"అమ్మమ్మగారూ, మీరేం చదూకున్నారండీ?" పదకొండేళ్ళ పిల్ల నిలదీస్తోంది.
అట్నుంచి సమాధానం రాలేదు. బాదం చెట్టు నీడ అరుగుమీదకి వాలుతోంది. మధ్యాహ్నపు దాహానికి కాకి కావుకావుమంటోంది.
పెరటి గుమ్మానికి పక్కనే అరుగు మీద పీట వాల్చుకుని, గోడకానుకుని సొట్టకాళ్ళు జాపుకు కూర్చున్నారావిడ. కొద్దిగా పొట్టైన పరికిణీ జాకెట్టు వేసుకున్న పిల్ల, రెండుజడల్నీ ఇట్నుంచటుతిప్పి పీకకి మెలివేసుకుని అరుగుమీద నుండి కాళ్ళు వేలాడేసుకుంది. చతికిలబడ్డాక కావలసినవన్నీ గుర్తొస్తాయావిడకి.
"హయ్యొ.. మతిమండా.. మర్చిపోయానూ!! ఇదిగో ఏవేఁ పోలీ, అలా వెళ్ళి ఓ నాలుగు చీపురుపుల్లలు పట్రావే. వరండాలో వార బల్ల కింద కుట్టు పుల్లల చీపురుంటుంది. అందుల్లోంచి తే.."
ఆవిడ మాటలకి కదలకుండా అలాగే చూస్తోందాపిల్ల.
"మిడుతూ మిడుతూ చూస్తావేం! పోయి పట్రా.." అదిలించారు.
"ఉహూ.."
"తేమ్మా? లేవలేనే!" ఈసారి జాలిగా మొహం పెట్టి అడిగారు.
"లేవలేనే.." వెక్కిరించింది.
మళ్ళీ తనే.. "పోలీ, పొత్రం అంటే ఎవరు చేస్తారేం? పోలిట పోలి.. నేనేమైనా పైడి కూతుర్నా? మా అమ్మ కూతుర్ని." అని ధిక్కరించింది.
"మీ తాతగారి మనవరాలివి. మీ అమ్మ చదువుకోమంటుందనీ, పన్జెప్తుందనీ ఇక్కడ చేరి తాతగారితో కలిసి సుబ్బరంగా వెన్నపూస దిగమేస్తే పొత్రానివి కాక ఇంకేవఁవుతావ్? దిబ్బాలమ్మా పండగా అద్దురూపాయ్ దండగా అని.."
"ఓ.. మీ పుట్టింటి వెల్లావుల పాలన్నీ వెన్నపూస చేసి పెడుతున్నారు మరి!" పిల్ల ఉడుక్కుని అరిచింది.
"ఓసినీ... నోటికి ఎంతొస్తే అంత అనీడవేఁనేంటే!! బాగా నేర్చావు తాతగారి దగ్గర..." మిగిలిన మాటలన్నీ సణుగుడులోకి తిరిగాయ్..
"మీరు నన్ననచ్చేవిఁటీ?"
ఆవిడ మాట్లాడలేదు.
"ఒక్ఖ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పారూ..!? ఎందుకు తేవాల్టా!" పిల్ల మూర్ఖించింది.
సణుక్కుంటూ గోడ పట్టుకుని లేవబోయారు.
పిల్ల కాళ్ళు ఈడ్చి తాటిస్తూ వెళ్ళి చీపురుపుల్లలు పీక్కొచ్చింది.
"ఆడసంతవే కదా! పెద్దమ్మ తల్లిలా అలా కాళ్ళు తాటిస్తావేం!" గద్దించారు.
"మీరూ ఆడసంతే కదా!"
"యతీ అంటే ప్రతీ అనీ.. మాటకి మాటా బాగా నేర్చావ్. నావి సొట్టకాళ్ళు కనకా ఈడ్పు. నీకేవొఁచ్చింది రోగం! అలా చప్పుడు చెయ్యకూడదు. చక్కగా నడవాలి. అసలే మీ అమ్మ బెంగ పెట్టుకు ఛస్తోంది."
