Sunday, June 10, 2012

మదిని కోరికలు.. మదన గీతికలు..

నా ప్రాణమా,

ఇంతకంటే దగ్గరగా మిమ్మల్ని ఏమని పిలుచుకోను? మాటిమాటికో పేర పిలిచి కవ్వించి వలపించుకునే మీ సారస్యం నాకెక్కడిదీ?

ఓయ్ అబ్బాయీ, ఎక్కడివారు మీరూ? ఇలా ఎలా నా లోకంలోకి దూసుకొచ్చేసారూ! మీ సంతకం లేని నిన్నల్ని గుర్తు తెచ్చుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రాణం లేకుండా ఈ దేహమిన్నాళ్ళెలా చలించిందా అని! వేయి రాత్రుల తపస్సు పండి, చకోరానికి చందమామ అందినట్టే నాకు మీరు..  ఎంత గర్వంగా ఉందో తెలుసా? పెదాల మీదకి నవ్వు ఊరికూరికే ఉబికి వచ్చేస్తోంది. వెనక్కి తిరిగి పదారేళ్ళ ప్రాయంలోకి పరుగుతీస్తున్నట్టుంది. ప్రేమలో కలుగుతాయని చెప్పే ఏ మనోవికారాల గురించి చదివి, విని, చూసి "నేను వీటికి అతీతురాల్ని" అనుకున్నానో, అవన్నీ నాలో నేను చూసుకుని విస్తుపోయి.. మిమ్మల్ని కరువుతీరా తిట్టుకుంటున్నాను. కానీ ఉన్న మాట చెప్పనా.. నా తీపిశాపాలు మీ దూకుడుని క్షణకాలం తగ్గించినా "" అడుసాయె నేల నా బాష్పవారి ననుచు నెవ్వగ మెయి నగలన్ని ఊడ్చు "అసలు దోషము నాదే" నటంచు ఏడ్చు"   విప్రలబ్ధనవుతాను. ఊరికే అన్నానంతే.. తప్పట్టుకోకండీ! చెప్పకనేం.. ఈ వింతలూ విడ్డూరాలూ బావున్నాయి. కాటుక దిద్దుకున్నా గుర్తొచ్చే మీరు.. నా హంసకమే రవళించినా ఝల్లుమనే నా మేను. ప్రపంచం ఇంతందంగా ఉందేంటీ!

"ఉత్తరాలు రాసుకుందామా?" అని అడిగిన మీ మాటలు ఇంకా నా చెవుల్లోంచి మనసులోకి మత్తుగా ఇంకుతున్నాయి. "తొలి తొలి బిడియాలన్నీ పక్కన పెట్టేసి రాయాలి సుమా!" అని మీరు హెచ్చరిస్తూ పంపిన మదనపత్రిక ఇదిగో నా ఒళ్లో రెపరెపలాడుతోంది.  ఇష్టాన్నీ, కాంక్షనూ, ఆఖరికి ఎడబాటులో వేదననూ కూడా అక్షరాల్లో ఇంత వైనంగా ఎలా పట్టిచ్చేయగలరు మీరు? నాకొచ్చిన భాషలో, నాకు తెలిసిన కొద్ది వందల పదాల పరిధిలో మీ ఆర్తిని తీర్చగలనా? అనే సంశయం నన్ను పట్టిలాగుతోంది. తప్పేదేముందీ.. ప్రతీ పదానికీ వలపు పరిమళమద్ది మురిపించిన ఈ మీ ఉత్తరం లాంటిది మరొకటి రావాలంటే నేనూ రాయాలి కదా!

మీ వాంఛలూ, మాటలూ వింటే కుతూహలంతో పాటూ భయం కూడా తెలుసా! నా చుట్టూ మీరల్లుకుంటున్న స్వప్నలతలకు నీరందించగలనా? మీకు సరిజోడీనేనా? అని. వలచి వలపించుకోవడంలో నా సీమాటితనమెంతో అని అపనమ్మకం.

"అమ్మడూ.. నా లావణ్యనిధానమా!" అనే మీ సంబోధనే నాకు కొరుకుడు పడలేదు. నిజం చెప్పొద్దూ.. నాకేనా ఈ ఉత్తరమని తడబడ్డాను. తత్తరపాటుని దాటుకుని ముందుకెళ్తే మీ ఆప్యాయతకు కంట తడి, మీరు గుర్తుంచుకు చెప్పిన గుట్టుమాటలకు నా బుగ్గల్లో వెచ్చని ఆవిర్లు.. వెరసి ఉత్తరం పూర్తయింది. నా ఉసురు మరిగింది. ఆ పై నాకు కోపమొచ్చింది.. అవును. ఆ రోజెప్పుడో 'మీ అభిమాన నాయిక ఎవరని' అడిగానా.. ఏమని చెప్పారూ? వేరెవరూ లేనట్టు "వరూధిని" అన్నారు. అప్పుడే నా గుండెల్లో రాయి పడింది. రుక్మిణి అని ఉంటే "ప్రేమ ఉందిగా నాక్కూడా" అనుకునేదాన్ని. అదే సత్యభామ అంటే కూడా సర్లెమ్మనేదాన్ని. కావాలంటే నేనూ గడుసుదనం నటించేదాన్ని. అష్టాదశ పురాణాలూ, కావ్యాలూ, గడిచిన యుగాల్లోనూ మీకు వరూధినే దొరికిందటండీ? మిగిలిన నాయికలూ ఏమీ తీసిపోలేదు కానీ మరీ అంత అందమా ఆ వరూధినికి! అల్లసానివారి ఘంటం గీటుకి చివాలున పుట్టుకొచ్చి ఆవిడగారు మీ గుండెల్లోకెక్కి తిష్ఠ వేసుక్కూర్చుంటే నా బోటి సామాన్య మానవకాంతలకు దిక్కేది? "కనియెన్ విద్యుల్లతా విగ్రహన్ శతపత్రేక్షణ చంచరీక చికురన్ చంద్రాస్య చక్రస్తనిన్ నతనాభిన్ నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్.." అంటూ ప్రవరుడు గాంచిన ఆ భీతహరిణేక్షణను మీ మగాళ్ళ కళ్ళకీ చూపించేసాడా పెద్దాయన. అంతటి అందగత్తెను, అంతకు మించి రాసిక్యమెరిగిన జాణనూ మెచ్చిన మీ కనులకు నేను ఆనుతానా? అదీ నా అనుమానం. పైగా ఉత్తరంలో "నా వరూధినీ" అంటే ఒళ్ళు మండదా? ఇదేం సవతి పోరు నాకు!

