Wednesday, December 14, 2011

ఒకసారి ఏం జరిగిందంటే..

అదో పల్లెటూరు. దాన్ని ఒరుసుకుని ప్రవహించే ఓ నల్లని నది. ఆ పక్కనే కొండల వరుస. ఆకాశంలో సాయంకాలం ఎగిరి వెళ్తున్న దేవతలకి ఆ ఊరు "పక్కకి తిరిగి పడుకున్న అందమైన పడతి జడలో మెరిసే నాగరంలా" కనిపిస్తుందట. ఆ ఊరి రంగు బంగారపు రంగు. "ఊరికి రంగేవిటా?" అనేగా మీ ప్రశ్న? ఇళ్ళకి చేరుతున్న గోవుల గిట్టలు రేపే నారింజ ధూళి చిమ్మచీకటయ్యేదాకా గాల్లో తేలుతూనే ఉంటుంది మరి! ఒకటా రెండా.. ప్రతీ ఇంటికి ఓ మంద పశువులుండాల్సిందే!

పాడీ, పంటా సమృధ్ధిగా ఉండే ఆ పల్లె పేరు "రేపల్లె". ఆ పక్కన పారుతున్నది "యమున". ఆ పల్లెలో వీచే గాలిలో నిత్యం తేలే ఓ దివ్య సుగంధం! అవును మరి! వెన్న కమ్మదనం, పున్నాగ పువ్వుల ఘుమఘుమలూ, ఆ ఊరి పడుచులద్దుకునే కస్తూరీ, జవ్వాది పరిమళాలూ.. ఇవన్నీ చాలవన్నట్టు ఆ ఊరి రాజుగారింట్లోంచి సతతమూ వీచే కర్పూర వీచికలూ కలిస్తే గాలి మత్తెక్కక మానుతుందా?

ఆ ఊరి రాజుగారింట్లో కర్పూరానిది ఉప్పుతో సమానమైన వాడుక. "రాచబిడ్డ"కి వాళ్ళమ్మ దిష్టి తీసి హారతివ్వని పూట లేదు మరి! ఎందుకా! నెమ్మదిగా అడుగుతారేం? అతను మహ అందగాడట!! అతనిది నీలిమేఘపు రంగు. అందమంటే అలాంటి ఇలాంటి అందం కాదు! అందానికే మోహం కలిగి, మనసు మరిగి మతి తప్పేంత సమ్మోహనుడట! అదొక్కటేనా? ఓ పాల నవ్వు నవ్వుతాడట! మల్లెలు చిన్నబోయేలా, వెన్నెల తెల్లబోయేలా.. అతని నవ్వు ఎంత బావుంటుందంటే, ఆ ఊరి పడుచులందరూ పాల కడవల్లో, నీళ్ళ బిందెల్లో, అద్దాల్లో, వాళ్ళ చేతుల మణి కంకణాల్లో.. ఇవన్నీ సరిపోక ఒకరి కళ్ళల్లోకి ఒకరు తమ ప్రతిబింబాన్ని చూసుకుని అతనిలా నవ్వుదామని నిత్యం సాధన చేస్తూ ఉంటారట! అయితే వాళ్ళకి ఆ నవ్వు పట్టుబడకపోవడానికి కారణమేవిటో తెలుసా! ఆ నవ్వులో వేరొకరికి చేతకాని 'ఓ చిన్న తుంటరితనం' ఉంటుంది. తుంటరితనం అతనికి కట్టుబానిస! అతను చేసే పనుల్లో, పలికే పలుకుల్లో, నవ్వే నవ్వులో సదా వెన్నంటి వచ్చే దాసానుదాసుడు ఆ 'కొంటెతనం'!

