Friday, August 26, 2011

భవసాగరంలో కాగితపు పడవ

"మా చిట్లక్కి తోకలేని కోతి" అని కనిపించిన వాళ్ళందరికీ, నన్ను కనిపెంచినవాళ్ళు పనిగట్టుకు చెప్పేవారు. తెలుగు నాన్ డీటైల్డ్ లో "పువ్వు పుట్టగానే పరిమళించినట్లు" అని సరోజినీ నాయుడు గురించి చెప్పలేదూ! ఇదీ అలాగే! ఇక చిట్లక్కి అంటే ఏమిటంటే, చిట్టి లక్క పిడత అని.

నా బాల్యం మహ గొఫ్ఫగా గడిచింది. బొమ్మలు అలిసిపోయేదాకా వాటితో ఆడాక ,  వంటింట్లోకి వెళ్ళి ఉప్పూ - గోధుమరవ్వ, చింతపండూ - కందిపప్పు ఇత్యాది విడదీయలేని బంధాలను సృష్టించి, చేతికందిన వస్తువల్లా నీళ్ళ బిందెల్లోనో, కుంపట్లోనో పడేసినా.. కనీసం పొద్దు గడిచేది కాదు. చీపురుపుల్లలన్నీ కట్టలోంచి ఒలిచి పెట్టానా.. ఇంకో పది నిముషాలు. పాలు తాగి, తలకు పోసుకొని, ముస్తాబయ్యి పనిలో పని అమృతాంజనమో, కాటుకో అద్దానికో, మొహానికో పూసుకు ఏడ్చి గోల చేస్తే ఇంకో గంట. మళ్ళీ తిని పడుకొని లేచి చూస్తే ఆవులొచ్చే వేళైనా అవదాయె. పడక్కుర్చీలో కూర్చొని కునుకు తీస్తున్న తాతగారి గుండెలమీది వెంట్రుకలు లెక్కేసుకుందామంటే, ఓ.. విలవిల్లాడిపోయేవారు. సహనం బొత్తిగా శూన్యం పెద్దవాళ్లకి. ఇల్లంతా గిరికీలు కొట్టివస్తే గంటలు గడవడానికి మనదేమన్నా రాజప్రాసాదమా, ఏమన్నా? అబ్బబ్బబ్బ.. విసిగిపోయానంటే నమ్మండి. అప్పటికి రేడియోలో నీళ్ళు పోసాను. కనకాంబరం వెన్నులు దూసిపోసాను. చేమంతి మొగ్గలు పుణికి పెట్టాను.  చేసిన పనే రోజూ ఏం చేస్తాం? రోజులు గడవవే! మూడేళ్ళ వయసంత కష్టమైన వయసు ఇంకొకటి లేదు సుమండీ!

ఇలా గడుస్తూండగా ఓ రోజు ఓ సంఘటన జరిగింది. తాతగారితో కలిసి షికారుకి వెళ్ళొస్తున్నానా.. పార్వతీశం మేష్టారు కనిపించారు. "అమ్మలూ, మేష్టారికి నమస్కారం చెయ్యమ్మా!" అని తాతగారు చెప్పారు. పార్వతీశం మాష్టారేమో చింత గింజకి తెల్లటి గోరంచు పంచె కట్టి, లాల్చీ వేసినట్టు ఉంటారు. బొడ్లో చైను గడియారం, భుజానికి గుడ్డ సంచీ, కాళ్ళకి ఆకు చెప్పులు. "బాలామృతం" అనే అద్భుత లేహ్యానికి పేటెంట్ హోల్డర్ ఆయన. ఏం వేసి చేసే వారో కానీ, నల్లగా, ఘాటుగా, వగరుగా ఉండేదా పదార్ధం. మా ప్రాంతంలో ఎవరి పిల్లలకి ఏడాది పుట్టిన రోజు జరిపినా వెళ్ళే వారు మాష్టారు. ఓ సీసాడు బాలామృతం పట్టుకెళ్ళి పుట్టిన రోజు పిల్లాడినో, పిల్లనో ఆశీర్వదించి "ఏడాది నిండింది కదా. రోజూ పరగడుపున "బాలామృతం" ఒక్క చెంచాడు తినిపించండి వీడికి. మూడో ఏడు వెళ్ళేసరికి అమోఘమైన తెలివితేటలు, మాటల్లో స్పష్టత వస్తుంది. జలుబులు, తుమ్ములు , అజీర్తి వీడి జోలిక్కూడా రావు. శుభం." అని ఇచ్చి వచ్చేవారు.

మూడేళ్ళు నిండి అక్షరాభ్యాసం జరిగిన పిల్లలందరినీ విధిగా పార్వతీశం మేష్టారి దగ్గరికి ట్యూషన్ కి పంపించాలి. ఆయన ఇల్లెక్కడో ఎవరికీ తెలియదు కానీ, మా వీధి చివర కట్టమూరి వారింటి కుడి అరుగు మీద సాయంత్రం నాలుగు అయ్యేసరికి వచ్చి కూర్చొనే వారు. ఇంట్లో నాలాంటి బాల రాక్షసుల బాధ పడలేని అమ్మలు, అయ్యలు ఆ సమయానికి పిల్లకాయలను తీసుకెళ్ళి ఆ అరుగెక్కించి వచ్చేవారు. ఓ గంటో, రెండు గంటలో, చీకటి పడే దాకా అక్కడే పడిగాపులు కాసేవాళ్ళా పిల్లలు. అలా ఎదురయి తాతగారికి తక్షణ కర్తవ్యాన్ని తెలియపరిచిన పార్వతీశం మేష్టారి దగ్గరికి ఓ నాల్రోజుల తరువాతి నుంచి నన్నూ పంపించడం మొదలెట్టారు.

"ఏం పిల్లా, నీకు వంకాయ తెలుసా?" అడిగారు మాష్టారు.
"ఓ.." కళ్ళు రెండు చక్రాలు, తలకాయ ఇంకో చక్రం చేసి తిప్పేస్తూ చెప్పాను.
"ఇదిగో ఈ పలక మీద గీతలు గీసి ఇస్తున్నాను. అదిగో వెంకటేషు గీస్తున్నాడు చూడు, అలా వంకాయలు గియ్యాలి వరుసగా.. ఏం?"
వెంకటేషు ఎన్ని యుగాల నుంచో శ్రధ్ధగా గీస్తున్న చిత్రకారుడిలా, గుండ్రంగా తెల్లని వృత్తాలు నల్లటి పలక మీద గీసుకెళ్ళిపోతున్నాడు. మొదటి రోజు నాకేం చేతకాలేదు. నాల్రోజులు ఏమీ రాలేదు. పదో రోజుకల్లా పట్టుబడింది.

అలా గీత దాతకుండా గుండ్రంగా, ఒకదాని పక్కన ఒకటి వంకాయలనబడు సున్నాలు రాసుకుపోవడమే పని. కొన్నాళ్లకి గీతలు గీయకుండా సున్నాలు చుట్టమనేవారు. వంకాయల వరుస కొండ దిగిపోయినా, ఎక్కేసినా "ఏం, బాలామృతం పట్టెయ్యనా?" అని బెదిరింపొకటి, నా ప్రాణానికి. ఆయనకి నేను గీసిన వంకాయలు తృప్తి కలిగించాక, అప్పుడు మొదలెట్టించేవారు అక్షరమాల. ఇప్పుడాలోచిస్తే అనిపిస్తుంది. పలకమీద గుండ్రంగా ఒక వరుసలో వృత్తాలు గీయడం వచ్చాక అక్షర మాల నేర్వడం ఎంత పని అని. పార్వతీశం మేష్టారి దగ్గర వంకాయలు చుట్టిన వాళ్ళందరి చేతి రాతలు ముత్యాల కోవలు. అక్షర మాల, గుణింతాలు, రెండక్షరాల పదాలు, మూడక్షరాల పదాలు, చిన్న చిన్న వాక్యాలు పట్టుబడేసరికి స్కూల్లో వేసే వయసొచ్చేది. ఏణ్ణర్ధంలో పిల్లలకి వాక్యాలు కూడబలుక్కుని చదవడం మప్పేసే వారు.

