Sunday, July 14, 2019

కంచికి చేరని కథలు


మాసాలని ఋతువులుగా విభజించే అధికారం నా చేతిలో ఉంటే కార్తీక మార్గశిరాలని నా పేర్న గుత్తి కట్టేస్తాను. 

నాకు చలికాలమంటే యిష్టం. అమెరికా లెక్కల ప్రకారం హాలిడే సీజన్ అంటే మరీ యిష్టం. మత్తుగా నిద్దరోయే ధృవపు ఎలుగుబంటిలా సోఫాలోంచి లేవకుండా ముడుచుకుని సినిమాలు చూడడమంటే మహా యిది. పట్టుమని రెణ్ణెళ్లు కూడా మర్చిపోనివ్వని ప్రాపంచిక విషయాలంటే తగని మంట. ప్రాపంచిక విషయాలంటే మార్ట్ గేజి బిల్లులు, సంవత్సరం చివరిదాకా గుర్తురాని డెంటల్ అపాయింట్మెంట్లు, అప్పటికైనా కళ్ళజోడు కొనుక్కోకపోతే వృధాపోయే ఇన్షురెన్సులు... ఇలాంటివన్నమాట. ఈ యేడాది ఆ లెక్కలో కొత్త ఉద్యోగం కూడా చేరింది. మొద్దుగా నిద్దరోనివ్వని జీవితావసరాలు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేలా నన్ను ముందుకు తోసాయి. నాకు గతిలేకపోతే నాకు ఉద్యోగమిచ్చినవాడికి మతిలేదు. డిసెంబర్ లో రమ్మన్నాడు. దేహాన్ని ఈడ్చుకుంటూ పోయి జాయినయ్యాను. 

ఉదయాన్నే హడావిడి వలన ఫిల్టర్ కాఫీకి నోచని జీవుడికి ట్రిపుల్ ఫ్లాట్ వైట్ తో సర్దిచెప్పి ఆఫీస్ లోకి నడిచాను. డిసెంబరు పన్నెండు. నిర్జనారణ్యంలో నిద్దరోతున్న మానిటర్ లు. అస్మదీయుడిలా కనిపించేవాడొకడు నా లేప్ టాప్ మధ్యాహ్నానికొస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. తప్పనిసరి పరిస్థితిలో బ్రేక్ రూమ్ కి, క్యూబికల్ కీ పచార్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాను. మధ్యలో ఉన్న రెస్ట్ రూమ్ లోంచి బయటికొస్తూ పలకరింపుగా నవ్విందొకావిడ. ఆకుపచ్చని టర్టిల్ నెక్ స్వెటర్ వేసుకుని పండు తమలపాకులా ఉంది. ఇంకేమనాలి? పాప్లర్ ఆకు?

లంచ్  టైం లో ఎదురుగా ఉన్న సబ్వేకి వణుక్కుంటూ వెళ్లొచ్చి క్యూబ్ లోనా, బ్రేక్ రూమా అని ఆలోచించుకుంతున్నంతలో ఆకుపచ్చ స్వెట్టరావిడ అటుగా వెళ్తూ కనిపించింది. వెనకే వెళ్ళి బ్రేక్ రూమ్ లో కూర్చున్నాను. 

"బాగా చలిగా ఉందివాళ.." మాటలు కలిపిందావిడ. 
అవునని అడ్డదిడ్డంగా తలూపి గొణిగాను. 

రాబోయే వారంలో శీతోష్ణస్థితిగురించి కాసేపు ముచ్చటించి, నీ అభిప్రాయమేంటన్నట్టు చూసింది. లేచి ఆవిడ కూర్చున్న బల్లకి ఎదురుగా కుర్చీ లాక్కున్నాను. 

" కొత్తగా వచ్చినట్టున్నావు.. ఇంతకు మునుపు ఈ ఫ్లోర్ లో చూళ్ళేదు." అని వాకబు చేసింది. 
అవునన్నాను. టీమ్ వివరాలు చెప్పి ప్రవర వర్లించాను. 

