Tuesday, April 9, 2019

షెహెరజాదె

(Haruki Murakami కథకి అనువాదం)


********


వాళ్ళ కలయిక జరిగిన ప్రతీసారీ, ఆమె హబార కి ఆసక్తికరమైన వింత కథొకటి చెప్పేది. అచ్చం అరేబియన్ నైట్స్ లో రాణి షెహెరజాదె లాగే. అయితే హబార కి తెల్లారగానే ఆమె తల ఖండించే ఉద్దేశ్యమూ లేదు, ఆమె మర్నాటి ఉదయం దాకా అతనితో ఎప్పుడూ లేదు. ఆమె అలా కథలెందుకు చెప్తోందీ అని హబార ఆలోచించాడు. బహుశా ఆమెకి.. ఆ దగ్గరితనం తరువాత అలసిపోయిన క్షణాల్లో అలా మంచం మీద ముడుచుకుని అతనితో కబుర్లు చెప్పాలనిపిస్తుందేమో.  లేదా రోజంతా ఇంట్లోనే గడిపాల్సిన అతనికి కాస్త ఉపశమనం ఇవ్వాలనో.. 

హబార ఆమె పేరు 'షెహెరజాదె' అని పెట్టుకున్నాడు. ఆమెని ఆ పేరుతో ఎప్పుడూ పిలవలేదు కానీ, తన డైరీలో ఆమె గురించి రాసేటప్పుడు మాత్రం 'షెహెరజాదె ఇవాళొచ్చింది.' అని బాల్ పాయింట్ పెన్ తో రాసుకునేవాడు. ఆపై ఆమె చెప్పిన కథని చిన్నచిన్న పదాల్లో రాసుకునేవాడు. ఆ డైరీని ఎవరైనా చదివితే, ఆ పదాలతో కథని ఊహించడం అసాధ్యం.  

ఆమె చెప్పే కథలన్నీ నిజమో కాదో, సగం కల్పితమో.. అతను చెప్పలేకపోయేవాడు. నిజం - ఊహ, ఆకళింపు - ఆశ కలగాపులగంగా ఉండేవి. పెద్దగా ప్రశ్నలేవీ వెయ్యకుండా అతను ఆ కథల్ని ఆసక్తిగా, చిన్నపిల్లాడిలా వింటూ ఉండేవాడు. నిజానికి, అవన్నీ కల్పితాలైనా కాకపోయినా అతనికే తేడా ఉండేది కాదు.  

ఏదేమైనా షెహెరజాదె కి కథచెప్పే ఒడుపు చాలా బాగా తెలుసు. ఎలాంటి కథైనా మనసుకి హత్తుకునేలా చెప్పడం ఆమెకి అబ్బిన ఒక అద్భుతమైన విద్య. ఆమె గొంతు, ఆసక్తి సన్నగిల్లకుండా చెప్పడం.. కథ చెప్పే వేగం.. అన్నీ అద్భుతంగా ఉండేవి. వినేవాడిని మాయచేసి వేరేలోకానికి తీసుకుపోయి ఆలోచింపజేసి.. చివరికి వాడికి నచ్చే ముగింపు ఉండేలా చూసుకునేది. ఈ కథలో మునిగిపోయిన హబార కి.. ఒకే ఒక్క క్షణం నిజజీవితాన్ని మర్చిపోయే అదృష్టం కలిగేది. నల్లబల్లమీద రాతల్ని తడిబట్టతో తుడిచేసినట్టు, అతని బాధలూ, చేదు జ్ఞాపకాలూ అతన్ని క్షణకాలం విడిచిపోయేవి. ఇంకేం కావాలి! ఆ మరపు కోసమే పాకులాడే అతనికి.. 

షెహెరజాదె కి ముఫ్ఫై ఐదేళ్ళుంటాయి. హబార కంటే నాలుగేళ్ళు పెద్దది. గృహిణి.. ఎలిమెంటరీ స్కూలుకెళ్ళే ఇద్దరు పిల్లలున్నారు. ఆమె రిజిస్టర్డ్ నర్స్ కూడా. అందుకే ఈ పార్ట్ టైం ఉద్యోగంలోకి వచ్చిపడింది. ఆమె భర్త మామూలు ఉద్యోగి. వాళ్లిల్లు హబార ఇంటికి ఇరవై నిమిషాల దూరంలో ఉందట. ఇవన్నీ ఆమే స్వయంగా చెప్పిన తన విషయాలు. హబార కి ఇవన్నీ నిజమో, కాదో తెలుసుకునే అవకాశం లేదు.. అవసరమూ లేదు. ఆమె తన పేరెప్పుడూ చెప్పలేదు. నా పేరు నీకెందుకు? కదా..అనడిగిందోసారి. నిజమే.. ఇలా గడిచినన్నాళ్ళూ ఆమె షెహెరజాదెగా మిగిలిపోవడంలో అతనికెలాంటి ఇబ్బందీ లేదు. 

ఆమెకి హబార పేరు తెలిసినా, అదేదో తప్పన్నట్టూ ఎప్పుడూ పెదవి విప్పి అతని పేరు ఉచ్ఛరించలేదు. 

చూడ్డానికైతే ఆమె అరేబియన్ నైట్స్ లో క్వీన్ షెహెరజాదె లా అందంగా అస్సలుండదు. ప్రతీ అవయవంలోనూ కొవ్వు కూరేసినట్టూ, కళ్ళకింద ఉబ్బిన ముడతలతో ఉండే సామాన్యమైన గృహిణిలా కనిపిస్తుంది. ఆమె వేసుకునే బట్టలూ, మేకప్, ఆమె జుట్టు.. మరీ చుట్టుకొచ్చేసినట్టూ ఉండవు. అలా అని మెచ్చుకునేంత గొప్పగానూ ఉండవు. అతిసాధారణమైన కనుముక్కుతీరు. గుర్తుండిపోయే అందగత్తేమీ కాదు. ఆమె యే రోడ్ మీదో, ఎలివేటర్లోనో కనిపించినా, ఎవరూ ఆమెని పెద్దగా గమనించరు. పదేళ్లక్రితం మంచి వయసులో ఉండగా బావుండేదేమో.. కాలంతో వచ్చే మార్పులతో ఆమె సౌందర్య వైభవానికి తెరపడ్డట్టే లెక్క. 

హబారని చూడడానికి షెహెరజాదే వారానికి రెండుసార్లు వచ్చేది. కచ్చితంగా ఫలానా రోజనేమీ లేకపోయినా, శనాదివారాల్లోమాత్రం వచ్చేది కాదు. బహుశా కుటుంబంతో సమయం గడుపుతుందేమో మరి. ఆమె రావడానికి సరిగ్గా గంటముందు ఫోన్ కాల్ చేసేది. దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్ నుంచి హబారకి కావల్సిన సరుకులన్నీ కొనుక్కుని తన చిన్న నీలిరంగు మజ్దా కారులో తీసుకొచ్చేది. బంపర్ కి డెంట్ తో నీలిరంగుకి నల్లని మకిలి పట్టేసినట్టుండే ఆ పాతకారుని పార్కింగ్ లాట్ లో ఆపి, సరుకులన్నీ మోసుకొచ్చి బెల్ కొట్టేది. తలుపుకున్న కన్నంలోంచి చూసి హబార గొళ్ళెం తీసి, ఆమెని లోపలికి రానిచ్చేవాడు. ఆమె కిచెన్ లోకి నేరుగా వెళ్ళి, సరుకులు ఫ్రిజ్ లో సర్దిపెట్టేది. ఈసారొచ్చినప్పుడు ఏం తీసుకురావాలో చీటీ రాసుకునేది. ఈ పనులన్నీ అలవాటుగా చకచకా చేసేసేది. 

వంటింట్లో ఆమె పని అవగానే ఇద్దరూ నిశబ్దంగా పడకగదిలోకి వెళ్ళేవారు. ఆమె తన వస్త్రాలని ఒలిచిమంచంపై ఉన్న హబార పక్కకు చేరుకునేది.  వారి కలయికలో మాటలుండేవి కావు. అప్పచెప్పిన పనిని శ్రద్ధగా పూర్తిచేస్తున్నట్టు.. ఆమె నిమగ్నమైపోయేది. తను పీరియడ్స్ లో ఉన్నప్పుడు తన చేయి ఉపయోగించి పని పూర్తిచేసేది. తన పనిలో భాగమన్నట్టు యాంత్రికంగా, చురుగ్గా ఉండే ఆ తీరు చూస్తూంటే  తను ఒక నర్స్ అని చటుక్కున హబార మనసులో మెదిలేది. 

కలయిక తరువాత మంచం మీదే వాలి కబుర్లు చెప్పుకునేవారు. కచ్చితంగా చెప్పాలంటే ఆమె కబుర్లు చెప్పేది..అతను వినేవాడు. అక్కడక్కడా ఒక చిన్న మాటో.. ప్రశ్నో  కలుపుతూ. గడియారం నాలుగున్నర కొట్టగానే ఆమె చెప్తున్న కథ ఆపేసి, మంచం మీదనుండి దుమికి బట్టలు చుట్టబెట్టుకుని వెళ్లిపోయేది. ఇంటికెళ్ళి వంటచెయ్యాలని చెప్పేది. ఆమె చెప్తున్న కథ ఎప్పుడూ ముగింపుకొచ్చినట్టే ఉండేది. ఠంచనుగా అక్కడితో ఆపేసి వెళ్ళిపోయేది. 