కట్టమూరి వారింటి కుడి అరుగుపై పార్వతీశం మేష్టారి మూడు నుంచి అయిదేళ్ళ చిట్టి బొమ్మల కొలువు, ఎడమ అరుగు మీద కట్టమూరి పద్మనాభ శాస్త్రి గారి ఋగ్వేదం సంత జరుగుతుండేది. ఆయన దగ్గర వేదాధ్యయనం చెయ్యడం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారాలు చేస్కుంటూ, అరుగుల మీద, పంచల్లోను, సింహాచలం దేవస్థానం వారు మా ఊళ్ళో నిర్మించిన సత్రంలోను పడుక్కుంటూ గడిపేవారు బ్రహ్మచారులు, వేదాధ్యాయులు ఎందరో. బజార్లోకి వెళ్ళొస్తూ వీధి చివర సైకిలాపి బాల్యస్నేహితుడైన పద్మనాభ శాస్త్రి గారితో ఓ రెండు నిముషాలు ముచ్చటించి, పార్వతీశం మేష్టారిని పలకరించి, నాకో చిరునవ్వు తాయిలమిచ్చి వెళ్ళిపోయేవారు తాతగారు. "కట్టమూరి వాడు మహా భాగ్యశాలే. నిత్యం వాడి ఇంటి ఎడమ అరుగు కాడమల్లెల చెండు లాగ, కుడి అరుగు చిట్టి చేమంతుల సేరులాగ ఉంటుంది." అనేవారు నాయనమ్మతో.

మూడో తరగతి సెలవుల్లో అనుకుంటా, ఓ మహాద్భుతం జరిగింది. చందమామ కథలు చదువుకోగలిగాను. పెద్ద పెద్ద కథలు అర్ధమయ్యేవి కాదు. అవే కథలు మరో నాలుగు నెలల తరువాత మళ్ళీ చదివితే సూక్ష్మం బోధపడి కొత్త ప్రపంచపు రెక్కల వాకిళ్ళు తెరుచుకున్నట్టు ఉండేది. చందమామ పుస్తకంలో ఆఖరి కథ చదవడం పూర్తయ్యేసరికి అదోలాంటి బెంగ కమ్మేసేది. "అయ్యో! అప్పుడే అయిపోయిందా.." అని. కొన్నాళ్ళు అదే పుస్తకం మళ్ళీ చదువుకొని సంబర పడడం. ఇంకో కాగితమో, పుస్తకమో దొరికే దాకా బుల్లి మనసులో అశాంతి. ఇంచుమించు అందరికీ తెలిసిన రుచే కదా ఇది! చందమామ పిచ్చోళ్ళు కాని వాళ్ళు తెలుగుళ్ళలో పుట్టి ఉండరు.

అది మొదలు కిరాణా సరుకులు చుట్టి వచ్చిన కాగితాలు, దిన, వార పత్రికలు వెతికి ఓ కథో, కార్టూనో చదివితే కానీ తోచేది కాదు. మీకూ అంతేగా! ఇవి కాక "యస్య జ్ఞాన దయా సింధో.. " అంటూ అమరం నూరిపోస్తే కానీ తాతలకి తృప్తి లేదు కదా! పాల బువ్వ లాంటి కృష్ణాష్టకం, లడ్డు అంత తియ్యని వెంకటేశ్వర సుప్రభాతం, అమృతపు ధారలా ముకుందమాల, చెగోడీల్లా శతక రత్నాలు, పూతరేకుల్లాంటి భర్తృహరి సుభాషితాలు, విదురనీతి, బెల్లం మిఠాయిలా పోతన భాగవతం, ఇలా ఎన్నో ఎన్నెన్నో .. అర్ధం కానక్కర్లేదు. భక్తి ఒంటపట్టక్కర్లేదు. డొక్క శుధ్ధి అంటారే! దానికి ఇదే మహత్తరమైన దారి. పలకలేని పదం ఉండకూడదు. వినని పద్యం వదలకూడదు. అలా ఉండాలి బాల్యం అంటే.

తాతగారి అక్కని 'నాన్నత్తయ్య' అని పిలుచుకునేవాళ్ళం. రామతీర్ధం అనే పల్లెటూరు వాళ్ళది. పాడీ పంట ఉన్న పెద్ద మండువా ఇల్లు. నాన్నత్తయ్య గారింట్లో ఆవిడ కట్టెలపొయ్యి మీద కమ్మగా వండిపెట్టినది అడ్డాకుల విస్తరి వేసుక్కూర్చొని తినేసి, ఆవిడ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేసి, చేతులు కడుక్కుని వెళ్ళి వాళ్ళ లైబ్రరీ గదిలో  దూరేదాన్ని.  నాన్నత్తయ్యకి ఇద్దరు కొడుకులు. సర్పంచ్ పెద మావయ్య గారి తీరిక వేళ వ్యాపకం హోమియోపతీ వైద్యం. ఆ పుస్తకాలున్న బీరువా జోలికి వెళ్ళడమే నిషిధ్ధం. అది దాటితే ఇంకో అద్దాల బీరువా నిండా రామాయణ భాగవతాలు (భారతం ఇంట్లో ఉండకూడదంటారు. కులక్షయం జరిగిన కథ అని.) తమిళ ప్రబంధాలు, మీమాంస శాస్త్రం, న్యాయ శాస్త్రం ఇంకా బోలెడు పెద్ద పెద్ద పుస్తకాలు. చిన్న మావయ్య రాజకీయ పుస్తకాలు, దిన పత్రికల కలెక్షన్ ఉండేది ఇంకో బీరువాలో. నాకు కావలసినవి ఆ పక్క గూట్లో ఉండేవి . ఈనాడు పేపరు మూడో పేజీలో కుడి చేతి వైపు కింది మూలలో బొమ్మల కథలు వచ్చేవి గుర్తుందా! అవి ఓపిక గా కత్తిరించి బుల్లి బుల్లి పుస్తకాలు కుట్టే వారు చిన్న మావయ్య. రెండు పెద్ద పెద్ద దొంతులు ఉండేవి. అవి కాక బాలల బొమ్మల భాగవతం, రామాయణం, కాశీ మజిలీ కథలు, సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి. ఆ కిటికీ మూల కూర్చొని ఒక్కో పుస్తకం చదివేసి మళ్ళీ దొంతులు పెట్టే దాన్ని. ఉన్న నాలుగు రోజుల్లో రెండో, మూడో సార్లు చదివేసి విసుగొస్తే "చిన్న మావయ్యా.." అని గునిసే దాన్ని. "తినేస్తున్నావే.. శబ్దరత్నాకరమో, నాలాయిరమో చదివెయ్.. " అని ముద్దుగా విసుక్కొని ఏదో ఒక పుస్తకం వెతికి ఇచ్చేవారు. ఈ రోజు చిన్న మావయ్యా లేరు. ఆ పుస్తకాల దొంతులిచ్చిన ఆనందమూ లేదు. తలుచుకుంటే గుండె మాత్రం గర్వంగా పొంగిపోతుంది. "ఎన్ని తీపి గురుతులున్నాయ్ నాలో..!!" అని.