"నా పేరు పెట్రీషియా. ఇవాళ ఆఫీస్ లో నా ఆఖరు వర్కింగ్ డే. సెలవుల తరువాత వచ్చి ఫేర్వెల్ పార్టీ ఇప్పించుకుని, లేప్టాపూ వగైరా ఇచ్చి వెళ్ళిపోతాను." అని చెప్పింది. 

"కంగ్రాట్స్! పోన్లే హాయిగా టీవీ చూడచ్చు." అనేసి నాలిక్కరుచుకున్నాను. 

"ఒకప్పుడు బాగా చూసేదాన్ని కానీ, ఇప్పుడు కదలకుండా కూచుని చూసినా బుర్రకెక్కడం లేదు. వేరే పనేదో గుర్తొచ్చి అటు వెళ్ళిపోతాను. డిమెన్షియా కాదని నా డాక్టరు చెప్పాడు కానీ, నాకు భయమే." మిలమిల్లాడే పళ్లు కనిపించేలా నవ్వుతూ అన్నది. 

ఏదీ దాచకుండా భలే చక్కగా కబుర్లు చెప్తారేం వీళ్ళు! ఇంతకీ క్రిస్మస్ కి ఏం చేస్తావని అడిగాను. ఆరున్నర నిమిషాలపాటు తన  ప్లాను చెప్పి, ఇక నీ వంతు అని తన సేండ్ విచ్ కొరుక్కుంది. 

"మామూలే. ఇల్లు కదలకుండా కూర్చోవాలనుంది. లేప్టాప్ వచ్చేస్తే బహుశా అంతే. చీకటి పడ్డాక వెస్టన్ ఎస్టేట్ వైపు డ్రైవ్ కి వెళ్లడం బావుంటుంది. క్రిస్మస్ లైట్స్ చూడడానికి. మా ఇంట్లో ట్రీ ఉంటుంది కానీ అంత గొప్పగా సెలబ్రేట్ చేసుకునే అలవాటేమీ లేదు. నా కూతురి కోసం పెడతానంతే." అని చెప్పాను. 

కూతురు అనడం పాపం.. చక్కగా తన పిల్లలు, మనవల చిట్టా విప్పి చెప్పింది. పోన్లే కాస్త ఊసుపోతోంది అనుకున్నాను. 

"నేనూ, జాన్ నలభై నాలుగేళ్ళ క్రితం క్రిస్మస్ పార్టీ లో మిసల్ టో కింద కలిసాం." పెట్రీషియా అందంగా నవ్వింది. 

"వండర్ ఫుల్.  ఫెయిరీ టేల్ లా ఉంది." 

బోలెడంత ఉత్సాహంగా వాళ్ళ పెళ్ళి కబుర్లు, అత్తగారెంత మంచిదో, జాన్ హాబీ లిస్టులేంటో గలగలా చెప్పేసింది. నవ్వుతూ తలూపుతూ వింటున్నాను. 

"నా గురించే చెప్పి బోర్ కొట్టిస్తున్నట్టున్నాను కదా! నీ గురించి చెప్పు.." అంతే ఉత్సాహం ఆమె గొంతులో. 

"మీ ఆయన ఎక్కడ చేస్తారు? మీరెక్కడనుంచి?" లాంటి రొటీన్ ప్రశ్నలకి భిన్నంగా ఉంది కదా అనుకున్నాను. 

"నా గురించి చెప్పడానికి మీ అంత గొప్పకథేమీ లేదు." పొడిగా నవ్వాను. 

"నీ గురించి తెలీదు కానీ, నాకు ముంబాయ్ నుంచొచ్చిన ఫ్రెండ్ ఉండేది. ఎక్కువ అరేంజ్డ్ మేరేజెస్ జరుగుతాయని విన్నాను. బహుశా అందరూ అలా కాదేమో కానీ.." కలుపుగోలుగా అడిగింది పెట్రీషియా. 