"దేనికి?" గుమ్మం పట్టుకుని ఊగుతూ, ఇంట్లోకి తొంగిచూస్తూ అడిగింది.
పట్టీల మువ్వలు గిల్లుగిల్లుమన్నాయి. లేత చెంపలూ, చిట్టిముక్కు.. పిల్ల కోలకళ్ళు చురుగ్గా మెరుస్తున్నాయి.
"లేచారేవిఁటే?" గుసగుసగా అడిగారావిడ.
"ఆహాఁ.. ఏ పొద్దనగానో లేచి చదువుకుంటున్నారు." నవ్వాపుకుంటూ చెప్పింది.
"అప్పుడేనా!" పుల్లలు చీరుతున్నావిడ ఆగి అపనమ్మకంగా చూస్తూ..
"ఊ.. లేచి పలహారాలు వండండి."
"ఆఁ.. వండుతాను వండుతాను. మీ తాతగారి కూడా కూర్చుని దొబ్బి తిందువులే.."
"ఇగో తాతగారూ . చంద్రకాంతలు పుచ్చుకుంటారా? చక్కిలాలా?" పిల్ల లోపలికి చూస్తూ కీచుగా గొంతు పెంచింది.
"నీ నోరుబడ.. ఇటురా చెప్తా రేపట్నుంచీ.." పళ్ళు బిగించారు.
"ముందు మీరేం చదూకున్నారో చెప్పండీ.."
"ఇంత మొండి రోగవేవిటే నీకు!! ఎన్నిమార్లడుగుతావ్? నా చదువులూ చట్టుబండల సంగతీ నీకెందుకే!"
"మొన్నెప్పుడో లెక్కల్లో తక్కువమార్కులొచ్చాయని మా అమ్మ చెప్తే ఊరంతా టముకేసి మరీ నవ్వారుగా.. నేను చదువూసంధ్యల్లేక్కుండా తిరుగుతున్నాననీ. చింతపిక్కలు కడిగివ్వమంటే పైడి 'సదూకోండమ్మా.. ఊకె సింతపిక్కలేడికీ పొవ్వూ..' అని విసుక్కుంది. మీవల్లే. అందుకే.. చెప్పండి. మీరేం చదివారేం?"
మాట్లాడకుండా ప్రశాంతంగా పని చేసుకుంటున్నారావిడ. గోడకి జారబడి కాళ్ళు బారజాపుకుని, ఎడమ వైపుకి వంగి మూలకి ఉన్న తిరగలిని పక్కకి జరిపారు. ముందు రాత్రి మంచుకి తడిసి మెత్తబడిన విస్తరాకుల బొత్తి తిరగలి కింద మణగబెట్టి సిద్ధంగా ఉంది. ఒక్కోటీ తీసి రెండేసి ఆకులు అమర్చి పుల్లతో చిటుకూ చిటుకూ కుడుతున్నారు. చూస్తూండగానే అల్లినట్టూ ఆకులు చేర్చి గుండ్రని విస్తరి తయారైపోయింది. ఓసారి కుట్టు చూసుకుని పక్కన పెట్టి, గోడకి ఆన్చి ఉన్న చిన్న పీట తిరగేసి విస్తరి మీద బరువుకి వాల్చారు. చకచకా మరోటి కుట్టనారంభించారు.
"పోనీ, మా అమ్మ ఎందుకు భయపడి ఛస్తోంది, చెప్పండిదైనా?"
"ఏవిఁటే చెప్పేదీ? ఘోష.. వసపిట్టలాగా! సు అన భయం. వెధవ ప్రశ్నలూ, నువ్వూను. మీ తాతగారు నిద్దర్లేస్తారు కదా! అన్నీ ఆయన్నే అడుగు. ఏదో ఒహ వంకన నా తాతతరాలకి దినాలు పెడుతూ మరీ చెబుతారు కబుర్లు." విసుక్కున్నారు.
