Sunday, October 7, 2012

హృదయేశుడున్న ఆ పొదరింటి వరకు.. (నాయికలు ~ 7)

గాలి గుసగుసలతో వలపు రహస్యాలను, ఎవరో వేణుకుంజాల సాయమడిగి వర్తమానం పంపిస్తున్నట్టూ  ఉండుండీ సన్నని సవ్వడి.  రాత్రి మహ మత్తుగా సాగుతోంది.  తొలిఝాము గడవబోతోంది. పాలకడలి  మరిగి నురుగులతో నేలను ముంచెత్తినట్టు తెలివెన్నెల!  మబ్బులు ఆ ధవళిమనద్దుకుని ఆకాశదేశాన కులుకుతూ విహరిస్తున్నాయి. కలువలరాయుడు విరగబూసిన తన చెలియల సుగంధానికి మతితప్పి మురుసుకుంటున్నాడు.

కుటీరపు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. వెన్నెలబొమ్మ గుమ్మం దాటి అడుగు బయట పెట్టింది. హంసకం ఘల్లుమన్నది. కోరడిని అల్లిన నీలిగోరింట.. "ఎక్కడికమ్మా..?" అన్నట్టు చూసింది. ఆమె తలుపు ఓరవాకిలి చేసి  ముందుకు నడిచింది.

వలిపెంపు చీర సింగారించిందామె. తళుకులీనే తెల్లని రవిక తొడిగింది. మిసమిసల మేలిముసుగున మోము దాచింది.  సోయగాలమాలికలల్లి ఎవరి పాలజేద్దామనో నడిచివెళ్తోంది. ఆమె పాదాలు తెలనాకులు! పల్చగా కాంతులీనుతూ మా జిగి చూసి ఆమె సొగసు ఊహించమంటున్నాయి. మీగాళ్ళపై దిద్దిన లత్తుక వెన్నెలలో మెరిసిపడుతోంది. మువ్వల సడి ఆమె తొందరలా గలగలమంటోంది. వీధి మలుపు దాటి వస్తూ ఎవరైనా గమనిస్తున్నారేమో అని ఆగి, మేలిముసుగు కాస్త తొలగించి చూసింది. చంద్రదర్శనమయిందని చకోరాలు సంబరపడ్డట్టు, ఆమె ముద్దుమోము చూసి జాబిలి సంతోషం పట్టలేక వెన్నెల పూవులు పూయించాడు. వీధిమొగ దాటి పచ్చని బయలువైపు అడుగులు వేసిందామె.

పచ్చని పసిరికపై తెల్లని ఆమె పాదాలు.. పచ్చిక అంచున నిలిచిన మంచు ముత్యాలలో  తడిసి తళతళలాడుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళి తన ప్రాణేశ్వరుడున్న బృందావని వైపు నడిచింది. వేసిన అడుగు దూరం తగ్గిందని సంబరపడితే, వేయాల్సిన అడుగు విరహాన్ని మరిమరి పెంచుతోంది. ఎవరైనా చూస్తున్నారేమో అని చుట్టూ పరికించిచూసిన ఆమె కనులు బెదురు హరిణివి కావు, మిలమిలలాడే మీలు కావు. విచ్చిన కలువరేకులు కావు..  కనుల ధావళ్యానికి వన్నె తెచ్చే ఓ ఎర్రని జీర తళుక్కుమంటోందామె నేత్రాలలో.. అది విరహపడు కన్నులకు మాత్రమే సొంతమైన సొబగు. లేడికేం తెలుసా ఎడబాటు! వెర్రి చేపల పోలికా ఆ కన్నులకు! శతపత్రములకెక్కడిదీ ఆ తరళేక్షణ శోభ! అవి ఆమె కనులు.. రాధ కనులు! విరహవేదన నిండిన కలలవాకిళ్ళు.

