Showing posts with label పతంజలి. Show all posts
Showing posts with label పతంజలి. Show all posts

Tuesday, June 4, 2013

అలమండ రాజుగోరి గానమైన బేపి కత

'ఎంత ఎద్దైనా గిద్దెడు పాలైనా ఇవ్వకపోతుందా?' అన్నంత ఆశపడ్డాను.. దాని పేరు విని. కథ కొసాకూ మానికెల కొద్దీ సుద్దులు మాత్రం గరిపి పంపింది.

దాని ప్రవరేమైనా ఆషామాషీ అనుకున్నారా.. తాండ్ర వారింట పుట్టి, చెలికాని వారింట కొన్నాళ్ళు పెరిగి, ఉప్పలపాటి వారింట పెద్దై.. కాకర్లపూడి వారి మన్ననలందుకుంది. "చెవులు రిక్కించుకుని, తోక నిగిడించి, బోర విరుచుకుని నడుస్తూంటే.. చూసి తీరాలోయీ.. నల్ల పులోయీ.. ఏనుగైనా అలా నిలబడిపోయి దానిని బయ్యం బయ్యంగా చూడవలసిందే!!" అని సొయానా దాన్ని సాకుతున్న రాజుగోరు చెప్తూంటే.. నల్ల సిందువల్లే నడిచొస్తున్న దాని రాచఠీవి కళ్ళక్కట్టేయట్లేదూ! అదే బొబ్బిలి... వీరబొబ్బిలి. అలమండ ఊళ్ళో, ఉప్పలపాటి ఫకీర్రాజు దగ్గర పెరుగుతున్న జాతి కుక్క. భీకరమైన వేటకుక్క.

గాలి తోటలోంచి దూసుకుని వస్తున్నది. రెండు నిముషాల్లో వేట జట్టంతా మళ్లీ మామిడితోటలోకి ప్రవేశించారు. ఎండిపోయిన ఆకులు కాళ్ళ కింద నలుగుతున్నాయి. తోటలో చీకటి మరింత గుబురుగా వున్నది. బొబ్బిలి ఒక్క లాగు లాగి పరుగు మొదలుపెట్టింది. పడమటివైపు నుంచి సడ్ సడ్ సడ్ మని ఏదో భారీజంతువు పరిగెడుతున్నట్టు చప్పుడు వినిపిస్తోంది. బొబ్బిలి గుర్రుగుర్రుమంటూ హడావిడి పడిపోతున్నది. దాని చెవులు రిక్కబొడుచుకుంటున్నాయి. మెడమీదా, మూపుమీదా దాని చర్మం అలలు అలలుగా విరుచుకుపడుతున్నది. అక్కడి జూలులోని వెండ్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఒక్క గుంజు గుంజింది. బొబ్బిలిని పట్టుకున్న గోపాత్రుడి చేతులోంచి తాటికొసలు జారిపోయాయి. బొబ్బిలి రెప్పపాటులో చీకటిలో కలిసిపోయింది.

వేటకుక్కలతోనూ, ఈటెలతోనూ జరిగే సేరీవేటకి బయలుదేరిన రాజులు.. తమను నడిపించి, వేట జంతువుని చూపించే విషయంలో తమ కుక్కల ఆఘ్రాణశక్తి మీద ఆధారపడతారు. కుక్క ఉరుకుని బట్టి, ఆవేశాన్ని బట్టి జంతువు ఎంత దగ్గరలో ఉందో వేటగాడికి అర్ధమయిపోతుంది. శిక్షణ పొందిన కుక్కలు వేటగాడికి జాగా ఇస్తూనే జంతువుని చుట్టుముట్టి నానా అల్లరీ పెడతాయి. అయితే ఆ రాత్రి వేటలో ఇంతల్లరి చేసింది కదా ఈ బొబ్బిలి.. ఈ కుక్క ఎంతుందో దీని గుండెకాయా అంతే వుంటుందన్నాడు రాజుగోరు. వేటపొలం మీద ఒంటి పంది దీని కంటపడడానికి వీలులేదు. పడిందో... దగ్గర ఏ చెట్టుంటే ఆ చెట్టెక్కేసి ఆ ఒంటిపంది కనుచూపు మేరలో లేకుండా వెళ్ళిపోయేవరకూ దిగదు. అంత జాగర్తయిన కుక్క. ఆరోగ్యం మా జాగ్రత్తగా కాపాడుకుంటుంది.. ఇదీ పాపం రాజుగోరి మాటే! భవిషం తీసీసేరు కదూ! బొబ్బిలీ.. బొబ్బిలి..!! ఆకారం భీకరం అసలు శూన్యం అంటే ఇదేనన్నమాట!

