"యెంకి గాలొకసారి యిసిరినా సాలు - తోటంత రాజల్లె తవ్విపోసేను.. యెంకి సూపే సాలున"న్నాడు నాయిడుబావ. నిజమే! యెంకి లాంటి పిల్ల చూపే పడితే మహరాజయోగమే!
***
***
***
***
***
***
"అమ్మకడుపు చల్లగా నూరేళ్ళు బతక"మని కోరుకునే మనసూ, అవసరమైన క్షణాన వెర్రిబసవన్నకైనా కొమ్ము విసిరే పొగరు నేర్పే తెలివీ, పుచ్చపువ్వంటి వెన్నెల రేయి వృధా పోనివ్వక కులుకు చూపి ముందడుగు వేయించే ఒడుపూ.. ముప్పేటలా అల్లుకున్న పదారణాల ఆ “ఎన్నెల పిల్ల” పాట – “ఆరుద్ర” వ్రాసిచ్చిన పాట.
"అటు ఎన్నెలా.. ఇటు ఎన్నెలా.." అంటూ తన బంగారు సామిని చూసి మురుస్తున్న ఓ పిల్లకి ఏకాంతం కొండంత చొరవనిచ్చింది. బిడియాన్ని పక్కన పెట్టి తన ఇష్టాన్ని చూపాల్సిన తరుణం. అమాయకుడైన పడుచువాడిపై మనసు పడింది. లాలిత్యం పోతపోసిన పల్లె పాట పాడుతోంది.
కలువంటి మోము దానివనో, వెన్నెలంటి నీ నవ్వనో.. ఆడపిల్లని పోల్చి పొగడదండలేయడం కద్దు. అటు ఇటైతేనో! మగరాయని బులిపించేందుకు మగువకు మాటలు కరువా? కానేకావు! "మల్లె మొగ్గల నవ్వు నవ్వకురా.. ఓరందగాడ బంగారు సాఁవీ.. నీ నవ్వు లోనే తెల్లవారునురా!" అని హెచ్చరించింది.
ఎన్నెలల సొగసంత ఏటిపాలేనా? ఊఁహూ.. కానివ్వననంటోంది. ఏరులాగ ఎన్నెలంతా జారిజారి పారిపోతే.. ఏటికి ఎడద అడ్డువేసిమరీ ఆపేస్తానంటోంది. ఎంత మక్కువ ఆ పిల్లకి! ఎన్నెలంటేనా? ఎన్నెల్లో నవ్వుతున్న బంగారు సామంటేనా?
స్త్రీసహజమైన సిగ్గరితనాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండానే గుట్టుమాటలలో మనసు పలికించింది. "కన్ను నిన్నే కౌగలించెనురా.. నిన్ను చూస్తే మనసు నిలవదు.. రా" అని.
అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా
ఎటు సూస్తే అటు ఎన్నెలా
ఓరందగాడ బంగారు సాఁమీ
నా మనసు ఎవరి పాలు సేతునురా
ఈ వయసు ఎవరీ పాలు సేతునురా
మీద జూస్తే సందమాఁవ
కింద జూస్తే తెల్లకలవ
మల్లెమొగ్గల నవ్వు నవ్వకురా
నీ నవ్వులోనే తెల్లవారునురా
ఏరులాగ ఎన్నెలంతా జారిజారి పారిపోతే
ఏటికెడద అడ్డమేసెద రా
ఓ రందగాడ బంగారు సాఁమీ
ఈ నీటి మీదె కొంగు పరతును రా
ఆశ పెట్టే లేతపెదవి
ఆవులించే దోరవయసు
కన్ను నిన్నే కౌగలించెనురా
ఓ..రందగాడ బంగారుసాఁమీ
ఇలా నిన్ను జూస్తే మనసు నిలవదు రా
ఎటు సూస్తే అటు ఎన్నెలా
ఓరందగాడ బంగారు సాఁమీ
నా మనసు ఎవరి పాలు సేతునురా
ఈ వయసు ఎవరీ పాలు సేతునురా
మీద జూస్తే సందమాఁవ
కింద జూస్తే తెల్లకలవ
మల్లెమొగ్గల నవ్వు నవ్వకురా
నీ నవ్వులోనే తెల్లవారునురా
ఏరులాగ ఎన్నెలంతా జారిజారి పారిపోతే
ఏటికెడద అడ్డమేసెద రా
ఓ రందగాడ బంగారు సాఁమీ
ఈ నీటి మీదె కొంగు పరతును రా
ఆశ పెట్టే లేతపెదవి
ఆవులించే దోరవయసు
కన్ను నిన్నే కౌగలించెనురా
ఓ..రందగాడ బంగారుసాఁమీ
ఇలా నిన్ను జూస్తే మనసు నిలవదు రా
"ఆడువారి మాటలకు అర్ధాలె వేరులే!" అని పెద్దలు చెప్పిన మాట జ్ఞప్తికి లేకపోతే - తప్పక తప్పుదారి పట్టించే పాటొకటుంది. "పాలగుమ్మి పద్మరాజు"ది! గుమ్మపాలల్లే కమ్మనిది!