అతనికి ఇంకో విద్య వచ్చు, తెలుసా! పిల్లనగ్రోవి ఊదుతాడట. చిత్రమేమిటంటే అతను మురళిని మ్రోగిస్తూ ఉంటే వినేవారికి ఆ మాధుర్యానికి కళ్ళు తెరవలేని మత్తు కమ్మేస్తుందట! అలా అని మురళీధరుణ్ణి చూడకపోతే ఎలా..? అందుకని ఏకకాలంలో ఆ వేణుగానం వింటూ, కళ్ళు తెరిచి అతన్ని చూడడం ఎవరికి సాధ్యమవుతుందో అని పందాలు కాసుకుంటూ ఉంటారట ఆ ఊళ్ళో. గెలిచినవాడు లేడిప్పటికి!

అతని అందానికే వాళ్ళమ్మ దిష్టి తిసేస్తోందనుకుంటున్నారేమో! కాదు.. కాదు! అతను బోలెడు బలమున్నవాడట! ఆ ఊరికి రాక్షసుల బెడద కొంచెం ఎక్కువే, పాపం! ఆడపిల్ల రూపంలోనూ, బండి రూపంలోనూ, కొంగలాగా, ఆవులాగా.. ఇలా రకరకాల మారు వేషాల్లో బోలెడుమంది రాక్షసులు వచ్చి అతని చేతుల్లో ప్రాణాలు విడిచారట. పాపం, తల్లి మనసు కదా! అందుకని ఎటు నుంచి ఏ కీడొస్తుందో అని కొడుకుని చూసి బెంగపడుతూ, అతని అందానికి మురిసిపోతూ మెటికెలు విరుస్తూ ముప్పూటలా దిష్టి తీస్తూంటుందన్నమాట!

మరి ఇంత అందగాడి వెంటపడేవాళ్ళేమైనా తక్కువా? అబ్బే! ఊరందరి కళ్ళూ అతని మీదే! ఆ ఊరి ఆడపిల్లలందరికీ అతనంటే తగని మక్కువ. ఇంట్లో కట్టడి చేస్తున్నా, పెడచెవిన పెట్టి నది ఒడ్డునా, తోటల్లోనూ అతను మురళీగానం చేస్తూంటే పరుగున వెళ్ళి వింటూ ఉండేవారట! అతగాని ఊహల్లో మైమరిచిపోతూ నిత్యకృత్యాలన్నీ అవకతవకలుగా చేసేస్తూ ఉండేవారట. చల్ల చిలికేవేళ అతను గుర్తొస్తే, ఆ చల్లలో వెన్న ఏర్పడి మళ్ళీ కరిగిపోయేదాకా చిలికీ చిలికీ ఆ ఊరి భామలందరి నడుములూ బహుసన్నమైపోయాయట. "ఏ క్షణంలో అతను ఎదురుపడతాడో!" అని ఎప్పుడూ వాళ్ళందరూ అలంకారాలు చేసుకుని, పువ్వులు ముడుచుకుని గంధపు కుప్పెల్లా, నిత్యమల్లె చెట్లలా, బంగారుబొమ్మల్లా మెరిసిపోతూ ఉంటారట!

అలా గడుస్తూండగా శరదృతువు వచ్చింది. ఆకాశంలో మేఘాలు తెల్లని పువ్వుల్లా, తేలికైన, స్వచ్చమైన మనసుల్లా తేలుతున్నాయి. రాత్రుల్లో వెన్నెల చాందినీకి కట్టిన ముత్యాల్లా నక్షత్రాలు మెరుస్తున్నాయి. పండి ఓరగా వాలిన వరిచేలలో, గాలి వీచినప్పుడల్లా గలగలమని వినసొంపైన సడి పుట్టేది. చేలల్లో వాలిన చిలుకలు అదిలించగానే గోలగోలగా ఎగిరిపోయేవి. కొలనుల్లో కలహంసలు కిక్కిరిసి తామరలకి చోటు లేకుండా చేసేసాయి. చామంతులూ, బంతులూ విరిసి పసిడిహారతుల్లా మెరుస్తున్నాయి. ఇంత మనోహరమైన రోజుల్లో ఆ ఊరి పడుచులకి ఒకటే బాధ! మన్మథ తాపం. చెరుకు వింట మన్మథుడెక్కుపెట్టిన నల్ల కలువల బాణాలు నేరుగా ఆ వెర్రి గొల్ల పడుచులకి గుచ్చుకునేవి.

