Sunday, April 1, 2012

"మిథునం" పాటలు.. ఎలా ఉన్నాయంటే..

వంకాయ బజ్జి పచ్చడిలో కొత్తిమీర ఎలా ఉండాలయ్యా అంటే "తత్వాలు పాడేటపుడు తంబురా శ్రుతిలా" అసలు విషయాన్ని మింగేయకుండా ఉండాలన్నాడు అప్పదాసు.

"నొష్ట రాసిన రాలు తుడిచినా పోదు - చీర చెరుగులు పెట్టి తుడిచినా పోదు - పైట చెంగుల తోటి పులిమినా పోదు" అని పాడేంత సర్వజ్ఞురాలు బుచ్చిలక్ష్మి. చూడబోతే ఇద్దరికిద్దరూ సంగీత సాహిత్యాలు కాచివడబోసినట్టే అనిపిస్తారు.

అచ్చ తెలుగు కథగా పుట్టి ప్రాణం పోసుకుని.. కాగితాల్లోంచి గుండెల్లోకి చరచరా నడిచివచ్చి, గూడు కట్టుకున్న ఆ "మిథునం" - చలన చిత్రమై వెండితెరపై కనువిందు చేయబోతోందని విన్నదగ్గరనుంచీ ఆత్రమే.. అనుమానమే.. ఆరాటమే! పాత్రధారులూ, చిత్రీకరణ.. "మిథునం"లో అతి ముఖ్యమైన భూమిక ఆ "తోట" ఎలా ఉండబోతోందా అనే ఆలోచనతో పాటూ సంగీతం గురించి కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.

ఎట్టకేలకు ఆడియో విడుదల చేసారు. మచ్చుకు చూపించారు. ఆ పాటల కబుర్లు.. నాకు తెలిసినవీ.. నాకు తోచినవీ.. కొన్ని.

తనికెళ్ళ భరణి దర్శకత్వంలో, శ్రీరమణ "మిథునం" స్వరవీణాపాణి చేతిలో స్వరాలద్దుకుంది. జొన్నవిత్తుల, ఆనంద్ ముయిద రావ్, తనికెళ్ళ భరణిల కలంలో సాహిత్యాన్ని వ్రాయించుకుంది. కే. జే. యేసుదాసు, బాలసుబ్రహ్మణ్యం, జమునా రాణి, స్వప్న, జొన్నవిత్తుల గళంలో వినిపించింది.

* "షట్పద ఝుంకారమో.. ఏమో..!" అని ఒళ్ళు పులకలు తేలేలా మొదలయ్యే యేసుదాసు గంధర్వ గాత్రంలో "ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిథునం.." అనే పాట ఎంత విన్నా చాలుననిపించడంలేదు.

దాంపత్య రసజ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం

అల్పసంతసపు కల్పవృక్షమున ఆత్మకోకిలల గానం

గృహస్థ ధర్మం సగర్వమ్ముగా తానెగరేసిన జయకేతనం

ఇలాంటి మెరుపులు తళుక్కుమన్న జొన్నవిత్తుల సాహిత్యం చక్కగా ఉంది. యేసుదాసు మంత్రజాలం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! జగద్విదితం.. అదో అద్భుతం!!

* నాకు అమితంగా నచ్చిన పాట - అప్పదాసునీ, బుచ్చిలక్ష్మినీ ఠక్కున కళ్ళెదుట నిలబెట్టిన పాట అలనాటి మేటి గాయని జమునా రాణి పాడిన "ఎవరు గెలిచారిప్పుడూ.. రంగా.. ఎవరు ఓడారిప్పుడూ.." ఆనంద్ ముయిద రావ్ వ్రాసారట.