ఆశల రంగవల్లులల్లిన కన్నెప్రాయపు మునివాకిట.. ఎప్పుడెదురవుతాడో, ఏనాడొస్తాడో ఊహించలేని అతిథి "అతడు". "అతిథి దేవోభవ" అన్నారాయే! ఎప్పుడొస్తాడో తెలియని వానికైనా మరియాదలు తక్కువ చేయని సంప్రదాయం మనది. అది ఈ అమ్మాయీమణీ పుణికిపుచ్చుకుంది. ఇల్లు కడిగిన ముత్యంలా ఉంచాలనుకుంది. తానూ ముచ్చటగా అలంకరించుకుని ఎదుర్కోలు పలకాలనుకుంది. వేళకానివేళలో వచ్చిన ఆ అనుకోని అతిథికి ఆకలవుతుందేమో.. పంచభక్ష్యాలు సిధ్ధం చేయాలనుకుంది. ఈ పనులన్నీ తెమలేలోగా అతనొచ్చేస్తే.. ఎలా?
"నేనొచ్చే వేళకి నీ అలంకరణలో జాప్యమా! ఇదేనా నీ ఎదురుచూపు?" అని తప్పు పట్టుకుంటేనో?
అందుకే.. "సిగలో చేరేందుకు విచ్చుకోని సిరిమల్లెలదే జాగు" అని చెపుతోంది.
"నిద్దురనీడలు వీడని కనులకు కాటుకెలా దిద్దనూ?" అని వాపోతోంది.
"తాను మనసులో సన్నిధ్ధమే" ఆతనికి చెప్పకనే చెప్పాలనుకుందే కానీ రమ్మని బిడియం విడిచి పిలువలేదు. ముగ్ధ సౌందర్య నాయిక!
"రాకోయీ అనుకోని అతిథీ.." పెదవంచున మాటే కానీ ఆతను వచ్చే ఆ క్షణం కోసమేగా ఇన్నాళ్ళూ వేచి ఉన్నది!
ఎంతటి అందానికైనా తెలివితేటలూ, గడుసుదనమూ తోడయితేనే - బంగారానికి తావి అబ్బినట్టు!
"రాకోయీ.." అంటూనే ఎదురుచూస్తున్న తానేమైనా చులకనౌతుందేమో అని అనుమానమొచ్చిందేమో.. ఆతనికో చిక్కు ప్రశ్న విసిరింది.
"వచ్చావు.. బాగానే ఉంది. ఊరక దారిని పోతూ పోతూ అలసే వచ్చితివో.." అంటూ
నొసలు ముడివేసింది.
"అబ్బే లేదు లేదు.. నీకోసమే వచ్చానని" దాసుడు ఒప్పుకునే లోగా మరో చెణుకు "ఒంటరిగా ఉన్ననని నే తెలిసీ వచ్చితివో.."
అవుననగలడా? కాదని మనగలడా? అదీ ఆడపిల్లంటే!
అప్పటికే ఏమనాలో తెలియక బెంబేలుపడే పురుషుడికి అప్పుడే ఊరట కలిగించేస్తే ఎలా..?
