Tuesday, December 20, 2011

ఓ బాల! నిద్ర లేవవే!! - కాత్యాయనీ వ్రతం - 6

ఆకాశం యమునని అడిగింది. "యమునమ్మా, నల్లని చలి రాత్రంటే మహా లోటుగా లేదూ!?" అని. గలగలా నవ్వుతూ యమున చెప్పింది.. "చంద్రుడిని కృష్ణపక్షం దాచేసుకుంటే నాకేం! ఇలపై నడిచొచ్చే చందమామల్లా ఇంకాసేపటిలో గోపవనితలొస్తారు నా దగ్గరకి. ఈ మార్గశిర శీతవేళ కార్తీక దీపాల్లా నాలో మునకలేసి తేలుతూ మెరుస్తారు. హిమాలయాల్లో రాత్రివేళ వెలిగే అద్భుత ఓషధుల్లా పవిత్రమైన తేజస్సు వెదజల్లుతారు."

గొల్ల పడుచులందరూ ఒక్కొక్కరే నిద్ర లేచి తమతమ ఇళ్ళకు దగ్గరలో ఉండే నేస్తాలను కలిసి, మిగిలిన వారిని నిద్ర లేపేందుకు కదులుతున్నారు. గాజుల గలగలలు నవ్వులకి వంతపాడుతున్నాయి. వాళ్ళ నవ్వులు, మాటల్లో విడిచే వెచ్చని శ్వాస చలిగాలిలో పల్చటి మేఘాలను సృష్టిస్తోంది.  దారిలో పరిమళాలు వెదజల్లే పూలమొక్క ఎక్కడ కనిపించినా పువ్వులు కోసి సజ్జల్లో వేసుకుంటున్నారు. రాత్రి తమకొచ్చిన కలలను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. "కన్నయ్య నాతో కలిసి పాట పాడాడు." అని ఒకరు చెప్తే, "కృష్ణుడు నా జడలో పువ్వులు ముడిచాడ"ని మరొకతె చెప్తోంది.

ఈ కోలాహలానికి మేలుకున్న పక్షులు ముక్కులతో రెక్కల్ని సవరించుకుంటున్నాయి. పశువులు మోరలెత్తి బధ్ధకం తీర్చుకుంటున్నాయి. ఒక్క అమ్మాయి మాత్రం తన పడకటింట్లో శిల్పసుందరిలా కదలక మెదలక నిద్రపోతోంది. ఆమె 'వకుళ'.

అప్పుడే చివురులేస్తున్న సన్నజాజి తీగె, జాళువా బంగారు తిన్నె పైకి జారినట్టుంది.. పట్టు బాలీసుల మధ్య ఆ శయ్యపై ఆమె నిద్రపోతున్న భంగిమ! ముక్కుపచ్చలారని చిన్నది ఆ పిల్ల. మొన్ననే పదహారేళ్ళు నిండాయి. అతి సుకుమారమైన సౌందర్యం. మేలి బంగరు ఛాయ. కాటుక పూత లేకున్నా చెవుల దాకా ఉండే సోగకళ్ళు. పాల పసిప్రాయపు ఛాయలింకా వీడని ముద్దులొలికే మోము.

వకుళ అందానికి నెలవు ఆమె కళ్ళే. ఇతరులని ఆకర్షించేది ఆ సోగ కళ్ళ వైశాల్యమో, స్వఛ్చంగా మెరిసే నీళ్ళలో తిరిగే మీనుల్లా తోచే ఆమె కనుపాపలో, నల్లగా వత్తుగా వంపు తిరిగి ఉన్న కనురెప్పలో, హరివిల్లులా వంగి ఆ కళ్ళ వైశాల్యానికి హద్దులు సూచించే కనుబొమలో కాదు. ఆ కళ్ళలోకి భీతి, బెంగ, సందేహం, కోపం.. ఇవేవీ రానివ్వకుండా నిత్యం కొలువుండే విశ్వాసం!! ధీమాగా ఉంటాయామె చూపులు. ఎప్పుడూ తడబడవు. లేడి కూన చూపుల్లా బిత్తరపోవు. ఆమె మాటా, నడవడికా అన్నీ అంత స్థిరంగానూ ఉంటాయి.