హబార ఆమెను వీధితలుపు దాకా సాగనంపి, గొళ్ళెం పెట్టుకుని.. పరదాల వెనకనుండి ఆ నీలం రంగు కారు వెళ్ళిపోవడాని చూసేవాడు. సాయంత్రం ఆరయ్యాక సులువుగా క్లుప్తంగా వంట ముగించుకుని, ఒంటరిగా  తినేవాడు. పూర్వాశ్రమంలో అతనొక వంటవాడు. ఆమాత్రం వండుకోవడం అతనికెప్పుడూ కష్టమనిపించలేదు. భోజనం చేసేటప్పుడు స్పార్క్లింగ్ వాటర్ తాగేవాడు. అతనెప్పుడూ ఆల్కహాల్ ముట్టుకోలేదు. ఆనక డీవీడీ చూస్తూనో, పుస్తకం చదువుతూనో ఒక కప్పు కాఫీ తాగేవాడు. అతనికి బరువైన ఇతివృత్తంతో నిడివి ఎక్కువ ఉన్న క్లిష్టమైన పుస్తకాలంటే ఇష్టం. అంతకంటే చెయ్యడానికి పనేమీ లేదతనికి. మాట్లాడడానికెవరూ లేరు. ఫోన్లో మాట్లాడడానికి కూడా. కంప్యూటర్ కూడా లేదాఇంట్లో. న్యూస్ పేపర్ రాదు, టీవీ అతనెప్పుడూ చూడడు. ఏదైనా కారణానికి షెహెరజాదె రాకపోకలు ఆగిపోయినట్లైతే.. బయటి ప్రపంచంతో అతనికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్టే. 


అలా జరిగితే పరిస్థితేవిటని హబార ఎప్పుడూ బెంగడిల్లలేదు. కష్టమే కానీ, ఏదో ఒకలా నెట్టేయవచ్చని అతని ఉద్దేశం. 'నేనేం ఎడార్లో లేను..' తనకి తనే చెప్పుకున్నాడు. 'నేనే ఒక ఎడారిని..' మళ్ళీ సరి దిద్దుకున్నాడు. అతనికి ఒంటరిగా గడపడానికే ఇబ్బందీ లేదు. అతని పరిసరాలలో ఏకాంతానికి అతని మనశ్శరీరాలు అలవాటు పడిపోయాయి. అయితే, షెహెరజాదేతో మంచం మీద పడుకుని చెప్పుకునే కబుర్లు ఉండవంటే అతనికి చాలా పెద్ద కష్టమే. కచ్చితంగా చెప్పాలంటే, ఆమె చెప్పే కథలో తరువాతి భాగం ఉండదంటే ఎలా! 

ఆ ఇంట్లోకి వచ్చిన కొద్దిరోజులకే హబార గడ్డం పెంచడం మొదలుపెట్టాడు. చాలామంది మగాళ్ళకంటే అతని గడ్డం ఒత్తుగా పెరుగుతుంది. అతనికి తనలో మార్పు కావాలనిపించి మొదలుపెట్టినా.. దాని సంరక్షణకి ఎంత సమయమైనా సరిపోదు. అతనిక్కావలసిందే అది. కొంచెం గుబురుగా పెరిగిన గడ్డాన్ని దువ్వుకోడంలో సౌఖ్యాన్ని అతను అనుభవించేవాడు. ఆ మాటకొస్తే గడ్డంతో పాటూ మీసం, చెంపలూ కూడా. గడ్డం పెంచడంవల్ల ఇలా కాలక్షేపం చెయ్యొచ్చని అతనికి మొదటిసారి తెలిసింది. 

********

"గతజన్మలో నేనొక లాంప్రే ఈల్ ని.." అందామె ఒకరోజు. మంచంమీద పడుకుని ఉన్నారిద్దరూ. 'సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు..' అన్నంత సూటిగా, మాములుగా చెప్పిందామాట. లేంప్రే ఈల్  ఏవిటో, అదెలా ఉంటుందో హబార కి తెలీదు. ఆమె ఏం చెప్పబోతోందో అర్ధం కాలేదు. 

"లేంప్రే చేపని ఎలా తింటుందో తెలుసా?" అడిగింది. 

అతనికి తెలీదు. నిజానికి లేంప్రే చేపల్ని తింటుందని ఇదే మొదటిసారి వింటున్నాడు. 

"లేంప్రే కి దవడలుండవు. మిగిలిన ఈల్స్ కీ - లేంప్రేకీ అదే తేడా."

"ఆఁ..? ఈల్ కి దవడలుంటాయా?"

"ఎప్పుడూ చూడలేదా?" ఆశ్చర్యంగా అడిగింది. 

"అప్పుడప్పుడు తింటాను కానీ, ఎప్పుడూ వాటి దవడల్ని పరిశీలించలేదు."

"చూసి తీరాలి. ఏదైనా ఎక్వేరియం కి వెళ్లి చూడు. మామూలు ఈల్ కి దవడలు, పళ్ళు ఉంటాయి. కానీ లేంప్రేకి లోపలి పీల్చుకోడానికి చిన్నచిన్న నాలికలుంటాయంతే. వాటితోనే నీటి అడుగున రాళ్ళకి అతుక్కుని అలా తేలుతూ ఉంటాయి. అలా ముందుకీ వెనక్కీ.. నీటిమొక్కలా కదులుతూ.." 

చెరువు అడుగున నీటిమొక్కల్లా బోలెడు లేంప్రేలు ఊగడాన్ని ఊహించుకున్నాడతను. అసహజంగా అనిపించినా.. ఒక్కోసారి నిజాలలాగే ఉంటాయనిపించిందతనికి. 

"లేంప్రే అలాగే బతుకుతుంది. నీటిమొక్కలమధ్యదాక్కుని.. ఎదురుచూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఓ చేప మీదనుంచి దాటి వెళ్తే ఠకీమని పట్టేసుకుని నాలికలతో చుట్టేసుకుంటుంది. ఆ నాలికలకి పళ్ళలాంటి ముళ్ళుంటాయి... వాటితో ఆ చేపని ముందుకీ వెనక్కీ రుద్దుతూ.. చేప పొట్టకి కన్నం పెడుతుంది. అప్పుడు కొద్దికొద్దిగా ఆ చేపని తింటుందన్నమాట." 

"నేను ఎప్పటికీ చేపని కావాలనుకోవడంలేదు.చెప్పాడు హబార. 

"రోమన్ లు, లేంప్రేని కొలనులో పెంచేవారట. తిరగబడిన బానిసలని వాటికి ఆహారంగా వేసేవారు."

అలా బానిసలా లేంప్రేకి ఆహారమవడమనే ఆలోచనకూడా హబార కి నచ్చలేదు. 'ఎట్టిపరిస్థితుల్లోనూ బానిసత్వమే వద్దు..అనుకున్నాడు. 

"చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉండగా  క్లాస్ అందరితోనూ కలిసి అక్వేరియం చూడడానికి వెళ్లాను. అక్కడ మొదటిసారిగా లేంప్రేని చూసాను." చెప్పింది షెహెరజాదె. "అవెలా బతుకుతాయి, ఎలా తింటాయి.. ఇవన్నీ రాసిన బోర్డు చదివేసరికి నేను గతజన్మలో లేంప్రేనని అర్ధమైపోయింది. గుర్తొచ్చింది.. రాయికి అతుక్కుని నాచుమొక్కల మధ్య నీళ్లలో ఊగుతూ ఉండడం, బొద్దుగా ఉన్న ఓ చేప ఈదుకుని వస్తూంటే దాన్ని ఆశగా చూడడం.. అన్నీ.."

చేపని ఎలా తిన్నావో గుర్తుందా?"

"ఉహు.."

"హమ్మయ్య.. పోన్లే." అన్నాడు హబార. 'కానీ నువ్వు మడుగులో లేంప్రేవని మాత్రం గుర్తుందన్నమాట!" స్వగతం గా అనుకున్నాడు. 


"గత జన్మ గుర్తురావడం అంత సులువేమీ కాదు. అదృష్టముంటే లీలగా గుర్తొస్తుంది.. ఎక్కడినుంచో పడుతున్న వెలుతురులా మసకగా ఉంటుంది. ఫోటోలో బంధించినట్టు కొన్ని విషయాలే  కనిపిస్తాయి.." నమ్మకంగా చెప్పింది షెహెరజాదె. 

"ఇంతకీ నీ పూర్వజన్మ జ్ఞాపకమేదైనా నీకు గుర్తుందా?" హబార ని అడిగిందామె. 

"ఉహూ.. అస్సల్లేదు." కచ్చితంగా చెప్పాడతను. నిజానికి తన ముందు జన్మల మీద ఆసక్తేమీ లేదతనికి. ఈ జన్మే చాలా భారంగా గడుస్తోందనిపిస్తూ ఉంటుంది. 