అసలు కోపం అందుకు కాదనుకోండీ. మరేమో.. మీరు నన్ను ఎలా పిలిచినా బావుంటుందన్నానని పరకాంతల పేర్లతో పిలిస్తే మనసు చివుక్కుమనదూ! అప్పటి నుండీ ఆ పిలుపే ములుకులా గుచ్చుకుంటోంది. ఉత్తరం లో కాదు. నేరుగానే.. నేను పక్కనుండగానే నన్ను "విమల" అన్నారు. వెంఠనే చటుక్కున కళ్ళు తిప్పి చూద్దును కదా.. హాయిగా గుర్రు పెట్టి నిద్దరోతున్నారు. నటిస్తున్నారో మరి..! తెలతెలవారుతూనే పొడుస్తూ భానుడూ పుష్యరాగపు ఛాయ పుష్య రాగము మీద పొంగు బంగరు ఛాయ.. ఇంతలో మీ ప్రయాణం. తప్పని ఎడబాటుకి తడుస్తూ కన్నులూ మంకెన్న పూఛాయ.. మంకెన్న పువు మీద మంచి ముత్తెపు జాలు.. కొనగోట చిదిమి, నుదుట ముద్దిచ్చి వెళ్ళిపోయారు. అది మొదలూ ఎదురుచూపులు, కార్చిచ్చల్లే కాల్చేసే విరహం! 

ఉదయం మీ తలపులని బలవంతాన విదిలించుకుని, తానాలాడి దీపం వెలిగించి అగరుధూపం మధ్య మెరిసే తిరువేంగడ ముడయాన్ నే చూస్తూ, "కలవేణురవావశ గోపవధూ శతకోటివృతాత్ స్మరకోటిసమాత్.." అంటూ ఉండగానే మీరూ, మనం కలిసి చదువుకున్న గోపికాగీతలూ గుర్తొచ్చేస్తాయి. అపచారం అని లెంపలేసుకున్నానా.. మంగమ్మ నా వైపు చూసి నవ్వింది. ఏలికను ఏడుకొండలు దిగివచ్చేలా చేసే కిటుకులేవో చెప్తున్నట్టు నవ్వింది. చెప్పండి.. నాకు నా వెంకన్న దర్శనమెప్పుడో.. ఊఁ.. మీరే! ఇష్టం, మోహం, భక్తి, ప్రేమ, మైమరపూ ఇవన్నీ కలగలిపి నన్ను నిలవనీయని ఈ భావన మిమ్మల్ని ఏడుకొండలెత్తున నిలబెట్టేసింది మరి!

ప్రాణదీపమా, ఎవరు నువ్వు? జీవనమాధుర్యం అడుగంటిందని, నిట్టూర్పులు సైతం చల్లారిపోయాయనీ నిశ్చయం చేసేసుకుని నిర్లిప్తంగా సాగిపోతున్న నాలో అలజడి రేపావు. యవ్వనలత మారాకు తొడిగింది. నాకు ప్రాప్తమై, నా ప్రపంచమైపోయావు. నిన్ను, నీ కాంక్షలనూ నాకు కానుకిచ్చావు. తోడువీడనని మాటిచ్చావు. ఇక మిగిలింది.. నీ కోసం ఎదురుచూపే! మళ్ళీ నీ కబురు వినే క్షణం వరకూ మనసుని జోకొట్టి బజ్జోపెట్టేందుకు విఫలప్రయత్నం చేస్తాను. రాసేసిన లేఖ చదువుకుంటే అర్ధమవుతోంది. నీకెంత దగ్గరయిపోయానో.. హద్దులన్నీ చెరిపేసి నిన్నెంతలా కోరుకుంటున్నానో.. నీకు తగినదాన్నో కానో ఈ జన్మకింతే.. సర్దుకుపో. అంతే!
 

మీకు రాసే ఉత్తరం ముగిస్తూంటే మనసు నిండా పరుగులెత్తుకొస్తున్న కరిమబ్బులా బాధ నిండిపోతోంది. చీకటి కమ్మేస్తోంది. ఏం చేసేసారు నన్ను? విరహపు రాత్రుల్లో కాంక్షల దీపం వెలిగించి మీ రాకకోసం ఎదురుచూస్తూంటాను. వచ్చేయండీ..

మీ
నేను


                               *****

అమ్మడూ, కుశలమా? 