విరహబాధ తట్టుకోలేని పడుచులంతా యమునలో జలకాలాడుతూ, గుసగుసగా ఒకరి చెవిలో ఒకరు తమ బాధ చెప్పుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, వేళాకోళం చేసుకుంటూ నల్లనయ్య గురించి కలలు కంటున్నారు. పిల్లనగ్రోవి మ్రోగేసరికి ఒళ్ళుమరిచి ఆ దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ బాధకి ఉపాయం ఏదైనా ఉంటే బాగుండునని తలవని ఆడపిల్ల లేదు.

ఒకనాడు ఉదయం పల్లెలో పెద్దలందరూ ఆడపిల్లలనందర్నీ సమావేశపరిచారు. "ఎందుకో? ఏం చెప్తారో? కారణమేంటో?" అని వాళ్ళందరూ గుసగుసలాడుకుంటున్న ధ్వని తుమ్మెదల గుంపు ఝుమ్మని ఎగురుతున్నట్టు వినిపిస్తోంది. ఓ ముసలి గొల్ల లేచి పువ్వుల దండలా ఓ వైపు నిలబడిన పడుచుల్ని చూసి చెప్పనారంభించాడు. "అమ్మాయిలూ, మీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. నేనూ, మిగిలిన పెద్దలూ ఇందాకే మన పల్లె చివర ఉన్న మునిపల్లెకి వెళ్ళి వచ్చాం. అక్కడి మునీశ్వరుడు చెప్పిన మాటలివి. రాబోయేది హేమంత ఋతువు. మార్గశిరమాసం మంచి కాలమట. ఈ నెలలో ఆడపిల్లలు కాత్యాయినీ దేవిని పూజిస్తే మంచిదట. మంచి వర్షాలు కురిసి, పాడీ పంటా సమృధ్ధి చెందుతుందట."

"ఈ పెద్దాయన ఒకరూ, మంత్రాలకి చింతకాయలు రాలతాయా? అయినా మనకిప్పుడేం తక్కువైందని? అబ్బో, ఈ పూజలూ పునస్కారాలూ మన వల్ల అయ్యేవేనా? ఇళ్ళల్లో పనులో!" ఇలా అమ్మాయిలందరూ గుసగుసలు ప్రారంభించారు.

వాళ్ళ ఉద్దేశ్యం, మాటలూ తెలియని వాళ్ళు కాదు కదా పెద్దలు. అమ్మ పుట్టిల్లు మేనమామ ఎరుగడా? పండిన మీసం చాటున నర్మగర్భంగా నవ్వుకుని పెద్దాయన చెప్పాడు.. "అంతే కాదమ్మాయిలూ, ఈ వ్రతం శ్రధ్ధగా, సక్రమంగా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయట."

"కోరికలన్నీ అంటే.." ఓ పిల్ల కొంటెగా అడిగి ముందున్న అమ్మాయి వెనక్కి నక్కింది.
"ఆహా.. అన్ని కోరికలూ అంటే అన్ని కోరికలూ.. సురభికి కాసుల పేరూ, నర్మదకి మువ్వల పట్టెడా, మల్లికకి జడ నాగరమూ, ప్రియంవదకి దంతపు బొట్టుపెట్టె, మృణాలినికి సంపెంగ రంగు పట్టు చీరా.. నీకు కోరిన మొగుడూను" ఘొల్లుమని నవ్వారు పడుచులందరూ. ఇందాకా ప్రశ్న వేసిన కమలిని సిగ్గుగా నవ్వుతూ వెనక్కి జరిగింది. సభ తీరిన పెద్దవాళ్ళూ ముసిముసిగా నవ్వుకున్నారు.
"అలా కాదు పెద్దయ్యా, మా చేత వ్రతం చేయించేదెవరనీ?" సందేహం వెలిబుచ్చింది మృణాలిని.
"ముందు మీరంటూ సిధ్ధపడితే, అన్నీ జరుగుతాయి. సురభీ, ప్రియంవదా, ఉత్పలా, కావేరి.. ఇంత మంది ఉన్నారు మీలో అన్నీ తెలిసినవారూ, చదువుకున్న వారూను. మీలో కొందరు ఓ సారి మునిపల్లెకి వెళ్ళి కనుక్కుంటే విషయాలూ, విధానమూ మీకే తెలుస్తాయి. అన్నీ మేమే చెప్పాలంటే ఎలాగర్రా.. మీరే ఉత్సాహంగా అన్నీ తెలుసుకోవాలీ, చెయ్యలీ కానీ!" ఉత్సాహపరిచాడు పెద్దాయన.

