మీ సిరీస్ విషయం లో ! అసలు ఎంత అద్భుతం గా రాసారు . నిజం గా ఆ రేపల్లె ని మా కళ్ళ ముందు ఉంచారు .
    రోజు నిద్ర లేవ గానే మీ పొస్టు చదవటం అనేది ఈ నెల రోజులు గా ఒక అలవాటు గా మారింది , ఇప్పుడు అయిపొయింది అంతే దిగులేస్తుంది :(((

    ReplyDelete
  12. అభినందనలు. నా పాఠాల మాటేం చేశారు. నిజంగానే అడుగుతున్నాను.

    ReplyDelete
  13. శ్రీనివాస్January 14, 2012 at 5:57 PM

    చాలా కాలం నుంచి మీ బ్లాగు చదువుతున్నా కామెంటుకి బద్దకించాను. ఇవ్వాళ కామెంటాల్సిందే అని ఇలా వచ్చాను. వ్రతం మీరు ఆచరిస్తూ నలుగురినీ ఇలా చెబుతూ అందులో కొంత పుణ్యం సంపాదించిపెట్టారు. కృతజ్ణతలు. మీ పెద్దలకు నా నమస్సులు. మీకు ధన్యవాదాలు. మీకు అభ్యంతరం లేకపోతే మీ తాతగారి పేరు తెలియపరచగలరు.

    ReplyDelete
  14. @ లలిత: మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం మినహా ఏమీ చెయ్యలేను. వెన్నంటి నడిచే చెలిలా కాత్యాయనీ వ్రతాన్ని దగ్గరుండి పూర్తి చేయించిన మీదే పుణ్యమంతా!

    @ జ్యోతిర్మయి: ధన్యవాదాలండీ!

    @ లలిత: మాటల్లేవు. అర్హతకు మించిన అభినందన అని మాత్రం చెప్పగలను. ధన్యోస్మి.

    @ అవినేని భాస్కర్: హమ్మయ్యో! అంత బరువు మోయలేనండీ! ప్రోత్సహించిన మీ అందరికీ దక్కాల్సిన పుణ్యమిది. ధన్యవాదాలు!

    @ బులుసు సుబ్రహ్మణ్యం గారు: అయ్యో! ఎంత మాట! మీరు "బాగుంది" అని చిన్న మాట చెప్పినా అదెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది సర్! మీ ఆశీర్వాదం.. అంతే. ధన్యవాదాలు.

    ReplyDelete
  15. @ anrd: అవునా! నేను చూడలేదండీ.. ఈ సారి ప్రత్యేకించి విల్లిపుత్తూరు చూడాలి. ధన్యవాదాలు.

    @ భైరవభట్ల కామేశ్వరరావు: చాలా సంతోషంగా ఉందండీ! తోచిన తీరున పడుగూ పేకా అల్లుకుపోయాను. మీ వ్యాఖ్యలు జలతారు అంచులా నిండు తెచ్చాయి. ధన్యోస్మి. నేను విశ్వనాథ వారి గోపికాగీతలు చదవలేదండీ. పోతన భాగవతంలోనే చదివాను. మంచి విషయం తెలిపారు. ధన్యవాదాలు.

    @ Anonymous: అవునండీ. అయిపోయింది. ధన్యవాదాలు.

    @ మురళి: ధన్యవాదాలండీ!

    @ puranapandaphani: నా టపా కంటే మీఅందరి వ్యాఖ్యలే చాలా అందంగా కనిపిస్తున్నాయి. మీరిచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    @ కృష్ణప్రియ: మీ సెలవుదినాలలో నా టపాలు చదివేందుకు సమయం వెచ్చించినందుకు మీకే నేను ధన్యవాదాలు చెప్పాలి. రేపా..? పిండివంటలు చేసుకోవద్దూ..! :) ధన్యవాదాలు!

    ReplyDelete
  16. @ Sraavya Vattikuti: ప్రతి ఉదయం వ్రాయడాన్ని ఎంత ఆస్వాదించానో, మీ ఆదరాభిమానాలకు అంతే ఆనందించాను. ధన్యవాదాలండీ!