షెహెరజాదె నెమ్మదిగా చెప్తోంది. 

"ఆ మడుగు కింద చాలా బావుండేది. తలకిందులుగా.. నోటితో రాయికి కరుచుకుని. ఓసారి ఓ పెద్ద తాబేలుని చూసాను. నల్లని నీడలా నా మీదనుంచి అది తేలివెళ్తుంటే స్టార్ వార్స్ లో శత్రువుల స్పేస్ షిప్ లా అనిపించేది. చేపల కోసం వచ్చివాలే కొంగలు.. కిందనుంచి చూస్తుంటే మబ్బుల్లా కనిపించేవి. అవి మా లేంప్రే లని ఏమీ చెయ్యవులే.. మేం నాచుమొక్కల మధ్యలో దాక్కుని ఉంటాం కదా.." 

"ఇవన్నీ నీకిప్పుడు కనిపిస్తాయా?!" అపనమ్మకంగా అడిగాడు హబార. 

"స్పష్టంగా కనిపిస్తాయి.. ఆ వెలుతురు, నీటి ఒత్తిడి.. అన్నీ. అప్పటి నా స్థితికి, ఆలోచనల్లోకి.. వెనక్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది." 

"ఆలోచనలా! లేంప్రేలు ఆలోచిస్తాయా?"

"ఆహాఁ! చక్కగా.." నవ్వింది షెహెరజాదె.. 

"ఏం ఆలోచనలు? ఎలాంటివి?" ఆసక్తిగా అడిగాడు. 

"లేంప్రే ల ఆలోచనలు లేంప్రేల్లాగే ఉంటాయి. మాటల్లో చెప్పలేం. నీళ్ల అడుగున అదో ప్రపంచం. గర్భస్థ శిశువు ఉన్నట్టే.. మనం కడుపులో ఉన్నప్పటి ఆలోచనల్ని మనం మాట్లాడుకునే మాటల్లో పెట్టగలమా? అలాగే లేంప్రే ఆలోచనలు కూడా.."

"నీకు గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో గుర్తుందా!" ఆశ్చర్యపోతూ అడిగాడు. 

"గుర్తుంది.. నీకు?" అతని గుండెలపై నుంచి లేస్తూ అడిగింది.

"ఉహుఁ.." 

"సరే.. ఈసారెప్పుడైనా చెప్తానేం.."

"షెహెరజాదె.. లేంప్రే.. గతజన్మలు.." అని డైరీలో రాసుకున్నాడు. ఎవరైనా చదివితే ఆ మాటల వెనుక కథ అర్ధం కాదు కదా అనిపించిందతనికి. 


********

హబార ఆమెను మొదటిసారి కలిసి నాలుగు నెలలవుతుంది. టోక్యో నగరానికి దక్షిణాన ఉన్న ఓ ఊళ్ళో ఆ ఇంటికి అతను చేరాక.. ఆమె అతని సహాయకురాలిగా కుదర్చబడింది. హబార బయటికి వెళ్ళలేడు కనుక, బయటి ప్రపంచానికి, అతనికి ఉన్న ఒకేఒక వారధి ఆమె. అతనికి కావలసిన తిండి, సరుకులు తీసుకొచ్చి సర్ది వెళ్తుండేది.  అతను చదవాలనుకున్నా పుస్తకాలు, వినేందుకు సీడీలు తెచ్చిపెట్టేది. ఆమె తెచ్చే సినిమాలు అతనికి నచ్చేవి కావు. 

హబార ఆ ఇంట్లోకి వచ్చాక, అప్రయత్నంగా ఒకరోజు ఆమె అతన్ని పక్కమీదకు తీసుకువెళ్ళింది. మంచం పక్కనుండే బల్ల సొరుగులో కాండమ్స్ చూసి, ఆమె విధినిర్వహణలో సెక్స్ కూడా ఒక భాగమని ఊహించాడు. ఏదేమైతేనేం.. నీటివాలుకి కొట్టుకువెళ్ళే గడ్డిపోచలా.. ఆమెతో శారీరక సంబంధాన్ని చాలా సహజంగా స్వీకరించాడు. మొదట్లో మొక్కుబడి వ్యవహారంలా మొదలయినా.. రాన్రాను హబారకి అంతకుమించినది ఉందనిపించేది. ఆమె కదలికల్లో, స్పందనలో అప్పుడప్పుడు బయటపడే తృప్తి అతనికి సంతోషాన్నిచ్చేది. అతనేం మానూ మాకూ కాదు కదా! అయితే షెహెరజాదె జీవితంలో ఈ విషయానికి ఎంత ప్రాధాన్యత ఉందన్నది అతనికి అంతుచిక్కేది కాదు. 

హబార కోసం ఆమె చేసే యే పనైనా అభిమానంతో చేస్తోందా, కేవలం తన ఉద్యోగం కాబట్టి చేస్తోందా అనేది అతనికి అర్ధంకాని విషయం. ఆమె మనసులో యేముందో తెలుసుకోవడం అతనితరం అయ్యేది కాదు. షెహెరజాదె వేసుకునే సామాన్యమైన లోదుస్తులు చూస్తే ముప్ఫయిల్లో ఉండే సాధారణ గృహిణులు అలాగే వేసుకుంటారనిపించేదతనికి. ఒక్కోసారి హఠాత్తుగా గాఢమైన రంగుల్లో మెరిసిపోయే సిల్కు లోదుస్తులలో ప్రత్యక్షమయ్యేది. ఆ మార్పుకి కారణమేమిటో అతనికి తోచేది కాదు. 

హబార కి అస్సలు అర్ధంకాని మరో విషయమేమిటంటే, వారిద్దరి కలయికకి, అది ముగిశాక ఆమె చెప్పే కథలకీ మధ్య ఉన్న లంకె. ఒక అనుభవంలోంచి మరొకటి మొలిచినట్టుండేది. ఇలాంటి వింత అతను మునుపెన్నడూ యెరుగడు. అతను ఆమెని ప్రేమించకపోయినా, వారి కలయికలో విద్యుత్తేమీ పుట్టకపోయినా.. ఆమెకి అతను రోజురోజుకీ గాఢంగా పెనవేసుకుపోవడం అర్ధమవుతూనే ఉండేది. 


********

"నేను నా టీనేజ్ లో ఉండగా.. ఎవరూ లేనివేళ పొరుగిళ్లలోకి దొంగతనంగా దూరేదాన్ని." ఒకరోజు మంచం మీద పడుకుని ఉండగా చెప్పింది షెహెరజాదె.

షరామామూలుగా హబార కి నోట మాట లేదు. ఆమె ఏదైనా కథ మొదలుపెడితే అంతే.. అతనికి వాగ్బంధనే. 

"నువ్వెప్పుడైనా అలా వెళ్ళావా?" అతన్ని అడిగింది. 

"ఉహుఁ.." గొంతు పెగల్చుకుని చెప్పాడు. 

"ఒకసారి అలా వెళ్తే, మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపిస్తుంది." రెట్టించిందామె. 

"అలా వెళ్ళకూడదు.." అతను చెప్పాడు. 

"అవును. వెళ్ళకూడదు. పోలీసులు పట్టుకుంటే అంతే సంగతులు. దొంగతనానికి దూరావని కటకటాల వెనక పెట్టేస్తారు. అయినా సరే, ఒకసారి అలా వెళ్ళావంటే ప్రమాదమని తెలిసీ అలవాటు పడిపోతావు." 

హబార మౌనంగా ఆమె మాటలు వింటున్నాడు. 

"ఎవరూ లేని ఇళ్ళలో దొంగతనంగా చొరబడితే.. ఆ ఇల్లంతా ఎంత నిశబ్దంగా ఉంటుందో తెలుసా! ప్రపంచం మొత్తానికి అత్యంత నిశబ్దమైన స్థలం అదే అనిపించేది. నేలమీద కూర్చుని, రెప్పవేయకుండా వుంటే.. లేంప్రే లా అయిపోయాననిపించేది. అన్నట్టు.. నేను క్రితం జన్మలో లేంప్రే ఈల్ ని అని నీకు చెప్పాను కదూ..?" 

"చెప్పావు.." 

"ఆఁ.. అలా అనిపించేది. నీటి అడుగున ఒక రాయికి అతుక్కుని, నీటి అలలతో కదులుతూ.. నా చుట్టూ ఉన్న నాచుమొక్కలతో కలిసి లయగా కదులుతూ.. నిశబ్దంగా! అప్పుడు నాకు చెవులు లేకపోవడం వలన నిశబ్దంగా అనిపించేదేమో! ఆకాశంలో ఎండగా ఉన్నప్పుడు, నీరు స్పటికంలా మెరిసిపోయేది. రంగురంగుల చేపలు నా తలపైనుండి ఈదుతూ వెళ్ళేవి. నా ఆలోచనలు ఖాళీగా ఉండేవి.. అచ్చం ఆ ఇంటిలాగే. లేంప్రే ఆలోచనలు ఏవో కలిగేవనుకుంటా.. కానీ చాలా స్వచ్ఛంగా ఉండేవి. నేను నేనే.. కానీ మరోలా ఉండే జీవితం. అద్భుతంగా ఉండేది." కలలో మాట్లాడినట్టు చెప్పింది. 