తలెత్తకుండా కుట్టుకు పోతున్నారు. నెమ్మదిగా పిల్ల వెళ్లి, ఆవిడ కాళ్ళవైపుకి కూర్చుంది. గమనించనట్టు ఊరుకున్నారావిడ.
పసుపు పులుముకున్న కాలిగోళ్ళు వంకరగా ఉన్నాయి. పెట్లిన చర్మం గజిబిజి గీతలతో నిండిపోయింది. కడియాన్ని మీదకి జరిపి, ఆవిడ ఎడమ కాలి గుత్తి తన బొటన వేలూ, మధ్యవేలితో పట్టుకు సాగదీయడం మొదలుపెట్టింది పిల్ల. మూలిగారావిడ.
పిక్కల దాకా నొక్కి మళ్ళీ పాదాల దగ్గరకి వచ్చింది. పది నిమిషాల్లో రెండు కాళ్ళూ నొక్కి వేళ్ళు మెటికెలు తీసేసరికి ఆవిడ మొహమంతా సౌఖ్యం పాకింది. కుడుతున్న విస్తరి ఒళ్లో పడేసుకుని నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నారు.
ఏదో అలికిడైనట్టనిపించి, చటుక్కున కళ్ళిప్పి చూశారు. ఎవరూ రావడం లేదన్నట్టూ తల అడ్డంగా తిప్పింది పిల్ల.
"అసుంటా జరుగు. ముట్టుకున్నావని తెలిస్తే నిన్నూ నన్నూ కలిపి కోనేట్లో ముంచుతారు." లబలబలాడారు.
మాట్లాడకుండా పాదాలు అరచేత్తో రాస్తోంది.
"వదులింక. ప్రాణం తీసేస్తావే. పట్టు తెలుసే నీకు.." నవ్వారు.
పిల్ల చిత్రంగా నోరు విప్పలేదు.
"పోయి రెండు బాదవాఁకులు తెచ్చుకో.."
మూడు ఆకులు కుట్టిన ఎర్రని విస్తట్లో కొయ్యరొట్టె పెట్టి, పక్కన ఆవకాయ వేసారు. కొబ్బరి, శనగపప్పు వేసి రొట్టె కాల్చిన ఘుమఘుమలు.. సంతోషంగా కూర్చుని విస్తట్లోకి వంగి వాసన చూసింది పిల్ల.. నంజుకోడానికి వట్టి ఆవపిండే!!
"బద్ద వెయ్యొచ్చుగా!" అరిచింది.
"అక్ఖర్లేదు. పారేస్తావు."
"తింటాను"
"ఎందుకు తినవూ.. నీ మొగుడి సొమ్మనీ.."
"దత్తుడు మావయ్యని చేసుకుందునా! అత్తొప్పుకుంటుందా?" ఓ ముక్క తుంపి పిండిలో ముంచుకు నోట్లో పెట్టుకుంది.
"తాట తీస్తుంది. నీకంటే రణపెంకదీ.." నడుం మీద చేతులేసుకుని నవ్వారు.
"పోనీ తాతగారినీ.."
"చచ్చి నీ కడుపున పుడతానే తల్లీ.. ఆ పని చెయ్" అన్నారావిడ.
"ముందావబద్ద వెయ్యండి. చేసుకుంటాను." పిల్ల కిలకిలా నవ్వింది.
"మొండి సంత. ఇంత తిండి ఘోషేవిటే! నీకూ మీ తాతగారి చాలొచ్చింది. ఇదిగో, ఈ మంకుతనానికే మీ అమ్మ హడిలిచస్తోంది. నిన్ను మేపలేనని మూణ్ణాళ్ళలో వెనక్కి దింపి చక్కాపోతాడు కట్టుకున్నవాడు.. "
"తాతగారొస్తున్నారు. చెప్తా ఉండండి మా అమ్మపనీ, మీ పనీ.." గుమ్మం వైపు చూపించింది.
