Saturday, July 3, 2021

నోటిఫికేషన్

 వేళ్ళు అలవాటుగా పాస్ వర్డ్ టైప్ చేశాయి. ఎర్రర్… 

 

జాగ్రత్తగా మరోసారి నొక్కగానే మళ్ళీ తప్పు పొమ్మంది. కంగారొచ్చి జాగ్రత్తగా మూడోసారి నొక్కేముందు గుర్తు చేసుకున్నా.. కేప్స్ లాక్ సరిచూసుకుని ఎంటర్ చేసేదాకా ఊపిరి బిగించి ఉంచడం అర్ధమవుతోంది. 

 

ఛ!! లాక్డ్ ఔట్.. 

 

*****

 

తెలివొచ్చేసరికి ఆరున్నర. పళ్ళు తోముకుంటూంటే కల గుర్తొచ్చింది. నిజంగా లాక్ అయిపోలేదు కదా అని క్షణకాలం అద్దంలో మొహం చూసుకుంటూ ఆలోచించుకున్నాను. ఇంతకీ సెక్యూరిటీ క్వశ్చన్ ఏమిచ్చానో గుర్తే లేదు. మొదటి కార్ పేరయుంటుంది. లేదా నిక్ ని మొదటిసారి కలిసిన చోటయుంటుంది. 

 

ఫోన్ అందుకుని నొక్కాను.. అటు నుంచి అమ్మ గొంతు వినబడగానే అడగాల్సిన ప్రశ్న సిద్ధంగా ఉంది. 

 

మామీనీ మైడెన్ నేమ్ నాకెప్పుడూ చెప్పలేదేంటి?” 

 

ఫోన్ కాల్ అయ్యాక... కాఫీ కప్ వెచ్చదనాన్ని చేతులతో కప్పుతూ అద్దంలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాను. పేరెంట్సేమో హైస్కూల్ స్వీట్ హార్ట్స్. వాళ్ళ ఒక్కగానొక్క కూతుర్ని మాత్రం ప్రేమలో పెద్ద ఫెయిల్యూర్నయ్యాను. 

 

“Move on Sweetie… It has been almost two years! The day's still young. Swipe right again. Alright, tell me when are you coming home?” 

 

మామీ మాటలు మెత్తగాప్రేమగా చెవుల్లో మోగుతున్నాయి. 


రెండేళ్లు! పాండెమిక్ ఊడ్చి పెట్టేసిన రెండేళ్ల సమయమూ నా ఒంటరితనానికి లెక్కగా పనికొస్తుందని ఊహించలేదు. 

 

*****

 

నిక్ తో ఇదే అపార్ట్మెంట్ లోఇదే బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర  గడిపిన చివరి ఉదయం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆల్బమ్ లో ఫోటోలే ఇంకా డిలీట్ చేసెయ్యలేకపోతున్నాను. మొన్న ఉదయమేగా.. మెమొరీస్ లో నిక్ కోసం చేసిన అవకాడో టోస్ట్ ఫోటో కనిపించింది. 

 

అదేనా నేను తనతో పూర్తి ప్రేమలో ఉండగా తీసిన చివరి ఫోటో అని అనుమానమొచ్చింది. ఆల్బమ్ తీసి చూసుకుంటే ఆ రోజు సాయంత్రం బైకింగ్ కి వెళ్లొస్తూ తీసుకున్న ఫోటోలు కనిపించాయి. సాయంత్రం డిన్నర్ చేస్తూ తీసుకున్న ఫోటోలూ ఉన్నాయి. అవే ఆఖరనమాట! ఒకటా రెండా… తొమ్మిదేళ్ల సహజీవనం. పెళ్లి దాకా వెళ్లిన బంధం! మర్చిపోయి ఎలా మూవాన్ అయిపోతాను

 

*****

 

ఆ రోజు రాత్రి మంచం మీద చేరాక పెళ్లి కోసం ఇంకా చెయ్యాల్సిన పనుల గురించి నిక్ తో మాట్లాడుతూ ఉన్నట్టుండి "ఇప్పుడిదంతా అవసరమా.." అని బయటికే అనేసాను. తనేమీ మాట్లాడలేదు. ఆపై ఇద్దరికీ నిద్ర పట్టలేదు. 

 

ఇలా జరుగుతుందని ఎందుకో మాకు లోలోపలే తెలుసనుకుంటా. మర్నాడు కాఫీ తాగుతూ చెప్పేసా.. ఈ పెళ్ళి జరిగేలా కనిపించడం లేదని. పెద్ద పెద్ద మాటలేవీ లేకుండానే తొమ్మిదేళ్ళ మా బంధం ముగిసిపోయింది.

 

పాండెమిక్ వెడ్డింగ్ కేన్సిల్ అయితే పెద్దగా ఎవరికీ సంజాయిషీ చెప్పుకోనవసరం లేదేమో కానీ, ఇది అంతకు ముందు జరిగినది.. సరిగ్గా 2019 చివర్లో. అరడజను ఫోన్ కాల్స్కొన్ని ఈమెయిల్స్  తో పెళ్లి పనులు ఆపగలిగాను. 

 

ఉన్నట్టుండి మెరుపులా ఓ ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. స్టోర్ కి పరిగెత్తి వెళ్ళి ఫోన్ చార్జర్ కొనుక్కున్నాను. అప్పటికి నెలరోజులుగా అతని చార్జరే వాడుతున్నాను మరి. పాడయిన వస్తువులకి స్పేర్ ఉండని ఒంటరి జీవితంలోకి మళ్ళీ అడుగుపెట్టానారోజు. ఫోన్ లేకపోతే రోజెలా గడుస్తుంది?

 

*****



మొదటిసారిగా స్నేహితులింట్లో కలిసాం మేం. నిక్ అప్పట్లో నార్టన్ లో పనిచేసేవాడు. నేను న్యూజీలాండ్ వెళ్ళి పనిచెయ్యాలనే ప్రయత్నంలో ఉన్నాను. అప్పుడే ఒక ఇంటర్వ్యూ పూర్తిచేసా కూడా. మాటల్లో ఆ విషయం చెప్పాక నిక్  మొహంలోనవ్వులో కొంత మార్పు కనిపించింది. 

 

ఇదేమీ కుదిరే వ్యవహారం కాదని అప్పుడే అనిపించింది. రెండు రోజుల తరువాత డేట్ కి వెళ్దామని తను పిలవకపోతే అక్కడితో ఆగిపోయేదే. నేనా ఇంటర్వ్యూ లో ఫెయిలయ్యానని నా స్నేహితుల ద్వారా తెలిసాకే ఫోన్ చేశాడని నాకూ తెలుసు. మేమెప్పుడూ ఆ విషయం మాట్లాడుకోలేదు.

 

నా ఉద్యోగరీత్యా టెక్నాలజీ ఎక్కువగా వాడుతాను. 

"నాకు మాత్రం ఇదే ఉద్యోగం కాదా?" అని తను నవ్వేవాడు. 

 

సహజంగా కూడా నాకు టెక్నాలజీ ఇష్టం. తనేమో ఎన్ని సెక్యూరిటీ బ్రీచ్ లు జరుగుతున్నాయో అనే విషయం మీద గంటలకి గంటలు మాట్లాడగలడు. మా ఇంట్లో జరిగే పార్టీల్లో సుషీషార్డెనేఈ లెక్చరూ తప్పనిసరి అని నవ్వుతూ ఉండేదాన్ని. అయినా నన్నెప్పుడూ తక్కువ చెయ్యలేదు తను. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఫోన్ కోసం లైన్లో నిలబడదామన్నాబిల్లులన్నీ ఆన్లైన్ కడదామని చెక్ బుక్ ఆర్డర్ చెయ్యడమే మానేసినా సహకరించేవాడు. ఇది మా పరిచయమైన కొత్తల్లో.. అంటే పది పన్నెండేళ్ళ క్రితం విషయం. ఇన్నేళ్ళలో  నా చుట్టూ ప్రపంచం ఎంత మారిపోయిందో తల్చుకుంటే నాస్టాల్జిక్ గా లేదేంటో! 

 

*****

 

మేమిద్దరం కలిసి వెళ్ళిన పార్టీల ఫొటోలురెస్టారెంట్ ల చెక్ ఇన్స్వెకేషన్స్హాలిడే పార్టీలు.. నా దగ్గర బహుశా ఇరవై ముప్ఫై వేల ఫొటోలుంటాయేమో! మేం కలిసి తీసుకున్న మొదటి ఫోటో ఆ రాత్రి స్నేహితుల ఇంట్లో.. నా చేతిలో వైన్ గ్లాస్గ్రూప్ ఫోటోలో నా పక్కనే చోటుచేసుకుని నిలబడ్డ నిక్. తన మొహంలో అదే నవ్వుకళ్ళలో ఉత్సాహపు వెలుగు. ఆ ఫోటో చూస్తుంటే ఆ క్షణానికి టైం ట్రావెల్ చేయగలిగితే బావుండునని బలంగా అనిపిస్తోంది. 

 

నిక్ కి సంబంధించిన ఆఖరి ఫొటో... కిచెన్ కౌంటర్ మీద సగం తెరిచిన టు గో బాక్స్తన నోట్లో క్రాబ్ సుషీ.. డిజిటల్ గా ఆ సుషీ వయసు రెండేళ్ళు. అది కాలంలో ఘనీభవించి ఫొటో రూపంలో నా ఫోన్ లో ఉండిపోయింది.