షెహెరజాదె చెప్పినదాని ప్రకారం, ఆమె మొదటిసారి ఖాళీ ఇంట్లోకి చొరబడినప్పటికి ఆమె హైస్కూల్లో చదువుతోంది. స్కూల్లో ఒక అబ్బాయి మీద వల్లమాలిన ఇష్టం ఉండేదామెకి. అతనేమీ అందమైన వాడు కాదు. పొడవుగా, విలక్షణంగా ఉండేవాడట. హైస్కూల్ సాకర్ టీమ్ కి ఆడేవాడు. బాగా చదివేవాడిని షెహెరజాదె చెప్పింది. ఆమెకి ఆ అబ్బాయంటే వెర్రి ఆకర్షణ ఉన్నా.. అతనికి ఈ విషయం ఏమాత్రం తెలీదు. వేరే అమ్మాయిని ఇష్టపడేవాడట. 'షెహెరజాదె' అనే మనిషి ఉనికే అతనెరగడు. అయితే ఆ అబ్బాయిని తన మనసులోంచి తీసేయడం ఆమె వల్లకాలేదు. దూరంగా అతను కనిపిస్తే షెహెరజాదె కి ఊపిరాడేది కాదు, ఒక్కోసారి వాంతైపోతుందేమో అన్నట్టు కడుపులో ఏదో అలజడి. ఏదో ఒకటి చెయ్యకపోతే, పిచ్చెక్కేలా ఉందనిపించేదామెకి. వెళ్లి తన ఇష్టాన్ని చెప్పడమనే ప్రసక్తే లేదు. 

ఒకరోజు ఉదయాన్నే స్కూలెగ్గొట్టి షెహెరజాదె ఆ అబ్బాయింటికి వెళ్ళింది. ఆమె ఇంటికి పావుగంట దూరంలో ఆ ఇల్లు. వెళ్ళేముందు వాళ్ళింటి వివరాలన్నీ ఆరా తీసి పథకం వేసుకుంది. సిమెంట్ కంపెనీలో పనిచేసే వాళ్ళ నాన్న, కార్ ఏక్సిడెంట్ లో కొన్నేళ్ల క్రితం పోయారు. తల్లి పక్క ఊళ్ళో మరో స్కూల్లో టీచరు. అక్కేమో స్కూల్లో ఉంటుంది. అంటే, ఇంట్లో ఎవ్వరూ ఉండరన్నమాట. 

తలుపు తాళం వేసి ఉంది. ఇంటిముందు కాళ్ళు తుడుచుకునే గోనెపట్టా కింద తాళం చెవి ఉంది. దొంగతనాల ఊసే లేని ఆ ఊళ్ళో చాలామంది తాళాలు అలాగే పెడతారు.. కాలిపట్టాకిందో, పక్కన పూలకుండీలోనో. షెహెరజాదె తొందరపడలేదు. ఇంట్లో ఎవరూ లేరని రూఢి పరుచుకునేందుకు బెల్ మోగించింది. కొన్ని క్షణాలాగి, తలుపు తీసుకుని లోపలికెళ్లింది. కాలిజోళ్ళు విప్పి, చిన్న కవర్లో వేసి, తన సంచీలో దోపుకుంది. మునివేళ్ళ మీద నడుస్తూ మేడ మీదకి వెళ్ళింది. ఆమె ఊహించినట్టే ఆ అబ్బాయి గది అక్కడుంది. 

చెక్కమంచంపై దుప్పటి మడత నలగకుండా పరిచి ఉంది. పక్కనే పుస్తకాల అలమారా, బట్టల బీరువా, రాసుకునే బల్ల. పుస్తకాల అలమారా మీద చిన్న స్టీరియో, కొన్ని సీడీలు ఉన్నాయి. బార్సిలోనా సాకర్ టీమ్ ఉన్న కేలండర్ గోడకి తగిల్చి ఉంది. అంతే.. ఖాళీగా.. లేత నిమ్మరంగు గోడలు. కిటికీకి వేలాడుతున్న తెల్లని తెర. ఎక్కడ ఉండాల్సిన వస్తువులక్కడ.. పెన్నులు, పెన్సిళ్ళతో సహా తీర్చి దిద్దినట్టు కదలకుండా కూర్చున్నాయి. ఆలాంటి గదిలో ఉండే అబ్బాయిని మెచ్చుకోవాలి.. లేదా అలా సర్దిన వాళ్ళ అమ్మని బహుశా. లేదా అమ్మని, అబ్బాయిని కూడా. ఉన్నట్టుండి షెహెరజాదె కి భయమేసింది. ఆ గదే కనుక చిందరవందరగా ఉండిఉంటే, ఆమె వచ్చివెళ్లిన ఆనవాలు ఎవరికీ తెలిసేదికాదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంది. మరుక్షణం, చక్కగా సర్ది ఉన్న ఆ గది చూసి భలే ముచ్చటేసిందామెకి. 

రాత బల్ల దగ్గరకి వెళ్లి కుర్చీలో కూర్చుంది. రోజూ ఆ అబ్బాయి అక్కడే కూర్చుకుంటాడనే ఊహకి ఆమె గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది. బల్ల మీద వస్తువులు తాకి చూసింది, వేళ్ళ మధ్య తిప్పుతూ వాసన చూసింది. పెదాలకి తాకించుకుంది. ఆ అబ్బాయి పెన్సిలు, పెన్ను, కత్తెర, స్కెలు, స్టేప్లరు.. చాలా మామూలు వస్తువులన్నీ.. బోలెడంత ప్రత్యేకత అద్దుకున్నాయి. కేవలం అతనివి అవడం వలన. 

పై అర తెరిచి చూసింది. చిన్న చిన్న సొరుగుల్లో రకరకాల వస్తువులూ, కాగితాలు. రెండో అరలో నోట్ బుక్స్, చివరిదానిలో పాత పేపర్లు, మళ్ళీ నోట్సు, పరీక్ష పేపర్లు. అన్నీ అయితే చదువుకో, లేదా సాకర్ కో సంబంధించిన వస్తువులే. డైరీ కానీ, ఫోటోలు కానీ కనబడతాయేమో అని వెతికింది. ఉహుఁ.. ఆమెకి ఆశ్చర్యమేసింది. సహజంగా లేదిది.. అనుకుంది. అతనికి స్కూలూ, సాకరూ తప్ప వేరే లోకమేమీ తెలీదా.. తెలిసినా బయటికి కనబడకుండా దాచాడా

అతని కుర్చీలో కూర్చోవడం, చేతిరాత చూడడంతో షెహెరాజాదేకి పట్టలేని సంతోషం కలిగింది. అదుపు తప్పే ప్రమాదముందనిపించి, నేలమీద కూర్చుంది. తలపైకెత్తి చూస్తూ చుట్టూ ఉన్న నిశబ్దంలో మమేకమైంది. అలా లేంప్రే ప్రపంచంలోకి వెళ్లిపోయిందట కాసేపు. 

"అయితే ఇంతాచేసి వాళ్ళింటికి వెళ్ళి, అతని వస్తువులన్నీ సవిరించి.. నేలమీద కూర్చుని వచ్చేసావా?" హబార ఆమెని అడిగాడు. 

"అంతేనా.. ఇంకా ఉంది. నాకు అతని వస్తువేదైనా తీసుకోవాలనిపించింది. అతను ప్రతిరోజూ వాడేది, అతని శరీరాన్ని తాకినది.. అలా అని ఆ వస్తువు పోతే అతనేమీ మిస్ అవకూడదు. అందుకని.. ఒక పెన్సిల్ దొంగలించాను." 

"ఒక పెన్సిల్?" 

"అవును.. అతను వాడుతున్న పెన్సిల్. కానీ అది సరిపోదు. నేను దొంగనవకూడదు. నేను ప్రేమ దొంగని కదా.." 

ప్రేమ దొంగ? సినిమా టైటిల్ లా అనిపించిందా పదం హబార కి. 

"అందుకని, నాకు సంబంధించినదేదైనా అక్కడ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడికి వెళ్లినదానికి సాక్ష్యంగా.. అప్పుడు పెన్సిల్ దొంగలించినట్టు అవదు కదా? ఇచ్చిపుచ్చుకున్నట్టవుతుంది. ఏం విడిచిపెట్టాలి? తలబద్దలుగొట్టుకున్నా అర్ధం కాలేదు. ముందుగా ఈ ఆలోచన రానందుకు, సరైన వస్తువేదీ తీసుకురానందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. నా బేగ్ అంతా వెతికితే, నా టాంపాన్ తప్ప ఇంకో వస్తువు కనిపించలేదు. నెలసరికి ముందు బేగ్ లో అది ఉంచుకోడం నాకు అలవాటు. అతని రాతబల్ల సొరుగులో, వెనకవైపుకి.. బయటికి కనబడకుండా దాన్ని జారవిడిచాను. నాకు చెప్పలేని మోహంలాంటిదేదో కమ్మేసింది. శరీరంలో కలిగిన విపరీతమైన స్పందనలకి అనుకుంటా.. నా పీరియడ్ ఆసారి వెనువెంటనే అన్నట్టు వచ్చేసింది." 

