Saturday, March 31, 2012

ఎందుకు ఆ చందమామ? రామా!

వేయి వెన్నెల రేయిలకైనా తనివి తీరని దాహం - చకోరాలది.
వింత కాకపోతే మచ్చలున్న ఆ చందమామ ఏమంత అందగాడని!?

కోటి కోట్ల సార్లు విన్నా తనివి తీరని తీయదనం - రామకథది.
మచ్చలేని సుగుణాల రాశి.. దయా వారాశి.. ఆ దాశరథి కథ అని! వింతేముందని!

"రామా!" అంటే చాలు. పెదవి తీయన.. మనసు చల్లన!
అతగానికెక్కడిదీ మాయ!? ఏవిటా మహిమ!?
పాల పాయసం చలువన పుట్టాడనేమో!
లేక పాలసంద్రపు పట్టిని చేపట్టి చదివించుకున్న కట్నమో!!

చందమామని చూపిస్తూ బుజ్జాయికి బువ్వ తినిపించే ప్రతీ అమ్మా చెప్పే కథ రాముడిదే!
వెన్ను తన్ని పుట్టే ప్రతీ తోబుట్టువూ కోరుకునేది రామన్నలాంటి అన్ననే!
భుజానికి భుజం రాసుకుని నడిచే కొడుకుని చూసి గుంభనంగా గర్వించే ప్రతీ నాన్నా దశరథుడే!
వయసు పూత పూసిన ప్రతీ కన్నెమనసూ గాఢంగా కోరుకునేది రాముడంటి పెనిమిటినే!
మల్లెతీవెలా మారాకు వేసిన తన గారాలపట్టిని యోగ్యుని చేతిలో పెడుతూ ప్రతీ జనకుని తలపూ "..ప్రతీఛ్ఛచైనాం భద్రం తే..!"
"పదములె చాలు రామా.." బిగి సడలిన ప్రతీ మేనూ మరు మజిలీకై కోరుకునేది రామయ్య సన్నిధినే!

ఏళ్ళూ పూళ్ళూ గడిచినా వెర్రిమనసు శబరిలా రామకథని నెమరేస్తూనే ఉంటుంది.
రామబంటులా చిరాయువై ఒళ్ళుమరిచి నాట్యం చేస్తూనే ఉంటుంది.
నిత్యకల్యాణం కదూ రామచంద్రునిది!!

గిర్రున తిరిగే కాలచక్ర భ్రమణంలో ప్రతీ కొత్త సంవత్సరం సోయగాలద్దుకునేందుకూ..
వేసవి గాడ్పుకి మిరియాలు వేసిన బెల్లం పానకం తాగి శమన పొందేందుకూ..
మనింట్లో పెళ్ళిలా.. మనమే ఆడపెళ్ళివారిలా..
మనసుకి మామిడాకుల తోరణాలు కట్టే ఓ సంబరం చైత్ర శుధ్ధ నవమి నాడే!

ప్రతి వసంతానికీ మామిడి పూత, కోయిల పాట, మల్లెల రాక.. ఇవన్నీ రామభద్రుని పెళ్ళి సన్నాహాలే!

అందాల రామయ్య రత్న డోలలూగి.. జాబిలికై మారాం చేసి.. లోకాలను కాచే మేటి విలుకాడై.. కన్నె జానకిని చేపట్టేందుకు బయలుదేరిన వైనం.. తీయని తెనుగు పదాలలో..
దేవులపల్లి కృష్ణశాస్త్రి 'అక్షరాల'లో..


రామా లాలీ! మేఘశ్యామా లాలీ!
తామరస నయనా! దశరథ తనయా.. లాలీ!

నిద్దరనైనా పెదవుల నవ్వుల ముద్దరలుండాలీ!
తూగే జోలకు సరిగా ముంగురులూగుచుండాలీ!

ఇదే అమ్మ ఒడి ఉయ్యాల! ఇదే నవరత్న డోల!

ఏది కావాలీ? ఎవ్వరు ఊపాలీ?
ఎవ్వరు జోల పాడాలీ?

నేనా? నేనో? నేనే!

ఎందుకు ఆ చందమామ?
ఎవ్వరి విందు కోసమో, రామా?
శ్రీరామా! ఎందుకు ఆ చందమామ?

అందగాడనా నీ కన్నా? అందరాడనా ఓ కన్నా?

