Friday, October 5, 2012

ఏలాగునీ మేఘవేళ.. ఒంటరి రేల.. (నాయికలు ~ 5)

చిటచిటా మొదలయిన చిరు చినుకుల సందడి క్షణక్షణానికీ పెరిగేలా ఉంది. టపటపా రెక్కలు విదిలించుకుంటూ ఆ తోట మధ్యలో  తీర్చిన ముచ్చటైన బొమ్మరింటి చూరున చేరుదామని ఎగిరొచ్చాయి గోరువంకలు.

కనుచూపుమేర చిక్కని చీకటి. ముసురు మేఘాలు కమ్మిన నింగి ఉండుండీ మెరుపుతీగల్ని విదిలిస్తోంది. ఉరుముల ధాటికి పిట్టా పురుగూ భయపడి గూళ్ళు చేరుకున్నాయి. చెంగలువలు తలలూచుతూ..  తటిల్లతల కాంతిలో వెన్నముద్దల్లా జిగేల్మంటున్నాయి. వానకారు పేరంటానికి మొగలిభామలు అత్తరు పూసుకొచ్చి పచ్చపచ్చగా మెరుస్తున్నాయి. మొల్లలు సరేసరి! వాటి ఘుమఘుమల సంబరం అంతా ఇంతా కాదు. ఆ తోటలో, ఆ బాటలో ఉన్న ప్రతి మొక్కా పూవుగట్టి ఉంటే, ఇంటి ముంగిట ఉన్న  మందారువు మాత్రం బోసిపోయింది.

"తీరైన ఇల్లు.. ఎవరిదో!"
"ఏమోనమ్మీ, బావుంది కదూ! ఆ పక్కగా పక్షులకు ఎంత అందమైన గూడు కట్టారో చూడు. వెళ్ళి పలకరిద్దామా ఈ ఇంటి శారికని?"
"వెళ్దాం వెళ్దాం. ఇటు చూసావూ.. నెమిలి ఉందిక్కడ చూరుకింద."
"ఇంత ముసురుపట్టి ఉరుముతుంటే దిగాలుగా కూర్చుందేం పాపం! క్రేంకరించి ఆడాలి కానీ!"
"ఏమో మరీ.. ఆహా ఎంత బావుందీ వాతావరణం! సృష్టిలో ఏ కాలానికా కాలమే రమ్యంగా ఉంటుందిలే!"
"ఊ.. ఆహ్లాదకరమైన పరిమళం! ధరణీపరాగమో.. కేతకీ సుగంధమో!"
" ఆ దారంతా బారులు బారులుగా మొగలి పొదలూ, మొల్ల గుబురులూ ఎవరో తీర్చి నిలబెట్టినట్టు ఎంత పరిమళం వెదజల్లుతున్నాయో చూడు."
"చినుకుల సంగీతానికి, ఉరుముల తాళానికీ ఈ నెమలి కనుక ఆడిందా.. అప్పుడు కదా సంపూర్ణమవుతుందీ మునిమాపు!"
"అవునవును!"
"ఇంతకీ ఈ వీట ఎవరూ లేనట్టుందే! అలికిడి లేదూ.." తొంగి చూసాడు గొరవంక.

శయ్యపై వాలి ఉందామె! గూటిలోని పెంపుడు గొరవంక కలకలం వినబడిందింతలో..  లేచి బయటకు వచ్చి చూసింది. పడమటిగాలి రివ్వున వీచి ఆమె ముంగురులను చెదరగొట్టింది. నడిచి వస్తున్న యజమానురాలిని చూసి మయూరం లేచి దగ్గరకు చేరింది. ముంగాళ్ళ మీద నిలిచి దానిని సవరించిందామె. మెరుపు వెలుగులో అవ్యక్తంగా కనిపిస్తున్న ఆమె సామాన్యమైన సౌందర్యవతి కాదని గోరువంకలకు అర్ధమయ్యింది. నీలి చీరెలో, పొందికైన అవయవ సౌష్టవంతో, తెగబారెడు నీలాల కురులు జారుముడి వేసి, తగుమాత్రపు అలంకరణతో లక్షణంగా ఉందా ఇంతి. విసురుగా వీచిన ఈదురు గాలికి ఓరగా తెరుచుకున్న తలుపులోంచి, బయటకు చొచ్చుకొచ్చిన దీపకాంతి ఆమెను మరింత స్పష్టపరిచింది. చెక్కుటద్దాల ప్రతిఫలిస్తున్న దీపపు వెలుగులు ఆమె ముద్దులమోమును మరింత నిగ్గులుదేఱ్చాయి. ఆమె ముక్కు సంపెగ, ఛాయ చెంగలువ, సోయగం మొల్ల, పరిమళం గొజ్జంగి..గుత్తంగా వానకారు పనుపున పెరిగి పెద్దైన గారాల పూబోణిలా ఉందామె.