'పెన్సిల్ బదులు టాంపాన్..' హబార డైరీలో రాసుకోబోయే మాటలు మనసులో అనుకున్నాడు. ఎవరైనా చూస్తే ఏమర్ధమవుతుందో

"దాదాపు పదిహేను నిమిషాలు ఆ ఇంట్లో ఉన్నాను. ఎవరైనా హఠాత్తుగా వస్తారేమో అని భయం. అదే మొదటిసారి కదా అలాంటిపని చెయ్యడం! వీధిలో ఎవరు లేకుండా చూసుకుని, నెమ్మదిగా బయటికొచ్చి, తాళంచెవి యధాస్థానంలో పెట్టేసి జారుకున్నాను. అతి విలువైన వస్తువు.. అతను వాడిన పెన్సిల్ ని చేజిక్కించుకుని స్కూల్ కి వెళ్ళిపోయాను. "

షెహెరజాదె నిశబ్దంగా ఉండిపోయింది. బహుశా ఆ క్షణాలు కళ్ళముందు కదిలుంటాయి. లేదా.. వరుసగా గుర్తు తెచ్చుకుంటోందో! 

"ఆ తరువాతి వారం నా జీవితంలోనే చాలా సంతోషకరమైన కాలం." చాలాసేపటికి చెప్పింది. " ఆ పెన్సిల్ తో ఏదేదో రాసాను. వాసన చూసాను, ముద్దుపెట్టుకున్నాను. బుగ్గమీద రాసుకున్నాను. ఆడాను. నోట్లో పెట్టుకుని చప్పరించాను. వాడేకొద్దీ పెన్సిల్ అరిగిపోతుంటే బాధనిపించింది. పోనీ వెళ్లి ఇంకొన్ని పెన్సిళ్లు తెచ్చుకుంటే.. అని ఆలోచించాను. ఆ బల్లమీద బోలెడు సగం వాడిన పెన్సిళ్ళున్నాయి. ఒకట్రెండు పోయినా అతనికేం తేడా తెలీదు. నేను ఆ గదిలో దాచిన వస్తువు కూడా బహుశా చూసుండదు. ఆ ఆలోచనే నాలో వింత ప్రకంపనలు రేకెత్తించింది. అతను నావైపు చూడలేదని కానీ, ఇంకెవరినో చూస్తున్నాడని కానీ నాకేం బాధలేదింక. ఎందుకంటే, అతని వస్తువొకటి అతిరహస్యంగా నా దగ్గర ఉంది. 

"చేతబడిలా ఉంది.." హబారా అన్నాడు. 

"అవును. ఆ తరువాతెప్పుడో దానిగురించి ఒక పుస్తకం చదివినప్పుడు, నాక్కూడా అలాగే అనిపించింది. కానీ, అప్పుడింకా స్కూలు పిల్లని. నాకలాంటి విషయాలేం తెలీవు. నన్ను పట్టి కుదిపేసే కోరిక ఒకటే.. ఆ గదిలోకెళ్ళి అతని వస్తువులు తెచ్చుకోవాలి. నేను దొరికిపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు. స్కూల్ నుంచి పంపిస్తారు. ఊళ్ళో తిరగడం కష్టం అయిపోతుంది. నాగురించి నానామాటలు చెప్పుకుంటారు. కానీ, ఆ భయాలేవీ నన్ను ఆపలేకపోయాయి. నా బుర్ర సరిగా పనిచేసే పరిస్థితి లేదు. 

పదిరోజుల తరువాత షెహెరజాదె మళ్ళీ ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళింది. ఉదయం పదకొండుగంటల వేళ, తాళంచెవి తీసుకుని వెళ్లి ఆ గదిలోకి ప్రవేశించింది. ఎప్పటిలాగే పడక సర్ది ఉంది. ఈసారి కొంచెం పొడవుగా ఉన్న పెన్సిల్ తీసుకుని, జాగ్రత్తగా తన పెన్సిల్ బాక్స్ లో పెట్టుకుంది. ఆ తరువాత అతని మంచం మీద పక్క నలగకుండా సున్నితంగా వాలింది. గుండెలమీద చేతులు వేసుకుని వెల్లకిలా పడుకుని పైకప్పు చూస్తూ పడుకుంది. 'ప్రతీరాత్రీ అతను పడుకునే మంచం..' ఆ ఆలోచన రాగానే ఆమెకి ఊపిరాడలేదు. గభాలున లేచి, దుప్పటి సర్ది నేలమీద క్రితంసారిలాగా కూర్చుంది. పైకి చూస్తూ, 'ఆ మంచం మీద పడుకునే ధైర్యం చేయలేనింకా..' అనుకుంది. 

ఈసారి ఆ గదిలో అరగంట గడిపింది. సొరుగులో నోట్సు తీసి చదివింది. అతను రాసిన బుక్ రిపోర్ట్ ఒకటి ఆమె కంటపడింది. సొసెకి నట్సుమె రాసిన 'కొకొరొ' నవల గురించి క్రితం వేసవిసెలవల్లో రాసిన రిపోర్ట్ అది. చేతిరాత ఎంత అద్భుతంగా ఉందంటే, దిద్దే టీచర్ చదవాల్సిన పనే లేదు. బ్రహ్మాండమైన మార్కులొచ్చాయ్. 

షెహెరజాదె అతని బట్టల బీరువా సవరించింది. లోదుస్తులు, సాక్సులు, షర్ట్లు, పేంట్లు.. సాకర్ యూనిఫామ్. అన్నీ పద్ధతిగా మడతపెట్టి ఉన్నాయి. అతనే మడతపెట్టుకుని ఉంటాడా? తల్లి చేసి ఉంటుందా? క్షణకాలం ఆమెకి అతని తల్లిమీద - ముల్లు గుచ్చుకున్నట్టు అసూయ కలిగింది. 

ఆమె ముందుకు వంగి ఆ బట్టల వాసన పీల్చుకుంది. సబ్బు సువాసన! బూడిదరంగు టీషర్ట్ ఒకటి తీసి మొహానికి అడ్డుకుంది. ఎక్కడైనా అతని పరిమళం తెలుస్తుందేమో అని పీల్చుకుంది.ఉహుఁ.. చొక్కా చంకల్లో కూడా సబ్బు వాసనే. అది తనతో తీసుకుపోవాలనిపించిందామెకి. కానీ అంట పద్ధతిగా సర్దిన బట్టల్లోంచి ఒక చొక్కా మాయమైతే తెలిసిపోయే అవకాశమే ఎక్కువ. ఎన్ని చొక్కాలున్నాయో అతనికో, అతని తల్లికో తెలిసే ఉంటుంది. కొంపలంటుకుంటాయి. 

ఆ ఆలోచన విరమించుకుని, చొక్కా అతిజాగ్రత్తగా మడతవేసి సర్దేసింది. దానిబదులు సాకర్ బాల్ ఆకారంలో ఉన్న ఒక బేడ్జ్ తీసుకుంది. అది బహుశా కొన్నేళ్ల కిందటిదై ఉందనిపించింది. పెన్సిళ్లు ఉన్న బల్ల సొరుగులోనే దొరికిందది. అతనికేం అవసరం ఉండకపోవచ్చని నిర్ణయించుకుని తీసుకుని జాగ్రత్తచేసుకుంది. పనిలో పని క్రితం సారి తనువదిలివెళ్ళిన టాంపాన్ ఉందోలేదో చూసింది. అది అక్కడే ఉంది. అది బయటపడితే ఏమవుతుంది? అతని తల్లి అదిచూస్తే ఏమవుతుందో అని ఆలోచించుకుంది. కొడుకుని నిలదీస్తుందా? అడగకుండా అనుమానపడుతుందా? ఏమైతేనేం.. మొదటిసారి విడిచిపెట్టిన గుర్తు అక్కడే ఉంచేద్దామనుకుంది. 

ఈసారి తనవైపునుంచి వదిలిపెట్టేందుకు ఒక వస్తువు సిద్ధం చేసుకునే వచ్చింది. ముందురోజు రాత్రి తన తలవెంట్రుకలు మూడింటిని కత్తిరించి, ఒక కవరులో పెట్టి బేగ్ లో పెట్టుకుంది. పాత లెక్కలనోట్స్ తీసి, దానిమధ్యలో ఆ కవరు పెట్టింది. నల్లగా, పొడవుగా ఉన్న ఆ వెంట్రుకలు ఆడపిల్లవని తెలుస్తుంది.. కానీ డీ ఎన్ యే పరీక్ష చేస్తే తప్ప ఎవరివో తెలీదు. 

మధ్యాహ్నం క్లాసుల వేళకి స్కూలుకెళ్ళిపోయిందామె. ఆ తరువాత పదిరోజులు హాయిగా గడిచిపోయాయి. అతని వస్తువులు ఆమె దగ్గరున్నాయి కనుక ఇబ్బందేం లేదు. అయితే, ఏదో ఒక సంఘటన జరిగితేకానీ అలవాటు మానుకోవడం కష్టం. అందుకే.. అలా ఇళ్లలోకి దొంగతనంగా జొరబడడం చాలా ప్రమాదకరమైన వ్యసనం అని షెహెరజాదె ముందే చెప్పింది. 