"ప్రియతమా" అందామనుకుని ఆగిపోయాను. "ఠాఠ్.. ప్రియ, ప్రియతర ఎవరోయ్?" అని నిలదీసేస్తావని. ఒకవేళ నువ్వలా అడిగావే అనుకో.. "ఏకేన రాజ హంసేన యా శోభా సరసః భవేత్ న సా బక సహస్రేణ పరితు తీరవాసినా" సరస్సు చుట్టూ మూగిన వేయి కొంగలివ్వలేని అందం ఒక్క రాజహంస ఇస్తుందీ అని చెప్పేవాడిని. నా మానస రాజహంసా, ఓ బంగారూ! ఇంత అసూయేంటీ? అయినా ప్రియతమా.. నీ విలువ మరింత పెంచేందుకే దాటిపోయిన మిగిలినవారంటాను.

నీ ముద్దు మాటలు గుర్తొస్తూండగా ఈ శీతవేళ ఇలా ఉయ్యాలలో కూర్చుని, నీకు ఉత్తరం రాయడం ఎంత బావుందో తెలుసా! మహాకావ్యం రాసేస్తున్నంత గర్వంగా ఉంది.  సరిజోడైన ఆడపిల్ల కోసం ఎన్ని వసంతాల ప్రాయాన్ని కాలానికి ధారపోసానో కదా! బింకంగా, పొగరుగా కనిపించే నువ్వేనా ఇంత బేలగా "వచ్చేయండీ" అని లేఖ రాసినదీ అని నవ్వుకుంటున్నాను. అవును మరి.. ప్రేమ ఆడపిల్లకి ధైర్యాన్నీ, మగపిల్లాడికి సిగ్గునీ ఇస్తుందట. మగాడికి సిగ్గేంటీ అనుకోవు కదా! వచ్చింది. నీ ఆలోచనల్లో మునకలేస్తూ, సన్నని గుసగుసల్లో నువ్వు చెప్పే సిగ్గుకబుర్లు తలుచుకు మురుసుకుంటూ, బెంగగా చూస్తున్న నీ కళ్ళనే పదే పదే ఊహిస్తూ ఇక్కడ నేను చేస్తున్న అవకతవక పనులకి కాస్త సిగ్గుగానే ఉంటోందని చెప్పకతప్పదు. ఎవరైనా గమనించి "ఏవిఁటోయ్.." అని మేలమాడితే అదీ బావుంటుందనుకో.

మానవమాత్రుడైన ప్రవరుడిని చూసి మోహపరవశ అయిన వరూధిని తన అతిమానుష విద్యలన్నీ మర్చిపోయిందట. రెప్పవేయక్కర్లేని అమరభామిని బిత్తరచూపులు చూసిందట. చమట పట్టని దేవతాలక్షణమల్లా ఆవిరైపోయి, చిరుచెమటల మేను తడిసి చివురాకల్లే వణికిందట. భ్రమరకీటకన్యాయం..! తానూ మానవకన్యలా ప్రవర్తించిందట! వలపు వింతలు ఇన్నీ అన్నీనా! నువ్వూ అంతేగా.. పొగరూ, వగరూ పక్కన పెట్టి నా కోసం అతి సామాన్యంగా, బేలగా నన్నే సర్వస్వమనుకోలేదూ! మనసిచ్చిన మగని కోసం ఏమైనా చేస్తారుగా ఆడపిల్లలు! అందుకే వరూధినీ.. నువ్వు వరూధినివి. ఆ అచ్చరకన్నె అందం కంటే నన్ను ఉత్తేజితుడిని చేసేది ఆమె బేలతనమే.. ఇంకా మోహంతో మతితప్పి కలిగిన తత్తరపాటూ, నర్మభాషణమూను. అవన్నీ నీకూ ఉన్న వన్నెలేగా! ఏమంటావ్? ఇప్పుడు చెప్పు. నాకు సరిజోడీ ఇంకెవరు.. మంచిగంధమంత చల్లని హాయైన 'నువ్వు' తప్ప!
 

పక్షిపేరొకమారు
పండు పేరొక మారు
రాలేన ఒక తీరు
పూలేన పలుమారు
 


ఏం? వెయ్యినామాలు దేవుళ్ళకేనా.. ఇలా గుండెల్లో కొలువుండే నా రాక్షసికీ తగును. అందుకే నిన్ను పాలపిట్టన్నా, పూల చెండన్నా నువ్వు పలికితీరాల్సిందే! తెలిసిందా? ఏవిటేవిటీ.. సత్యభామ లాగా పొగరు నటించేదానివా? నీకా నటనలెందుకూ? నిజమైన విన్నాణాలెన్నో ఉండగా! చీర చెంగు వదలనన్నానని, స్నానానికి సమయం మించిపోతోందనీ.. ఆ రోజు నువ్వు చూసిన ఎర్రని కోరచూపు మర్చిపోతానా? మిరపకాయ నమిలినంత ఘాటు సుమీ నువ్వు! ఊఁ.. ఆ రోజు నాకూ కోపం వచ్చేదే.. కానీ పేదవాడికోపం పెదవికి చేటు. ఓ వయ్యారి సీమాటీ, నా యెంకి పిల్లా..  కోపాల నా కోట కూలువగ యెంకి పూల రంగములోన కాలు దువ్వేను.. ఓడిపోయి దాసానుదాసుణ్ణి అయ్యేది నేనేగా! నీ పెదవి జిగజిగ పూల పదును కోసం ఆ మాత్రం ఓటమి పరవాలేదులే!