చూరు కింద నిలచి వర్షపు ధాటిని అంచనా వేస్తూ నెమలితో మాటలాడింది. "మయూరీ.. ఇంత ముసురుపట్టిందేమే! చీకటికి తోడు ఈ వర్షం.. ఏవిటోలా ఉందే! వారు గుర్తొస్తున్నారు. ఇలాంటి మేఘవేళ ఉరమగానే బెదిరి వారి కౌగిట చేరినపుడు, భయం టక్కున తీసిపారేసినట్టు పోయేది కదూ! "ఉరిమితే బెదిరే పిల్లవి. ఒంటరివేళల వాన పడితేనో!" అనడిగేవారు నన్ను దగ్గరకు పొదువుకుంటూ.  ఏం చెప్పేదాన్నో తెలుసా! "ఉరుము కంటే ముందే వచ్చే మెరుపు చూడగానే మీరే నా చెంత నిలుస్తారు. ప్రేమేం కాదులెండి. నా భయాన్ని ఆటపట్టించడం మీకు సరదా కదూ!" అని. "నీకేం తెలుసూ.. ఆ బెదురుకళ్ళలో మెరిసే మెరుపెంత మనోహరమో!" అంటూ నన్నే చూస్తున్న ఆ కళ్ళు.. ఆ ననతూపు చూపులు. గుర్తొస్తున్నాయే మయూరమా! ఏడుపొస్తోంది. ఆ ఒంటరి రేయి రానే వచ్చింది. జడివాన కూడింది. మనసంతా దిగులు దిగులుగా ఉంది. నిజం చెప్పూ..  నీకూ అంతేగా! నిన్ను చేరదీసే యజమాని వీట లేడని పురి విప్పి ఆడక నీ సహజ లక్షణాన్ని కూడా పక్కన పెట్టావు. ఎంత ప్రేమ నీది!" ఆమె మాటలు వింటూ మూగగా చూస్తున్న మయూరం ఆమె పాదాలను రాసుకుంటూ వెనుదిరిగి ఓ మూలచేరి కూర్చుంది. దానిని చూసి నిట్టూర్చి పెంపుడు గువ్వ గూటి వైపు కదిలింది.

గోలగోలగా ఏవేవో పలుకుతున్న శారికను చేతిమీదికి తీసుకుంది. నెమ్మదించిన గోరువంకను మునివేళ్ళతో సవరిస్తూ.. "ఏమయిందే శారికా.. వర్షమేగా! భయమెందుకూ..? హ్హు.. నీకు చెప్తున్నానా నేను! ఈ చల్లని వేళ ఆ ఉయ్యాలలో జంటగా వెచ్చవెచ్చగా కూర్చుని ఆ కొండమీదనుండి దూకుతున్న వాగుల ధ్వని వింటూ, మయూరి నడకలను.. పురివిప్పి ఆడే ఆ వయారాన్నీ చూసి ఆనందిస్తూ, చూరు నుండి ధారలుగా నేలచేరుతున్న నీలి నీటిదారాలను లెక్కబెడుతూ.. ఇందాకా కొంగలబారులెలా వెళ్ళాయో తలుచుకుని  ఊసులాడుతూ, కాస్త తెరిపివ్వగానే  చెంగల్వదండలు కూర్చుకుని మార్చుకుని.. అరతడిసిన వొళ్ళారబెట్టుకుంటూ.. గూట్లోంచి ఊసులాడుతున్న నిన్ను చూసి నవ్వుకుంటూ.. దీపపు వెలుగులో  నిశి వేళను జమిలిగా ఆస్వాదించేవాళ్ళం కదూ! ప్చ్.. ఇలా ఒంటరిగా గడిపే రేయి వస్తుందని.. దూరదేశానున్న ఆతని తలపులే ఇంతలా వేధిస్తాయనీ  ఊహించనేలేదు సుమా!" దిగులుగా చెప్పింది. శారిక కువకువలాడుతూ తన గూట్లోకి వెళ్ళిపోయింది. తనకు నవ్వులూ, కబుర్లూ నేర్పే యజమానురాలు ఇలా బేలగా మాట్లాడితే దానికి నచ్చలేదు.