తరగని తగ్గని జాబిలి మా సరసనే ఉండగా,
కరగని, చెరగని పున్నమి మా కనులలో నిండగా..
ఎందుకు ఆ చందమామ?

వేలెడంత లేడు - వేయి విద్యల దొర అయినాడు!
ఆ వీర బాలమూర్తి సౌరు చూడు! చూడవే!
ఆ తండ్రి గారు మురియు తీరు చూడు!

చదువులకై గురువుల కడ ఒదిగియుండు వినయము!
అదెరా విల్లందుకుని అమ్మువేయు వీరము

అన్ని గుణములెదురు వచ్చి అయ్యను కొలిచేను..
రామయ్యను కొలిచేను!

పైన కాస్తే వెన్నెలౌను! పందిరేస్తే మల్లెలౌను!

పడతి జానకి పెదవి పూస్తే పారిజాతాలు!
కన్నె జానకి మదిని దాస్తే సన్న సన్నని వలపులు!

లేత మామిడి పూత కోరు!
తీగ పందిరి ఊత కోరు!

సీతకా శ్రీ రామచంద్రుని చెలిమియే వైకుంఠము!
ఆది లక్ష్మీదేవికా హరి అంతరంగ నివాసము!


వీనుల విందూ.. కన్నుల పండుగా.. ఇక్కడ


"శ్రీరామ నవమి శుభాకాంక్షలు!"
ముత్యాల తలంబ్రాల తాహతు లేక పెద్దాయనెప్పుడో రాసిన ఈ పాట రామయ్యకి చదివిద్దామని.. ఉడతాభక్తిగా..!!

Friday, March 16, 2012

కరి మింగిన వెలగపండు

"చదవేస్తే ఉన్నమతి పోయిందని ఇదేం పాడుబుధ్ధిరా తండ్రీ! 'మచ్చా మరకా లేని పిల్లాడ'ని నలుగు పెట్టిన ప్రతీ సారీ మురిసిపోయేది మీ అమ్మ. దానికి కోపం వచ్చిందంటే రాదూ!" తరుగుతున్న వంకాయ ముక్కల్ని గిన్నెలో నీళ్ళలో వేస్తూ కాక్క మెత్తమెత్తగా చీవాట్లు వేస్తోంది.
పేపర్ పక్కన పడేసి లోపలికెళ్ళి షేవింగ్ కిట్లోంచి నెయిల్ కటర్ తెచ్చుకొచ్చి కూర్చున్నాను.
"మంగళారం పూటా గోళ్ళు తీసుకుంటున్నావా! ఆపు.." గొంతు ఇంకాస్త తగ్గించి కసిరింది. నిర్లక్ష్యంగా గోళ్ళు తీసుకోబోతూ ఆగి, నెయిల్ కటర్ పైజమా జేబులోకి జారవిడిచి మళ్ళీ పేపర్ లోకి మొహం దూర్చాను. అక్షరాలు అర్ధం కావట్లా..! అమ్మ వచ్చి వంకాయ ముక్కలు తీసుకెళ్ళింది.

"అమ్మడూ! కొబ్బరి పచ్చడి చేస్తానంటివే..తురమనా?" అడిగింది కాక్క
'కాక్క' అమ్మకి పినతల్లి. ఆవిడకెవరూ లేరు. అమ్మతో అరణం వచ్చింది. అమ్మ ఆవిడని 'కక్కి' అని పిలుస్తూంటే నేను 'కాక్కా..' అనే వాడినట. ఇప్పటికీ అదే అలవాటు.
"ఇదిగో.. పొద్దెక్కక ముందే స్నానం కానిచ్చి ఇంటిపట్టున ఉండు. ఊరమ్మట పోకు. ఏ సాయంత్రానికో మీ అమ్మ కోపం తగ్గితేనే ఇంట్లో అందరికీ మనశ్శాంతి. ఏం పిల్లలో ఏమో..!" సణుగుతూ పైకి లేవబోయి తూలింది. టక్కున ముందుకు వంగి చెయ్యివ్వబోయా.
"ముట్టుకోకు. ఇంకా పూజా గట్రా కాలే.." సంభాళించుకుని చేతికర్ర అందుకుని తాపీగా అడుగులేస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయిందావిడ..