కాసేపు అవును, కాదు కి మధ్యస్థమైన వివరాలేవో చెప్పాను. 

"ఖాళీ సమయంలో ఏం చేస్తావు?" నన్ను హీరోయిన్ ని చేసే ప్రయత్నం చేస్తోంది. నేనే నేషనల్ లెవెల్ పోకర్ ఆడుతాననో, చెస్ ప్లేయర్ననో చెప్తే ననుగన్న మాయమ్మ కూడా ఆశ్చర్యపోయి భయపడేంత పొగుడుతుందీవిడ అని నవ్వుకున్నాను. నావి మరీ ఇంత దారుణమైన ఆలోచనలేంటో! 

"కథలు రాస్తాను." అతిశయానికి అట్టేసి మాడెస్ట్ గా చెప్పాను. నా గొంతు నాకే "స్విమ్మింగ్ వచ్చు" అని వెంకటేష్ చెప్పినట్టు వినిపించింది. 

ఇంతలేసి కళ్ళతో ఆశ్చర్యపోయి మెచ్చేసుకుంది. తెలుగులో అని చెప్పేసరికి మరింత మెచ్చుకుంది. ఒక అమెరికన్ వనిత టెస్టిమోనీ అక్కరకు వస్తుందో రాదో కానీ.. 

"నువ్వెప్పుడైనా ఇంగ్లిష్ లో రాస్తే తప్పక పంప"మని ఒట్టేయించుకుంది. తప్పకుండా అని చేతిలో చేయేసినంత పని చేసాను. 

"అసలు ఎలాంటి కథలు రాస్తావు? నా క్లాస్ మేట్ న్యూయార్కర్ కి రాస్తూండేవాడు." 

పెట్రీషియా లాంటి పాఠకులుంటే నా ప్రభ ఎలా వెలిగేదా అని ఆలోచించుకున్నానోక్షణం. 

"ఫిక్షన్"

"మరి నీకు కథలకి వస్తువులెక్కడనుంచొస్తాయ్?" 

వెఱ్ఱినవ్వొచ్చింది. 

"నేను కథలు చెప్తూ నీ టైం వృధా చెయ్యను. నాకంటే పనిలేదు కానీ, నీకుంటుంది కదా?" మొహమాటంగా అన్నాను. 

"నా టీమ్ అంతా సెలవుల్లో ఉన్నారు. పరవాలేదు చెప్పు.." బుగ్గన చేయేసుకుందావిడ. ఏవిఁటీ ఋణానుబంధం

తిన్న సబ్ అరిగేదాకా కబుర్లు చెప్పుకుని, మరో కాఫీ తెచ్చుకుందామని డిసైడ్ అయ్యాను.

************

"మా దేశంలో పెళ్లి ఎలా జరుగుతుందని అడిగావు కదా పెట్రీషియా.. నేను నాలుగు కథలు చెప్తాను. అందులో ఒకటే నాది. కనుక్కోగలవా?" 

"నువ్వు నాక్కొన్ని హింట్స్ ఇస్తే తప్పక  ప్రయత్నిస్తాను. ఓడిపోయినా నాలుగు వండర్ఫుల్ కథలు వింటాను కదా! పరవాలేదు." 

అరే!! మళ్ళీ దోచేసుకుందీవిడ!

***********

ప్రశాంతమైన భారత పల్లెటూరు మాది. రెండు వీధులవతల నాకో స్నేహితురాలుండేది. వాళ్ళ అన్నయ్య మాకు జామకాయలు కోసిస్తుండేవాడు. చిన్నప్పుడెప్పుడూ అతనే నా జీవితంలో ఓ కీలకమైన మనిషవుతాడని ఎప్పుడూ ఊహించలేదు. 

"స్వీట్! అతన్నే ప్రేమించావా?" 