పడగ ముడిచి పుట్టలోకి జారుకున్న పాములా.. ఆవబద్దల రాచ్చిప్ప పట్టుకుని వంకరగా నడుస్తూ లోపలికి వెళ్ళిపోయారావిడ.
*****
పిల్ల ఇంటికి రెండు వీధులవతల పెదతాతగారిల్లు. పిల్ల తల్లికి స్వయానా పెదనాన్నగారాయన. పెదతల్లి.. వాళ్ళకో దత్తుడు.
పిల్ల అమ్మ కడుపులో పడేనాటికి అమ్మా వాళ్ళ అక్క కూడా నీళ్లోసుకుందిట. అమ్మక్కకి అంతకు మునుపు పిల్లలు పుట్టిపోవడంతో జాగ్రత్తకని, ఐదోనెల్లోనే పుట్టింటికి వచ్చేసింది. ఇక అమ్మ కూడా వెళ్తే ఒకే ఇంట్లో ఇద్దరు పురుడుపోసుకోకూడదని, తొలి చూలైనా అమ్మనిక్కడే ఉంచేశారు పిల్లనాన్న. మొత్తానికి దగ్గర్లో ఉన్న పెద్దదిక్కు అమ్మమ్మ గారి చేతులమీదుగా, అలా పిల్ల భూమ్మీద పడింది.
పిల్ల పెదతాతగారు, అమ్మమ్మ దగ్గరే పెరిగింది. అసలు అమ్మమ్మా తాతలకంటే దగ్గరగా..
*****
ఏళ్ళు గడిచిపోయాయి. తాతగారు కాలం చేశారు. అమ్మమ్మగారి దత్తుడు ఢిల్లీలో ఉంటాడు. ఆవిడ ఊరు కదలనని చెప్పేసారు. దత్తుడు సెలవులకి వచ్చి ఇల్లు బాగుచేయించి, పొలం కౌలు వసూలు చేసుకుని వెళ్తుంటాడు.
*****
పిల్ల పట్నంలో చదువుకుంది.. అమ్మమ్మగారు పైడితో మొదలు ఊరందరితోనూ గొప్పగా చెప్పుకునేలా చదువుకుంది. పెళ్ళీడుకొచ్చేసిం ది.
*****
"ఏవేఁ పోలీ, పెళ్ళికూతురివైపోతున్నావే!" సంబరంగా మొహంలోకి చూస్తూ అడిగారమ్మమ్మ గారు.
"అవునండీ. మూన్నాళ్ళలో తీసుకొచ్చి మీ ఇంట్లోనే దింపమని చెప్పాను మా ఆయనకి."
"దింపుతాడు దింపుతాడు.. వెల్లావుల మందతో పాటూ తోలుకురమ్మని చెప్పు ఈ మూర్ఖపు బర్రెని." నోరు నొక్కుకుందావిడ.
"తప్పకుండా! అయినా మేనబావా ఓ మొగుడేనా? ఉప్పుడు పిండీ ఓ పిండి వంటేనా అనీ.." పైటల్లోకి ఎదిగిన పడుచుపిల్ల నవ్వింది.
"ఎవడో ఒకడు. కాల్చుకు తిను. మీ అమ్మ ఫోటో చూపించింది. అర్భకుడు.. వాడిని భగవంతుడే కాపాడాలి. మీ అత్త పోలికల్లోనే తేలాడు. బావున్నాడు సుమీ!"
కర్ర సాయంతో ఈడ్చుకుంటూ వెళ్ళి.. బీర్వా తలుపు తీసి, దగ్గరకి రమ్మని మధ్య అరలో ఉన్న కొత్తచీరా, రవిక చూపించారు.
దేవతార్చన గదిలోకెళ్ళి బొట్టుపెట్టుకు రమ్మన్నారు. సంపెంగ రంగు నారాయణపేట చీరకున్న నీలిజరీ అంచుని వేళ్ళతో రాస్తూ పిల్ల ఆవిడ మొహంలోకి చూసింది.. నచ్చిందన్నట్టుగా. సంతోషంగా తలాడించారావిడ.
