Monday, December 16, 2013

రాజహంస

చిరచిరలాడించే చుఱుకుటెండ. గుండిగలతో సేవకులు మోసుకొస్తున్న చల్లని నీళ్ళు ఎన్నైనా చాలడం లేదు.. ప్రాసాదం చుట్టూ వేలాడదీయబడిన వట్టివేళ్ళ చాపలపై ఇలా చల్లితే అలా ఆవిరైపోతున్నాయి. లోపలి గదులలో వట్టివేళ్ళ సువాసనలు, కవాటాలకి ఆవల వార ఏపుగా పెరిగిన మరువపు గుబాళింపులూ కలగలిసి గాలిలో తేలివస్తున్నాయి. 

రత్నపీఠం పై కూర్చున్నాడతను. ముత్యాల బాహుపురులు, రత్నకంకణాలతో విరాజిల్లుతున్న ఆతని చేతులు జోడించబడి ఉన్నాయి. చారుచక్షువులు అరమోడ్పులైపోయినాయి. ఎదురుగా కూర్చున్న ఆచార్యులవారి వైపే ఆతని దృష్టి, మనసూ లగ్నమై ఉన్నాయి.

"సువేలాద్రిపై నుంచి లంకలో ఉన్న రావణుడి మీదకి దూకాడండీ సుగ్రీవుడు.. హుమ్మని హుంకరిస్తూ రావణుడికి శృంగభంగం చేసి చక్కా వచ్చాడు. వచ్చాడా.. 'ఆహా! ఎంత గొప్ప పని చేశావూ..!" అనలేదు రామచంద్రుడు.

త్వయి కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ

'నీకేమైనా అయితే... సీతను పొంది మాత్రం నేనేం చేసుకోను!' అని విలవిల్లాడాడు. 'నీకేమైనా అయితే..' అనేది కూడా ఎంతో ఓగాత్యపు మాటలా అనిపించింది ఆయనకి. తప్పక, స్నేహితుడి దుందుడుకు పనికి గింజుకుంటూ అన్నాడు. అది స్వామీ మైత్రి అంటే!! కడవలకి కడవల నవనీతం తిన్నదేమో కృష్ణుడు.. రాముడైతే నిలువునా నవనీతమే కదూ! రూప దాక్షిణ్య మనోహరుడని అందుకే అంటారు.  

తన్మయంగా చెప్తున్నారు ఆచార్యులవారు. ద్వాదశోర్ద్వపుండ్రాలతో భాసిస్తున్న మేనూ, శ్రావ్యమైన కంఠస్వరమూ వారి పై నుండి చూపరుల దృష్టిని మరలనివ్వవు. వారు మాట్లాడితే శిశుర్వేత్తి పశుర్వేత్తి.. అంతే! ఇక కథ మొదలుపెట్టారంటే దానికి చిలవలు పలవలూ పిట్టకథలు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. వారు ఏ నవరాత్రుల్లోనో రామకథ చెప్తారంటే..  పురాణశ్రవణానికి దూరాభారమనుకోకుండా బగ్గీలూ, బండీలూ కట్టుకుని పిల్లపిల్లాద్రీ తరలి వస్తారు. 

"సత్పురుషుల మైత్రి అలా ఉంటుందన్నమాట! అంతటి మసృణిమ ఉండాలనమాట స్నేహానికి! అంత చిక్కని స్నేహం... రామసుగ్రీవులది.. జయ జయ జానకీ వల్లభా! జయ దశరథ నందనా! ఆచార్య తిరువడిగళే శరణం." పురాణ కాలక్షేపం ముగించారు ఆచార్యులవారు.

అక్కడే కాస్త దూరంలో కూర్చున్న అమాత్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకరి వైపొకరు చూసుకుని ఇవాళ్టికి గండం గడిచిందన్నట్టూ నిట్టూర్చారు. రత్నపీఠం మీద నుంచి చివాలున లేచి ఆచార్యులకి సాష్టాంగ పడ్డాడు రాజచంద్రుడు.
***

అతని పేరు కులశేఖరుడు. చేరదేశాధిపతి. తిరువంజిక్కుళం రాజధానిగా రాజ్యం చేస్తున్నాడు. తండ్రి దృఢవ్రతుడి కోరిక మేరకు  దేశాలన్నీ జయించి రాజ్యవిస్తరణ గావించిన శూరుడు. విల్లవర్, మలయర్, వానవర్, పంజువెట్టవాయర్ రాజవంశీకులందరూ ఆతని సామంతులు. అతని చేతిలో ఓడిన పాండ్యరాజు మెచ్చి పిల్లనిచ్చాడు.