"రమ్మనుటకు సాహసము చాలదు"
"హతోస్మి!" అని వెనుతిరగబోతాడేమో!
"పొమ్మనుటా మరియాద కాదిది.." అయినప్పటికీ "త్వరపడి రాకోయీ అనుకోని అతిథీ.."
వాకిటి తలుపులు తెరువనె లేదు
ముంగిట ముగ్గులా తీర్చనె లేదు
వేళకాని వేళా.. ఈ వేళకాని వేళా
ఇంటికి రాకోయీ అనుకోని అతిథీ
సిగలో పువ్వులు ముడవాలంటే సిరిమల్లెలు వికసింపనె లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే
నిద్దుర నీడలా వీడనె లేదు
పాలు వెన్నలు తేనే లేదు
పంచ భక్ష్యములా చేయనె లేదు
వేళ కాని వేళా ఈ వేళకాని వేళా
విందుకు రాకోయీ అనుకోని అతిథీ
ఊరక దారిని పోతూ పోతూ
అలసీ వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో
రమ్మనుటకు సాహసము చాలదు
పొమ్మనుటా మరియాద కాదది
ముంగిట ముగ్గులా తీర్చనె లేదు
వేళకాని వేళా.. ఈ వేళకాని వేళా
ఇంటికి రాకోయీ అనుకోని అతిథీ
సిగలో పువ్వులు ముడవాలంటే సిరిమల్లెలు వికసింపనె లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే
నిద్దుర నీడలా వీడనె లేదు
పాలు వెన్నలు తేనే లేదు
పంచ భక్ష్యములా చేయనె లేదు
వేళ కాని వేళా ఈ వేళకాని వేళా
విందుకు రాకోయీ అనుకోని అతిథీ
ఊరక దారిని పోతూ పోతూ
అలసీ వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో
రమ్మనుటకు సాహసము చాలదు
పొమ్మనుటా మరియాద కాదది
వేళకాని వేళా ఈ వేళ కానివేళా
త్వరపడి రాకోయీ అనుకోని అతిథీ
త్వరపడి రాకోయీ అనుకోని అతిథీ
మనసేలే దొరకై ఎదురుచూపులో మధురమైన బాధ! తీయని నరకాన్ని, హింసించే హాయినీ.. అనుభవానికి తెచ్చే ఎడబాటు కడవాకిట - అతడొచ్చే క్షణం కోసం వేచియున్న ప్రోషిత భర్తృకని, భక్తురాలిని.. “దేవులపల్లి కృష్ణశాస్త్రి” తప్ప వేరొకరు పదాలలో ప్రతిష్ఠ చేయలేరేమో!
"అట చూడ వీటి ముంగిటను మౌనముగా తలవాల్చె మన మందార తరువు.." అని తానూ అలాగే ఎదురుచూసే ఆమెలో స్థితప్రజ్ఞతను కూడా రంగరించి మలచిన ఈ పాట ఒక మణిపూస! ఆ మాణిక్యపు నాణ్యతని వెలకట్టాలనో, రంగునో, తళుకునో వర్ణించాలనో ప్రయాసపడడం అత్యాశ. అయినప్పటికీ "ఆహా!' అని అబ్బురపడడం మానవసహజం!
"నీవొచ్చే మధురక్షణమేదో కానుకోలేని మందమతిని! కాస్త ముందు తెలిసినా.. ఈ మందిరమిటులుంచేనా?" అని వాపోతుంది. "వాకిట సుందరమందారకుంద సుమదళములు పరచి నీ కనులకు విందులివ్వాలి.." అని కోరిక వెలిబుచ్చుతుంది. అయితే అంత వెసులుబాటేదీ! ఎదురు చూడని క్షణంలో ఆతడొచ్చినా.. తోట పూలు ఆమెకు బాసట నిలిచే చెలులు. అతడి దారిపొడవునా ఆమె తలపుల్లా అప్రయత్నంగానే జారి ఎదురుచూస్తున్న పారిజాతాలున్నాయి. "వాటిపై నీ అడుగుల గురుతులు.. ప్రభూ! అవి చాలవూ!" అని తాదాత్మ్యం చెందుతుంది. అవి శీతవేళ తడిసిన పారిజాతాలట.. ఎడబాటుతో చెమ్మగిల్లిన తలపులకు ఇంతకంటే అందమైన పోలిక వేరేది!
