Monday, October 8, 2012

ఎంత పున్నెమ్ము చేసినానే! (నాయికలు ~ 8)

"ఇన్నాళ్ళకు ఓ జంట సఖ్యంగా మన కళ్ళబడింది. ఏ ఊరో పండిపోయి ఉంటుంది." సంబరంగా చెప్పింది శారిక.
"అవునవును.. గువ్వల జంట కొమ్మ ఊయల మీద, పడుచు జంట ఉయ్యాల మీదా.. బాగు బాగు.." పొన్న చెట్టు  మీద నుంచి ఆ తోటలో సంజె చీకట్లు ముసురుకుంటున్న వేళ.. సరాగాలాడుతున్న ఆ ఇద్దరినీ తేరిపార చూసాడు గోరువంక.
"అలా చూస్తావేం.. మన దృష్టే తగులుతుందేమో అన్నట్టున్నారిద్దరూ!"
"ఓయబ్బో.. ఇన్నిరోజులూ చేసినదేంటీ..! ఎవరెలా వేగుతున్నారో, ఏమని వగస్తున్నారో చూసి కబుర్లు చెప్పుకోవడమే కదూ!"
"హ్హు.. వీసానికి వీగిపోతావు కదా! ఏదో ముద్దుగా ఉన్నారని మురిసానంతే!" చిన్నబుచ్చుకుంది గువ్వ.
"సరేలే.. అతగాడేదో బులిపిస్తున్నాడా భామను. నేనూ నేర్చుకుంటానుండు."
"నువ్వా!! చాల్లే.. కొండనాలిక్కి మందు వెయ్యకు!"
"సరి..! వద్దని కోరుకున్నది నువ్వే. ఆనక వగచి ప్రయోజనం లేదు." కవ్వించాడు గోరింక.
"ఉండవోయ్.. అతని మాటలు విననివ్వకుండా ఏవిటీ నీ ఘోష.. " విసుక్కుంది.

                                              ***

"ఐతే నా సింగారం బాలేదన్నమాట!" మూతిముడిచిందామె.
"బాగులేదనలేదు. పూర్తి కాలేదన్నాను." నవ్వాడతడు.
"ఏదీ.. మీరొచ్చే వేళయిపోయింది. త్వరపడి ముస్తాబవుతున్నానా.. ఇంతలో తలుపు తట్టారు."
"ఓహో.. తొందరగా వచ్చేసానా? తలుపు వెనుకే నిలబెట్టలేకపోతివా?"
"అయ్యో.. " నొచ్చుకుంటూ అతడి మోములోకి చూసింది.
"నీలాల కురులు ఇంత వైనంగా దువ్వి ముడిచావే.. ఇవిగో.. ఈ మల్లెలు తురమనిదీ నిండేదీ!"  లేచి పక్కన సజ్జలో ఉన్న మల్లెలచెండు అందుకుని ఆమె జడలో తురిమాడు. కళ్ళిప్పినవ్వాయి మల్లికలు.. తమ అదృష్టానికి మురుస్తూ.. తననే కన్నార్పక చూస్తున్న ఆతని చూసి సిగ్గుగా కళ్ళువాల్చి ఓరగా నవ్వింది.
"నవ్వకు ప్రియా. పాపం మల్లెలు చిన్నబోతాయ్.."
"మీరు మరీనూ.. " ముద్దుగా విసుక్కుని ఉయ్యాలపై కూర్చుంది.