పడుచు మనసున్నోడు పరుగులెడుతున్నాడు
అరవయ్యేళ్ళ పడుచు అలిగి కూర్చున్నాది

కలతలన్నీ కలిపి కలనేతలా నేసి
కన్నీళ్ళు ఒగ్గేసి కలిసి నవ్వేసారు

ఎవరు గెలిచారిప్పుడూ.. రంగా.. ఎవరు ఓడారిప్పుడూ
రెండు గుండెల చప్పుడూ.. రాగమొక్కటె ఎప్పుడూ..* "పాకవేదం అపౌరుషేయం.. అంటే నీకెట్టా తెలుస్తుందీ.. నిరక్షర కుక్షివి.." అని బుచ్చిలక్ష్మిని ఆడిపోసుకుని శాకాల్లో ఘనపంచరత్నాల చిట్టా చదివిన అప్పదాసుకి ఓ మంచి పాకకళాసారం దట్టించిన పాట ఉండాలని భరణి అనుకున్నారేమో.. ఇదిగో ఆయన కలం నుంచే ఓ మాంచి రుచి కోరు రుచైన పాట.. "ఆవకాయ మన అందరిదీ.. గోంగూర పచ్చడీ మనదేలే"

ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ.. పెసరట్టులోకి అల్లమురా
దిబ్బరొట్టెకీ తేనె పానకం.. దొరకకపోతే బెల్లము రా

వేడి పాయసం ఎప్పటికప్పుడె.. పులిహోరెప్పుడు మర్నాడే..
మిర్చీ బజ్జీ నోరు కాలవలే.. ఆవడ పెరుగున తేలవలే..

గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా..
గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకుమురా..

పనసకాయ నీకున్నరోజునే పెద్దలు తద్దినమన్నారూ..
పనసపొట్టులో ఆవపెట్టుకుని తరతరాలుగా తిన్నారూ..

అని అప్పదాసు మైమరచి పాడుతూంటే బుచ్చిలక్ష్మి పెనం మీద ఆవగింజలా చిటచిటలాడడం మన కళ్ళముందే కనిపించేయాలి కదా.. అతి చమత్కారంగా ముక్తాయింపిచ్చింది మరి..!  ఏమనీ..?

తిండి కలిగితే కండకలదనీ గురజాడవారు అన్నారూ..
అప్పదాసు ఆ ముక్క పట్టుకుని ముప్పూటలా తెగతిన్నారూ.. అని
భలే బుచ్చిలక్ష్మి కదూ! ఈ పాట బాలసుబ్రహ్మణ్యం, స్వప్న పాడారు. సాహిత్యం చదివితే ఓ మంచి పాటకి పేరడీ అని తెలిసిపోవడం లేదూ!

* "మావిడి పిందె కరష్టే కానీ.. అది చిలక కాదు.. ఉడత" అని ఇంగిలీషులో తేల్చి చెప్పింది కనుక బుచ్చిలక్ష్మి తన పెనివిటికి కాఫీ ఇస్తుందంటారా! ఇస్తుందేమో మరి! జొన్నవిత్తుల కాఫీ దండకమొకటి వ్రాసి, స్వయంగా పాడారు కూడా!

"అనుదినమ్మును కాఫీయె అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కూ
కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కూ
అమృతమ్మన్నది హం బక్కు అయ్యలారా.." అని సాగే ఈ దండకం "టేస్టేశ్వరి.. బ్రూకు బాండేశ్వరి" లాంటి చిత్ర పద విన్యాసాలతో నడుస్తుంది. "ఎలా ఉందీ.. నచ్చిందా?" అంటే సినిమా చూసేదాకా చెప్పలేను.

* ఎంతటి ఆనందమైనా ఒక ముగింపుకు రాక తప్పదన్న చేదునిజం.. భరణి రచన "ఆట గదరా శివా.. ఆట గద కేశవా.." యేసుదాసు గళంలో వింటూ ఉంటే మసక చీకటిలా కమ్మేస్తుంది.

ఆట గద జననాలు
ఆట గద మరణాలు
మధ్యలో ప్రణయాలు
ఆట నీకూ..

అయిదే పాటలు.. అలరించే పాటలు!

ఆడియో సీడీ కచ్చితంగా మీ ఇంట్లో చేరి మీకు వీనులవిందు చేయాల్సినది.. వెళ్ళి కొని తెచ్చేసుకోండి మరి!


"మిథునం" ఆడియో సీడీ
కీర్తన మ్యూజిక్
వెల: రూ 60/-, $5

23 comments:

 1. హమ్మయ్య పాటల గురించి చదివాక సగం బెంగ తీరిందండీ. ఇక్కడ మేము ఎప్పుడెప్పుడు మార్కెట్లో దొరుకుతాయా అని ఎదురుచూస్తుంటే ఇలా ఊరించడం మీకు తగునా చెప్పండి.

