"ఇంతుదయాన్నే లేచావేంటే! ఏ ఊరు పండిందో!" పింజె పెట్టిన చీర నీళ్ళలో ముంచి జాడిస్తున్నదల్లా తలెత్తి అడిగింది అమ్మ.
మాట్లాడకుండా సందులో మూలనున్న రోలు మీద కూర్చుని బ్రష్ నోట్లోకి తోసాను.
"మాయదారి అలవాట్లు! లేవే రోలు మీంచీ.. ఎన్ని సార్లు చెప్పాలి నీకు? పాతికేళ్ళొచ్చినా పెళ్ళవ్వట్లేదందుకే!" అమ్మ విదిలించిన నీళ్ళు మొహం మీద పడి చచ్చేంత చిరాకొచ్చింది. గయ్ మని ఒంటికాలిమీద లేవబోయినదాన్నే ఒక్క క్షణమాగాను. ఈరోజు ఈవిడని ప్రసన్నం చేసుకోవల్సిన పనుంది. రోలు మీద నుండి బోర్లించిన ఇనపబకెట్ మీదకి మారింది పీఠం.
"వంగి ఛస్తుందదీ. చిన్న పిల్లవేంటీ! బర్రెదూడలాగా.. " గుమ్మంలో నిలబడి కిచకిచలాడుతున్న చిట్టి మీదకి పక్కనే ఉన్న చీపురు అందుకుని విసరబోయి ఆగిపోయాను.
తాపీగా నోట్లోంచి బ్రష్ తీసి, మదుం దగ్గర నోరు పుక్కిలించి అరిచాను. "అమ్మా.. ఈ చిట్టిరాక్షసి గుమ్మం మీద నిలబడింది. పరవాలేదా?"
"మాయదారి పిల్లల్లాలా.. రండే కాఫీలకీ. ఎనిమిదవ్వొస్తోంది. స్నానం చెయ్యాలింకా.."
నీళ్ళు మొహం మీద చిలకరించుకుని, చిట్టివైపు చూసి కళ్ళెగరేసాను.
"పులి పేపర్ నవలడం ఇంకా అవలేదు. రా తొరగా.. నువ్వు పెద్ద యుధ్ధమే చెయ్యాలివాళ." అని లోపలికి నడిచిందది.
మొహం కడుక్కుని లోపలికెళ్ళి అమ్మ చెంగుతో మొహం తుడుచుని, కాఫీ గ్లాసు అందుకున్నాను.
గోడవార చిట్టి పక్కనే జారబడి కాఫీ ఆస్వాదిస్తున్నా నెమ్మదిగా..
"ఎన్నాళ్ళయిందో..!! నీ చేతి కాఫీ మాత్రం మిస్ అవుతున్నానే అమ్మా.. అనవే. ఈవిడ భుజాలు గజాలైపోతాయీ.." నవ్వింది చిట్టి.
"నువ్వేం బోడి సలహాలివ్వఖ్ఖర్లేదు.. నా పెదబంగారంతో కొచ్చిన్ పోతా నేను కూడా. నువ్వూ, మీ నాన్నా ఉట్టి కట్టుకు ఊరేగుదురుగాని." అమ్మ నా పక్కనే చతికిలబడుతూ అంది.
"వచ్చేయవే అమ్మా. అట్నుంచలా అమెరికా వెళిపోదాం మనం." అన్నాను కాఫీ మైకంలో మునిగితేలుతూ..
"వెళ్ళండమ్మా వెళ్ళండి. ఇదో అమ్మతల్లీ.. నువ్వెళ్ళేప్పుడు నీ ఉద్యానవనాన్ని కూడా పట్టుకుపో! రోజూ నీళ్ళు పెట్టే పని తప్పుతుంది నాకు." చిట్టి లేచి గ్లాసు సింక్ లో పెడుతూ నా వైపు చూసి సైగ చేసింది. "ఉండూ.." అని శబ్దం రాకుండా పెదాలు కదిపాను.
"ఇదేం వనమే చిట్టీ. అమ్మమ్మా వాళ్ళ పాత పెరడు నీకు తెలీదసలు! ఈ చివర నారింజ చెట్టు తో మొదలెట్టి ఆ చివర కూరాకుమడి దాకా అరెకరం ఉండదూ! ఇప్పట్లా సోగ్గా కొళాయికి గొట్టం తగిలించి నీళ్ళు పెట్టడం అనుకున్నావా? చచ్చేలా తోడిపోసేవాళ్ళం నేనూ, పెదమావయ్యా. చిన్న వెధవ ఎప్పుడూ పనిదొంగేలే!" జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది అమ్మ మాణిక్యం.
"నాకు లీలగా గుర్తుందే. ఇది పుట్టేసరికి అమ్మేశారేం ఇల్లూ.." అని గ్లాసు పక్కన పెట్టి అమ్మ వైపు చూసి అడిగాను నెమ్మదిగా.. "అమ్మా.. పదిగంటల బస్ కి జామి వెళ్ళనా?"
మాట్లాడకుండా లేచి నా గ్లాసు కూడా తీసుకెళ్ళి కడుగుతోంది. వెనకే నిలబడ్డాను. చిట్టి మౌనంగా చూస్తోంది.
"ఒక్క సారి ఆలోచించమ్మా.. మంచి పనేగా నే చేస్తానంటున్నది! ఓ పిల్ల చదువు.. జీవితమక్కడ! మమ్మల్ని చదివించడానికి మీరెంత పడ్డారో తెలీదూ నాకు! ఏదో నాలుగు రాళ్లు సంపాయించుకుంటున్నాను. ఆ పిల్లని అలా ఎలా వదిలేయమంటావు?" నా కంఠశోషే మిగిలేలా ఉంది. అమ్మ పెరట్లోకి వెళ్ళి ఉతికిన బట్టలు దండేల మీద ఆరేస్తోంది.
"పాపం కడిగేసుకోనీ..." అన్నాను నెమ్మదిగా. మాట్లాడకుండా బాత్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంది. నీళ్ళ శబ్దం వింటూ ఆలోచిస్తున్నాను. నాన కిచెన్ లోకి వచ్చిన అలికిడయింది. "కాఫీ కావాలా నానా..." చిట్టి గొంతు. ఇక తప్పదు.. గట్టిగా ఊపిరి పీల్చి వదిలాను.
"జామి వెళ్దాం నానా.. స్నానం చేసి రెడీ అవండి." చెప్పాను స్థిరంగా.
"కాఫీ అక్కర్లేదు కానీ.. చిట్టీ... ఇస్త్రీ అయిందేమో అడుగు సూరిని. టైమౌతోంది." దానిని పంపేశారు బయటికి.