"మైథిలొచ్చింది." ట్రావెల్ బేగ్ భుజాన వేసుకుని లోపలికొస్తూ చెప్పారు నాన్న.
"ఏరా రాఘవా! రాత్రొచ్చావా?" నోరంతా తెరిచి నవ్వుతూ లోపలికొచ్చింది మైథిలి.. మా పిన్ని.
"లేదు. తెల్లవారు ఝామున వచ్చాను... ఒక్కర్తివే వచ్చావా?" కుర్చీలోంచి లేచి ఎదురెళ్ళాను.
"అవున్రా.. రేపు సాయంత్రం వెళ్ళిపోవాలి. ఎల్లుండి మీ బాబాయ్ కేంప్ కి వెళ్ళాలట." నా భుజం మీదోసారి చెయ్యి వేసి నిమిరి లోపలికెళ్ళింది.

లోపలికి వెళ్ళి మామూలుగా ఉండలేక హాల్లోనే ఉండిపోయాను. మనసూ, శరీరం కూడా చిరాగ్గా ఉన్నాయ్. స్నానం చేద్దామని తువ్వాలు భుజాన వేసుకుని గదిలోంచి వస్తూండగా పిన్ని కాఫీ గ్లాసు ఊదుకుంటూ ఎదురొచ్చి కళ్ళెగరేసింది. "మీ అమ్మ ఎందుకు కోపంగా ఉంది?" అని అర్ధమన్నమాట. మాట్లాడకుండా టీషర్ట్ స్లీవ్ పైకి మడిచి జబ్బ చూపించా..

"పచ్చబొట్టా!! నిజందే!!" గట్టిగా ఆశ్చర్యపోబోతున్న దాని నోరు నొక్కేసి "ష్షూ" అన్నాను.
"ఏవిటది.. తేలా?!"
"ఊ.. స్కార్పియన్"
"నొప్పెట్టలేదూ!!"
"కొంచెం.. ఉహూ..కాదులే.. బాగా నొప్పెట్టింది. ఒక్కసారేగా!"
"అయినా తేలేంట్రా! ఎంచక్కా ఏ పువ్వులో, దేవుడి బొమ్మలో వేయించుకోవలసింది."
"ఛ ఛా.. పువ్వులు అమ్మాయిలకి. ఇది నా జోడియాక్ సైన్" జబ్బ మడిచి కండ చూపిస్తూ నవ్వాను.
"అందుకా కోపం! సర్లే.. స్నానం చెయ్య్.. లక్ష్మత్త ఇంటికి వెళ్ళొచ్చేద్దాం."
                    
                             ******

ఆర్ ఎండ్ బీ బంగ్లా పక్కనుంచి మట్టి రోడ్లోకి బండి తిప్పుతూ "నాల్రోజులుండేలా రావల్సిందే.." అన్నాను వెనక కూర్చున్న పిన్నితో.
"కుదరదులేరా. అయినా చిన్న పనేగా. ఒక్క సంతకం." గాలి కోసేస్తున్న మాటలు ముక్కలుముక్కలుగా వినిపించాయి.
"ఇప్పుడెందుకా ఇల్లు అమ్మడం?"
"ఎప్పటికైనా అమ్మేయాల్సిందేగా! పాత ఇల్లు. పల్లెటూరు. ఎవరు చూస్తారు? మంచి బేరం వచ్చిందిగా.."
"..."
"అవున్రా.. అక్కడి సామాను తెప్పించేసారా?"
"ఆ.. నిన్న సాయంత్రం నాన్న తెచ్చారట. మేడ మీద పెట్టించారు."
"మీ అమ్మ ఓకేనా?"
"ఒకే కాదు. ఉదయం నేను వచ్చేసరికే డల్ గా ఉంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా టాటూ మీద పడింది."
"తిట్టిందా?"
"కొట్టినా బాగుండు! మాట్లాడదుగా.. మొండిది." పళ్ళు బిగిస్తూ అన్నాను.
"హ్హహ్హా.. అది చిన్నప్పటినుండీ అంతేరా.." నవ్వింది పిన్ని.
"మీ ఇద్దరికీ ఎంత తేడా పిన్నీ! నీలా తనూ కూల్ గా ఉండచ్చుగా!"
"ఐదు వేళ్ళూ ఒకేలా ఉంటాయా? అయినా దానికున్న డిసిప్లిన్, ప్రిన్సిపుల్స్ నాకు లేవు. మీ బాబాయ్ ఎప్పుడూ పోల్చి తిడుతూ ఉంటారు."
"జులాయి పిల్లా.. అనేనా?" బాబాయ్ పిన్నిని "జూపీ.. జూపీ" అని పిలుస్తాడు. చాలా రోజులు బతిమాలి దాని అర్ధం తెలుసుకున్నాను.
"చుప్.. భడవా!" భుజం మీద చరుస్తూ నవ్వుతూ చెప్పింది "శౌరి గాడు టాటూ వేయించుకుంటే ఆమేర తొక్క తీసేస్తా నేనయితే.."
"వాడు నాలా ఊరుకోడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు యే నాగేస్సర్రావు బొమ్మో టాటూ వేయించేస్తాడు."
"ఛీ.. ఊహకైనా యే రాజేష్ ఖన్నావో హృతిక్ రోషనో అనచ్చు కదరా!" పకపకా నవ్వింది.
లక్ష్మత్త ఇంటి ముందు బండి ఆపి చెప్పాను. "ఆశ లావే కానీ.. సోది తొందరగా పూర్తి చేసి రా.. నేను బజార్లోకి వెళ్ళొస్తాను. మధ్యాహ్నం మేడ మీది సామాన్లు సర్దాలి. అది మన డ్యూటీ."
"మన కాదు. 'న్నీ' డ్యూటీ. నేను సాయం చేస్తున్నాను... రాత్రి సినిమాకి తీసుకెళ్తున్నావు కాబట్టి." చెప్పి గేటు తీసుకుని వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ బండి వెనక్కి తిప్పాను.
             
