వెచ్చని నిద్ర దుప్పటి కప్పేసుకొని, రాత్రంతా కమ్మని కలలు కన్న తరువాత, బధ్ధకపు పొరలు నెమ్మదిగా విడేలా పాదాలు ఒత్తుతూ, "అమ్మలూ, లేమ్మా.." అని ఓ మేఘ గంభీరమైన గొంతు లాలనగా మేలుకొలపడం కంటే శుభోదయం ఏముంటుంది?
"ఊ.. " కళ్ళు తెరవకుండా ఇంకో మాట కోసం ఎదురుచూసేదాన్ని.
"ఇలా ఆరయ్యే దాకా పడుకుంటే ఎలా? రేపటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. నాలుగయ్యేసరికి లేవాలి. ఏం?" కనురెప్పల వెనుక నెలగంటు ముగ్గు మెరిసి, కళ్ళు తెరిచి చూద్దును కదా..! ఊర్ధ్వపుండ్రాలు రూపం దాల్చినంత పవిత్రంగా, చందన తరువులా తాతగారు.
ఒక రోజు కాదు, ఒక నెల కాదు. పదిహేను వసంతాలు చిరునవ్వు మేల్కొలిపింది నన్ను.. సూర్యకిరణం కంటే ముందు.
కమలా ఫలాలు తిన్నారా? నాగపుర్ కమలాలని పెద్దగా ఉండేవి. ఆ పండు ముచిక దగ్గర ఓ చిన్న రంధ్రం చేసి, లోపలి తొనలు నెమ్మదిగా వేలితో బయటికి లాగేస్తే, నారింజ రంగు పండు దొన్నె (cup) లా మిగిలిపోతుంది. దానిలో మట్టి ప్రమిద నెమ్మదిగా దించి, వత్తి వేసి, నూనె పొసి వెలిగించి ఓ పళ్ళెం లో పెట్టి తాతగారు అందిస్తే, అపురూపంగా తీసుకెళ్ళి ఆ నారింజ వెలుగుల దీపాన్ని వాకిలి కిటికీ లో పెట్టే దాన్ని. వీధి మొత్తానికి నాదే అందమైన కార్తీక దీపం. గాలికి కొండెక్కకుండా తెల్లవార్లూ ప్రభలు విరజిమ్మేది అది. కార్తీక మాసం పూర్తయిందా.. వీధి సద్దుమణిగేది. మా లోగిలి నిద్రలేచేది. ప్రతి మార్గశీర్షాన వేళ తప్పకుండా.. కాత్యాయనీ వ్రతానికి సిధ్ధమయిన గోపకాంతలా.
నాలుగో గంటకి లేచి చన్నీళ్ళ స్నానం చేసినా వణుకు ఎందుకు రాదంటే.. 'నూతి నీళ్ళు వెచ్చగా ఉంటాయట!' అని నమ్మడం వల్ల. "శ్రీశైలేశ దయాపాత్రం.." అని తాతగారి గొంతు కంచు గంటలా మ్రోగేసరికి దేవతార్చన సన్నిధి గడపలో ఎందుకు కూర్చోవడం అంటే.. అది భక్తి కాదు, ఆ మాత్రానికి ముక్తి రాదు. అది బధ్ధకం, లాజిక్ అంటని పసితనం కనుక, దానికి నిబధ్ధత మారు పేరు కనుక. 'మనోహరమైన ముప్పై తమిళ పాశురాలతో అర్చించి, గోదాదేవి రంగనాధుడిని భర్తగా పొందిందట.' అని విని, ఆవిడ అక్కడెక్కడో శ్రీరంగంలో ఓ చక్కని ఇంట్లో, కులాసాగా కాపురం చేసుకుంటూ ఉండేదని నమ్మేదాన్ని. ఫొటోకి, చిత్ర పటానికి తేడా తెలియకపోవడం తెలివితక్కువతనమే కావచ్చు. తలుచుకుంటే నేను నాకే నవ్వుతెప్పించే చిన్నతనం అది.