"దత్తుడు మావయ్య దగ్గరకి వెళ్ళిపోవచ్చు కదండీ.." ఆవిడ ఇచ్చిన ఖర్జూరం నోట్లో వేసుకుంటూ అడిగింది.
"సుహంగా ఉంది ప్రాణం.. ఎవడి జోలీ పోరూ లేకుండా. ఇలా వెళ్ళిపోనీ." పడక కుర్చీలో చేరబడుతూ అన్నారావిడ.
"పోనీ ఎవర్నైనా సాయం ఉండమనకపోయారా? ఒక్ఖరూ.."
"ఎలకేమైనా ఎత్తుకుపోతుందేవిఁటే నన్నూ! అయినా మీ తాతగారిక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు.. నేనెలా సుహపడిపోతున్నానో చూడ్డానికి.. ఏ చూరో, వాసమో పట్టుకు వేళ్ళాడుతూ.. " ఫెళఫెళా నవ్వారు.
"ఒప్పుకోరుగానీ మీకు మా లావు ప్రేమే!" కవ్వించింది.
దవడ బిగిస్తూ ఉక్రోషంగా ఆవిడ చెప్పే కబుర్లు బోలెడు బావుంటాయి పిల్లకి.
"మరే! మీ తాతగారి పరగణాకి రాణీననీ!! ఎలాంటి అల్లారుముద్దు పుటక నాది! గులాబీల గంపలో కూర్చోబెట్టి, ఆరుగురు మేనమావలు తీసుకొచ్చారు తెలుసా నన్నూ.. పెళ్ళి మంటపానికీ!"
"ఎన్నేళ్ళండీ మీకప్పుడూ.."
"ఎన్నేళ్ళోలే.. రేప్పొద్దున్న మీ దత్తుడు మావయ్య నడ్డి విరిగిందే, నిన్ను పీటల దాకా మోసుకొచ్చేసరికీ.." చేతులు ఊపుకుంటూ నవ్వుతున్నారు గమ్మత్తుగా..
"ఆరుగురు మేనమావలు మోసుకు రావల్సి వచ్చింది మిమ్మల్నీ.. నన్ను కాదు."
"చందనబ్బొమ్మని బొమ్మల పెళ్ళికి తీసుకొచ్చినట్టూ తెచ్చేరే! నిండా పదేళ్ళు లేవు నాకు."
"ఊఁ.."
"బావిలీలు, రాళ్ళ జుంకీలు, గుళ్ళపేరు, పాలెల మొలతాడు, దండవంకీలూ, పలకల గాజులు.. నా చేతులెంతనీ.. మా నాన్న ఉంగరం ఆదితో నాకు గాజులైపోతాయని నవ్వీది మా అమ్మ."
"ఇంకేం! ఆరణాలెత్తు బంగారంతో అత్తవారింటికొచ్చీసారన్నమాట!" పిల్ల పకపకలాడింది.
"భడవకానా! ఏడుమల్లెలెత్తు నేను! నేనే బంగారం.. నా రాత ఇలా ఏడ్సీ.. అన్నట్టు జిగినీ నాను కూడా ఉండేదేవ్.."
పూర్వవైభవాన్ని చాటుతున్న కోట బురుజుల్లా ఆవిడ మొహం మీది ముడతలు నీడలు పరుచుకుంటున్నాయ్. చీకటి పడుతోంది.
"ఏం తింటావే? ఉప్పిండి చేద్దునా!" కుర్చీలోంచి లేస్తూ అడిగారు.
"బయల్దేరుతాన్లెండీ. అమ్మ చూస్తూ ఉంటుంది."
"ఫోనుందిగా. చేసి చెప్పు.. ఉదయాన్నే వెళ్దూగాని. పొరుగూరా ఏం?" వంటింట్లోకి వెళ్ళిపోయారు నెమ్మది నెమ్మదిగా..