ఎడతెగని వర్షధారలు పెంచేస్తున్న గుబులు తీర్చుకునేదారి ఆమెకు తోచలేదు. అటూఇటూ పచార్లు చేసింది. లోపలికి నడిచి శయ్య మీద చేరింది. కళ్ళు మూసుకుంది. అటుఇటు పొర్లింది.  అతని కబుర్లకి నేపధ్యంలో వినిపించే వర్షపు సంగీతం ఎంత మత్తుగా ఉండేదో! ఇప్పుడేంటింతలా వేధిస్తోందీ.. అని విసుక్కుంది. చలి ఆమెను వణికించ ప్రయత్నించి విఫలమై గదిలోంచి బయటకు పోయింది. రాని నిద్రని ఆహ్వానించి విసిగి మంచపు చివర కూర్చుని ఆలోచించసాగింది. ఒళ్ళంతా కమ్మేస్తున్న విరహం.. ఆతని తలపులు మరిమరి గుర్తొచ్చి ముంచేస్తున్న దుఃఖం. శయ్య పక్కనే ఉన్న చల్లని పన్నీరు తీసి జల్లుకుంది. ఆ చల్లదనానికి కాస్త శమన కలుగుతుందేమో అని భ్రమపడినంత సేపు పట్టలేదు.. పన్నీరు ఆవిరై.. గాలిలో ఆ పరిమళం కలిసి ఆమెను మరింత రగిలిపోయేలా చేయసాగింది. కర్పూరపరాగపు చల్లదనానికి ఆశపడింది. మేన రాసుకుంది. ఆమె ఒంటి తాపానికి ఆ సుకుమారమైన పుప్పొడి ఎప్పుడు మాయమైపోయిందో తెలియరాలేదు.

లేచి వీధిలోకి వచ్చి చూసింది. "ఏ దేవతలో కరుణించి శ్రీవారిని ఇంటి ముంగిట నిలబెడితే.. పరుగున వెళ్ళి కౌగిట వాలిపోతే.. ఎంత బావుంటుంది.." అనే వెర్రి ఆశ రగిలి వగచింది. మౌనంగా తలవాల్చి నిలచిన మందారతరువును చూడగానే ఆమె దుఃఖం మరింత పెరిగిపోయింది. సాయంవేళ ఆ మందారపు చెంతనే నిలిచి ఎదురుచూస్తున్న తనను చూసి నవ్వుతూ వచ్చి హత్తుకునే అతని సామీప్యసుఖం.. ఇంకా ఎంత దూరాన ఉందో! ఈ నిరీక్షణలెంతసేపో! తలపులు ప్రయాణించినంత సులువుగా తనువులు సైతం వెళ్ళగలిగే ఏ మాయో తెలియకూడదూ విరహాన వేగే వారికి! ఏ బెంగా తెలియనివ్వని మత్తు నిద్దరైనా రాకూడదూ ఆతనొచ్చేవరకూ..!

"అటు చూడ వీటి ముంగిటను మౌనమ్ముగా
తల వాలిచి మన మందార తరువు!
పురి విప్పదు మన పెంపుడు మయూరమ్ము ది
గులు చెంది దిక్కు దిక్కులకు చూచు!
సారెసారెకు మన శారిక  పలవించు

కలవరపడి ఏదొ పలకబోవు!
ఏలాగు నీ మేఘవేళ ఒంటరి రేల
ప్రాణేశ్వరు ప్రవాసి బాసి" యనుచు

చల్లుకొను మేన చలువ గొజ్జంగి నీరు;
గప్పుకొనును కప్పురము తోడి పుప్పొడులను;
పొరలు సెజ్జ, లేచి మరల నొరుగు సుంత;
పొగులు ప్రోషిత భర్తృక మగని కొరకు.