సరిగ్గా అదే క్షణంలో షెహెరజాదె మంచం పక్కనున్న బల్లపై గడియారం వంక చూసింది. సమయం నాలుగున్నర. 'వెళ్ళాలి..' అంటూ చటుక్కున లేచి, తెల్లని కాటన్ లో దుస్తులు, జీన్స్, ముదురు నీలం రంగు నైకీ చొక్కా తలమీంచి వేసుకుని బాత్రూం లోకి వెళ్ళింది. చేతులు కడుక్కుని, తలదువ్వుకుని,తన నీలిరంగు మజ్దా కారులో వెళ్ళిపోయింది. 

చెయ్యడానికేమీ లేని ఏకాంతంలో.. మంచం మీద పడుకుని ఆమె చెప్పిన కథనంతా ఆవులా నెమరేస్తూ ఆస్వాదించాడు హబార. ఎక్కడికెళ్తుంది కథ? ఆమె చెప్పే ప్రతీకథా అంతే.. ఊహించశక్యం కాదు. షెహెరజాదె ని హైస్కూల్ పిల్లగా ఊహించుకోడం కష్టంగా ఉందతనికి. ఎలా ఉండిఉంటుంది? సన్నగా, ఇప్పటిలా కాకుండా.. స్కూల్ యూనిఫామ్, తెల్ల సాక్సులు, జడలతో ఉండేదా

అతనికి ఆకలేయడం లేదింకా. వంట చేసుకోలేదు. సగం చదివిన పుస్తకం తిరగేయడం మొదలెట్టాడు. అదీ బుర్రకెక్కలేదు. తన క్లాస్మేట్ గదిలోకి చొరబడి అతని చొక్కాలో మొహం దాచుకున్న షెహెరజాదె అతని కళ్ళముందు కదులుతోంది. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలని చెడ్డ కుతూహలంగా ఉందతనికి. 

మూడురోజుల తరువాత వచ్చిందామె. మధ్యలో ఒక వారాంతం గడిచిపోయింది. పేపర్ బేగుల్లో సరుకులు మోసుకొచ్చింది. ఫ్రిజ్ లో ఎక్స్పైర్ అవబోతున్న సరుకుల్ని తీసి, అందులో సర్దాల్సినవి చకచకా అమర్చింది. నిండుకోబోతున్న సరుకుల చీటీ రాసుకుంది. హబార తాగే స్పార్క్లింగ్ వాటర్ బాటిళ్లను ఫ్రిజ్ లో పెట్టింది. చివరిగా కొత్తగా తెచ్చిన పుస్తకాలు, డీవీడీలు టేబుల్ మీద సర్దిపెట్టింది. 

"ఇంకేమైనా అవసరం పడతాయా?" అడిగింది. 

"ఉహుఁ.. నాకు గుర్తున్నంతలో ఏమీ అక్కర్లేదు.హబార చెప్పాడు. 

ఎప్పట్లానే పడకగదిలోకి వెళ్ళారిద్దరూ. వారిద్దరి మధ్య కలయిక తప్పనిసరేం కాదు.. ఇద్దరికీ. మనసారా జరిగే అనుభవమూ కాదు.  డ్రైవింగ్ నేర్చుకునే కుర్రాడి అత్యుత్సాహానికినేర్పే ఇన్స్ ట్రక్టర్ అడ్డుకట్ట వేసినట్టు.. ఎలాంటి మానసికమైన బంధం ఏర్పడకుండా జాగ్రత్త తీసుకుంటుందామె. అతనిలో మార్పులని తన నర్సు కళ్ళతో ఒకమారు గమనించాక, ఆమె మిగిలిన కథ మొదలుపెట్టింది. 

పదిరోజుల పాటు తాను తెచ్చుకున్న బేడ్జ్ తో ఆడుతూ, ఆ అబ్బాయి వాడిన పెన్సిల్ ని కొరుకుతూ పగటికలల్లో గడిపేసింది. పొద్దస్తమానం అతని గదే గుర్తొస్తోందామెకి. అక్కడ తాను చూసిన వస్తువులు.. వదిలివచ్చిన తన వస్తువులూ గుర్తొస్తున్నాయి. 

ఇలా పగటిపూట చొరబడడ్డం మొదలెట్టాక, షెహెరజాదె కి స్కూల్లో చెప్పే చదువు మీద ఆసక్తిపోయింది. క్లాసులో ఉన్నంతసేపు పగటికలలు. ఇంటికెళ్ళాక కూడా చదవబుద్ధి కావడం లేదామెకి. హోమ్ వర్క్ చెయ్యడం మానేసింది. తను మొదటినుంచీ గొప్పగా చదివే విద్యార్థినేమీ కాదు. అలా అని పని ఎగ్గొట్టే పిల్లా కాదు. 'ఎందుకలా ఉన్నావని' టీచరు నిలదీస్తే ఒంట్లో బావుండడం లేదని నీళ్లునమిలింది. ఇలా ఫలానా అబ్బాయిని ఆరాధిస్తున్నానని, ఎవరూ లేనివేళ వాళ్ళింట్లో చొరబడి అతను వాడిన వస్తువులు తెచ్చుకుని కలలు కంటున్నానని ఎవరితో చెప్పుకోగలదు? ఆ రహస్యాన్ని తనలో దాచుకోవలసిందే.. 

"రెండోసారి వాళ్ళింటికి వెళ్లొచ్చిన పదిరోజులకు, మళ్ళీ నా కాళ్ళు అప్రయత్నంగా ఆ ఇంటివైపు దారితీసాయి. నాకు పిచ్చెత్తినట్టు అనిపించేది. ఎవరైనా చూస్తే ఎంతప్రమాదమో తెలిసినా నన్ను నేను ఆపలేకపోయాను. ఎవరైనా చూసి పోలీసుల్ని పిలుస్తారని నాకు అనిపిస్తూనే ఉండేది." షెహెరజాదె చెప్పింది. 

"అస్తమానం స్కూలు మానేస్తే ఇంట్లోను, స్కూల్లోనూ ఇబ్బందవలేదా?" 

"మా అమ్మానాన్నలకు సొంత వ్యాపారం ఉండేది. అందులో తలమునకలుగా ఉండేవారు. నేనెప్పుడూ వాళ్లకి తలనొప్పులేమీ తేలేదు, ఎదురు చెప్పలేదు. అందుకని కూడా నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇక స్కూల్లో సాకులు చెప్పడం చాలా సులువు. మా అమ్మ చేతిరాతతో ఉత్తరం రాసేదాన్ని. 'ఒంట్లో బాలేదని, డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సిన పనుందని..అప్పుడప్పుడు స్కూలు మానేసే నాకంటే వాళ్లకి ముఖ్యమైన విషయాలు చాలా ఉండిఉంటాయి. నన్నెవరూ ఏమీ అడగలేదు. 

షెహెరజాదె టైమెంతయిందో ఒకసారి చూసుకుని, అప్పుడు మిగిలిన కథ చెప్పడం కొనసాగించింది. 

కాలిపట్టా కింద ఉన్న తాళం తీసుకుని లోపలి వెళ్ళానా.. ఈసారి ఇల్లంతా ఇంకా నిశబ్దంగా ఉన్నట్లనిపించింది. ఫ్రిజ్ లోంచి వస్తున్న చిన్న చప్పుడు బ్రహ్మరాక్షసి బరువుగా ఊపిరి తీసుకుంటున్నట్టు అనిపించింది. పులి మీద పుట్రలా నేనక్కడ ఉన్నప్పుడే ఫోన్ మోగింది. అదెంత బిగ్గరగా వినిపించిందంటే, గుండె ఆగిపోయిందనుకున్నాను. ఫోన్ శబ్దం ఆగిపోయాక, చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశబ్దం.  

షెహెరజాదె ఈసారి ఆ అబ్బాయి మంచం మీద చాలాసేపు పడుకుంది. పక్కనే అతను హాయిగా నిద్రపోతున్నట్టు, అతని మొహాన్ని తాను తదేకంగా చూస్తున్నట్టు ఉహించుకుంది. చేతిని జాపి, బలంగా మెలితిరిగిన అతని చేతి కండరాలని తాకినట్టు కళ్ళకి కట్టిందామెకి. ఊహల్లో తేలిపోయింది కాసేపు. 

హఠాత్తుగా షెహెరజాదె కి ఆ అబ్బాయి ఒంటివాసన ఎలా ఉంటుందో చూడాలనిపించింది. లేచి అతని బట్టల బీరువా తీసి చూసింది.. అవే మడతనలగని దొంతరలు. ఆమె బుర్రలో మెరుపులా ఒక ఆలోచన మెరిసింది. పరుగున కిందకి వెళ్లి వెతికితే బాత్రూం పక్కన ఉన్న మాసినబట్టల బుట్ట కంటబడింది. తల్లీ, కూతురు, కొడుకు బట్టలు ఉన్నాయి.. ఒక రోజు క్రితం బట్టలు అయి ఉండచ్చు. అబ్బాయి వేసుకునే చొక్కాలాంటి తెల్లటి టీ షర్ట్ ని బయటికి లాగి వాసన చూసింది. కచ్చితంగా యవ్వనంలో ఉన్న మగపిల్లాడి వాసన. తన మగస్నేహితులు దగ్గరగా మసలినప్పుడు తెలిసే ఆ వాసన ఆమెకి గుర్తొచ్చింది. లీలగా ఆ అబ్బాయి వాసనని పట్టి ఉంచిన ఆ చొక్కాని హత్తుకుంటే పట్టలేని సంబరం కలిగింది. రివ్వున మేడమీదకి పరిగెత్తి, అతని మంచంపై వాలిపోయింది. తనని కుదిపేస్తున్న అలజడి ఆమెకి ఆ వయసులో స్పష్టంగా అర్ధం కాలేదు. 

