మావి చిగురు తినగానే కోవిల పలికేనా..?
కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..?
ఏమో.. ఏమగునో గానీ ఆమని - ఈ వని ..
ఎలమావి తొలిచిగుళ్ళ తోడుగా వసంతమాసం మరో కొత్త సంవత్సరానికి యవ్వనశోభను తెచ్చేసింది. ఎన్ని వసంతాలు గడిచినా పదారేళ్ళ పడుచులా మిడిసిపడేదొకటుంది. అదే “వలచిన మనసు”. ఏ మంచు బిందువు తాకిడికో చిగిర్చి, మారాకులు తొడిగి.. కసరు మల్లెమొగ్గలా, ఏ మాటున లేవలపు పుడుతుందో - ఆపై ఎన్ని బెంగలో, ఎన్ని బిడియాలో, అనుమానాలో, ఆత్రాలో, పంతాలో .. ఒకటా?! కోటానుకోట్ల అనుభూతుల్ని గుప్పెడు గుండెలో ఎలా ఇముడ్చుకుంటుందో, కాలపు జాలానికి చిక్కకుండా నిలిచి, ఏళ్ళుగడిచినా నూతనత్వపు అమృతాన్ని చుక్కచుక్కగా జీవనమధుకలశంలో ఎలా నింపుతుందో - బిందువు సింధువైనంత చిత్రం! అణువు బ్రహ్మాండమైనంత విచిత్రం!!
అసలే మాటలకు చిక్కని చిక్కులమారి ప్రేముడి కదూ! అందునా అది ఆడపిల్ల ప్రేమైతే పీటముడి పడ్డట్టే! విప్పి చెప్పడం మహాకష్టం. పగడాల పెదవి విచ్చి పడతి తనంతట తాను పలుకదు. "ఊఁ - గొప్ప రసికుడినంటివే! మనసు తెలుసుకో మరి! " అని మౌనంగానే కవ్విస్తుంది, సవాల్ విసురుతుంది. తెగువ లేనివారికి దక్కదు -బంగరుబొమ్మ! తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత! చేతగాక చతికిలపడినవాడు పడగా, కొందరేమో అగాధమౌ జలనిధిలో దాగిన ఆణిముత్యాలనే సాధించే సాహసికులు, పట్టువీడని పరాక్రమశాలురూను. అమ్మాయి మనసులో దాగున్న ప్రేమసౌరభపు గుభాళింపును ఊహించక మానలేదు. "రవిగాంచనిది కవి గాంచు"నని నిరూపించిన కాంతామానస మహాకావ్య పఠితలు వారు! కవులు!!
కవుల్లో సినీకవులది విలక్షణమైన శైలి. కత్తిమీద సామూ వారి వంతునే పడింది. ఊహకి మాటలు అద్దడమో, మాటలను పాటలా దిద్దడమే కాక - సన్నివేశానికి తగినట్టు పాత్రోచితంగా ఊహించి, ఊహని ఒడుపుగా పల్లవీ చరణాల్లో పొదిగి మెప్పించడం ఆషామాషీ కాదు. అందునా మగవారై ఉండీ "ఆమె"ను ఆవాహన చేసుకుని రచన సాగించడం అన్ని సందర్భాలలోనూ సులువైన విషయమేమీ కాదు. యాదృచ్ఛికమే కానీ ఈనాటి వరకూ సినీరంగంలో గీతరచయితలందరూ మగవారే!
సూరీడి కన్ను పడని కన్నె వలపుల్ని "తానే ఆమెగా మారి" ఊహించి, అనుభూతించి.. అక్షరాలలో అక్షరమైన గీతాలను అందించిన సినీగీత రచయితలు మూటగట్టుకున్న ఈ కావ్యకీర్తి కాంతాసమ్మిత ఉపదేశం మాత్రమే కాదు. కాంతామానసానికి దర్పణం కూడా! మనసుకెక్కించుకుంటే మానినీమానస చోరులకు వ్యవహార జ్ఞానాన్ని మెండుగా మప్పుతుంది - సారస్యాన్ని గరుపుతుంది.
పాట ఒక ఆడపిల్ల మదిలోయల్లో పారిన ఊహల సెలయేరైతే - అది ఎలా ఉంటుందో, ఎన్ని హొయలు పోతుందో - సినీగీతాల ఖజానాలో ఓ పది గీతాలు స్థాలీపులాకంగా ఎంచుకుని ముచ్చటించాల్సి వస్తే..