బృందావనం లో 'ఏ పొద చాటున దాగాడో!',  వెతుకుతున్న తమని 'ఏ చెట్టెక్కి గమనిస్తూ నవ్వుకుంటున్నాడో!' అని తప్పిన దూడని వెతికే ఆవుల్లా "కన్నా..!! కృష్ణా..!!" అని పిలుస్తూ మిగిలిన గోపికలంతా వెదికే వేళ వకుళ మాత్రం అలా పరుగులు తియ్యదు. బృందావనంలో ఓ తిన్నె మీద కూర్చుని వీణ మీటుతూ ఉంటుంది. "వకుళా.. కన్నయ్య ఇటుకానీ వచ్చాడా?" అని ఏ నేస్తమైనా వచ్చి అడిగితే, "ఇక్కడ కూర్చో! తానే వస్తాడు. మనం ఎందుకు చెప్పు వెతకడం! మనం కనిపించకపోతే అతగాడికి మాత్రం బెంగ ఉండదూ! నా వీణాగానం వినబడుతుందిలే." అని సమాధానం చెప్పేది. పువ్వులు మాలలు కడుతున్న తనని "త్వరగా కానీ, ఎవరు ముందు మాల కడితే ఆ మాలదే కన్నయ్య మెడలో చోటు." అని ఎవరైనా పందానికి పురికొల్పితే, "మిగిలిన పువ్వులు పూచేది కన్నయ్య కోసం కాదా? అతని కోసం కట్టిన ప్రతీ మాలా ధరించే బాధ్యత అతనిదే!" అని మొండిగా సమాధానం చెప్పేది.

వకుళ ఆత్మ విశ్వాసాన్ని చూసి నెవ్వెరబోయేవారు మిగిలిన వాళ్ళంతా. చాటుగా "మొండిపిల్ల!" అని గుసగుసలాడుకునేవారు. 'మొండివాడు రాజు కంటే బలశాలి' అన్న మాట వకుళ విషయంలో నిజమయ్యేది. తను వచ్చేదాకా ఎదురుచూస్తూ ఎంత పొద్దుపోయినా పొగడమాలలు అల్లుతున్న వకుళ దగ్గరకి కృష్ణుడే వచ్చేవాడు. ఆమె అల్లిన మాలలన్నీ కంఠంలోనూ, చేతులకూ, నడుముకూ చుట్టుకునేవాడు. మిగిలిన మాలలతో ఆమెను బంధించి నవ్వేవాడు.

వకుళకి ఏ కల్లా కపటం తెలీదు. కుతంత్రాలూ, అసూయలూ అంటలేదు. అలక రాదు. ఆశించడం రాదు. ఎడబాటూ, విరహమూ అర్ధం కావు. ఆమె ముగ్ధ! అమాయకత్వం ఒక వరం కదూ! అందుకే వకుళ అంటే రేపల్లెలో ఆడపిల్లలందరికీ ఇష్టం. "ఈ పిల్ల ఇప్పుడే కన్నయ్యని జయించేసింది! ఇంక పెద్దయితే ఇంకేమైనా ఉందా! ఈ పిల్లది మొండితనమూ కాదు, తెలియనితనమూ కాదు. వేరేదో! "ముంచినా, తేల్చినా నీదే భారం!" అని కన్నయ్య పైనే నిశ్చింతగా అన్నీ వదిలేస్తుంది కదా! మనం అలా ఉండగలిగితే బాగుండును!" అనుకునేవారు. నిజం! వకుళ స్థితప్రజ్ఞురాలు. కన్న తండ్రే శత్రువై కొండ మీద నుండి తోయించినా, నిప్పుల్లో నడిపించినా.. "నీదేనయ్యా బాధ్యత. నన్ను నువ్వే కాపాడుకో! రా!" అని నృహరిని స్థంభం బద్దలుగొట్టుకు వచ్చేంతలా లొంగదీసుకున్న ప్రహ్లాదునిదీ అదే స్థితప్రజ్ఞత!

వణికించే చలి తట్టుకోలేక కిటికీలన్నీ మూసి, తలుపులు గొళ్ళాలు పెట్టి నిద్రపోతోంది వకుళ. మిగిలిన అమ్మాయిలంతా ఆ వీధి దాకా వచ్చాక తమలో వకుళ లేకపోడాన్ని గమనించారు.

"వకుళ ఇంకా నిద్ర లేవనట్టుంది కదూ! కమలినీ, వకుళ కనిపించిందా?" అడిగింది ఉత్పల.
"అబ్బే, లేదు. పదండి, వెళ్ళి చూద్దాం." అని వకుళ ఇంటివైపు నడిచింది కమలిని. తలుపు తట్టారు. "కృష్ణా.. కృష్ణా.." అన్నారు. "వకుళమ్మా.. లే తల్లీ" అని పిలిచారు.