గూట్లో ఉన్న రవ్వ డబ్బా బర్రున ముందుకు లాగారు. ఇత్తడి గిన్నె స్టౌ మీద వేడెక్కుతోంది. కాస్త నూనె వేసి, వేడెక్కేలోగా ఇంగువ ముక్కని గరిటెతో నొక్కి నూనెలో పడేసారు. జీలకర్ర పాయలు, కరివేపాకూ వేసి చిటచిట్లాడగానే నీళ్ళు పోసారు. ఎసరొచ్చాక పిడికెడు పెసరపప్పు వేసి మరగనిచ్చారు.
మరుగుతున్న ఎసటివైపు చూస్తూ గట్టుకు ఆనుకుని నిలబడ్డారావిడ. వంగిపోయిన నడుం. నెత్తిన ఉన్న నాలుగు తెల్లవెంట్రుకలతోనూ గట్టిగా బిగించివేసిన ఉసిరికాయంత ముడి. బోసిగా ఉన్న మెడ. చేతులూ, కాళ్ల మీద నెర్రెల్లా ముడతలు.
*****
"పదమూడో ఏట నన్ను కాపరానికి పంపాక ఉత్తరదేశయాత్రకెళ్ళారు మా అమ్మానాన్నా.. తెలిసీతెలియకుండా దిగారేమో పాపం.. ఏదో కొండవాగులో ఇద్దరూ కొట్టుకుపోయారన్న వార్తమాత్రం వెనక్కొచ్చింది." వాలుకుర్చీలో కూర్చుని చెప్తున్నారావిడ.
మడత మంచం వాల్చుకుపడుకుని వింటోంది పిల్ల.
"పద్నాలుగోయేట ఓ ఆడపిల్లపుట్టిపోయింది. పురిట్లో వాతం కమ్మి కాలు నీలుక్కుపోయింది. మళ్ళీ పిల్లలూ పుట్టలేదు." ఆగారు.
ఊఁ కొడుతోంది పిల్ల.
"నువ్వు నిన్నగాక మొన్న నా చేతుల్లో పుట్టినట్టుంది. అప్పుడే పెళ్ళికూతురివైపోతున్నావ్. గుండుకు గుండు పోలిపూర్ణబ్బూరెలా ఉంటావని పోలీ అనేదాన్ని. పోలిపూర్ణం.. మా అమ్మ చేసేది.. ఎంత బావుండేవో! ఏవిఁటో.. ఆడపిల్ల పెళ్ళైపోతుంటే బెంగగా ఉంటుంది." అతకనట్టు వర్లిస్తున్నారావిడ.
పిల్ల లేచి పడగ్గదిలోంచి తలగడలూ దుప్పట్లు తెచ్చి ఆవిడకి పట్టెమంచం వాల్చి పక్కవేసింది.
"తెల్లారుగట్టా చలేస్తే లోపలికెళిపోవచ్చులే.." మంచంమీద సర్దుకుంటూ అన్నారు.
*****
"అమ్మమ్మగారూ.."
"చెప్పవే.."
"ఒక్కరే ఎందుకు.. నాతో వచ్చేయండి."
పకపకా నవ్వారావిడ.
"హాయిగా ఉన్నాన్లేవే.. బలగం ఏనాడుందనీ, ఇప్పుడొక్ఖర్తినీ అనుకోడానికి."
పిల్లకి ఎందుకో మహాదుఃఖమనిపించేసింది.
"ఒక పని చెయ్యవే పోలీ.." మళ్ళీ ఆవిడే అన్నారు.
"చెప్పండి."
"నేను పోతే గనుక.. నా పడక్కుర్చీ నువ్వు తీసుకుపో.."
"అదటండీ నాకిచ్చే ఆస్తి?" చిత్రంగా నవ్వింది పిల్ల.
"నాదంటూ ఏఁవుందనీ? ఏదోలే.. అయిపోయింది జీవితం."