అమ్మమ్మ గారింటికి వెళ్తే ఇంట్లో స్వాతులు, భూములు, సితారలు అయిపోయాయంటే మధ్య వీధిలో లైబ్రరీ కి వెళ్ళి వేలాడే దాన్ని. అది మూసేస్తే మళ్ళీ ఇంటికొచ్చి ఆరుగురు మేనమామల్లో ఎవడో ఒకడిని కాకా పట్టడమే. "కొత్త పుస్తకాలేవైనా తెచ్చిపెట్టమని." వేసవి సెలవులు నెల రోజుల్లో, కనీసం తొమ్మిది వందల ఇరవై ఏడు సార్లు అమ్మమ్మ వెతుక్కుంటూ కొట్టడానికి వచ్చేది, ఏ మూల కూర్చుని పుస్తకం చదువుకుంటున్నానో కనిపించక. అమ్మకి ప్రతీ సారి చెప్పేది. "ఈ పిల్లని వదిలేసి వెళ్లకే బాబూ, తిండి తినదు. ఏ మూలనుందో తెలియదు. పొద్దస్తమానం పుస్తకాలే. కళ్ళు పాడవుతాయ్. దేనికైనా హద్దుండద్దూ!" అని.

మా రెండో మేనమామ రామానుజం ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో ఎం.ఏ సంస్కృతం టాపర్.  ప్రొఫసర్స్ ని మెప్పించి తెచ్చుకున్నవి, మక్కువతో కొనుక్కున్నవి అపురూపమైన పుస్తకాలెన్నో బీరువాల నిండా పేర్చుకొనే వాడు. . "Gem" అని ముద్దు గా పిలుచుకునే వారు మావయ్యని యూనివర్సిటీలో. రామాను'జం' కదా అతని పేరు! "జెం.. జెం" అని పిలుస్తూ ఇంటికి హడావిడిగా వచ్చేది ఓ స్నేహితురాలు. కూర్చున్నంత సేపు కుర్చొని నిశబ్దంగా పుస్తక చౌర్యం చేసి జారుకుంటూ ఉండేది. ఆ పిల్ల ఇంట్లో లెక్కపెట్టలేనన్ని పుస్తకాలు బీరువాల్లో తాళాలేసి భద్రంగా ఉండేవిట. ఆ పిల్ల వస్తే మా మావయ్యకి హడలు. కొన్నేళ్ళ తరువాత ఎవరి పెళ్ళిలోనో మావయ్యా, నేనూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, సదరు స్నేహితురాలు కనిపించింది, పిల్ల తల్లయి, రెండింతల వెడల్పయి. "హెల్లో జెం!!" అని  మావయ్యని ఎంతో ఆనందంగా పలకరించింది. కుశల ప్రశ్నలు అయ్యాక ఆవిడ పక్కనే ఉన్న నాలుగేళ్ళ కూతుర్ని చూస్తూ మావయ్య అడిగాడు. "పేరేం పెట్టావ్?" అని
"విద్యాధరి" అని చెప్పించింది పిల్ల తో తల్లి.
"నీ పుస్తక సేక(తస్క)రణ మక్కువకి తగ్గట్టే పెట్టావ్ కూతురి పేరు. బాగుంది" అన్నాడు మావయ్య.
"అదేంటి జెం? "
"విద్యాధరి అంటే బుక్ షెల్ఫ్ .. కదా! కొంటున్నావా ఇప్పుడైనా పుస్తకాలు?" అంటించాడు మన జెం. వెర్రి నవ్వు నవ్వేసిందా స్నేహితురాలు.

నిష్ఠల సుబ్బారావు గారి లైబ్రరీ నుండి ఉదయం పదిగంటల వేళప్పుడు ఏభై పైసల నవలొకటి ఆద్దెకి తెస్తే, భోజనానికి పిలిచేసరికి నవల పూర్తి చేసెయ్యాల్సిందే. మళ్ళీ ఎడాకటి వేళ ఏ కారప్పూసో, బత్తాయి తొనలో నోట్లో వేసుకుంటూ, వీధి గదిలో మడత మంచం మీద బోర్లా పడుకొని మరో సారి పుస్తకం ఆమూలాగ్రం తిరగేసి ఏభైకి ఏభై అయిదు పైసలు కిట్టించుకుని మరీ సాయంత్రం తిరిగి ఇచ్చేదాన్ని. రోజుకొక్క నవల అనే షరతు మాత్రం ఆ లైబ్రరీ ఉన్నన్నాళ్ళూ ఉంది. వేసవి సెలవులు ఇంకో నెలలో మొదలవుతాయంటే "గున్న మామిడి కొమ్మకి మొదటి పిందెప్పుడు వేస్తుందా!" అన్నంత ఆశగా ఆ లైబ్రరీ వైపు చూస్తూ ఉండేదాన్ని. సెలవుల్లో తప్ప చదువుకునే పిల్లలని రానిచ్చేవారు కాదు నిష్ఠల సుబ్బారావు గారు తన లైబ్రరీకి.

గురజాడ గ్రంధాలయం ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన మొదలయిందంటే పొలోమని వెళ్లేవాళ్లం నేనూ, నా నేస్తం. ప్రదర్శన మొదటి రోజు పుస్తకాలన్నిటినీ అబ్బురంగా చూడడం, వెల ఎంతో చూసి "హమ్మో!" అనుకొని పక్కన పెట్టడం, అన్నింట్లో కాస్త అందుబాటులో ఉన్న పలుచని పుస్తకం కొనుక్కోవాలని తీర్మానించుకొని ఇంటికి రావడం. దాచిన డబ్బులు పోగు వేసి, ఇద్దరం కలిపి ఓ పుస్తకానికి ఉమ్మడి యజమానులమయ్యేవాళ్ళం. పద్దెనిమిది సంవత్సరాల మా స్నేహానికి పునాది పుస్తకాలే.

"కాలమనే సముద్రపు ఒడ్డున దీప స్థంభాలు పుస్తకాలట. బాగుంది కదూ!" చెప్పనోసారి నేస్తంతో. "హ్మ్.. మరే! నువ్వు భవసాగరాన్ని కూడా కాగితపు పడవలోనే ఈదేస్తానంటావు కదా! నీకు బాగానే ఉంటుంది." వేళాకోళం చేసింది నవ్వుతూ. "చాల్లెద్దూ, ఒక పుస్తకం ఎన్ని జీవితాల సారమో! భవసాగరమెంత పని? పుస్తకాలిచ్చిన వెలుగులో ఎంచక్కా ఈదెయ్యొచ్చు." నమ్మకంగా చెప్పాను.