"చూసావూ.. మనకి మనోహరంగా తోచిన వర్షపురాత్రి, ఈ విరహిణికి ఎంత వెతలరేయో కదూ! ఇంకా ఏ సముద్రాలు దాటి ఏనాటికొచ్చేనో ఈమె ప్రాణవల్లభుడు! " కురుస్తున్న వర్షాన్ని, వేగివేసారుతున్న ఆమెనూ మార్చి చూస్తూ గోరువంకలు నిట్టూర్చాయి.

19 comments:

 1. "రాధికా...కృష్ణా... తవ విరహే... కేశవా...."

  ReplyDelete
  Replies
  1. అవునండీ.. కృష్ణుని విరహంలో రాధికే ప్రతీ నాయికా..
   ధన్యవాదాలు!

   Delete
 2. ఏ సీమల ఏమైతివో! ఏకాకిని, నా ప్రియా!
  ఏలాగీ వియోగాన వేగేనో! నా ప్రియా!
  ఏలాగీ మేఘమాస మేగేనో! ప్రియా ప్రియా!
  గడియ గడియ ఒక శిలయై కదలదు సుమ్మీ
  ఎదలోపల నీ రూపము చెదరదు సుమ్మీ
  పడిరావాలంటే వీలుపడదు సుమ్మీ

  నాయకుడైనా నాయికైనా విరహం విరహమే! అయినా ఆడవాళ్ళ విరహంలో మరింత సౌందర్యం ఉంది కాబోలు!

  పద్యంలో రెండూ మూడు తప్పులున్నాయండి. ఒకసారి సరిచూడండి.

  ReplyDelete
  Replies
  1. "న జీవేయం క్షణమపి వినా తాం అసితేక్షణాం" అని అంతటి ధీరగంభీరుడూ అనేసరికి గుండె నీరైపోతుంది కదండీ. మిగిలిన నాయకులెందరున్నా అసలైన విరహం అనుభవించినది రాముడొక్కడే అనిపిస్తుంది. ఆడవారి విరహం మరింత సుందరంగా ఉంటుంది. నిజం!

   సరిదిద్దానండీ. ధన్యవాదాలు! :)

   Delete
  2. వాల్మీకి రాముడలా అంటే, భవభూతి రాముడు "జ్వలయతి తనుమంతర్దాహః కరోతి న భస్మసాత్" అంటాడు! నిజమే, విరహంలో రాముడు అనుభవించిన తీవ్రత ఇంకే నాయకునిలోనూ చూడలేం. అది విరహాన్ని అతిక్రమించి ఒక తీవ్రమైన గాఢమైన వేదనాస్థాయిని చేరుకుంటుంది.

   ఇంకా చిన్న నెరసులుండిపోయాయి:
   సారెసారెకు మన శారిక ఏదొ పలవించు - సారెసారెకు మన శారిక పలవించు
   ప్రాణేశ్వరు ప్రవ్వసి బాసి - ప్రాణేశ్వరు ప్రవాసి బాసి

   Delete
  3. ఏవిటో, మీ చేత ఈరోజు మళ్ళీ మొట్టికాయలు తప్పలేదు. :) సరిచేసానండీ. ధన్యవాదాలు.

   Delete

 3. "ఊ.. ఆహ్లాదకరమైన పరిమళం! ధరణీపరాగమో.. కేతకీ సుగంధమో!"
  " ఆ దారంతా బారులు బారులుగా మొగలి పొదలూ, మొల్ల గుబురులూ ఎవరో తీర్చి నిలబెట్టినట్టు ఎంత పరిమళం వెదజల్లుతున్నాయో చూడు."

  నాయికలేమో గానీ శారికలు బాగా నచ్చేస్తున్నాయసలు! :-)

  విరహోత్కంఠితకీ, ప్రోషిత భర్తృకకీ తేడా ఏమిటి? ఇద్దరూ చెంత లేని అతగాని కోసం ఎదురుచూసే విరహిణులే కదా!?!?

