Wednesday, February 29, 2012

ఎన్నెల్లో ముత్యమా..

అరవిచ్చిన సన్నజాజుల మాలలో నారింజవన్నెల నేవళపు కనకాంబరాలు అక్కడక్కడ కలగలిపితే ముద్దుగా ఉంటుంది కదూ! చాలదన్నట్టు మనసుని మెలిపెట్టేందుకు కాసిని మరువపురెమ్మలు కలిపి పూల చెండు అల్లితేనో.. ఆ సౌందర్యపు తాకిడికీ, సుగంధ వీచికకీ సాయంత్రం మరింత గుమ్మెత్తిపోదూ! అలా జాజుల చెండల్లే మైమరపించే అందమైన పాటొకటుంది. అది తెలుగు సినిమా సిగలో "వేటూరి సుందర రామ మూర్తి" తురిమిన కదంబమాల.

సినిమా పాటకి కావ్య గౌరవాన్ని సంపాదించిపెట్టిన గీత రచయితలకి నిన్నటి దాకా కొదవలేదు. కొరత సుస్పష్టంగా కనిపిస్తున్న నేడు.. నాటి వైభవాన్ని తలుచుకుని నెమరేయడమే మిగిలిందేమో! తెలుగింటి ఆడపిల్లలో భిన్నపార్శ్వాలకు అద్దం పట్టిన అజరామరమైన మూడు రచనలను, ముగ్గురు మహాకవుల మానసపుత్రికలను.. తెలుగు వెలుగుల సోయగాలను విరజిమ్మే ఆ కావ్యకన్యకలను వెండి తెరపై నిలిపి నృత్యం చేయించిన ఆ పాట.. ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన "మయూరి" సినిమాలో "శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం" స్వరరచనలో ప్రాణం పోసుకున్న "వెన్నెల్లో ముత్యమా.." ఈ చిత్రం సంగీతదర్శకుడిగా బాలసుబ్రహ్మణ్యానికి నంది పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.

ఈ పాటకి స్ఫూర్తిదాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావో, లేదా పూర్తిగా వేటూరి ఆలోచనో తెలియదు కానీ, గురజాడ అప్పారావుగారి "పూర్ణమ్మను", విశ్వనాథ వారి "కిన్నెరసానిని", నండూరి వారి "యెంకినీ" కట్టెదుట నిలిపేందుకు, ఆ కవుల హృదయాన్ని క్లుప్తంగా ఆవిష్కరించేందుకు వేటూరి బహుచక్కని కృషి చేసారు. తెలుగు సాహిత్యచరిత్రలో మైలురాళ్ళలాంటి ఆ రచనలను కానీ, ఈ పాటను కానీ నా మిడిమిడి జ్ఞానంతో విశ్లేషించేందుకు బయలుదేరకుండా.. తెలిసినంతలో ఆస్వాదించేందుకు మాత్రమే ధైర్యం చేస్తున్నాను.

సుధ తొలిసారి నృత్య ప్రదర్శన ఇచ్చే సందర్భంలో వచ్చే ఈ పాట ఎస్. జానకి, బాల సుబ్రహ్మణ్యం, బృందం గళాలలో వినిపిస్తుంది. తెరపై అభినయించినది సుధా చంద్రన్. నృత్యరూపకానికి సూత్రధారిగా మోహన్ (శుభాకర్ ) కనిపిస్తాడు. నీడలో లీలగా కనిపించే ఓ అమ్మాయిని నువ్వెవరో చెప్పమని చెలులు అడగడం, ఆమెవరో సూత్రధారుడు పరిచయవాక్యాలు పలకడం, ఆపై ఆమె తన గురించి వివరించడం ఈ నృత్యరూపకంలో అంశాలు.

ఎన్నెల్లో ముత్యమా
ఎండల్లో పద్మమా
చీకట్లో దీపమా
సిరికే ప్రతిరూపమా

ఏ పేరో ఏ ఊరో చెప్పవమ్మా?
తెలుగింటి కలికంటి తేనెలమ్మా
చెప్పవమ్మా తేనెలమ్మా
చెప్పవమ్మా తేనెలమ్మా..

