Saturday, January 1, 2011

రెక్కల గుర్రం

రెక్కలొచ్చినా ఇబ్బంది లేనిది ఊహలకే..!
మనిషికో, జేబులో డబ్బుకో వస్తే లేనిపోని తలనొప్పులు. కదా!
నా 'న్యూ ఇయర్ విషెస్ ' కి రెక్కలు మొలిచాయ్, చిత్తగించండి.

ఈ 2011 సంవత్సరంలో..

ప్రతి రోజూ మీరు నిద్ర లేచే సమయానికి కరంట్ ఉండాలి.(ఇండియా వాసులకు)
మీ అలారం మీరు నిద్ర లేచాకే మోగాలి. (ఇది అందరికీనూ)
మీరు వేసుకోవాలనుకున్న బట్టలు ఎప్పుడూ ఇస్త్రీ చేసి సిధ్ధంగా ఉండాలి.
మీ కాఫీ మీరు తాగేంత వరకూ పొగలు కక్కుతూ ఎదురుచూడాలి.
నిద్రలేచి చూసేసరికి ఆడవాళ్ళకి వంటిల్లు శుభ్రంగా, వంటకి తయారుగా ఉండాలి.
మంచు కురిసే దేశవాసులకు, కార్ మీద మంచు ఆకాశ రామన్న తీసేసి ఉంచాలి.
బస్ లో వెళ్ళే వాళ్ళకి రోజూ లిఫ్ట్ దొరకాలి.
లిఫ్ట్ ఇచ్చే వాళ్ళ బళ్ళలో పెట్రోల్ తక్కువ ఖర్చవ్వాలి.
మీరు ఆఫిస్ కి వెళ్ళాకే, మీ బాస్ రావాలి.
ఆఫీసుల్లో ఫేస్ బుక్ ని హోం పేజ్ గా పెట్టాలి.
పిల్లలు పేచీ పెట్టకుండా తినేసి, ఏడవకుండా స్కూల్ కి వెళ్ళాలి.
కూర ఎప్పుడూ మాడిపోకూడదు.
మీరు పని పూర్తి చేసిన మర్నాడు మాత్రమే, మేనేజర్ దాని గురించి అడగాలి.
తలనొప్పి మీకు ఎప్పుడూ రాకూడదు. మీకు నచ్చని మీటింగ్ ఉన్నరోజు, కాసేఫు మీ మేనేజర్ కి రావాలి.
సాయంత్రం 5 తరువాత, ఆఫీస్ లో జనాలు ఉండకూడదని చట్టం రావాలి
మీరు బయటకు వెళ్ళాలనుకున్న రోజు, మీ ఆవిడ/ఆయన కాదనకూడదు.
ఇంట్లో ఉండి టీవీ చూద్దామనుకుంటే రిమోట్ ఎవరూ అడగకుడదు..
మాల్ లో ఎంతసేపు తిరిగినా కాళ్ళు నొప్పెట్టకూడదు.
మీ కళ్లకి నచ్చినవన్నీ సేల్ లో ఉండాలి.
ఐస్ క్రీం తింటే బరువు తగ్గుతారని పరిశోధనల్లో తేలాలి.
తిరుపతి వెంకన్న దర్శనం గంటలో అయిపోవాలి.
మీరు ఎదురుచూసిన సినిమా ఎప్పుడూ సూపర్ హిట్ అవ్వాలి.
మీకు నచ్చిన వాళ్ళ ఫోన్ ఎప్పుడూ మీకు ఎంగేజ్, నాట్ రీచబుల్ కాకూడదు.
మీ పుట్టిన రోజు వారాంతంలోనూ, మీ పిల్లల పుట్టిన రోజులు స్కూల్ ఉండే రోజుల్లోనూ రావాలి.
జనసందోహం ఉన్న చోట, మీ పిల్లలు మీ చేతిని వదలకుండా గాఠ్ఠి గా పట్టుకోవాలి.
మీరు కొన్న వంకాయలు ఎప్పుడూ పుచ్చుల్లేనివై ఉండాలి.
పండగ రోజుల్లో కూడా మన ఊరికి వెళ్ళే బస్ టికెట్లు దొరకాలి.
బంగారం ధర తగ్గిందని, మీ జీతం పెరిగిందని ఒకే రోజు తెలియాలి.
మీకు సుత్తి కొట్టి బుర్ర తినే జీవులకి, మీరు కనిపించగానే ఏదో ముఖ్యమైన పని గుర్తు రావాలి.
'నా ఫోటోలు అప్ లోడ్ చేసాను, చూడూ!' అని తినేసే వాళ్ళ కెమేరా కాకెత్తుకుపోవాలి.
మీరు నిద్రపోతున్నప్పుడు మీకు ఫోన్ కాల్స్ రాకూడదు.
మీకు ఈ ఏడాది జ్ఞానదంతం రాకూడదు.
మీరు పోస్ట్ చేసిన పేకేజ్ ఎప్పుడూ చేరాలి.
మీ పుట్టిన రోజు మీ వాళ్ళందరికీ గుర్తుండాలి. మీ ఆయన/ఆవిడది కూడా!
మీరు ముఖ్యమైన కాల్ మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఫోన్ బేటరీ డౌన్ అవకుడదు.
మీకు ఒంట్లో బాలేని రోజు వారాంతం లేదా బంద్ అవ్వాలి.
మీరు ఏ సైట్లోకి వెళ్ళినా వైరస్ రాకూడదు, వెళ్ళినది మీరు కనుక.
మీకు నచ్చిన వాళ్ళు దూరంగా ఉంటే, మీరు వాళ్ల కలలోకి వచ్చి మీ మీద బెంగ రావాలి.
మీకు వాళ్ళు కనిపించేదాకా కలలే రాకూడదు.
మనం ఇండియా వెళ్ళాలనుకున్నప్పుడు డాలర్ విలువ దారుణంగా పెరిగిపోయి, ఫ్లైట్ టికెట్ ధరలు ఘోరంగా తగ్గిపోవాలి.
మీకు నచ్చిన పాటని మీ పక్కన కూర్చుని ఎవరూ కూ(ఖూ)ని రాగం తీయకూడదు.
ఎండలో బయటకు వెళ్ళిన రోజు మీ పనులు సక్రమంగా, వెంటనే జరిగిపోవాలి.
వర్షంలో తడిసిన వెంటనే జొన్నపొత్తుల బండి కనిపించాలి.
చలిగా ఉన్న రోజు ఆదివారం కావాలి.

