"గాడ్.. ఐ మిస్ హర్."
మంచం
మీద నుండి లేచి పేటియోలోకి నడిచి సిగరెట్ వెలిగిస్తూ అనుకున్నాడు ఏడెన్.
"జస్ట్ యూ.. నో బడీ ఎల్స్ బట్ యూ.. " మంచం మీద నిలబడి మారిలీన్ మన్రోని అనుకరిస్తూ, లేతాకుపచ్చ కళ్ళను మెరిపిస్తూ.. పాడే వికా గుర్తొస్తోంది. ముదురు నీలిరంగు స్టిలెటోస్ వేసుకుని గదిలో గిరగిరా తిరిగి డాన్స్ చేస్తూ, జారుతున్న శాటిన్ లాంటి నవ్వుతో విరబూసే వికా.. వికా..
"మిసింగ్ హర్.."
తన చెయ్యి క్లా హేమర్ కింద నలిగి జ్వరమొస్తే..
ఓ నెల బిల్స్ కట్టడానికి ఇబ్బందై ఏం చెయ్యాలో తోచకపోతే..
వైన్ ఫెస్టివల్ దగ్గర పడుతోందంటే.. దేనికైనా పక్కనే వికా..
సిగరెట్ బట్ కింద పడేసి కాలితో రాస్తూ, తల తిప్పి గదిలోకి చూశాడు. మంచం మీద షీట్స్ మధ్య నిద్రపోతున్న షానన్ కనిపిస్తోంది.. ఫ్రెంచ్ విండో బ్లైండ్స్ మధ్యలోంచి. టకీలా షాట్ లా నిన్న రాత్రి బార్ నుంచి బెడ్ దాకా తోడొచ్చిన ఆ అమ్మాయి.. హాయిగా ముడుచుకుని నిద్రపోతోంది.
"గిల్టీ?" తనని తనే ప్రశ్నించుకున్నాడు. నవ్వొచ్చింది.
ఉద్యోగం,
వస్తున్న జీతం, సిటీలైఫ్.. అంతా పర్ఫెక్ట్. వికా ఉంటే.. ఇంకా
బావుండేదనిపించింది ఏడెన్ కి. ఇలా అనిపించడం గత మూడునెలల్లో ఇది మొదటిసారేం
కాదు.
***
దాని ఒంటిమీద మెత్తటి వెంట్రుకలు రెండురోజులై ఊడిపోతున్నాయ్. దొరికిన ప్రతీ పదార్ధం, పురుగూ పుట్రా తిని, రోజుకి పద్దెనిమిది గంటలకి పైగా హాయిగా పొదకింద ఉన్న కలుగులో నిద్రపోయే ఆ ప్రాణి, నిద్రాహారాలు మాని పిచ్చెత్తినట్టు తిరుగుతోంది. ఉన్నట్టుండి వింత శబ్దాలు చేస్తోంది. అటూఇటూ దొర్లుతోంది. దాని చర్మం నుండి వస్తున్న ఘాటైన వాసన ఆ ప్రాంతమంతా వ్యాపిస్తోంది. బెంచీకి కొట్టుకుని కింద పడుతోంది. పొదలోకి పరిగెత్తి మళ్ళీ వెనక్కి వచ్చి తనను తనే కొరుక్కుంటోంది.
దాదాపు తొంభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ పార్క్ లో మూలగా ఉన్న ఆ చెట్టుకింది కలుగు దగ్గర అలికిడేం ఉండదు. అక్కడ గత మూడు నెలలుగా కాపురముంటున్న.. ఫెరెట్ లవర్స్ ముచ్చట పడే 'చాకొలెట్ సేబల్' రకానికి చెందిన ఆ ఫెరెట్ కి ఆరోజుకి సరిగ్గా నాలుగు నెలలు నిండాయి.
***
"హెచ్ వన్ రాపోతే ఏం చేస్తాం రా! ఉంకో మాస్టర్స్ చేసుకోడమే. నాలుగేసి మాస్టర్స్ ఉన్నోళ్ళున్నార్రా బాబు. నువ్వు రెండోదానికే గాబరైపోతున్నావ్. ఈ హరిగాణ్ణి చూడు. రెండో మాస్టర్స్ అయిపోతోందీడికి.. నిమ్మళంగున్నాడా లేదా! స్టూడెంట్ వీసాల మీద పెళ్ళాన్ని తెచ్చుకున్నోళ్ళున్నారు." వేణుకి గీతోపదేశం చేస్తున్నాడు రాజేష్.