నేను దేవుణ్ణి అడిగే వరం ఒకటే - వాన, పిడుగులు, అపనిందలు, అవమానాలు అన్నీ, ఎన్ని కానీ అతని ఇష్టం! ఒక్క నిన్ను నాకిస్తే చాలు అంటాను. కానీ వినేట్టు లేడు. ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించకపోతే, మనమింత దూరం అయిపోం కదా!  ఈ మాటన్నది నేను కాదు సుమా.. బుటేదారీ అంచుకుచ్చెళ్ళ పైజామా, జుబ్బా కత్తిరింపు లాల్చీ వేసుకుని.. కళ్ళల్లో కలలు తొణికిసలాడిపోతూ, వెన్నెలనవ్వులల్లించే ఓ చెలం మాటలివి. ఇంతకు మునుపు చదివిన ప్రతి కవితా, అనుభూతీ, కావ్యమూ ఇప్పుడు ఇంకా నిక్కచ్చిగా నా పరిస్థితికి అద్దం పట్టేస్తున్నాయ్. "వార్నీ..  వీళ్ళందరికీ ముందే నా తహతహలూ, విరహాలూ, బాధా ఎలా తెలిసిపోయాయో!" అనిపిస్తోంది. నిజంగానే ఈ ప్రపంచమింత పెద్దది ఎందుకయ్యిందీ? హూఁ.. తప్పదుగా.. చీకట్లో ఉన్న దీపానికి వెలుగెక్కువ. విరహంలో పెరిగే ప్రేమకి తీవ్రతెక్కువ. వచ్చేస్తానులే.. రేపో మాపో.. నువ్వసలు ఎదురుచూడని వేళ! అలాంటి వేళంటూ ఉండనే ఉండదంటావా? "ఈ పాడు లోకముతోటి మనకేటికి లోలాక్షీ రా పోదము"  అని చెట్టాపట్టాలేసుకునే రోజుకోసమేగా ఈ ప్రయత్నమూ ప్రయాణమూను.

మరేమో బంగారూ.. ఆ రేయి తళుకుల చీరారేసావు. నా మనసు పారేసుకున్నాను. ఆ ముచ్చటేదో అయ్యాక చూద్దును కదా.. దీపపు వెలుతురంతా మింగేసినట్టు శ్రీకారంలా మహ చక్కని నీ కుడి చెవి ఎరనెర్రగా కనిపించింది. మీ నాన్నగారు ముద్దుగా కొనిపెట్టిన జూకా మెరిసిపోతోంది. నీ సొమ్ములు భద్రమనేగా నాకు ఒప్పగించారూ.. ఆ బాధ్యతతో నీ చెవి కమ్మల్ని సవరించి నా అల్లుడరికం నిలబెట్టుకుందామనిపించింది. ఆ వంకతో నిన్ను తాకుదామనో, ముద్దాడుదామనీ మాత్రం అస్సలు కాదు. నన్ను నమ్ము! నువ్వేమో.. చెయ్యి విసిరికొట్టావు. మనసెరిగి మృష్టాన్న భోజనం పెట్టిన నా ఇల్లాలివి.. కప్పురపు తాంబూలం ఇవ్వమరచిపోవడం లోటు కదూ! నీకే మాటొస్తుంది మరి! నీకూ తెలియాలిగా.. అందుకే 'విమల' అన్నాను. అంటే అర్ధం కాలేదా "విసుగు మహా లక్ష్మీ.." పాదరసానివనుకున్నానే! పట్టేస్తావనుకున్నానే! అలిగి మనసు పాడుచేసుకుంటావనుకోలేదు సుమీ!

ఊఁ.. చెప్పాలనుకున్న మరోమాట గుర్తొచ్చింది. అన్ని కబుర్లూ 'మీరూ మీరూ..' అని రాసి ఉన్నట్టుండి 'నువ్వు' అనేసావేం! అలా కనుబొమ ముడేయకు.. పెదాలు బిగించి నొచ్చుకోకు అమ్మడూ! నాకు నచ్చింది. చాలా అంటే చాలా..!  బాల్యంలో కుమారులకూ, ప్రణయకలాపాలలో స్త్రీలకూ, స్తుతించే కవులకూ, సమరంలో భటులకూ "నువ్వు" అనే చనువు ఉండడం శాస్త్ర సమ్మతం. జీవితాన్నర్పించి, నన్ను తలుచుకుని కళ్ళు చెమ్మదేలిన నా అర్ధభాగం నన్ను 'నువ్వు' అంటే తప్పేం లేదు. అది మనసుతో మనసు రమించిన వేళ! త్వమేవాహం .. కదూ!

వచ్చేస్తానమ్మడూ.. వీలైనంత త్వరలో.. రెక్కలు కట్టుకుని వచ్చేస్తా. తోపురంగు సరిగంచు చీరకట్టుకుని అటుతిరిగి నిద్దరోతున్న నీ రూపే కళ్ళలో కదులుతోంది.

రేతిర్లొ మనతోట కాడా వొక్కణ్ణి 
నా తిప్పలీశ్శరుడు లేడా! 
సీకు సింతా లేక నీవా నా యెంకి.. 
పోకల్లె పండుకున్నావా?

ఒంటిరివాడంటే నిద్దరకీ చిరాకట! ఇలా మసలి మరిగిపోనీ ఈ ప్రాణాన్ని.. ఈ చీకట్లో.. నీ విరహంలో.. 

జాగ్రత్తగా ఉండూ.. వచ్చేస్తానుగా! నువ్వే నేనైనప్పుడు నేనెవరన్నది నీతో చెప్పాలా..? సంతకాలు చెయ్యాలా?
  