అంతటి కులశేఖర మహరాజు పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళ్తే..

కృష్ణనిర్యాణమై కలి ప్రవేశించిన కొత్తలవి. ఇంకా పూర్వవాసనలు పోలేదు. ధర్మదేవత మూడోకాలు మెడ్డుతూ ఉంది. ఏతావాతా ప్రజలింకా సంతోషంగానే బ్రతుకుతున్నారు. కోళపట్టణంలో మహారాజు దృఢవ్రతుడు, నాదనాయకీ దంపతులకి 'మాసి' నెల శుక్లద్వాదశి నాడు, పునర్వసు నక్షత్రాన కుంభరాశిలో కులోద్దీపకుడు పుట్టాడు. "కులశేఖరుడ"ని నామకరణం చేశారు. జాతకర్మలు చేయించిన రాజపురోహితులు 'రాచబిడ్డ కారణ జన్ముడ'న్నారు. 

దేశాటన చేస్తూ అటుగా వచ్చాడు ఓ సాధుపుంగవుడు. బంగరు ఉయ్యాలలో బజ్జుని, చిన్ని నవ్వులు చెంగలిస్తున్న ఆ బుడతడి ముఖం చూసి అబ్బురపడ్డాడు. చిగురెర్రని పిల్లవాడి పాదాలవైపు చూశాడు. పాపడు గాల్లోకి కాళ్ళు తన్ని చేతులతో అందుకుంటున్నాడు. పాదరేఖలు ప్రస్ఫుటంగా గోచరమయ్యాయి సాధువుకి. క్షణం తీక్షణంగా చూసి తలపంకించాడు. ఏదో అవగతమై ఆయన మోమంతా నవ్వు పులుముకుంది. "వైకుంఠపురం వదిలి వచ్చావా పెనుమాణికమా.." అని నవ్వగానే చటాలున చేతులందించాడు కులశేఖరుడు. 

ఎత్తుకుని బిడ్డ చేతులని కళ్ళకద్దుకుని, రాణికి అందించి దృఢవ్రత మహరాజుతో చెప్పాడు సాధువు.. "రాజా! నీవెంతటి భాగ్యశాలివి! నీ కడుపున కారణజన్ముడు పుట్టాడు. విష్ణువక్షస్థలాన అలరారే కౌస్తుభమే నీ కులశేఖరుడు."

దృఢవ్రతుడి మేను గరిపొడిచింది. హృదయం ఉప్పొంగింది.

"మహానుభావా! ఎంత గొప్ప విషయం చెప్పారు! నా చిరంజీవి పట్ల మీ ఆశీర్వాదం ఎన్నటికీ ఇలాగే ఉండాలి. వాడు దేశాలేలాలి." అంటూ చేతులు జోడించాడు.

"శుభం! చిరంజీవి భక్తిసామ్రాజ్య చక్రవర్తి అవుతాడు." అని దీవించాడా సన్యాసి.

ఆ రాత్రి దృఢవ్రతుడి మనసు మనసులో లేదు. సుక్షత్రియ వంశాన్ని ఉద్ధరించి, రాజ్యవిస్తరణ చేసి పుత్రపౌత్రాభివృద్ధి చెయ్యాల్సిన కుమారుడు భక్తిమార్గం పట్టడమేమిటి! తెల్లారుతూనే అమాత్యులతో మంతనాలు జరిపాడు. 

"ప్రభూ! తమకు తెలియనిదేముంది. వేసే ఎరువుని బట్టే పైరు, పెంచే తీరుని బట్టే బిడ్డలు. మనకి ముందే విషయం తెలిసింది కనుక.. జాగ్రత్త పడదాం." అని ధైర్యాన్ని నూరిపోసారు. 