ఉహు.. అతనికోసం పక్క ఊరి నుండివచ్చే స్నేహితుడిని. మా ఊరికి దగ్గర్లో ఇరవై మైళ్ళలో సముద్రం ఉంది. అక్కడ కలుసుకునే వాళ్ళం. అప్పట్లో ఇండియాలో కేబుల్ టీవీ అనే ప్రభంజనం మొదలయింది. అప్పట్లో హార్లిక్స్ హృదయాంజలి టీమ్ వీధివీధికీ తిరిగి టీవీలో కనిపించాలనే ప్రజల సరదాని తీర్చేది. అలా ఒక దుర్ముహూర్తంలో మమ్మల్ని ఉదయభాను అనే భామ ఇంటర్వ్యూ చేసింది. 

"దట్స్ అమేజింగ్!" 

అమేజింగు లేదు, ఆవకాయా లేదు. మొహానికి చున్నీ సగం చుట్టుకుని మాట్లాడాను. ఇంట్లో తెలిస్తే చీరేస్తారని భయం. అలా ప్రేమ అంటూ బీచులమ్మట తిరిగితే ఎంత అప్రదిష్ట! కానీ పక్కన అతనున్న మైకం.. గలగలా భానుతో కబుర్లు చెప్పేసాను. 'లక్కీ బోయ్!' అని అతన్ని మెచ్చుకుంది కూడాను. అదెప్పుడు టీవీలో వస్తుందా అని భయం మొదలయింది. 

"నువ్వు చాలా డిసిప్లిన్డ్ టీనేజర్ వి! ఐ అడ్మయిర్ యువర్ ..." 

నా తలకాయ డిసిప్లిన్ పెట్రీషియా. విను.. ఆ హృదయాంజలి వచ్చే టైము కి కేబుల్ పీకేయడం ఒక్కటే మార్గం అని, నేను హాల్లోనే కూర్చుని మా తమ్ముడికి లంచం ఇచ్చి ఆ పని చేయించేదాన్ని. మొత్తానికి వారం గడిచిపోయింది. గండం గడిచినట్టే అని ఊపిరి పీల్చుకున్నాను. 

"థాంక్ గాడ్!" 

గాడ్ నన్ను మోసం చేసి, నాలుగిళ్ళ అవతల ఉన్న మా అత్తకి టీవీ చూడాలనే బుద్ధి పుట్టించాడు. మొహానికి కప్పుకున్న చున్నీ నన్ను కాపాడలేకపోయింది.

"పోన్లే! నువ్వు బోలెడు అదృష్టవంతురాలివి. అడ్వెంచరస్ లవ్ స్టోరీ మొత్తానికి.." 

ఉహు.. పప్పులో కాలేసావు. ఇంట్లో విషయం తెలిసి, వీపు చీరి నన్ను మా అక్క ఇంటికి పంపేశారు. నాలుగేళ్లు పోయాక, జామకాయలు కోసిచ్చిన ఫ్రెండు అన్నయ్య ఉన్నాడే.. అతను నా మొగుడయ్యాడన్నమాట. అరేంజ్డ్ మేరేజ్. మరో రెండేళ్ళకి అమెరికా వచ్చామా.. ఒక కూతురు. 

"దట్స్ స్వీట్! డెస్టినీ అంతే! ఇంతకీ నీ భర్తకి తెలుసా నీ క్రష్ సంగతి?" 

ఏం చెప్పమంటావ్ పెట్రీషియా! ఉదయభాను రిటైర్ అయ్యేదాకా ఆవిడ తెరపై మెరిసినప్పుడల్లా మా ఆయనకి దాక్షారం సంబంధం బెదిరింపు తప్పదు. దాక్షారం సంబంధమేంటని అడక్కు. అందుకు నీకు తెలుగు వచ్చితీరాలి. అదీ మొదటి కథ! 

"ఇదే నీ కథ అనిపించేలా చెప్పావ్ తెలుసా!" 