చిలుకలూ, గోరువంకలు లగాయితూ పశుపక్ష్యాదులచేత మాట్లాడించడం, సుద్దులు చెప్పించడం కవిగారు రాసే కావ్యమన్నాక చాల బోలెడు సందర్భాల్లో కద్దు. అచ్చం అల్లాగే.. పోకడలు పోయే కుక్కోటి భూపెపంచకంలో ఉందంటే అది బొబ్బిలే. మాట్లాడే కుక్క ఇస్కో అంటే ఉస్కో అందని చెప్పుకోడమే కానీ, పుట్టి బుధ్ధెరిగాక ఇస్కో అన్నదీ లేదు. ఉస్కో విన్నదీ లేదు. సరే ఈ బొబ్బిలి సంగతేవిటో చూద్దామంటే దాని సిగదరగా.. ఎన్ని వేషాలూ.. ఎన్నెన్ని కబుర్లూ.. మా గానవైన బేపి కాదో!!

తన పరువు తీసిన రాజుగోరి మీద అలిగి.. సన్నాకుల మావిడి చెట్టు కింద, మట్టిలో గుంట చేసుకు బజ్జున్న బొబ్బిలి అలక చూసి తీరాల్సిందే. ఎంత కోపం!! ఏం పౌరుషం!! రాచకూడు తిన్నాక ఆ మాత్రం రోషం ఉండద్దూ! అలిగి కూర్చున్నా ఆకలవుతుంది కదా మరీ! బోయినం చేసి బతకమని బగమంతుడు శపించేడు గాబట్టి, ఇంతటిదైన వీరబొబ్బిలి కూడా కందా ఇంట్లోంచి వస్తున్న ఘుమఘుమలకి చిత్తైపోయి, గిన్నెలు గానీ కడిగీసేరంటే చాలా నష్టం జరిగిపోతుందనే విషయాన్ని గ్రహించి.. 'బోయినం అంటే అదేం పోయిందని తినేస్తా'నని బయలుదేరింది. అలా అని పౌరుషం చచ్చి మాత్రం కాదు.. అక్కడే మహారాజశ్రీ బొబ్బిలి విలక్షణత బయటపడుతుంది. మనుషులకైతే బోయినం కంటే పౌరుషం ముఖ్యం గావొచ్చు. కుక్కలకైతే అన్నిటి కంటే విశ్వాసమే ముఖ్యం గావొచ్చు. ఇక్కడ బొబ్బిలి మాట్లాడే కుక్క కదూ.. అందుకని మనుషులకుండే హక్కులూ, కుక్కలకుండే సదుపాయాలూ ఆకళింపుచేసుకుంది. అందుకే పోలుగు పిట్టల మాంసం కూరలో హక్కుభుక్తమైన తన వాటా తను తినడానికి "నా ఇంట్లో నన్నొకడు పిలిచేదేంటి? నేనే ఇంట్లో లేకపోతే యీ కొంపకి కళేమిటి?" అని తన తరపు వకాల్తా తానే తీసుకు వాదించుకు నెగ్గింది. తర్కజ్ఞానం లేకపోతే కడుపు మాడ్చుకోవలసి వస్తుందీ అని తెలుసుకోవాలిక్కడ. ఇక కుక్కలకుండే సదుపాయాల సంగతి మా బాగా ఎరిగినది కనుకే.. "వంటగది తలుపు వెనక్కి ఓ సారి లాగి మళ్ళీ ముందుకు తొయ్యి.. తెరుచుకుంటుంది." అని తలుపు దొంగ చేతే తీయించి మరీ, "ఈ ఇంట్లో దేనిలోనైనా నాకు వాటా వుంది. నా వాటా మాంసం రేపు ఎలాగూ నాకు కట్టబెట్టాలి. నాకిప్పుడు తినాలని వుంది కాబట్టి నా వాటా నాకు యిచ్చీమంటున్నాను" అని దర్పంగా దొంగ చేతే అన్నం కలిపించుకుని తినగలిగింది. దీన్ని బట్టి వ్యవహారజ్ఞానం బొబ్బిలికి జాస్తి అనిపించడంలేదూ!