  ReplyDelete
 2. మొన్ననే ఒక స్నేహితునికి భరణిగారు ఆడియో కబుర్లన్నీ చెప్పారంట. తను ఆగలేక ఫోన్ చేసి నాకు పూస గుచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు మీరు ఇంకా ఊరిస్తూ ఒక రివ్యూ వ్రాసారు. ఎదురు చూపుల్లో ఉన్న సుఖం అనుభవిస్తూ ఉంటాం మరి...

  ReplyDelete
 3. మిధునం రచన మీద మమకారం ఎలాంటిదంటే సినిమాగా వస్తోందంటే,ఎన్నో సందేహాలు.మన ఇమాజినేషన్ కి అందుతుందా అని!! కానీ మీ ఒక్కొక్కరి రివ్యూలు చూస్తుంటే మళ్ళీ ఆశ కలుగుతోంది,భరణి చేతిలో బాగానే వస్తుందని!

  ReplyDelete
 4. ఆ పాటలన్నీ ఒకెత్తు మీ మాటల మూటలన్నీ మరొకెత్తూ...వెరసి మిధునం+మా మనసుల్లో ఆనందకేళీ మధనం.

  ReplyDelete
 5. అబ్బ రివ్యూ చాలాబాగుందండీ.. పాటలు బాగున్నాయనమాట మొన్న ట్రైలర్ చూసినపుడే పాటలు బాగుండబోతున్నాయని ధీమా వచ్చేసింది... చక్కని రివ్యూ అందించినందుకు ధన్యవాదాలు..

  ReplyDelete
 6. పండుగ పూటా కొత్తావకాయ లాంటి మాంచి ఘాటైన విషయం చెప్పారు సుమా...

  ReplyDelete
 7. పాటలకి సంబంధంలేని ప్రశ్న: ఆడియో సి.డి కవరుపైనున్న బొమ్మ చూసి ఆశ్చర్యపోయాను. శ్రీవైష్ణవ నామధారణలు, ఆచారం స్ఫష్టంగా కనిపిస్తాయ్ అనుకున్నాను. సినిమా తీసేవాళ్ళకి అన్ని స్వేఛ్ఛలు ఉంటాయనుకోండి. But, somewhere its disappointing to me. Also, the lyrical quality, just reading through the lines cited by you, is disappointing to me.

  Any way, I love the story, but I will never see the film, because I don't like to be disappointed. ఇంతవరకు గొప్ప సాహిత్యాన్ని దేనినీ తెలుగు సినిమా తెరపై పట్టుకోలేక పోయారని నా బలమైన అభిప్రాయం/కంప్లైంటు.

  Regards,
  Sreenivas

  ReplyDelete
 8. నిత్య కొత్తావకాయగారూ మీ పోస్ట్‌లు కూడా మీ మాటల్లాగే భలే ఉంటాయండి. మీరు రివ్యూ రాసి, పాజిటివ్ రేటింగ్ ఇచ్చారంటే ఇంక దానికి తిరుగేముంది! 'మిథునం' సగం విజయం సాధించేసినట్టే. :)

  ReplyDelete
 9. మీ పదాల్లో ఈ పాటలు ఇంకాస్త అందంగా కనిపిస్తున్నాయ్.. ఇక విని చూడటమే మిగిలింది :-)
  ఒక్క "ఆది దంపతులు అభిమానించే అచ్చ తెలుగు మిథునం" పాటనే అదే పనిగా వింటున్నా శుక్రవారం నించీ (థాంక్స్ టూ వేణూ శ్రీకాంత్!) మీరు ఫుల్ ఆల్బం కి సర్టిఫికేట్ ఇచ్చేశాక ఇక లేటు చేయకూడదు :))

  :)))))) చాణక్యా @ నిత్య కొత్తావకాయ. సో ట్రూ!

  ReplyDelete
 10. @ SHANKAR.S: నాకూ పాటలు విన్నాకే సగం బెంగ తగ్గిందండీ. సినిమా చూసే దాకా మిగిలిన బెంగ ఎలాగూ తప్పదు. ధన్యవాదాలు.

  @ MURALI: :) ధన్యవాదాలు.

  @ Indira: "ఊహకి సరితూగేలా సినిమా ఉంటుందా?" అనే సందేహం అందరికీ ఉందండీ. చూడాలి. ధన్యవాదాలు.