    @ Chandu S: అయ్యో! మీరలా అనేస్తే ఏం చెప్తాను చెప్పండి. నేర్పడానికి నాకేం రాదే! మీ అభిమానానికి ధన్యవాదాలు.

    @ శ్రీనివాస్: మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండీ.

    ReplyDelete
  17. standing ovation for this successful series ! great job...congratulations !!

    ReplyDelete
  18. భక్తి..భావుకత లని అందంగా కలిపి చేసిన మీ కధావ్రతం ఒక అద్భుతమైన సాహితీ సృష్టి అని చెప్పడంలో తప్పులేదేమో!.. నిర్విఘ్నంగా పూర్తిచేసినందుకు అభినందనలు. మమ్మల్ని ధన్యుల్ని చేసారు.
    సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  19. కొత్తావకాయ గారు, ఇంత చక్కని తెలుగులో ఇంత పెద్ద టపాలు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒకటి మాకందించడానికి మీరెంత శ్రమ పడి ఉంటారో తలచుకోడానికే నాకు కష్టంగా ఉందండీ ఎంతో నిబద్దతో ఈ వ్రతం పూర్తిచేసినందుకు అభినందనలు మరియూ ధన్యవాదాలు. నేను చందమామ కథల్లో తప్ప పురాణాలు వ్రతకథలూ ఏవీ చదవలేదు మొదటిసారి మీ ఈ కన్నయ్య కథలను మాత్రం పూర్తిగా చదివాను ప్రతిటపా కూడా ఒకటికి రెండుసార్లు చదువుకున్నాను కానీ వ్యాక్యరాయడానికి మాత్రం ధైర్యంచాలేది కాదు. రాసినా రొటీన్ గా బాగుంది అని రాయలేక ఇంకేం రాసినా తక్కువే అవుతుంది పైగా టపా అందం చెడుతుంది అనిపించి ఆగిపోయే వాడ్ని. మరోమారు ఇంత చక్కని సిరీస్ ను ఇంత సరళమైన తెలుగులో అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరో సిరీస్ ఏమైనా మొదలుపెడితే బాగుండునని కోరుకుంటూ శలవు :-)

    ReplyDelete
  20. మీ తెలుగు పాండిత్యం అపారం. మీ రచనా శైలి అద్భుతం. మీ వర్ణన అమోఘం.
    ప్రేమలో నేను... అరడజను సార్లు, చిన్నగీత టపాలు ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు. మీ నలకూబరుడంత కాకపోయినా, నాకు కూడా వంటలో కొంచం ప్రావీణ్యం ఎక్కువే. అయితే, నాకు కాబోయే భార్య కి మీలాంటి కష్టాలన్నమాటే.

    ReplyDelete
  21. అద్భుతమండీ,నిజంగా కొత్త ప్రపంచం చూపించారు థాంక్యూ వెరీ మచ్

    ReplyDelete
  22. తెన్నేటి హేమలత గారు లెని లోటు తీర్చగల శక్తి మీ రచనలకు ఉంది.

    ReplyDelete
  23. Mimmulanu kallaraa choosi manasara mee cheyyi pattukuni abhinandinchalani undi.
    Lakshmi Vasa

    ReplyDelete
  24. హాయ్ సుస్మితా.....చాలా బాగా రాసావు. ఇంతకు ముందు కూడా నీ టపాలు చదివాను. కానీ ఇవి చాలా బాగున్నాయి. రాసిన విషయం కంటే రాసిన విధానం నాకు బాగా నచ్చింది. మంచి తెలుగులో అందంగా రాస్తున్నావు. నీ పోస్ట్ లలో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మల్లాది వారి గురించి రాసినది. నీ వర్ణనలు అద్భుతంగా ఉన్నాయి. నీ శైలి ఒక దృశ్యమాలికలా ఉంది.

    ReplyDelete
  25. రాయడం ద్వారా మీరూ వ్రతం చేసుకున్నారు

    ReplyDelete
  26. susmita chala baga rasavu. A padala allika chala bavundi. Neelo inta kala vundani teliyadu suma. Tatagari polika baga vachindi

    ReplyDelete