ఎప్పుడైనా తెలియక పుస్తకం చింపినా, తెలిసి నిర్లక్ష్యం చేసినా "కంకుభట్టు గారి మేక" కథ చెప్పేవారు తాతగారు. కంకుభట్టు అని ఒకాయన ఉండేవారట. అతనికి అపురూపమైన గ్రంధాలెన్నో పూర్వీకుల నుంచి సంక్రమించాయిట. అతనికి తను ఏకసంతాగ్రాహినని, మహా పండితుడినని మా చెడ్డ గర్వం ఉండేదిట.  ఈయన మిడిసిపాటు చూసి బుధ్ధి చెప్పాలని మారు రూపంలో పరమేశ్వరుడు, ఓ నాడు ఓ మేక ని తీసుకొచ్చి ఆతని పాండిత్యానికి నజరానా ఇచ్చాడట . వీధి అరుగు మీద కూర్చొని గ్రంధాలు తిరగేస్తూ చదివిన పుటల్లా చింపి విసిరేస్తూ ఉండేవాడట కంకుభట్టు. చదివిన పుటతో మళ్ళీ తనకి జన్మలో అవసరం పడదని మిడిసిపడేవాడట. అతను చింపి పడేసిన కాగితమల్లా ఆ మేక మేస్తూ ఉండేదిట . మేక "బ్రేవ్"మని త్రేన్చగానే కంకుభట్టు అప్పటిదాకా చదివినదంతా మర్చిపోయేవాడట. అలా కొన్నాళ్ళు గడిచేసరికి కంకుభట్టు పామరుడైపోయాడు. మేక పండితురాలై పోయిందిట. మళ్ళీ చదువుకుందామంటే పుస్తకాలు చింపిపోసాడాయె. "అంచేత పుస్తకం మహా గొప్ప వస్తువు. ఎప్పుడు ఏ పుస్తకం అవసరం పడుతుందో ఎవరికీ తెలియదు." అని చెప్పేవారు తాతగారు. ఇది కట్టుకథే కావచ్చు.  కానీ నన్ను కట్టుబాటులో ఉంచిన కథ.

ఖండాంతర వాస శిక్ష విధించబడేనాటికి ఇంటి నిండా బోలెడు పుస్తకాలతో, కాగితపు పూవుల నందనవనాన్ని పెంచుకున్నాను. పెట్టె సర్దుకొనే క్షణంలో ఇవన్నీ పట్టుకెళ్ళే వెసులుబాటు లేక మనసు మెలిపడింది.  ఏం వదిలెయ్యను? ఎంచే వీలుందా? విశ్వనాథవారిని వదలనా? తిలక్ ని వెనక్కి పెట్టనా? కూనలమ్మ పదాలు తెస్తే, ఎంకిపాటలు ఘొల్లుమనవా? రామాయణం ఎంచుకోనా, రసాలూరు భాగవతం విడిచి? గీతాంజలిని వద్దనగలనా?  అయ్యో, చిలకమర్తి వారు? సాక్షి వ్యాసాలు? ఇక మిగిలిన పుస్తకాల వైపు చూద్దామనుకొనేసరికే మసకమసగ్గా కళ్ళు అలుక్కుపోతే అంతకంటే కష్టం ఇంకొకటి ఉంటుందా? 

"పుస్తకాలు లేని ఇల్లు, కిటికీల్లేని గదిలాంటిది. ఊపిరాడదు నాకు." జీరబోతున్న గొంతుతో చెప్పాను, పక్కనే ఉన్న నేస్తానికి. మౌనంగా భుజం మీద చెయ్యేసి ఓదార్చింది. చేతికి అందిన పుస్తకాలను పెట్టెలో నింపుకుని వచ్చేసాను. గుండె నిండిన బాధ కళ్ళలోంచి పొర్లుతుందెందుకో?

 

36 comments:

 1. "పుస్తకాలు లేని ఇల్లు, కిటికీల్లేని గదిలాంటిది. ఊపిరాడదు నాకు." యెంత నిజం. నాక్కూడా, అచ్చం ఇలాగే. యెంత అలసిపోయినా, యెంత రాత్రి లేట్ అయినా ఎప్పుడో కనీసం ఒక పది నిమిశాలయినా ఏదో ఒకటి చదవందే ఊపిరి నిలవని మనలాంటి వాళ్ళకి ఎంత కష్టం.. ఎంత కష్టం. ఏవీ తెచ్చుకోకుండా వచ్చేసి, కొన్నేళ్ళు ఎక్కడ ఏ చెత్త దొరికినా కూడా నమిలేసి.......

  తర్వాత కొన్నేళ్ళకి ఇక్కడికి పుస్తకాలూ పంపించే వాళ్ళు దొరకటంతో, కొన్ని కొన్నిగా మళ్లీ కొన్ని చేరాయి. కొన్ని పోయాయి కూడా.. :-)) అప్పటి నుంచి ప్రతి ఇండియా ప్రయనలో, వెనకి వచేటప్పుడు, పచ్చళ్ళు, కారల బదులు పుస్తకాలు ఆక్రమించుకొన్నాయి. నన్నయినా వదిలెయ్యండి లగేజ్ ఎక్కువైతే కానీ, నా పుస్తకాలు మాత్రం రావాల్సిందే అని ఒక అల్టిమేటం ఇచ్చేస్తాను ముందే.

  చిన్నప్పుడు పుస్తకాలతో మీ జ్ఞాపకాలు, నా చిన్నతనాన్ని గుర్తు తెచ్చాయి, ఒక్క అల్లరి తప్ప. :-))

  ReplyDelete
 2. కొత్తావకాయ గారూ, ఏం చెప్పమంటారు.. ఆఫీస్లో బోల్డంత పని ఉండి కూడా మీ టపా అనగానే చదవడం మొదలెట్టాను. ఎంతుందో కూడా చూడలేదు. అలా చదువుతూనే ఉన్నాను. నా బాల్యానికి అలా ఒక ముప్పై సార్లు వెళ్లొచ్చాను. అక్కడే ఉండిపోవాలనేంత ఇష్టంతో వెళ్లాను. ఒక్కొక్క పుస్తకం మీద ఉన్న మక్కువ రెండింతలయింది మీ టపా చదువుతూ ఉంటే. ఇంకా చదవని పుస్తకాల్ని వెంటనే కొని చదవాలనేంత ఆతృతగా ఉంది. ఏంటో.. ఇంగ్లీష్ పనితో ఊపిరి సలపలేనంత పనిలో ఉండగా మీ తెలుగు టపా చదివాను కదా, అచ్చ తెలుగు లోగిలిలో అమ్మ ఒళ్లో కూర్చున్నంత సంబరంగా ఉంది. ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది, కానీ వ్యాఖ్య తరువాతే పని అనుకున్నా కదా. ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యతో సరి పెట్టుకోండి. పనంతా అయ్యాక మళ్లీ వస్తా, తనివితీరా వ్యాఖ్య పెడతా:))

  ReplyDelete
 3. నాకేమిటో, అద్దం చూసుకుంటున్నట్టు ఉంది. ఇలాగే పుస్తకాలంటే పిచ్చితో పెరిగాను, పిచ్చితో బతికేస్తున్నా, పిచ్చితోనే పోతాను. నా నగలూ, బంగారం,పట్టు చీరెలూ, నా పేరున ఉన్నవన్నీ ఎవరు తీసుకుంటారనే బంగ నాకు లేనే లేదు! ఎందుకంటే వాటికోసం ముందుకొచ్చేవాళ్లు ఎవరైనా ఉంటారు. నా పుస్తకాలో! ఇదే నా దిగులు!

  నేనంటూ వీలునామా రాస్తే నా పుస్తకాలు ఫలానా ఫలానా వాళ్ళకి ఫలానా పుస్తకాలు ఇవ్వాలని రాస్తా!

  భలే రుచిగా ఉంది ఈ పోస్టు

  ReplyDelete
 4. 'అప్పుడే అయిపోయిందా?' అనిపించిందండీ.. చివరికి వచ్చేసరికి.. నాకు చాలా ఇష్టమైన టాపిక్.. పైగా నా బాల్యం అక్కడక్కడా మెరిసింది.. పుస్తకాల రేట్లు చూసి హమ్మో అనుకున్న రోజులున్నాయి కానీ, కలిసి కొనుక్కునే స్నేహం మాత్రం లేదు.. మీరు చాలా అదృష్టవంతులు ఈ విషయంలో.. నా చదువూ సున్నాలతోనే మొదలయ్యింది.. నేనూ ఎక్కడికెళ్ళినా పుస్తకాలే వెతుక్కునే వాడిని.. నేనూ హైస్కూలుకి వచ్చాక, పైసా పైసా పోగేసి అద్దె లైబ్రరీకే చెల్లించాను.. అయితే నాకు దక్కిన అదృష్టం.. పుస్తకాల మధ్యన ఉండగలగడం.. 'ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు' అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడూ...