ఫ్రిజ్ పక్కన నిలబడ్డారాయన. పెరటి గుమ్మానికి వేలాడుతూ నేను.
"అయిపోయిందేదో అయిపోయింది. అవన్నీ తవ్వుకుని మాటలు పడడం మినహా జరిగేదేం ఉండదు. వాళ్ళు మూర్ఖులు." అన్నారాయన.
"అసాధ్యం అంటే మనం ప్రయత్నించనిదే. వెళ్ళి చూద్దాం నానా.. తిడతారంతే కదా! అప్పుడు నా బదులు మీరు మాటలు పడ్డారు. ఇప్పుడు నేనే పడతాను. తెలిసీ ఆ పిల్ల చదువు ఆగిపోతూంటే నాకు కష్టంగా ఉంది." బాధగా చెప్పాను.
"నువ్వు చదివిస్తే.. ఆ పిల్ల చదూకోవద్దూ! వీధిని పోయేదాన్ని తలకెత్తుకోవడం దేనికి? అదీ అడిగి తన్నించుకోవడం ఇప్పుడు.."
"అదేంట్నానా అలా అంటున్నారూ? ఇది మీరు చెయ్యాలనుకున్నదే కదా ఒకప్పుడు! నేను మాట్లాడతాగా.. మీరు వచ్చి నిలబడండి చాలు. ఆ పిల్ల బా చదూతుందట. చిట్టి చెప్పింది."
"దానికెలా తెలుసు!" ఆశ్చర్యంగా చూశారు.
"వాళ్ళ పక్కింట్లోనే ఉంటుందట దీని ఫ్రెండ్."
"ఓహో.. అన్నీ కనుక్కున్నావన్నమాట! సంపాయిస్తున్నావ్ కదమ్మా.. ఇంక నేను చెప్పేదేముంది!" హాల్లోకి వెళ్ళిపోయారు.
"ప్లీజ్ నానా.. అలా అనకండి. నేను యూఎస్ వెళ్తే ఎప్పుడొస్తానో తెలీదు. కనీసం ఏడాది చిక్కుకుపోతానక్కడ. వెళ్ళేలోగా ఈ ఒక్క పని చేసి వెళ్ళనివ్వండి. ప్లీజ్.."
"...."
"అదిగో.. అమ్మొచ్చేసింది. మీరు వెళ్ళండి స్నానానికి. నేను లోపలి బాత్రూమ్లో.." ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను. ఆయన గదిలోకెళ్ళి తువ్వాలు భుజానేసుకుని వచ్చి పెరట్లోకి వెళ్ళిపోయారు.
గబగబా స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. చిట్టి భుజం తట్టి వెళ్ళింది. రెండు ఇడ్లీలు నాముందు ప్లేట్లో.. మొహం చిట్లించబోయి ఊరుకున్నాను. బలవంతాన మింగాననిపించి లేచాను. ప్లేట్ సింక్ లో పెడుతూండగా ఖంగుమంది అమ్మ గొంతు.
"తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరమనీ.. వెర్రి మొర్రి ఆలోచనలు మానుకో శైలా! ఎప్పటి విషయం ఇది. రావణ కాష్ఠం! ఆ ముసలాళ్ళది మూర్ఖత్వమనుకోవాలో, మనదే తప్పనుకోవాలో మరి. మళ్ళీ ఎందుకూ.."
"అడిగి తన్నించుకోవడం.. అంటావ్" గట్టిగానే అడిగాను.
"మొండిదాన్ని మొగుడేం చేస్తాడనీ.. "
నేను మాట్లాడబోయేలోగా నాన వంటింట్లోకి వచ్చారు.
"శైలా.. మాకు తోచినది చెప్పాం. నువ్వు చిన్నపిల్లవేం కాదు. ఆలోచించుకోగలవు. అప్పట్లో ఆ పిల్ల చిన్నదై ఉన్నప్పుడు కూడా సాయం చేస్తామనే చెప్పాం. అంతా మీవల్లే జరిగిందని నింద వేసి అవమానించారే కానీ, సాయం తీసుకోలేదు. మూర్ఖంగా అందరికీ దూరంగా పల్లెటూళ్ళో వెళ్ళి కూర్చున్నారు. అయినా ఆ ఊళ్ళో ఎవరూ లేరిప్పుడు. నీ ఆలోచనని సమర్ధించడానికైనా.. వెళ్తానంటే వెళ్ళు. నాకు కుదరదు." చెప్పారాయన.
"పదిగంటల బస్ కి బయలుదేరుతున్నాను." అమ్మవైపు చూస్తూ చెప్పాను. నిశబ్దం..
***
ఒంటిపూట బడి మొదలయింది మొదలూ చద్దెన్నం మరీ ఉదయాన్నే మింగి పరిగెత్తాల్సి వస్తుంది. కడుపులో చల్లగా ఉంటుంది పెరుగేసుకోవే అని అమ్మ చెప్పినా హబ్బే.. మన వల్లకాదు. పిల్లావకాయో, మెంతిబద్దలో వేసుకు తినేయడమే. ఆ రోజు కూడా అలానే తినేసి ఆదరాబాదరా పెట్టె సర్దుకుని.. చిట్టి పాపాయికి టాటా చెప్పి పరిగెత్తానా.. గుమ్చీ దగ్గర జాగ్రత్తగా అటూ ఇటూ చూసుకుని రోడ్డు దాటుతున్నాను. ఎవరో పిలిచినట్టనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే రవణ! జామి నుంచి ఎప్పుడొచ్చాడో.. రోడ్డు పక్కన మోపెడ్ ఆపుకు నిలబడి చెయ్యూపుతున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాను.
"శైలా.. నువ్వేనా! ఎంత పొడవైపోయావే! నువ్వో కాదో అనుకున్నా.." అన్నాడు.
కాస్త గర్వంగా "నేనే రవణా.. ఎప్పుడొచ్చావూ?" అడిగాను.
"ఇందాకే ఊళ్ళో పనుంటేనూ.. స్కూలుకా?"
"ఊ ఊ.. టైమైపోతోంది" చెప్పాను మోపెడ్ వైపు ఆశగా చూస్తూ.
"ఓ చిన్న పని చేసి పెట్టవే శైలా. నేను బండి మీద దింపేస్తా స్కూల్ దగ్గర."
"తొరగా చెప్పు.. బండి మీద వెళ్ళినా అసెంబ్లీ టైం కి వెళ్ళలేం."
"బాల తెలుసు కదా?" సంకోచంగా నా వైపు చూస్తూ అడిగాడు.
"దాసు తాతగారి బాలక్కేనా? తెలుసు."