 

ఇదొక్కటే కాదు. మేం విడిపోయాక చాలా రోజులు నా పర్సనల్ లేప్టాప్ మీద స్క్రీన్ సేవర్ గా మా ఫొటోలు కనిపిస్తూ ఉండేవి. నిర్లిప్తంగా చూస్తూ ఉండేదాన్ని. ఇక చాలు అనుకుని అవి తీసేయడానికి నెల్లాళ్ళయినా పట్టిందేమో. నా మొబైల్ రిమైండర్లలో తన డెంటిస్ట్ అపాయింట్మెంట్స్ కనిపిస్తూ ఉండేవి. ఒకటా రెండా.. తొమ్మిది సుదీర్ఘమైన సంవత్సరాలు. 

 

ఏ అర్ధరాత్రో తెలివొస్తేఇవన్నీ ఎలా వదిలించుకోవాలా అనే ఆలోచన పట్టి పీడించేది. అరచేతిలో ఉన్న ఫోన్ విసిరి కొట్టేస్తే సరిపోతుందాపేరుఊరుసోషల్ సెక్యూరిటీ నంబర్లతో ముడిపడి ఉన్నవెన్ని మారాలి! ఫైనాన్స్ లెక్కలు కూడా కలిస్తే ఆ చిక్కుముడి విప్పడం ఎవరి తరం! మనిషి ఐడెంటిటీతో నరనరాల్లోంచీ ఏకమైపోయిన డిజిటల్ ప్రపంచంలోంచి ఎలా పారిపోవాలి! 

 

*****

 

నేను అస్తమానం ఫోటోలు తీస్తానని విసుగు నిక్ కి. 

 

"ఈ ఫొటోలన్నీ కరెన్సీ అయితే బావుండు. డౌన్ పేమెంట్ కి పనికొచ్చేది." అని నవ్వాడొకరోజు నా ఆల్బమ్ చూస్తూ.  బే ఏరియాకి వెళ్ళిపోయి కలిసి ఇల్లు కొనుక్కుందామని నిర్ణయించుకున్నప్పుడు చూసిన ప్రతీ ఇంటికీ లెక్కలేనన్ని ఫోటోలు తీసుకున్నాను.  

 

ఆఫీస్ లో ఏదైనా సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చెయ్యాలంటే ఎవరి ఫొటో అయినా నా దగ్గర ఉండేది. సన్ గ్లాసెస్ ఎక్కడ పోయాయో ఆరోజు తీసుకున్న ఫొటోలు చూసే నిర్ధారించుకోగలిగాం. 


నాకు తెలియకుండానే నేను జ్ఞాపకాలని పోగు చేస్తూ ఉండేదాన్ని. ఫలానా రోజు ఫలానా పని చేసాం అని కచ్చితంగా టైం తో సహా చెప్పగలగడం గొప్పగా ఉండేది. కానీ దానికేం బుర్ర ఉపయోగించక్కర్లేదు కదా.

 

నిక్ తో విడిపోయాకమామీ బలవంతం మీద థెరపిస్ట్ దగ్గరికి వెళ్లాను. ఇవన్నీ మర్చిపోవడానికి మందుల్లేవాఇన్నిసార్లు తల్చుకోవాలా అని ఏడ్చానొకరోజు. 

 

అప్పుడామె చెప్పింది. జ్ఞాపకాలని మరిచిపోవడంతో పాటూ మార్చుకోగలగడం కూడా ఓ గొప్ప వరమని. ప్రపంచ యుద్ధాల్లోంచివిపత్తుల్లోంచీ బయట పడినవారికి ఫోటోలు ఉండే అవకాశం తక్కువ. వాళ్ళు సహజంగానే జ్ఞాపకాలని మార్చుకోగలుగుతారట. 


మరి నేనోనాదొక బాధ కాదా

 

నా చుట్టూ ఉన్నవన్నీ జ్ఞాపకాలే! కోరి పేర్చుకున్నవి.. డిజిటల్ గా. నా సంగతి సరేజీవితాన్ని ఈ సోషల్ మీడియా శకంలో మొదలుపెట్టిన చిన్నపిల్లలు.. టీనేజర్ల పరిస్థితేంటిడిజిటల్ నేటివ్స్ కదా వాళ్ళు! చెరిపేద్దామన్నా చెరగని తప్పటడుగుల్ని చూసుకుని చిన్నపిల్లలెవరో ఏడుస్తున్నట్టనిపించింది. కొత్త పేజీ తిప్పడమనేది సాధ్యమే కాదు కదా వాళ్ళకి!

 

*****

 

డిజిటల్ ఫుట్ ప్రింట్ గురించి అందరికీ తెలుసు. అందరం చాలా సులువుగా మర్చిపోయే విషయమది. కొన్నేళ్ళ పాటు నేను డౌన్లోడ్ చేసిన ప్రతీ యాప్నేను సబ్స్క్రైబ్ చేసిన ప్రతీ వెబ్సైట్ వివరాలూ ఒక ఎక్సెల్ లో రాసిపెట్టుకునేదాన్ని. అవి కూడా నిక్  హెచ్చరించడం వల్ల ఎక్కడో కలిగిన భయం ఫలితమే. తరువాత ఎప్పుడో అవసరం తీరగానే అన్నీ డిలీట్ చెయ్యాలని నా ప్లాన్. అవసరం తీరడమనేది భ్రమ. ఉహూ.. అవసరముందనుకోవడమే అసలు భ్రమ. 

 

మా బ్రేకప్ తరువాత ఓ బిజినెస్ మీటింగ్ లో పరిచయమైన లోగన్ తో డిజిటల్ ఫుట్ ప్రింట్ గురించి మాట్లాడినంతసేపూ నిక్ గుర్తొస్తూనే ఉన్నాడు. లోగన్ ఘోస్టరీ’ అనే కంపెనీలో పనిచేస్తుంది. ఇంటర్నెట్ లో మన వివరాలెక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే టూల్ తయారుచేశారు వాళ్ళు. అది మార్కెట్ చేసేందుకే లోగన్ నన్ను కలిసింది. 

 

ఇంకేం.. పెళ్లి కేన్సిల్ అయ్యాక సబ్స్క్రిప్షన్ తీసేసినా, నన్ను ప్రతిరోజూ నోటిఫికేషన్లతో చాలా విసిగించే ఓ వెడ్డింగ్ వెబ్సైట్ క్రోం లో పెట్టిఅందులోంచి పువ్వులమ్మే వెబ్ సైట్ కి వెళ్ళిఘోస్టరీ తో ట్రాక్ చేసి చూసా. అక్షరాలా పదహారు ట్రాకర్లు నన్నే చూస్తున్నాయి. ఒక్కసారి నా చుట్టూ ఉన్న బుడగ టప్ మని పేలిపోయిన భావన.

 

"నువ్వు వద్దనుకున్నా నిన్ను వదలనివెన్నో ఉన్నాయి సైబర్ ప్రపంచంలో. మనిషి పోయినా ఇక్కడిక్కడే తిరిగే దయ్యంలా.." అని నవ్వింది లోగన్.

 

 

*****

 

నిక్ నాకు ప్రపోజ్ చెయ్యడం వింతగా జరిగింది. వెగాస్ ట్రిప్ లో అడుగుతాడనిక్రిస్ మస్ కి తప్పదనీ ఊహిస్తూ వచ్చానా.. యొసమిటీ హైకింగ్ ట్రెయిల్  లో ప్రపోజ్ చేసాడు. నడుస్తూంటే ఒక మలుపులో పెద్ద సెకోయా చెట్టు కనిపించింది. అక్కడ ఫోటో సెషన్ అయ్యాక ఫోటోలు చూసుకుంటూ నిలబడ్డాను. నన్ను చూస్తూ ఎదురుగా ఎంతసేపు నిలబడ్డాడో మరి. నేను తలెత్తి చూసేసరికినెమ్మదిగా నేల మీదకి మోకాలు పెట్టి వంగాడు. ఏడుపొచ్చేసింది. ఆ క్షణంలో తన చేతిలో మెరిసిన ఆ ఉంగరం మెరుపు ఇంకా మర్చిపోలేను!  

 

యొసమిటీ నుంచి వెనక్కి రాగానే గబగబా అరడజను సైట్స్ లో రిజిస్టర్ చేసాను. లొకేషన్ఫ్లవర్స్కేక్టేబుల్ డెకార్… అన్నీ నేనొక్కర్తినేగా చూసుకోవలసింది. 

 

ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలో అర్ధం కావడం లేదని ఓ ఫ్రెండ్ తో చెప్పుకు బాధపడితేపిన్ టెరెస్ట్ లో చూడమని సలహా ఇచ్చింది. తీరాచేసి పిన్ టెరెస్ట్ లో నేనెప్పుడో రిజిస్టర్ చేసుకున్నానట!  గుర్తే లేదు. నా ఈమైల్ అడ్రస్ ని ఇట్టే చూపించేసింది యాప్. పాస్వర్డ్ రీసెట్ చేసి లాగిన్ అయిపోవడమే. పిన్నులే పిన్నులు అప్పట్నుంచీ. ఇన్స్టా ఫేస్ బుక్ తో కలిసి వచ్చే ప్లస్ వన్ కాబట్టి అదీ అందుబాటులోనే ఉంది.

 

పెళ్ళి వద్దనుకున్నాక కూడా నా న్యూస్ ఫీడ్ నిండా వెడ్డింగ్ గౌన్లుకేకులే. నొప్పేసేదిఏడుపొచ్చేదిఎందుకిలా జరిగిందనే బాధకంటే ఈ నస ఎలా వదుల్చుకోవాలో అర్ధమయ్యేది కాదు. 