  ReplyDelete
 5. వహ్.. వా మీ అధ్బుతమయిన పోస్ట్ తో నన్ను చిన్ననాటికి తీసుకుపోయారు.

  నేను మూడో తరగతి చదివేటప్ప్పుడూ మా ఇంటి ముందే లైబ్రరీ ఉండేది. లైబ్రేరియన్ మా నాన్నగారికి ఫ్రెండవ్వటంతో స్కూల్ నించొచ్చాక పరిగెట్టుకుంటా పోయీ,"బాబూ..ఇక కదులూ.. ఇంటికెళ్ళాలి నేను" అనే వరకూ వరకూ అక్కడే ఉండేవాడిని. ప్చ్.. చాలా గొప్పరోజులండీ..

  ఎక్సెలెంట్ పోస్ట్.

  ReplyDelete
 6. "అది మొదలు కిరాణా సరుకులు చుట్టి వచ్చిన కాగితాలు, దిన, వార పత్రికలు వెతికి ఓ కథో, కార్టూనో చదివితే కానీ తోచేది కాదు" నేనూ అంతే..

  " అవి ఓపిక గా కత్తిరించి బుల్లి బుల్లి పుస్తకాలు కుట్టే వారు చిన్న మావయ్య." --నేనూ కుట్టేదాన్ని.ఇంకా ఉన్నాయి...

  "ఎన్ని తీపి గురుతులున్నాయ్ నాలో..!!" అని.

  " ఏ మూల కూర్చుని పుస్తకం చదువుకుంటున్నానో కనిపించక. " -- నేనూ ఇంతే...

  " వెల ఎంతో చూసి "హమ్మో!" అనుకొని పక్కన పెట్టడం, అన్నింట్లో కాస్త అందుబాటులో ఉన్న పలుచని పుస్తకం కొనుక్కోవాలని తీర్మానించుకొని ఇంటికి రావడం. దాచిన డబ్బులు పోగు వేసి.." -- అంతే అంతే..

  "పుస్తకాలు లేని ఇల్లు, కిటికీల్లేని గదిలాంటిది. ఊపిరాడదు నాకు." -- very true..

  "గుండె నిండిన బాధ కళ్ళలోంచి పొర్లుతుందెందుకో?" -- నిజం కదా..

  ఎన్నని కోట్ చెయ్యనండీ..:))

  మొత్తంమీద..ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేసారుగా..:))

  ReplyDelete
 7. మీరు "యస్య జ్ఞాన దయా సింధో.. " అంటూ అంటే, నాకు "గోడ దూకితే అదే సందో" అనే చిన్నప్పటి ప్రహసనం గుర్తుకు వచ్చింది. ;)
  మన వాళ్ళూ అంటూ ఉంటారు. తింటే గారెలే తినాలి, వింటే, భారతం వినాలి అని. బహుశా భారతం అందరి ఇళ్ళలో ఉండదు కాబట్టి, పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు, మనకు భారతం మీద మక్కువ వచ్చి వుంటుంది.

  చిన్నపుడు మధుబాబు షాడో పుస్తకాలు అన్నిటినీ వదలకుండా చదివే వాడిని. మొన్నీమధ్య రైల్లో ఒకటి కొని చదివా. అస్సలు నచ్చలేదెందుకో.
  నెమలి కన్ను వారు అన్నట్లు, "ఎప్పుడో విన్న పాట మళ్ళీ విన్నప్పుడు కలిగే అనుభూతి, ఎప్పుడో చదివిన పుస్తకం మళ్ళీ చదివినప్పుడు కలిగే అనుభూతీ ఒక్కటి కాదు".

  ఆ బాలామృతం ఎలా చేస్తారో తెలుసా మీకిప్పుడు?

  ReplyDelete
 8. చందమామ,బాలమిత్ర,బుజ్జాయి,వండర్‌వరల్డ్ పుస్తకాలు మార్కెట్‌లోకి రాగానే చదివేసేవాడ్ని. తరువాతి సంచిక వచ్చేవరకూ చకోర పక్షిలా ఎదురు చూసేవాడ్ని. కిరాణా పొట్లాలు చింపి చదివే అలవాటు నాకూ ఉండేది. అసలు నాకు వెన్నెల్లో ఆడపిల్ల పరిచయమయ్యింది కిరాణా పొట్లంలోనే. ఈనాడు ఆదివారంలో వచ్చే కధలు, వార్తలో వచ్చే బి.వి.పట్టాభిరాం వ్యాసాలు, రమణ మహర్షి గూర్చి వ్యాసాలు కత్తిరించి దాచుకునేవాడ్ని.

  మా ఇంట్లో ఎవరికీ ఇంత పిచ్చిలేదు. కాబట్టి చిన్నప్పుడే భాగవత పద్యాలు అవి నేర్పించేవారు లేకపోవటంతో నా పుస్తక పఠనం కేవలం వచనానికి, అందునా ఆధునిక వచనానికే పరిమితమయిపోయింది. మా ఊరిలో 18 సంవత్సరాలు నిండాకే లైబ్రరీ మెంబర్‌షిప్ అనేవారు. కానీ నేను మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా లైబ్రరీ చుట్టూ తిరిగేవాడ్ని.

  మీ పోస్టు పుస్తక ప్రేమికులకు ఆనందాన్ని ఇచ్చేలా, పుస్తకం చదివే అలవాటులేని వారికి చదవాలనే ఆసక్తిని కలిగించేలా ఉంది. పుస్తకాలు పదికాలాలు బ్రతకాలని. భావితరాలు కూడా మనలానే పుస్తక ప్రేమికులు కావాలని కోరుకుంటున్నా.

  ReplyDelete
 9. అల్లరితనం లేదుకానీ, పుస్తకప్రియత్వం అచ్చు ...ఇలాగే, ఇలాగే.
  మీకు లాగా నాచుట్టూ పుస్తక ప్రియులు లేరు.నా కన్ని పుస్తకాలు చదివే అదృష్టం కలగలేదు. ఇప్పుడిప్పుడే చదవటం మొదలుపెట్టా.

  ReplyDelete
 10. రాయడానికేముంది,అంతా అద్దంలో చూపించేసారు,పాపం ఆ మిత్రుడు నన్నూ ధన్యుడ్ని చేసాడు.

  "యస్య జ్ఞాన దయా సింధో.. " అంటూ అంటే, నాకు "గోడ దూకితే అదే సందో" అనే చిన్నప్పటి ప్రహసనం గుర్తుకు వచ్చింది. ;)

  ఇదేదో మానూరి గొంతులా ఉంది చెప్మా...

  ReplyDelete
 11. కొత్తావకాయ గారూ! నా బాల్యాన్ని మళ్ళా రివైండ్ చేసుకుని టీవీలో పెట్టుకుని చూసినట్టుంది.....ఐతే ఒకటే తేడా..నాకు లైబ్రరీలతో పని పడలేదు ఎప్పుడూ...ఎందుకంటే మా నాన్న,పెదనాన్నల లైబ్రరీలు చదవడానికే ఇంకా అవ్వలేదు...అచ్చు మీలానే, మూలల్లో,కిటికీల్లో ఎక్కి కూచుని చదివేవాణ్ణి...సెలవుల్లో కనీసం భోజనానికి కూడా లేచేవాణ్ణి కాదు....అమ్మమ్మ అంటుండేది, అంతలా చదివితే కళ్ళు పాడవుతాయని..హ్మ్...