                             *****

"ఇదేంట్రా ఇంత తక్కువ సామానుంది?" వక్కపొడి డబ్బా తెరిచి చేతినిండా ఒంపుకుని నోట్లో వేసుకుంటూ లోపలికొచ్చిన పిన్ని ఆశ్చర్యపోయింది.
"కుర్చీలూ అవీ ఊళ్ళో ఎవరికో ఇచ్చేసారు. పందిరి మంచం ఆ పక్క గదిలో వేసారు. వంట సామాను ఆ మూటల్లో.. అటక మీద సామాను ఇదిగో.." ట్రంకు పెట్టెలు పక్కకి జరిపి పిన్ని కూర్చునేందుకు జాగా చూపిస్తూ చెప్పాను.
"అవున్లే.. ఎప్పటి సామానిదీ..! మా తాతగారి హయాంలో ఓ వెలుగు వెలిగిన ఇల్లది. అదో వైభోగంలే! మీ అమ్మ పెళ్ళి అయిన ఏడాది మా నాన్న పోయారు. మరో రెండేళ్ళకి నువ్వు పుట్టక ముందే మా అమ్మ వెళ్ళిపోయింది. మహా ఇల్లాలు! నా పెళ్ళి మీ అమ్మే చేసింది. అప్పటికి నువ్వు అడుగులు వేస్తున్నావింకా."
"నీకంటే అమ్మకే ఎక్కువ బంధమేమో కదా ఈ ఇంటితో. "అమ్మ వచ్చే ముందే సామాను సర్దేసి అటక ఎక్కించెయ్. పిచ్చిది.. చూస్తే ఏడుస్తుంది" అన్నారు నాన్న."
"ఏమోరా.. నేను ఆకతాయితనంగానే ఉండేదాన్ని. మీ అమ్మ ఎప్పుడూ కొంచెం సీరియస్సే. నాకూ బాధ ఉంటుంది కానీ దానికే ఎక్కువనుకుంటా.." ఆలోచిస్తూ అంది పిన్ని.
"నువ్వు బయట పడవంతే. నీకు మాత్రం ఉండదూ!" సర్దేసాను. ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ ఒక్కో వస్తువు వెనుకా ఉన్న కథ పిన్ని చెప్తూఉంటే వింటూ పని దాదాపు పూర్తి చేసేసాను.