**************

ఆరోజు జామకాయ కోసిద్దామని ఎప్పట్లాగే చెట్టెక్కి పట్టుతప్పి పడిపోయాడు. ఎముక అతుక్కున్నా కాస్త అవుకు అలా ఉండిపోయింది. పిల్లలం పెద్దవాళ్లయిపోయాం. అతను వీధిలో కనిపించినప్పుడల్లా నాకెందుకో తప్పుచేసినట్టనిపించేది. వయసొచ్చిందేమో ప్రేమ పుట్టింది. 

చీప్ గా ఉత్తరం రాయడమా అనిపించి, చాలారోజులు ఆలోచించాను. అప్పట్లో సందుకొక నెట్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఈమెయిల్ వచ్చింది. అతనిపేరులో రెండు అక్షరాలూ, నా పేరులో రెండు అక్షరాలూ కలిపి, నేను పుట్టిన సంవత్సరం తగిలించి ఐడీ క్రియేట్ చేయించుకున్నాను. 

"ఎవరు చేశారు??" 

హెల్ప్ తీసుకునేవాళ్ళం. తప్పేం లేదు. నెట్ సెంటర్ అన్నయ్య చేసాడు. జాగ్రత్తగా చీటీమీద రాసుకుని ఇంటికి తీసుకెళ్ళాను. ఆ అబ్బాయి కంప్యూటర్స్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు మరి. ప్రేమ తెలియజెయ్యాలంటే నాకు ఆ మాత్రం టెక్నాలజీ తెలియకపోతే ఎలా! 

"యూ ఆర్ రొమాంటిక్ యునో!" 

ఐనో పెట్రీషియా. ఆరోజు సాయంత్రం వెనకవీధి పార్వతీదేవి కోవెలకి వాళ్ళన్నయ్యని తీసుకురమ్మని నా ఫ్రెండ్ ని అడుక్కున్నాను. బోలెడు బతిమాలించుకుని సరే అంది. అక్కడ తనని ఎవరో ఏడిపిస్తున్నారని అబద్ధం చెప్పి తీసుకొచ్చింది పాపం. 

"దట్ గాళ్ ఈజే బాంబ్!" 

మా వీధిలో అందరూ బాంబులే. ఆ అబ్బాయ్ సైకిల్ ఆపేసరికి నాకు వణుకొచ్చేసింది. తెగించి చీటీ తీసుకెళ్లి తనచేతిలో పెట్టేసా. ఏమిటిదన్నాడు. ఈమెయిల్ ఐడీ అని చెప్పాను. అదిసరే ఎందుకన్నాడు. మెయిల్స్ రాసుకోడానికి అని సహనంగా చెప్పాను. అయోమయంగా పాస్వర్డ్ ఎందుకన్నాడు. 

"వాట్!!!" 

అవును. చీటీలో మెయిల్ ఐడీ, పాస్వర్డ్ కూడా రాసిచ్చాను. "పాస్వర్డ్ లేనిదే లాగిన్ అవలేరని నెట్ సెంటరన్నయ్య చెప్పాడు. అందుకే ఇస్తున్నా.. లాగిన్ అవమని" చెప్పాను. అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఎప్పటికైనా లాగిన్ అవుతాడు కదా అని బోలెడు ఈమెయిల్స్ రాసాను కూడా. గంటకి పది రూపాయలు ఖర్చు. 

పకపకా నవ్వుతోంది పెట్రీషియా. 

ఇదిగో.. ఇలాగే నవ్వేవాడు నేను కనిపించినప్పుడల్లా. భలే ఏడుపొచ్చేది. ఈ ప్రేమ మనకి అచ్చిరాలేదని వదిలేసా. ఆ వచ్చే ఏడాది నేను కూడా కంప్యూటర్ ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాను. అయ్యాక నాలుగైదు నెలలకనుకుంటా.. బల్బు వెలిగింది. ఆ తరువాతెప్పుడో కనిపించినప్పుడు అదే నవ్వు. ఏడవబోయి నేనూ నవ్వేసాను. 

నా భుజం మీద తట్టి కళ్ళు తుడుచుకుని మరీ నవ్వుతోంది. "ఏమయిందప్పుడు?" తమాయించుకుని అడిగింది. 