"తనకి ఈ చీటీ ఇచ్చొస్తావా?" జేబులోంచి తీస్తూ అడిగాడు.
"ఏవిటిదీ?"
"ఏదో పెద్దాళ్ళ చీటీల్లే. విప్పకుండా, ఎవరికీ చూపించకుండా ఇచ్చేసి రావాలి."
"ఎవరైనా అడిగితే? అసలే దాసు తాతగారు వీధిలోనే కూర్చుంటారు."
"ఆయన జావిఁ వెళ్ళార్లే. నేను నిన్న సాయంత్రం చూశా. పర్లేదు. ఇంకెవరైనా అడిగితే ఊరికే వచ్చానని చెప్పు. బీయీడీ క్లాసుల కోసం బాలక్క నోట్సేదో అడిగిందని చెప్పు పోనీ."
"అలాగే.. " రోడ్డు దాటి రివ్వున పరిగెత్తాను.
ఇలా చాలా సార్లే బాలక్క బీయీడీ నోట్సులు తయారుచేసుకోడానికి నా టెక్స్ట్ బుక్కులు, నోట్సులూ తీసుకునేది. నేనేమో మోపెడ్ మీద రయ్య్ మని స్కూలుకెళిపోయేదాన్ని. కొన్నాళ్ళకి బాలక్కకి పెళ్ళి కుదిరింది. కొన్నాళ్ళంటే మరీ ఎన్నాళ్ళో కాదు. నా దసరా సెలవుల్లో అనమాట. నెలగంటు ముందు పెళ్ళట. బాలక్క బియీడీ నోట్సులు రాసుకుంటూనే ఉంది. పెళ్ళికి జామి నుంచి అందరూ వచ్చేసినట్టే. పెళ్ళి కూతుర్ని చేసేది తెల్లవారు ఝామున కదా.. ముందు రోజే అమ్మా, చిట్టీ, నేనూ దాసుతాతగారింటికి వెళ్ళిపోయాం. నన్ను తోడు పెళ్ళికూతుర్ని చేస్తామని అడిగారట అమ్మమ్మ గారు. నాకు వయొలెట్ కలర్ గార్డెన్ సిల్క్ పరికిణీ కుట్టించారు. సంపెంగ రంగు సిల్క్ చీర కట్టుకుని, బోలెడు పువ్వులు పెట్టుకు కూర్చున్న బాలక్క కి చీటీ అందించాను.. ముందు సాయంత్రమే. కొంచెం భయమేసిందెందుకో!
అర్ధరాత్రి పెరట్లోకి వెళ్తున్న బాలక్కని అమ్మమ్మగారడిగారు.. సాయం రానా అని. "శైల కూడా వెళ్ళాలట పెరట్లోకి. నువ్వు పడుకో" అంది. అప్పటికే నన్ను తట్టిలేపి పెరట్లోకి తీసుకుపోతోంది. "నువ్వెళ్ళొచ్చేయవే.." అని బాత్రూమ్ బయట నిలబడింది. నేను వచ్చేసరికి బాలక్క లేదు. అంత చలిలోనూ చెమటలు పట్టేశాయి నాకైతే. "బాలక్కా.." అని పిలుస్తూ పెరడంతా వెతికి తలుపు దగ్గర ఆగిపోయాను. ఓరగా తీసుంది పెరటి తలుపు. భయమేసి వచ్చి అమ్మ పక్కన పడుక్కున్నాను.
ఉదయం లేచేసరికి అమ్మమ్మగారు పేద్ద శోకాలు తీస్తున్నారు.
"తల్లి లేని పిల్ల కదా అని ఆడిందాటా పాడింది పాటా అన్నట్టు పెంచాను దాన్ని. మా పరువు తీసిపోయింది. ఏ దిక్కుమాలిన వెధవ కళ్ళు పడ్డాయో పిల్ల మీద! నాశనమైపోతాడు." ముక్కు చీదుకుంటున్నారావిడ.
అమ్మ పక్కనే కూర్చుని ఓదారుస్తోంది. చిట్టి మండువాలో స్థంభాలు పట్టుకుని అడుగులు వేస్తోంది. వచ్చిన వాళ్ళు సంగోరు మంది వెళ్ళేపోయినట్టున్నారు. ఏం చెయ్యాలో తెలీక అమ్మ పక్కన కూర్చున్నాను. తాతగారికి ఎగశ్వాసొచ్చేస్తోంది అరిచీ అరిచీ.. నాన, గంట్యాడ మావయ్య గారూ, బుల్లి నాయన గారూ వీళ్ళంతా ఆయన్ని ఆపుతున్నారు.
"ఎక్కడికెళ్తుందండీ. మనుషుల్ని పంపాం కదా.. మీరు కాస్త సావధాన పడండి." అంటున్నారు మావయ్యగారు.
"ఏ త్రాష్టుడి పాల పడిందో నాయనా! ఆడపిల్లలని అమ్మేస్తున్నారని రోజూ పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఈన గాచి నక్కల పాలు చేశాను. బంగారం లాంటి పిల్ల.." అమ్మమ్మ గారికి దుఃఖం ఆగట్లేదు.
"జామి వెళ్ళారా ఎవరైనా?" నెమ్మదిగా అడిగాను అమ్మని.
అమ్మ వినిపించుకోలేదు. మళ్ళీ అడిగాను.
" ఏవిటే గోల. మొహం కడుక్కుని రా.." కసిరింది.
నేను పెరట్లోకెళ్ళి వచ్చేసరికి దాసుతాతగారి చుట్టూ మూగి ఉన్నారందరూ! నాన విసనకర్రతో వీస్తూ దూరం జరగండని కసురుతున్నారు. అమ్మ మంచినీళ్ళ చెంబుతో పక్కనే నిలబడి ఉంది. డాక్టర్ని పిలిపించారు. కాసేపటికి సర్దుకున్నారాయన. బీపీ పెరిగిందని మాత్తర్లిచ్చి వెళ్ళిపోయారు డాక్టరు గారు. పెరట్లోకి చిట్టిని తీసుకెళ్తున్న అమ్మ వెనకే వెళ్ళాను.
"అమ్మా.. "
"ఆకళ్ళా..! ఆగండే.. చస్తూంటే సంధి మంత్రవా అని. పాలు కాగుతున్నాయ్. విరిగిపోతాయో ఏమో! తెల్లవారగట్టా వచ్చాయ్. కాచడానికే వీలవలేదు. ఈ హడావిడిలో.. శీతాకాలమేన్లే.." మాట్లాడుతున్న అమ్మ చెయ్యి పట్టుకున్నాను.