"ఇదెవరే? " ఓ పెట్టెలోంచి పాత ఫోటో ఫ్రేము పైకి తీస్తూ అడిగాను.
"చూడనీ.."
చెదలు పట్టి సగం పాడయిపోయిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో.. లంగా వోణీ వేసుకున్న పదిహేనేళ్ళ అమ్మాయి పక్కన నాలుగైదేళ్ళ పిల్ల.. పిల్లేనా? రిబ్బన్లు కట్టిన జడలు.. మోకాళ్ళ దాకా ఉన్న పెద్ద చొక్కా..!
"నువ్వూ అమ్మానా? కాదే.. మీ ఇద్దరికీ అయిదేళ్ళేగా తేడా?"
"మేం కాదు." ఆ ఫోటో చేతిలోకి తీసుకుంటూ చెప్పింది పిన్ని. ఫోటో వైపు దీక్షగా చూసి మళ్ళీ పెట్టెలో పెట్టేసి "పైన పెట్టెయ్ రాఘవా.." అంది.
"పెట్టేద్దాం లే. ఎవరది? చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే.."
"మా అమ్మ, మావయ్య" పొడిగా చెప్పేసి కిందకి వెళ్ళిపోయింది.
అంత హఠాత్తుగా పిన్ని ముభావంగా వెళ్ళిపోవడం వింతగా అనిపించింది. మిగిలిన పని పూర్తి చేసుకుని కిందకి వెళ్ళేసరికి అన్యమనస్కంగా కనకాంబరాలు మాల కడుతోంది.

"ఏ సినిమాకెళ్దామే?"
"ఏం వద్దులే."
"సాయం చెయ్యలేదని నేనేమీ అనుకోలేదులే. హిందీయా తెలుగా?"
"తలనొప్పిగా ఉందిరా. నువ్వెళ్ళు పరవాలేదు." బలవంతంగా నవ్వుతూ చెప్పింది.
కోపం తగ్గని అమ్మ.. ఎందుకు ముక్తసరిగా మాట్లాడుతోందో తెలియని పిన్ని.. ఇల్లు చాలా వేడిగా ఉందనిపించింది. సినిమాకి ఒక్కడినే వెళ్ళాలనిపించక స్నేహితుల్ని కలిసి బయట తిరిగి పదింటికి ఇంటికి చేరాను. అమ్మ నిద్రపోతోంది. పిన్ని నిద్ర నటిస్తోంది.

                             *****

"రిజిస్ట్రీకి నేను రావాలేంట్రా?" కాక్క ఉదయాన్నే అడిగింది. తను లీగల్గా ఆ ఇంటి మనిషి కాదని ఆమెకు తెలీదు మరి.
"నువ్వెందుకూ.." అనబోతున్న నన్ను ఆపినట్టు అమ్మ చెప్పింది. "లేదు కక్కీ.. రిజిస్ట్రార్ మనకి తెలిసినాయనే. నువ్వు పెద్దదానివి.. రాలేవని తెలుసు. పరవాలేదులే." అని నావైపు తిరిగి "నేనూ పిన్నీ ఆటోలో వచ్చేస్తాం. నువ్వూ నాన్న ముందు వెళ్ళండి. అరగంటలో రెడీ అవాలి." అంటూ కాఫీ గ్లాస్ అందించింది.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. అమ్మ ఎప్పుడూ తిట్టలేదు, కొట్టలేదు. మౌనం ములుకు, చూపులు కమ్చీలు.. ఇంక దెబ్బలెందుకు!! తాత్కాలికంగా పిన్ని సంగతి మరిచిపోయాను. మధ్యాహ్నం భోజనాలవేళప్పటివరకూ..

                               *****
"ఏవిటలా కెలుకుతున్నావ్?" అమ్మ మాట విని పిన్ని వైపు చూసాను. కళ తప్పినట్టున్న మొహం దించుకుని గబగబా నాలుగు ముద్దలు తినేసి మేడమీదకి వెళ్ళిపోయింది.

"ఏమయింది పిన్నీ.. చెప్పక పొతే ఎలా తెలుస్తుంది?" మేడ మీద వాలుకుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్న పిన్ని ఎదురుగా కూర్చున్నాను.
"ఏం లేదురా.. ఇంటి గురించి ఆలోచన. అంతే." బుకాయించింది.
"కమాన్..! నువ్వు ఎంత ప్రాక్టికలో నాకు తెలుసు. నిన్న ఆ ఫోటో చూసాక మూడీగా తయారయ్యావ్."
మాట్లాడకుండా లేచి దండెం మీద ఆరవేసి ఉన్న చీర తెచ్చి మడతవేస్తోంది.
"అమ్మమ్మ గుర్తొచ్చిందా?"
"లేదురా.. మీ అమ్మ నాకా లోటు ఎప్పుడూ రానివ్వలేదు." సూటిగా నా కళ్ళలోకి చూస్తూ చెప్పింది.
"ఊ.. మరి?"
"మావయ్య..."
"ఓ.. ఫోటోలో ఉన్న పిల్లాడా? ఎక్కడుంటారు?"
"ఏమో.."
"అంటే?"