అ, ఆ లు గుర్తున్నంత స్పష్టంగా, ఆ రోజు విన్న ప్రతి పద్యం పొల్లుపోకుండా గుర్తుందంటే, నేను ఏకసంతాగ్రాహిని అని కాదు. తెల్లవారు ఝాము చలిలో, ముడుచుకు కూర్చున్న పదేళ్ళ పిల్లకి చందనపు వాసన, కర్పూర గంధం, చామంతులు, గులాబులు, మరువం, నంది వర్ధనాల సుగంధపు మేళవింపు, 'చలి గాలికి వణుకుతున్నాయేమో!' అన్నట్టు సుడులు తిరుగుతూ, సుగంధం విరజిమ్మే అగరు పొగల నడుమ, నిశ్చలంగా వెలిగే దీపశిఖల మధ్య, శేష పర్యంకం మీద ఉజ్వలప్రభలు చిమ్ముతూ వేంచేసిన ఇంటివేలుపుల తీరు, వంట గదిలోంచి వీచే నైవేద్యాల భోగ్యమైన ఘుమ ఘుమల నేపధ్యం లో.. అందమైన శ్లోకాలు .. డెభ్భై వసంతాలొస్తున్నా వన్నె చెదరని ఓ గంభీరమైన ,శ్రుతి బధ్ధమైన, స్పష్టమైన, గొంతులో వింటే ఎలా మరిచిపోగలదు? పంచలో రాతి స్థంభానికే కంఠతా వచ్చేసి ఉంటాయ్, నేనెంత?
రెండువేళ్ళ సందులోంచి తెల్లటి ముగ్గు వదులుతూ, ముంగిట్లో క్షణాల్లో రంగవల్లికలల్లేసే ఆడపడుచుకి ఏం వరం ఇవ్వాలన్నా లక్ష్మి వెనుకంజ వెయ్యదు గాక వెయ్యదు. ప్రతి రాత్రి వీధిలో పోటీలు పడుతూ, పడుచులు వేసే చుక్కల ముగ్గులు ఒక అందమైతే, నెలగంటు ముగ్గులు ఇంకో విలక్షణమైన చక్కదనం. రెండు గీతలు ఒకే సారి గీస్తూ, ముగ్గు వేసి అమ్మ నన్ను అబ్బురపరిచేస్తే, నాయనమ్మ గుప్పెట్లో ముగ్గుని, వేళ్ళ సందులోంచి అలవోక గా జారుస్తూ, నాలుగేసి గీతలు సృష్టించి నాకు మాయాజాలికురాలిలా కనిపించేది. "ఎలా వేస్తావ్ నాయనమ్మా?" అని అడిగిన ప్రతి సారీ విసుక్కోకుండా, ముగ్గు పక్కన ఓ గీత విడి గా గీసి చూపించేది. నేను చూసిన చిత్రం నెమరువేసుకొనే లోపు ఆ గీత ఓ చెరుకు గడ గానో, ఓ వెదురు బాణం గానో, ఓ పొంగలి కడవ గానో మారిపోయేది. నవ్వేసి వీధిలో మిగిలిన ముగ్గులు చూసి రావడానికి తుర్రుమనేదాన్ని. ఇంకాస్త పెద్దయ్యాక నాయనమ్మతో పోరాడి జనవరి ఒకటి నాడు రంగుల ముగ్గుకి అనుమతి సాధించేదాన్ని. ముగ్గు వేసేసి, నేస్తాలతో వీధులన్నీ చక్కర్లు కొట్టి వచ్చేలోపు, ఆ ముగ్గు పక్కన ఓ చిన్న ఈనెల ముగ్గు ప్రత్యక్షమయ్యేది. ఓసారి విసుక్కుని 'పోన్లే' అని నాయనమ్మని క్షమించేసేదాన్ని. చెప్పొద్దూ.. ఒకటో తారీకు మునిమాపు వేళకే, పేడనీళ్ళతో ముంగిలి అలికి, నా వర్ణ కావ్యాన్ని రూపు మాపేసి, వైకుంఠ ద్వారాల ముగ్గు వేసేస్తే కాని దానికి నిద్ర పట్టేది కాదు. ప్రతి ఏడూ జరిగే తంతే అయినా నాయనమ్మ- మనవరాళ్ళ పోరు తప్పేది కాదు ఆ రోజున.