ఇంట్లో ప్రతి అంగుళం పద్ధతిగా అమర్చుకునే ఆ అబ్బాయి తల్లి.. ఒక్క చొక్కా కనిపించకపోయినా ఇట్టే పసిగట్టేస్తుంది. అయినా సరే... షెహెరజాదె ఆ చొక్కాని వదలలేకపోయింది. తనతో తీసుకుపోవడానికి నిర్ణయించుకుంది. పోలీసు కుక్కలా ఇల్లంతా తిరగదోడి, కొడుకు గదిలోకి ఎవరో దూరారన్న నిజాన్ని ఆమె పట్టేస్తుంది. అన్నీ తెలిసినా షెహెరాజాదే మనసు ఆమె అదుపులో లేదు. మరి తిరిగి తన వస్తువేం వదిలేయాలా అని ఆలోచించింది. తన లోదుస్తుల్ని మించినదేమీ ఉండదనిపించింది.. విప్పి చూస్తే కాస్త బెరుకు కలిగిందామెకి. ఎవరూ చూడని చోట దాచేసినా, ఆ పని చేసి తనని తాను తగ్గించుకున్నట్టే అవుతుందనుకుంది. ఇంకేం విడిచిపెట్టాలి

షెహెరజాదె కథ అక్కడితో ఆపింది. చాలాసేపు మౌనంగా మంచం మీద కళ్ళుమూసుకుని పడుకుంది. పక్కనే హబారా అలాగే మౌనంగా ఆమె కథ కొనసాగించాలని ఎదురుచూస్తూ ఉండిపోయాడు. 

కాసేపటికి కళ్ళు తెరిచి "హేయ్ మిస్టర్ హబార.." అని పిలిచింది. 
మొట్టమొదటిసారి... అతన్ని పేరుపెట్టి పిలిచింది. ఏమిటన్నట్టు చూసాడు. 

"మనం.. మరోసారి కుదురుతుందా?" 
"అనుకుంటా.." చెప్పాడు. 

అలా వాళ్ళు మరోసారి కలిసారవేళ. ఆమె శరీరం అంతకుమునుపెప్పుడూ లేనంత కొత్తగా ఉందతనికి. విల్లెక్కుపెట్టినంత బిగువుగా, మెరుస్తూ ఉందామె చర్మం. గతాన్ని నెమరేసుకోవట్లేదామె.. పాత రోజుల షెహెరజాదె గా మారిపోయింది. గతజన్మలు గుర్తున్నట్టే, ఆమెకి పదిహేడేళ్ళ వయసుకి వెళ్లిపోవడం కూడా సాధ్యమేమో! అలాంటి అతీతశక్తులు చాలానే ఉన్నట్టున్నాయామెకి. మాంత్రికుడెవరో మాయాదర్పణంలోకి తీసుకుపోయినట్టు, కథ చెప్తూ వినేవాడిని లాక్కెళ్లిపోగలదామె. కాలాన్ని గిర్రున వెనక్కితిప్పి సరిగ్గా ఆనాటి అమ్మాయిగా మారిపోయిందిప్పుడు. ఎప్పుడూ లేనంత ఆర్తితో, మోహంతో చాలాసేపు గడిపారు. షెహెరజాదె సౌఖ్యపుటంచుకి చేరుకోవడం హబార కి సుస్పష్టంగా తెలిసింది. బలమైన స్పందనలు ఆమె శరీరాన్ని కుదిపేశాయి. హబార కి ఇదో వింత అనుభవం.. క్షణమాత్రం తెరుచుకునే నెర్రెలోంచి ఆనాటి పదిహేడేళ్ల షెహెరజాదె ని చూసే అవకాశం కలిగిందతనికి. ఇక ఊహించుకోవలసిన అవసరమే లేదు. ముప్ఫయి ఐదేళ్ల గృహిణి శరీరంలో ఇరుక్కుపోయిన ఆ పదిహేడేళ్ళ అమ్మాయి కనిపించింది. అతను చూసాడు.. ఉగ్గబట్టుకోలేని ఉద్వేగంతో, కళ్ళుమూసుకుని ఒక అబ్బాయి విడిచిన తెల్లటి చొక్కాలో మొహం దాచుకున్న షెహెరాజాదే కనిపించింది. 

ఈసారి కథ చెప్పలేదామె. అతని కాండమ్ ని నర్సులా పరికించి చూడలేదు. ఒకరిపక్కన ఒకరు మౌనంగా పడుకున్నారు. ఆమె కళ్ళు బాగా తెరిచి ఇంటిపై కప్పువైపు చూస్తోందామె. నీటి ఉపరితలంపై వెలుగుని పరిశీలనగా చూస్తున్న లేంప్రే ఈల్ లాగ. ఎంత బావుంటుంది.. అనుకున్నాడతను. తను కూడా ఆమెలాగే, ఈ ఒంటరి 'నొబుక్త హబార' అనే మనిషి శరీరాన్ని విడిచి పేరులేని లేంప్రే అయిపోతే ఎంత బావుంటుంది! షెహెరజాదె పక్కనే తనని తాను ఊహించుకున్నాడు.. వాళ్లిద్దరూ ఒక రాతికి అతుక్కుని నీటి కదలికలతో ఊగుతూ.. తమకి అందేలా ఒక బొద్దు చేప ఈదుతూ వెళ్ళాలని ఎదురుచూస్తూన్నట్టు ఊహించుకున్నాడు. 

"ఇంతకీ చొక్కా బదులు ఏం విడిచిపెట్టావు?" నిశబ్దాన్ని బద్దలుగొడుతూ అడిగాడు. 

వెంటనే సమాధానం రాలేదు. 

"ఏమీ లేదు. అతని పరిమళం అంటుకున్న ఆ చొక్కాకి సరితూగేదేదీ లేదు. అందుకే ఏమీ వదల్లేదు. అది తీసుకుని బయటపడ్డాను. అలా.. నేనో దొంగనయ్యాను." 

పన్నెండు రోజుల తరువాత షెహెరజాదె ఆ అబ్బాయి ఇంటికి నాలుగోసారి వెళ్ళింది. తలుపుకున్న కొత్త తాళం ఆమెని పలకరించింది. ఎండలో మెరుస్తూ బలంగా ఉందా తాళం. కాలిపట్టా కింద తాళంచెవి లేదు. ఆ అబ్బాయి తల్లికి అనుమానం వచ్చి ఉండాలి. కొడుకు చొక్కా కనిపించకపోయేసరికి, ఇల్లంతా తిరగేసి వెతికుండాలి. ఇంట్లో ఎవరూ లేనివేళ దొంగ చొరబడి ఉంటాడనుకుని వెంటనే తాళం మార్చేసింది. ఆ అబ్బాయి తల్లి చాలా చురుకు. 

చేసేదేమీలేక షెహెరజాదె వెనుతిరిగింది. నిరాశతో పాటు ఆమెకి చెప్పలేని విముక్తి కలిగినట్టనిపించింది. తనకి తెలియకుండా తన భుజాలమీద బరువునెవరో తీసిపారేసినట్టనిపించింది. ఎప్పుడో ఒకరోజు ఆమె ఆ అబ్బాయి గదిలో ఉండగా ఇంట్లోవాళ్లెవరికో దొరికిపోయి అవమానాలు, శిక్షలు భరించేబదులు, తన ప్రమేయం లేకుండా ఆ దారి మూసుకుపోవడమే ఆమెకు బావుంది. డేగకళ్ళతో పోయినవస్తువుని వెతికితాళం మార్చి సహాయంచేసిన ఆ అబ్బాయి తల్లికి  ఋణపడిపోయింది నిజానికి. ఆవిడని షెహెరజాదె ఎప్పుడూ చూడలేదు. 

ఆ చొక్కా పరిమళాన్ని ప్రతిరాత్రీ నిద్రపోయేముందు ఆస్వాదించేది. దాన్ని పక్కనపెట్టుకుని పడుకునేది. ఉదయాన్నే పేపరులో చుట్టి దాచిపెట్టి స్కూలుకి వెళ్ళేది. రాత్రి భోజనం చేసొచ్చాక మళ్ళీ అదే రివాజు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆ వాసన ఇగిరిపోతుందేమో అని భయపడింది కానీ, అలా జరగలేదు. షెహెరజాదె జ్ఞాపకాల్లాగే ఆ చొక్కాని అతని ఒంటివాసన శాశ్వతంగా పట్టుకుని ఉండిపోయింది. 