మొత్తానికి "విషింగ్ యూ ఏ హేపీ న్యూ ఇయర్" అన్నమాట.

9 comments:

 1. మీరెంత మంచివారు. మీకు వాక్శుద్ది ప్రసాదించమని దేవుడిని ప్రార్ధిస్తాము.

  ReplyDelete
 2. కొత్తావకాయ గారూ....మీ న్యు ఇయర్ విషెస్ చాలా బాగున్నాయ్! ఇప్పుడే మీ బ్లాగ్ చూడటం...వెంటనే నాకు తెగ నచ్చేయడం..ఫాలో అయిపోవడం కూడా జరిగిపోయి ఇక రెండు నెలల క్రితం రాసిన పోస్టుకి...ఇప్పుడు కామెంట్లు పెడుతున్నా! ఏమీ అనుకోరుగా! :) భలే ఉంది మీ బ్లాగ్! ఇంకా ఆ పిట్ట....ఆవకాయ వర్ణన!..సూపర్బ్!

  ReplyDelete
 3. @ మందాకిని, జ్యోతి: సంతోషం. :) జ్యోతి గారింట్లో గులాబి చెట్టు రోజుకి నాలుగు పువ్వులు ఎక్కువ పుయ్యాలని కోరుకుంటున్నా.. వాక్శుధ్ధి వరం ఆవిడ ఇప్పించే మాటుంటే. :)

  @ ఇందు: భలేవారే.

  ReplyDelete
 4. అబ్బే, ఇలా బతకడం కనాకష్టం తెలుసా మీకు? ఊహించి చూడండి. నాల్రోలు పొతే మహా బోరు కొట్టేస్తుంది. అనుకుంటాం గానీ, కాసిన్ని తలనొప్పులు, ఎప్పుడూ ఏదో గోల లేకుంటే మనకు మనసున పట్టదు కదా.. ఏదో మీ మంచితనం, అమాయకత్వం నలుగురికీ మంచి జరగాలని రాసారు గాని, నిజ్జంగా నిజమైపోతే ఇబ్బందే మరి. :)

  ReplyDelete
 5. entha chakkati blog idi !!!.. innaallu choodakunda undipoyenae ani tega baadha padipotunnanandi. chaala chaaaala entertaining ga undi idi.. meeru ma yeduruga koorchuni boldanni kaburlu cheptunnattu ga anipinchindi.. Love U madam..

  ReplyDelete
 6. నిద్రలేచి చూసేసరికి ఆడవాళ్ళకి వంటిల్లు శుభ్రంగా, వంటకి తయారుగా ఉండాలి.
  ఐస్ క్రీం తింటే బరువు తగ్గుతారని పరిశోధనల్లో తేలాలి.
  మీరు కొన్న వంకాయలు ఎప్పుడూ పుచ్చుల్లేనివై ఉండాలి.
  'నా ఫోటోలు అప్ లోడ్ చేసాను, చూడూ!' అని తినేసే వాళ్ళ కెమేరా కాకెత్తుకుపోవాలి.
  వర్షంలో తడిసిన వెంటనే జొన్నపొత్తుల బండి కనిపించాలి.
  చలిగా ఉన్న రోజు ఆదివారం కావాలి.

  ఇవి అన్ని నిజం అయితే ఎంత బావుండు
  మొత్తానికి బలే ఉన్నాయండి.

  ReplyDelete
 7. మీ పుట్టిన రోజు వారాంతంలోనూ, మీ పిల్లల పుట్టిన రోజులు స్కూల్ ఉండే రోజుల్లోనూ రావాలి.
  --- :))) కరెక్ట్

  బాగున్నాయి మీ విషెస్!

  ReplyDelete
 8. "మీ కాఫీ మీరు తాగేంత వరకూ పొగలు కక్కుతూ ఎదురుచూడాలి."
  మిగితా అన్నీ ఒకెత్తు, ఇదొక్కటీ ఒకెత్తు. మీరెంత మంచి వారో! సరిగ్గా 2011 లో నుంచే నా చక్కటి చిక్కటి సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ నాకు దక్కకుండా పోయింది. దిగుల్తో బ్లాక్ కాఫీ విదవుట్ షుగర్ మొదలుపెట్టేశా.

  "ఇల్లాలిముచ్చట్లు" లో సీత గారి ప్రార్థనలు గుర్తొచ్చాయ్! ;)

  ReplyDelete