కార్తీక మార్గశిరాలు నాపేరన గుత్తి కట్టేసుకోవాలనిపించేంత అరుదైన జ్ఞాపకాలూ, అనుభవాలూ ఉన్నాయీ కాలంలో!
దాదాపు పదేళ్ల క్రితం మార్గశీర్షంలో అనాలోచితంగా మొదలుపెట్టి రాసుకున్న నెల్లాళ్ళ తిరుప్పావై కథా కుసుమాలు నా ప్రయాణంలో ఒక మైలురాయి. అయితే ఈ రాతల్లో నాదంటూ ఏమీ లేదు. మహానుభావుల కవిత్వానికి నా పైత్యం జోడించి అల్లినవే. మున్నుడి నుండీ ముగింపు దాకా మెరిసిన వాక్యాలన్నీ పురాకవిత్వం నాలో ఇంకి ప్రతిఫలించిన వెలుగులైతే, ఓగులన్నీ అచ్చంగా భవదీయురాలివి.
"అరసికాయ కవితా నివేదనం శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ" అని వాపోతాడో కవి. రసజ్ఞత లేనిచోట మాట్లాడవలసిన గతి పట్టించవద్దని బ్రహ్మకే మొరపెట్టుకోవడమన్నమాట. నా భాగ్యానికి అచ్చంగా నాదైన బ్లాగు ముంగిట్లోకొచ్చి చదివి వెళ్లే రసజ్ఞులైన అతిథులూ, సద్విమర్శకులూ దొరికారు. గొప్ప నేస్తాలు కుదిరాయి.
అప్పటి తిరుప్పావై కథలని ఈ మార్గశిరంలో కూర్చి మాలకట్టే ప్రయత్నం చేసాను. e-book రూపంలో కాస్త ముస్తాబు చేసాను. ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అడగగానే కవర్ పేజీ కోసం నా బాల్యమే రూపుకట్టినట్టున్న బొమ్మనిచ్చిన శ్రీ కేశవ్ వెంకటరాఘవన్ గారికి శిరసా నమస్సులు. కన్నయ్య కథలంటూ మురిసి తన బ్లాగులో అతిథిగౌరవమిచ్చిన వేణూ శ్రీకాంత్ గారికీ, పుస్తకం పని ఎందాకా వచ్చిందని నన్నంటిపెట్టుకుని ఆసక్తిగా ఎదురుచూసిన వంశీకృష్ణకీ, శ్రీనిధికీ ప్రేమపూర్వక ధన్యవాదాలు.
జీవనమాధుర్యమే తానైన మురళీ మనోహరునికి ఏమివ్వగలను! కృష్ణార్పణం.