  @ శ్రీనివాస్ పప్పు: :)ధన్యవాదాలు.

  @ వేణూశ్రీకాంత్: ఐదు పాటలూ హిట్ అవుతాయో లేదో కానీ ఒకట్రెండు పాటలు మాత్రం అద్భుతంగా ఉన్నాయనిపించిందండీ. ధన్యవాదాలు.

  @ puranapandaphani: :) ధన్యవాదాలు.

  ReplyDelete
 11. @ Sreenivas Paruchuri:

  "ఆ శివాష్టకం కూడా ఓసారి అనుకోరాదూ.. ఆ చివరి పాదులు కూడా తడుస్తాయీ.." అని బుచ్చిలక్ష్మి అంది కదండీ. నమకచమకాలు వల్లించే అప్పదాసు నిలువు నామాల వాడు కాదు మరి.

  ఇంక సాహిత్యవిలువల ప్రమాణాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోడానికేముందండీ. మీరు ఆనాటి స్ఫుటమైన పెద్ద గీతలతో పోలుస్తున్నారు. నాబోటివాళ్ళం ఈ కాలపు వంకర టింకర గీతలతో పోల్చి "ఇవే మహాభాగ్యం" అనుకుంటున్నాం. అయితే మరీ తీసిపడేసేలా ఏమీ లేవనే అనిపించిందండీ.

  గొప్ప సాహిత్యాన్ని ఇప్పటిదాకా తెరపై పట్టలేకపోయారన్నమాటతో సంపూర్ణంగా ఏకీభవిస్తాను. ఏకవీరకే సాధ్యం కాలేదు! కాకపోతే ఇప్పటి చిత్రాల వెల్లువకి ఎదురీదుతున్న అభిరుచి గల ఈ దర్శకనిర్మాతలని అభినందించకుండా ఉండలేను. :)

  మీ స్పందనకి ధన్యవాదాలు.

  ReplyDelete
 12. @ చాణక్య: అబ్బో! పెద్ద మాట! :) నిజంగానే మిథునం విజయం సాధించాలనే కోరుకుందామండీ. ఇందరి గుండెల్లో గూడు కట్టుకున్న కథ కదా.. భరణి నిరాశ పరచరనే అనుకుందాం. ధన్యవాదాలు.

  @ నిషిగంధ: అన్ని పాటలూ విని తీరాల్సినవి. కొన్ని మళ్ళీ మళ్ళీ వినాల్సినవీ కూడా ఉన్నాయండీ. సంతోషించాల్సిన విషయమే కదూ! చిత్రం కూడా బాగుంటుందని ఆశిద్దాం. ధన్యవాదాలు.

  ReplyDelete
 13. అసలే ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ ఎదురుచూస్తుంటే మీరిలా కొత్తావకాయని కళ్ళముందు పెట్టి ఎలా ఉందంటే అంటూ ఊరించటం భావ్యమా? చాలా బాగుంది మిధునం పాటల టపా!

  ReplyDelete
 14. expectations penchesaarandee...
  eagerly waitingggggggggggggg ;)))))

  iha mee review gurinchi cheppedemundi??

  ReplyDelete
 15. మిథునం నేను చదవలేదండీ..చదవని వాళ్ళు, చదివిన తరువాత సినిమా చూస్తే మంచిదేమో!?
  మా చిన్నప్పుడు, మా పెద్దమ్మ పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని, ఆలీ బాబా నలభై దొంగల కథ చెప్తూ భోజనం తినిపించేది.
  తను కథ చెప్పే విధానంతో మా ఊహని జోడించి ఆ కధకు ఒక భావాన్ని సృష్టించుకొన్నాను.
  తరువాత ఎప్పుడో ఆ సినిమా చూసి మేము విన్న కథతో పోల్చుకొని నిరుత్సాహానికి గురయ్యాను.
  అదే విధానం చదివిన కధకు కూడా వర్తిస్తుంది అని నా నమ్మకం.
  సినిమా చూసిన తరువాత పుస్తకం చదివితే మనం చదువుతున్నది చూసిన దానితో పోల్చుకోవడంతోనే సరిపోతుంది.
  నేను గమనించిన ఇంకొక విషయం, చదివిన పుస్తకాన్నే మళ్ళి కొన్నాళ్ళు తరువాత చదివితే భావంలో కొంత variation కనపడుతుంది.
  కానీ చూసిన సినిమా వందసార్లు చూసినా కొత్తదనం ఏమి కనపడదు.
  మీ రివ్యూతో మిధునం చదవాలన్న ఆకాంక్ష ఇంకొంచం పెరిగింది :) ధన్యవాదాలు