మహాకవి గురజాడ మానస పుత్రికవు నీవు
పుత్తడి బొమ్మవా.. పూర్ణమ్మవా..

అని సూత్రధారి పలుకగానే నడిచొచ్చిన ఓ పుత్తడిబొమ్మ తన గాథ వినిపిస్తుందిలా..

నా కన్నులు కలువల రేకులనీ
నా నడకలు హంసల రాకలనీ
నా పలుకులు తేనెల వాకలనీ
తెలిసీ తెలిసీ ఎంత వగచినా
తాతతోనె ముడి పెట్టారు
తాళితోనె ఉరి తీసారు

అమ్మల్లారా అక్కల్లారా.. ఆకాశంలో చుక్కల్లారా
నెలకోసారి వస్తూ ఉన్నా నిండుగ పున్నమినై
మీలోనే జీవిస్తున్నా పుత్తడిబొమ్మ పూర్ణమనై.. పుత్తడిబొమ్మ పూర్ణమనై..

కొండల నడుమ ఉన్న కోనలో, కొలను గట్టున వెలిసిన దుర్గని పూజించే పూజారింట పుట్టిన చిన్నది పూర్ణమ్మ. ఏయే వేళల పూసే పూవుల ఆయా వేళల అందించి, బంగరు దుర్గను భక్తితో కొలిచేది. పిన్నలను పెద్దలను ప్రేమించేది. కాసుల ప్రలోభానికి గురైన తండ్రి పూర్ణమ్మను ముదుసలికిచ్చి వివాహం చేసాడు. కొన్నాళ్ళకు పూర్ణమ్మను కాపురానికి తీసుకెళ్ళేందుకు వచ్చిన "తాత వయసున్న మగని" చూసి పూర్ణమ్మ కన్నెకలలు వాడిపోయాయి. చేసేదిలేక అతనివెంట వెళ్లేందుకు సిధ్ధపడిందా చిన్నది. పిన్నలకూ పెద్దలకూ తాను కొలిచిన తీరున దుర్గను కొలవమని అప్పగింతలు పెట్టింది.

నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొకపరి తలవండి
మీమీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నాపేరివ్వండి

అని జాలిగా పలికిన పూర్ణమ పలుకులు విని కన్నీళ్ళు చిప్పిల్లనిది ఒక్క ఆమె తండ్రి కళ్ళలో మాత్రమే. ఆ సాయంత్రం ఎప్పటి తీరున దుర్గను కొలిచేందుకు వెళ్ళిన ఆ పుత్తడిబొమ్మ ఇక ఇంటికి రాలేదు. నాటి కన్యాశుల్క దురాచారానికి బలైన ముక్కుపచ్చలారని వేవేలమంది ఆడపిల్లల ప్రతినిధి పూర్ణమ్మ.

కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి చేరెను మేనిపసల్
హంసల చేరెను నడకల బెడగులు
దుర్గను చేరెను పూర్ణమ్మ

ఒక సాంఘిక దురాచారానికి తన జీవితాన్ని ఓడిన బేల పూర్ణమ్మయితే, అత్త ఆరళ్ళకి విసిగి వాగై పారి, తనకు బాసటగా నిలవని మగడు బండరాయై మారాక చింతించిన ఓ ఉద్విగ్న హృదయ "కిన్నెర", విశ్వనాథ సత్యనారాయణ గారి ఊహాత్మక రచన.

విశ్వనాథుని చేత తొలినాటి కవితవై
విరితేనియలు పొంగు సెలయేటి వనితవై
వెలుగొందు తెలుగు జిలుగుల రాణివి
అవును..! కిన్నెరసానివి!

సూత్రధారి నోట అందమైన మాటల్లో కిన్నెరని పలుకరించిన వేటూరి ఆ 'సెలయేటి వనిత' చేత తన వెత ఎంత హృద్యంగా పాడించారో చూడండి.

తొలుత నా కన్నీరు కాల్వలై పారింది
పిదప అది వాగులై వంకలై పొంగింది

తరగలై నురగలై తరగలే పడగలై
పడగలే అడుగులై అడుగులే మడుగులై
పరుగులెత్తినదానిని.. నేను పరువాల దొరసానిని..