  నా చిన్నతనంలో నాన్న ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకునే రెండు పుస్తకాలు కూర్చుని శ్రద్ధగా పోగులు పోగులుగా చించానట... అవేంటంటే వేయిపడగలు, వేదవతి....అమ్మ బాది పారేసిందనుకోండి, అది వేరే విషయం.;)...నాన్న వాటిని ఎంత శ్రద్ధగా అంటించుకున్నారో, ఇప్పుడు ఆ పుస్తకాలు చదివేప్పుడు ఆ పేజీలదగ్గరకొచ్చినప్పుడు అనిపించిద్ది, అప్పుడు నాన్న ఎంత బాధపడ్డాడో అని.....

  నేను మూడోతరగతికొచ్చేవరకూ చిన్న చిన్న పుస్తకాలు అరగంటా గంటలో నమిలి పక్కన పడేసేవాణ్ణి....ఆ వేసవిలో నాన్న నా చేతికి అపురూపంగా ఇచ్చిన కానుక, "వేయిపడగలు"...అది చాలు నా జీవితానికి....అప్పటి నుంచి ఎన్ని వందలసార్లు చదివి ఉంటానో! మా రెండోఅక్కకి చూపులేదు...సెలవుల్లో నా చేత వేయిపడగలు చదివించుకునేది...అలా అక్కకోసం పది సార్లైనా చదివుంటా...ఏడుపు సన్నివేశాలు వచ్చినపుడు అక్క కళ్ళల్లోంచి వచ్చే కన్నీళ్ళు ఇంకా గుర్తే!

  అలా మొదలైన నా పుస్తకాల సావాసం పదో తరగతిదాకా బాగానే సాగింది...విశ్వనాథవారి నవలలు అన్నీ అటేసి ఇటేసి ఓ ఇరవై సార్లకి పైనే చదివుంటా..ఆరు,ఏడుల్లో ఉన్నప్పుడు కావ్యాలు,పురాణాలు చదువుకున్నా...ఎనిమిది కొంత సంస్కృతానికి కేటాయించా...తొమ్మిది షేక్స్పియరూ,టాల్స్టాయీ.... ఇక పది తర్వాత నుంచి ఏం చదివాను, ఏం లేదు, ఇదో మళ్ళా ఓ నాలుగేళ్ళనుంచీ చదువుకుంటున్నా...

  ఏంటొ మీటపా నాతో ఏదేదో రాయించేస్తోంది....సుజాతగారి మాటే నాదిన్నూ, నాన్నగారిది, పెదనాన్నది కలిపి ఒక పెద్ద లైబ్రరీకి సరిపడా అవుతాయి.వాళ్ళకి వారసత్వం నేనున్నా...మరి ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గరా కలిపినన్ని నా దగ్గర ఉన్నాయి...మళ్ళా ఎన్ని కొంటానో! హ్మ్! ఎలా చెయ్యాలో ఏమో!ఎవరు నా వారసత్వం తీసుకుంటారో!

  ReplyDelete
 12. పుస్తకం చేతికొస్తే అది ఆసాంతం చదివేదాకా ఇంకో పని చేయబుద్ధి కాదు. ఒక్క మీ పార్వతీశం మాష్టారి ఘట్టం తీసేస్తే ఈ మొత్తం పోస్ట్ లో నా బాల్యం అద్దంలోలా కనిపించింది. (మొదటి కామెంట్)

  ReplyDelete
 13. పుస్తకం మొత్తం ఏకధాటిగా చదివేసి చివరి పేజీ అయిపోయాక ఆ ట్రాన్స్ లో కొంతసేపు ప్రపంచాన్ని మరచిపోయి ఉంటూంటే ఉంటుందీ...నా సామిరంగా. అసలు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి కనీసం రెండు మూడు వేల పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేసుకుని మిగిలిన జీవితమంతా ఆ గదిలోనే గడిపేయాలన్నది నా కల. నా తదనంతరం నా పిల్లలు ఆస్తుల కోసం కాకుండా ఆ పుస్తకాల కోసం కొట్టుకుంటుంటే పైనించి సంబరంగా చూడాలని ఆశ :))))) (రెండో కామెంట్)

  ReplyDelete
 14. @సుజాత గారు

  "నేనంటూ వీలునామా రాస్తే నా పుస్తకాలు ఫలానా ఫలానా వాళ్ళకి ఫలానా పుస్తకాలు ఇవ్వాలని రాస్తా!"

  సుజాత గారూ వీలునామా రాయించేటప్పుడు కుసింత నాపేరూ గుర్తుంచుకోండి ప్లీజ్. కనీసం ఒక పాతిక పుస్తకాలైనా నా పేర్న రాయించేయండి.

  ReplyDelete
 15. కామెంట్ రాయబోతే పెద్ద పోస్ట్ ఐంది. ఓసారి నా బ్లాగు చూడండి.
  http://sunitatelugublog.blogspot.com/

  ReplyDelete
 16. @శంకర్: పైనుంచెందుకు.. ? ఇప్పుడు మేం దెబ్బలాడుకోవటంలా నాన్న పుస్తకాల కోసం...అలా మా నాన్నలాగ మీరూ ఎదురుగా ఉండి దెబ్బలాట చూడకూడదా?

  ReplyDelete
 17. తృష్ణ గారూ మీ నాన్నగారిలా అయితే ఇద్దరూ ఓకే పుస్తకం కోసం కొట్టుకుంటే ఎవరికీ సర్ది చెప్పలేక ఇబ్బంది పడాలి. అదే పైనించి అయితే తమాషా చూడచ్చు. :)))))

  ReplyDelete
 18. @ పద్మవల్లి , ఇండియా నుంచి పుస్తకాలు విరివిగా తెచ్చుకునేన్ని సార్లు వెళ్ళనేలేదండీ నేను. ఎంత లేట్ అయినా ఒక్క పది పేజీలైనా చదివి పడుక్కునే విషయంలో సేంపించ్. ధన్యవాదాలు.

  @ మనసుపలికే, నన్నేమని చెప్పమంటారు. మీ వ్యాఖ్యతో ఏనుగెక్కించారు. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ.

  @ సుజాత, లెస్స పలికితిరి. ఆస్తులు పంచుకునే వారసులుంటారు కానీ, అభిరుచుల వారసత్వం పిల్లలకి, అందునా ఈ కాన్వెంట్ పిల్లలకి వస్తుందో, రాదో. నేను ఇంగ్లీష్ చదువుతున్నంతైనా నా పిల్లాడు తెలుగు చదివితే బాగుండునని ఉంది. ఏం జరుగుతుందో, ఏమో!

  ReplyDelete
 19. @ మురళి, భలేవారే, చాంతాడంత టపా చూసి విసుక్కుంటారేమో, అని నేననుకుంటే అప్పుడే అయిపోయిందా అంటున్నారే! స్నేహితుల విషయంలో నేను అప్పటి నుంచి, ఇప్పటి దాకా అదృష్టవంతురాలినేనండీ. మీ అందరి సహవాసం నాకు, నా పుస్తకాల పిచ్చికి మెరుగులు దిద్దుతోంది. ధన్యవాదాలు.

  @ రాజ్ కుమార్, అందరూ లెండింగ్ లైబ్రరీల వాళ్ళని విసిగించిన వాళ్ళమే కదా! సేం పించ్. ధన్యవాదాలండీ.