66 comments:

  1. SPLENDID!!
    You took me to a different plane.
    Pratee vyaakyaanni preminchaanu. Prema mallee anubhavam loki vochindi ____ .
    Mee Varudhini to nenuu premalo paddaanu.
    Ekantangaa nishabdangaa unna samayamlo Varudhini naku rasina lekha chadavatam naa adrustam.

    ReplyDelete
    Replies
    1. ఈ వరూధినీ కదిలించిందన్నమాట! చాలా సంతోషం. :)ప్రేమని చదివి మెచ్చుకునే పాఠకుల మధ్య ఉండడం, వారిని మెప్పించగలగడం నా అదృష్టం. ధన్యవాదాలు కుమార్ గారూ!

      Delete
  2. గబగబా రెండుసార్లూ, నింపాదిగా ఒకసారీ (ముఖ్యంగా అతనిది) చదివేశానా.. ఏమో నాకైతే వీళ్ళకి ఎలాంటి కితాబు ఇచ్చినా చాలా తక్కువే అనిపిస్తుంది.. ఇంతందాన్ని ఊరికే 'బావుందనో.. అమేజింగ్ అనో' అనేసి సరిపెట్టాలంటే మనసొప్పట్లేదు.. చాలా మధురంగా ఉంది.. ఇంకొన్ని రోజులు వీళ్ళ చుట్టూనే తిరుగుతుంటాను, అస్సలేమనుకోవద్దు!!

    అవును, కొత్తగానే ఉంది కానీ ఊహించాను.. :-)

    ReplyDelete
  3. ఇద్దరూ నచ్చారు కానీ అతను ఇంకొంచెం ఎక్కువ నచ్చేశాడమ్మయ్.. 'విమల ' అంట!! :))

    "నీ ముద్దు మాటలు గుర్తొస్తూండగా ఈ శీతవేళ ఇలా ఉయ్యాలలో కూర్చుని నీకు ఉత్తరం రాయడం ఎంత బావుందో తెలుసా! మహాకావ్యం రాసేస్తున్నంత గర్వంగా ఉంది. సరిజోడైన ఆడపిల్ల కోసం ఎన్ని వసంతాల ప్రాయాన్ని కాలానికి ధారపోసానో కదా! బింకంగా, పొగరుగా కనిపించే నువ్వేనా ఇంత బేలగా "వచ్చేయండీ" అని లేఖ రాసినదీ అని నవ్వుకుంటున్నాను."

    "వచ్చేస్తానమ్మడూ.. వీలైనంత త్వరలో.. రెక్కలు కట్టుకుని వచ్చేస్తా. తోపురంగు సరిగంచు చీరకట్టుకుని అటుతిరిగి నిద్దరోతున్న నీ రూపే కళ్ళలో కదులుతోంది. "


    --- ఎప్పుడొస్తాడో!? I'm n love with him! :))

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్యో.. నిషిగంధా పోటీకి వచ్చేస్తోందని తెలిస్తే ఆ అమ్మడి కంటికి కునుకుండదేమో! పాపం! అతడిని మెచ్చుకున్నందుకు బోలెడు థాంక్స్! :)

      Delete
  4. వాహ్వా వహ్వా మాటలు లేవంతే!!కొన్ని లైన్స్ కాపీ చేసుకుంటా వ్రాసే అవసరం వస్తే వాడుకుంటా ;)(మీరు సరే అంటేనే సుమీ)

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ, తప్పకుండా వాడుకోండీ. నాకు అసలు అభ్యంతరమే లేదు. :) ధన్యవాదాలు!

      Delete
  5. <>

    <>

    ఏమి చెప్పడానికీ మాటల్లేవు మరి నాకొచ్చిన భాష సరిపోదు కూడా,అయినా మీరింతల్లా రాసేసాక ఇంకా మాటలతో పనేంటిలెండి,అనుభూతి చెందుతూ పరవశించిపోడమే తప్ప.

    ReplyDelete
    Replies
    1. :) అంతేనంటారా? ధన్యవాదాలు!

      Delete
  6. మధురాతి మధురం

    ReplyDelete
  7. కోవా అంత తియ్యగా, కొత్తావకాయంత కమ్మగా :)

    ReplyDelete
  8. Very beautiful, as usual :). Enjoyed it thoroughly.

    ReplyDelete
  9. నాకు ఏం అర్ధమయ్యిందో ఒక్క మాటలో చెప్తానండీ..
    ఇవి దేవతల ప్రేమలేఖలు ;) ;)
    అద్బుతం..

    ReplyDelete
    Replies
    1. అమ్మో.. అమ్మడినీ, అతడినీ మునగచెట్టెక్కించేసారుగా! చాలా సంతోషంగా ఉందండీ! ధన్యవాదాలు!

      Delete
  10. "ప్రేమ (ఆడపిల్లకి ధైర్యాన్నీ) మగపిల్లాడికి సిగ్గునీ ఇస్తుందట." -- పట్టుకున్నారుగా...
    త్వరలోనే "రా" కొట్టిస్తారని ఎదురు చూస్తూ....

    ReplyDelete
    Replies
    1. అమ్మడినడిగి చెప్తా. :) ధన్యవాదాలు!

      Delete
  11. అబ్బాయి రాసిన మొదటి ప్రేమ లేఖ ఎక్కడ??????

    ఇలాంటివారిని బైట ఎందుకు చూడలేం.....