***
***
కన్ను చెదరగొట్టి, మనసులో మరులు రేఫిన వన్నెకాడిని తన వైపు మరల్చుకుని లొంగదీసుకోవడమంత కష్టమైన పని ఆడపిల్లకి మరొకటి లేదేమో! అచ్చరల బాట పట్టి.. వన్నెచిన్నెలు వొలికించి అతడిని సుముఖుడిని చేసుకునేందుకు ఓ వగలాడి ప్రయత్నమే ఈ అందమైన గీతం.
చినవాడి మీద మనసుపడిన కుర్రదాని వలపు.. పాటై అల్లుకుంటే - అదీ “మల్లాది రామకృష్ణశాస్త్రి” కలంలో.. సన్నజాజుల జాలరు కదూ! తప్పించుకు పోగల మొనగాడెవరని! కొమ్మ మీదున్న కోయిల మత్తెక్కి మరిమరి పాడాలంటే "కో"యని పాడే జత ఉండాలి మరి. తాను వలచిన కోడెవాడిని తనతో ఆడిపాడమని నర్మగర్భంగా కోరుతోందా వలపుగత్తె. అతని ముందు పరచిన అందాలని కనువిచ్చి చూడమంటోంది. మనసు కానుకోమంటోంది. ఎదర ఉన్న వేడుక వదిలిపోవద్దని హెచ్చరిస్తోంది. సాములు చేసే చక్కని కనుబొమ్మలతో కవ్విస్తోంది.
మనసు గెలుచుకోవడమేమంత చిన్నపని కాదు. వగలూ, వయారాలూ - ఎన్ని పొంకాల సంపెంగలు ఘుమాయించాలో! చల్లని గాలి చక్కిలిగింతలా అతగాని మైమరపించి వశం చేసుకోవాలి. అందం ఎరవేసి ఇంత జాణతనంగా చనువు కోరిన ఆ పిల్ల ఆశ పండకుండా ఉంటుందా?
సన్నజాజి జాలరిరా ఎన్నెలుందిరా ఎదర ఏడుకుందిరా
ఎన్నెలుందిరా ఎదర ఏడుకుందిరా
ఎన్నెలుందిరా ఎదర ఏడుకుందిరా
చక్కిలిగింతల చల్లనిగాలిలో చిన్నోడా..
సంపంగి ఘుమాయింపురా
సంపంగి ఘుమాయింపురా
చిలుకు సూపు సిరులున్న మోము సాములు చేసే సక్కని కనుబొమ్మలు
మనసొమ్ము లేదురా మనసైన రాదా
సనువైతే మేలురా సరదాల రాజా
మనసొమ్ము లేదురా మనసైన రాదా
సనువైతే మేలురా సరదాల రాజా
కొమ్మమీద కోయిలుంది రా..
చినవోడా కోయంటె పలుకుతుందిరా
చినవోడా కోయంటె పలుకుతుందిరా
***
వలచి గెలుచుకున్న వగకాడు చెంత లేకపోతే ఆ విరహం - అహరహం గుచ్చే ములుకు! వియోగానికి మందు - ప్రియునితో చేసే వెన్నెల విహారమే! మగువ తానుగా చెప్పలేదు. సిగ్గరి! అలా అని ఎడబాటు తాళలేదు. కనులు చెదరేంత మోహనాకారుడాతడు! మధ్యేమార్గంగా దూతికని పంపింది. రాయబారం నెరపమంది.
"అమ్మాయీ.. నీ మనసులో మాట చెప్పినా ఆతడు కాదంటేనో!" అని సకియ అపశకునం పలుకుతుందనుకుందేమో.. "వగలెరిగిన చెలునికి.." అని ముందే సూచించింది. అతనికి వగలు తెలుసట. వలపులెరుగని జడుడు కాదట.
"ఏమంత తాళలేక వేళకానివేళ కబురంపుతున్నావో..!" అని తన చెలికత్తే బుగ్గలు నొక్కుకుంటుందేమో అని లజ్జ కలిగిందేమో. "మరువలేక మనసు రాక.." అని తన విఫలప్రయత్నాన్ని చెప్పకనే చెప్పింది.