ఊరు ఊరంతా రెండు వర్గాలైపోయి.. భూమి గుండ్రంగా పంపర పనసకాయనాగుందా? బల్లపరుపుగా పెదపాత్రుడి మంచంనాగుందా? అని జట్టీకి దిగి, సంతబయల్లో దొమ్మీలో కొట్టేసుకుందామనీ, గెలిచినవాడేం చెప్తే భూమాత అలాగే ఉండితీరాలనీ అనేసుకున్నారా..


బొబ్బిలి "మూర్ఖజనంతో జట్టీకి దిగకూడదు" అంది.

భూమి చదరంగా ఉందన్న గోపాత్రుడే రైటంది.

"ఒకడు మనకి చెప్పడవేటోయ్ గోపాత్రుడూ.. భూ ప్రపంచకంలో మనకి ఏదైనా చెప్పగలిగిన దిల్ ఎవడికున్నది?" అని తెగేసి రొమ్మువిరిచింది.

"ఫలానీ రాజు ఫలానీ కుక్కని పెంచి చెడిపోయినాడని జనం చెప్పుకుంటే లోకంలోని కుక్కలన్నిటికీ మచ్చగాదా?" అని ఆవేదన చెందింది.

"బోయినం ముఖ్యమా? విశ్వాసం ముఖ్యమా?" అనే ధర్మసందేహానికి ఆకటివేళల ఏది ముఖ్యమో కచ్చితంగా చెప్పింది.

రావిచెట్టు కింద నిలిచిన రాజుల ఫౌజులో ఫకీర్రాజు పక్కనే నిలబడింది.

జామి కోర్టులో "బొబ్బిలి" అనే గ్రామసింహం మీద కేసు మోపబడింది.



కాబట్టీ.. ఎంతసేపూ కుక్క ఇంటి కాపలాకి పనికొస్తాదా?

వేటజేయడానికి పనికొస్తాదా?

కోసేసి ఊరగాయ పెట్టుకుని, దొబ్బితిండానికి పనికొస్తాదా? అని ఆలోచిస్తారు గానీ.. "కుక్క కోసమే కుక్క"



***

వీరబొబ్బిలి మానవజాతికి నేర్పిన పాఠాల పూర్తి పాఠాన్ని K.N.Y. పతంజలి వ్యంగ్య రచనలలో చదవాల్సిందే..



* బేపి - కుక్క





Monday, January 28, 2013

ఎవరీ పతంజలి!!

అలివిని బలివి కొడితే బలివిని బ్రహ్మదేవుడు కొట్టాట్ట! "నా ఉదయపు కాఫీ కప్పునీ, అర్ధరాత్రి ముసుగేసుక్కూర్చుని చూసే కామెడీ సినిమానీ తప్ప దేన్నీ నేను సీరియస్ గా తీసుకోనండీ!" అని జోకాననుకుని ఎవరితోనో ఇలా ప్రగల్భాలు పోయానో లేదో, అలా ఠపీమని మొట్టికాయ తిన్నాను. అది నాకు కపాల మోక్షాన్నిచ్చినంత పనిచేసిన విధంబెట్టిదనినా..

మా ఇంటి పంచపట్టున గోడకి వేలాడే సన్మానపత్రం చాలా బోలెడు సార్లు చదివుంటాను. పటం కట్టించిన అద్దం వెనక సాలెగూళ్ళని చిత్రంగా చూస్తూ.. కొంచెం కొంచెంగా చెద కొరికేస్తున్న కాగితపు వైభవాన్ని లెక్కేస్తూ.. అటొచ్చీ ఇటు పోయీ ఒక్కో అక్షరం నవులుతూండేదాన్ని. మా తాతగారి పదవీవిరమణ మహోత్సవానికి స్కూలు వాళ్ళిచ్చిన పత్రమది. వందిమాగధులు "రాజాధిరాజ రాజమార్తాండ.. గండరాయవర.." అని ఉబ్బేసినట్టూ సంస్కృతసమాసభూయిష్టమైన సంబోధనలతో హడావిడిగా ఉండే ఆ పత్రంలో.. ఓ పిలుపు మాత్రం మహ నచ్చేసేది. "చతురవచోనిధీ..!"

