ఇదే వేసంగి.. అయితే ఇప్పట్లా ఉస్సురస్సులేం తెలుసూ! చిన్నతనపు భాషలో
వేసవంటే.. సెలవులూ, మామిడిపళ్ళూ, మల్లెపూలజడలూ, ఎండావకాయ, దొంగచాటున తినే
తాటిముంజలూ, బొమ్మల ప్రింట్ కాటన్ గౌన్లూ. కరంటంటే మునపటి తరం నుంచీ ఉన్నా,
కరంటుకోత మాత్రం మా చిన్నతనాల్లోనే వచ్చిందని చెప్తారు. కాకపోతే అప్పటి
నెలజీతంలాగే, పవర్కట్టూ పరిమితంగానే ఉండేది.
సాయంకాలాలు వీధిలో దొంగాపోలీసో, స్థంభాలాటో, బీసీ నో ఆడుతున్న పిల్లలందరూ కరెంటుపోగానే "ఓ..." అని అరుస్తూ ఆ ఇంటికి పరుగుదీసేవాళ్ళం. చిన్న వీధి చపటా, రామనీలం రంగు వెల్లవేసిన గోడలూ, నల్లటి చెక్కతలుపులు.. రెండు వాటాల పెంకుటింటి ముందు బోలెడు మేర గచ్చు చేసి ఉండేది. సర్దుకు కూర్చునేవాళ్ళం... ఒళ్ళంతా చెవులుచేసుకుని! కాస్త దూరంలో తూర్పుగోడవైపుకి ఉన్న తులసమ్మ ముందు వెలిగిన సంజెదీపం. వెన్నెలరాత్రులైతే ధారగా జారిపడే పాలనురుగు. చీమచిటుక్కుమంటే వినిపించే నిశబ్దం.. ఆ కాస్త వెలుగులో కూడా పసిడిలా మెరిసే పిట్టంత మనిషి. కాసంత బొట్టు, తాంబూలంతో పండిన పెదవులు, తళతళ్ళాడే కళ్ళు, ముడతలు పడిన ముఖం. ఖణీమనే గొంతు. అపూర్వమైన వాగ్ధార. పైడిపల్లి మామ్మగారంటే రూపుకట్టిన కథ.
శ్రవణకుమార చరితంతో మొదలు పెట్టి ఉత్తర రామచరితం దాకా నడిచే కథ ఓ వేసవంతా! సగర కుమారులు తవ్విన గుంటలు గడిచి దారువై కాచిన పూరీ జగన్నాథుడి కథ వరకూ మరో వేసవి. ఇక అటు దాటాక పంచతంత్రం, కాశీమజిలీలూ, భట్టివిక్రమార్కుల కథలు ఎలానూ ఉన్నాయి. పైడిపల్లి మామ్మగారు వేసిన మంత్రం ప్రతీ మునిమాపూ గంటన్నర పాటు పనిచేసేది. మంత్రముగ్ధమై వినడమే.. అంతే! ఎన్ని నుడికారాలు, ఎన్నెన్ని సామెతలు, ఎన్నేసి పిట్టకథలు, మరెన్నెన్ని చిలవలూ పలవలూ..
ఇదిగో.. మళ్ళీ అదే పనుపున మల్లాది వారి ఈ "కృష్ణాతీరం"
దివిసీమలో ఎండలు ముదిరాయి. అవనిగడ్డ గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యంలో ఇంచుమించూ అందరూ మోతుబరులే. అయితే చాలీచాలని సంసారాలూ ఉన్నాయట. పూవుల్లో పత్రిలాగ..
శాస్త్రం చదువుకోవెళ్ళి, అబ్బక పురాణం చెప్పుకో సిధ్ధపడ్డాడు అన్నప్ప. మోస్తరు గృహస్థు. పురాణ శ్రవణానికైనా, పూజకో పుణ్యహావచనానికైనా.. ఆఖరికి స్థోమతలేనివారింట పొడితాంబూలానికైనా చిరునవ్వుతోనూ, మాటమంచితనాన తానున్నానంటాడు.