"అయితే ఏమని చెప్పమంటావూ?" అని దూతిక కాలయాపన చేయకుండా, తన ప్రియునికి తన మనసు నేరుగా తెలిపే ప్రౌఢవాక్యాలే కబురంపింది. "మల్లెపూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళలో - సరసాల సరదాలు తీరేది వెన్నెల వెలుగులోనే" అని జాబిలిరేయి సల్లాపాలకు పిలుపునిచ్చింది.
వగలెరిగిన చెలునికి నా కథ
నిన్ను జూచి కనులు చెదరి కన్నె మనసు కానుక జేసి
మరువలేక మనసు రాక విరహాన చెలికాన వేగేనని
మల్లెపూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళ
చలువరేని వెలుగులోన సరసాల సరదాలు తీరేనని..
నిన్ను జూచి కనులు చెదరి కన్నె మనసు కానుక జేసి
మరువలేక మనసు రాక విరహాన చెలికాన వేగేనని
మల్లెపూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళ
చలువరేని వెలుగులోన సరసాల సరదాలు తీరేనని..
సఖియా వివరించవే..
అలతి పదాలలో నెలత కోరికని పట్టిచ్చిన ఈ రసగుళిక “సముద్రాల రాఘవాచార్య” విరచితం
***
స్వర్గానికి వెళ్ళి, వేయికన్నుల దేవరతో పోరు సలిపి మరీ సాధించుకున్న పారిజాతమూ, ప్రతిష్ఠ రెండూ సవతి ముందు వెలతెలపోతే సత్యభామలాంటి స్వాధీనపతిక ఊరకుంటుందా? అన్నింటికంటే మిన్న, ఏడేడు లోకాల రేడు అయిన తన పతిని ఐశ్వర్యం ధారపోసైనా దక్కించుకుంటుంది. వ్రతవిధానమహిమ వలన తాను గీసిన గీటు దాటని కృష్ణుని ఊహించుకుని మురిసిపోతుంది.
"మీరజాలగలడా నాయానతి.." అని వ్రతఫలితాన్ని ముందే కళ్ళకు కట్టించుకుని ఆనందించే సత్యభామకు ఎన్నో తెలుసు. అన్నీ తెలుసు. నటన సూత్రధారి తన చేతికే కాదు, ఎవరికీ చిక్కడని ఆమెకు తెలుసు. అయినా సరే.. నోము పూని కట్టేసుకుందామని ఆశ! ఎంత ప్రియమైన పూనికో కదా ఆమెది? అన్నీ తెలిసీ దేనికీ అమాయకత్వం? అదే ఆమెకు కృష్ణునిపై గల గాఢానురాగానికి గీటురాయి.
మనోహరుని చేరుకునేందుకు మమతల వారాశిని ఈదేందుకు తనతో మరెవరూ పోటీ లేరని నొక్కి చెప్తోంది. సత్యభామకు తన ప్యత్యర్థి పేరు పలకడం సైతం ఇచ్చగించ లేదు. "వైదర్భికి.." "అదిగో.. వాళ్ళమ్మాయి ఉందే..!" అని ఈసుగా మాట్లాడినట్టే! సవతిపై ఆ మాత్రం అయిష్టం ఉండాలి మరి! ఉంటేనేగా ఉమ్మడి సొత్తు మీద తనకున్న పట్టుదల, తన ఆభిజాత్యమూ బయటపడేది. ఆఖరికి సత్యాపతి కూడా తనతో వాదులాడి ఆమెను వెనకేసుకురాడని ధీమాగా చెప్తోంది. "సత్యాపతి" అంటూ ఎంత గోటు ఒలకబోస్తోందో!
గీర్వాణమే కానీ ఈ భామ మనసులో ఇంకేం లేదని పొరబడేరు! వ్యయప్రయాసలకోర్చి ఈ నోము దేనికి..? మధుర మధుర మధురాధిపతిని కైవసం చేసుకునేందుకు. కృష్ణుని ప్రణయ సామ్రాజ్యానికి ఆధిపత్యాన్ని కోరుకుని కదూ! ఆ ఊహకే ఆమె మనసు ఎంత మైమరచిపోతోందో.. ఒక్క మధురమైన వాక్యంతో కనులముందు నిలిచే రాసక్రీడ "మధుర మధుర మురళీగాన రసాస్వాదనమున అధరసుధారసమది నే గ్రోలగ.." వేణువల్లే కన్నయ్య పెదవిని చేరి చెంగలించాలనే కాంక్ష! "నేనంటూ వ్రతమూనాక, నేనంటూ ముద్దుముద్దరలేసాక.. నన్ను వదిలి పోగలడా?" అని అణువణువునా స్థైర్యమే! ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం సత్యభామ.