    ReplyDelete
    Replies
    1. అన్నీ బయటపెట్టేయడం కష్టం కదండీ! ఇలాంటివారిని బయట చూడగలం. అయితే ఎవరికి వారు కష్టపడి వెతికి పట్టుకోవలసిందే! :) ధన్యవాదాలు!

      Delete
  12. నిన్నంటి నుండీ నీ ఇంటి ముంగిట్లో తచ్చాడుతున్నాను, నువ్వు రేపిన అసహనాన్ని అసంతృప్తిని ఎలా తెలియచేయ్యాలో చేతకాక. ఇప్పటికీ కావటం లేదనుకో, కానీ నీకు ఏదో ఒకటి చెప్పేసి బరువు దులిపేసుకోకపోతే విమలని కాస్తా అమలనై పోతానని భయంగా ఉంది.

    చదవగానే దిగాలుపడి, నీ అమ్మాయి మీద అసూయపడి, నీరసపడిన మాట నిజమే అనుకో. (అమ్మాయి మీద అసూయ ఎందుకంటే, అమ్మాయి చేత అంత అందంగా ఉత్తరం రాయిన్చుకోడానికి కారణమయిన అబ్బాయి ఉండబట్టి, ఆ అబ్బాయి ఆ అమ్మాయికి స్వంతమవ్వబట్టీనూ. లేకపోతే ఎవరికి రాస్తుంది, అల్లసానివారికా?) సత్యభామలా కపట గాభీర్యంతో, నా కంటి చివరనుండి రాలనా మాననా అని సందేహిస్తున్న ముత్యాలని కొనగోటితో విదిలించి, ఆ చాల్లే .. వీళ్ళు కూడా వరూధినిలాంటి కల్పిత పాత్రలే, లేకపోతే నిజంగా ఎక్కడన్నా ఉంటారా ఏంటి చోద్యం అని మనసుని బుజ్జగించేసాను. హమ్మయ్య, కొంచెం శాంతిగా ఉంది ఇపుడు. మనకి లేనిదీ, అందనిదీ అసలు సృష్టిలోనే లేదనుకోవటంలో యెంత శాంతి. వెదుకులాటలు తప్పాయి కదా.

    సరేగానీ, నీకో ప్రేమతో కూడిన హెచ్చరిక. నీ అమ్మాయి గనక వూహ కాకపోయినా, లేదా అది నువ్వే అయినా ఆసంగతి పొరపాటున కూడా నాతో చెప్పకేం ప్లీజ్. నా అసూయని నువ్వు తట్టుకోలేవు.

    *** అవునూ, సత్యభామది కపట గాంభీర్యం అని ఎందుకు అన్నాను అంటావేమో. నాకైతే సత్యభామలో మీరజాలగలడా నాయానతి అని పైకి ఎన్ని బడాయిలు పోయినా, ఎక్కడ కృష్ణుడు తన చేతిలోంఛి జారిపోతాడో అన్న భీరత్వమే ఎక్కువ కనిపిస్తుంది నాకు, అచ్చమైన అతి మామూలు ఆడపిల్లలా.

    ReplyDelete
    Replies
    1. "లేకపోతే ఎవరికి రాస్తుంది, అల్లసానివారికా?" -- పద్మవల్లి గారూ.. అదరగొట్టేశారండీ... నేను కూడా కొత్తావకాయ గారంటే కుళ్ళుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫార్మేట్‌లో కాళిదాసు కాన్సెప్ట్‌తో రాయాలని సుమారు పుష్కర కాలంగా గోళ్ళు గిల్లుకుంటూనే ఉన్నాను. ఈవిడ చూస్తే ఇలాంటివి ఎడాపెడా రాసేస్తున్నారు, :(

      Delete
    2. థాంక్యు యు. అవును ఇది ఆవిడ మీద ఉక్రోషంతో వచ్చినదే.

      Delete
    3. పద్మవల్లి గారూ, మొత్తానికి మీరు అమల (అసూయ మహాలక్ష్మి) అయిపోయారన్నమాట! మీ కోపం నాకు అభినందన. మీ ఉక్రోషం అమ్మడికీ, అతడికీ దీవెన.

      "ఎవరికి రాస్తుంది, అల్లసానివారికా?" ఈ ప్రశ్నకి నా గుండె ఝల్లుమంది. నిజం కదూ! అతడే లేని అమ్మడికి విలువేదీ? సత్యభామ గారూ, అస్సలు చెప్పనే చెప్పనండీ. వాళ్ళిద్దర్నీ మీ ఊహలోనే భద్రంగా ఉండిపోమందాం. సరేనా? ధన్యవాదాలు. :)

      Delete
    4. పురాణపండ ఫణి గారూ, గోళ్ళు గిల్లుకోవడం అయిపోతే మాకు కాళిదాస దర్శనం చేయించవచ్చు కదా! కుళ్ళుకోవడం.. హ్హహా.. థాంక్యూ థాంక్యూ!

      Delete
    5. ఒక స్త్రీ పురుషుడి అంతరంగాన్ని పట్టుకోడం సులువేమో కానీ ఓ మగాడు మగువ మనసును అర్థం చేసుకోడం అంత వీజీ కాదేమో....! అయినా, ఇలాంటివి రాయాలంటే కోరిక ఒకటే ఉంటే చాలదు కదండీ... మనసు లో నుంచి దానంతట అదే పెల్లుబికి రాగల భావుక ధార కావాలి. అది నా గుండెలో ఉన్నట్టు లేదు. :)

      Delete
  13. వ్యాఖ్య వ్రాయాలంటే నాకు పదాలు దొరకటం లేదు. ఒక అనుభూతిని మాటల్లో చెప్ప గలిగే భాష నాకు తెలియదు.
    మిమ్మల్ని మెచ్చుకోవాలన్నా నాకు చేత కావటం లేదు.