కులశేఖరుడు తండ్రి మనసునెరిగి వేదవేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు, సంస్కృతమూ తమిళమూ నేర్చాడు. కత్తిసాము, మల్లయుధ్ధం, అశ్వారోహణ గజారోహణాలూ, యుధ్ధవిద్యలలోనూ ఆరితేరాడు. ధనుర్విద్యా సాధన చేస్తున్న కులశేఖరుడిని చూసిన ప్రతిఒక్కరూ అలనాటి కోదండ రాముడిని చూడలేని లోటు నేడు తీరింది కదా అనుకునేవారు. 

చిననాటి నుండీ కులశేఖరుడికి రామ అన్న రెండు అక్షరాలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలూ.. గుండెచప్పుళ్ళూను. దృఢవ్రతుడు భయపడ్డట్టూ కులశేఖరుడు రాజ్యమొద్దనలేదు. రాజ్యవిస్తరణ చెయ్యననలేదు. క్షాత్రధర్మాన్ని విడనాడలేదు. రాముడు బాటే ఈ రాజు ది కూడా.. తండ్రి మాట జవదాటలేదు. చుట్టుపక్కల దేశాలన్నీ జయించి ఏకఛత్రం కిందకి తెచ్చి జనరంజకంగా పాలించనారంభించాడు. అదిగో.. ఆ సందర్భంలోనే పాండ్య రాకుమారిని పరిణయమాడాడు. ముత్యాల్లాంటి పిల్లలిద్దరు. కొడుకు పేరు మళ్ళీ దృఢవ్రతుడే. కూతురు ఇళై. 

రాజ్యమొద్దనలేదు కానీ తన భగవద్భక్తినీ, భాగవత భక్తినీ వదులుకోలేదు. ఏ వేళలో అయినా సాధువులూ, భక్తులు, పండితులూ, వైష్ణవస్వాములూ నిరభ్యంతరంగా రాజప్రాసాదంలోకి వచ్చి కులశేఖరుడిని చూడవచ్చు. అపరాత్రైనా ఎవరైనా వచ్చారని తెలిస్తే వాళ్ళ మంచీ చెడూ చూసి, వారే పుణ్యక్షేత్రాలు చూసి వచ్చారో అడిగి విశేషాలు తెలుసుకుని కానీ నిద్రపోయేవాడు కాదు. ఇది చూసి మంత్రులు భయపడుతూ ఉండేవారు. దేశాన్నేలే రాజుకి రక్షణ లేకపోతే ఎలా! కూడదని వారించారా, "అమాత్యవర్యా... రాముడున్నాడు. నా రక్షణకొచ్చిన చిక్కేమీ లేదు. వచ్చేది రాముడు పంపినవారే కదూ! అపచారం!!" అని ముక్కున వేలేసుకుని నొచ్చుకునేవారు రాజుగారు. చేసేదేముందింక! అడ్డూ ఆపూ లేకుండా వచ్చి పడే కాషాయగుడ్డల వాళ్ళనీ, నిలువు నామాల వాళ్ళనీ చూస్తే వారికి కారం రాసుకున్నట్టుండేది.

ఇది చాలదన్నట్టూ ఓ నాడేం జరిగిందంటే.. మధ్యాహ్నభోజనానికి ముందు పురాణశ్రవణం రాజుగారి రోజువారీ కార్యక్రమాల్లో ఒకటి. ఆచార్యులవారొచ్చి వెళ్తూండేవారు. రోజూ చెప్పినట్టే రామాయణంలో ఓ ఘట్టం వర్ణిస్తున్నారు. రాజుగారు శ్రధ్దగా వింటున్నారు.