  ReplyDelete
 16. నేను ట్రైలర్ చూసాను. చాలా బాగుంది.
  సినిమా కోసం నిరీక్షిస్తున్నాను.
  పాటల గురించి బాగా వ్రాసారు. సిడి కొనాలి.
  "శ్రీరామరాజ్యం" పాటలు విన్న తరువాత జొన్నవిత్తుల గారి మీద గౌరవం పెరిగింది.

  "మిథునం" ఒక అద్భుతమైన కథ.
  అది చదివినప్పుడు బాపు గారి దర్శకత్వంలో సినిమాగా వస్తే బాగుంటుందనుకున్నాను.
  అలాగే అప్పదాసు పాత్రలో అక్కినేని గారు, భార్య పాత్రలో షావుకారు జానకి గారు చేస్తే బాగుంటుందనుకున్నాను.
  అయినా, బాలు గారు, లక్ష్మి గారు బాగానే చేసినట్టున్నారు.

  ReplyDelete
 17. Nice.

  @ Paruchuri .. మిథునం కథలో శ్రీవైష్ణవ కుటుంబమనీ, సాంప్రదాయమనీ నాకు అనిపించలేదే?

  ReplyDelete
 18. కొన్ని చదవటానికి బాగుంటాయి, మరికొన్ని చూడటానికి బాగుంటాయి. బాపు-రమణ, వంశీ లాంటి వారి రచనల్లో కనిపించే వర్ణనలు విజువల్ గా చూపడం అసాధ్యం. ఒక ఎపిసోడ్ "మా పసలపూడి కథలు" సీరియల్ ని ఆన్లైన్ లో చూసి విరక్తి చెందిన అనుభవం తో, మిథునం చూడకూడదు అని నిర్ణయించుకున్నా. అందులోనూ, తనికెళ్ల భరణి "సిరా" ని అందరూ మెచ్చుకుంటుంటే ఒక్క సీను కూడా అర్థం కాక, వాళ్లంత బుర్ర నాకు లేదేమో అని సరిపెట్టుకున్నా.
  (btw, మిథునం చదివి చాలా రోజులయ్యింది, ఎవరిదగ్గరయినా PDF file link వుంటే ఇక్కడ share చేస్తే బాగుంటుంది)

  ReplyDelete
 19. మంచి విషయం చెప్పారు...మీ రివ్యూ బాగుంది

  ReplyDelete
 20. నేనూ మొన్నే ఒక స్నేహితురాలు వినిపించే భాగ్యం కలుగజేయడంతో విన్నాను. "ఆటగదరా శివా", "ఎవరు గెలిచారిప్పుడూ" పాటలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగ "ఎవరు గెలిచారిప్పుడూ" పాట చిత్రీకరణతో నిమిత్తం లేకూండా కళ్ళకు కట్టినట్లు "వినిపించింది" ఏం జరుగుతోందో! ;)

  ReplyDelete
 21. ఈ ఊళ్లో కమ్మని కాఫీ దొరకక పాత కాఫీటపాలు చదువుకుంటూ ఇటొస్తే - కొత్త దండకం రుచి చూపించారు ధన్యవాదాలు.

  ఎంత సగం పేరు కలిస్తే మాత్రం పోయి పోయి ఈఎవిడనెట్టా పెట్టుకున్నాడండీ భరణి ఆ పాత్రకి?

  ReplyDelete
 22. Ee cinema meeda meeru tharanga radio lo oka program chesthe chala santhoshistham

  ReplyDelete
 23. మరీ మరీ ఈ పాటను ఎన్ని సార్లు వింటూ వున్నా తనివి తీరడం లేదు..గొప్ప సాహిత్యం..బాలు గారి గాత్రం, భరణి గారి కలం నుండి జాలువారిన సుమధురగీతం...

  ReplyDelete