నేలపై పారాడుతూ వెతుకుతోంది ఇళై. ప్రాతస్సంధ్యావందనం పూర్తి చేసుకుని,
దేవతార్చన మందిరానికి అటుగా వెళ్తున్న కులశేఖరుడు కుమార్తెని చూసి ఆగాడు.
దీక్షగా మూలమూలలా వెతుకుతోందా అమ్మాయి.
"ఏం వెతుకుతున్నావమ్మా?"
లేచి నిలబడింది. ఇంకా ఆమె కళ్ళు నేలని వెతుకుతూనే ఉన్నాయి. కులశేఖరుడు ఆమెనే చూస్తున్నాడు.
"నిన్న సాయంత్రం రంగడికి బొమ్మల పెళ్ళి చేసి మేనా ఇలా తీసుకొచ్చాం నాన్నగారూ. పవళింపు వేళ చూద్దును కదా.. స్వామి తురాయి కనిపించలేదు. ఎక్కడ పడిపోయిందా అని నిన్నటి నుంచీ ఈ దారంతా వెతుకుతున్నాను."
"..."
"శ్రీరంగం నుంచి వచ్చిన భట్టరు గారిచ్చిన తురాయది. అక్కడ స్వామిని కల్యాణానికి అలాంటిదానితోనే ముస్తాబు చేస్తారట."
"అలాగా! అయ్యో.. వెతికిస్తాను తల్లీ. దొరుకుతుందిలే. లేదా శ్రీరంగం నుంచే మరొకటి తెప్పిద్దాం." అనునయంగా పలికాడు.
"మరొకటి తెచ్చినా అది భట్టరుగారిచ్చినది కాదుగా!" మోము చిన్నబుచ్చుకుంది.
మాట మార్చకపోతే పిల్ల బావురుమంటుందేమో అనిపించిందతనికి.
"అది సరే కానీ అమ్మా.. శ్రీరంగనాథుడి బొమ్మ గీస్తున్నావు కదా! పూర్తయిందా మరి?"
"ఓ.. మీ మందిరంలో పెట్టించనా?" ఉత్సాహంగా అడిగింది.
"తప్పకుండా.. కానీ బొమ్మ నాకు ఇచ్చేస్తే.. నీకు ఉండద్దూ?" ముచ్చటగా చూసుకున్నాడు బిడ్డని.
"నాకు బొమ్మెందుకు? రంగడే కావాలి."
ఉలిక్కిపడ్డాడు. ఇళై కళ్ళు నిర్మలంగా తననే చూస్తున్నాయి.
తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం
రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితేక్షణా
సౌశీల్యం, సౌందర్యం, నడత, కులము.. అన్నిటా రాఘవునకు తగినది వైదేహి మాత్రమే! ఇళై కనిపించలేదు ఆతని కళ్ళకి.. ఆ క్షణాన తను జనక మహరాజైపోయాడు.
దేవతార్చనవేళని సూచించే తూర్యనాదాలు కులశేఖరుని మైమరపుని చెదరగొట్టాయి.
***
"దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా.."
మేఘగంభీరంగా పలుకుతోంది కులశేఖరమహరాజు కంఠం. ముమ్మారు చప్పట్లు కొట్టి దేవతామూర్తులున్న కోయిలాళ్వార్ తలుపులు నెమ్మదిగా తెరిచాడు. చేతులు జోడించి, దీపకాంతిలో జాజ్వల్యమానంగా వెలుగుతున్న సీతారామలక్ష్మణులని తేరిపార చూసుకున్నాడు. క్షణకాలం అతని కనుబొమలు ముడివడ్డాయి. క్షణకాలం మాత్రమే..
"నవరత్నమాల కనిపించడం లేదా!!" అమాత్యులు ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు.
"రాముని మెడలో ఆభరణం కనిపించకపోవడమే చిత్రంగా ఉంది!"
"నెమ్మదిగా అంటారేం మహారాజా! ఘోరాపచారం.. ఎలా జరిగి ఉంటుందా అని."
"ఇదేదో మాయలా ఉంది." నిట్టూర్చాడు కులశేఖరుడు.
"మాయా మంత్రమూ కాదు. ఎవరో ఇంటిదొంగల పనే!" ముక్తకంఠంతో చెప్పారు మంత్రులు.