లోపలి నుంచి సడి లేదు. వ్రత నియమాలకు అలసిన ఆమె శరీరమే సహకరించట్లేదో, కలలోకి జారిపోయి ఈ లోకపు శబ్దాలేవీ వినిపించట్లేదో మరి! కృష్ణుడే వచ్చి నిద్ర లేపే దాకా నిద్ర లేవనట్టుంది ఆమె వాలకం.
"ఓ వకుళ బాలా! లే లే! పక్షులు కూస్తున్నాయ్, పిల్లా! విన్నావా?!" తలుపుకు దగ్గరగా నిలబడి పిలిచింది కమలిని.
"కృష్ణా కృష్ణా అన్నా ఉలకదూ పలకదూ ఈ పిల్ల!!  ఆ వచ్చే కన్నయ్య తన దగ్గరకే వస్తాడని ధీమా!" చెప్పింది ఉత్పల.
"అమ్మడూ!  గూళ్ళలోంచి లేచి ఎగరబోతున్న పక్షుల కిలకిలారావాలు వినిపించలేదు సరే! దూరంగా ఆ పక్షి రాజు గరుడుని వాహనంగా చేసుకున్న విష్ణుమూర్తి ఆలయం లోంచి వినిపించే శంఖారావం వినిపించట్లేదూ!"
ఊహూ.. లాభం లేదు. చప్పుడు లేదు.
"ఓ పిల్లా! నీకేమైనా మాయ కమ్మేసిందా ఏం! అదేమైనా సామాన్యమైన శంఖమా? శ్రీహరి పాంచజన్యాన్ని పోలిన తెల్లని శంఖం! చీకటి పొరలు చీల్చేలా ఎలా ఘోషిస్తోందో! ప్రాతఃకాలపు పిలుపు అది! వినిపించలేదూ! లే బంగారుతల్లీ!" బతిమాలుతూ పిలిచింది ఉత్పల.

"లాభం లేదర్రా! ఈ పిల్లకి ఇష్టమైన కథలు చెప్తే నిద్ర లేస్తుందేమో!"
"తను పుట్టక మునుపు కన్నయ్య చేసిన మాయలూ, లీలలూ అంటే వకుళకి మహా ఇష్టం కదా! పదే పదే అడిగి చెప్పించుకుంటుంది. పోనీ అవి చెప్తే లేచి వస్తుందంటారా?" అంది కమలిని.
"హూ.. ప్రయత్నిద్దాం." అని సురభి తనూ తలుపు దగ్గరగా నిలబడి పిలిచింది.
"వకుళా! ఓ చిన్నారీ! లేమ్మా.. అదిగో చూడు.. మునిపల్లెలో మునులూ, యోగులూ నిద్ర లేచారప్పుడే! "హరిహరీ" అని విన్న వాళ్ళ మనసు చల్లగా హాయి నిండేలా పిలుస్తున్నారు. లే తల్లీ! వ్రతానికి వేళ మించిపోతోందీ.."
"హరీ.. హరీ.." అని మగత నిద్రలో కలవరించి అటు తిరిగి పడుకుంది వకుళ. అలా తిరగడంలో ఆమె కాలి మువ్వలు గలగల్లాడాయి. ముఖంలో అదే నిశ్చలత.