  @ తృష్ణ, ఈనాడులో కథల పుస్తకాలున్నాయా? భలే! చాలా సంతోషం. ధన్యవాదాలు.

  @ చాతకం, మీరెవరైనా చెప్తారనే నేను "యస్యజ్ఞాన దయా సింధో.." అని ఊరుకున్నాను. బాలామృతం మా మాష్టారి రహస్యం కదండీ! మనమెలా తెలుసుకోగలం? ధన్యవాదాలు.

  ReplyDelete
 20. @ మురళి, వచనానికి పాఠకులను ఆకట్టుకునే లక్షణం మెండు. అందుకే మీరు అంత తొందరగా పుస్తకాలకి ఆకర్షితులై ఉంటారు. నేనూ వండర్ వరల్డ్, విస్ డం కోసం తెగ ఎదురుచూసేదాన్ని. కథలు మాత్రమే కాకుండా వ్యాసాలు చదవడం అప్పుడే అలవాటయింది. ధన్యవాదాలు.

  @ మందాకిని, నేర్చుకోనే ప్రక్రియకి ఆలస్యం అంటూ లేదు కదా! Happy reading! ధన్యవాదాలు.

  @ శ్రీనివాస్ పప్పు, మనూరి గొంతే అనుకోలేం లెండి. గోదారి వారికీ గోడలు దూకడం వచ్చట. మా ఇంటాయన భాష్యం ఇది. :) అద్దంలో చూసుకున్నందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 21. పుస్తక పఠనం విషయంలో మీ టపాలో నన్ను నేను చూసుకున్నానండి..నాకు ఏ తెలుగు పుస్తకం కనపడినా చదవకపోతే నిద్రపట్టదు. మా పెదనాన్నగారి ఇంటికి వెళ్ళినపుడు చదివిన పాత ఈనాడు ఆదివారం అనుబంధాలు( నే పుట్టాక ముందు నుండి) మొదలు, మొన్న మా మామగారి ఇంటికి వెళ్ళినపుడు ఆయన శిక్షణా పుస్తకాలు వరకు అన్ని గుర్తోచ్చేసాయి నాకు.

  మీకు తెలియదని కాదు, చందమామ పాత సంచికలు ఇంటర్నెట్లో లభ్యం అవుతాయి. దానిపై నే రాసిన టపా


  "కంకుభట్టు గారి మేక" కధ బావుందండి, నాకు స్వార్ధం అనుకోండి ఇంకేమయిన అనుకోండి, నా పుస్తకాలను ఎవ్వరికీ ఇచ్చేవాడిని కాదు. జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం :)

  ReplyDelete
 22. ఈనాడులో పుస్తకాలు కావండి...మీరు మీ మావయ్యగారు కత్తిరించి పుస్తకాలు కుట్టేవారని రాసారు కదా.., అలానే నేనూ చిన్నప్పుడు న్యూపేపర్లో పడిన "బొమ్మల కథలు" కత్తిరించి పుస్తకంలా కుట్టేదాన్ని..అదన్నమాట..:))

  ReplyDelete
 23. @ శంకర్ గారూ! జై కాకినాడ. కాకినాడ కాలేజీలో, సూర్యకళామందిర్లో, గ్రంధాలయంలో పెట్టే పుస్తక ప్రదర్శనలో ఆణిముత్యాల్లాంటి ఎన్ని పుస్తకాలెన్నో చదివాను, సొంతం చేసుకున్నాను. పుస్తకం చదివాక ఆ ట్రాన్స్ (హాంగ్ ఓవర్)లో మునిగి పక్కవాళ్ళని బలిచెయ్యడం నాకు అలవాటే. మీకూనా? సేం పించ్ అయితే. మీరు రిటైర్ అయ్యాక మీ ఇంటికి తరచూ వచ్చే అతిధి నేనే అవుతానయితే! పుస్తకాల కోసం పిల్లలు కొట్టుకుంటూంటే.. అహా.. మీది ఎంత గొప్ప ఊహ అసలు!! ధన్యవాదాలండీ!

  @ సునీత, మీ టపా వ్యాఖ్య అద్భుతంగా ఉందండీ! ధన్యవాదాలు.

  @ తృష్ణ, ఈనాడు పేపర్లో వచ్చే బొమ్మల కథల బుల్లి పుస్తకాలా? అనే నా ఉద్దేశ్యం అండీ! సంతోషంలో తడబడ్డానంతే. ధన్యవాదాలు.

  @ శ్రీ, మీ చందమామ కలల టపా చాలా బాగుందండీ! చిన్నప్పటి రోజుల్లో రాత్రికో మాయా లోకాన్ని చుట్టి వచ్చేవాళ్ళం కదా, చందమామ కథలు చదివి!! కలవరించి ఇంట్లో చివాట్లు కూడా తినేదాన్ని నేనయితే. మీరిచ్చిన లంకెలకి ధన్యవాదాలు, వ్యాఖ్యకి కూడా!

  ReplyDelete
 24. బాగుంది మీ పుస్తకోపాఖ్యానం. నాదీ ఇంచుమించు ఇలాటి ప్రస్థానమే అయినా, అది ఆంగ్ల సాహిత్యంతో మొదలై తెలుగులో తేలింది కాబట్టి మీరు చదివినన్ని తెలుగు పుస్తకాలు నేను చదవలేకపోయాను!
  పుస్తకం హస్త భూషణం అన్నారు కదా పెద్దలందుకే!


  శారద

  ReplyDelete
 25. అదేవిటే నీకు కినిగె గురించి తెలీదా ఇన్నాళ్ళు? బలేదానివే!

  బావుందే నీ పుస్తకాల గోల.....చిన్నప్పుడూ చందమామలు చదివి నమిలేసేదాన్ని. అది తప్ప నాకు పుస్తకాల పిచ్చి చిన్నప్పటినుండీ లేదుగానీ మధ్యలో మొదలయ్యి, వస్తూ పోతూ ఇప్పుడు మేరుపర్వతం అయి కూర్చుంది. పుస్తకాల మీద పుస్తకాలు కొనేస్తున్నాను. అవే నా ఆస్థి. కానీ ఒక్కోసారి అవన్నీ చూస్తుంటే నా తరువాత వీటిని ఎవరు కాపాడతారు. నా పిల్లలు చదువుతారా? అని బెంగగా ఉంటుంది.

  నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. డిల్లీకి వచ్చి పడ్డప్పుడు నాకు అచ్చు ఇదే పరిస్థితి. అన్ని పుస్తకాలూ మోసుకురాలేను, ఏమో ఎన్నాళ్ళుంటామో ఇవన్ని ఎక్క్ద పట్టుకు తిరుగుతాను అని తెచ్చుకోలేదు. రోజూ బోలెడు బెంగపడిపోయేదాన్ని పుస్తకాలు లేక. అలా మెల్లి మెల్లిగా ఒక్కోటీ తెచ్చుకుంటూ ఇప్పుడు సగం చేర్చాను.

  నా పుస్తకాలని పసిపాపాయిలా చూసుకుంటాను. ఎవరికైనా చదవడానికి ఇచ్చినా బోలెడు కండిషన్లు పెడతాను. పుస్తకం మడవకూడదు, అట్ట నలగకూడదు, గీతలు పెట్టకూడదు, అండర్ లైన్లు చెయ్యకూడదు...నేను చదివినా అలాగే మల్లెపువ్వులా చూసుకుంటాను. నా పిల్లలకి వాటిపై ఆసక్తి కలిగించలేకపోతే నా ఆస్థిని ఏదైనా లైబ్రరీకి ధారదత్తం చెయ్యలని నిర్ణయించుకున్నాను. చూద్దాం!