ఇంతలో ఓ చిలిపి తెమ్మెర అటుగా వచ్చింది. మేలిముసుగును తొలగించి చూసింది. తుమ్మెదరెక్కల్లాంటి ముంగురులను చెదరగొట్టింది. సవరించుకుందామని గంధపొడి అద్దుకున్న చేయి పైకెత్తింది రాధ. గాజులు గలగలమని సంగీతమాలపించాయి. చప్పున వాటిని ఆపింది. ఈ కలవరంలో అడుగు వెయ్యగానే ఘల్లుమని గుట్టంతా రట్టుచెయ్యబోయాయి కడియాలు. "అడుగు సుతిమెత్తగా వేసినా ఈ అల్లరేంటీ!" అని మువ్వల కడియాలను విసుక్కుని, చీర చెరగున గాజులు కదలకుండా బిగించి, మునివేళ్ళమీద మరింత సుతారంగా అడుగులు వేసింది. "ఎంతకు తరిగేనీ దూరం..!  మార్గమధ్యంలో ఎవరి కంటైనా పడితే! ఈ విరహం తీరే క్షణం కోసం చేసిన ఈ ప్రయత్నమంతా వృధా కదూ! అక్కడ పొదరింట విరహంలో కనలుతూ వేచియున్న ప్రియుని చేరే దారింత సుదీర్ఘమైనదెందుకయ్యిందో.." అని కలవరపడింది. ఆతని తలపు ఇప్పపూవుల పరిమళమల్లే కమ్మేసిందామెను. మత్తుగా సోలి సిగ్గిలుతున్న కనులలో అరనవ్వు దాచుకుని వడివడిగా నడిచింది.

"ఈ వెన్నెలరేయి ఎంత బావుంటే మాత్రం కల్పవృక్షపు ఛాయలో కిన్నెర మ్రోగిస్తూ గడిపే అచ్చరలు భువికి చేరి సొగయడం ఎంత విడ్డూరం!" శారికతో అన్నాడు గొరవంక.
అప్పుడే విచ్చిన పారిజాతాల పరిమళానికి ఆ కొమ్మ మీదే రేయంతా గడుపుతున్న ఆ గువ్వలజంటకి, అల్లంత దూరాన నడిచి వస్తున్న ఆమె కనిపించింది.
"అచ్చర కాదామె..!"
"అవునా!"
"ఊ.. ఆ కనుల తడబాటు చూడు. ఇంత చల్లని వెన్నెల రేయి ముచ్చెమటల కరిగిన ఆ తిలకపు జాడ చూడామె నొసటిపై.. అచ్చరలే అయితే ఇంత విరహానికి ఎగిరెళ్ళి కౌగిళుల వాలిపోరూ!"
"ఎంత దూరం నుంచి నడిచొస్తోందో.. పాపం ఈ అభిసారిక!"

పారిజాతపు తిన్నె పక్కనే ఉన్న కలువల కొలను ఒడ్డున క్షణమాగింది రాధ. ఆమె మోముని చూసి గుప్పున పరిమళం చిమ్మాయి కలువలు. గుండెల నిండుగా ఆ సుగంధాన్ని పీల్చుకుని రెట్టింపైన విరహాన్ని ఓపలేక విలవిలలాడిందామె. అడుగులు తడబడ్డాయి. పొగడ పువు మొలనూలు జవజవలాడింది. ఒక్కో పూవూ రాలుతూ వింత ఆభరణంలా తోచింది. "చూస్తివా.." అంటూ గువ్వలు గుసగుసలాడాయి. ఆ శబ్దానికే అదిరి చుట్టూ చూసిందామె. పారిజాతపు శాఖపై ఒదిగి కూర్చున్న గోరువంకలు కనిపించాయి. తన బెదురును తలుచుకుని నవ్వుకుంది. పగడపు పెదవి చివర పూసిన నవ్వు పారిజాతమల్లే ఉంది. దానిని చూసి నేల చేరే సమయమాసన్నమైందని తలచి ఒకదాని వెంట ఆ పగడమల్లెలు జలజలా రాలాయి. జల్లుజల్లున తడిపేస్తున్న  పూవుల వర్షానికి ఆమె మరింతగా విరహాన వేగింది. ఆ కుసుమాల తాకిడి, దవ్వున పొదరింట ఎదురుచూసే మురళీమనోహరుని చూపులు తన తనూలతికను పలకరించే వైనాన్ని గుర్తు తెచ్చిందామెకు. క్షణమైనా ఆలస్యం చేయక నడక కొనసాగించింది. పారిజాతాల వర్షానికి తడిసిన ఆమె ముంగురులు నెలకూనల్లే ఉన్న ఆమె నుదుట అతుక్కుని వింత సోయగాన్నద్దాయి.

దట్టమైన కదంబవనంలోకి ప్రవేశించింది. వెన్నెల చారికలు నేలమీద అక్కడక్కడా కనిపిస్తున్నాయి. నేలమీది జాబిల్లిలా తెలికోకలో మేని మిసమిసలు దాచానని భ్రమపడి నడుస్తున్న ఆమెను చూసి మిణుగురులు నెవ్వెరపోయాయి. రివ్వున ఎగిరొచ్చి చుట్టూ చేరి తమ వెలుగులో ఆమెను చూసేందుకు తాపత్రయపడుతున్నాయి. రాత్రి వేళ ప్రకాశించే అపూర్వమైన ఓషధిలా మెరిసిందామె. దారి చూపుతూ ముందుకు సాగాయి మిణుగురులు.. అతని చేరేందుకు వడిగా సాగిన ఆమె నడక విరహవేదనని అడుగు అడుగుకీ తగ్గిస్తోంది.