 

ఎవరైనా మెసేజ్ చేసినా కింద అక్షరం టైప్ చెయ్యగానే బిలబిలా మిగిలిన నోటిఫికేషన్స్ కనిపించేవి. అన్నీ డిలీట్ చేసి మెయిల్ ఓపెన్ చెయ్యగానే "పన్నెండు హనీమూన్ స్పాట్స్" అంటూ ఎవడో మెయిల్ పంపేవాడు. మనిషి జీవితంలో ఏడవడానికి కూడా ఖాళీ లేనంతగా డిజిటల్ నస.

 

సెట్టింగ్స్ మార్చుకున్నాను. సజెషన్స్ తగ్గాయి కానీ పూర్తిగా పోలేదు. తుడిచిపారేసే అవకాశమే లేదేమిటని సర్చ్ చేస్తే నేను మైనారిటీ లో ఉన్నానుట! మార్చగలం కానీ పూర్తిగా ఆపేయలేం. 


పెళ్ళి అనుకున్నాక చేసుకున్నవారికి ఏ సమస్యా లేదు. వద్దనుకునేది మైనారిటీయే కదా. 


అలాగే ఒక ఇల్లు కొనుక్కోవాలని కోనేసుకుంటే అక్కడితో అయిపోతుందిఏ కారణానికైనా కుదరని వాళ్ళకి మళ్ళీ అదే గుచ్చీ గుచ్చీ చూపించడం హింస కాక మరేమిటి


ఇదే బిడ్డ గదికి వేసుకునే రంగుల కోసం పిన్ టెరెస్ట్ లో వెతుక్కున్న అమ్మాయికి ఏదైనా అనుకోని పరిస్థితుల్లో బిడ్డ పుట్టి ఉండకపోతే?

 

నాకొచ్చిన అనుమానమే ఎవరికైనా వచ్చి ఉంటుందా అని ఫోరమ్స్ లో చూసా. మనస్తత్వాలని కాచి వడబోసి బిలియన్ల  డాలర్ల బిజినెస్ చేస్తోంది సోషల్ మీడియా! అంత సులువుగా మనుషుల్ని పోనిస్తుందాజ్ఞాపకాలని కూడా సెలెక్టివ్ గా చూపిస్తుంది. 

 

*****

 

ఫేస్ బుక్ మెమొరీస్ లో తరచూ మా రెస్టరెంట్ చెకిన్స్ఫొటోలు కనిపిస్తాయి. "ఈ జ్ఞాపకాలు అచ్చంగా నీకు మాత్రమే కనిపిస్తాయి సుమా. అందరికీ చెప్పమందువా?" అని భద్రంగా తాళం పెట్టి చూపించి మర్యాదగా అడుగుతాడు. వద్దంటే మానేస్తాడు. 

 

విరిగిన కాలోచెయ్యో కట్టు కట్టించుకున్నాక సంతకాలు పెట్టించుకుని ఫోటో తీసుకుంటాం కదా.. మరి అదీ కనిపించాలి కదా అనుకున్నాను. అవి కనిపించవు! ఈ లెక్కన హాస్పిటల్ గౌన్స్ ని కనిపెట్టే ఇంటెలిజెన్స్ ఉంటే తప్ప వాటిని దాచడం కుదరదు. మరి ఎవరైనా బిడ్డని ఎత్తుకున్న ఫొటోలో గౌన్ ఉంటేఇదే ప్రశ్న అడిగితే మెషీన్లు ఇంకా అంత నేర్చుకోలేదు అన్నాడొక ఫ్రెండ్. అతను ఫేస్ బుక్ లో పనిచేస్తాడు. క్షణక్షణానికీ మెషీన్లు నేర్చుకుంటున్నాయి.. అదెంతపని! మనమే ముఖ్యమైనవి ఎన్నో మర్చిపోతున్నాం. 

 

జీవితంలో నొప్పీ ఒక భాగం కదా.. అనుకుంటే ఈ పాండెమిక్ పోస్ట్ లు ఏడాది తరువాత మెమొరీస్ లో కనబడితే!

 

రెండేళ్లుగా ఇంట్లోనే ఉన్నాను. వీలు చిక్కినప్పుడల్లా కూర్చుని డిజిటల్ ఫుట్ ప్రింట్ ని వీలైనంత చెరపడం మొదలు పెట్టాను. కొన్ని సులువుగా దారం తెంపినంత పుటుక్కున టాటా చెప్పేస్తున్నాయి. కనిపించినంత సులువుగా అక్కడితో అయిపోదని నాకూ తెలుసు. ఎక్కడో ఎవరో నా క్రెడిట్ కార్డ్ మీద మూడువేల రూపాయిల ఎలక్ట్రానిక్స్ కొన్న సందర్భం అకస్మాత్తుగా గుర్తొచ్చింది. ఎక్కడికి పారిపోతాం! ఎవరి నుంచి పారిపోతున్నాం?

 

ఒక మనిషికి  దూరమైపోవాలనుకున్న మరుక్షణం వెళ్ళి చార్జర్ కొని తెచ్చేసుకున్నంత సులువుగా డిజిటల్ స్వేచ్ఛ కొనేసుకోగలనా

 

సాలీడు గూడు కట్టినట్టు జాగ్రత్తగా నా చుట్టూ నేనే అల్లుకున్న డిజిటల్ ప్రపంచంనన్ను కదలనివ్వట్లేదు. సూపర్ పవర్స్ లేని మామూలు మనిషిని కదా. 

 

*****

 

ఫోన్ లో ఫొటోలు స్క్రోల్ చేస్తూ ఆగిపోయాను. ఆ ఫోటో నా ఫేవరెట్. అందులో మామీ వీపు మాత్రమే కనిపిస్తోంది, నేను తనని కౌగిలించుకున్నాను. నా మొహంతన భుజం మీదుగా  కేమెరా వైపు చూస్తూ నవ్వుతూ కనిపిస్తోంది. తెల్లని సిల్క్ గౌన్ లో ఉన్నాన్నేను. నన్నలా చూసి తను కన్నీళ్ళు పెట్టుకుంది. సేల్స్ గర్ల్ గబుక్కున నా ఫోన్ అందుకుని తీసిన ఫొటో అది.  మామీని చుట్టుకున్న నా చేతికున్న ఉంగరపు రాయి దీపాల వెలుగుల్లో తళుకుమంటోంది. నా మోహంలో స్పష్టంగా కనిపిస్తున్న గర్వం, ఆనందం! అది డిలీట్ చెయ్యలేను. మామీని అలా కౌగిలించుకోవాలన్నా కుదరనంత దూరం రెండేళ్లుగా మా మధ్య. ఆ ఫోటోకి ఇక్కడ కూర్చున్న నాకూ మధ్యలో ఒక పాండెమిక్ నడిచిన రెండేళ్ల కాలం ఉంది. వీలైనంత త్వరలో ఇంటికెళ్ళాలి. 

 

నాకిష్టమైన ఫొటో ఇంకొకటుంది. సెకోయా చెట్టు కింద నిలబడి నవ్వుతున్న నేను.  

 

అక్కడే నిక్ నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. "Paula Merril, will you marry me?" అన్నాడు. 

 

ఎందుకు కాదనలేకపోయానుఈ జ్ఞాపకాలన్నీ చెరిపేయనవసరమే ఉండేది కాదుగా..

 

ఇంతేనాఇంకాస్త రొమాంటిక్ గా అడగలేకపోయావా?” అని తరువాతెప్పుడో కవ్విస్తే.. 

 

రోజులో ఒక ఫోన్ కి ఏవరేజ్ న అరవై మూడు నోటిఫికేషన్స్ వస్తాయట. నీ ఫోన్ కైతే దానికి డబల్ అనుకో.. నీ ప్రతి నోటిఫికేషన్ నేనే అవాలనుందిపెళ్లి చేసుకుంటావా అని అడిగుండాల్సింది!” అన్నాడు నవ్వుతూ.. 

 

 *****


(after reading an article in Wirally) 

 

Wednesday, May 19, 2021

కచ్ఛపసీత

"వాల్మీకి లోకానికి ఓ మహోపకారమూ, ఓ మహాపకారమూ చేశాడు." అన్నారట ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు, ఎస్వీ భుజంగరాయశర్మ గారితో.. 


"రామాయణాన్ని వ్రాసి ఈ జాతి అభిరుచుల్నీ, అభిప్రాయాల్నీ యుగయుగాలుగా తీర్చిదిద్దాడు. అది మహోపకారం కాదా!" 
"సరే, అపకారం ఏమి?" టన్నారు భుజంగరాయశర్మ.
"మరి కొత్తది రాయడానికి ఎవరికీ ఏమీ మిగిల్చిపోలేదు." అన్నారట హనుమచ్ఛాస్త్రి గారు. 

వాల్మీకి రామాయణంలోంచి శాఖోపశాఖలుగా విస్తరించిన అభివ్యక్తులన్నీ దేశాల ఎల్లలు దాటి విస్తరించాయి. రామాయణపాత్రల్నీ, వర్ణనల్నీ మించి కొత్త ఊహ ఏదైనా ఉందా అంటే అనుమానమే. పూర్వకవుల దగ్గర్నుంచీ ఏదో ఒక పాత్రని ఆరాధించడమో, సన్నివేశాన్ని విశ్లేషించడమో, వాల్మీకంలో వాచ్యార్ధానికి వెనుక ఇంకా ఏదైనా ఉందా అని ఆలోచించడమో జరుగుతూనే ఉంది. ఆ చింతనల్లోంచి చిలవలు పలవలుగా పుట్టిన పిట్టకథలు వాల్మీకి రామాయణపు సొగసునూ, గాఢతనూ పెంచేవే. ఊర్మిళ నిద్ర అలాంటి కథ. 