కొడుకు దశనే దాటి మగడు కాలేని
ఒక పడుచువానికి తగని గడుసు ఇల్లాలిని
నేను కిన్నెరసానిని.. పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని..

చాలా కుటుంబాలలో సామాన్యమైన అత్తాకోడళ్ళ పోరే ఆ ఇంటా జరిగింది. కొడుకు సుఖం పట్టని అత్త, కిన్నెర పై నిందలారోపించింది. అమ్మని అనలేక, ఆలిని రవ్వంత ఉపేక్షించిన కిన్నెర భర్త పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. దుఃఖాన్ని పట్టలేక ఆవేశంగా అడవులవెంట పరుగులు తీసింది కిన్నెర. ఆమె వెంట పరుగున వచ్చిన మగడు ఆమెను చేరుకుని కౌగిట బంధించాడు. అప్పటికే ఆలస్యమయిపోయింది. కిన్నెర మగని కౌగిట్లోనే కరిగి నీరైంది.

నిను కౌగిట నదిమిన నా
తనువు పులక లణగలేదు
కను విప్పితినో లేదో
నిను కానగ లేనైతిని ఓహో

అని దుఃఖించి బండరాయైన మగని ప్రేమను చూసి వగచింది కిన్నెర. "బ్రతికుండగా ఇంత ప్రణయమ్ము కలదంచు తెలిసితే ఇంకెంత చెలిమి ఉండేదంచు" వగచి వగచి "తన కర్మమింతేనని, తనకింక పతితో ఋణము తీరిందని తలచి" సాగిపోయింది. అలా సాగిన 'కిన్నెర నడకల సొగసులు' అనుభూతించిన క్షణాన ఎక్కడుందో కానరాని మనసుకి సైతం కనులున్నాయని ఒప్పని తెలుగువాడుండడు. జోహారు విశ్వనాథ కవీశ్వరా..!

కదలగా కదలగా
కాంత కిన్నెరసాని
పదుపు కట్టిన లేళ్ళకదుపులా తోచింది
కదలు తెల్లని పూలనదివోలె కదిలింది
వదలు తెల్లనిత్రాచు పడగలా విరిసింది

నడవగా నడవగా
నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిగా తోచింది
కడుసిగ్గుపడు రాచకన్నెలా తోచింది
బెడగుపోయిన రత్నపేటిలా తోచింది

జలదేవతల వెంట
సాగి కిన్నెరసాని
తెలితారకల వెంట వెలుగులా తోచింది
తలిరు పువుల వెంట తావిలా తోచింది
తెనుగు పాటల వెంట తీపిలా తోచింది

"లయ పెంచుతూ.. మధ్య లయ దించుతూ.. పాట రయమెంచుతూ 'అయ్యారె!' అనిపించు" కిన్నెర హొయలు చూసిన 'తెలుగు వాడి పున్నెపు రాసి' అంతా ఇంతా కాదు కదా.. నండూరి సుబ్బారావు గారి నోట "ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసినట్టు" యెంకి పాటలు పుట్టాయి. ఎన్ని రేతిరుల ఎన్నెల నండూరి వారి మనసు నింపి యెంకిని సృష్టించి ఉంటుందో..! ఒకే ఒక్క మాటలో సూటిగా "తెలుగు ఎదలో యెంకి ఎక్కికూర్చున్న చోటు" చూపించేసారు వేటూరి కూడా..!

"ఎవ్వరెరుగనిదమ్మ నండూరి యెంకీ..
పువ్వులా నవ్వేటి తెలుగు పూబంతి" అంటూ..

నాయుడు బావ గుండె నమిలిన పిల్ల పొంకం ఎన్ని అక్షరాలలో సరిపోతుందని..!? వెర్రి ఆశ కదూ వేటూరి వారిది!ప్రయత్నలోపం లేకుండా యెంకిని ఆరాధించారాయన సైతం..!