"ఏవిటే.." నా వైపు చూసింది.
"బాలక్క.."
"ఊ.. బాలక్క?" చిట్టిని వదిలి నా వైపు చూసింది.
"జామి వెళ్ళిందేమో అనీ.."
"నీకు చెప్పిందా? ఎప్పుడు? ఏం చెప్పింది?" నిలదీసేస్తోంది.
"అబ్బా.. నాకేం చెప్పలేదే. ఊరికే అనిపించింది."
"అన్నట్టు నిన్న రాత్రి నువ్వు బాలక్కతో కలిసి పెరట్లోకి వెళ్ళావ్ కదే! వెనక్కి వచ్చిందా?" గబుక్కున గుర్తొచ్చి అడిగింది అమ్మ.
"లేదు. అప్పుడే వెళ్ళిపోయింది." నెమ్మదిగా చెప్పాను.
"ఏమయింది చెప్పవే.." నా భుజంలో అమ్మ వేళ్ళు దిగబడిపోయాయ్.
నాకేడుపొచ్చేసింది. ఇంతలో నాన వచ్చారు చిట్టిని ఎత్తుకుని. వెక్కుతూ చెప్పాను. వెనకే అమ్మమ్మ గారు వచ్చి నా చెయ్యి పట్టుకు లాక్కుపోయారు.
"నాకసలు గుర్తే లేదు. దీన్ని సాయం తీసుకు పెరట్లోకి వెళ్ళింది. వచ్చి పడుకుందనుకున్నాను. జెష్ట నిద్ర.. అప్పుడే నేను వెళ్ళుంటే చెమడాలెక్కదీసేదాన్ని. అసలు ఏ తెల్లవారుఝామునో పోయిందేమో అనుకున్నాను. అర్ధరాత్రే...!! ఏమయిందో చెప్పవే." అడిగారావిడ గట్టిగా ఏడుస్తూ.
నాన వచ్చి విషయం చెప్పారందరితోనూ. గంట్యాడ మావయ్య గారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని నెమ్మదిగా అడిగారు.. ఏం చెప్పింది. ఎలా వెళ్ళిపోయింది. ఇంకెవర్నైనా చూశావా.. వెంటనే ఎందుకు అమ్మతో చెప్పలేదు.. ఇలా..
అమ్మొచ్చి నా వీపు మీద ఒక్క చరుపు చరిచింది.
"మామూలప్పుడు ఊరి పెత్తనాలన్నీ పూసగుచ్చినట్టు చెప్తావు కదే! వెంటనే నన్ను లేపొద్దూ! పిల్ల ఎక్కడికెళ్ళిందో... నిజంగానే ఏ దేశాలకైనా..." అమ్మకేడుపొచ్చేసింది. చిట్టి ఏడ్చేస్తోంది.
"లేదే.. జామెళ్ళి ఉంటుంది. రవణ తీసుకెళ్ళుంటాడూ! చీటీ ఇచ్చాడు కదా సాయంత్రం.." బ్రహ్మాండం బద్దలయ్యింది.
బాలక్కకి రవణతో పెళ్ళైపోయిందట. సింహాచలంలో కనిపించారట ఇద్దరూ. రెండేళ్ళ తరువాత ఓ సారెప్పుడో.. వాల్తేరు బస్టాప్ లో బాలక్క కనిపించిందట నానకి. బాలక్క చేతిలో కూతురుందని, రవణ చేతిలో నిత్యం సారాకాయ ఉంటుందనీ చెప్పారు అమ్మతో. ఆ రోజు దాసు తాతగారింట్లో గొడవ జరిగాక మళ్ళీ నేను వాళ్ళింటివైపు వెళ్ళలేదు. అమ్మ కూడా నాలుగైదు సార్లు వెళ్ళి అమ్మమ్మగారు ఏదో అందని ఇంటికొచ్చి ఏడ్చింది. నాన ఓదార్చారు. "చిన్నపిల్ల దీనికి తెలీక రాయబారం మోసేసింది. ఘటన.. నొసటి రాతలా ఉండబట్టే ఆ పిల్లకా బుద్ధి పుట్టింది." అని. అది మొదలూ దాసు తాతగారింటి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాకేదో తప్పు చేసినట్టనిపించేది.
ఓ నాలుగేళ్లకి బాలక్క రవణని వదిలి వెనక్కి వచ్చేసింది. అమ్మా నానా వెళ్ళారు. సాయంత్రం అటువైపు వెళ్దామని కాళ్ళు లాగాయి కానీ.. కొన్నాళ్ళాగాక చూద్దాంలే అనుకున్నాను. ఓ రోజు సూరంపల్లప్పల్రాజు షాపు బయట నిలబడ్డాం నేనూ చిట్టీ.. అమ్మ సరుకులు కట్టిస్తోంది. వెనకనుంచి "శైలా.. బావున్నావే!" అని పలకరింపు. తుళ్ళిపడి చూశాను. బాలక్క! పెద్దగా మారలేదు. బీయీడీ పూర్తవలేదు కానీ నాలుగు ముక్కలు నేర్పగలదని నాన చెప్పి పెద్దిరాజుగారి స్కూల్లో ఉజ్జోగమిప్పించారట తనకి. పక్కనే ఐదేళ్ళ పిల్ల. "నీ పేరేంటీ?" అని చిట్టి అడిగితే 'వకుళ' అని చెప్పిందది. సన్నగా, ఎర్రగా అచ్చం రవణలా ఉంది.
***
నేను ఇంజినీరింగ్ లో జాయినయిన ఏడాదికి అనుకుంటా. సెలవులకి ఇంటికెళ్ళినప్పుడు ఓ రోజు ఉదయాన్నే బయటికెళ్ళి వచ్చిన నాన మోసుకొచ్చిన విషయం .. బాలక్క ఎవరితోనో వెళ్ళిపోయిందని. "రవణా?" అన్నాను అనుమానంగా..
"నువ్వు నోరుమూసుకు లోపలికి పోవే.." కసిరిందమ్మ.
"పెద్దాయన పరిస్థితేం బాలేదు. బీపీ దారుణంగా ఉందన్నాడు డాక్టరు. చిన్నపిల్లని వదిలేసి ఎలా పోయిందసలు!! ముసలావిడవల్ల అయ్యే పనేనా మరో ఆడపిల్లని పెంచడం?" నాన కుర్చీలో కూలబడ్డారు.
"స్వార్ధం! అయినా అదేం పోయేకాలం దానికసలు! ఆ ముసలిప్రాణాలు తిన్నగా వెళ్ళవా భగవంతుడా? పోనీ పోయేదేదో పిల్లని తీసుకునే పోవచ్చు కదా? పిల్లని కాదనుకునే తల్లుంటుందా? కలికాలం.." నేల మీద చతికిలబడిపోయింది అమ్మ.