జనకుడికి నాగేటిచాలులో దొరికిన బిడ్డ సీత, ఆపై ఇంకొక కూతురు ఊర్మిళ. జనకుని తమ్ముడు కుశధ్వజుడు సాంకస్య పట్టణపు రాజు. ఆయనకీ ఇద్దరు కూతుళ్లు. నలుగురు రాజకుమార్తెల్నీ అయోధ్యా రాకుమారులకి ఇచ్చి ఒకే ముహూర్తానికి పెళ్లి చేసాడు జనకుడు. వాల్మీకి రామాయణంలో ఉన్నది ఇంతే. 

ఊర్మిళ నిద్ర, లక్ష్మణదేవర నవ్వూ ఇవన్నీ జనకథలే. అన్నగారివెంట అడవులకి వెళ్లిన భర్త విరహాన్ని భరిస్తూ ఒంటరిగా ఉండిపోయిన ఊర్మిళ ఏమై ఉంటుందనే ఊహ మనసుని మెలిపెడుతుంది. 

పతంజలి శాస్త్రిగారి "కచ్ఛపసీత" కథ ఆ ఊహని వేరే స్థాయికి తీసుకెళ్తుంది. ఈ కథ గురించి ధూళిపాళ అన్నపూర్ణ గారు సమీక్షించినప్పుడు తెలిసింది. ఆ విదుషిని మెప్పించిన కథ ఎంత బావుండి ఉంటుందో అనుకున్నాను. పుస్తకం అంది చదివిన మొదటిసారి, రెండో సారి, ఎన్నిసార్లో... ఇదిగో ఇప్పుడు ఇంకోసారీ కూడా అదే అలజడి. కొక్కేలు వేసి లాగే వాక్యాలు ఎన్ని ఉన్నాయని. రామాయణం కొన్ని సర్గలు ప్రత్యేకంగా వెతుక్కుని చదువుకున్నాను, మళ్ళీ కథ చదువుకున్నాను. తీరదే! 

భారతీయ తాత్విక దృక్పథానికి రచయితకి ఉండాల్సిన అనుసంధానం గురించి శాస్త్రి గారి మాటల్లో అక్షరయాత్రలో విన్నవి మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకున్నాను. ప్రాచీన సాహిత్యకారులు తాత్వికతకి మనిషి అస్తిత్వానికి లంకె వేసి మనకందించారు. నెమ్మది నెమ్మదిగా సగర్వంగా అన్నీ జారవిడిచుకున్న తరానికి ఆఖరు ప్రతినిధిని నేను. ఇప్పుడు ఏడ్చి మొత్తుకుంటే దొరికేదా జ్ఞానం? 

లక్ష్మణుడి సాన్నిహిత్యాన్ని, ప్రేమని తల్చుకు తల్చుకు శల్యమైపోతున్న కూతురితో తండ్రి చెప్పే మాటలు ఏ బాధకైనా వర్తించేవే. "దుఃఖాన్ని లేదనుకోవడం అజ్ఞానం, దాన్ని విస్మరించమని చెప్పడం అమాయకత్వం. నువ్వు ముందు దుఃఖాన్ని అర్ధం చేసుకో. నువ్వు ఏ ఉపశమనం కోరుకుంటున్నావో అది వెలుపల ఉండదు. నీలోనే, నీ ఆధీనంలోనే ఉంటుంది." 

అయినా ఊర్మిళకి దారి దొరకదు. దుఃఖంలోంచి, ఆగ్రహంలోంచి విజ్ఞతలోకి ప్రయాణించడమేమీ సులువు కాదు అంటాడు ఊర్మిళతో తండ్రి. 

"బాల్యంలో తప్ప క్షత్రియస్త్రీ కి సుఖముండదు" అని చెప్తుంది  సీత తన చెల్లెలితో. పుట్టింటికి వెళ్లిపొమ్మని, బాల్యాన్ని పునర్జీవించమని ప్రోత్సహిస్తుంది. ఎంత గాఢమైన ఆలోచన! ఎంత అపురూపమైన ఊహ! 

ఒడిదుడుకులు అన్నీ మానవప్రయత్నానికి లొంగి దారివ్వవు. ఒక్కోసారి తలవంచక తప్పదు. బాల్యంలోకి ఎలాగైనా పారిపోగలిగితే చాలని క్షణకాలమైనా అనుకోని వారుంటారా? ఇంత తాత్వికతని అస్తిత్వానికి లంకె వేసి కథలో చుట్టి అందించారు పతంజలిశాస్త్రి గారు. 

"జీవితంలో మళ్ళీ సౌమిత్రిని చూడలేనేమోననే భయం హృదయం మీద శిలవలె ఉండేది. తన జీవితం భయం ఉండచుట్టిన వియోగం." అనుకుంటుంది ఊర్మిళ. 
ఊర్మిళ అంటే 'కోరిక కలిగినది' అని చెప్తారు. ప్రతీ స్త్రీ ఊర్మిళ కాదూ? సంతోషంగా జీవితం గడపాలని చూసే మనిషి కాదూ? 

కథకి మలుపు అవసరం కాబట్టి కచ్ఛపసీత ఊర్మిళ కథలోకి వస్తుంది. ఆమెకి పట్టుకొమ్మ దొరికినట్లయింది. తనలోకి తాను అంతర్లోకనం చేసుకోమని తండ్రి చెప్పాడు. బాల్యానికి వెళ్లిపొమ్మని అక్కచెల్లెలు చెప్పింది. దానికి మార్గమే తాబేలు రూపంలో కనిపించిందేమో. ప్రతీకాత్మకంగా సాగే కథలో మణిపూసల్లాంటి  మాటలెన్నో. "ఎక్కడ నుంచి వస్తాయీయనకి ఇలాంటి ఊహలు!" అని ముచ్చటపడి మళ్ళీ చదువుకోవడమే. "ఊరుకో.. నీ కన్నీళ్లు సౌమిత్రి కళ్ళలో తిరుగుతున్నాయి." అన్న వాక్యం కొన్ని జన్మలకి కూడా నన్ను వదిలిపోదేమో! 

ప్రాచీనసాహిత్యం అందకుండా ఒక తరాన్ని సాహిత్య పరంగా నిర్వీర్యం చేసిన మార్పుల గురించి కూడా పతంజలిశాస్త్రిగారికి కచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి. పంచతంత్రం, పురాణేతిహాసాల్లో ఉన్న కాల్పనికత, మార్మికత మనిషి మెదడుకు పదును పెట్టే అంశాలు అంటారాయన. సమకాలీనతకు అద్దం పట్టేలా రాయడమొక్కటే సాహిత్యపు పరమావధి కాదు, ఆ పని చేసేందుకు వేరే మార్గాలున్నాయంటారు. పిడుగుపడి చెట్టు కూలితే బాల్కనీలోంచి చూసి అర్జంటుగా సోషల్ మీడియా లో కవిత్వమో కథో వెలార్చడాన్ని సృజనాత్మకత అనుకొమ్మని బలవంతం చేసే పరిస్థితుల్లో ఉన్నాం. కొత్త విశేషణాలెందుకు పుట్టట్లేదు? కొత్త పోలికలు ఎందుకు అందట్లేదు? నింగికీ, మన్నుకీ, పచ్చని చెట్టుకీ, పారే నీరుకీ దూరమైన మనిషికి కల్పనా, కవిత్వమూ ఎక్కణ్ణుంచి వస్తాయి? 

"పచ్చని చెట్ల నీడలో పడుకుని నీ బాల్యంలోకి వెళ్ళు. మన సుఖసంతోషాలని అక్కడ విడిచి వచ్చాం." అని చెప్తుంది సీత. కష్టాల కడలిలో ఎలా అంతర్ముఖమవ్వాలో కచ్ఛపసీత చూపిస్తుంది. ఊర్మిళ నిద్రపోతుంది. 

నిజంగా నిద్రపోయిందా? అందులో స్త్రీ సాధికారత ఏముంది? అసలీ కట్టుకథ వలన ప్రపంచానికి ఏం ఒరుగుతుంది? అని ప్రశ్నించే వారికి ప్రతీకాత్మకత అంటే చెప్పగలిగిన శక్తి రామాయణభారతాలకి కూడా లేదు. 

శాస్త్రిగారు ఒక మాట అంటారు.. ప్రాచీన సాహిత్యమొక్కటే సాహిత్యమని వాళ్లెప్పుడూ చెప్పలేదు. కానీ ఆధునికులు అభ్యుదయ సాహిత్యమొక్కటే సాహిత్యమని ఒక తరాన్ని గొప్ప అనుభవం నుంచి దూరం చేసేసారు అని.. ఎంత కఠోరనిజమది! 
 
సి. ఆనందారామం అంటారు.. "కాపీరైట్ హక్కులు లేవనే కదా రామాయణ భారతాల్ని ఇష్టానికి తిరగరాస్తున్నారు?" అని. నచ్చనిదాన్ని విశ్లేషించడమో, విమర్శించడమో కాక తమ భావజాలాన్ని ఆ పాత్రల మీద రుద్దడంలో  నైతికత ఎప్పుడూ ప్రశ్నార్ధకమే.     