ఆడపిల్లలందరూ ఒకరి మొహాలొకరు చూసుకుని, గోలగోలగా అభిప్రాయాలూ, సందేహాలూ, అనుమానాలూ వెలిబుచ్చుకుని, తమలో తామే సమాధానాలు చెప్పుకుని ఒక అంగీకారానికి వచ్చారు.
"సరే పెద్దయ్యా.. హేమంతం వచ్చేసరికి సిధ్ధంగా ఉంటాం. అందరం కాత్యాయనీ వ్రతం చేస్తాం. మంచి పనికి వెనకాడేదేముంది?" అని స్థిరంగా చెప్పింది సురభి.

హేమంతం వచ్చేసింది. తెలవారితే వ్రతారంభం. యమున ఒడ్డున స్నానానికి కలుద్దామని, అక్కడే కాత్యాయనీ దేవికి పూజ చేసుకోవాలని.. ముందు రోజే అమ్మాయిలందరూ కలిసి నిర్ణయం చేసుకున్నారు. హేమంతమంటే మాటలా! చలి వణికించేస్తోందప్పుడే! అంత తెలవారు ఝామున లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలంటే కష్టం.. మంచు కత్తిలా కోసేసే యమున నీళ్ళలో మూడు మునకలు వెయ్యాలని తలుచుకుంటేనే అందరికీ వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. అదే మాట అంది ఉత్పల. ఖస్సుమని ఒంటికాలిన లేచింది కమలిని. "గారెలు తినాలని ఉందంటే అవి గాల్లో పుట్టవు, అమ్మడూ! మనమే వండుకోవాలి. కోరినవి దక్కాలంటే ఆ మాత్రం కష్టం తప్పదు. మరో మాట లేదు. వేకువ ఝాముకి ఘడియ ముందే నేను మీ ఇంటికి వచ్చి లేపుతాను."అంది చేతులు తిప్పుకుంటూ.
"ఏనుగులు మీద పరిగెట్టినా లేవని దానివి! నువ్వా సుద్దులు చెప్తున్నావ్, కమలినీ!?" వెక్కిరించింది సురభి.
"ఏం కాదు. రేపు చూడండి. ఉత్పల ఒక్కర్తినే కాదు మీ అందరినీ నేనే లేపుతాను." ఉడుక్కుంటూ చెప్పింది కమలిని.
"అబ్బా..ఆగండే! చిటికె వేస్తే తెలివొస్తుంది సురభికి. సురభీ! నువ్వే రేపు మా అందరినీ నిద్ర లేపాలి. నీదే పూచీ. మనం లేవడం ఆలస్యమయి పొద్దు పొడిచిందా.. వ్రతానికి ముప్పు!" హెచ్చరిస్తూ చెప్పింది ఉత్పల.
"సరేనర్రా.. ఇళ్ళకి వెళ్ళి హాయిగా నిద్రపోండి. నేను కోడికూతకి రెండు ఘడియల ముందే లేస్తాను. పక్కనే కమలిని ఇల్లు కదా.. ఇద్దరమూ మిగిలిన వాళ్ళని లేపుతాం." చెప్పింది సురభి.
అందరూ ఇంటిదిక్కు పట్టారు.