"ఇంటిదొంగలా!!"
"అవును మహాప్రభూ.. చెప్తే మీరు కోపగించుకుంటారు కానీ.. అడ్డూ అదుపూ లేకుండా వచ్చిపోయేవారిలో ఎవరో.."
"రామచంద్రప్రభో!" చెవులు మూసుకున్నాడు కులశేఖరుడు.
"రామ రామ!! ఎంత పొరబడ్డారు. ప్రాయశ్చిత్తం లేని పాపం సుమా నిర్దోషులని అనుమానించడం!" అతని గొంతులో ఆవేదన.
"లేదు
మహారాజా.. మా మాట నిజమని నిరూపిస్తాం.. రాజమందిరంలో విడిది చేసిన
భాగవతులని సోదా చేస్తే విషయం బయటపడుతుంది." మంత్రులు గట్టిగా చెప్పారు.
క్షణాల్లో బిలబిలమంటూ వచ్చిన సైనికులు స్వాములని చుట్టుముట్టి రాజు ఎదుట నిలిపారు.
"ఇదిగో ఈ దొంగస్వాముల మూటలో దొరికింది ప్రభూ!" సేనాధిపతి చేతిలో నవరత్నమాల!
"ప్రభో! మాకే పాపం తెలియదు. కులశేఖర పెరుమాళ్.. న్యాయం కాదిది!" స్వాములు ఆక్రోశించారు.
"కళ్ళకి కనిపిస్తున్న నిజాన్ని కాదని ఎలా బుకాయిస్తారు?" మంత్రులు అక్కసుగా అడిగారు.
కులశేఖరుడు సాలోచనగా మంత్రుల వైపు చూశాడు.
"కళ్ళకి కనిపించేదంతా నిజం కాదని నేను నిరూపిస్తాను." క్షణకాలం యోచించి స్థిరంగా చెప్పాడు.
***
రాజాజ్ఞ మేరకు ఓ కుండ, బుసలు కొట్టే ఓ కోడెనాగు తెప్పించబడ్డాయి. పాములవాడు ఆ కుండలో నాగుని విడిచిపెట్టి వాసెన కట్టాడు. మంత్రులు ముఖాలు చూసుకున్నారు.
"భాగవతులు నేరం చెయ్యరని రామచంద్రప్రభువు పాదాల సాక్షిగా నమ్ముతున్నాను. నా నమ్మకం అబధ్ధమైతే... ఈ నాగు కాటు వేస్తుంది." ప్రకటించాడు కులశేఖరుడు.
మంత్రులు గుసగుసలాడుకున్నారు. కాలనాగు కాటువేయక ఏం చేస్తుందిలే అని నవ్వుకున్నారు. స్వాములవైపు గేలిగా చూశారు. ఇంతలో హాహాకారాలు మిన్నంటాయి.
కులశేఖర మహరాజు ఆ కుండకి ఉన్న గుడ్డ విప్పి చెయ్యి పెట్టాడు!
ఆయన పెదవులు రామనామం పలుకుతున్నాయి. ముఖం ప్రశాంతంగా ఉంది. క్షణాలు గడుస్తున్నాయి. మంత్రులు జావకారిపోతున్నారు.
మణికంకణ శింజితం వినిపించేంత నిశబ్దం. కుండలో నుండి చెయ్యి బయటకు తీశాడు. పరమాశ్చర్యం.. పాము కాటు వెయ్యలేదు! మంత్రుల శిరస్సులు వాలిపోయాయి.
కులశేఖరుడు స్వాముల వైపు తిరిగి చేతులు జోడించాడు.
"అపచారానికి మన్నించండి. రాముని బంటుల బంటుల పరిచారకుల బంటులకి బంటుని నేను.. మీ పాదరేణువుని."
తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య
భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ
***
ఋతువులు మారుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి. దృఢవ్రతుడికి యౌవరాజ పట్టాభిషేకమైంది. ఇక శ్రీరంగం ప్రయాణమే అని సంబరపడ్డాడు కులశేఖరుడు.
***
శ్రీరంగమెళ్ళేటి బుల్లి గోసాయీ
ఇచ్చటికి శ్రీరంగమెంత దూరమ్మూ...
అద్దాల మంటపాలాకు తోటల్లూ
అల్లదిగొ శ్రీరంగ గాలిగోపురమూ...