అతగాని ఒక్ఖగానొక్క కూతురు కామాక్షి. అన్నప్పా, ఆతని ఇల్లాలు అనంతలక్ష్మీ చెప్పుకోదగ్గ రూపసులు కాకపోయినా కాముడు ముత్యమల్లే ఉంటుంది. ఎనిమిదేళ్ళు దాటింది. ఏటికేడూ నేవళం దేరుతూ ఆ పిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే తన ఇల్లు సామాన్యుల ఇల్లు కాదు... జమీందారు దేవిడీ అనిపించేది అన్నప్పకి. గ్రామం మొత్తానికి సంపన్న గృహస్థు రామావధాన్లు. అతనికి ఒక్కగానొక్క కొడుకు, ఒకే కూతురు. పిల్లవాడు సుబ్బరాముడు చురుకైన వాడు. దిప్పకాయితనం ఏ కోశానా లేదు. పిల్లని సుఖపెడతాడు. కనుక కాముడిని ఆ ఇంట్లో పడేయాలని నిర్ణయించుకున్నాడు అన్నప్ప.
ఈలోగా రామావధాన్లు తన కూతురు అమ్మడికి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. అదేదో అయ్యాక తన కూతురి సంగతి కదుపుదామనుకున్నాడు అన్నప్ప. అమ్మడిని చూసుకోడానికి బందరు నుంచీ రమణయ్య గారూ, లచ్చమ్మ గారూ బండి కట్టించుకుని వస్తున్నారు. ఊళ్ళోకి వచ్చాక విడిది అన్నప్ప ఇంట్లోనే అని ఖాయమైంది. ఇంతలో యెడ్లు బెదిరి బండి పిల్లబోదెలో పడింది. అపశకునమని లచ్చమ్మ గారు గింజుకుంది. సరే ముందుకే వెళ్దామని నిశ్చయించుకుని అన్నప్ప ఇంటికి చేరారు. భోజనాలు కానిచ్చుకుని రామావధాన్ల ఇంటికి చేరేసరికి వేళ మించిపోయింది. నిక్కీనీలిగీ ఆలస్యంగా వచ్చారని, కారణం తెలుసుకోకుండా పెళ్ళివారి పట్ల పెడమొహం పెట్టి అహం చూపించాడు రామావధాన్లు. మంచివాళ్ళు కనుక పిల్లను చూశామనిపించారు. ఇంటికి వెళ్ళి పక్షం దాటినా ఏ కబురూ రాకపోయేసరికి పిల్ల తండ్రి కంగారుపడ్డాడు. తప్పేది లేక అహం చంపుకుని బందరు వెళ్ళి అడిగాడు. లచ్చమ్మ గారు చెరిగేసింది. మాటపడ్డ రామావధాన్లూ ఊరుకోలేదు. వెనక్కి వచ్చి అన్నప్ప మీద గయ్యిమన్నాడు. "పప్పూ అన్నంలో ఏం కలిపి పెట్టావ్ బాబూ ఆ బందరు వారికి.. చక్రం ఇట్టే తిప్పేశావ్!" అని నింద వేశాడు. ఇదేం పాపమని అన్నప్ప, తన పిల్లని రామావధాన్లు కొడుక్కి ఇద్దామనుకున్నవాడు కనుక, అతని పిల్లకి బెడిసిన సంబంధం సానుకూలపరచడం తన బాధ్యతనుకున్నాడు. బందరు పయనమయ్యాడు.
లచ్చమ్మ గారు మనసులో మాట బయటపెట్టింది. ఆమె కాముణ్ణి చూసి ముచ్చటపడిన మాట వాస్తవం. అప్పుడు అన్నప్ప అన్నాడు కదా, "అమ్మా! నా పిల్ల మేలుకోరి, ఆ పిల్లకు ద్రోహం జేస్తానా? యింతకు పూర్వం నేనూ పేరాశకు బోయినాను. అవధాన్లు గారి పిల్లవాడికి మా అమ్మాయిని చేసుకుంటారేమో, అనుకున్నాను. ఇంత జరిగిన మీద యిహ అడిగేందుకు నాకు నోరు రాదు. మా కాముడి మీద మీకు వాత్సల్యం కలిగింది గనుక, మీ యెరికనే ఎక్కడన్నా, ఓ సంబంధం చూసి మీ ఎదుటనే ఉంచుకోండి." అన్నాడు. లచ్చమ్మ గారు లక్షణమైన సంబంధం కుదిర్చింది కాముడికి. ఎవరోకాదు.. అమ్మడి పెళ్ళిచూపులకి బందరు నుంచి వచ్చిన పురోహితుడు యెగ్గన్న కొడుకే. అన్నప్ప మాట మేరా, అనుకున్నట్టే అవధాన్లు గారి అమ్మడు లచ్చమ్మ గారి రామశేషు పెళ్ళామయింది.