కొన్నాళ్ళకి నాకో చీటీ పంపాడు.. తన ఈమెయిల్ ఐడీ!  పాస్వర్డ్ తరువాతెప్పుడో తెలిసిందిలే. నా పేరే. 

"దట్స్ హిలేరియస్ అండ్ సూపర్ క్యూట్!" 

మా పెళ్లయ్యాక చెప్పాడు.. నేనిచ్చిన మెయిల్ ఐడీలోకి లాగిన్ అయి నేను రాసిన మెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు వేడివేడి డ్రాఫ్ట్స్ చదివానని. నా అజ్ఞానాన్ని పూర్తిగా ఆస్వాదించాడన్నమాట! నేను తనని క్షమించడానికి చాలా రోజులు పట్టింది. తలుచుకుంటే ఇప్పుడు కూడా చచ్చేంత కోపమొస్తుంది. 

"ఇది కచ్చితంగా నీ కథే!" నవ్వుతూ చెప్పింది. 

ఐతే మిగిలిన రెండూ చెప్పక్కర్లేదా

"నో నో నో... చెప్పు చెప్పు" 

**************

మేమిద్దరం ఇంజినీరింగ్ లో కలిసాం. ఒకేసారి కేంపస్ సెలెక్షన్ వచ్చింది. కానీ అమెరికా వచ్చి పనిచేసే ఆన్సైట్ వరం తనకి ముందొచ్చింది. నాకు రాలేదు. అతను అమెరికా - నేను ఇండియా. రెండేళ్లు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్. 

"ఓహ్. దట్స్ టఫ్!"

అంతకంటే టఫ్ ఇంకోటుంటుందని నేననుకోను. నేను స్టూడెంట్ వీసా మీద అమెరికా వచ్చాను. ఇక్కడా దూరంగానే! తను కేలిఫోర్నియా - నేను కెంటకీ.

"వెల్.. కొంతలో కొంత నయం కదా!" 

అస్సలు కాదు. దూరంగా ఉన్నప్పటికంటే అందే దూరంలో ఉన్నప్పటి ఆరాటం, బాధ మరీ ఎక్కువ. ఇంతలో తన వీసా ఎక్స్ టెన్షన్ రిజెక్ట్ అయింది. నేను ఇండియాలో ఉద్యోగం మానేసి ఇక్కడికొచ్చి చదువు మొదలెట్టి ఏడాదే అయింది. మరో ఏడాది నేనిక్కడ చిక్కుకుపోయాను. 

"డేమ్!" 

ఎస్.. నా చదువుకి అయిన లోన్ తీర్చుకునేందుకు సీపీటీ మీద ఉద్యోగం మొదలుపెట్టాను. ఆ తరువాత ఓపీటీ ఉద్యోగం కొన్నాళ్ళు. అతను అమెరికా రావడానికి మళ్ళీ ప్రయత్నాలు. లాటరీ సిస్టం మొదలయింది ఆ సంవత్సరమే! అన్ని రోగాలూ ఆ కుంటిగాడిదకే! ఇక్కడ గాడిద అంటే మేమిద్దరం. ఎంత అలిసిపోయేవాళ్ళమో మాకే తెలుసు. ఏడవడానికి కూడా కుదరని పరిస్థితి. 

"పోనీ నువ్వు ఇండియా వెనక్కి వెళ్లిపోవలసింది కదా?" 

నా లోన్ తీరేదాకా నేను అమెరికా వదిలివెళ్లలేను. ఇండియాలో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ కూడబెట్టగలను? ఇద్దరు మనుషులది ఒకటే జీవితం అయినప్పుడు, దాన్ని దూరం విడదీయడమన్నది ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇంకెవరికీ తెలియదని కాదు, మాకు తెలుసని చెప్తున్నానంతే. 

"ఏమయిందప్పుడు? నువ్విక్కడున్నావంటే హేపీ ఎండింగ్ కదా?" ఆత్రుతగా అడిగింది. 