"పాము కి పాలుపోసి పెంచామనుకోవడమే అని నిర్లిప్తంగా మాట్లాడుతోందా పెద్దావిడ. నాకావిడని చూస్తే భయమేసింది. నువ్వు ఆనకోసారి వెళ్ళిరా.. పిల్లదాన్ని తీసుకొచ్చేస్తావా?" అడిగారు నాన.
"అయ్యో.. మనకేమైనా భారమా? నేనూ అదే అనుకుంటున్నాను. తీసుకొచ్చేసుకుందాం."
"మొత్తానికి ఉంచేసుకుందామంటే పంపరేమో. అసలు అందరూ మా ఇంటికొచ్చేయండి. ఒక్కరే ఎలా ఉంటారూ అన్నాను. అలవాటైపోయాయ్ దెబ్బలు.. అన్నారు పెద్దాయన"
"ఏం రాతో పాపం! కూతురు పోయింది. అల్లుడు పట్టించుకోలేదని ఈ మనవరాల్ని.. పసిగుడ్డుని సాకారు. ఇప్పుడు ఎనభయ్యిల్లో పడ్డాక మునిమనవరాల్ని పెంచాలా వాళ్ళు! అసలు ఆ సిగ్గుమాలింది ఎక్కడుందో వెదికి లెంపలు వాయగొడితే సరి!" అమ్మకి వెర్రి కోపమొచ్చేసింది.
వకుళ మా ఇంటికి రాలేదు. దాసుతాతగారూ వాళ్ళూ ఇక్కడి ఇల్లు అద్దెకిచ్చి జామిలో పాతింటికి వెళ్ళిపోయారట. నాలుగైదు సార్లు నానా, అమ్మా అక్కడికి వెళ్ళి పిల్లదాన్ని పంపమని అడిగి కాదనిపించుకున్నారు. ఒకసారైతే "ఇంకా ఏం మిగిలిపోయింది నాయనా.. వదిలేయండి మమ్మల్ని." అని తలుపేసారట అమ్మమ్మగారు. అదే ఆఖరు.. రాకాపోకా ఆగిపోయింది. తరువాతెప్పుడో చిట్టి ద్వారా తెలిసిన విషయమేవిటంటే.. వకుళ చదువు మానేసిందని, అంగన్ వాడీ స్కూల్లో టీచర్ కి హెల్పర్ గా చేస్తోందనీ.. పిల్లలని ఆడించి అక్కడే బోయినం చేసి వస్తుందని తెలిసింది. "ప్రవేటుగా పదికి కట్టొచ్చు కదే.." అని చిట్టి ఫ్రెండ్ అడిగితే.. "డబ్బులుంటే నేరుగా కలెక్టర్ చదువే చదివేదాన్ని" అని నవ్విందట.
***
తొలి జీతం అందుకోగానే వెంకన్న మొక్కుతో పాటూ వకుళ మొక్కూ తీర్చాలనిపించింది. ఇన్నాళ్ళకి కుదిరింది. ఉహూ.. కుదురుతుందేమో అని ఆశ. ఊరు మారింది అని పొలిమేరల్లో కనిపించిన అపార్ట్మెంట్ లు చెప్పేశాయి. కణతలు రుద్దుకున్నాను.. ఎలా మాట్లాడాలీ అని.
"అమ్మమ్మ గారూ.. నేనూ శైలని. గుర్తు పట్టారా?" ఉన్నంతలో శుభ్రంగా ఉన్న ఆ పెంకుటింటి వసారాని పరికించి చూస్తూ అడిగాను.
"ఎవరే అదీ.. " లోపల్నుంచి తాతగారి గొంతు ఖంగుమంది.
జారిపోతున్న జుట్టుముడి తిరిగి వేసుకుంటూ లోపలికి రమ్మని సైగ చేసారావిడ. తల పైకెత్తి, జారిన చత్వారపు అద్దాల్లోంచి చూశారాయన.
"అమ్మణి కూతురు శైల ని తాతగారూ.. బావున్నారాండీ?" ముందు గదిలో పడక్కుర్చీలో కూర్చున్న దాసు తాతగారి కాళ్ళకి దణ్నం పెట్టాను.
"శైలేవిటే విరోధాభాసం పిలుపూ..! శైలనందన అంటే సోకు తక్కువయ్యిందా ఏం? దీర్ఘాయుష్మతీ భవ!" తల మీద చెయ్యుంచారాయన.
"బయటివాళ్ళు నందన అనే పిలుస్తారండీ.."
"ఇదింకా నికృష్టం. ఎవడి నందనా? సర్లే.. ఏవిటీ ఇలా వచ్చావూ? మావయ్యలెవరైనా వచ్చారా ఊళ్ళోకీ?"
"లేదండీ. నేనొక్కర్తినే వచ్చాను. రెణ్ణెల్లలో అమెరికా వెళ్తాననుకుంటున్నాను. ఓ సారి చూసి వెళ్దామనీ.." అన్నాను మంచినీళ్ళ గ్లాసు జాగ్రత్తగా ఎత్తి నోట్లో పోసుకుంటూ. నేను చెప్పిన మాట నాకే నమ్మశక్యంగా లేదు.
"శుభం! వీర్రాఘవుడి కొడుకు కూడా అక్కడే ఎక్కడో ఉన్నాడనుకుంటా! ఆ మధ్య ఊళ్ళోకొచ్చి ఫోటోలు తీసుకెళ్ళారు. దేశం దాటాకే గుర్తొస్తాయ్ సంస్కృతులూ సంప్రదాయాలూనూ.." ఆయన చూపు పొట్టిగా ఉన్న నా జుట్టు మీద ఉందేమో అనిపించిందో క్షణం.
"వకుళ లేదా?" నా గొంతు నాకే కొత్తగా ఉంది.
"స్కూల్లో ఉంటుంది. రెండయ్యాక వస్తుంది." ముక్తసరిగా చెప్పారాయన.
ఆయనతో ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. చదువుకునే పిల్లనే కదిపితే సుఖమనిపించింది. పక్క వీధిలో ఉన్న పుల్లల అడితి ఎదురుగానే స్కూలని చిట్టి చెప్పింది. వీళ్ళు ఇంట్లోకే రానివ్వకపోతే అదే మార్గమని ముందే కనుక్కొచ్చాను కదా మరీ..
"నేను అలా ఊళ్ళోకి వెళ్ళొస్తా తాతగారూ.."