పెరిగి పెద్దై అమ్మడు, కాముడు అత్తవారిళ్ళకి వెళ్ళారు. కూతురు కాపురానికి వెళ్ళిన ఏడాదికి అన్నప్పకి కొడుకు పుట్టాడు. వాడి పేరు బుచ్చన్న. అక్కడ కాముడి కాపురం మూడు పువ్వులూ ఆరు కాయలై ముచ్చటగా సాగిపోతోంది. పురోహితుడు యెగ్గన్న కొడుకు దర్భపోచలు చంకనెట్టుకుని ఇల్లిల్లూ తిరక్కుండా, సంస్కృతం ముక్కలు నేర్చి, పండితుడై తిరుపతి మహంతువారి పాఠశాలలో ఉపాధ్యాయుడైనాడు. కాముడు అందలమెక్కింది. కానీ అమ్మడి కాపురంలోనే ఏవో కలతలు. ఇంతలో అవధాని గారి కొడుకు సుబ్బరాముడు పాలెంలో ఓ పిల్లని చూసి ప్రేమించి పెళ్ళాడాడు. కులం కాని పిల్లని మనువాడాడని అవధాన్లు గారు కొడుకుని వెలేశాడు. అలా ఉంటే బానే ఉంది.. ఒకనాడు సుబ్బరాముడు తండ్రిని ఆస్తిపంచమని వచ్చి కూర్చున్నాడు. కాదన్న తండ్రిపై నోరూ చెయ్యీ ఆచుకోలేదు. అలా కొడుకు తండ్రిని అంటూంటే ఊరు ఊరంతా ముక్కున వేలేసుకుని ఊరుకుంది కానీ, యెవరికీ లేని జోక్యం అన్నప్ప కొడుకు బుచ్చన్న కలిగించుకున్నాడు. కుర్రవాడు మాంచి రెక్కకట్టి - పిక్కకట్టి జవమీదున్నాడేమో - అవధాన్లు గారి కొడుకుని పట్టుకుని, ఊరంతా పొర్లు దణ్ణాలు పెట్టించి పొలిమేర మీదకి గొడ్డుని తరిమినట్టూ తరిమేశాడు.
అన్నప్పకి ఈ సంగతి తెలియగానే అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. కొడుకుని వెంటబెట్టుకుని పాలెం బయల్దేరాడు. "కొడుకు యెలాంటి వాడు కాని, తండ్రికి వాడి మీద మమకారం పోదు నాయనా! తండ్రి మనసు ఎంత క్షోభిస్తుంది?" అని బుద్ధి చెప్పి, అటూ ఇటూ ఉన్న తప్పుల్ని బేరీజు వేస్తూ పాలెం చేరారిద్దరూ. అక్కడ ఉన్నదేమో సుబ్బరాముడు, పెళ్ళాం లచ్చి, ఆమెను పెంచిన మేనత్త రత్తాలేమో లోకగయ్యాళి. తీరా చూసి అన్నప్ప వెళ్ళేసరికి లచ్చి ఒక్కర్తే ఉంది. ఉయ్యాల్లో పిల్లాడు, తొలిచూరు పిల్ల ఏణ్ణర్ధపుది తువ్వాయితో పాటూ చిందులేస్తోంది.
అన్నప్ప ఆ ఇంటి కళ చూసి విస్తుపోయాడు. లచ్చిని సయాం తన రెండో పిల్లని చేసుకున్నాడు. బుచ్చన్నని సుబ్బరాముడి దగ్గరకి పొలానికి పంపించాడు. "ఒరే బుచ్చీ.. నీవు అలా పోయిరారా! తంతే పడు! అంటే - మింగు! ఇవాళ మీ ఇంట్లో వారం జెప్పుకున్నాం అంటే వాడు పరిగెత్తుకొస్తాడు." అంటూ..