ఇంక ఆ అబ్బాయి ఇంటికి వెళ్లలేనన్న నిజాన్ని ఆమె మాములుగా తీసుకోగలిగింది. నెమ్మదిగా మనిషి కాగలిగింది. పగటికలలు తగ్గాయి. స్కూల్లో పాఠాలు అర్ధమవుతున్నాయి. అయినాకూడా టీచర్ చెప్పినదానికంటే, ఆ అబ్బాయి వైపు చూడడమే ఇంకా ఇప్పటికీ ఆమెకి ఇష్టమైన వ్యాపకం. అతనిపై ఒక కన్ను ఎప్పుడూ వేసే ఉంచింది. ఆ అబ్బాయిలో ఎలాంటి మార్పూ లేదు. ఎప్పట్లాగే తల వెనక్కి వంచి నవ్వుతున్నాడు. ఎవరైనా పిలిస్తే పలుకుతున్నాడు. సాకర్ ఆడుతూ గట్టిగట్టిగా అరిచాడొకనాడు. బోలెడు చెమట పట్టేలా పరిగెత్తి ఆడుతున్నాడు. 

అయితే ఆ అబ్బాయికి సంబంధించిన రహస్యమొకటి షెహెరజాదె కి మాత్రమే తెలుసు. వాళ్ళింటికెళ్లినప్పుడు అతని గదిలో బయటపడ్డ రహస్యమొకటి.. బహుశా మూడో కంటివాడికి తెలిసే అవకాశం లేదు. ఏమో.. అతని తల్లికి తెలుసేమోగానీ! మూడోసారి వాళ్ళింటికెళ్లినప్పుడు అతని బీరువాలో చాలా జాగ్రత్తగా దాచిపెట్టిన పుస్తకాలు కొన్ని ఆమె కంటబడ్డాయి. అశ్లీల చిత్రాలున్న పుస్తకాలవి. షెహెరాజాదే అలాంటివి అంతకుముందు చూడలేదు. పరిశీలనగా ఒక్కోపేజీ తిప్పిచూసింది. బహుశా అవి చూసి అతనికి ఆ వయసుకి అవసరమైన ఉద్రేకాన్ని పొందుతూ ఉండి ఉంటాడనుకుందామె. ఆడపిల్లలకి నెలసరిలాగే, మగపిల్లల వీర్యం కూడా బయటికెళ్లాల్సిందే కదా.. అనుకుంది. అదేమీ అభ్యంతరకరమైన విషయంలా అనిపించలేదామెకి. అయితే.. ఆ అబ్బాయి ఎక్కడినుంచో దిగివచ్చిన వాడు కాదు, ఋషి అంతకంటే కాడు.. మామూలు మనిషే అని నిరూపించాయవి. ఆమెకి అతనిపై ఉన్న వెర్రివ్యామోహం వదిలిపోడానికి ఒకవిధంగా ఉపయోగపడిందా సంఘటన. 

"వాళ్ళింటికి వెళ్ళే దారి మూసుకుపోవడంతో నా పిచ్చి నెమ్మదించింది. ఆ అబ్బాయి చొక్కా వాసన చూడడం కూడా తగ్గింది. పెన్సిల్ ని, బేడ్జ్ ని తరచూ తడిమిచూడడం మానేసాను. జ్వరం తగ్గినట్టుండేది.. తేలికగా. ఆ ఉధృతి ఉన్నంతకాలం నేను నేను కాదు. అందరిజీవితాల్లోనూ ఇలాంటి సంఘటనేదో జరిగే ఉంటుంది. లేదా నాకే జరిగిందో! నీకు ఇలాంటిదేదైనా ఎదురైందా?" షెహెరజాదె అడిగింది. హబార కాసేపు గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించి, లేదన్నాడు. ఆమెకి అదంతగా రుచించలేదు.

"సర్లే.. హైస్కూలు అయ్యేసరికి అతన్ని నెమ్మదిగా మర్చిపోయాను. చాలా త్వరగా, చిత్రంగా మర్చిపోయాను. పదిహేడేళ్ల నేను అంతలా ఆకర్షించబడ్డానంటే అతనిలో ఏముందని బుర్రబద్దలుకొట్టుకు చాలా ఆలోచించాను. గుర్తులేదు. జీవితం భలే విచిత్రమైనది కదా! ఏదో చిన్న ఆకర్షణకి మనల్ని మనం ధారపోసేసుకుంటాం.. మళ్ళీ క్షణాల్లో అది దాటి ముందుకు వెళ్ళిపోతాం. అదీ, నా దొంగతనం కథ.." కనబడని నీలినీడలని మాటల్లో వివరించినట్టు చెప్పబోయింది. ఆమె చెప్పాలనుకున్నది హబార కి అర్ధమయింది. 

మంచం పక్కనున్న గడియారం వైపు కాసేపు చూసింది. ఆమె వెళ్లే సమయం దగ్గరపడుతోంది. కాసేపలా ఆలోచించి చెప్పిందామె.. "నిజానికి కథ అక్కడితో అయిపోలేదు. కొన్నేళ్ళకి నేను నా నర్సింగ్ స్కూల్లో ఉన్నప్పుడు మళ్ళీ మేమిద్దరం ఎదురయ్యాం. ఈసారి కథలో వాళ్ళ అమ్మ పాత్రే ఎక్కువ ఉంది. చాలా చిత్రమైన పాత్ర! వింటావా?" 

"తప్పకుండా.." హబార అన్నాడు. 

"వచ్చేసారి చెప్తాను. టైమయింది. ఇంటికెళ్లి వంటచెయ్యాలి." 

మంచం మీదనుంచి లేచి బట్టలేసుకుంది. ముందు లోదుస్తులు, సాక్సులు, కేమిసోల్.. చివరగా స్కర్టు, బ్లౌజు.. హబార బట్టలేసుకుంటున్న ఆమె కదలికల్ని గమనించాడు. తీసేటప్పటికంటే ఆసక్తికరంగా అనిపించాయతనికి. 

"పుస్తకాలేమైనా తెమ్మంటావా?"
"ఫలానా అనేమీ అక్కర్లేదు.." 

అతనికి కావాల్సింది ఆమె చెప్పబోయే మిగతా కథ. అలా అని బయటికి అనలేదు. మొదటికే మోసం వచ్చే ప్రమాదముందనుకున్నాడు. 

ఆరోజు రాత్రి హబార తొందరగా నిద్రకి ఒరిగాడు. షెహెరజాదె గురించి ఆలోచించాడు. ఆమె ఇంక రాకపోయే అవకాశం లేకపోలేదు.. అనుకున్నాడు. అనుకుంటే బాధనిపించింది. అలా జరిగే అవకాశం మరీ ఎక్కువ. వాళ్ళిద్దరి మధ్య బంధమేమీ లేదు. ఎవరో కల్పించిన అవకాశం.. వాళ్ళు కాదంటే పోయేదే కదా! బలహీనమైన దారంతో కట్టీ కట్టనట్టున్నారిప్పుడు. అది ఎప్పటికైనా.. కాదు కాదు.. కచ్చితంగా తెగిపోతుంది. అది ఇవాళా.. రేపా అనేదే ప్రశ్న. షెహెరజాదె వెళ్ళిపోతే ఆమె చెప్పే వింతవింత కథలుండవు. ఇంకెవరికీ అవి వినబడవు. 

ఇంకో ప్రమాదం కూడా పొంచుంది.. అతని శరీరం ఇంకా కదలలేని స్థితికి వచ్చేస్తే, షెహెరజాదె మాత్రమే కాదు.. మరో స్త్రీ అతని జీవితంలోకే రాదు. వెచ్చని ఆ శరీరాన్ని అతను ఇంకెప్పుడూ హత్తుకోలేడు. కరిగిపోబోయే శారీరక సుఖం అతన్ని భయపెట్టలేదు.. దగ్గరితనపు ఆనందాన్ని వదులుకోవాలంటే బాధగా ఉంది. స్త్రీ లేకపోవడమంటే సాన్నిహిత్యం లేకపోవడమే కదా! హబార అందుకున్నదేదైనా చేజారిపోవడానికే! కానీ షెహెరజాదె ఇచ్చిన బహుమతి అద్భుతమైనది.. తరగనిది. దానిని వదులుకోవాల్సిన కాలం చాలా దగ్గర్లో ఉందనే ఆలోచనే అతన్ని కుంగదీస్తోంది. 

హబార కళ్ళుమూసుకున్నాడు. షెహెరజాదె గురించి ఆలోచించడం ఆపి, లేంప్రే ని తలుచుకున్నాడు. నోట్లో పళ్ళులేని లేంప్రేలు.. రాతికి అతుక్కుని నాచుమొక్కల మధ్యలో దాక్కుని.. నీళ్లలో ముందుకీ వెనక్కీ కదులుతున్న లేంప్రేలు. తనని వాటిలో ఒకటిగా ఊహించుకున్నాడిప్పుడు. ఎదురుచూస్తున్నాడు.. ఒక్క చేపా రాలేదు. బొద్దు చేపే కాదు.. బక్కది కూడా రాలేదు. నెమ్మదిగా వెలుతురు తగ్గి, చీకట్లోకి జారిపోయాడు.