"బోయినానికి వచ్చేయ్.." అమ్మమ్మ గారి గొంతు విని మహా ఉత్సాహమనిపించింది. హుషారుగా తల ఊపి బయటపడ్డాను.
***
"చిట్టెలా ఉందక్కా. ప్రవీణ చెప్తూ ఉంటుంది. చాలా బాగా పాడుతుందట కదా తనూ?" ఎర్రగా ఉన్న జుత్తుకి నూనె రాసి బిగించి జడ వేసుకుంది వకుళ. మట్టిరంగు మీద నీలం పువ్వులున్న సింథటిక్ చుడీదార్. మనిషి పల్చగా పొట్టిగా ఉంది.
"బావుంది. నువ్వెలా ఉన్నావు?" మూడోసారనుకుంటా ఎలా ఉన్నావని అడగడం.
"బానే ఉన్నా."
"స్కూల్లో చేస్తున్నావా.." ఏవిటో పిచ్చిప్రశ్న
"అవును. నువ్వెక్కడో వేరే ఊళ్ళో ఉంటావట కదా. కలకతా.."
"కొచ్చిన్.. కేరళ లో"
"ఓ.."
"చదూకుంటావా వకుళా?" హమ్మయ్య.. అడిగేశాను.
"ఏంటక్కా?" అర్ధం కానట్టు అడిగింది.
"చదివిస్తాను. చదూకుంటావా?"
"......."
"తాతగారికి నచ్చచెప్పుదాం. నువ్వు ఊ అంటే.."
"ఎందుకూ చదివిస్తానంటున్నావ్?"
నేనసలు ఊహించని ప్రశ్న! తడబడ్డాను.
"పదక్కా.. ఇంటికెళ్దాం." పరిగెత్తుకెళ్తున్న పిల్లల్ని చూస్తూ చెప్పింది. మౌనంగా నడుస్తున్నాం. చిన్నపిల్లతో కూడా మాట్లాడలేకపోతున్నాననిపించింది.
"నువ్వు చదూకుంటే తాతగార్ని, అమ్మమ్మనీ బాగా చూసుకోవచ్చు. నీకూ వాళ్ళ తరువాత చదువే ఆధారమవుతుంది." గంభీరంగా చెప్పాను.
"ఊ.." కాసేపు మౌనం.
"విశాపట్నం వెళ్ళావా అక్కా ఈ మధ్య?" అడిగింది తనే..
"మొన్నే వెళ్ళా యూనివర్సిటీలో ఏదో పనుండీ." చెప్పాను. ఈ ప్రస్తావన దేనికో అర్ధం కాలేదు.
"లాసన్స్ బే కాలనీ అట. అక్కడుంటుంది అమ్మ."
"చూడాలనిపిస్తోందా?" జాలిగా అడిగాను.
"ఉహూ.. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్తుంది అవ్వ. మనదేం లేదన్నమాటేగా. నువ్వేదో చేశావని తిట్టారట కదా అప్పుడు? అదేం లేదు. అమ్మ బావుందట. ఆర్ ఎంపీ మూర్తి గారి భార్య చెప్పారు. మాట్లాడారట అమ్మతో మొన్నీమధ్యే." తల తిప్పి నా వైపు చూస్తూ చెప్పింది. ఆ పిల్ల చూపులు స్వచ్ఛంగా ఉన్నాయి.
"నువ్వు బాలేవు కదా! నిన్నెవరు చూస్తారు?" ఆ పదారేళ్ళ పిల్ల నాకెందుకో చిట్టికంటే చాలా పెద్దదానిలా కనిపిస్తోంది.
"నాకేం?" నిజాయితీగా ఉందా మాట.
"ఏమో.. ఇంకా బావుండచ్చేమో ఇదంతా.." ఇల్లు కనిపిస్తోంది అల్లంత దూరంలో.. ఆగాను.
"చదువుకో వకుళా.. చదివిస్తాను."
"తప్పకుండా అక్కా. కానీ.. అమ్మ విషయంలో నీకేదైనా బాధుంటే.. అది వదిలేయ్."
"నీకు తెలీదులే.." చప్పరించేసాను.
"నన్ను అక్కడ పెంచడం కష్టం. అతన్ని తాత రానివ్వరు. వీళ్ళకి నన్ను వదిలేసి ఉండకపోతే..."
"ఊ...." కొత్తకోణం చూపిస్తోంది.
"వీళ్ళు ఇలా కూడా ఉండేవారు కాదేమో!" గేటు తీసి అవ్వా అని పిలుస్తూ వెళ్తున్న వకుళ... పర్లేదు. బతికేస్తుంది.
చాలా రోజులకు వ్రాశారే. మీ మార్కుతో బావుంది కథ.
ReplyDeleteఅవునండీ.. చాన్నాళ్ళయింది. ధన్యవాదాలు! :)
DeleteBRILLIANT
ReplyDeleteధన్యవాదాలు!
Deleteఅగ్రహారం కథలు
ReplyDeleteచదువుతుంటే ఎందుకో పతంజలి గుర్తొచ్చారు. కథాసంకలనం వ్రాయండి కోవాగారు.
పతంజలి! ఆయన దద్దయ్యల కథలు చెప్పారనా? :)
Deleteముందు కథలు రాయనీయండీ. :) ధన్యవాదాలు!
చాలా బాగా రాశారు... ఇలాగే రాస్తు మమ్మల్ని నవ్వించండీ..-:)
ReplyDeleteధన్యవాదాలు!
Deleteమీరు కథను narrate చేసే తీరు చాలా బాగుంటుంది. ఇతరుల పాత్రల గురించి తెలియదుకానండీ, వకుళ మాటలు చూస్తే ఎందుకో శ్రీదేవిగారి ’కళ్యాణి’ గుర్తొచ్చింది.
ReplyDeleteప్రశంసకి ధన్యవాదాలండీ! శ్రీదేవి గారి కల్యాణికి "ఆత్మవిశ్వాసం" మహా మెండు. సాయం తీసుకోను పొమ్మంటుంది కదా మరీ! వకుళకి ఇంకా చేతకాలేదది. :) మీరు ప్రస్తావించిన తరువాత ఆలోచిస్తే 'దాదాపుగా ఎవరూ లేకపోవడం' విషయంలో పోలికైతే ఉందనిపిస్తోందండీ.
Deleteశ్రీదేవి గారి ఇందిరా? కల్యాణా?? కల్యాణి కి ఏడుస్తూ కూచోడం తప్ప ఇంకేమీ చేతకాదే!!
Deleteచాలా బాగుందండీ...
ReplyDeleteధన్యవాదాలు!
Deleteకథ బాగుంది .
ReplyDeleteధన్యవాదాలు!