"ఏలాగు ఈ మేఘవేళ - ఒంటరి రేల.. ప్రాణేశ్వరు ప్రవ్వసి బాసి.." అని వేసారుతూ బ్రతుకంతా ఎదురుచూచినా నీవు రాలేదు.. ఎప్పుడో, ఏ ఎదురు చూడని వేళనో వచ్చి ఇట్టే మాయమౌతావు!" అని తాననుభవించే వెర్రిబాధకు మాటలు వెతుక్కుంటుంది. అలా అని వచ్చిన ప్రభువును బంధించే ప్రయత్నమూ చేయలేక నిలచిపోయింది. బంధించేతటిదా.. ఆమెకా శక్తి ఉందా? హృదయమే సంకెల జేసి బంధించాలనుకుందట. మరి ఎందుకు ఆకట్టుకోలేకపోయిందో..? ఎవరి రాక కోసం ప్రాణాలు నిలుపుకుందో ఆ ప్రభువే ఎదురయ్యాక వేరే బంధనాల గురించి ఆలోచించేంతటి మతి ఉంటుందా? ఆనంద స్థితే తప్ప!
ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ..
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ..
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందార కుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచిన చాలును
సుందర మందార కుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచిన చాలును
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి
ఓ కన్నెజాజి.. ఆమె కనుల నిండా కలలు! వరకట్నపు విసపుకోరలతో కాటేయబోయిన పెళ్ళిచూపుల పాము నుండి తెగువతో తప్పించుకుని, గాయపడ్డ మనసు చిక్కబట్టుకుంటోందా పిల్ల!
ఇంతలో అతడు కనిపించాడు. శ్రీమన్మహారాజ మార్తాండ తేజుడూ.. ఆనందరాయుడూ.. అందగాడు! అప్పుడెప్పుడో అల్లరిగా అల్లుకున్న ఊహలన్నీ పలకరించాయి. వాటిని సంబాళించుకోలేక సతమతమవుతున్న మనసుని అదిలించి లొంగదీసుకోవాలని ఆమె చేస్తున్న విఫలప్రయత్నం.. అక్షరాలలో ఆడపిల్ల గుబులూ, నిజమైన ఆశా, దానిని వారించే నిరాశా.. “వేటూరి సుందరరామమూర్తి” రచించిన గీతం. ఇదో అందమైన గులాబీ.. వెంట “బరువైన భావపు” ముళ్ళుంటాయి.. మనసుకు గుచ్చుకుంటాయి.
అతనిని చూస్తే ఆమె మనసు తుళ్ళిపడుతుంది. ఆ అదురుపాటు అతని కంట పడకుండా దాచుకోమని మనసుకి తొలి హెచ్చరిక చేస్తోందామె "మనసా తుళ్ళి పడకే.. అతిగా ఆశపడకే.." అంటూ.
మాట వినని ఆశకి ఎంత పిరికిమందు నూరి పోస్తోందో.. ఎంత నిరాశ తలకెక్కిస్తోందో.. వెర్రి పిల్ల! "అతనికి నీవూ నచ్చావొ లేదో.. ఆ శుభ ఘడియ వచ్చేనొ రాదో" అంటూ గతం మిగిల్చిన గాయపు మచ్చని తడుముకుంటోంది. "తొందరపడతావేమో.. అలుసవుతావు సుమా!" అని వెనక్కి లాగుతోంది.
"ఏం? అతను అందరిలాంటి వాడూ కాదేమో!" అని ఆశకి ఊపిరిపోయబోతున్న వలపుకి కళ్ళెం వేసేందుకు "ఏమన్ని సిరులున్నాయనీ వచ్చేను నిన్ను వలచీ?" అని ప్రశ్నిస్తోంది. "సొగసూ లేదు. చదువూ, పదవీ లేనేలేవు. ఇంకేమున్నాయని కలలు కంటున్నావు?" అని చేదు పాట పాడుతోంది.