అసలు కథ సౌందర్యాన్ని వెయ్యింతలు చేసేలా రాసిన "కచ్ఛప సీత" లాంటి కథ చదివి ఆ తిరగరాతల్ని చదివిన బాధని కడిగేసుకున్నాననిపించింది. 

మొన్న జరిగిన పతంజలిశాస్త్రిగారి పుట్టినరోజు సందర్భంగా "సారంగ"లో వచ్చిన వ్యాసాల్లో రెండు - "గోదావరి పడవలా మా అన్నయ్యగారు" లో తల్లావఝల శివాజీ తన అన్నగారి కంటే తనెన్ని వందలేళ్ళ చిన్నో నిరూపించుకునే విఫలప్రయత్నం చేశారు. శివాజీగారి మెటాఫర్లకి నేను వీరాభిమానిని. "ఎంగిలి కాని వాక్యాలతో అసలు కథ" అని కె. రామచంద్రారెడ్డి గారు వడ్లచిలకలు కథ గురించి రాశారు. "ఈమాట" లో  కె. సురేష్ గారు "శాస్త్రిగారి అరవై ఏళ్ల అక్షరయాత్ర" ని  సింహావలోకనం చేశారు. మూడూ ఇంకోసారి చదువుకుని, మృణాళిని గారి అక్షరయాత్ర చూసి, నిద్రకి ఒరుగుతూ ఇంకోసారి కచ్ఛపసీతని తల్చుకున్నాను. 

ఊర్మిళకి దొరికిన దారి ఎప్పటికైనా నాకూ దొరకకపోతుందా.. ఇలాంటి కథలు చదువుతూ చదువుతూ ఉంటే ఎప్పటికైనా అని. 

అన్నట్టు మనలో మన మాట - రామచంద్రారెడ్డి గారి విసురొకటి భలే నచ్చిందబ్బా! "ఎందుకింత శ్రమపడి చెరకు చీల్చి రసం తాగడం. డిస్పోజబుల్ గ్లాస్లో ఐస్ కలిపి గొంతులోకి దిగిపోయే రెడీమేడ్ సరుకు వుండగా అనే చదువరులకు ఓ దణ్ణం." అని... 

చెరుకుముక్క నవులుతూ... శాస్త్రిగారికి ఓ దణ్ణం పెట్టుకుంటున్నా. 



*** 

కచ్ఛపసీత కథ, మరో పదకొండు కథలతో కలిపి "రామేశ్వరం కాకులు" కథాసంకలనంలో ఉంది. ఛాయా ప్రచురణ

Sunday, May 16, 2021

కళావంతులు - ఒక చింతన

 అనగనగా ఓ రాజ్యంలో చాలా చాలా శతాబ్దాల క్రితం తలపాగాలు చేసే కళ ఉద్భవించింది. నిజానికి ఆ కళ మనిషి పుట్టినప్పుడే.. నచ్చిన దాన్ని సంతోషంగా తలకెత్తుకున్న నాడు పుట్టిందట.

అందమైన తలపాగాలను ఆస్వాదించేందుకు రాజుగారిని మించిన పోషకులెవరున్నారు! కళాకారులకు సమ్మానాలూ, మాన్యాలు.. ఊరంతా రాజుగారి కొలువుకి చేరి తలలూచుతూ మరీ తలపాగాలను చూసేవారు.

ఆ రాజ్యంలో ఒక దేవాలయం. తోటలో పూసిన పూవు కోవెలలో దేవుడికి అర్పించాలని కోరుకునే రోజులవి. దేవుడికి ప్రత్యేకంగా తలపాగాలు చేయించేందుకు రాజుగారు కొందరు కళాకారులని నియమించారు. వారికి తగ్గ బహుమతులు వారికి దక్కాయి. పుణ్యమూ, పురుషార్ధమూ కలిసొచ్చినందుకు కళాకారులూ సంతోషించారు.

వీధికో కోవెల, కోవెలకో తలపాగా. కోవెల మాన్యానికి లోటులేని కళాకారులు వీధివీధినా వర్దిల్లారు. అతిచక్కని తలపాగాలు చేసి ప్రజలని, ప్రభువుని, దేవుడినీ కూడా సంతోషపెట్టారు. వారి స్వయంప్రతిపత్తి రాజ్యంలో వేరెవరికీ లేదు. జనసామాన్యంలో ఎవరైనా తమ పిల్లల్ని పెంచలేకపోయినా, కళాకారులకి పిల్లల్లేకపోయినా దత్తతలు జరుగుతూండేవి. సొంతంగా సైన్యాన్ని తయారుచేసి అవసరమైతే యుద్ధాలకి పంపగలిగేంత ధనముండేది ఆ కళాకారుల దగ్గర. రాజుగారి ఎదుట సామంతులు కూడా కూర్చొన వెరచేవారేమో కానీ, తలపాగా కళాకారులు తమలపాకులు ముడిచి నములుతూ సభలో కూర్చోగలిగేంత మన్నన పొందారు.

తరాలు గడిచాయి. రాజరికానికి రోజులు చెల్లే కాలమొచ్చింది. పెద్దపెద్ద రాజ్యాలు సంస్థానాలుగా విడిపోయాయి. అక్కడా మారుతున్న రోజులకి తగినట్టు తామూ మారుతూ కళాకారులు నెట్టుకొచ్చారు. ఆ కళని ఆరాధించేవారు చేతనైన దన్ను ఇస్తూ వచ్చారు. ఆ సంస్థానాలు కూడా ముక్కలు చెక్కలయ్యే రోజులొచ్చాయి. అంతా అగమ్యగోచరమైపోయింది.

దేశాన్ని అతలాకుతలం చేసిన తెల్లదొరలు సంస్థానాల్ని చూసేందుకొచ్చారు. కళాకారులు అందర్నీ మురిపించినట్టే దొరల్నీ మురిపిద్దామనుకున్నారు. చెమ్కీలు, జరీలు, మాణిక్యాలూ.. నేసిన తలపాగా ప్రదర్శించారు. గంధం వాసన, అటుకుల రుచీ, తలపాగా సొగసూ అందరికీ సొక్కుతుందా? తెల్లదొరలకి ఈ కళ నాటుగా అనిపించింది. అందుకు ఇంతలేసి ఖర్చెందుకన్నారు. అసలు కారణమేదైనా ఇదంతా అనాగరికమన్నారు. అనైతికమని తేల్చారు.

తరువాతి కథని ఊహించగలరు కదా.. ప్రపంచంలో వేరే ఏ దేశంలోనూ కనబడని చిత్రమైన కథ ఇది.

దశాబ్దాలు గడిచినా కళాకారుల వారసుల్లో కొందరికి పూర్వజన్మ వాసనల్లా ఉండిపోయిన కళ నిద్రపట్టనివ్వలేదు. ఇంకొందరికి మీద పడ్డ మచ్చ నిలవనివ్వలేదు. రాజకీయ చదరంగంలో పావులమయ్యామే అనే బాధ గుచ్చుతూనే ఉంది.

అస్తిత్వపోరాటం రాజుకుంది.

****

"అసలేం జరిగింది?" అని వెనక్కి వెళ్లి చూసి వచ్చే సదుపాయం కాలం మనకివ్వదు. ఆ సమయంలో పుట్టిన సాహిత్యం మాత్రం కాలాన్ని భద్రంగా తనలో దాచిపెడుతుంది. తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత. జాగ్రత్తగా గమనించే దృష్టి ఉండాలే కానీ అక్షరం అక్షరమే.

కాల్పనిక మధురవాణి, చాపల్యం కొద్దీ చదివిన ముద్దుపళని, రంగాజమ్మ, చరిత్రలో బెంగుళూరు నాగరత్నమ్మ.. కళావంతులంటే వీరు మాత్రమేనా? సాహిత్యంలో ఇంకా తరచి చూడాల్సిన అవసరం ఉందేమో! చిట్టాపద్దుల్లాగో, ఎత్తిపోతల్లాగో కాకుండా నాకు తారసపడిన కొన్ని దృష్టాంతాలని పరిచయం చెయ్యాలనే ప్రయత్నమిది. నేను గమనించినవి కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

సాహిత్యాన్ని, పరిశోధనలను పరిశీలించినప్పుడు - వందల ఏళ్ల కాలనైజేషన్ కళని, చరిత్రని, ఆలోచనా విధానాన్ని, అన్నిటికీ మించి నైతికతని ఎలా రాజకీయం చేసిందో తెలుసునేందుకు గొప్ప ఉదాహరణలు కనిపిస్తాయి.

భారతీయసమాజంలో ఒకప్పుడు ఒక వర్గం స్త్రీలు స్వేచ్ఛని అనుభవించారని అందరం ఒప్పుకుంటాం. ఏ వ్యవస్థలో అయినా తప్పని లుకలుకల్ని పక్కకి పెట్టి సమగ్ర సాధు దృష్టితో పరిశీలిస్తే కళావంతులని మించిన పాండిత్యం, రసజ్ఞత, స్వాభిమానం, స్వాతంత్ర్య ప్రతిపత్తి ఇంకోచోట ఉంటుందని నేననుకోను.

****

పండి తెల్లఁబారు వరితోటలను జూచి
యేల మొగము వంచి యేడ్చెదమ్మ?
చూడు జనుపచేను సొగసెక్కె నరిదళం
బలఁదుకొన్న యాటవెలఁది వోలె

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు ప్రాకృతం నుంచి తెలుగులోకి అనువదించిన గాథాసప్తశతిలో పద్యమిది. ఒకటో శతాబ్దపు కవిత్వం. మహిందుడు వ్రాసిన గాథ. హరిదళం మొహానికి అద్దుకున్న ఆటవెలది తో పచ్చని జనుప చేనుని పోల్చి చెప్తున్నాడు కవి. ఇది కచ్చితంగా రెండువేల సంవత్సరాల క్రితపు ప్రస్తావన.