Deleteఒక్కసారి మనసంతా శూన్యమైపోయింది. నాగార్జునగారు అన్నట్టు మీ కథనం చాలా బాగుంటుంది. బహుశా కథని ఉత్తమపురుషలో చెప్పడం వల్ల అందులోని ఆత్మీయత మరింతగా పాఠకుని మనసుకి హత్తుకుంటుందనుకుంటా.
ReplyDeleteఉత్తమపురుషలో చెప్పడంలో సౌకర్యమైతే కనిపిస్తోందండీ. మీరన్నవిషయం ఇప్పుడే గమనిస్తున్నాను. ధన్యవాదాలు!
Deleteincredible.
ReplyDeleteధన్యవాదాలు!
Deleteమీ కధలన్నిటిలానే ఈకధా బావుంది.చిక్కగా అల్లుతారు కధ ని మీరు.
ReplyDeleteధన్యవాదాలు!
Deleteచాలా బాగా వ్రాశారు.
ReplyDeleteధన్యవాదాలు!
Deleteమళ్ళి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదండి.
ReplyDeleteఎప్పటి లాగానే అద్భుతం.
చాలా చాలా బావుందండీ :)
ReplyDeleteధన్యవాదాలు!
DeleteWonderful!!
ReplyDeleteధన్యవాదాలు!
Deletenagarani yerra has left a new comment on your post "ఏం పర్లేదు..":
ReplyDeleteచీటీలు మోసిన శైలకి, వకుళకూ తెలివితేటలలో ఎంతటి వ్యత్యాసం. పరిస్థితులను బట్టి పరిణితి వస్తుంది అనిపించింది.కథ చాలా బాగుంది.
నాగరాణి గారూ, మీ కామెంట్ పొరపాటున డిలీట్ చేసేశానండీ. నాలిక్కరుచుకుని మైల్ లో ఉన్నది ఇక్కడ పేస్ట్ చేసాను. అవునండీ! పరిస్థితులు, పెరిగిన వాతావరణం చాలా విషయాలు నేర్పుతాయి. పరిణితిలో వ్యత్యాసం కచ్చితంగా ఉంది. ఉండాలి కూడా.. వ్యాఖ్యకి ధన్యవాదాలు!
Deleteokka mukkalo manasuni hattukunela...ending istarandi...vakula entha parinithi tho alochinchindandi... chala chala bagundi katha..
ReplyDeleteVAKULA peru lone pathra svabhavam choopinchesaru anipinchindi ending chadivaka... :)
ధన్యవాదాలు!
Deleteచాలా బావుందండీ...మనసుకి హత్తుకునేలా వుంది మీ శైలి ఎప్పటిలాగానే...
ReplyDeleteగంట్యాడ, జామి, ఈ ఊర్ల పేర్లు విని ఎంత కాలమయ్యిందో. these villages are very big nostalgia for me
ReplyDeleteఎప్పటి లానే కథ చాలా బాగుంది. కథ కన్నా కథనం చాలా చాలా బాగుంది.
కాముధ
@ these villages are very big nostalgia for me.
Deleteఅవునా! :) ధన్యవాదాలు!
శైలనందన, బాల, వకుళ... ముగ్గురిదీ ప్రత్యెక వ్యక్తిత్వమే... ఆటుపోట్ల బాల్యం గడిపిన పిల్లలలో సహజంగా వచ్చేసే పరిణతిని వకుళ పాత్రలో బాగా చిత్రించారు. బాల రెండో నిర్ణయంతో వేగం పుంజుకున్న కథనం, ముగింపు దగ్గర ఒక్క జర్క్ తో ఆగింది.. మీ కథనాన్ని గురించి ప్రత్యేకం చెప్పడానికి ఏముంది!!
ReplyDeleteమీ విశ్లేషణకీ, ప్రశంసకీ ధన్యవాదాలండీ!
Deleteకొంచం చాలా ఆలస్యంగా చదివాను కధని.
ReplyDeleteకొత్తవకాయ గారి బ్రాండ్ కధనం,చివరికొచ్చేసరికి ఆత్రేయ లెవెల్లో గుండెని భారం చేసారు.
భారం అనుకోకండి. ఏది ఏమైనా.. "ఏం పర్లేదు" అని చెప్పకనే చెప్పింది కదా వకుళ. :) ధన్యవాదాలు!
Deleteఎప్పటి లాగే చాలా చాలా బావుందండి , కానైతే నాకు నాలుగైదు సార్లు చదవాల్సి వచ్చింది కథని అర్ధం చేసుకోవటానికి :-)
ReplyDeleteఅవునా.. :) ధన్యవాదాలు!
Deleteఅంటే నా ఉద్దేశ్యం చాలా పదాలు నాకు తెలీయనివి వచ్చాయి అని అండి :-)
Deleteబావుందమ్మాయ్, కొత్తగా ఉంది కథ! చివర్లో వకుళ చూపిన పరిణితి...ఏమో కష్టాల్లోంచి వస్తుందేమో! వకుళ ఆలోచన నాకు తట్టనేలేదు..నిజంగానే కొత్త కోణం..బారాసావ్!
ReplyDeleteకష్టాలు అనను కానీ.. జీవితానుభవాలతో వచ్చే పరిణతి సామాన్యమైనదేం కాదు కదా. థాంక్యూ! :)
DeleteREALISTIC. ......nktr.
ReplyDeleteIlanti aadavallunna paravaa ledu kaani, Ilanti AMMA-lundakudadu.
ReplyDelete.....................padma mani
వకుళకేం పర్లేదు కదండీ.. అదే కదా ఇక్కడ కథ. ధన్యవాదాలు!
Deleteచాలా పరిణతితో బాగా రాశారు. వస్తువు, శిల్పం, శైలి అన్నీ చక్కగా కుదిరాయి. ఇంకా ముఖ్యంగా, అంతా చెప్పేశాయాలన్న లౌల్యం లేకుండా రాశారు. మీరు చెప్పాల్సిన కథలు ఇంకా ఉండాలనే కొరుకుంటున్నాను జంపాల చౌదరి
ReplyDeleteలౌల్యానికి పోకుండా ఉండాలనేదే నా మొదటి కట్టుబాటు. పాఠకుల మేధ పై నాకు అపారమైన నమ్మకం ఉందండీ. అన్నీ చెప్పేయక్కర్లేదు కదా. మీ ప్రశంసకు ధన్యవాదాలు!
DeleteKatha kathanam , mugimpu anni chala bagunnai andi ...
ReplyDeleteధన్యవాదాలు!
Deleteawesome...kalaniki taggatuuga undii..!!