అలా అని ఆతనిపై వల్లమాలిన అనురాగం లేకపోలేదు. "ఏ నోము నోచావు? ఏ దేముడిస్తాడు ఆ వరాన్ని?" అని అతనిని మనసులోనే సింహాసనమెక్కించేసింది. "మనసా వినవే మహ అందగాడు.. తనుగా జతగా మనకందిరాడు" అని పెదవి విరిచింది.కన్నెమనసుని కలలాపమని బతిమాలుకుంది.
తనపై తనకు విశ్వాసమున్న ఆడపిల్ల.. కాలపు దెబ్బలకు లొంగి పరిస్థితులకు తలవంచినప్పటికీ, "మనసు" మహ మొండిది. అందునా ఆడపిల్ల మనసుపడిందంటే ఒక పట్టాన మార్చుకోదు. అలాంటి మనసుని అదుపులో పెట్టుకునేందుకు ఒక అమ్మాయి ఇంతకంటే నైచ్యానుసంధానం చేయదేమో! ఆ కోణాన్నీ కవి చిత్రించగలిగాడు! అదే ఆశ్చర్యం!
మనసా తుళ్ళిపడకే
అతిగా ఆశ పడకే
మనసా తుళ్ళిపడకే
అతిగా ఆశ పడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియ వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
ఏమంత అందాలు కలవని
వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి ఉందని మురిసేను నిన్ను తలచి
చదువా పదవా ఏముంది నీకు?
తళుకు కులుకూ ఏదమ్మ నీకూ?
శ్రుతి మించకే నీవు మనసా
ఏ నోము నోచావు నీవని
దొరికేను ఆ ప్రేమ ఫలము
ఏ దేవుడిస్తాడు నీకని
అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నెమనసా..
ఆ శుభఘడియ వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
ఏమంత అందాలు కలవని
వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి ఉందని మురిసేను నిన్ను తలచి
చదువా పదవా ఏముంది నీకు?
తళుకు కులుకూ ఏదమ్మ నీకూ?
శ్రుతి మించకే నీవు మనసా
ఏ నోము నోచావు నీవని
దొరికేను ఆ ప్రేమ ఫలము
ఏ దేవుడిస్తాడు నీకని
అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నెమనసా..
అడ్డాల నాటి బిడ్డడు ఎదిగి గడ్డాలవాడైనా అమ్మ పాడే జోల అతడిని నిదురపుచ్చుతుంది. అదే అమ్మడు పాడే పాట కుర్రవాడికి కునుకు తెప్పిస్తుందా..? కర్తవ్యబోధ చేస్తుందా..? “సి. నారాయణరెడ్డి” కలం నుండి జాలువారిన ఈ పాట.. జోలపాట కాదు. ఓ కన్నె కస్తూరి వైనంగా బావకి తెలుపుకున్న విన్నపాల పాట.
జో కొట్టి నిదుర ఊచే ముందు పాపడికి ఈ దేవుడి కథలో, ఆ దేవుడి కబుర్లో చెప్పడం ఆనవాయితీ కదా! అలాగే తన బావ నీలాల కన్నులకి నిత్యమల్లి జోల పాడుతున్న మరదలు కూడా పుట్టెడు దేవుళ్ళ సాటి తెచ్చి ఊసులు చెప్తోంది.
"రేపల్లెలో గోపన్న రేపటి చింత మరచి నిదురపోయాడు. యాదగిరి నరసన్నో.. ఆదమరచి నిదరోయాడు. ఏడుకొండల ఎంకన్న ఎపుడనగానో నిదరోయాడు. ఇంతలేసి కళ్ళతో నన్ను నమిలేసేలా చూస్తున్న కోడె పిల్లడా.. నీకేమో కునుకైనా రావట్లేదేం?" అని ప్రశ్నిస్తోంది. అది ఆశ్చర్యమేమీ కాదు. తనకి కావలసినదీ అదేగా! కునుకు పక్కన పెట్టి కబుర్లు వింటున్న బావకి మనసు విప్పి చెప్పుకునే అదను కోసమేగా ఈ పాటలూ.. పదాలూ!