కిచెన్ లో గిన్నెలు డిష్ వాషర్ లో వేస్తూ వింటున్నాడు హరి. రూమ్మేట్స్ మాటలు వింటూ యాంత్రికంగా పని చేస్తున్నాడు.
"మనం దూరడానికి కంత లేదుగానీ.. పెళ్ళోటేటి? సెటిలైపోవాల్రా.. ఎదవ ఫేక్ రెసూమే.. ఎదవ బతుకూను.." వేణు చిరాకుకి అంతే లేదు.
"ఏదో ఓ దారిని వచ్చామా లేదా? హెచ్ వన్ బీ అంత సులువుగా ఎవడికొస్తోంద్రా! ఓపిక పట్టాలి మరి. నువ్వే రేపీపాటికి యే మార్క్ జుకెర్ బర్గ్ గాడి దగ్గరో ఉజ్జోగం సంపాయించేసి, బెమ్మాండవైన మసరెటీ కొంటావ్ చూడు.."
"ఏమోరా బాబు. లోన్ ఎప్పుడు తీర్చుకుంటామో, ఎప్పుడు సెటిలవుతామో.."
నీళ్ళు ధారగా పోతున్నాయ్ సింక్ లో... ఆగకుండా గిన్నెలమీద పడి పొర్లిపోతూ..
***
"క్లోయీకి స్ప్రే చేయించాలి..ఇంజెక్షన్ ఇస్తారు.. హీట్ లో ఉన్నప్పుడు. మర్చిపోకు. లేకపోతే లైఫ్ త్రెట్నింగ్."కాల్ చేస్తూనే చెప్పింది వికా.
"వాట్?" అర్ధం కాలేదు ఏడెన్ కి.
"ఆంట్ లిండా కాల్ చేసింది నిన్న. క్లోయీకి నాలుగు నెలలు నిండాయ్ కదా.. హీట్ కి వస్తుందింక. న్యూటర్ చేయించాలి లేదా టెంపరరీగా ఇంజెక్షన్ ఇప్పించాలి అని గుర్తుచేసింది."
"ఓహ్.. ఓకే.." సాలోచనగా అన్నాడు.
"తిట్టుకుంటున్నావా?"
"ఉహూ.. దేనికి?"
"ఫెరెట్స్ గురించి నాకూ తెలీదు. కాస్త జాగ్రత్తేం. హీట్ లో ఉండగా అలా వదిలేస్తే.."
"ఊ..."
"చచ్చిపోతాయట..."
"నిజమా!"
"యా.. యునీక్ అండ్ డెలికేట్."
"ఓ పెట్ మీద ఉన్న జాలి నామీద లేదు కదా హనీ నీకు..?"
"కమాన్ ఏడెన్. ఇది నీ చాయిస్." నిర్మొహమాటంగా చెప్పింది వికా.
***
వసంతం వచ్చేసింది. చాలా మారిపోతాయ్.. వికా చెప్పినట్టు..
లేక్ ఎలిజబెత్ చుట్టూ బారులు తీరిన మొండి కాండాలు చిగుర్లు తొడుక్కుంటున్నాయ్. నెలకోసారి నిండుగా నవ్వే జాబిలి సాక్షిగా ఋతుచక్రం తిరిగిపోతోంది. తనలాంటి మరో ప్రాణిని పుట్టించడమనే సృష్టి నిర్దేశించిన కర్తవ్యానికి విరుద్ధంగా నోరులేని ప్రాణులేవీ ప్రవర్తించవు. ఏదిఏమైనా చక్రం తిరిగిపోవాల్సిందే.
హరి అటువైపుగా రావడం మానేసాడు.. బిజీగా ఉండి.
బక్కచిక్కిపోయి, పొడలు తేలిన చర్మంతో వికారంగా తయారయిన ఆ ప్రాణి అప్పుడప్పుడూ కలుగులోంచి బయటికొస్తుంది. దాని శరీరంలో పెరిగిన ఈస్ట్రోజెన్ దాని తెల్ల రక్తకణాలని కొంచెం కొంచెంగా చంపేస్తోంది. ఉత్సాహంగా గెంతి బెంచీని గుద్దుకోవాలనిపిస్తూంటుందేమో దానికి.. సహకరించని శరీరాన్ని ఈడ్చుకుంటూ దొర్లుతుందోసారి. అరగంట విశ్వప్రయత్నం తరువాత కలుగు దాకా వెనక్కివెళ్ళగలిగిందారోజు.. ఆఖరి రోజు.