తెల్లవారు ఝామున దేవతార్చన పూర్తయ్యాక , నడుముకు చుట్టి ఉన్న పై కండువా తీసి దులిపి, కప్పుకొని బయటకు వస్తూ రేడియో పెట్టేవారు తాతగారు. ముందు రోజు పూలు కట్టించుకొచ్చిన తామరాకులు దాచి, శుభ్రం గా తుడిచి వాటిలో వేడి పొంగలి పెట్టేది నాయనమ్మ. భక్తి రంజనిలో వినిపించే తిరుప్పావై పాశురం, దానిని మృదుమధురం గా వివరించే శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు తాతగారి ప్రవచనం వింటూ తింటేనే, పొంగలికి రుచి. అమృతవల్లీ సుందరం పాడే వారు తెలుగు అనువాదాన్ని.
"మేలుకో ఓ సిరీ! శాతోదరీ! మేలుకో ఓ నీళ! పరిపుర్ణురాలా! మేలుకో నవకిసలయాధరా.. కలశోపమపయోధరా.." అని చెలిని మేల్కొలిపి యమునకి / కావేరికి స్నానానికి తీసుకొని పోయి వచ్చి, కృష్ణుడిని మేల్కొలిపి, పొగిడి, బ్రతిమాలి సాధించారట భామినులు, పర ను, పరమాత్ముడిని కూడా.
" అర్ధులమూ.. అనుగులమూ.. అంజలింప వచ్చినాము అడిగిన వరమిడుదువని అనురాగపు గనివనీ.. ఒక అమ కొమరుడవై, వేరొకామ ఒడిలో దాగి.. పరవశమున పాడి పాడి విరహమెల్ల మరతుము, పర వాద్యము కరుణింపుమూ.. పరమానందమొసగుమూ." పాట గోదాదేవిని కనులకు కట్టిస్తే, ఆ పదాలు గోవిందుని, గోకులాన్ని ఎదుట నిలబెట్టేవి.
ఒకరోజు తాతగారడిగారు. "ఈ తెలుగు అనువాదం రాసినదెవరో తెలుసా? అమ్మలూ!"
"ఎవరు?" కళ్ళతోనే అడిగా.. నేతి ముద్దలాంటి కూడారు పాయసం గొంతు దిగుతోందాయె అదే క్షణంలో.
"మల్లీశ్వరి చూసాం గుర్తుందా! ఆ సినిమాలో పాటలు రాసినాయనే. కృష్ణ శాస్త్రి గారు.. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారంటారు."
"కోతి బావకు పెళ్ళంటా.. ఆ సినిమా యేనా?" నిర్ధారణ కోసం అడిగాను.
"ఆ..మనసున మల్లెల మాలలూగెనే.." అందించారింకో పాటను.
"ఎక్కడుంటారు ఆయన? వైజాగ్?" అదే పెద్ద దూరాన ఉన్న ఊరాయె నాకు అప్పట్లో.
పైకి వేలు చూపించి " కీర్తిశేషులయ్యారు" చెప్పారు.
"అంటే?"
"ఎప్పుడో ఆయన రాసిన పాటలు విని, ఆయన లేనప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూన్నాం చూడూ. అదీ కీర్తిశేషులవడం అంటే."