"అలా సీతా లక్ష్మణసమేతంగా జనస్థానం చేరాడు రాఘవుడు. ఓనాడు దండకారణ్యంలోకి వ్యాహ్యాళికి వచ్చిన శూర్పణఖ ఆ బొమ్మరిల్లులాంటి పర్ణశాలని చూసింది. అక్కడో అందగాడిని చూసింది. అతనేమైనా సామాన్యుడా! పుంసాం మోహనరూపాయ.. అని చెప్తారు కదా! మన్మథ మన్మథుడు.. పురుషులకే మోహం కలిగించేంత సౌందర్యమాతనిది. చుప్పనాతి మనసు పడింది. నేరుగా వెళ్ళి తననేలుకోమంది. రాముడు నేను ఏకపత్నీవ్రతుడినన్నాడు. 'అల్లదిగో.. అక్కడ మా తమ్ముడున్నాడు. నాకేమీ తీసిపోడు.' అని సాగనంపాడు. లక్షణులవారేమో సాక్షాత్తూ బుసలు కొట్టే ఆదిశేషుడేనాయె.. 'హాత్తెరీ.. ' అని ముక్కూ చెవులూ కోసి పారేశాడు. పరిగెత్తుకు వెళ్ళిందయ్యా శూర్పణఖ. నేరుగా అన్నగారి దగ్గరకేమీ వెళ్ళలేదు. ముందు తన బంటుల్ని తోలింది. బంటులంటే అల్లాటప్పా వాళ్ళేం కాదు. దండకారణ్యంలో ఉండే మహర్షులనీ, మునులనీ నానాబాధలూ పెడుతూండేవారు.

తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వ రాక్షసాన్
ఖరం త్రిశిరసం చ ఏవ దూషణం చ ఏవ రాక్షసం

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఖర దూషణ త్రిశిరులనే ముగ్గురి నాయకత్వంలో అక్షరాలా పద్నాలుగు వేలమంది రాక్షసులు.. భీకరాకారులు.. మాయాయుధ్ధంలో ఆరితేరిన రక్కసులు బిలబిలమంటూ దిగిపోయారండీ.."

"అమాత్యా... యుధ్దభేరీ మ్రోగించండి." కంచు గంట లా మ్రోగింది కులశేఖరుని గొంతు. ఉలిక్కి పడ్డారు ఆచార్యులవారు. 

కులశేఖరుని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళలో ఎర్రజీర. అమాత్యులు అయోమయంగా చూస్తున్నారు. రాజుగారు స్పృహలో లేరు. 

"ఏంటలా చూస్తున్నారు! పద్నాలుగు వేలమంది రాక్షసులు వచ్చేస్తున్నారు. పిలవండి మన సామంతులని.. మోహరించండి సైన్యం.. తక్షణం యుధ్ధానికి సర్వసన్నధ్ధం చెయ్యండి." అని చరచరా నడుస్తూ అస్త్రాగారం వైపు సాగిపోతున్నాడు. వెంట అమాత్యులు పరుగులు పెడుతున్నారు. ఆచార్యులవారికేం చెయ్యాలో పాలుపోలేదు. ఆలోచిస్తూ వెనుకే తానూ నడుస్తూ.. 

"మహాప్రభో.. కులశేఖర చక్రవర్తీ! రాముడొచ్చేశాడు. యుధ్ధంలో గెలిచి వచ్చేశాడు.." అని పొలికేక పెట్టారు. 

టక్కున ఆగినవాడే  వెనక్కైనా తిరక్కుండా.. సందేహంగా "నిజమా!" అని ప్రశ్నించాడు.

"ముమ్మాటికీ నిజం! రాక్షసులని చీల్చి చెండాడి మరీ వచ్చేశాడు. 

త్వం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం
భభూవ హృష్టా వైదేహీ భార్తారం పరిషస్వజే 

రాక్షసులందరినీ చంపి దండకారణ్యంలో మహర్షులకి వాళ్ళ పీడ వదల్చివేశాడు. అలా శత్రుసంహారం చేసి వచ్చిన రాముడుని చూసి.. ఆనందంతో ఆలింగనం చేసుకుంది సీతాకాంత. " 

కులశేఖరుడు ఆగి సంతోషంగా నవ్వాడు. ఈ విపరీతధోరణికి అమాత్యుల గుండెల్లో రాయి పడింది. ఏవిటిదన్నట్టూ మొహాలు చూసుకున్నారు.

జనరంజకంగా పరిపాలిస్తున్న తమ రాజు ఏమైపోతాడో అనే బెంగ వారిలో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ భక్తి అనే వెర్రి ఒక్కటి తగ్గించే మార్గం వెతికితే చాలు.. రాజు తమవాడే! ఉపాయమాలోచిస్తూ తర్జన భర్జనలు పడసాగారు.

పులి మీద పుట్రలా మర్నాడే మరో ప్రమాదం వచ్చి పడింది. 