ఇళై పాడుతోంది. ఆమె చేతిలో తంబురని ఆ సన్నని వేళ్ళు సుతారంగా మీటుతున్నాయి. కవాటంలోంచి వస్తున్న పిల్లతెమ్మెరలు ఆమె పాటని వినివెళ్తున్నాయి.
"అమ్మాయీ.. శ్రీరంగమెళ్ళాలని ఉందా?" ఆర్ద్రంగా ఉంది కులశేఖరుని గొంతు.
ఇళై తలవంచుకుంది. ఆ అమ్మాయి మనసంతా శ్రీరంగనాథుడిని నింపుకుందన్న సత్యం కులశేఖరుడికి ఏనాడో తెలుసు.
తెలవారుతూనే చాటింపు వేయించాడు.
"శ్రీశ్రీశ్రీ కులశేఖర చక్రవర్తి శ్రీరంగ దివ్యక్షేత్రానికి వారి సుపుత్రికా సమేతంగా వెళ్తున్నారనీ.. ఇష్టమైన వారు కూడా రావచ్చనీ.." రాజ్యం నలుమూలలా చాటింపు వేయబడింది.
తమ రాజు శ్రీరంగ క్షేత్రానికి వెళ్తే ఇక వెనక్కి వచ్చేదుండదు. దృఢవ్రతుడింకా పద్దెనిమిదేళ్ళ చిరుతప్రాయంలోనే ఉన్నాడు. సువిశాలమైన చేర దేశాన్ని, సామంత దేశాలనూ సంరక్షించేంతటి సామర్ధ్యమింకా వచ్చి ఉండదని మంత్రుల అభిప్రాయం. ఉపాయం ఆలోచించారు.
సరిగ్గా రాజుగారు ప్రయాణానికి సిధ్ధమయేసరికి ఓ మహాపండితుడు వారి శిష్యబృందంతో సహా తరలివచ్చాడు. ప్రయాణం వాయిదా పడింది.
మర్నాడూ చాటింపు వేయబడింది. మర్నాడు మరో సాధువుల గుంపు ఎదురొచ్చింది.
మూడో నాడు రామకథ గానం చేస్తూ మరొకరొచ్చారు.
ప్రతీ రోజూ దేశంలో చాటింపు వెయ్యబడుతూనే ఉంది. ఆటంకాలొస్తూనే ఉన్నాయి. ప్రతి రేయీ నిద్రపోయేముందు కులశేఖరుడు "రంగయాత్రా దినే దినే.." అని నిట్టూరుస్తూనే ఉన్నాడు.
***
ఇళై యౌవనసౌరభాలద్దుకుంటోంది. క్షణానికి ముప్పిరిగొన్న సంతోషంతో ఆ పిల్ల మోము కళకళ్ళాడుతుంది. ఇంతలోనే ఏదో చెప్పలేని బెంగతో కళవళపడుతూ ఉంటుంది. ఆటలు ఆడడం లేదు. గొంతు విప్పి పాడడం లేదు. తల్లి చూసేసరికి, చటుక్కున నీరునిండిన కళ్ళని తుడుచుకుని మామూలుగా ఉండే ప్రయత్నం చేస్తోంది. తండ్రి మోములోకి ఆమె చూడనే చూడదు. పొడిపొడిగా మాటలాడి మరలిపోతుంది.
"ఎవరు దోచుకున్నారో ఈమె మనసు?" ఇదే అంతుచిక్కని ప్రశ్న.
పలువిధాల ప్రయత్నించగా ఇష్టసఖులు గుచ్చి గుచ్చి ప్రశ్నించగా ఇళై పెదవి విప్పింది.. "రంగా..." అని.
"రంగనాథుడిని వరించిందా?!" కోటా పేటా ఏకమై ఆశ్చర్యపోయాయి. ఏమాత్రం తొణకనిది తండ్రిగారొక్కరే.
***
ఇక ప్రయాణం తప్పలేదు. ఇళై ని వెంటబెట్టుకుని సపరివారసమేతంగా ముందుగా వేంకటాచలానికి చేరారు. అటునుంచి ఆ దివ్య ధామాన్ని విడిచి పెట్టలేక పెట్టలేక శ్రీరంగానికి ప్రయాణం కట్టారు. శ్రీరంగనాథుడికి పిల్లనిచ్చి పెళ్ళి చేసేంత భాగ్యం దక్కినందుకు పరవశించిపోయాడు కులశేఖరుడు.