    ReplyDelete
    Replies
    1. అనుభూతిని దొరకబుచ్చుకునే మనసు మీ వ్యాఖ్యలో కనిపిస్తోందండీ! మహా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు!

      Delete
  14. అమ్మయ్య తీరిగ్గా ఇప్పటికి చదివాను . మీ రాతల గురించి ఎంత చెప్పినా తక్కువే . ఒక్కింత అబ్బాయి రాసిన ఉత్తరం బావుంది అనిపించింది ఎందుకో :))
    విమల అంటే ఇదా అర్ధం :)))

    ReplyDelete
    Replies
    1. ఎందుకంటే మీరు అమ్మాయి కాబట్టీ.. :) ధన్యవాదాలు!

      Delete
  15. అద్భుతం కొత్తావకాయ గారు
    ఏం చెప్పాలో రాయడానికి మాటలు లేవు రాయడానికి బాష కూడా రాదు
    గౌతం మీనన్ సినిమా లు చూసే పిల్ల బ్లాగర్లం

    i must say Fantabulous :)

    ReplyDelete
    Replies
    1. అయ్యో.. ఎంతమాట! నేనూ గౌతం మీనన్ సినిమాలు చూసేదాన్నేనండీ. ఇంకా మాట్లాడితే ప్రిన్సెస్ డైరీస్ గోళ్ళు కొరికేసుకుంటూ చూసి ఆనందించేదాన్ని. టపా మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు!

      Delete
  16. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ ఎవరన్నా నా పెళ్లి మాటెత్తితేనే కళ్ళలో నీలాలు నింపుకునే మా అమ్మ కళ్ళల్లో మురిపెపు ముత్యాలు కురిపించినదీ ...
    "అమ్మయ్య! నా బంగారుతల్లి చిన్ని-చిన్ని కోపాలని "మాట మామిడల్లం - మనసు పటిక బెల్లం " చందాన తేలిగ్గా తీసుకుని ఆ కోపపు వేడిని చలువగా మార్చగలిగే రామ "చంద్రుడే" దొరికాడని మా నాన్నగారిని మురిపించినదీ...
    మా "బావ " మనసు సాక్షిగా జరిగిన నా ఎన్నో బారసాలల్లో , నాకు పెట్టిన "సహస్ర" నామాలలో నాకెంతో ప్రియమయినదీ...
    ఎంత కోపంలోనూ నన్ను నవ్వించేదీ...
    ఆ "విమల " ని ఇంత అందంగా మీరు మీ కథలో చేర్చినందుకు ...
    నా , మరి ఈ పేరుకి హక్కు-కర్త అయిన మా బావ - మా ఇద్దరి తరపున మీకు బోల్డన్ని ధన్యవాదాలు :))

    ~The one and only విసుగుమహాలక్ష్మి అనబడే విమలా దేవి (మరీ ముద్దొచ్చేస్తే ;) )

    ReplyDelete
    Replies
    1. సహస్ర నామాల విమల గారూ, ఇంతందంగా కథలో ఇమిడిపోయినందుకు నేనే ధన్యవాదాలు చెప్పాలి. థాంక్యూ! :)

      Delete
  17. చక్కటి సాహిత్యాభిరుచి, బోలెడు సాహిత్య పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ప్రేమలేఖలు రాసుకుంటే ఇంతందంగా ఉంటాయన్నమాట! :)

    ReplyDelete
    Replies
    1. చక్కటి అభిరుచున్నవారి ప్రశంసకి ధన్యవాదాలు! :)

      Delete
  18. దక్షిణపు గాలికి గోవర్ధనం చెట్టు పక్కన కూర్చుని చదవడం మొదలెట్టానా...పూర్తయ్యేసరికి మానస సరోవరం ఒడ్డున వున్నాను. ఈ లేఖలలోని అక్షరాలకు అమరత్వం ప్రసాదించారు.

    ReplyDelete
    Replies
    1. అబ్బో.. పెద్ద ప్రశంస! లేఖలకు అమరత్వసిధ్ధి వాటిలో తొణికిసలాడే ప్రేమ వలనే లభిస్తుంది కదండీ. నాదేముంది! ధన్యవాదాలు!

      Delete
  19. అబ్బా! యెంత బాగా రాసారో కొత్తావకాయగారూ! అమ్మాయి సరే గానీ (అమ్మాయిలు ఎప్పుడూ అందంగానే రాస్తారు), అతను మాత్రం భలే రాసేశాడు. :-)

    మీ విమల నాకు మా కమలను గుర్తు తెచ్చింది. కచ్చ మహాలక్ష్మి ని.
    -
    సోమిదేవమ్మ.

    ReplyDelete
    Replies
    1. విమల, అమల, కమల.. ముగ్గురు బయటకొచ్చారు. :) అబ్బాయి కలాన్ని కదిలించిన అమ్మాయిని మెచ్చుకుంటారనుకున్నాను. పోన్లెండి. ఇద్దరూ ఒకరేగా.. సర్దుకుపోతారు. ధన్యవాదాలు!

      Delete
  20. ఏమి రాయాలో తెలీటంలా...తెలిసినప్పుడు మరలా వెనక్కి వస్తా... ఇది too sweet!!