  ReplyDelete
 26. ఇలాంటి టపాలకి వ్యాఖ్య రాయడం కష్టం. ఏకకాలంలో మహదానందంగానూ, విపరీతమైన బెంగగానూ అనిపించింది.

  ReplyDelete
 27. చిన్నప్పుడు నేను పుస్తకాలు ఎక్కువగా చదవలేదు.మా ఇంట్లో తెలుగు గ్రంధాలు బాగానే ఉండేవి. ఎక్కువగా పద్య సాహిత్యం. యూనివర్సిటీ కి వెళ్ళిన తరువాత అలవాటు అయింది. ఎక్కువగా లైబ్రరీ లో వే. ఉద్యోగంలో చేరిన తరువాత కొనడం అలవాటు అయింది. ఒక కాలం లో ఏది దొరికితే అదే చదివేవాడిని. పోట్లాల కాగితాలు చదివే అలవాటు నాకు ఉంది. ఆ తరువాత తగ్గింది చదివే అలవాటు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను చదవడం.

  చిన్నప్పుడు మీలా అన్ని పుస్తకాలు చదవక పోయినా అల్లరి అంతకన్నా ఎక్కువే చేసానేమో. మళ్ళీ ఆ అల్లరి గుర్తుకు తెచ్చుకుంటున్నాను.

  మీ టపా గురించి కొత్తగా ఇంకేమి చెప్పాలి. బాగుంది. బాగుంది. బాగుంది.

  ReplyDelete
 28. చాలా బాగా రాసారు. నా పుస్తకాల ప్రేమని పునరుద్ధరించాలి. చాలా సిగ్గనిపించింది ఇదంతా చదివి. ఎక్కడో ఖండాంతరాలలో విజీనారం వాసనల్ని సొగసుగా పంచిపెడుతూ.. బాల్యాన్ని నెమరువేసుకుంటూ !

  ఖండాంతరం పోతే, అనుకోకుండా నోస్టాల్జియా చుట్టుముండుతుందా ? మీ ఫీలింగ్స్ చూస్తే - అంత గాఢత నా ఆలోచనల్లో లేదేంటబ్బా అనుకుంటున్నా.

  మీ మొదటి పేరాలు మాత్రం చాలా బావున్నాయి. మా అమ్మాయి పెంకితనాలన్నీ గుర్తొస్తున్నయి. దానికంత స్కోపే లేదు. ఉన్నంతలో అది బిందెలో చెయ్యి ముంచితే కోప్పడేస్తాం. ఈ రాక్షస కార్యాలు మీ అబ్బాయి రిపీట్ చేస్తున్నాడా లేదా చెప్పండి ? చూడబోతే అమాయకుళ్ళా ఉన్నాడు మీ కృష్ణుడు.

  ReplyDelete
 29. చాలా బాగా రాసారండీ.. చదువుతున్నంతసేపూ చాలాసార్లు బాల్యంలోకి వెల్లొచ్చాను. వర్ణమాల విషయంలో మీ మాష్టారిలాగే మా తాతగారు కూడా ("బాలామృతం" మినహా :) ).. సాయంత్రం అయ్యేసరికి "రెండొకట్ల రెండు, రెండు రెళ్ల నాలుగు.." అంటూ ఊరంతా దద్దరిల్లేట్టు ఎక్కాలు.. :)

  ReplyDelete
 30. మొదట... టపా..చూసి..ఇంత పెద్దది చదివేయాలా అనుకున్నాను..
  అసలు చదివాకా అప్పుడే అయిపోయిందా అనిపించింది..:)
  పుస్తక paTanam చిన్నప్పటి నుండి అలవాటు ఉండటం ఓ అదృష్టం..:)
  నేను చాల చాల మిస్ అయ్యాను..ఈ బ్లాగుల పుణ్యమా అని కొన్ని తెలుగు పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను...
  ఒక అయిదు ఆరేళ్ళ పరిచయానికే పుస్తకం అంటే పిచ్చి ప్రేమ ఏర్పడిపోయింది నాకు...ఇక మీ పరిస్థితి ఉహించాగలను..
  మీ టపాలు మాత్రం సూపరండి..:)

  ReplyDelete
 31. @ శారద, ధన్యవాదాలండీ.

  @ సౌమ్య, కినిగె గురించి తెలుసు. వాడడం ఇదే మొదటి సారి. అదీ కథ. మనం చదువుతూ ఉంటే పిల్లలకి అలవాటవుతుందని మాత్రం ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది నాకు. తెలుగు ఎంతవరకు చదువుతారో చూడాలి. ధన్యవాదాలు.

  @ కొత్తపాళీ గారూ, ధన్యవాదాలండీ!

  @ బులుసు సుబ్రహ్మణ్యం గారూ, మీ అల్లరి గురించి మీ టపాలో చదివే భాగ్యం కలిగించండి. ధన్యవాదాలు.

  ReplyDelete
 32. @ సుజాత, మీ టపాలకి వ్యాఖ్య రాయడానికి ఎంత ఆలోచించాలో, మీ వ్యాఖ్యకి రాయాలన్నా అంతే సంక్లిష్టంగా ఉంది నా పరిస్థితి. మీ ఆలోచనల్లో గాఢతే గడ్డిపూలు, వాటిని ఆస్వాదించే నాబోటివాళ్ళూ.
  మా కృష్ణుడి అల్లరి వేరేలా ఉంటుంది. అబ్బాయిగారు ఒలకబోస్తూ ఉంటే వారి అమ్మగారు ఎత్తిపెట్టుకుంటూ ఉంటారు. ధన్యవాదాలు.

  @ రవికిరణ్, అవునా! ధన్యవాదాలు.

  @ కిరణ్, టపా ఇంత పొడవు వచ్చేసరికి నేనూ అదే అనుకున్నాను. కానీ ఏ పేరా తిసేద్దామన్నా కుదరదనిపించింది. పుస్తకాన్ని మించిన వ్యసనం మరోటి ఉండదు, కిరణ్ గారు! ధన్యవాదాలు.

  ReplyDelete
 33. ఓసారెప్పుడో మీనాన్నగారి నోబుల్ బహుమతి గురించిన పోస్ట్ చదివానండి..అక్కడి నుండి తీరుబాటు అవ్వలేదు...మీకు అప్పుడు చెప్పాలనుకున్న మాటలు ఇవి...మీ శైలి అమోఘం.. చాలా బాగా రాస్తున్నారు...అందరికీ భాషమీద ఇంత చక్కనిపట్టు సాధ్యం కాదు... నిజంగా హేట్సాఫ్ అంతే :) ఈ రోజు గూగుల్లో మీ బ్లాగ్ పేరు రాసి వెతుక్కుని మరీ వ్యాఖ్య రాస్తున్నాను అంటే చూడండి ఎంత నచ్చిందో blog :)

  ReplyDelete
 34. నేస్తం గారూ, వెతుక్కుని మరీ వచ్చారంటే నాకు భలే ఆనందమనిపించింది. ధన్యవాదాలండీ!

  ReplyDelete
 35. wow.....beautiful post kova garu.
  entha bagundo mee baalyam... books ante avagahana / book reading alavatu leka nenu entha miss ayyano ani telusukunnanu,,,,

  you have very rich due to the wealth you accumulated from all these books.

  ReplyDelete
 36. భవసాగరాన్ని కాగితం పడవలో దాటడం గురించి ఈ రోజే ఇంకో మనిషికి చెప్పి, నేను (నాలుగోసారి) చదివాను. వాక్యాలు కంఠస్తం వచ్చినా పాతబడవూ!!

  ReplyDelete