*ఇప్పటికి ఇంతే. మిగిలిన కథ రేపు.


(బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి.)




22 comments:

  1. ఆపకుండా చదివించేశారు కొత్తావకాయ గారూ. :)

    హేమంతమంటే మాటలా మరి. :)

    చివర్న "ఇద్దరమూ మిగిలినవాళ్ళని లేపుతాం" అన్నది సురభి కదా? సరిచెయ్యాలేమో.

    ReplyDelete
  2. ఐతే మాక్కూడా ముఫ్ఫై వరాలు దక్కుతాయన్నమాట!

    ReplyDelete
  3. (I apologize for commenting in English - I can't type in Telugu from here)


    I have no authoritative vocabulary both in Telugu or English to express my feelings about this post and the beautiful language that you used. Kudos, Susmitha!

    Honestly, your Telugu gives me a divine feeling which makes me respect you instead of envying you for my inability to write like you do. That's all I can say.

    If Sri Pilaka Ganapathi Shasthri were here, he would have felt happy to see that his legacy is being carried over to future generations with a matched dignity with his works.

    Congratulations!!! Keep it up.

    - Lalitha

    ReplyDelete
  4. చాలా ఆలస్యమైంది మీ టపా ఉదయం కాఫీ కోసం దాచుకు౦టున్నాను. తరువాతొచ్చి వ్యాఖ్య పెడతా..

    ReplyDelete
  5. చాలా బాగుంది..మిగిలిన కధ కొసం నిరీక్షిస్తూ..

    ReplyDelete
  6. ధనుర్మాసమంతా వేడి వేడి పొంగళ్ లాంటి టపాలని కైంకర్యం చేయబోతున్నారన్న మాట!! శుభం..

    ReplyDelete
  7. చాందిని అన్న హిందీ పదం పొంగలిలో మిరియం గింజలా ఉంది.

    ReplyDelete
  8. @Mohan Vamshi

    Chandini is indeed a Telugu word. Susmitha hasn't done any mistake :)
    It's our Telugu knowledge that troubles us sometimes :)

    -M

    ReplyDelete
  9. అవునండీ!చాందిని హిందుస్తానీ పదమే. మేలుకట్టు అనేది సరైన తెలుగు పదం.

    "తెల్లని చాందినీ తెర క్రింద వ్రేలాడుతున్న ముత్యాల మాలిక వలె తారకలెల్లెడల తరళించినవి." ఇది యధాతధంగా 1964-65 లో పిలకా గణపతి శాస్త్రి గారు వ్రాసిన హరివంశంలో వాక్యమండీ. నేను వ్రాసుకునేటపుడు ఓ క్షణం చిన్న సందిగ్ధత కలిగిన మాట వాస్తవం. కానీ శాస్త్రిగారి రచన మీదున్న ప్రీతితో అలాగే వ్రాసేసుకున్నాను. పొంగలిలో మిరియపు గింజేగా.. ఉంచేద్దామలాగే! ధన్యవాదాలు మోహనవంశీ గారూ!

    ReplyDelete
  10. ఉత్సాహంగా తరువాత భాగం కోసం ఎదురు చూస్తుంటాం.

    ReplyDelete
  11. శుభోదయం..కాఫీతో మంచి టపా..పన్నీరు, గంధం పూసిన౦త బావుంది.