ReplyDeletekatha, katnam, patralu mariyu vatini jodichina vidanam bagundi...!!
ReplyDeleteధన్యవాదాలు!
Deleteచాలా అంటే చాలా బాగుందండీ..వకుళ పరిణితి చాలా సహజంగా ఉంది . చెప్పాలంటే, బరువేక్కే గిల్ట్ అని కాకపోయినా, చెప్పే తీరు చాలా బాగుంది .. !! ఒక్కోసారి చిన్న విషయాలే తీర్చుకోలేని కోరకలు అవుతాయి, అలా కాకుండా , శైల పాత్ర పాత్రలని అర్ధం చేసుకొనే తీరు చాలా బాగుంది .
ReplyDeleteచాలా బాగుంది కధ. అన్నీ సహజంగా ఉండే పాత్రలతో. చెప్పాలంటే పెద్ద గిల్ట్ కాకపోయినా, చిన్న చిన్న విషయాలు మనసులో వేసే ముద్ర, చాలా సహజంగా చెప్పారు. వకుళ చేత " పర్లేదు బ్రతికేస్తుంది " అనిపించి ..చెకోవ్ కధలలాగా చురుకైన ముగింపు ఇచ్చారు. చాలా బాగుంది. మీరు చెప్పాల్సిన కధలు ఇంకా ఉన్నాయని ఆశిస్తున్నాను.
ReplyDeleteమీకు ఇంతగా నచ్చినందుకు సంతోషమండీ. ధన్యవాదాలు!
Delete
ReplyDeleteబావుంది.....
నాకైతే నీ 'ఛాయ ' అనిపించటంలేదు..
ఎక్కువ వర్ణనలవీ లేకుండా, ఏది ఎంత చెప్పాలో అది స్థిరంగా చెప్పడం బాగా నచ్చింది!
అన్నిటికంటే-- అసలు బాలతో ఏవీ మాట్లాడించకుండానే తనని కధకి ముఖ్య పాత్రధారిని చేయడం బావుంది.
హమ్మయ్య! బాల మాట్లాడలేదన్న విషయం పట్టుకున్నావు కదా! ఇది బాల కథే కానీ.. వకుళ వైపునుంచి బాల కథ మరి. థాంక్యూ! :)
Deleteఇంతకీ ప్రధాన పాత్ర గిల్ట్ తీరిందా? దానితో మొదలుపెట్టారుగా కథని.. పిలేల బతికేయడం గురించిన సందేహంతో కాదేమో కదా...
ReplyDelete"అమ్మ విషయంలో నీకేదైనా బాధుంటే అది వదిలేయ్.." అని వకుళ చెప్పేసింది కదండీ. ఇక గిల్ట్ తీరినట్టే కదా. :) ధన్యవాదాలు!
Deleteచాలా బాగుంది.
ReplyDelete"Writing is an extreme privilege but it's also a gift. It's a gift to yourself and it's a gift of giving a story to someone."
ReplyDeleteAmy Tan, American Writer.
కొత్తసీసాల్లో పాతసారా నిరంతరాయంగా నింపుకొస్తూ, తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేయ కంకణం కట్టిన స్వయంప్రకటిత రచయితలు/రచయిత్రుల కాలంలో నిజమైన మేలిమి 'రచయిత్రి'ననిపించుకోవడానికి ఒక్కో అడుగూ చక్కగా వేస్తున్నారు. మరో ఆణిముత్యం ఇది..
:) సామెతలు తిరగరాసేస్తున్నావ్ కదా!
Deleteబాగుందండీ కథ..
ReplyDeleteశైల నందన పేరు చాలా బాగుంది. :)
పేరు నాక్కూడా నచ్చిందండీ. :) ధన్యవాదాలు!
Deleteమా తూరుపు యాస, కథనం అంతా మనం శైల ఇంట్లోకి తొంగి చూస్తున్నట్టు, కాసేపు శైల చిన్నతనం అప్పుడు ఎంత అమాయకం, ఒక అబ్బాయి, అక్క కి ఉత్తరం ఇమ్మన్నాడు అంటే ఎగురుకుంటూ వెళ్లి ఇచ్చేయడమే ,ఇప్పుడయితేచిన్నపిల్ల కి కూడా తెలుసును ,ప్రేమలేఖ అంటే ఏమిటో, హుహ్...మన మనసుకి శాంతీ అని అలోచిస్తే చాలదు , అవతలి వారికి నచ్చాలి కదా ,మన మనశ్శాంతి పథకం. ఫర్లే అవును బాగానే బతుకుతుంది వకుళ ,వయసుకి మించిన పెద్దరికం వచ్చి పడిపోయింది మరి, తల్లి చేసే పనులకి పిల్లలకి ఇది శిక్షా ? మేలా? నా సంతోషమో మరి అనే అమ్మలకి ఒక జవాబు ఈ కథ. ఎంత బాగుందో మరి ఇంతకన్నా మాటల్లో చెప్పలేను.
ReplyDeleteవసంతం.
ధన్యవాదాలు!
Deleteచాల బాగుందండి . కథ, కథనం చివరి వరకు.
ReplyDelete:venkat
ధన్యవాదాలు!
Deleteచాలా బాగుంది అండీ .....
ReplyDeleteధన్యవాదాలు!
Deleteకద అంటే ఇదే సుమా ! అన్నట్లు రాసారు. మీరు కధను ముందుకు తీసుకెళ్ళిన తీరు చాల అద్భుతంగ వుంది.అబ్బ! మనసుని హత్తుకునేలా ఈ కధ.చాల బావుంది.
ReplyDeleteపెద్ద ప్రశంస! ధన్యవాదాలు!
Deleteమీ, కథా, కథనం తో బాటు ముగింపు కూడా చాలా బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు!
Deleteచాలా బాగుంది. ఏదో చాలా దగ్గరవాళ్ళు కూర్చోబెట్టుకోని కథ చెప్పిన అనుభూతి వుంది మీ శైలిలో..
ReplyDeleteధన్యవాదాలు!
DeleteMee blog peru chadavagane noru oorindi... kotha vakaya ani peru unnanduku notiki maanchi ruchi icche avvakaya antha kammaga unnayi mee kathalu.. me shailu kooda chala bagundi.. :)nenu ee bog prapanchaniki ivale kotha ga vacchanu... mee blog chadivaka chaala manchi anubhoothi.. naaku prerana kuda kalipinchindi:)
ReplyDeleteధన్యవాదాలు!
Deletenarration chala bavundi kottavakayagaru.
ReplyDelete-radhika.
inta baga ela rayagalru?
ReplyDeleteinta baga ela rayagalru?
ReplyDelete