'తండ్రీ కొడుకుల్ని విడదీశాను. ఈ పాపం ఎలా పోతుంద'ని ఏడుస్తున్న లచ్చిని ఓదార్చాడు. "పిచ్చిదానా! నీవు చేసిన పాపం అల్లా ఒక్కటే! పిల్లా పాపల్తో ఇలా చల్లగా ఉండటం. యిలాటి పాపానికి ఒడిగట్టేందుకైనా ఎంత పుణ్యం జేసుకోవాలే! యీ స్వస్తికేం గానీ, పెందరాడే కాస్త పప్పూ అన్నం బెడుదూ! చుట్టాలొచ్చారని, నవకాయ పిండివంటలూ జేసేవ్. వంకాయ నాలుగు పచ్చాలు చేసి పోపులో వేసి, ఆనపకాయ మీద యింత నువ్వుపప్పు చల్లి, అరటిదూట మొఖాన యింత ఆవెట్టి, తోటకూర కాడల్లో యింత పిండీబెల్లం పారేయ్. కొబ్బరీ, మామిడీ, అల్లం యీ పచ్చళ్ళు చాల్లే - పెరుగులో తిరగబోత పెట్టి, దాన్లో పది గారెముక్కలు పడెయ్. రవంత శనగపిండి కలిపి, మిరపకాయలు ముంచి చమురులో వెయ్. సరే క్షీరాన్నమంటావా, అదో వంటా? ములక్కాయలు కాసిని వేసి, పులుసో పొయి మీద పడేయ్, యీ పూటకి యిల్లా లఘువుగానే పోనీయ్.. ఇదిగో! నేనూ స్నానం జేసి వస్తున్నాగానీ, ఈలోగా, ఓ అరతవ్వెడు గోధుంపిండి తడిప్పెట్టూ, రత్తమ్మొస్తే నాలుగు వత్తి ఇలా పడేస్తుంది.. మధ్యాహ్నం పంటి క్రిందకు వుంటాయ్!" అని పురమాయించాడు. లచ్చి నవ్వింది.
ఆపై లచ్చి మేనత్త పరమగయ్యాళి రత్తమ్మచేతా అన్నప్ప దండం పెట్టించుకున్నాడు. 'ఏ కులంలో గాని, శ్రోత్రియులంటూ ఉంటారని' ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పాడు. ముక్కోటి దేవతల కథల్లో లొసుగుల్నీ బట్టబయలు చేసి ఋజువు చూపించాడు. చిత్తశుద్ది, సదాచారం, వినయం, వివేకం - ఇవి బ్రాహ్మణ లక్షణాలు. అంతేగాని, ఫలాని యింట్లో పుట్టడం కాదన్నాడు. "యిప్పటి మన సంకుచిత దృష్టితో చూస్తే - మన లెక్క ప్రకారం, మంత్రద్రష్టలైన ఋషుల్లో, యెంతమంది బ్రాహ్మణులున్నారు? ఒక్కడో అరో మినహాయిస్తే - తత్తిమ్మా వారందరూ, అనులోమ ప్రతిలోమముల ఫలితాలే కద!" అని ఇంతటి నిక్షేపాన్ని దూరం చేసుకున్న రామావధాన్లదే దురదృష్టమని తెగేసి చెప్పాడు.
తండ్రిని తలుచుకుని ఏడ్చాడు సుబ్బరాముడు. "మామా! నా మూలంగా మా నాన్న నలుగురి నోళ్ళలోనూ పడాల్సి వచ్చింది. సంతానం కలిగితే ఉత్తమ గతులు కలగడం మాటేమో కాని, బతికుండగానే యిలా అధోగతి పాలు కావడం, ఇది వారి పాపమా, మా పాపమా! కావాలని కాళ్ళు గడిగి పిల్లనిస్తే, మా బావ, ఆ దౌర్భాగ్యుడు అట్లా చేశాడు. వాడంటే పరాయివాడు. మరి నేను చేసిన నిర్వాకమేవిటి?" అన్న సుబ్బరాముడికి ఒకే ఒక్ఖ మాట చెప్పి లేచి చక్కా వచ్చాడు అన్నప్ప.
"యీ నిర్వాకం జేశావ్! యింతవరకూ బానే వుంది. ఇహ ముందైనా నీవూ, నీ పిల్లలూ లక్షణంగా ఉండాలి అంటే ముందు నీ మంచి నువ్వు చూసుకో! అవతలివాళ్ళకోసం అఘోరించడం మానెయ్! తనకు కానినాడు తండ్రి పినతండ్రితో సమానం! వారి పుణ్యం బాగుంటే మనుమల్నీ, మనుమరాళ్ళనీ ఎత్తుకునే యోగం ఉంటే, బిర్రబిగిసినవారే దారికి వస్తారు. రారో - ఎక్కడి వారక్కడ గప్ చుప్, మరో ఆలోచనే వద్దూ అంటా!"