    ReplyDelete
  12. మీ టపా అంటే పంచభక్ష్యపరమాన్నాలు కదా అని ఆవురావురమని వస్తే ఇలా సగం పెట్టి మీరు 'కిచెన్ క్లోజ్‌డ్ ఫర్ టుడే' అంటే ఎలాగండీ, కొత్తావకాయ గారూ :((

    "పక్కకి తిరిగి పడుకున్న అందమైన పడతి జడలో మెరిసే నాగరంలా" కనిపిస్తుందట" ---- ఇది చదవడం ఆలస్యం నా మనసు ఝూమ్మని ఆవూళ్ళో దిగిపోయింది! ఏం చెప్పడానికీ తోచక, యధావిధిగానే మళ్ళీ ఆ చెప్పిందే చెప్తున్నా 'చాలా బా రాశారు!'
    అట్టే ఆలశ్యం చేయకుండా తరువాతి భాగం వెంఠనే రాసేయండి మరి :-)

    ReplyDelete
  13. పై ఇద్దరి మాటే నాదీనూ....

    ReplyDelete
  14. రెండు రోజుల క్రితమే విశాల నేత్రాలు చదివి, ఇంకా ఆ మాధుర్యం నించి తేరు కోలేదు, ప్రాచిన గాఢ లహరి చదువుతున్నాను..ఇంతలో యాదృచ్చికం గా మీ పోస్ట్ చదివాను, గణపతి శాస్త్రి గారు, నా మీద ఇలా కరునిన్చేరు..అనుకుంటున్నాను..చాల బాగుంది..కన్నయ్య కథలు ఎన్ని చదివిన, విన్నా తనివి తీరదు..
    వసంతం.

    ReplyDelete
  15. @ పద్మ: అవునండీ! సరిచేసాను. ధన్యవాదాలు.

    @ Madhavi: ధన్యవాదాలు.

    @ rajan: మనందరికీ దక్కాలని కోరుకుందాం. ధన్యవాదాలు.

    @ వేణూశ్రీకాంత్: ధన్యవాదాలండీ!

    @ లలిత: ఎంత పెద్ద ప్రశంస! చాలా సంబరమనిపించింది. భయం కూడా కలిగింది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోగలనో, లేదో అని. ధన్యవాదాలు!

    ReplyDelete
  16. @ జ్యోతిర్మయి: మళ్ళీ వచ్చి మరీ చదివినందుకు ధన్యవాదాలండీ!

    @ నైమిష్: ఈ మాసమంతా ప్రతి రోజూ ఒక టపా ఉంటుందండీ! ఆదరించినందుకు ధన్యవాదాలు.

    @ మురళి: నా సంకల్పానికి మీ శుభకామనలు తోడైతే తప్పకుండా! ధన్యవాదాలు!

    @ M: వివరణ ఇచ్చానండీ. చూసారా? మీ మాట సాయానికి ధన్యవాదాలు.

    @ MURALI: సంతోషమండీ! ధన్యవాదాలు.

    ReplyDelete
  17. @ నిషిగంధ: మీ స్పందనకి ఏమని బదులివ్వాలో తెలియడంలేదండీ! మిమ్మల్ని నిరాశ పరచకూడదనే నా ప్రయత్నం. ధన్యవాదాలు.

    @ sunita: మీరు అడిగినట్టే తరచూ రాసేస్తున్నాను. ఎలా రాస్తానో మరి! ధన్యవాదాలు.

    @ Vasantham: చాలా మంచి పుస్తకాలు చదువుతున్నారు. టపా నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    ReplyDelete
  18. చాలా చాలా బాగుందండీ.. నేను ఈరోజే చూడటం చాలా భాగాలు బాకీ పడిపోయినట్టున్నాను.;)అన్నీ చదివేసొచ్చి చెప్తా..

    ReplyDelete
  19. ఇప్పుడు తీరిగ్గా.. మొదలు పెడుతున్నా.. ఒక్కొక్క భాగం, మొదటి నుంచీ చదువుదామని. అంటే ముందు చదవలేదని కాదు.. ఆదరా బాదరా గా కొన్ని భాగాలు చదివాను.

    ReplyDelete
  20. అచ్చంగా కృష్ణుడిని కళ్ళల్లో నింపారు.. మీ అక్షరాల తోడుగా నేను మళ్ళీ రేపల్లె ప్రయాణం కట్టాను.. :)

    ReplyDelete