కడవాకైనా లేదు తొడిమంత ఎడము
ఎడమెట్టా ఉంటాది పిడికెడే నడుము
మబ్బు తెరనే దాటి వంకా జాబిల్లి
ఉబ్బరాలా రైకలో తెప్పరిల్లి

ఉబ్బరాలో ఏమి నిబ్బరాలో

జారుపైటే చాలు జావళీ పాట
నాయుడోరి జాణ నడిచేటి వీణ
వెన్ను తడితే చాలు వెన్నెల్లు కరుగు
గోవు పొదుగుల్లోన గోదారి పొంగు

ఎన్నెల్లో మునకిడిచి ఏడు మల్లెల కొదిగి
తెలుగింట పుట్టింది యెలుగంటి యెంకి
తెలుగల్లె ఎదిగింది చిలకంటి యెంకి
యెలుగంటి యెంకీ చిలకంటి యెంకీ

"ఎన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు.. ఏటి చెప్పేది నా యెంకి ముచ్చట్లు" అని నాయుడు బావే చేతులెత్తేసాడు.
"కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది.. దగ్గరగ కూకుంటె అగ్గి సూస్తాదీ" అని వాపోయాడు.
"మందొమాకో పెట్టి మరిగించినాదీ" అని నిందలేసాడు.
"కత్తిమీదే సాము కొత్తిమీదే కూడు.. సత్తువెరిగినె వారె విస్తుపోయేరు" అని యెంకి జాణతనాన్ని పట్టిచ్చేసాడు.
"సూపుతో మాటాడి ఊపిరితో తెనిగించు.. కనుబొమ్మతో నవ్వి మనసు కరిగించు" అని మురుసుకున్నాడు.
"రాసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల.. నా సొమ్ము.. నా గుండె నమిలి మింగిన పిల్ల.. యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి" అని నొక్కి వక్కాణించాడు.

అలక, కులుకూ తగుపాళ్ళలో రంగరించి రూపు దిద్దుకున్న తెలుగింటి పిల్ల కనుకే నాయుడు బావకి ప్రాణమయింది. ఆతనిపై ప్రాణాలు నిలుపుకుంది కనుకే "రేతిర్లో మనతోటకాడా వొక్కణ్ణి.. నా తిప్పలీశ్శరుడు లేడా! సీకు సింతాలేక నీవా, నా యెంకి.. పోకల్లె పండుకున్నావా!" అని నిష్టూరాలాడిన ఆతని నోటే "యెంకి వస్తాదాని యెదురూగా నే బోయి.. గట్టు మీదా దాని కంటి కాపడగానె.. కాలు కదపాలేదు నా యెంకి.. కరిగి నీరవుతాది నా యెంకి" అని పలికించింది, ప్రేమకి పదారణాల తెలుగు నిర్వచనమైంది.


కొసరు కబుర్లు :

* "ఎన్నెల్లో ముత్యమా.. " పాట ఇక్కడ చూడవచ్చు. అడగగానే వీడియో అప్లోడ్ చేసిన బ్లాగ్మిత్రులు వేణూ శ్రీకాంత్ దార్ల  గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

* ఈ పాటకు సుధ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. "నాయుడోరి జాణ నడిచేటి వీణ" అన్న చోట నా కళ్ళకు నిజంగానే యెంకిలా కనిపించింది.

* మయూరి సినిమా గురించి నవతరంగంలో ఓ సమీక్ష.. ఇక్కడ.

* ఎస్. పీ. శైలజ పాడిన "ఈ పాదం ఇలలోన నాట్య వేదం " పాట గురించిన చక్కని కబుర్లు ఇక్కడ

* వేటూరి అందించిన ఖజానా దాచుకోవాలని అభిమానులు చేస్తున్న చిరు ప్రయత్నం.

13 comments:

 1. చాలా బాగా రాసారు కొత్తావకాయ గారూ(ఈ వ్యాసాన్ని మన "వేటూరి" సైట్ లో ప్రచురిస్తున్నాం మీ అనుమతితో)

  ReplyDelete
 2. కొత్తావకాయ గారూ మీర్రాసింది చదివి వ్యాఖ్య పెట్టాలని ప్రయత్ని౦చాను మనసంతా పరవశానికి లోనై పదాలన్నీ పూర్ణమ్మ, కిన్నెర, ఎంకిలా మారిపోయాయి. మీ పద లాలిత్య౦లో వెన్నెల స్నానాలు చేసేస్తున్నాయి.