****

క్రీ.శ. 1253- 56 మధ్యకాలంలో కాకతీయ ప్రభువు గణపతిదేవుని ఆజ్ఞతో ఆయన బావమరిది జాయన / జాయ సేనాపతి "నృత్తరత్నావళి" రచించాడు. ఇది నాట్యశాస్త్ర దర్పణం. ఇందులో నర్తకి ప్రస్తావన ఎలా ఉందో గమనిస్తే ఆనాటి రాజాస్థానాల సంప్రదాయాన్ని ఊహించుకోగలుగుతాం.

శతాబ్దాల క్రితపు గ్రంథాన్ని పరిష్కరించి, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన వారూ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారే.

ప్రాయంపు గుబాళింపు కలది, మృదువైన దేహము కలది, స్నిగ్ధమైన స్వరముతో పాడగలిగినది, అనేకభావరసములు నిండిన లాస్యమున నేర్పరియైనది, దొండపండువంటి మోవి కలది యగు నర్తకిని సంపాదించుకోగల రాజేంద్రునికి సర్వేంద్రియములు సుఖియింపగా ఇతర వినోదములందలి రుచి మందగించును.

నృత్త సమయాలు - యజ్ఞము, పెండ్లి, పట్టాభిషేకము, నగరప్రవేశము, గృహప్రవేశము, జలక్రీడ, ప్రియసంగమము, వ్రతము, మహాదానం, పుత్ర జననము, యాత్ర, పండుగ, పరీక్షణము, ఉత్సవము, విజయానందము, ప్రతిష్ట, ఇష్టార్ధసిద్ధి, దేవపూజ

(ఆపై ఎనిమిది అధ్యాయాలలో నాట్య సంప్రదాయాలను వివరించి చివరి అధ్యాయంలో జాయన ఇలా చెప్తాడు.)

పుష్పాంజలికి పిమ్మట కర్పూరపుపొడి వంటి తెల్లని వలిపెము మరుగున నర్తకి అప్పుడే స్వయంవరమునకై పాలసముద్రమునందుండి వెడలిన మహాలక్ష్మివలె నిలచియుండవలెను. తెర పాటబంధముల శబ్దము తుదలో వాద్యములన్నియు ఒకేమారు చెవులకింపుగా మ్రోగుచుండగా తొలగింపబడవలయును.

ఇంగితమెరిగినవారు బృందంతో కూడా నర్తకిని, సువర్ణ రత్నమయములగు ఒడ్డాణము, అందియలు, కడియములు మొదలగు సొమ్ములును, బంగారు సరిగల వస్త్రములు, శ్రీగంధము, అగరు, కుంకుమపూవు, మున్నగు వానితోడి కలపములును, బహుమతిగా నిచ్చి సంతోషపరుపవలయును. మదించిన యేనుగులు, గుఱ్ఱములు మున్నగువానిని - లేదా శక్త్యానుసారము ఏవైనను ఈయవలెను.

బహుమానసంపద బరువుతో, ప్రభువు మెచ్చి గారవించుటచే ధన్యురాలనైతిని నను, నెమ్మదితోనున్న ఆ నర్తకిని భూపాలుడు "అలసితివి, ఇంటికిబోయి విశ్రమించుకొమ్ము" అని వీడుకొనవలెను.

ఇదే సందర్భంలో నృత్తరత్నావళి పీఠికలో డా. పోణంగి శ్రీరామ అప్పారావు గారి మాటలని ప్రస్తావించుకోవాలి. రఘునాథ నాయకుని కాలంలో తంజావూరులో పెక్కునాట్యశాలలుండేవని, కామరాజు వేంకటపతి సోమయాజి రచించిన విజయరాఘవచంద్రికా విహారంలో నాయిక "బైటి నాటకశాల పడుచు" ట అంటారు. అంటే రాచనగరులో ఎన్ని నాట్యశాలలుండేవో ఊహించుకోవచ్చు.

****

పద్నాలుగో శతాబ్దానికొస్తే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రంజకం వంశపు నర్తకులు ఉండేవారని తిరుమల శాసనాలలో ఉన్నది. (దేవస్థానం ఎపిగ్రాఫికల్ రిపోర్టు మూడో సంపుటం) రాయలవారి విద్వత్సభ తరువాత నాట్యం చేసే మేళంలో కుప్పాయి / కుప్పసాని ప్రముఖురాలు. ఆమె, ఆమె తండ్రి శ్రీరంగరాజు తిరుమలలో స్వామి ప్రీత్యర్ధం దానాలిచ్చారని శాసనాలు ఉన్నాయి. ఈ రంజకం కుప్పాయి కూతురు ముద్దు కుప్పాయి 1531 లో అచ్యుతరాయలు హయాంలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో దేవదాసిగా నియమించబడినదట.

****
"రాయలనాటి రసికతా జీవనము" అనే వ్యాసంలో సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్య మాటలు చూద్దాం. 1955 లో ప్రచురించిన చిరుపుస్తకమిది.

"ఆ సమాజమున బోగము వారు దూష్యము కాదు. వారికి సమాజమున గౌరవముండెను. దేవరాయల నాటికే అఱువది వేలకు పైగా వారుండిరి.

దేవదాసీలు సమాజమునకు కళంకమనువాదము ఈనాడు ప్రబలంగా వ్యాపించినది. ఈ ప్రచారంపై నాకు కళాదృష్టితో, సామాజిక దృష్టితోనూ ఎక్కువ సానుభూతి లేదు. ఈ సమాజమందు మంచిచెడ్డలు రెండును చాలాకాలముగా స్థానమును సంపాదించుకున్నవి. ఎంతవారికైనను మానవజాతి "యిట్లే యుండవలెనని" శాసించుట అసాధ్యము, అనవసరమూ కూడా. ఈ మాటలు నేననుటలో నన్నొక "అభివృద్ధి నిరోధకునిగా" ఇంద్రియలోలునిగా చాలామంది వ్యాఖ్యానించెదరని నేనెఱుఁగుదును.

నాకు సంఘసంస్కారము పనికిరాదని కాదు. సాధ్యముకాదనియే నా గొడవ. ఇక కళాదృష్టితో జూచినప్పుడీప్రచారములో కలుగు నష్టముపేక్షింపదగినది కాదు. మన ప్రాచీనసంఘము నందు శైవులు ముఖ్యముగ వైష్ణవులు దేవదాసికి ఇచ్చిన గౌరవము చాల గొప్పది, వారేర్పరచిన నియమములను చక్కగా అనుసరించుచున్న ఏ దేవదాసియైన నేడున్నచో ఆమెకు చేయెత్తి మ్రొక్కుటకు నాకెట్టి ఆక్షేపణము లేదు. ఏ నియమముకైనను హృదయధర్మము మారవలెను. అదిలేనిది యే ప్రయత్నమూ గూడ కేవల విడంబమే."

****

నాకు పరమ ప్రామాణికమైన తిరుమల రామచంద్ర మాట ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి. తన స్వీయ చరిత్ర హంపీ నుంచి హరప్పా దాకా లో బసవి నాగమ్మ గురించి ప్రస్తావిస్తూ అన్నమాట.

"మన ఆచారాలు అన్నీ మంచి ఉద్దేశంతో ప్రారంభమై చెడ్డ పరిణామంలో ముగుస్తాయి. సంసారబంధంలో చిక్కుపడక తనను భగవంతుడి సేవకు జీవితం అంతా అంకితం చేయడం దీని ఉద్దేశం. ఈ దైవసేవ కోసమే కాదు, రాజసేవ కోసం తన లక్ష్యసిద్ధి కోసం అంకితమయ్యేవారు. దీనికి గొప్ప ఉదాహరణ గోదాదేవి. తనకు వివాహం భగవంతునితోనేనని రంగనాథునికి జీవితం అర్పించి ఆయనలో ఐక్యమైంది."

ఈ రిఫరెన్సు తెలిసో తెలియకో తమిళకవి వైరముత్తు దినమణి పత్రికలో ఆండాళ్ గురించి రాసిన వ్యాఖ్య పెనువివాదానికి దారితీసింది. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పుకున్నాడు.

"పచ్చకర్పూరపు పరిమళమా? కమలపు సుగంధమా? ఆ రాగరంజితమైన పెదవి రుచి ఎలా ఉంటుందో" చెప్పమని శంఖాన్ని ప్రశ్నిస్తుంది గోదా. ఇంతకంటే గొప్ప కవిత్వమేముంటుంది!

తేట తెలుగులో ఇంతే అందమైన పద్యమల్లింది ముద్దుపళని.

కావి గా దది విడికెంపు దీవి గాని
దీవి గా దది యమృతంపు బావి గాని
బావి గా దది కపురంపు తావి గాని
తావి గా దది శౌరి కెమ్మోవి గాని

ఇంత సౌకుమార్యం, ప్రేమ, మోహం సామాన్యమైన స్త్రీకి కలలో కలిగితే కూడా ఇంటిల్లిపాదీ లెంపలేసుకునే జాతి మిగిలింది. సారస్యమనేదే ఇగిరిపోతే మిగిలిన పిప్పి మనుషులు సాధించేది యాంత్రిక అభివృద్ధి తప్ప, జీవికలో స్థిమితం ఎలా దక్కుతుంది!