"స్థానం నరసింహారావు" రచన, సుమసౌకుమార్యమే కాక కాసంత పొగరూ, వగరూ.. అంతకు మించి ప్రియునిపై పట్టలేని ప్రేమా ఉన్న ప్రియురాలి మనసుకు అద్దం! చలనచిత్రం కోసం వ్రాసిన గీతం కాకపోయినప్పటికీ సినీవినీలాకాశంలో అందాల జాబిల్లి.
మీర జాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
నటన సూత్రధారీ మురారీ
ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
సుధాప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోనిక
వాదులాడగలడా సత్యాపతి
వాదులాడగలడా సత్యాపతి
మధురమధుర మురళీగాన రసాస్వాదనమున
అధర సుధారసమది నే గ్రోలగ
అధర సుధారసమది నే గ్రోలగ
మీరజాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
***
నెమ్మదిగా పారే నదిలాంటి జీవనంలో హఠాత్తుగా ఏ చరియ వద్దో కలకలం మొదలయితే.. అది ఆనందకరమైన మలుపైతే! వరించి వచ్చినవాడు కలిసొచ్చేదాకా లేని అందాలేవో, ఉన్నట్టుండి తనలో తనకే గోచరమయితే..! “నిన్నటి వెతలింక ఉండబోవ”ని నిశ్చితంగా అనిపిస్తే ఆమె మనసెలా ఉరకలు వేస్తుంది? ఏమని రాగాలాలపిస్తుంది?
అందని జాబిల్లి తన సిగపూవై చెంత చేరాడని మురిసి పోతుంది. నిన్నటి దాకా లేని వెలుగేదో తన చుట్టూ..! "ఇది ఆతని వెన్నెలే కదూ!" అని ఆశ్చర్యం! ప్రేమలో.. లోకం వింతగా కనిపించడం సహజం. మరీ ఇంతగానా! "ఇన్నాళ్ళకు విరిసె వసంతములు. ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు" అని విస్తుపోతోందామె. అవును మరి! వలపు లేని వసంతం కనులకు ఆనుతుందా? చెలికాని తలపు లేనిదే మల్లియలూ వృధా కదా!
చెక్కిట మెల్లని కొనగోటి మీటుకి, నరాల వీణలను శ్రుతి చేసే మాయెక్కడిది? అంబరాన కొలువున్న నెలరాజు, కొలనులో కన్నెకలువతో - వెన్నెలరేకలతోనే సరాగాలాడినంత నిజమిది. హేతువూ, నిరూపణలూ ఏమీ ఉండవు ప్రేమలో.. అన్నీ సాధ్యమే!
ప్రేమ జీవనౌషధం. ఆశ దానికి అనుపానం. "ఇక రాలవు కన్నుల ముత్యములు.. ఇక వాడవు తోటల కుసుమములు" ఇంతకు మించిన ధీమా వేరేభావన ఇవ్వగలదు? చేతిలో చేయి వేసి కడదాకా తోడుంటానని నమ్మకమిచ్చిన సహచరుడి సాన్నిధ్యం తప్ప! అసాధ్యాలను సుసాధ్యమనిపించి అడుగు ముందుకు వేయించే అపరిమితమైన బలం, "తోడు దొరికిన ఆనందానికి" మాత్రమే ఉంటుంది.
"దాశరథి" కలంలోనుండి జాలువారిన ఈ వెన్నెలపాట.. కన్నెకలలకు నిలువుటద్దం.
ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే
నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరమున వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే
నరనరమున వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే
ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నా మది విహరించెలే
వలరాజే నాలో వలపులు చిలికెనులే
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నా మది విహరించెలే
వలరాజే నాలో వలపులు చిలికెనులే
***
congrats madam, anni kaalaala naayikalni choopinchesaaru. vaari mansu maatalu cheppinchaaru. challagaa haayigaa 'atu ennelaa ' paata koodaa parichayam chesaaru..totalgaa mallee oka saari koththaavakaaya ghubhaalinchindi..
ReplyDeletepanilo pani jyothirmayi gaari rachcha koodaa chadivesaa..