  ReplyDelete
 3. చక్కని చిక్కని తేట తెలుగు మీలా బ్లాగ్ ప్రపంచం లో ఎవరు రాయలేరు అంటే అతిశయోక్తి కాదేమో......చక్క గా ఉంది

  వీలుచుస్కోని కాత్యాయని వ్రతం పూర్తీ చేయాలి

  ReplyDelete
 4. వావ్ భలే రాసారండి !

  ReplyDelete
 5. చిరకాల దర్శనం. అందమైన పాటతో పాటు మూల కవితలనూ గుర్తు చేశారు. కిన్నెరసాని పాటలు చదువుతుంటే ఏదుపాపుకోలేక చదవడమే ఆపేసే వాడిని. (కష్టమ్మీద పూర్తి చేశాననుకోండి)

  ReplyDelete
 6. కొత్తావకాయగారూ,
  మీ బ్లాగు చాలా ఆలస్యంగా చూస్తున్నందుకు మన్నించాలి. బ్లాగ్ లోకంలో ఇంకా చాలా బ్లాగులగురించి నాకు ప్రథమపరిచయం కూడ లేదు.
  మీరొక చక్కని పరిశీలనచేశారు. సినిమాపాటకి కావ్యగౌరవం తీసుకువచ్చిన గీత రచయితలకి నిన్నటిదాకా కొదవలేదు అని. అది సత్యం. అంతేకాదు, వాళ్ళు బాగా డొక్కశుధ్ధి ఉన్నవాళ్ళు. అందుకని కొంతమంది చాలమేరకీ చాలామంది కొంతమేరకీ, భాషమీదా, భావం మీదా, లయజ్ఞానం మీదా, సాధికారం సాధించినవాళ్ళు. అందుకనే కేవలం సాహిత్యం చదివికూడా వాటిని ఆనందించగలం. అందులో మీరు ఉదాహరించినపాటలోని కావ్యకన్యకలు ముగ్గురూ తెలుగుభారతికి మూడు జడపాయలలాంటి వారు. మీ వ్యాసం రసనిష్యందంగా ఉంది. అభినందనలు.

  ReplyDelete
 7. చాలా బావుంది. సినిమా చూసినప్పుడు ఈ దృశ్యాన్ని చూసి, వీళ్ళకి సాహిత్యం బాగానే తెలుసే అని ఆశ్చర్యపడ్డం గుర్తుంది. బాలు కొంచెం "అతి"గా పాడాడు. తెరమీద వ్యాఖ్యానపు పంక్తులు పాడిన మగవాడు ఎవరు?

  ReplyDelete
 8. మంచి పాట. అందంగా రాసావు. పూర్ణమ్మ, కిన్నెరసాని, ఎంకి - మేలు కలయిక కదూ!
  ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందో వేటూరి వారికి! wonderful!
  నువ్వు ఆ కవితలను కూడా గుర్తు చేస్తూ మధురానుభూతిని అందించావు.

  ఈ పాట వింటుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు ముసురుతున్నాయి. రేడియోలో రెగ్యులర్ గా వచ్చేది ఈ పాట. మూడు కథలు చెబుతారని ఆసక్తిగా వినేదాన్ని :))

  ReplyDelete
 9. @ శ్రీనివాస్ పప్పు: చాలా సంతోషం సర్! ధన్యవాదాలు.

  @ జ్యోతిర్మయి: ధన్యవాదాలండీ. అంత చక్కని పాటనందించిన వేటూరి వారికి ఋణపడిపోయాం.

  @ శేఖర్: హమ్మయ్యో! ఎందరో మహానుభావులున్నారండీ. నావింకా తప్పటడుగులే. మీ ప్రశంసకి ధన్యవాదాలు.

  @ Sravya Vattikuti: ధన్యవాదాలు.

  @ puranapandaphani: :) నాకు కూడా కిన్నెర మీద కొంచెం ఎక్కువ అభిమానమే ఉందండీ. ఎన్నిసార్లు చదివినా ఉద్వేగం కలగకమానదు. "నీలిమబ్బుల బోలు నిడివి నీ చేతుల్లు.. " అక్కడికి వచ్చేసరికి కిన్నెర తొందరపాటుకు కళ్ళు చెమ్మగిల్లుతాయి.