"నీ తలపుల్లో తానాలు చేస్తున్న నా చుట్టూ చేపపిల్లలా తిరిగి అల్లరి చేయబోకురా.." అని మత్స్యావతారం ఎత్తవద్దని చెప్పేసింది. అలా అని కృష్ణుడిలా కోకలెత్తుకుపోయే అల్లరీ వద్దంది. వామనావతారమెత్తితే బ్రహ్మచారివై ఉండాలాయే. మనకి ఆ సామి ఊసొద్దు. బుధ్ధావతారమో.. బోధి చెట్టుని అంటి ఉండాలి. అదీ వద్దు. ఇంకెలా ఉండాలని కోరుకుంటోందా మరదలు?
చిననాటి నుంచీ విన్న కథల మూలాన ఆడపిల్ల మనసులో ముద్రవేసుకున్న ఒకే ఒక పురాణ పురుషుడు రాముడేమో! "రఘువంశ తిలకుడివై, రాముడివై, రమణుడివై.. సీతతోనే ఉండిపోరా!" అని కోరుకుంటోంది. తన గీత దిద్దేది అతడేనని చెపుతోంది.
రేపల్లె గోపన్న రేఫు మరచీ నిదరోయే
యాదగిరీ నరసన్న ఆదమరచి నిదరోయే
ఏడుకొండలా ఎంకన్న ఎపుడనగా నిదరోయే
కోడెపిల్లడా నీకేమో కునుకైనా రాదాయే
యాదగిరీ నరసన్న ఆదమరచి నిదరోయే
ఏడుకొండలా ఎంకన్న ఎపుడనగా నిదరోయే
కోడెపిల్లడా నీకేమో కునుకైనా రాదాయే
మీనావతారమెత్తి మేనిచుట్టూ రాబోకురా
కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా
వామనావతారమెత్తి సామిలాగ ఐపోకు
బుధ్ధావతారమెత్తి బోధిచెట్టునంటి ఉండకు
కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా
వామనావతారమెత్తి సామిలాగ ఐపోకు
బుధ్ధావతారమెత్తి బోధిచెట్టునంటి ఉండకు
రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై
సీతతోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీత తోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
సీతతోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీత తోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
వడ్డించిన విస్తరిలాంటి జీవితం. సంతోషపు తీరాన్ని చేరేందుకు అలల్లా ఎగసే కోరికలు. ఆమె మనసే ఓ అంతఃపురం. అందులో కొలువున్నవాడికోసం ఆ మహరాణేం చేసింది? “సిరివెన్నెల సీతారామశాస్త్రి” పదాల్లో.. ఆనందం, ఆశలు, జీవితం.. వీటిని దాటి స్త్రీ అనే మహాసముద్రపు ఆవలి తీరాన్ని సుస్పష్టంగా దర్శింపచేసిన అందమైన పాట.
“నా లోకం మహా అందమైనది. వెన్నెల్లో నడిచే మబ్బులు, వర్షంలో తడిసే సంద్రంలా పోటెత్తిన సంతోషం, పువ్వులు, నవ్వులూ.. అంతా సౌందర్యమే! ఇవన్నీ నీకోసమే!
నీతో ఎన్ని కబుర్లు చెప్తే కరుగుతాయని? నీతో ఎన్ని ఆశలు పంచుకుంటే తరుగుతాయని? అనంతం కదూ! అచ్చం ఈ సముద్రంలో అలల్లాగే..!
నా కలలు కోటానుకోట్లు.. ఆకాశంలో చుక్కల్లాగ! చిత్రం! అవన్నీ నిజమై కళ్ళెదుటే నిలుస్తున్నాయి. అణువణువూ అమృతంలో తడిసిన అద్భుతంలా తోస్తోంది. చిత్రమేముంది..? వెన్నెలరాజల్లే నువ్వే నా ఎదలో వాలినప్పుడు! కలలన్నీ సాకారమై.. నీలా.. ఇలా.. నా ఎదుట!