******

అయితే దేవదాసీ జీవనవిధానం ఎలా ఉండేదో ఎవరైనా చెప్తే కదా తెలిసేది?

కార్వేటినగరం రాజు గారికి అర్జీ పెట్టుకుని తిరుత్తణి కోవెలకి దేవదాసీ అయ్యే పద్ధతి గురించి "Nitya Sumangali" పుస్తకంలో వివరిస్తారు Dr. Saskia Kersenboom. తమిళనాడు దేవదాసీ సంప్రదాయం గురించి విస్తృతమైన పరిశోధన చేసి అందించిన ఈ ప్రామాణిక గ్రంధాన్ని నాట్య విద్యార్థులు కళ్ళకద్దుకు చదువుకుంటారని విన్నాను.

Dr. Kersenboom ప్రేమగా 'రంగనాయకి అమ్మ' అని తలుచుకునే పి. రంగనాయకి చెప్పిన మాటలు ఇవి.

"When a girl would reach the age of 16, an application to be allowed to become a devadasi would be sent to the king of Karvetinagar. Such a petition would have to be countersigned by ten priests and ten devadasis employed in the temple which the girl wished to enter. .. The training in dance, song, bhAratam and languages would continue indoors. In those days the admission was very strict. .... After one month from Muttirai, the devadasi was free to decide about her future: either she would accept a steady husband, or she would be kept as a mistress for a period that would be agreed upon. We were god-fearing. After we got our status as devadasi, we could decide for ourselves. If some were deserted by men, they still had their profession which offered them a living. We had our own discipline."

****

దక్షిణ భారతదేశంలో, తెలుగునాట కళావంతుల చరిత్ర గురించి ప్రొఫెసర్ దేవేష్ సోనేజీ రాసిన "Unfinished Gestures" కళావంతుల జీవితాల్లోని మనకి తెలియని, తెలిసినా ఒప్పుకోలేని దృక్కోణాన్ని పరిచయం చేస్తుంది.

దేవదాసీ నిర్మూలన చట్టం కోసం అహరహం శ్రమించిన ముత్తులక్ష్మీరెడ్డి గురించిన చాప్టర్ సోనేజీ చాలా విశదంగా రాశారు. మచ్చుకి ఒక పేరాగ్రాఫ్ ఇస్తున్నానిక్కడ. అప్పటి రాజకీయ నేపథ్యం గురించి విస్తారమైన వివరాలున్నాయి సోనేజీ పరిశోధనలో.

Muthulakshmireddy's anti-nautch activities were inextricably linked to Congress Politics and the Theosophical Society largely through the mediating figure of Annie Besent and emergent notions of eugenic health.

Besant first wrote about Devadasis in 1919: There was a band of pure virgin devotees attached to the ancient Hindu Temple. They used to preach religion like other religious teachers to the common people that resort to the temple for daily worship. In those days they were held in high esteem and were very well looked after. They would spend their time in doing religious service to the Gods, and the devotees of the temple, as the word dasi itself signifies. They would follow the procession of gods dressed in the simplest sanyasi garbs and singing hymns suitable to the occasion. This is the history and origin of the devadasi class. (cited in Reddy 1927,5) - No concrete source exists for Besant's claim.

బ్రిటిష్, యూరోపియన్ వారి మాటల్లో అప్పటి నాచ్ డాన్స్ గురించి , జావళీ పుట్టుపూర్వోత్తరాలు, కళావంతులు సినిమా రంగానికి వలస వెళ్లిన వైనం.. ఈ పుస్తకంలో దేనికదే ఆసక్తికరంగా ఉన్నా గోదావరి జిల్లా కళావంతులు అన్నాబత్తుల బులి వెంకటరత్నం, మద్దుల వెంకటరత్నం విశేషాలు, కోటిపల్లి హైమవతి రచయితతో మాట్లాడిన సందర్భాలు, వారి పురావైభవానికి ఆనవాళ్ళలాంటి భామా కలాపం, ఆట భాగవతం, గొల్లకలాపం గురించిన విశేషాలు పట్టి చదివిస్తాయి.

కోటిపల్లి హైమవతి "మందార గంధం ఇది" అంటూ పాడిన జావళీ గురించి చదివాక ప్రొఫెసర్ సోనేజీ కి మనసులోనే ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేకపోయాను. కళ్ళకి కట్టించడమనేది చిన్నమాట.

అన్నట్టు ఓ కొసరు సంగతి. సినీనటుడు సాయికుమార్ తల్లి, నటుడు పీజే శర్మ భార్య కృష్ణజ్యోతి కళావంతుల బిడ్డ. ముద్దుబిడ్డ సినిమాలో ఆమె నాట్యం చేసిన "అంతలోనే తెల్లవారె" జావళీ గురించి కూడా చెప్తారు ఈ పుస్తకంలో. ఇంకాస్త వెతికి తెలుసుకున్న విషయమేమిటంటే కృష్ణజ్యోతి కథలు రాశారు. కథానిలయంలో రెండు కథలున్నాయి కూడా.
****

తెలుగు కథలూ నవలల్లో దేవదాసీలు అందరికీ సుపరిచితమే. ఈ నేపథ్యంలో మరొకసారి పరిశీలిస్తే స్వాతంత్ర్యానికి ముందూ వెనుకా కూడా వారిపట్ల ఆరాధనే కాదు, కచ్చితమైన మద్దతు కూడా కనిపిస్తుందనడంలో సందేహమే లేదు.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు వడ్లగింజల్లో తంగిరాల శంకరప్పతో తనకు చదరంగం నేర్పిన చంద్రవదన గురించి చెప్పిస్తారిలా... "ఆమె మా నాయనగారి దగ్గిర కావ్య నాటకాలంకార గ్రంథాలు నాతో సరిగా క్షుణ్ణంగా చదివింది. ప్రస్తుతం ఆమె మొగలితుర్రు ఆస్థానంలో మన్ననలు పొందుతోంది. భ్రాతృప్రేమతో పెంచి నన్నామె చదరంగంలో ప్రవేశపెట్టి దిద్దింది." ఈ కథలో కనిపించే మరిద్దరు భోగం వారు రంగనాయికా, అలివేణీ కూడా తక్కువవారేమీ కాదు.

కలుపుమొక్కలు కథలో మేళం నాయకురాలు దుగ్గిరాల శేషాచలానికి పూర్తి వ్యతిరేకమైన పరిస్థితి ఎదురవుతుంది. అయినా ఆమె స్వాభిమానమే మనకి ముచ్చటగొలుపుతుంది.

తనని కబళించేందుకు చూస్తున్న ప్రెసిడెంటు గురించి అవధానితో శేషాచలం ఇలా అంటుంది.

"సభలో నాయకురాలిని గజ్జె విప్పించినవాడూ, ఊరేగింపులో నాయకురాలిని గజ్జె కట్టమన్నవాడూ మనిషేనా? విద్యలు అక్కర్లేదు. కానీ ఆ విద్యలు నేర్చిన స్త్రీలు కావాలి."

విద్యకి కాకుండా కేవలం రూపానికి ఎగబడే కామాంధులని ఎండగడుతూ మిగిలిన అసమానతల్ని కూడా నిక్కచ్చిగా ప్రశ్నిస్తుంది. అగ్రజాతుల్లో పుట్టవలసినదానివమ్మా అనగానే "ఇప్పుడగ్రజాతుల విశేషం యేమిటీ? అగ్రజాతుల్లో మాత్రం స్త్రీలకి ఆదర గౌరవాలున్నాయా? స్త్రీ అంటే బానిసే కాదూ?" అంటుందామె.

కలుపుమొక్కలు 1935 నాటి కథ. వడ్లగింజలు '41 నాటిదీను. ఇరవయ్యో శతాబ్దపు ప్రథమభాగపు సామాజిక పరిస్థితిని, ఆలోచనా విధానాన్ని గమనించవచ్చు.

1934 లో వచ్చిన వేయిపడగల్లో విశ్వనాథ వారి సృష్టి రత్నగిరీ ఇదే స్వాభిమానంతో మాట్లాడుతుంది. గతవైభవం కరిగిపోతున్న రోజుల్లో పోరాడి తన స్థానాన్ని కాపాడుకున్న ధీర ఆమె. జమీందారు రంగారావు పట్టాభిషేకానికి ఆస్థాన నర్తకి రత్నగిరి కి ఆహ్వానముండదు. ఆమె వయసుడిగిపోయింది మరి. కళాదృష్టిలేని అంధులూ, వారి కుహనా నాగరీక వేషాలు మొదలైన కాలం. అయితే రత్నగిరి ఊరుకోదు. హక్కుగా గజ్జెకడుతుంది.

"ప్రార్ధనాదికములయిన తరువాత నామె యధ్యాత్మము పాడ నారంభించెను. "అవి కాదు, జావళీలు పాడు" మనిరి. ఆమె క్షేత్రయ్య పాదమునొక డందుకొని యభినయము ప్రారంభించెను. ఆమె మొగమున నంతలో కండరములన్నియు విచిత్రముగా కదలాడి యొక కొత్తదనం వచ్చెను. పల్లవి యందుకొనునప్పటికే యేబదియేండ్ల రత్నగిరి పదునారేండ్ల కన్యావలె లఘుశరీరయై, నూతన యౌవనావిర్భావవేళ నాయకుని ప్రథమ సందర్శనము పొందిన నాయిక వలె ముగ్ధముఖ రేఖాంచలయై మారిపోయెను."