గురితప్పని చమత్కారబాణాలు సంధించగలిగే విలుదాలుపులెంతమంది!? ఆ పత్రంలో మిగిలిన పిలుపుల్లో, మాటల్లో నిజానిజాలెన్నో కానీ, ఈ పిలుపు మాత్రం పచ్చినిజం. చమత్కారం చెమక్కుమని మెరిసే మాట తీరాయనది. కానివారిపై సుతిమెత్తని వ్యంగ్యాస్త్రాలు సంధించి, వారు "మనమీదేనర్రోయ్!" అని తేలుకుట్టినదొంగల్లా జారుకునేలా చేసే నైపుణ్యం ఆయన సొత్తు. అంతేనా.. కబుర్లు పొడుపుకథల్లా ఉండేవి. భలే బావుండేవి. నిండుసభలో మాట్లాడుకున్నా నర్మభాషణ చేసి విషయం అందజేయగలగడం, శరములవలెనే చతురోక్తులనూ చురుకుగ విసిరే నైజమూ.. ఆషామాషీ యేం కాదు! అలా అని మాట సొగసు.. వసివాడకూడదు. పలుకు పరుషంగా గుచ్చుకోకూడదు. ఆ సమతుల్యం తెలిసిన వారి ఒక్కోమాటా పటం కట్టించుకోదగినదే! అలాంటి మనిషిని మరొకరిని చూశాను. పూర్తిగా కాదు.. మచ్చుకే! పతంజలిని..

పూల తీగె కాళ్ళకు చుట్టుకుని కారెనుబోతు ఆగిపోయినట్టు ఆ వేణునాదం విని విశ్వనాథం ఆగిపోయాడు.
జనప్రవాహం పై నుంచి వంతెన. దానిమీద రైలు పట్టాలు.
వంతెన గోడ నానుకుని ఒక గుడ్డి మనిషి.
అతని బండపెదవుల నానుకొని ఎప్పుడూ ఒక మురళి..
ఆ మురళి రంధ్రాల నుంచి కాటుక పొగలై, సర్పాలై జరజర పాకివచ్చే పాటలు.
విశ్వనాథానికి మోటరుసైకిలు చప్పుడులో ఆ పాటలు ఎప్పుడూ వినిపించవు.
వంతెన పై నుంచి వెళ్ళిపోయే రైలూ ఆలకించదు.
వంతెన కింద నుంచి ప్రవహించే జనమూ ఆలకించరు. మోటరు సైకిల్ మీద వెళ్ళిపోయే విశ్వనాథం ఎన్నడూ వినలేదు.
గుడ్డివాడి పాటలు గరికపూలై ఆ రోడ్డు నిండా గుట్టలు గుట్టలైతే విశ్వనాథం వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు.
గుడ్డివాడి పాటలు సీతాకోకచిలుకలై మబ్బుల్లాగ వీధినంతా ఆవరిస్తే విశ్వనాథం వాటిని చీల్చుకుని వెళ్ళిపోతాడు.
ఒకరోజు వంతెన దగ్గర అతని మోటరు సైకిల్ ఆగిపోయింది.


ఆపై ఏమయ్యిందో.. అదే కథ. చూపున్న పాట కథ.




ఒక్ఖ కథ చదివి, కొన్ని వ్యాసాలు చదివీ, అతని పై రాయబడిన ఎలిజీలు చదివీ.. ప్రేమించాల్సిన పని లేదు. కానీ.. నా కప్ ఆఫ్ టీ కాని దానిని నా చేత వైనంగా తాగించేసిన అతని చాతుర్యానికి ముచ్చటగా ఉంది. పదిలంగా కాపాడుకొస్తున్న నా సున్నితత్వాన్ని.. ఉహూ సున్నితత్వమనే ముసుగేసుకున్న "లోకాన్ని చూడలేనితనాన్ని" తుత్తునియలు చేసేసి ఏం చూపించేస్తాడో అని భయమేస్తోంది. ఇన్నాళ్ళూ దిగనా, దూకనా అనే సంశయమే.. ఇప్పుడు దబ్బున తోసేశాడు. ఇక ఈదక తప్పదు.