నీతో పంచుకునే ప్రతీ క్షణం నాకు మహా ప్రియమైనది. అరెరే.. విలువైన ఈ క్షణాలేవీ శాశ్వతం కావట్లేదే! కరిగిపోతున్నాయ్ సుమా! ఈ ఆనందాన్ని పట్టి బంధించాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. చెప్పనా.. ఈ హాయంతా పట్టి పాపాయిగా చేసి, నా ప్రాణాలు పోసి నీకిస్తాను. మన నూరేళ్ళ జీవితాన్ని భద్రంగా నీ చేతిలో కానుకలా పెట్టలేనా?"
ఇలా సృష్టిని ముందుకు నడిపే మహరాణి కాలాన్ని ఏలదా? తన నూరేళ్ళ జీవితంలో మరో నూరేళ్ళని పండించ గలిగే శక్తి అమ్మకే కదా ఉంది! తనకోసం కాదు, తనవాడికోసం. అతడితో తను కలిసి శాశ్వతమయ్యేందుకు!
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగ
వర్షంలో తడిసే సంద్రంలాగ
ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో
అంతా సౌందర్యమే అన్నీ నీకోసమే
వర్షంలో తడిసే సంద్రంలాగ
ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో
అంతా సౌందర్యమే అన్నీ నీకోసమే
నాలో ఎన్ని ఆశలో అలల్లా పొంగుతున్నవి
నీతో ఎన్ని చెప్పినా మరెన్నో మిగులుతున్నవి
కళ్ళల్లోనే వాలి నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో
ఆ గగనాన్నే ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
నీతో ఎన్ని చెప్పినా మరెన్నో మిగులుతున్నవి
కళ్ళల్లోనే వాలి నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో
ఆ గగనాన్నే ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి
చూస్తూనే నిజమై అవే ఎదుటే నిలిచాయి
అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంలా
చూస్తూనే నిజమై అవే ఎదుటే నిలిచాయి
అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంలా
ఇట్టే కరుగుతున్నది మహా ప్రియమైన ఈ క్షణం
వెనకకు తిరగనన్నది ఎలా కాలాన్ని ఆపడం
వదిలామంటే నేడు తీయని స్మృతిగా మారి ఎటో పోతుందే
కావాలంటే చూడు ఈ ఆనందం మనతో తనూ వస్తుంది
ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి
వెనకకు తిరగనన్నది ఎలా కాలాన్ని ఆపడం
వదిలామంటే నేడు తీయని స్మృతిగా మారి ఎటో పోతుందే
కావాలంటే చూడు ఈ ఆనందం మనతో తనూ వస్తుంది
ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి
పాపాయి చేసి నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లే నీ చేతికీయలేనా
నూరేళ్ళ కానుకల్లే నీ చేతికీయలేనా
ఆకాశం అంతఃపురమయ్యింది నాకోసం అందిన వరమయ్యింది
రావమ్మా మహరాణీ.. ఏలమ్మా కాలాన్నీ అందీ ఈ లోకమే
అంతా సౌందర్యమే.. అన్నీ నీకోసమే..
రావమ్మా మహరాణీ.. ఏలమ్మా కాలాన్నీ అందీ ఈ లోకమే
అంతా సౌందర్యమే.. అన్నీ నీకోసమే..
పాటల వివరాలు:
కొమ్మ మీద కోయిలుందిరా – రాజనందిని (1958)
సఖియా వివరించవే - నర్తనశాల (1963)
మీరజాలగలడా - శ్రీకృష్ణతులాభారం (1966)
అందెను నేడే అందని జాబిల్లి - ఆత్మగౌరవం (1966)
అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా - సాక్షి (1967)
రాకోయీ అనుకోని అతిథీ - శ్రీరాజేశ్వరివిలాస్ కాఫీ క్లబ్ (1976)
ముందు తెలిసెనా ప్రభూ - మేఘసందేశం (1982)
మనసా తుళ్ళిపడకే - శ్రీవారికి ప్రేమలేఖ (1984)
జోలాజోలమ్మజోలా - సూత్రధారులు (1989)
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగ - అంతఃపురం (2001)
* వ్యాసం "12వ ఆటా సభల మహా జ్ఞాపిక - 2012" లో.. 299 వ పేజీలో..