అఫ్కోర్స్.. మొత్తం ఐదు సంవత్సరాల దూరం, సందిగ్ధం తరువాత, నాకు హెచ్ వన్ వచ్చింది. 

"మరి తను?"

డిపెండెంట్ వీసా మీద అమెరికా మళ్ళీ వచ్చాడు. నాకు హెచ్ వన్ వచ్చాక ఇండియా వెళ్ళి పెళ్ళి చేసుకుని యిద్దరం వచ్చాం.

"గుడ్ బట్ కన్ఫ్యుజింగ్! ఇంత ఇబ్బంది ఉంటుందా వీసాలో?" 

 చాలా. అందులోను వైటుకే తరువాత వచ్చినవాళ్ళకి వీసా ఇబ్బందులు తప్పవు. పుణ్యం కొద్దీ వీసా, దానం కొద్దీ గ్రీన్ కార్డు. సరే, నేను ఇండియా వెళ్ళాను. పెళ్ళయింది. అతను డిపెండెంట్ వీసా మీద వచ్చి, స్టూడెంట్ గా మారి ఉద్యోగం చేస్తున్నాడు. బతకడానికి డబ్బులు కావాలి కదా?

"ఇంకా ఇబ్బందేనా?"

రెండేళ్ళ క్రితం దాకా. హెచ్ ఫోర్ డిపెండెంట్ కి వర్క్ పర్మిట్ వచ్చాక కొంత నయం. కానీ తన కెరీర్ నావల్ల చాలా పాడయింది. ఇప్పుడు ట్రంప్ ఏక్షణమైనా ఈ హెచ్ ఫోర్ వర్క్ పర్మిట్ తీసేస్తాడని భయపడుతున్నాం. 

"మీ దేశానికి వెళ్లిపోవచ్చు కదా? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు కానీ.." 

నా లోన్ తీరింది. ఇంక ఏ క్షణం ఏం జరిగినా భయం లేదు. వెనక్కి వెళ్ళిపోతాం. ఇలాంటి మూడున్నర మిలియన్ల కథలుంటాయి పెట్రీషియా. వీసా కథలంటారు వాటిని. కొన్ని సుఖాంతాలు, మిగిలినవి ఒడ్డు కనిపించని ఎదురీతలు. 

"నాకు తెలిసేవే కావు. థాంక్స్ ఫర్ షేరింగ్. ఐ కౌంట్ మై బ్లెస్సింగ్స్ టుడే.."

మౌనంగా ఉండిపోయాను. కాసేపటికి తేరుకుని ఎవరి క్యూబికల్స్ కి వాళ్ళు వెళ్లిపోయాం. కౌగలించుకుని గుడ్ లక్ చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చింది.. నా గొంతు ఆమె మళ్ళీ వినకపోవచ్చు. 

************

నాలుగో కథా? బహుశా అదే నాది కావొచ్చు. మీకు చెప్తాను. మనలో మనకే తెలియని వెలితి ఒకటుంటుంది. కొందరికి అది ఏ వెన్నుమీదో నొప్పి తెలియని పులిపిరిలా ఉండిపోతుంది. కొందరి దురదృష్టానికి అది కంటిమీద మొదలవుతుంది. ఆగలేరింక. దారులు వెతుకుతూ తపిస్తారు. ఏడుస్తూ కవిత్వం రాస్తారు, లేదా బొమ్మలు గీస్తారు, కొందరు కథలు చెప్తారు. ఏం చేసినా మన చేతివేళ్ళలో ఇమిడే మరో చెయ్యి వెలితిని పూడ్చడం ఎవరి తరం

నా ఫోన్ మోగుతోంది. ఏం చేసావ్ ఉదయం నుంచీ అని ప్రశ్న వినబడుతుంది. పెట్రీషియాకి కథలు చెప్పానని చెప్పనా


************


2019 TANA Souvenir లో ప్రచురితం