వెనక్కి వచ్చేసరికి, కాపురం చెడి ఇంటికి చేరింది రామావధాన్లు కూతురు. రయ్యని తామసం చూపించాడాయన యధావిధిగా! బందరు వెళ్ళి వాళ్ళని దులిపేసి అట్నుంచటే కాశీకి పోతానని శపథంచేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కూతురితో పాటూ ఏడుస్తూన్న అవధాన్లు గారి భార్య శాంతమ్మని ఓదార్చారు అన్నప్ప, అనంతలక్ష్మి. ఇక అమ్మడి కాపురం చక్కదిద్దే భారాన్నీ భుజాలమీద వేసుకున్నాడు అన్నప్ప.
"అన్నప్ప మామా! నాకు పిల్లలంటే అసహ్యం. ఆయనకి ప్రాణం. చీటికీ మాటికీ కవ్వించా. నేను కజ్జాలాడా! 'నువ్వుంటే చాలదూ వేయిమంది పిల్లల పెట్టు. నువ్వు గొడ్రాలివి అయినా, కొండముచ్చువి అయినా యీ ఇంటి కోడలివి.' అని నవ్వేవారాయన. చిర్రెత్తుకొచ్చేది.." అని చెప్పిన అమ్మడి కాపురంలో అసలు తగువేమిటి? రాలుగాయి పెళ్ళాన్ని భరించీ భరించీ తెగించిన రామశేషు ఏం చేశాడు? అన్నప్ప వాళ్ళ కాపురాన్ని ఏ దరికి చేర్చాడన్నదే మిగిలిన కథ.
అల్లిబిల్లిగా వెయ్యిన్నొక్క కబుర్లని అల్లి చెప్పిన కథ ఇది. నిజంగా వేయి తరగల కృష్ణమ్మ ఒడ్డున కూర్చున్నట్టే! ప్రతివాక్యం వెనక్కి వెళ్ళి చదువుకున్నాను. ఆ అసామాన్యమైన కథనపు మెళుకువల్నీ, నుడికారపు జిలుగుల్ని తరచి చదువుకుని మురుసుకున్నాను. అవును మరి! వచనరచనకి మేస్త్రి - రామకృష్ణ శాస్త్రి! "పాట అర్ధం కాకపోతే నువ్వు నీ చూపు మార్చుకో. తెలుగు నేర్చుకో." అని చెప్పిన ధిషణాహంకారం మల్లాది వారిది. అలాంటివారి వాక్యం పొల్లుబోదు. "కథ ఎటువెళ్ళింది? ఈ విషయం కథకి అవసరమా?" అనే కత్తెరలు, మేధస్సు పక్కన పడేసి, పైడిపల్లి మామ్మగారి కథలు విన్నంత అమాయకంగా, ఆసక్తిగా, నమ్మకంగా చదువుకున్నాను. నూటపదేళ్ళ క్రితం పుట్టిన ఓ మనీషిలో ఇంత ప్రజ్ఞ, అనురాగం, కోణంగితనం, సారస్యం, తెగింపు ఉన్నాయి కదా.. అని అడుగడుగునా అబ్బురపడడమే మిగులుతుందెప్పుడూ!
"నాలుగు కులాలు అంటే - అది లెక్క వరుస కానీ, ఒకదానికి ఒకటి తీసికట్టని కాదు. తల్లి కడుపున తొలిచూలు బిడ్డ బ్రాహ్మడూ, నాలుగోవాడు శూద్రుడూ అవుతాడా మన వెర్రి కానీ.." అన్న అన్నప్ప మాటకి మారాడగలమా!
"దాంపత్యం అనేది, తమలపాకు లాటిది. ఆదిలో - లేతలౌజు, - ఆపై కవటాకు, పైపై పండుటాకు. దాంపత్యమంటే, తాంబూలమంటే, ఆద్యంతం రసవంతమే కాదుషోయ్!" అని సుబ్బరాముడిని ఎగసనదోసి, సారస్యం బోధించిన అన్నప్పని మరచిపోగలమా!