మోకాలిపై గడ్డముంచి మంజీరాలను సవరించుకుంటూ.. కనులు విప్పి కలలు కంటోంది. ఆతని సాన్నిధ్యమిచ్చే పారవశ్యం ఆమెను తన్మయురాలిని చేస్తోంది. మాటమూగబోతుంది. పెదవులపై నవ్వు చెంగలించి ఉరుకుతూ ఉంటుంది. గుండె లయతప్పి కొట్టుకుంటుంది. మతి తప్పి మైకం కమ్ముతుంది. "ప్రేమ మహిమేనా ఇదంతా! ఏ జన్మ వరమో కదూ! ఉహూ.. ఎన్నో జన్మలు పంచాగ్నిమధ్యంలో, వాయుభక్షణ చేస్తూ తపస్సు ఆచరించి ఉంటుంది తను. ఏం.. రాజ్యాలూ, ఐశ్వర్యాలూ, మోక్షాలకోసమేనా తపస్సు! ఇంత మురిపించే మగని కంటే ఐశ్వర్యమేముంది! మనసు తెలుసుకు మసలే అతని కౌగిలి కంటే స్వర్గమున్నదా!" ఆలోచిస్తున్న ఆమెకాలికి చల్లని స్పర్శ! ఉలిక్కిపడి చూసింది. ఉయ్యాల పక్కన కింద కూర్చుని లత్తుక నెమలికన్నుతో తీసి తన పాదంపై దిద్దుతున్నాడు.
"అరెరే.. " కాలు వెనక్కి తీసుకోబోయింది.
పట్టుకుని ఆపాడాతను. "దిద్దనీ.. ఎంత ఎర్రగా ఉన్నాయీ పదపల్లవాలు! లత్తుక ఎరుపు కనిపిస్తుందా అసలు! కెందమ్ములమ్మీ నీ పాదాలు!" దీక్షగా దిద్దుతూ తల పైకెత్తకుండా ఆరాధనగా అన్నాడు.
కనులలో చిప్పిల్లుతున్న నీటికి మసకగా ఆనిందాతని రూపు. నవ్విందామె... గర్వంగా.

పారాణి దిద్దడం పూర్తి చేసి పక్కన చేరి ఆమెను చూసుకున్నాడు. ముగ్ధంగా తననే చూస్తోందామె. చూపులు కలిసినంతనే సిగ్గిలి మోము చేతులలో దాచుకుంది. ఆ అనుపమాన సౌందర్యానికి చిరుసిగ్గులు ఎంత వన్నె తేగలవో ఊహించలేనివాడు కాదు కదూ!
"ఏవిటది? నీ పెదవిపై..?" అమాయకంగా అడిగాడు.
చప్పున చేతులు తీసి, తన అందానికి ఏంతక్కువయ్యిందో చూసుకుందామని అద్దం కోసం ఇటూ అటూ వెతికింది.
"నేనున్నది ఎందుకూ.. ఇటు తిరుగు.. నేను తుడిచేస్తాను" అని నమ్మబలికాడు.
"ఊ,," మోము చూపిందామె. చటుక్కున ఆమె బింబాధరాలపై ముద్దుముద్దరలేసాడు. ఊహించని అతని చిలిపితనానికి మరింత సిగ్గుపడి ఆతని గుండెల్లో తలదాచుకుంది.
"సిగ్గే.. ఇటు చూడూ."
"ఉహూ.."
"చూడకపోతే ఎలా! జాబిల్లి లేక చీకటి!"
అర్ధం కానట్టు చూసింది.
"నీ మోము జాబిల్లి.." నవ్వుతూ చెప్పాడు.
ఆమె చెక్కిళ్ళు కెంపులయ్యాయి. మోవి సనసన్నని నవ్వులు చిలికిస్తోంది. కోలకళ్ళు తీయని మైకంలో వాలిపోతున్నాయి.

"కురులేమో.. కృష్ణ రజని. నవ్వులు వెన్నెలలు! వనకన్యవు నీవు! అన్ని వన్నెలూ నీలోనే దాచేసుకున్నావు. ఇదిగో.. ఇప్పుడీ గులాబి చెక్కిళ్ళకి ఎలా దిష్టి తీయాలబ్బా!"  గాజుల చేతులు రెండూ పట్టుకుని ఆమె సిగ్గుని తరిమేసే ప్రయత్నం చేస్తూ అడిగాడు.
"వదలండీ.." దూరంగా జరిగే ప్రయత్నం అసలు చేయకుండా బెట్టుచేసిందామె.
"తెలిసింది.." చటుక్కున లేచి పుప్పొడిలా మెరుస్తున్న బంగరుపొడి ఓ చిన్ని పాత్రతో తెచ్చి పక్కన చేరాడు. సన్నని కుంచె తీసుకున్నాడు.
అతని అల్లరి తెలిసిన ఆమె అనుమానంగా చూసింది.
"చెక్కులపైనే భామా! " నవ్వాడు.
తత్తరపడి నవ్వేస్తూ కనులు వాల్చింది.