***
"హరీ.. నేను.. "
"హేయ్.. ఈ టైం లో ఏంటీ? అంతా ఓకేనా?" నిద్రలోంచి గభాలున లేచిన దడ ఇంకా తగ్గలేదు హరికి.
"అంతా ఓకే.. నువ్విలా గాభరా పడతావని తెల్లారేక చేద్దామనుకున్నాను కానీ, ఆగలేకపోయాను." సుధ గొంతు వినిపిస్తోంది.
"ఏమయింది?" అయోమయంగా అడిగాడు.
"వచ్చేస్తున్నా మొద్దూఊఊఊఊ..." అరిచింది సంతోషంగా..
"ఎలా! ఎప్పుడు.. ఏమయింది?" హరికి మత్తొదిలిపోయింది.
"నువ్వు రమ్మనకపోతే రాలేనా? స్టూడెంట్ వీసా.. ఎమ్బీయే కి!! ఎన్ని ప్రశ్నలడిగాడో నీకేం తెలుసబ్బా.. ఉద్యోగం మానేసి ఇప్పుడెందుకూ. ఇక్కడ మాస్టర్స్ ఉంది కదా.. ఇలా అరగంటసేపు నన్ను వేపుకుతిన్నాడు. ఇచ్చాడు మొత్తానికి." చెప్పుకుపోతోంది.
"నా దగ్గర ఎలా దాచావసలు! ఎప్పుడెళ్ళావు.."
"జీమేట్ స్కోర్ రాగానే చెప్పేద్దామనుకున్నాను. కానీ వీసా ఇంటర్వ్యూలో ఇంకో డిసపాయింట్మెంట్ ఎదురైతే..? అందుకే చివరిదాకా దాచాను. యూ ఎన్ సీ.. చార్లెట్ లో సీటొచ్చింది. వచ్చేస్తున్నానోచ్... " సుధ గొంతులో సంబరం అప్పుడే వీడియో ఆన్ చేసిన హరికి స్ట్రీమ్ అయి స్పష్టంగా కనబడింది.
"షార్లెట్.. " నవ్వుతూ సరిదిద్దాడు హరి. అతని ఆలోచనలలో వేల మైళ్ళ దూరం వందల్లోకి మారుతోందప్పుడే.
***
"హనీ.. వెరీ సారీ ఫర్ యూ.." ఏడెన్ ఫోన్లో ఆమెనెలా ఓదార్చాలో అర్ధంకాక తడబడ్డాడు.
"దట్స్ ఓకే.." టిష్యూతో ముక్కు తుడుచుకుని దుఃఖాన్ని ఆపుకుంది వికా.
"మొన్నటి దాకా బానే ఉన్నాడన్నావు కదా గ్రాండ్ పా.."
"ఊ.. గ్రానీలాగే.. నిద్రలోనే.." మళ్ళీ ఏడుపొచ్చేసిందామెకి.
"నేను బయలుదేరుతున్నాను. సెవన్ అవర్స్ లో ఉంటా అక్కడ." చెప్పాడు.
"పర్లేదు ఏడెన్. ఐ కెన్ మేనేజ్."
"లేదు వస్తాను.. నిన్ను చూడాలి."
"ఏడెన్.."
"యెస్ హనీ.."
"నెక్స్ట్ వీక్ నేనటు రానా? నాకు చేంజ్ కావాలో నాలుగురోజులు. నేనిక్కడ ఉండలేను.. ఒక్కర్తినే."
"హేయ్.. మోస్ట్ వెల్కమ్.. అడగాలా చెప్పు? నేనొచ్చి ఫ్యూనరల్ అవగానే నిన్నిటు తీసుకొచ్చేస్తాను."
వికా కన్ఫెషన్ ని నమ్ముతుందనే నమ్మకం ఉంది ఏడెన్ కి.
***
దూరాన్ని లెక్కచేయని ప్రేమకి.. ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.