కుర్చీలో కూర్చుంది ఓపిక లేనట్టుగా..
"నువ్వు అడిగావు కనుక చెప్తున్నాను. ఎవరి దగ్గరా నోరుజారకు. నీకీ విషయం తెలీదు. సరేనా?"
"ఊ.. ప్రామిస్"
"మా అమ్మకి ఇద్దరు చెల్లెళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళు. నిన్న ఫోటోలో చూసావే శేషాద్రి మావయ్య.. ఆఖరువాడు. అమ్మ పెద్దది కదా.. మావయ్యని తనే పెంచిందట. అమ్మ కాపురానికి వచ్చేటపుడు తమ్ముడిని పంపమని తాతగారిని అడిగిందట కూడా. పంపలేదనుకో.. అంత ఇష్టం ఒకరంటే ఒకరికి. ఎప్పుడూ మా ఇంటిదగ్గరే ఉండేవాడు.

మావయ్య బొమ్మలేసేవాడు. అందంగా చక్కగా వేసేవాడు. పత్రికలకి పంపేవాడు. హిందీ పాటలు వినేవాడు. ఏమేమో రాసుకునేవాడు. నేను హైస్కూల్లో ఉండగా అనుకుంటా..  ఓ రోజు చాలా పెద్ద గొడవ జరిగింది. బొమ్మలు, నాటకాలంటూ తిరుగుతున్నాడని తాతగారు కొట్టారట. ఇంట్లోంచి వెళ్ళిపోతానని గొడవ. మా ఇంటికొచ్చి అమ్మతో 'మద్రాసెళ్ళి సినిమాల్లో చేరిపోతానని' చెప్పాడు. నాన్న చాలా తిట్టారు. నేనూ, అక్కా పెరటి అరుగు మీద కూర్చుని అంతా విన్నాం. తాతగారికి కబురు పెట్టారు. ఇంకేముంది.. అరుపులు, ఏడుపులు. ఒక ఆరునెలల తరువాత నిజంగానే వెళ్ళిపోయాడు. అమ్మకి క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తూండేవాడు. "చిట్టిని, కనతల్లినీ అడిగానని చెప్పు." అని చివర్లో రాసే ఒక్క వాక్యం పదేపదే చదువుకునేవాళ్ళం. మా కంటికి నిజంగా హీరోలాగే కనిపించేవాడు. అందునా పెద్దల్ని ఎదురించడం అంటే ఆ వయసులో మాకూ గొప్పగానే ఉండేది.

ఏదో ఉద్యోగం చేస్తున్నాడన్నారు. పోన్లే అనుకున్నాం. దాదాపు రెండేళ్ళపాటు కనిపించలేదు. ఓ సంక్రాంతికి ఇంటిల్లిపాదికీ బట్టలు తీసుకుని వచ్చాడు. అందరూ సంతోషించాం. పెళ్ళి చేసుకోమని అంటే నవ్వేసి ఊరుకున్నాడట. మీ అమ్మని ఇవ్వమని అడిగారు. మా నాన్న కుదరదని చెప్పేసారు."

"మా అమ్మనా? ఎందుకివ్వనన్నారు?" ఆశ్చర్యమనిపించింది.
"స్థిరం లేనివాడికి ఇవ్వనని.."
"ఊ.. తరువాత?"
"ఏముంది. నిజంగానే ఓ వెలుగు వెలిగాడు. లక్షలు గడించాడు. అడిగిన వారికి కాదనకుండా సొమ్ము పంపించాడు. మద్రాసులో ఇల్లు కొనుక్కుని ఇంటినిండా సామాను నింపుకుని అప్పుడు పెళ్ళి చేసుకున్నాడు... రాజోలు సంబంధం."

"సినిమాల్లో.."
"ఊ.. సినిమాల్లోనే. కళాదర్శకుడు. బోలెడు సినిమాలు చేసాడు. మండువా లోగిలి మధ్య పంచపాళీ తూముకి అడ్డం పెట్టి నీళ్ళు నింపి మధ్యలో మంచం వేసుకుని ఆకాశంలోకి చూస్తూ రేడియో వింటూ నిద్రపోయేవాడట. వేసిన చొక్కా మళ్ళీ వేసుకునే వాడు కాదట. చుట్టాలూ పక్కాలూ.. వచ్చిన ప్రతీవారినీ ఆదరించాడు. ఇంచుమించు ఒక అయిదేళ్ళపాటు చుట్టాలలో ప్రతీ పిల్లాడినీ చదివించాడు. పెళ్ళీడుకొచ్చిన ప్రతీ పిల్లకీ తన ఖర్చుతోనే పెళ్ళి చేసాడు.