సీతాకల్యాణమంత వైభవంగా జరపాలని సన్నాహాలు చేసారు. కన్యాదానసమయం ఆసన్నమైంది.
"ఇయం సీతా మమ సుతా..." అని జనకమహరాజు ఆ సీతామహాలక్ష్మి చేతిని రామచంద్రుడికి అందించినట్టు.. కులశేఖరుడు తన కుమార్తె ను 'కులశేఖర వల్లి ' అనే పేరిట కన్యాదానం చేసాడు. ఇళై కులశేఖరవల్లిగా రంగనాథుని పెండ్లాడింది.
కూతురి అత్తవారింట్లో ఎన్నాళ్ళుంటారు ఎవరైనా..? ఇక భవబంధాలొద్దనుకున్నాక.. రాజ్యానికి వెళ్ళాల్సిన పనీ లేదు. మరి ఎక్కడికెళ్ళాలి? ఏదీ కులశేఖరుడి చిరునామా?
చేరదేశాధిపతి కులశేఖరుడు.. రాజ్యాన్నీ, బంధాలనీ త్యజించి వేంకటాచలం చేరుకున్నాడు. శ్రీ వేంకటేశ్వరుడి గర్భగుడి ఎదుట నిలబడ్డాడు.
వేయికళ్ళైనా చాలని, కోటి జన్మలు కాంచినా తనివితీరని సౌందర్యమది. ఎలా వదిలి వెళ్ళడం? ఆ ఆనందధామాన్ని ఎలా విడిచి వెళ్ళడం? సాధ్యమా? సాధ్యమేనా?
"పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాణ్బేనే.. " అని కులశేఖరుడు చేతులెత్తి కోరుకున్నాడు.
"ఇదిగో.. ఇలా నీ వాకిట మెట్టునైనా చాలు. నీ పగడాల మోవిని చూస్తూ ఉండిపోతాను." అర్ధించాడు.
కరుణించాడు పరమాత్మ. తిరుమలలో గర్భగుడి మెట్టు "కులశేఖర పడి" అయింది.
======================
ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే
తమహం శిరసా వందే రాజానం కులశేఖరం
చీకటి పడగానే పాలబువ్వ తినిపించినంత మురిపెంగా తాతగారు గరిపిన 'ముకుందమాల'... పలుకు తేనెలంటే అతిశయోక్తి కాదు. నలభై మణిపూసలు! కులశేఖర మహారాజు శ్లోకాల మాలలల్లి వేంకటేశ్వరునికి అర్పించాడట. వాటిని వల్లెవేస్తూ పొగడదండలా గుబాళించింది నా చిన్నతనమంతా. ఆ రాజు గారి కథని.. ఇలా కాస్త నా ఊహ జోడించి మీతోనూ పంచుకుందామని.
కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం
అద్యైవ మే విశతు మానస రాజహంసః
ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే?
కృష్ణా.. ఎరనెర్రని తామరలవంటి నీ పాదాలు.. ఆ పాదసౌందర్యమనే పంజరంలో నా మానస రాజహంసని ఇప్పుడే.. తక్షణమే బంధించనీ. ప్రాణాలు ఈ గూటిలోంచి పయనమయ్యే క్షణం దాకా ఆగితే.. కఫవాతపిత్తాలు నా కంఠాన్ని మూసేస్తాయేమో! ఈ క్షణమే నిన్ను స్మరించనీ..
కృష్ణార్పణం
సూపర్ గా ఉంది కొ.ఆ గారు. అక్కడక్కడ కొన్ని సినిమా డైలాగుల్లా వచనం ప్రయోగించేరు గానీ (ఉదా: "అమ్మాయీ.. శ్రీరంగమెళ్ళాలని ఉందా?"). అవి కాస్త చవకబారులా ఉన్నాయి. దాని బదులు "శ్రీరంగం వెళ్ళాలని ఉందా?" అని రాసి ఉంటే బాగుండేది.
ReplyDelete'చవకబారు' అనే పదం కాస్త చవకబారుగా ఉన్నట్టుంది. పదాలు పొదుపుగా వాడుకోవాలి కదండీ!