ఇన్నాళ్లూ మురళి అంటే మధుమురళే!

కాలు చల్లదనాలొ!
కనలు తీయదనాలొ!
వలపు పిల్లన గ్రోవి
పిలుపులో! సొలపులో!


అలాంటిది ఇప్పుడు కాటుకపొగలాంటి పాట కమ్మేస్తున్న ఆ గుడ్డివాడి మురళి.. ఆ మురళిలో పతంజలి మ్రోగించిన పాట కూడా వినిపిస్తోందేవిటో! సరే తప్పేదేముంది కనుక!

ఇంతందంగా పఠితను కట్టిపడేయగల కలం.. ప్చ్..  కారణజన్ముడేమో! అనుకుంటూ పతంజలి తలపులు తిరగేసానా.. మొదటి పేజీల్లోనే ఆగిపోవాలనిపించింది. కారణం ఈ వాక్యాలు..

"మరణాలకు ముందు మాటలు వెనకమాటలు అక్కర్లేదు, అవసరమూ కాదు. మరణించినవారిని మాటల్లో, మాటల్తో బ్రతికించుకునే ప్రయత్నమే ఇది. ముందుకు మిగిలాడు పతంజలి. మనం వెనక మిగిలాం అంతే."
~ విశ్వేశ్వరరావు


నా స్వభావసిధ్ధమైన బెరుకు ఆపింది నన్నక్కడ. "పతంజలిని పూర్తిగా చదవకుండా.. ఇవన్నీ చదవాలా!" అని. కానీ కళ్ళు ముందుకు పరిగెట్టాయ్.. అక్కడో అయస్కాంతం ఉందిగా మరీ! "శ్రీశ్రీ సలహా!" విశ్వేశ్వరరావు గారి గొంతు పూడుకుపోయి శ్రీశ్రీ సలహాని కొనసాగింపుగా ఇచ్చారక్కడ!  ఇది పతంజలికే కాదు ఎందరెందరు రచయితలకో, ఉహూ ప్రతీ ఒక్కరికీనేమో..  సలహా! ప్రస్తావించకుండా ఉండలేని వాక్యాలు..

ఆంధ్రదేశంలో గొప్పవారు కావడానికి ఒక చిన్న ఉపాయం ఉంది. అది ఎవరూ అమలులో పెడతారనే నమ్మకం లేదు గానీ అయినా బయట పెట్టక తప్పదు. ఆంధ్రదేశంలో నువ్వు గొప్పవాడివి కాదలచుకుంటే ఒక్కటే మార్గం. చచ్చిపో.

అప్పుడు నీకు అఖండ గౌరవం జరిగితీరుతుంది. అదంతా నీకు కనబడదు - నిజమే, కానీ ఏ మృత్యువుకీ లొంగని నీ ఆత్మ ఒకటి ఏడిసింది కదూ! అది కనిబెడుతూనే ఉంటుంది నీకు జరిగే మర్యాదలన్నింటినీ. నీ మరణాన్ని పురస్కరించుకుని టౌను హాలులో జరిగే సానుభూతి సభలో నీ ఆత్మ చూరునుంచి వేళ్ళాడుతూ వినబడని కరతాళధ్వనులు చేస్తుంది.

ఇంకో సంగతి. నువ్వు ఆంధ్రదేశం నుంచి వీలయినంత హెచ్చు గొప్పతనం పిండుకోవాలంటే సాధ్యమైనంత దూరంగా పారిపోయి జీవించవలసిందని నా సలహా. ఎంత దూరం పోతే అంత పొడుగ్గా సాగుతుంది నీ పేరు.