ఆ సడి విన్న చెలులకి కాస్త ధైర్యమొచ్చింది. ఈ పిల్లని ఎలాగో ఒకలాగ లేపొచ్చని ఒకరి మొహాలు ఒకరు చూసి చిన్నగా నవ్వుకున్నారు.
"ఇదిగో వకుళా.. ఆ మునులు పిలుస్తున్న కన్నయ్య చిన్నప్పుడు ఎలాంటి పనులు చేసాడో తెలుసా! నందవ్రజంలో పసికందులను చంపమని కంసుడు పంపిన పూతన అనే రాక్షసి వచ్చిందోనాడు. పెట్టెలో మాణిక్యాన్ని పెట్టి భద్రంగా దాచుకున్నట్టు కన్నయ్యని కాపాడుకొస్తున్నాడు నందగోపుడు." చెప్పసాగింది సురభి.
"ఊ.. అప్పుడేమయింది...?!" అని అడుగుతూ వకుళ నిద్ర లేస్తుందని వాళ్ళ పథకం, ఆశ!
"ఊ.." లోపల ఉన్న వకుళ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఊ కొట్టారు.
"అందమైన గొల్ల పడుచులా వేషం వేసుకుని, వయారాలు పోతూ రాజు గారింటికి వెళ్ళింది. కన్నయ్య అమ్మ దగ్గర బొజ్జ నిండా పాలు తాగి ఉయ్యాల్లో నిద్దరోతున్నాడట. ఉయ్యాలకి కట్టిన చిలకల పందిరి తప్ప గదిలో ఇంకెవరూ కావలి లేరు."
"యశోదమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది కాబోలు..!" కలవరం నిండిన స్వరంతో వెనక చెప్పింది విష్ణుప్రియ. ఎన్ని వేలసార్లు విన్న కథైనా, తరువాతేం జరుగుతుందో తెలిసినా కన్నయ్యకేమైనా అవుతుందేమో అనే బెంగే ఆ పిల్లకి.
"ఆ పూతన మెల్లిగా గదిలోకి వచ్చింది. చిరునవ్వు మోముతో, ముద్దులొలికే పాల బుగ్గలతో, బిగించిన ఎర్రని గుప్పిళ్ళతో నిద్రపోతున్న కన్నయ్యని చూసి ఒక్క క్షణం అంతటి రాక్షసీ మైమరచిపోయిందట!"
"ఊ.."
"మరుక్షణం తమాయించుకుని అప్పుడే కళ్ళు విప్పి చూస్తున్న కన్నయ్యని ఒళ్ళోకి తీసుకుని, విషం పూసిన చనుమొన నోటికందించిందిట!"
"హమ్మయ్యో!!"
"పాల బుగ్గల పసివాడైనా కన్నయ్య సామాన్యుడేం కాదు కదా! విషపు పాలతో పాటూ రక్కసి ప్రాణాలూ పీల్చి ఆ పూతనని హతమార్చాడు. ఇంకేముందీ.. భీకరమైన కొండలా నిజరూపంలో విరుచుకు పడ్డ దాని గుండెల మీద చందమామలా ఆడుకుంటున్న కన్నయ్య! కసుకందలేదు. ఆ పూతన పెట్టిన చావుకేకలకు పరిగెత్తుకొచ్చిన ఊరంతా బెదిరిపోయిందట!"
"పాడు రాక్షసి!! కన్నయ్య భద్రమే కదా!"
"ఆ.. పుట్టగానే ప్రకృతి అనే పూతన ఇచ్చే "నేను, నాది అనే అహపు విషాన్ని హరించేవాడా.. హరీ..!!" అని పిలుస్తున్నారు మునులు" చెప్పింది సురభి.
వకుళ గదితలుపులకు చెవులానించి విన్నా లోపల నుంచి సడి లేదు.

నిద్రపోతున్న ఆ "కల్యాణి"ని మేలుకొలిపేందుకు మధురంగా పాడుతోంది సురభి.  వెనుకే గొంతు కలిపారు కమలినీ, ఆనందినీ..

తెలవారుచున్నది గదే! లేవే! లేవవే!
కలకలా కూసేను పులుగులు - ఓ బాల!
అల గరుడ వాహనుని గుడినుండి తెలిసంకు
అదిగదిగొ పిలిచేను లేవే! బాల లేవే!

ఓలి పెనువిసపు చనుబాలు పీల్చిన వాని,
లీల మాయశకటమ్ము కాల కూల్చిన వాని,
మేలుకుని, ఋషులు యోగులు మనసులోనగొని,
మరిమరీ 'హరి హరీ' అను మహాఘోషమ్ము
చొరబారి మా యెదలలో
చలచల్లనాయె గదవే!

పాల కడలిలో పాపపానుపున యోగ ని
ద్రాళువగువాని కారణ భూతుని,
మేలుకుని ఋషులు యోగులు మనసులోనగొని,
మరిమరి 'హరి హరీ' అను మహాఘోషమ్ము
చొరబారి మా యెదలలో
చలచల్లనాయె గదవే!

తెలవారుచున్నది గదే లేవే లేవవే..

"మేలుకొలుపు పాట పాడినా నిద్ర లేవలేదు! పాలకడలిలో విష్ణువులా ఈ పడకటింట్లో వకుళ బాల నిద్దరోతోంది! పోన్లే ఆనందినీ.. బండి రాక్షసుడి కథ కూడా చెప్పెయ్య్.. చూద్దాం నిద్ర లేస్తుందేమో!" అంది మేదిని. సరేనని చెప్పనారంభించింది ఆనందిని.