చాలా నచ్చింది నాకు! ఒక్కొక్క మాట quote చేస్తూ పోతే ఓ పెద్ద పోస్ట్‌లా తయారవుతుంది. ఆ souvenir కి అందం తీసుకొచ్చారు. :)
ReplyDeleteఅమ్మయ్య ఇప్పటికి చదవటం పూర్తి చేసాను . బావుంది అని చెప్పటం చాలా చిన్నమాటండి .నాకు సినిమా పాటల పరిజ్ఞానం పెద్ద గా లేదు, పైగా అంత సీరియస్ గా విననేమో అందుకే మరీ ఆశ్చర్యం గా ఉంది ఇలా ఎలా రాయగాలిగారా అని :)
ReplyDeleteఅసలు పదాలు ఎక్కడనుంచి వచేస్తాయి మీకు అలా ఆశువుగా ?
btw మీరిచ్చిన లింక్ లో ఇంత పెద్ద వ్యాసం చదవటం కష్టం గా ఉందండి. మొత్తం బ్లాగులో పెట్టగలరేమో ఒకసారి చూడండి .
మీ వర్ణన,శైలి అద్బుతం కొత్తావకాయ గారు..
ReplyDeleteనచ్చింది అనటం కన్నా మీ ఆర్టికల్ చదువుతుంటే మనసుకి హయీ గా ఉంటుంది అనటం కరెక్ట్ ఏమో !!
యెంత బాగా ఓపికగా వ్రాసారు.నారికేళ పాకం(నాకు) అనిపించినా
ReplyDeleteకొబ్బరి నీళ్ళ కమ్మదనం తో తియ్యాగా ఉంది
We all take these great songs for granted but, now you have showed us to look at them differently, for that matter any good song. Like those great writers, I guess you too now have high reader expectations and once again you gave us another gem of a post. Thank you.
ReplyDeletePS: We do miss those awesome photos here too. ;)
వ్యాసం బాగుంది. ఆటా జ్ఞాపికలో ఒకే వ్యాసంగా వ్రాసినా, యిక్కడ బ్లాగులో అయిదో ఆరో విడి టపాలగా (పాటలకి లింకులిస్తూ) పెడితే యింకా బాగుండేది. అన్నిటికన్నా, "ముందు తెలిసెనా ప్రభూ" పాటకి మీరిచ్చిన వివరణ నాకు నచ్చింది. నేనింతవరకూ, "దారి పొడుగునా తడిసిన" అన్న వాక్యం ఆ పై వాక్యంలాగానే నాయిక ఆకాంక్ష మాత్రమే అని అనుకున్నాను. కాని మీరు చెప్పిన అర్థం ఇంకా బాగుంది.
ReplyDeleteఈ పది పాటల్లోనూ, మీరన్న "ఆడపిల్ల ప్రేమైతే పీటముడి పడ్డట్టే! విప్పి చెప్పడం మహాకష్టం" అన్న మాటకి దీటైన ఒకేఒక పాట, "అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా ఎటు సూస్తే అటు ఎన్నెలా", అని నాకనిపించింది. ఈ పాటలో ఉన్న రకరకాల "ఎన్నెలలు", "నీటి మీద కొంగుపరవడం", "ఆవులించే దోరవయసు", "మనసు నిలవదురా"లో విరుపూ - తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత!
ఒక చిన్న నెరసు, బహుశా అచ్చుతప్పేనేమో, "ముగ్ధాసౌందర్య"లో ముగ్ధకి దీర్ఘం ఉండదు.
:) ఇప్పటికి మొత్తం చదివాను. Thanks for putting it in the blog and making it easier for us readers.
ReplyDeleteబాగా రాసారు కొ.ఘా. గారూ. మా అమ్మాయ్ తెలుగు అక్షరాలు జిలేబీల్లా ఉంటాయంటుంది. మీ వ్రాతలు నిజంగా జిలేబీ చుట్టలే! నాకు తెలియని కొత్త పాటలు పరిచయం చేసారు. థాంక్స్.
మీ బ్లాగ్లోకి వెళ్ళగానే ఇది రెండు పేరాలు చదివేసి మళ్ళా అమ్మాయ్-అబ్బాయ్ దగ్గరికి వెళ్ళిపోయాను. That is absolutely an amazing piece kottavakayagaru.
- సోమిదెవమ్మ.
చాలా బాగా రాశారు అనడం అల్పోక్తి.
ReplyDeleteఅద్భుతం..
ReplyDeleteవైదర్భి అంటే?