*****
పెళ్ళికి సరిగ్గా వారం ఉందనగా.. అత్తకొడుకు తను ప్రేమించినమ్మాయిని చేసుకుని వెళ్ళిపోయాడు. పిల్లకి ఎందుకో ఉపిరిపీల్చుకున్నట్టనిపించింది.
ఏడాది తరువాత ఆఫీసులో తనతో పనిచేసే అబ్బాయితో పెళ్ళయింది.
ఇద్దరూ బండిచక్రాల్లా పక్కపక్కనే నడుస్తున్నారు.
*****
ఐసీయూ బయట దత్తుడు, అతని కొడుకూ ఉన్నారు. డ్యూటీ డాక్టర్ తో మాట్లాడి అప్పుడే వచ్చిన పిల్లనీ, అమ్మనీ లోపలికి పంపించారు.
గాల్లో చల్లదనం ఇబ్బందిగా కదులుతోంది. గొట్టాలూ మాస్కుల వెనక అమ్మమ్మ గారి మొహం ఎవరిదో అన్నట్టూ ఉంది.
పిల్ల అప్రయత్నంగా ఆవిడ కాళ్ళవైపు చూసింది. దుప్పటి వెనకెక్కడో ఉన్నాయవి.
"మత్తులో ఉన్నట్టున్నారు." అమ్మ గుసగుసగా అంది.
పిల్ల దగ్గరగా వెళ్లి ఆవిడ కాళ్ళు తడిమింది.
*****
ధర్మోదకాల దాకా ఉండిపోయింది పిల్ల.. ఇల్లు ఖాళీ చేస్తుంటే సాయం చేసొచ్చింది దత్తుడికి.
*****
ఫోన్ లో పిల్ల మొగుడు చెప్తున్నాడు.
"చిరాగ్గా ఉంది. ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అవలేదు. ఇప్పటికిప్పుడు వేరే ఎకౌంట్ కి మారాలో ఏమో! ఈ గోలలో సెలవు పెట్టుకు వచ్చి రిజిస్ట్రేషన్ కి సంతకాలు పెట్టివెళ్లమని అన్నయ్య డిమాండ్లు. ఏంటో.. అన్నీ కలుపుకుని వస్తున్నాయ్."
"అంభం మీద కుంభం.. ఆపై ఆదివారం.." నవ్వింది పిల్ల.
"నాకు నవ్వు రావట్లేదు." చెప్పాడు.
"రేపు సాయంత్రం బయల్దేరుతాను."
నిశబ్దంగా వింటున్నాడు.
"మరేమో.. "
"చెప్పు.."
"మనకి ఎన్ని కష్టాలొచ్చినా పర్లేదు.. మన మధ్యకి ఏ కష్టం రానంతవరకూ." పిల్ల గొంతులో అడ్డుపడ్డట్టయింది.
అవునన్నట్టు చిన్న నవ్వు నవ్వాడు. పిల్లకి బలగమంటే ఏవిఁటో అర్ధమయింది.
*****
Touching story
ReplyDeleteధన్యవాదాలు..
DeleteNice👍
ReplyDeleteమనకి ఎన్ని కష్టాలొచ్చినా పర్లేదు...మన మధ్యకి ఏ కష్టం రానంతవరకూ
ReplyDeleteధన్యవాదాలు
Deleteఎందఱో తెలిసిన వ్యక్తులు ,ఎన్నో సంఘటనలు ............కళ్ళు చెమర్చాయి .రుద్రావఝల సుమన్ లత
ReplyDeleteమీ స్పందనకి ధన్యవాదాలండీ.
Deleteఇన్ని నగల పేర్లు ఎప్పుడు వినలేదు. మన ముందుతరాల అనుబంధాల ముందు మనవేపాటి? కథ కదిలించింది. బావుంది.
ReplyDeleteఅనుబంధాలెప్పుడూ ఉంటాయండీ.. రూపాలు మారుతుంటాయంతే. ధన్యవాదాలు.
