Monday, December 21, 2020

మంచి వెన్నెలవేళ

కార్తీక మార్గశిరాలు నాపేరన గుత్తి కట్టేసుకోవాలనిపించేంత అరుదైన జ్ఞాపకాలూ, అనుభవాలూ ఉన్నాయీ కాలంలో! 

దాదాపు పదేళ్ల క్రితం మార్గశీర్షంలో అనాలోచితంగా మొదలుపెట్టి రాసుకున్న  నెల్లాళ్ళ తిరుప్పావై కథా కుసుమాలు నా ప్రయాణంలో ఒక మైలురాయి. అయితే ఈ రాతల్లో నాదంటూ ఏమీ లేదు. మహానుభావుల కవిత్వానికి నా పైత్యం జోడించి అల్లినవే.  మున్నుడి నుండీ ముగింపు దాకా మెరిసిన వాక్యాలన్నీ  పురాకవిత్వం నాలో ఇంకి ప్రతిఫలించిన వెలుగులైతే, ఓగులన్నీ అచ్చంగా భవదీయురాలివి. 

"అరసికాయ కవితా నివేదనం శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ"  అని వాపోతాడో కవి. రసజ్ఞత లేనిచోట మాట్లాడవలసిన గతి పట్టించవద్దని బ్రహ్మకే మొరపెట్టుకోవడమన్నమాట. నా భాగ్యానికి అచ్చంగా నాదైన బ్లాగు ముంగిట్లోకొచ్చి చదివి వెళ్లే రసజ్ఞులైన అతిథులూ, సద్విమర్శకులూ దొరికారు. గొప్ప నేస్తాలు కుదిరాయి. 

అప్పటి తిరుప్పావై కథలని ఈ మార్గశిరంలో కూర్చి మాలకట్టే ప్రయత్నం చేసాను. e-book రూపంలో కాస్త ముస్తాబు చేసాను. ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

అడగగానే కవర్ పేజీ కోసం నా బాల్యమే రూపుకట్టినట్టున్న బొమ్మనిచ్చిన శ్రీ కేశవ్ వెంకటరాఘవన్ గారికి శిరసా నమస్సులు. కన్నయ్య కథలంటూ మురిసి తన బ్లాగులో అతిథిగౌరవమిచ్చిన వేణూ శ్రీకాంత్ గారికీ, పుస్తకం పని ఎందాకా వచ్చిందని నన్నంటిపెట్టుకుని ఆసక్తిగా ఎదురుచూసిన వంశీకృష్ణకీ, శ్రీనిధికీ ప్రేమపూర్వక ధన్యవాదాలు.  

జీవనమాధుర్యమే తానైన మురళీ మనోహరునికి ఏమివ్వగలను! కృష్ణార్పణం. 


7 comments:

 1. మీ ప్రయత్నం రమణీయమూ, సుందరమూ. పుస్తకం హృదయాహ్లాదిగా ఉంది
  దీర్ఘాయుష్మాన్ భవ

  ReplyDelete
 2. శుభాభినందనలు నందనందుని కథను రాసి మహదానందమందించినందుకు 👏

  ReplyDelete
 3. బుక్ కూడా ఉందా మేడం

  ReplyDelete
 4. Has been thinking of your this series since the start of Dhanurmaasam. I was trying to make it a pdf to send to my father. You reduced my strain. :)

  ReplyDelete
 5. సుస్మితగారికి, నమస్తే! రెండేళ్ళ క్రితం కాబోలు, మీ ధనుర్మాసం పోస్టులు చదివి, కృష్ణశాస్త్రిగారి పాటలను ఏరుకున్నాను. ఇవాళ "30వ పాశురం" కనబడలేదేమని మళ్ళీ వెదుక్కుంటూ వస్తే, "మంచి వెన్నెల వేళ" కనబడింది.

  ఈ తిరుప్పావై రేడియో ప్రోగ్రాం (కృశా పాటలు, శ్రీభాష్యం అప్పలాచార్యుల భాష్యంతో ఉన్నది) దొరుకుతుందా? ఇప్పుడు యూట్యూబులో ఉన్నది వేరే కాబోలు (సంతాన గోపాలాచార్యుల వ్యాఖ్యానం + "శ్రీనివాసగురుడు", వేటూరి ప్రభాకరశాస్త్రుల అనువాదం).

  తెలిస్తే చెప్పగలరు.

  ReplyDelete
  Replies
  1. నమస్తే శ్రీనివాస్ గారూ. నాకు నెట్ లో దొరికిన లింక్ ఇస్తున్నాను చూడండి. ఇవి ఆకాశవాణి వారివి కాదు మరి.

   https://archive.org/details/THIRUPPAVAI_SRIBHASYAM_APPLAACHARYA/PART+01+-+THIRUPPAVAI+PRAVACHANAM+-+SRI+BHASYAM+APPALAACHARYA.mp3

   Delete
 6. ఈ బ్లాగ్ పోస్టులని ఇన్నేళ్ళయినా గుర్తుంచుకుని ఆదరిస్తున్న మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు.

  ReplyDelete