తన విద్యని గౌరవించని ఆ సభలో తన కూతురిని తీసుకురమ్మని పంతం పట్టిన పెద్దలని ధిక్కరించి తన కోపాన్నీ, స్వాభిమానాన్నీ చూపిస్తుంది. రత్నగిరి సభలోనుంచి వెళ్ళిపోతూంటే ఆమె కాలి అందె జారిపోతుంది. అది అందుకోకుండానే చరచరా నడిచి వెళ్ళిపోతుంది.

1940 లో ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి రాసిన కథ "వివాహమంగళం" లో నాయకుడు శర్మ భార్యాపిల్లలతో పెళ్లికెళ్తాడు. అక్కడ మేజువాణీ జరుగుతూ ఉంటుంది. రావోయ్ అని పిలుస్తూనే ఫొక్తు యాంటీ నాచ్ గా ముద్ర వేస్తారు అక్కడి బంధువులు. అటు వెళ్లకుండా మొహం తిప్పుకొచ్చేస్తూ శర్మ అనుకునే మాటలు నలభైలనాటి పరిస్థితిని కళ్ళకి కట్టిస్తాయి.

"సుమారు పదేళ్ళయింది బోగం మేళంలో కూచుని. పాపం - ఈ కళావతుల్లో కళ ఏనాడో పోయింది. అక్కడికి వెళ్లి ఎం బావుకోవాలి. పౌడర్లు, రంగు చీరలు, సిల్కు రవికెలూ కప్పిన రోగిష్టి శరీరాలను చూచి చప్పరించడం తప్ప. టైలర్లూ, డ్రైవర్లు, హోటలు సర్వర్లు గదా ఈనాటి రసికులు. అణాకాణీకి దిగలాగి ఈతపళ్ళ పాటలు పాడించి నిర్భాగ్యులంతా యీ మధురమైన సంస్థను చంపేశారు." అంటూ తిలాపాపం తలా పిడికెడు అని సమాజంలో నిర్భాగ్యతని బయటపెడతారు శర్మ గొంతులో రచయిత.

మధ్యాక్కర కథలో మల్లాది రామకృష్ణశాస్త్రి గారు ఓ కళావంతుల శశిరేఖని మెచ్చుకుంటూ తన బడుద్ధాయి మనవడితో ఒక మాట అంటారు. "ఆడలేని సానికైతే తాళాలు ఏడేనోయ్.. అది అందె వేసిన కాలు" అని.

కళని ఆస్వాదించడానికి పిసరంత రసజ్ఞత కూడా కుదరాలి. లేనప్పుడు అర్ధసత్యాలూ, రాజకీయ కుతంత్రాలూ వాటిలోంచి పుట్టిన స్వకపోల కల్పితాలు మాత్రమే మిగిలిపోతాయి.

****

సునో ఇండియా వారికోసం "Her Story of Dance" అని ఆరు ఎపిసోడ్ల పాడ్ కాస్ట్ చేశారు ప్రముఖ నర్తకి, కళావంతుల అమ్మాయి డా. యశోదా ఠాకూర్.

శోభానాయుడు అడుగుజాడల్లో కూచిపూడి, స్వప్నసుందరి వెనుకే విలాసినీ నాట్యం నేర్చుకున్నా తన మూలాల అన్వేషణ యశోద ను అన్నాబత్తుల లక్ష్మీ మంగతాయారు దగ్గరకి చేర్చింది. మన కళకి అమర్యాద అనే గ్రహణమెందుకు పట్టిందని అడిగితే మంగతాయారు సూటిగా చెప్పిన సమాధానమొకటే. "ఎవరైతే కళావంతులమని చెప్పుకుని మనలో కలిసిపోయారో వాళ్ళని ఒక పదం పాడమను, నాట్యం చెయ్యమను. తెలిసిపోతుంది." అని.

"ఒకసారికే..", "ఇల్లెరుగక..", " చెఱగు మాసె.." ఇవన్నీ జావళీలు..

రాజ్యాలు పోయి దేవదాసీ వ్యవస్థ పై కట్టుబాట్లు మొదలయ్యాక... సంస్థానాలు, జమీందారీ హయాంలో కళావంతుల నాట్యాన్ని నిలబెట్టినది జావళీలే అంటే అతిశయోక్తి లేదు. వాటిని "జావళీలు" అనే అపురూపమైన సంకలనంలో చూడచ్చు. మోదుగుల రవికృష్ణ యశోదాఠాకూర్ సహకారంతో ప్రచురించారిది. పదాలు, జావళీలు కేవలం శృంగార కవిత్వమొక్కటే కాదు. ఆనాటి స్త్రీ సాధికారత, లైంగికత ఆనవాళ్ళని పదిలపరుచుకున్న కవిత్వం.

జావళీలకి మళ్ళీ ప్రాణం పోసే ధైర్యం, తన మూలాలపై అపరిమితమైన ప్రేమ యశోదకు మాత్రమే ఉంది.

" చెఱగు మాసె.." జావళీ గురించి ప్రొఫెసర్ సోనేజీ మాటల్లో - The heroine is menstruating and exposes the hypocrisy of the situation- the very god who made the rules of purity and pollution now wishes to break them at will. This javali bears a striking resemblance to a Kshetrayya padam likely composed nearly three centuries earlier. In this padam Krishna is apprehensive about touching her in her polluted state, and she implores him to let go of the false taboos that society places on menstruation.

జావళీలు స్వాతి తిరుణాళ్ వంటి రాజులతో పాటూ, చాలామంది బ్రాహ్మణ పండితులు కళావంతుల కోసం ప్రత్యేకంగా రాసి ఇచ్చారు. కళని sanitize చేసిన వారిలో బ్రాహ్మణ వర్గం కూడా ఉన్నందుకు కనుక వారందరినీ ఒకే గాటన కట్టి యశోద తూలనాడలేదు. మారిన కాలమాన పరిస్థితుల నేపధ్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశోధన చేసి తన వాదాన్ని నిర్మించుకున్నారు. చారిత్రిక సత్యాలని కచ్చితమైన ఆధారాలతో తెగేసి చెప్తూనే, వర్గ దూషణకి పరిమితమై ఆవేశపడలేదు. మంచీ చెడూ అన్నివైపులా ఉంటాయని గుర్తించడమే ఆమె ఉన్నత సంస్కారానికి గీటురాయి.

2019 లో గుంటూరులో విశ్వనాథ సాహిత్య అకాడెమీ వారు విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ పురస్కారమిచ్చి యశోదా ఠాకూర్ ని సత్కరించారు. ఆ సందర్భంలో మూడు జావళీలకి నృత్యం చేశారు యశోద. "ఇది న్యాయమా.. స్వామీ.." అంటూ వేదిక వెనుకకు యశోద వెళ్ళిపోతూ ఉండగా, అకస్మాత్తుగా ఆమె జడలోంచి రాలిన మల్లె తో పాటూ జారిపోని మనసు మనసే కాదు.

అలవోకగా కుచ్చెళ్ళు పైకి దోపుకున్న చీర, మెడలో కాసులపేరుతో యశోద రూపుకట్టిన అభినయమల్లే ఉంటారు. అయినా అంత సామాన్యంగా ఎలా వేదికమీదకి వచ్చారో అని చాలామంది ఆశ్చర్యపోవడం విన్నాను. సహజ సౌందర్యవతులు కళావంతులు. తళుకుబెళుకులవాళ్ళు కాదు. గారడీ నృత్యాలు వారెరుగరు. భక్తినైనా రక్తినైనా వాటి సహజస్థితిలో చూడాలంటే కళావంతుల అభినయంలోనే సాధ్యం. అసామాన్యత ఆమెలో ఉన్న అప్సర నాట్యానిది. వీయేకే రంగారావు గారి ఇంటర్వ్యూల్లో మెరిసే బొబ్బిలి సాని గడ్డిభుక్త సీతారాం, మా విజయనగరం సాని కళావర్ రింగ్ సరిదె లక్ష్మీ నరసమ్మలని ఊహించుకోగలనిప్పుడు.

"కాపుమనిషినై పుట్టి - మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరపమొక్కలకూ దోహదం చేస్తే, యావజ్జీవం కాపాడే తనవాళ్ళన్నవారు వుందురేమో" అన్న మధురవాణి ఆనాటి పరిస్థితులకి అద్దం పట్టే పాత్ర.

స్వాభిమానం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు, అస్తిత్వవాదాలు సర్వజనామోదంగా మారిన ఇవాళ్టి సమాజంలో తన మూలాల్ని గర్వంగా చెప్పుకునే స్వాతంత్య్రం కళావంతులకీ ఉంది మరి.

సరే.. ఇంతటి చరిత్రని పట్టి ఉంచిన సాహిత్యాన్ని, పరిశోధనలని ఎంత వరకూ తరచి చూసుకుంటున్నాం?

తమ భావజాలానికి అనుకూలంగా ఉండే ఒక వాదాన్ని సమర్ధించుకోడానికో, అర్ధసత్యాలనే నిజమని నమ్మబలికే సోషల్ మీడియా చర్చలతోనో నిర్ధారణకు వచ్చి మాట్లాడేముందు ... సాహిత్యాన్ని పరిశీలించే అవసరముంది కదా?

****





First three photos are from "Unfinished Gestures" (Professor Davesh Soneji) - 
Tiruvidaimarudur Nagalakshmi, Maddula Janakamma , Annabathula Buli Venkataratnam and Yashoda Thakore