Deleteచాలా బావుంది.
ReplyDeleteధన్యవాదాలు
Deleteచాల' బావుంది ఒక్క వాక్యం మనసుని బాగా లాగింది. ఎన్ని కష్టాలొచ్చినా మనమధ్యకి కష్టం రానంత వరకూ
ReplyDeleteధన్యవాదాలు
Deleteకథ కదిలించింది.చివరి వాక్యం మరీ మరీ నచ్చింది.
ReplyDeleteధన్యవాదాలు
Deleteentha manchi telugu vadatharandi meeru. i like u r writing style.
ReplyDeletepls keep on writing
ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ. ప్రయత్నిస్తాను.
Deleteశ్రీ రమణ గారి బంగారు మురుగు జ్ఞప్తికి వచ్చింది. చాల బాగా రాసారు .
ReplyDeleteధన్యవాదాలండీ.
Deleteమీ కథ,కథనం,భాష అన్నీ బావుంటాయండి. "ఎన్ని కష్టాలొచ్చినా మన మధ్యకి ఏ కష్టం రానంత వరకి.." బాగా నచ్చింది.
ReplyDeleteధన్యవాదాలు!
Deleteశ్రీపాదవారు చెప్పినట్లు భాషను ఆడవాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. చక్కని వ్యక్తీకరణతో కథంతా సాగింది. మల్లాదివారిలాగా ‘కాక, నిక్కాక’ అన్నట్లుగా కేవల సంభాషణలతోనే కథంతా నడిపే శక్తియుక్తులు మీకున్నట్లుగా మేము గ్రహించితిమి. కావున, మా ముచ్చట కూడా తీర్చగలరు.
ReplyDeleteతప్పక ప్రయత్నిస్తానండీ. ధన్యవాదాలు!
Deleteఆసాంతం ఆపకుండా చదివించిందండీ..
ReplyDeleteస్త్రీవాదాన్ని ఇంత సున్నితంగా చెప్పేవాళ్ళు బాగా తగ్గిపోయారెందుకో...
ఏ వాదానికైనా సత్తువుండాలి కానీ ఊరికే చప్పుడెందుకండీ. రామసీతా, ధనలక్ష్మీ గట్టిగా మాట్లాడగా విన్నామాండీ? ధన్యవాదాలు.
Deleteమీ కధ మామూలే, చాలా బాగుంది.ప్రతి అక్షరం తూచి వేస్తారల్లే వుంది మీ కధల సంపుటి కోసం ఎదురు చూస్తున్నాము.
ReplyDeleteజీవిత చిత్రం కంటె వాక్చిత్రాలు మహత్తరంగా ఉన్నాయి.
ReplyDeleteమాటకి మాట .. భలే అందంగా కుదిరిందండీ !! ఎప్పటిలానే అద్భుతం
ReplyDeleteమీ కథలు రాసే విధానం చాల చాల బాగుంటుంది..అట్టే మన ముందె జరుగుతున్నట్టే ..ప్రతి మాట తూచి రాస్తారు ..
ReplyDelete
ReplyDeleteపదముల తూకము చక్కగ
కుదిర్చి కొత్తావకాయ కుంకుమ నిడెనౌ !
చదువన నుత్సాహంబగు
సదనంబిదియే జిలేబి సమతుల్యంబై !
జిలేబి
మకుటం ఉన్న పద్యాల సంగతి తెలుసు కానీ - మకుటం ఉన్న కథ చదవటం ఇదేనేమో !!
ReplyDeleteచివరి వాక్యం - రసాత్మకం కావ్యం !! సంభాషణం - సరసాత్మకం బామ్యం !! బామ్మ మనవరాళ్ల మధ్య ఇన్ని రసాలూ పండించటం మీకే చెల్లింది !!
Very nice. Felt nostalgic
ReplyDeleteNice story ...Kallu chamarchayi
ReplyDeleteEnto ee post enni sarlu chadivina sare ippatiki kallaku neellochesthayandi naku
ReplyDelete