Deleteఏంటండీ రాతలు ? మీ కీబోర్డ్ ని దేనిలో ముంచి తెలుస్తారేం రోజూ :-))) ఇళై మనస్సుని ఆ శ్రీరంగనాథుడు ఎలా దోచుకున్నాడో, మీ అక్షరాలు కూడా అలానే మా మనస్సులని దోచేస్తున్నాయి !
ReplyDeleteThank you for writing such a wonderful series !
mixed feelings...Wish there were more in the series..!!! :( :)
ReplyDeleteThank you so much Kottaavakaaya gaaru :)
ఇలాంటి జ్ఞానాన్ని మీకిచ్చిన తాతగారికి వేవేల వందనాలు..
ReplyDeleteకృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం
ReplyDeleteఅద్యైవ మే విశతు మానస రాజహంసః
ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే?
ఇటువంటి అర్ధాన్నిచ్చే ఒక పద్యం దాశరధీ శతకం లోకూడా ఉంది.
APPUDU TIRUPPAVAI KATHALU
ReplyDeleteIPPUDU RAJAHAMSA
MARO HEMALATHA GARI SAHITYAM LA UNDHI.
MEE RACHANA ADBHUTHAM
ReplyDeleteAPPATI TIRUPPAVAI
ReplyDeleteIPPUDU RAJAHAMSA
DACHUKOVALSINA MUTYALU
మీరు రాసిన తిరుప్పావై ,ఈ సంవత్సరం రాజహంస కథను కూడ చదివాను. మీరు రాసిన ప్రతి అక్షరం లోను,పదంలోనూ,వాక్యంలోను విశిష్టాద్వైతాన్ని ప్రతిబింబిస్తూ,
ReplyDeleteపూర్ణ భక్తి,శరణాగతి భావాలు తొణకిసలాడుతూంటాయి. మీరు రాసినది చదువుతున్నపుడు మార్గళి మాసంలో రంగనాయకుల క్షేత్రాలైన శ్రీరంగం, తిరువళ్లురు, నెల్లూరు
మరియు మద్రాస్ లోని పార్థసారథి కోయిల్ లో జరిగే ఉత్సవాలు అన్ని గుర్తుకువచ్చాయి.
క్లుప్తం గా చెప్పాలి అంటే ముకుందమాలలోని ఈ క్రింది పద్యంలో మాదిరిగా చదువుతున్నంతసేపు మీ అక్షరాలలో శ్రీమన్నారయణ తత్వం చవిచూపించారు.
నమామి నారాయణ పాదపంకజం
కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ తత్త్వమవ్యయం
*హరికథల సంప్రదాయం తెనుగుదేశంలో ఉన్నట్లు తమిళనాట ఉందా?*
విశాఖహరి అనే ఆవిడ చెప్పే ప్రహ్లాద చరిత్రం ఏ సాంప్రదాయం క్రిందికి వస్తుంది?
Visaka hari Prahlada vijayam 03.mpg
http://www.youtube. com/watch? V=en1tbocMWxg
ఏంటండీ.. ఈ ధనుర్మాసం ముగ్గులు నెలరోజులూ పెట్టడం లేదా? రెండ్రోజులేనా?
ReplyDeleteచాలా బాగుంది. "సౌశీల్యం, సౌందర్యం, నడత, కులము.. అన్నిటా రాఘవునకు తగినది వైదేహి మాత్రమే! ఇళై కనిపించలేదు ఆతని కళ్ళకి.. ఆ క్షణాన తను జనక మహరాజైపోయాడు" సాక్షాత్తూ ఆ లక్ష్మీ దేవిని బిడ్డగా పొందిన కులశేఖరుడు నిజంగా మరో జనకమహారాజే. కర్తవ్య నిర్వహణ గావిస్తూ తామరాకు మీద నీటిబొట్టులా ఉండే వారి గురించి చెప్పేప్పుడు ఉదాహరణగా జనకమహారాజు గురించి చెప్తారు మరి కులశేఖరుడి గురించి ప్రస్తావించడం వినలేదు. ఆళ్వారు గా ప్రసిద్ధుడైన ఈయన మరో కోణాన్ని తెలియచేశారు. ధన్యవాదములు - అభినందనలు
ReplyDeleteGod bless you!
ReplyDelete