  ReplyDelete
  Replies
  1. హ్హహా.. అవునా! బావుంది బావుంది. :) ధాంక్యూ!

   భలే గమనించావు. :) పేరులోనే ఉంది కదూ ఇద్దరికీ మధ్యతేడా.. దేశాంతరగతుడైన భర్త కోసం ఎదురుచూసేది ప్రోషితభర్తృక. అల్లంత దూరాన కొలువులో ఉండి, ఇంకా రాని ప్రియుని కోసం పడిగాపులుండి విరహపడేది విరహోత్కంఠిత.

   బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాడు ప్రోషితభర్తృక మగడు. ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు విరహోత్కంఠిత ప్రియుడు. :)

   Delete
  2. నిజమే కదా! @ పేరులోనే ఉంది.. బట్, నువ్వు చెప్పాకనే అది అర్ధమైంది :-)

   దూరదేశాన మగడు - అల్లంత దూరాన ప్రియుడు :-)

   Thanks for the explanation!

   Delete
  3. హహ్హహ్హా.. భలే explain చేసారండీ కొత్తావకాయ గారూ.. నాక్కూడా తేడా తెలీలేదు.. ఇప్పుడు బాగా అర్థమైంది.
   అయినా, నాకసలు ఈ నాయికలందరూ పేర్లే తప్ప పరిచయం లేదు లెండి.. మీ ద్వారా ఇంతందంగా పరిచయం కావడం చాలా బాగుంది. :)

   Delete
 4. <>

  చక్కనైన ఈ తెలుగు పదాలు ఇలా వాక్యాల్లో పొదిగారు చూడండీ ...మీరు చెప్పిన చెంగల్వలంత సుకుమారాంగా, సువాసనా భరితంగా వానకారు రుతువంత బాగా....ఎంత బాగున్నాయో చెప్పటానికి మీ అంత భాషా కోవిదను కాను నేను:(( బాగుందని మాత్రమే చెప్పగలను:((

  ReplyDelete
  Replies
  1. అంతా కృష్ణశాస్త్రి చలవేనండీ. అందమైన పదాలను చదివి ఏరుకుని, జాగ్రత్తగా సర్దుకుని వాడుకున్నానంతే. మీ ఆదరానికి ధన్యవాదాలు. :)

   Delete
 5. ఏంటండీ ఈ అమ్మాయిలు ? కొంచెం ఫోన్ చేసో ఉత్తరం రాసో కనుక్కోవచ్చు గా దూరాన ఉంటె ఎప్పుడు వస్తావని ? అలాగా అదే పని గా ఎదురు చూడటం ఎందుకు ?:P (just kidding)
  మీ వర్ణన తో ఆ నాయికలని మా కళ్ళ ముందు నిలబెట్టేస్తున్నారు ! ఎంత బావుందో ఈ సిరీస్ !

  ReplyDelete
  Replies
  1. హ్హహహా.. శకుంతల రాసింది కదండీ ఉత్తరం. ఎదురుచూపులో ఏదో హాయి ఉందనుకుంటా. చూస్తూనే ఉన్నారు పాపం. :) మీకు నచ్చినందుకు చాలా సంతోషమండీ. ధన్యవాదాలు.

   Delete
 6. >>చెంగలువలు తలలూచుతూ.. తటిల్లతల కాంతిలో వెన్నముద్దల్లా జిగేల్మంటున్నాయి. వానకారు పేరంటానికి మొగలిభామలు అత్తరు పూసుకొచ్చి పచ్చపచ్చగా మెరుస్తున్నాయి. మొల్లలు సరేసరి!>>
  కాసేపలా మెరుపు వెలుగులో ఉరుముల మధ్యకి వెళ్ళి వచ్చేసరికి అదేమిటో అక్కడుండాల్సిన నెమిలి, శారికలు మా ఇంటికొచ్చేశాయి. ఇక్కడుండాల్సిన మనసేమో ఆ గూట్లో చిక్కుకుపోయింది.

  ReplyDelete
 7. >>గోలగోలగా ఏవేవో పలుకుతున్న శారికను చేతిమీదికి తీసుకుంది. నెమ్మదించిన గోరువంకను...

  చాలా బాగుంది.

  ReplyDelete