    ReplyDelete
  21. ఏం చదువుకున్నారో, ఎక్కడివారో కానీ కొత్తావకాయగారూ, బ్లాగ్లోకాన్ని ఘుమఘుమల్లో ముంచెత్తుతున్నారు. ఒక్క వాక్యం ఎంచి రాద్దామని ప్రతీవాక్యం దగ్గరా ఆగి ఎంచలేక వదిలేశా. ఎన్నని ఏరమంటారు. అడుగడుగునా ఆణిముత్యాలే.

    అమ్మడి మాటల్లో అయితే ప్రతీ మాటా మనసులో గుచ్చుకుంది. అబ్బాయీ తక్కువవాడేం కాదండో. "దీపపు వెలుతురంతా మింగేసినట్టు శ్రీకారంలా మహ చక్కని నీ కుడి చెవి ఎరనెర్రగా.." వాహ్! వీరు నిజమా? ఆమె మీరేనా?

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంస కి ధన్యవాదాలు. ఇక మీ ప్రశ్నలకి సమాధానం.. ఊహలే అందంగా ఉంటాయ్ కదండీ. అందుకని మీ ఊహకే వదిలేస్తున్నాను. :)

      Delete
  22. తెలుగు బ్లాగులు అందించిన ఆణి ముత్యాలు ఈ కొత్తావకాయ , రసజ్ఞ , కృష్ణ ప్రియ డైరీ , యరమణ గారు,నెమలి కన్ను మురళి గారు. మీకు గాదు, బ్లాగరోడికి చెప్పాలి కృతఙ్ఞతలు మీ లాంటి ఆణి ముత్యాల రచనలు మా చేత చదివించినందుకు.

    కొత్తవకాయ మీ రచనలలో ఈ టపా ఒక మేలి ముత్యం. ప్లీజ్ కంటిన్యూ మేడం.

    ReplyDelete
  23. మాటలు రానంతగా అంటే చెప్పలేనంత బాగుంది. నేను చదివిన మొదటి టపా ఇది పాత వాటికోసం సమయం చూసుకోవాలి

    ReplyDelete
  24. హమ్మ్మ్.... ఏమని చెప్పేది ఈ భావాన్ని... అనుభూతి కి అక్షర రూపం ఇవ్వడం , అందరికీ సాధ్యం కాదు మీలాగ :)
    ఏ అక్షరమూ వదలకుండా ఒకటికి పది సార్లు చదివినా ఇంకా సరిపొవట్లేదు.
    మీకు బోలెడు ధన్యవాదాలు ఇన్ని అద్భుత రుచులను అందిస్తున్నందుకు :)

    ReplyDelete
  25. habbaa manasuni kudipi,kadipi maa mankena puvvullo muthyaala jallu teppinchesaaru....great

    ReplyDelete
  26. naaku enduko sarigaa download avaledandi. chadivindi antaa chalaa chaalaa baagundi kaani chala padalu, akshraalu download avaka feel miss ayyanu.

    ReplyDelete
    Replies
    1. వేరే బ్రౌసర్ లో ప్రయత్నించి చూడండి. థాంక్యూ!

      Delete
  27. kavayitrulaki maatrame ilaanti andamayina bhavanlu vastaayi...rachayitrulaki maatrame andamayina varnanalu vastayi..inka rachayitri+kavayitri ayinaa meeku ido lekkaa anta!! intha adbhutamgaa wrasina mimmalni choodaalani undi...face book lo kaneesam choodachchemo anukunte...norooristoo akkadaa aavakaaya jaadeeye!!!I was really disappointed...
    mee rachanalu suparasalu...!!!andukondi naa abhinandana chengaluva. sannajaajula kalagalupu suma maalaa...

    ReplyDelete
    Replies
    1. నోరూరిస్తూ ఆవకాయ జాడీ కనిపిస్తూంటే.. ఇంకా మనుషులతో పనేంటండీ. :) మీ అభిమానానికి ధన్యవాదాలు!

      Delete
  28. gadusu abbai.. sutimettani ammai!!

    Kottavayakaya garu... naakkooda ila letters raaseyyalanipistondi!! :)

    ReplyDelete
    Replies
    1. రాసేయండీ మరి! ఏవిటాలస్యం? ధన్యవాదాలు! :)

      Delete
  29. కొత్తావకాయ ఘాటుతనం కాదండి. పుట్టతేనె మాధుర్యం. అటిక నిండా :)

    ReplyDelete
  30. ఈ వ్యాఖ్య మీరు గమనిం చరేమో అనే సందేహం ఉన్నా వ్రాస్తున్నా ఎప్పుడో ఒక సారి చూస్తారని .చాలా మిస్ అయ్యాను మీ బ్లాగు ఇంత ఆలస్యం గా చూసి.ప్రేమ ఉచ్చ్వాసం అయితే ఎలా ఉంటుందో మీ రెండు లేఖలు అలా ఉన్నాయి.ఇంతఅందంగా ప్రేమ లేఖలు ఇప్పటిదాకా యండమూరి నవలల్లో చూసాను,ఇప్పుడు మరలా!జ్యోతిర్మయి గారు వ్రాసిన టపా ఆధారంగా మీ బ్లాగు చూస్తున్నాను.ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం.

    ReplyDelete
  31. ఈ టపా చదువుతూ నన్ను నేనే మరచిపోయి ఊహాలోకాల్లో ఊరేగానంటే, నన్ను ఎంతగా ఆకట్టుకుందో వేరే చెప్పాలా... అద్భుతం అనేది చిన్న మాట.. మీకు అభిమానిని అయిపోయానండీ బాబూ :)

    ReplyDelete