మసకచీకటిని తరిమేస్తూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపకాంతులలో, పసిడి గొలుసుల ఊయలపై విలాసంగా కూర్చుని చెక్కిళ్ళపై మగని చేత మకరికలను దిద్దించుకుంటోందామె. ఏకాగ్రతతో తన బంగరుబొమ్మ అందానికి నగిషీ చెక్కుతున్నాడతను. గువ్వలు ముచ్చటగా చూస్తూ నవ్వుకున్నాయి.




ఇరులలో తారక లివియంచు, తానెనా
కురులలో మల్లియ విరులు తురుము!
అసలె కెందమ్ము లీ అడుగు లనుచు, ఎంతొ
పొందుగా లత్తుక పూయు తానె!
అదియేదొ అంటె నీ అధరాన నని, తన
మెత్తని పెదవుల నొత్తి తుడుచు!
చూచుచు, మరిమరి చూచి మెచ్చుచు, మక
రికల చెక్కిళ్ళ చిత్రించుతానె!

ఎంత పున్నెమ్ము చేసినానే, మగండు
ఒక్క క్రీగంటి చూపులో, ఒక్క లేత
నగవులో, నా మనస్సు నెరిగి గ్రహించి,
తీర్చునే యంచు మురియు 'స్వాధీన పతిక'.





                                    ***


* దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన "శృంగార నాయికలు" ఆధారంగా, కాసింత కల్పన జోడించి.


~  మనసేలే దొరలకు, వారి మనసెరిగి మసలే భామలకు..

11 comments:

  1. ఎప్పటిలాగే.... అద్భుతం

    ReplyDelete
  2. అంతలోనే పరిసమాప్త మాయెనా ! య
    ని మదికి నసంగతపు సంశయము జనించె
    అసలు శృంగార నాయిక లష్ట విథము
    లనుటె మరిచి తేమి రుచి ! కొత్తావ కాయ .
    ----- సుజన-సృజన

    ReplyDelete
  3. Yee ooru gorinko ee andamina kokilla katha cheputhu...Avakaya jadilo padindi...


    Veeluguthuna Deepa kanthi...Hats off

    ReplyDelete
  4. wonderful.అద్భుతమైన కావ్య దృశ్యం ల వున్నాయి అన్ని టపా లు . మీరు రాసినంత అందంగా మిమల్ని ప్రసంసించాలని వుంది.కానీ చేతకాక అద్భుతం అని మాత్రమే అనగలిగాను.
    యింకా సాహిత్యం లోని తియదానని ఆస్వాదించడానికి మీలాంటి వారి బ్లాగ్లు వున్న్నదుకు మేము అదృష్టవంతులం.

    ReplyDelete
  5. "నీ మోము జాబిల్లి... కురులేమో.. కృష్ణ రజని."
    -- గతంలో చదివిన ఓ కథలో వర్ణనను గుర్తు చేశాయి... 'నీ వదనం నిశి - కురులేమో నిశి'.

    సరి సరి... తరువాయి ధీర నాయకులేనా?

    ReplyDelete
  6. క్షమించాలి.. చిన్న సవరణ. ఆ వాక్యం... 'నీ వదనం శశి - కురులేమో నిశి'

    ReplyDelete
  7. చాలా ముచ్చటగా రాశారు! Romantic కథలంటే ఇలా ఉండాలి!

    ReplyDelete
  8. అందమైన భాష, హృద్యమైన కూర్పు..మీ భావాలు వంశీగారి భాషలో చెప్పాలంటే "గోపెమ్మ చేతిలో గోరు ముద్దల్లా" వున్నాయండి..అభినందనలు.

    ReplyDelete