తెలుగు పత్రికలన్నీ నీ మీద సంపాదకీయాలు వ్రాస్తాయి. వాటిని వ్యాస పిండాలని 'ఆరుద్ర ' లాంటి పెంకి పురుగు అంటేనేంగాక? తెలుగు పత్రికలో సంపాదకీయాలకి నీ అకాల మరణం (నువ్వెప్పుడు చచ్చిపోయినా అకాలమరణమే! సకాలంలో ఎవ్వరూ మరణించరనేది అందరికీ తెలిసిన రహస్యం.) కారణం కావడం కంటే నువ్వు కోరుకోదగ్గదేముంది?

బతికివున్న వాళ్ళ లోపాలను ఎంత శ్రద్ధగా స్తనశల్య పరీక్షగా యెంచగలరో, పోయినవాళ్ళ సద్గుణాలను కూడా అంతే నిర్దుష్టంగా నిష్కామకర్మగా బేరీజు వేయగలిగినవారు ఒక్క ఆంధ్రులే అని మరచిపోకు. నీ 'విలువ ' కు తగ్గమూల్యం ఒక్క ఆంధ్రదేశంలోనే లభించగలదని ఘంటాపథంగా చెప్పగలను. కానీ దీనికి ఒకటే షరతు వుంది. చచ్చిపోవాలి.


నవ్వుకుని పుస్తకం మూసేసాను. భలే శ్రీశ్రీ!! ఆరుద్ర - పెంకి పురుగు.. హహ్హహా..

ఈ సారి పుట్టింటికి వెళ్ళాలని ఉవ్విళ్ళూరడానికి కారణాల్లో.. వెంకన్న దర్శనం, వండిపెట్టాలనుకున్న భగినీహస్తభోజనం, నేరుగా అందుకోబోతున్న స్నేహహస్తపు కరచాలనం.. వీటితో పాటూ అక్కడ పొట్లకాయలా పటపట్లాడిపోతున్న తాతగారి చెక్కబీరువాలో మొన్నే వచ్చి చేరి నాకోసం ఎదురుచూస్తున్న "పతంజలి సాహిత్యసర్వస్వం" ఉంది. నా చేత సీరియస్ గా చదివించేసుకోవడానికి "అలమండ రాజుగారి అక్షరాలు" ఠీవిగా కొలువుదీరి ఉన్నాయి.

ఓసోస్.. మీ ఊరి వాడనా!? యెస్సెస్.. మా ఊరి వాడే!!
ఆ ఒకే ఒక గురజాడని, ఒక చాసో నీ, ఒక్ఖ రావిశాస్త్రినీ.. ఇచ్చిన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ.
ఒక్ఖ కథ చదివి ఇంతలా ఎలా!? చెప్తాను చెప్తాను..

వంటింటి చూరు కింద కూర్చుని అమ్మ చేత జడ వేయించుకుంటూంటే.. అమ్మమ్మ ఏం చేసేదంటే,  కుంపటి మీద శేరుగిన్నెలో ఎసరు మరగగానే కడిగితెచ్చుకున్న బియ్యం పోసేది. కాసేపున్నాక నేనూరుకోకుండా "కుతకుతశబ్దం కుండకనర్ధం.." అనగానే "ఏడ్సావ్ లేవే! ఇలా వంటింటిలోకి తొంగిచూస్తారనే ఇక్కడ జడల పీఠం పెట్టద్దనేదీ!" అని కసిరి కుంపట్లోంచి నాలుగు బొగ్గులు విసనకర్ర చివరతో బయటికి లాగిపడేసి, గిన్నె మీద ఇత్తడి సిబ్బి ఓరగా పెట్టేది. గుమ్మంలో కూర్చుని ఏ ఆకుకూరో బాగుచేస్తూనో, చిక్కుళ్ళు తుంపుతూనో.. అమ్మతో కబుర్లు చెప్తూ అలా వెనక్కి తిరిగి ఆవిరెలా వస్తోందో చూసి, లేచి వెళ్ళి గిన్నె దింపేసేది. ఇక అమ్మైతే మెతుకు పట్టి చూసేదనుకోండీ. ఆవిరీ చూసాను, మెతుకూ చూశాను.. ఇంకేం కావాలి! అన్నం మల్లెపువ్వల్లే ఉడికే ఉంటుంది.



(పతంజలి సాహిత్యం - అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, కినిగె.కాం లోనూ లభ్యం)