"అమాత్యా.. నేను శ్రీరంగం వెళ్ళిపోతున్నాను. ఇదిగో ఈ స్వాములతో కలిసి.. ఇకపై రాజ్యభారం మీదే!" తులసి పూసలూ, నారవస్త్రాలతో నిలబడి చెప్తున్న కులశేఖరుడిని చూసేసరికి వారికి మతి పోయింది.

ఒక మంత్రి క్షణమాలోచించి పొంగిపొరలుతున్న ఆ భక్తి సాగరానికి అడ్డుకట్ట వేశాడు.. తాత్కాలికంగా.

"తప్పకుండా మహాప్రభూ! కానీ.. చిన్ననాటి నుండీ ప్రతీ విషయంలోనూ రామచంద్రుడిని అనుసరిస్తున్న మీరు.. ఈ ఒక్క విషయానికీ ఆయన చూపిన బాటని ఉల్లంఘిస్తున్నారే!"

"రాముడిని ఉల్లంఘించడమా!!" ఆశ్చర్యపోయాడు రాజు.

"కుశలవులిద్దరినీ పట్టాభిషిక్తులని చేసి కానీ, రాముడు వైకుంఠానికెళ్ళలేదు ప్రభూ!"

"నిజమే! లోకరక్షణార్ధం సీతమ్మనే విడిచిపెడతానన్నాడు రామచంద్రప్రభువు. నా ప్రజలనెలా విడిచి పెట్టను! దృఢవ్రతుడిని నన్ను మించినవాడిని చేసి.. అప్పుడు నేను శ్రీరంగం వెళ్ళిపోతాను." 

అప్పటికి ముప్పు తప్పింది. మంత్రులు చర్చించుకున్నారు.. ఈ వైష్ణవస్వాముల బెడద వదిలిస్తే కానీ తమకు రాజు దక్కడని నిర్ణయించుకున్నారు.. కులశేఖరుడికి వారిపై ఏవగింపు కలిగించాలని పన్నాగం పన్నారు.

***

అదేమిటో.. తరువాయి భాగంలో..
 

3 comments:

  1. 1. తెలుగూ సంస్కృతమూ కలసినట్టు తమిళమూ సంస్కృతమూ కలుస్తాయా?
    2. హరికథల సంప్రదాయం తెనుగుదేశంలో ఉన్నట్లు తమిళనాట ఉందా?

    ఇవి వ్యక్తిగత సందేహాలే కానీ... కథాస్వాదనకు అడ్డుపడినవి కావు సుమా....

    ReplyDelete
    Replies
    1. ఫణి గారూ, కులశేఖరాళ్వార్ అని పిలవబడే ఈ మహరాజు విశిష్టాద్వైత సంప్రదాయంలో పన్నిద్దరాళ్వార్లు గా చెప్పబడే ఆచార్యుల్లో ఒకరండీ. ఈయన 'ముకుందమాల' అనే పేరుతో నలభై సంస్కృత శ్లోకాలు, 'పెరుమాళ్ తిరుమొళి ' అని తమిళ పాశురాలతో కూడిన ప్రబంధం రాశారు. సంస్కృతమూ, తమిళమూ కూడా నేర్చిన వారున్నారు. కానీ భాషలు కలుస్తాయా అంటే కలవవనుకుంటానండీ. తమిళం తెలిసినవారినడగాలి.

      హరికథలు కాదు కానీ, పురాణశ్రవణంలా ప్రబంధం చెప్పుకునే సంప్రదాయం ఉంది.

      ధన్యవాదాలు!

      Delete
  2. హరికథలున్నాయి. చెప్పేవారిని భాగవతార్లు అనేవారు. త్యాగరాజస్వామి నేరు శిష్యులు కొందరు ఇటువంటి భాగవతార్లే. ఇప్పుడు త్యాగరాజ చరిత్రగా ప్రసిద్ధిలో ఉన్న కథ వారి చలవే. తమిళం సంస్కృతం కలుస్తాయా .. అంటే .. కలవకుండ అడ్డుపడేదేవిటో నాకు అర్ధం కాలేదు. ఇప్పటికీ తమిళ వైష్ణవుల వాడుకల్లో ఈ మిశ్రమ వాడుకల ధోరణి కనిపిస్తుంది.

    ReplyDelete