నడిరేయి, కాని పున్నమినాటి వెన్నెల
పాల వెన్నెల జడివాన లీల!
హృదయేశు డున్న ఆ పొదరింటి వర కొరుల్
పసిగట్టకుండ పోవలయుగాదె!
తెలికోక, తెలిరైక, తెలిమేలిముసుగులో
మెయి సోయగపు మిసమిసలు దాచి,
కాలి యందెల కడియాల గాజుల మువల్
రవళింపకుండ  చెరగున జొనిపి

మోముపై, కేలిపై గంద వొడి నలంది
పులుగు రవ్వంత గూట కదల బెదురుచు
ఆకుసడి కదరుచు, గాలి అడుగులిడుచు,
వెడలె నభిసారికగ ప్రియు కడకు రాధ.                                    ***

* గువ్వలు రేపు కూడా రమ్మన్నాయి.
** దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన "శృంగార నాయికలు" ఆధారంగా, కూసింత కల్పన జోడించి..7 comments:

 1. అష్టవిధ నాయికలందరిలోనూ 'అభిసారిక' అంటే మీకు ప్రత్యేకమైన ఇష్టం అని అర్ధమయ్యిందండీ :-) :-)

  ReplyDelete
 2. ఎవరైనా చూస్తున్నారేమో అని చుట్టూ పరికించిచూసిన ఆమె కనులు బెదురు హరిణివి కావు, మిలమిలలాడే మీలు కావు. విచ్చిన కలువరేకులు కావు.. కనుల ధావళ్యానికి వన్నె తెచ్చే ఓ ఎర్రని జీర తళుక్కుమంటోందామె నేత్రాలలో.. అది విరహపడు కన్నులకు మాత్రమే సొంతమైన సొబగు. లేడికేం తెలుసా ఎడబాటు! వెర్రి చేపల పోలికా ఆ కన్నులకు! శతపత్రములకెక్కడిదీ ఆ తరళేక్షణ శోభ! అవి ఆమె కనులు.. రాధ కనులు! విరహవేదన నిండిన కలలవాకిళ్ళు.

  .....మొత్తం టపా కాపీ పేస్ట్ చేసేస్తానో ఏవిటో.....

  ReplyDelete
 3. ఓహ్! కృష్ణశాస్త్రిగారి అన్వేషణము పద్యాలన్నీ గుర్తుకొస్తున్నాయి!

  తలిరాకు జొంపముల సందుల త్రోవల నేల వాలు
  తుహినకిరణ కోమల రేఖవొ! పువుదీవవొ!
  వెలదీ, యెవ్వతెవు నీపవిటపీవనిలోన్?

  కారుమొయిళ్ళ కాటుకపొగల్ వెలిగ్రక్కు తమాలవాటి నే
  దారియు కానరాదు నెలతా! యెటువోయెద వర్ధరాత్రి, వి
  స్ఫార విలోచనాంధతమసమ్ముల జిమ్ముచు వేడి వేడి ని
  ట్టూరుపులన్ నిశీథ పవనోర్మివితానము మేలుకొల్పుచున్?

  "తావులతోడ తేనియల ధారల చిప్పిలు వేణుగీతికా
  రావముతోడ మందగతులన్ జను మారుతముల్ విశాల బృం
  దావన వీథులందు యమునా నవభంగ మృదంగ వాద్యముల్
  త్రోవ స్ఫురింపగా వలపు తొందరవెట్టగ బోతి నొంటిమై"

  ReplyDelete
 4. కనుల ధావళ్యానికి వన్నె తెచ్చే ఓ ఎర్రని జీర తళుక్కుమంటోందామె నేత్రాలలో.. అది విరహపడు కన్నులకు మాత్రమే సొంతమైన సొబగు.
  చాలా చాలా బాగుంది...అభినందనలు...@శ్రీ

  ReplyDelete
 5. ఓ! ఇప్పుడు అర్థం అయ్యింది! కృష్ణశాస్త్రిగారి శృంగార నాయికల మీద ఒక్కొక్క కథ రాస్తున్నారా! చాలా మంచి ఆలోచన!

  ReplyDelete