'కొత్త పుస్తకాల వాసనకి ఇంచుమించు సరిసాటి కొత్త బట్టలది' అని నేను ఢంకా మీద దెబ్బ కొట్టి మరీ చెప్పగలను. దర్జీ గుండ్రం గా చుట్టి ఇచ్చిన పరికిణీ తెచ్చి, దులిపి వేసుకుంటే అదీ పండగ. భోగి నాడు భోగిపళ్ళ సంబరాల గురించి, తెలుగు వారు ఎవరికీ ఎవరూ గుర్తుచెయ్యక్కర్లేదు. జ్ఞాపకాల్లో భోగిపళ్ళలో కలిసి జారిన పైసల గలగలలు వినబడని వాళ్ళుండరేమో. సంక్రాంతి నాడు ఉదయం అమ్మతో కలిసి పసుపు, కుంకుమలు పంచిపెట్టడానికి కొత్త బట్టలు వేసుకొని బయలుదేరేవాళ్ళం. పసుపు , కుంకుమ అమ్మ ప్లేట్ లో వేస్తే తాంబూలం అమర్చి పెట్టడం నా వంతు. కనుమ స్నానం, గంగిరెద్దుల వాళ్ళు"అయ్యవారికి శుభోజ్జయం కలగాలి" అని దీవిస్తూ బసవన్న చేత దీవింపచేసి, పాత బట్టలు దాని మూపున వేయించుకొని, దక్షిణ పుచ్చుకొని వెళ్ళడం ఎంత సంబరం అసలు!
'ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహముల'ని గాలిలో ప్రశ్న వదిలి చేతులు దులిపేసుకోలేను. 'నాకొద్దు ఆ జ్ఞాపకాలు, కాలచక్రాన్ని గిర్రున వెనక్కి తిప్పలేని బాధ నాకొద్దు.' అనాలనిపించినా అనలేను. మార్పు సహజం, అభిలషణీయం. ఆనాటి బడిపంతులు కొడుకు, ఈనాటి క్షణం తీరిక లేని సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు మరి! రోలు, రోకలి, తిరగలి, కొడవలి, గొడ్డలి, సైకిలు.. మాయమయిపోయిన సుఖమైన జీవితాలకు అక్కర్లేని పిండి వంటలు, నేతి పొంగళ్ళు తినాలని కాదు. జిహ్వకి, కంటికి కొత్త రుచులు తప్పనీ కాదు. కొత్త వింతే, కాని నాకు పాత రోత మాత్రం కాదు. క్షణం తీరిక లేని పరుగులో, ఎప్పుడైనా ఆటవిడుపుకి ఆగినప్పుడు.. తెలుగు పద్యం, వేణు గానం, పూర్ణం బూరెలు ఇలాంటి డెలికసీ లని అనుభవించే అభిరుచి పాడయిపోకుండా ఉంటే చాలు.
'పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు' కదా! నేను తాతగారి తీపి గురుతుని. నా తరువాత, నేను తీపి గురుతులని మిగుల్చుకోవాలంటే ఎంత ప్రయత్నం చెయ్యాలో.. కథలు, రుచులు, కబుర్లు, పాటలు.. ఎన్ని అందించాలో నా విహారి కి..
చాలా బాగుందండి. హృదయానికి హత్తుకునేలాగా...
ReplyDeleteశుభాభినందనలతో
తేజస్వి(ప్రజ్ఞ)
Super-Like సుస్మితగారూ.
ReplyDeleteచాలా బాగా రాశారు.
ReplyDelete>>>నేను తాతగారి తీపి గురుతుని.
చాలా బాగా ముగించారు ఈ వాక్యంతో. Beautiful Post.
చాలా బాగున్నాయండీ మీ టపాలు , అభినందనలు
ReplyDeleteతెలుగుదనమంతా ఒక్కసారిగా తాకినట్టుంది.
ReplyDeleteఒక రోజు కాదు, ఒక నెల కాదు. పదిహేను వసంతాలు చిరునవ్వు మేల్కొలిపింది నన్ను.. సూర్యకిరణం కంటే ముందు.
ReplyDeleteచాల అందంగా , ప్రేమగా ఉంది ఈ పోస్ట్. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను ?
నెమలి కన్ను మురళి గారికి థాంక్స్. ఇంత అందమైన పోస్టు ని చూపించినందుకు. ఈ రోజు నుంచీ నేను మీకు ఏ.సీ. ని.
ReplyDeleteనేను తీపి గురుతులని మిగుల్చుకోవాలంటే ఎంత ప్రయత్నం చెయ్యాలో.. కథలు, రుచులు, కబుర్లు, పాటలు.. ఎన్ని అందించాలో...
ReplyDeleteఎంత గొప్ప ఆలోచన..
Thanks you so much అండీ