"పూతన వచ్చి చచ్చి నాలుగు రోజులు కాక మునుపే.. ఊరవతల కొండకు పూజలు చేద్దామని బళ్ళు కట్టుకుని ఊరంతా వెళ్ళింది. నిద్దరోతున్న కన్నయ్యని బండి కింద ఉయ్యాల కట్టి పడుకోబెట్టింది యశోద."
"ఊ.. అప్పుడేమయింది!" విన్నకథే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వినే చిన్నపిల్లల్లా అందరూ..
"ఏమవుతుంది. అది నిజం బండి కాదటా! శకటాసురుడనే రాక్షసుడు. మారు రూపంలో కన్నయ్యకి కీడు తలపెట్టాలని వచ్చాడు."
"మనుషులూ, పశువుల రూపం చాలదా.. బండి రూపంలో కూడానా!! అయ్యో!"
"ఊ.. ఏం చేసాడు కన్నయ్య? భద్రమేనా బంగారు తండ్రి!"
"ఏం చేస్తాడు.. ఏడేడు లోకాలూ బొజ్జలో నింపుకున్న ఆ బుజ్జాయికి ఆకలేసింది. కళ్ళిప్పి చూస్తే అమ్మ ఎదురుగా లేదు. యశోదమ్మది కదూ అదృష్టమంటే! ఎర్రటి బుల్లి గుప్పిళ్ళు విసురుతూ.. ఏడుపు లంకించుకుని.."
"ఆ.."
"మువ్వల చిగురు పాదం ఎత్తి బండిని ఒఖ్ఖ తాపు తన్నాడు."
"భలే!!"
"బండి అంత రాక్షసుడూ ఒక్క తన్నుకి ముక్కలైపోయి ప్రాణాలు వదిలేసాడు." నిద్ర లేచిన మత్తు ఇసుమంతైనా లేని తెల్లని అరవిందాల్లాంటి కళ్ళు మెరిపిస్తూ చెప్తూ తలుపు తీసింది వకుళ.
"హమ్మయ్య! లేచావా చిట్టితల్లీ.. పద పద.." తొందర చేసారు మిగిలిన వాళ్ళంతా..

యమునలో మునకలేసి, ఆ గొల్ల పడుచులందరూ "సైకత కాత్యాయని" కి అగరు ధూపపు సుడుల మధ్య వెలిగే దీప కళికల వెలుగులో చేసిన పూజ నిర్విఘ్నంగా జరిగిపోయింది. యమున తరగల నవ్వులతో సాగిపోతోంది.


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )

* ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..

(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)
9 comments:

 1. Susmitha!

  Stambham braddalu kottukuni Nrihari vachchi kaapaadedi "Prahlaadudini", "Dhruvudini" kaadu.

  Eppatlaage chala baavundi.

  - Lalitha

  ReplyDelete
 2. :) అవునండీ లలితా! సరిచేసాను. ధన్యవాదాలు!

  ReplyDelete
 3. చాలా బాగా రాస్తున్నారండి.

  ReplyDelete
 4. ప్రతిరోజూ అదే చక్కని అనుభూతికి గురి చేస్తున్నారు.. ధన్యవాదాలండీ...

  ReplyDelete
 5. >>అప్పుడే చివురులేస్తున్న సన్నజాజి తీగె, జాళువా బంగారు తిన్నె పైకి జారినట్టుంది.. పట్టు బాలీసుల మధ్య ఆ శయ్యపై ఆమె నిద్రపోతున్న భంగిమ!

  ఎంత బాగా రాస్తారో!.. ప్రతీ రోజు మాకు రేపల్లె దర్శనం. బాగు!..బాగు!.

  ReplyDelete
 6. బండి రిక్క వాడు ఒక్క తన్నుకే బండిని ముక్కలు చేసిన వైనం... బహు పసందుగా ఉందండీ....

  ReplyDelete
 7. వకుళ కాస్త ఆలస్యంగా నిద్రలేవడం కన్నయ్య లీలల్ని స్మరించుకోవడానికేనన్న మాట. బాగుంది.

  ReplyDelete
 8. వకుళ :) భలే గా నచ్చింది ఈ అమ్మాయి. అందరూ కృష్ణుడి వెనక పరిగెడితే, వకుళ మాత్రం కృష్ణ తత్త్వం గ్రహించిన అమ్మాయి. వాహ్!

  గబుక్కున వకుళ లాంటి వారు ఒకరిద్దరు గుర్తుకొచ్చేశారు..

  ReplyDelete
 9. నాకీ బండి రాక్షసుడి కథ ఇవాళే తెలిసింది. వకుళ నిద్ర పుణ్యమా అని.. :D

  ReplyDelete