"ఎవరు మోసం చేసారు?" తరువాతి కథ నాకు తెలుసునన్నట్టు అడిగాను.
"ఎవరూ మోసం చెయ్యలేదు. ఆరోగ్యం బాగోక ఒక్క ఆరునెలలు సంపాదించలేకపోయాడంతే."
"అందరూ వదిలేసారా?"
"ఆ.. కట్టుకున్నదానితో సహా.."
"ఎందుకలా?"
"ఏమో.. ఏం జరిగిందో తెలీదు ఒక్క ఏడాదిలో రోడ్డున పడిపోయాడు."
"ఊ.. సిరి తా వచ్చిన వచ్చును.."
"నిజం! కరి మింగిన వెలగపండే అయిపోయింది పరిస్థితి. తప్పు ఎక్కడ జరిగిందో తెలీదు. ఎవరి వల్ల జరిగిందో తెలీదు."
"మళ్ళీ పుంజుకోడానికి ప్రయత్నించలేదా?"
"ఉహూ.. కళాకారులకో శాపం ఉంటుందనుకుంటా.. మనం ఎంత కష్టపడినా ఫలితం ఉండని రోజులుంటాయి చూడు.. అవి వాళ్ళ జీవితంలో చాలా ఎక్కువ ఉంటాయి."
"బుల్ &%$#  పోయిన చోటే వెతుక్కోవాలి. అంత ఎదిగిన వాడికి కిందపడ్డాక లేవడం తెలియలేదా?"
"ఏమో.. అవకాశం ఉండి కష్టాలెవరు పడతారు చెప్పు? మా ఊరొచ్చేసాడు. మీ అమ్మకి పెళ్ళయి వెళ్ళిపోయింది. మా నాన్న ఒంట్లో బాలేని రోజులు. ఏ తెలవారుఝామునో మా అమ్మ ముగ్గు పెట్టడానికి వాకిలి తలుపు తీసేసరికి అరుగుమీద కూర్చుని ఉండేవాడు."
"...."
"స్నానం చేసి వెళ్ళిపోయేవాడు."
"డబ్బులడిగేవాడటా?"
"ఊహూ.. ఎప్పుడైనా గ్లాసెడు పాలు తాగేవాడట.. మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటుందని."
"తరువాత?"
"ఏమో.. మొదట్లో రెండు రోజులకొకసారి కనిపించేవాడు. తరువాత వారం.. నెల.. నెలలు.. అంతే."
"బతికే ఉన్నాడా?" అని అడగబోయి ఆగిపోయాను. పిన్ని మొహంలో అంత బాధ ఎప్పుడూ చూడలేదు. ఇలా ఎగసి విరిగిపోయే కెరటాలు చాలానే ఉంటాయని తనకు మాత్రం తెలీదా? రక్తసంబంధం కదా.. అందుకేనేమో అంత నొచ్చుకుంటోంది. అనిపించింది. కొన్ని క్షణాల నిశబ్దం..

"మీ అమ్మని ఇవ్వక మా నాన్న మంచి పని చేసారు. కదూ..!" ఉన్నట్టుండి ప్రశ్నించింది. పిన్ని చూపులు కొబ్బరాకుల నీడల్ని కుచింపచేస్తున్న ఎండ వైపు చూస్తున్నాయి. దూరంగా కాకుల అరుపులు ఆగీ ఆగీ వినిపిస్తున్నాయ్.
"ఏమోలే.. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు కదా!" అన్నాను. పిన్ని దగ్గర ఏం మాట్లాడాలో తెలియకపోవడం ఇదే మొదటిసారి.
పాలిపోయినట్టు నవ్వి నెమ్మదిగా చెప్పింది.. "మీఅమ్మని అడిగే బదులు నన్ను అడగలేదేం రా.."
నాకు ఒక్క క్షణం తలతిరిగిపోయింది.
"నీకూ అతనికీ..!!"
"పదేళ్ళు తేడా..." నిర్లిప్తంగా ఉంది పిన్ని గొంతూ.. మొహం కూడా..