  ధన్యవాదాలు

  @ nsmurty: నా బ్లాగ్ కి స్వాగతం. మీ ప్రశంస చాలా ఆనందాన్ని కలిగించిందండీ. అవునండీ. "కవిత్వం, భావుకత అంటే అందమైన పదాల గజిబిజి అల్లిక మాత్రమే" అని ఈ కాలపు కవుల భావనేమో అనిపిస్తూ ఉంటుంది. భావస్ఫోరకంగా రాసేవాళ్ళు బహుతక్కువ. ధన్యవాదాలు.

  ReplyDelete
 10. @ Narayanaswamy S: మీరు ఇలా అభిప్రాయాలన్నీ బయటపెట్టేస్తే చిక్కే సుమండీ. కాదనలేను. :) ఇంత వరకూ వచ్చాక చెప్పకపోవడమేం. జానకి గొంతు "నేను కిన్నెరసానినీ" అన్నప్పుడు మహకీచుగా వినబడుతుంది నా చెవులకి. :)

  తెరపై కనిపించిన మగవాడు శుభాకర్ అండీ. నాకు బాగా నచ్చినది పాటకోసం పూర్ణమ్మ, కిన్నెర, యెంకి కథల ఎంపిక, ఎంచుకున్న వరుస, మూలకవితల్లో పదాలను ఎత్తి రాసేయకుండా భావాన్ని చక్కగా తనమాటల్లో ప్రతిఫలింపచేసిన వేటూరి చాకచక్యం.

  ధన్యవాదాలు.

  @ ఆ. సౌమ్య: అవును. రేడియోలో ఈ పాట మొదలవగానే మూడు కథలనూ కళ్ళ కట్టించుకోవడం భలేగా ఉండేది. ఎంచుకున్న వరుస చూసావా! బేల 'పూర్ణమ్మ', ఖండిత 'కిన్నెర', నెరజాణ 'యెంకి'. :)

  ధన్యవాదాలు.

  ReplyDelete
 11. ఇందులో కంటే బాలూ అతిగా పాడిన పాటలెన్నో ఉన్నాయి లెండి. ఇందులో బాగానే పాడాడు. పైగా ఇది నృత్య రూపకం కాబట్టి, రక రకాల నాయికల్ని వర్ణిస్తూ పాడే పాటా, హావ భావాలకు ప్రాముఖ్యం ఉన్న పాటా కాబట్టి ఆ మాత్రం అతిని ఒప్పుకోవాల్సిందే మనం.
  సరిగా పాడితే అతి అంటారు, ఇప్పటి వాళ్ళు డ్రై గా పాడితేనేమో ఫీలింగ్ లేకుండా పాడుతున్నారంటారూ?

  జానకి గొంతులో కీచుని చాలా పాటల్లో అరికట్టలేం! ఆస్వాదించలేం! ఆ మాటకొస్తే సుశీల గొంతులో కూడా! కీచు దనం ఎవరి గొంతులోనైనా ఏం బాగుంటుందీ? శృతి అందుకోగలిగారన్న తుత్తి తప్ప!

  ఈ పాట లో సంగీతానికంటే సాహిత్యానికి, చిత్రీకరణకే ప్రాధాన్యం! బాలూ సంగీతం ఈ సినిమాలో "ఇది నా ప్రియ నర్తన వేళ" పాట కి బాగుంటుంది.

  వేటూరి అసమాన ప్రతిభకు ఈ పాటో మెచ్చు తునక!

  ReplyDelete
 12. తెలుగు సినిమా సాహిత్యం లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గొప్ప గేయ రచయిత వేటూరి సుందరరామ మూర్తి గారు ..
  ఈ టపా ద్వారా ఎన్నో విషయాలు పంచుకొన్నందుకు ధన్యవాదాలు .

  ReplyDelete
 13. BTW, what about another song - కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి? సితార సినిమాకోసం రికార్డు చేశారు (ఆడియో రికారుడుల్లో ఉంది), కానీ సినిమాలో లేదనుకుంటా.

  ReplyDelete