Wednesday, October 5, 2011

కొలువు తీరిన జ్ఞాపకాలు

అదో వేసవి సాయంత్రం. ఎక్కడో కూస్తున్న కోయిల పాట అప్పన్న కొండని తాకి మారు మ్రోగుతోంది. "హాత్తెరీ.. సరి లేరు నాకెవ్వరూ..!" అని మళ్ళీ మళ్ళీ కూస్తోంది మత్తెక్కిన పొగరు కోయిల. పెరట్లో ఆవు దూడ ఉండుండీ "అంబా.." అంటోంది. వంటింటి చూరు కింద కాగుతున్న నూనె మూకుట్లో, గులాబీ పువ్వుల చట్రం "సయ్..య్" మని మునక వేసింది. వేడెక్కిన చట్రాన్ని పిండిలో ముంచి తీసి నూనెలో మరో మునక వేయించింది అమ్మమ్మ. తేలిన బంగారు రంగు గులాబీలని పంచదార పాకంలో ముంచి పెద్ద ఇత్తడి పళ్ళెంలో ఆరబెడుతోంది అమ్మ. గడప మీద ఆనుకుని ఓ రెండేళ్ళ పాపాయి "అమ్మమా... గులాగీ.." అని గారాలు పోతోంది. నీలం చుక్కల తెల్ల కాటన్ గౌను, కుచ్చులు కుచ్చులుగా నుదుటిమీదికి పడుతున్న నల్లని వంకీల జుట్టు, ముంజేతులకి మురుగులు, కాళ్ళకి వెండి గజ్జెలు.. అంత ముద్దొస్తున్న పాపాయి ఎవరని మళ్ళీ అడుగుతారేం.. కచ్చితంగా నేనే.

అలా నేను పన్నెండో గులాబీ పువ్వు పట్టుకెళ్ళి ఇస్తే, సందులో కుంకుడు చెట్టు నీడలో నులక మంచం మీద నడుం వాల్చి, తెచ్చిన గులాబీ తెచ్చినట్టు నోట్లో వేసేసుకుంటూ, కన్యాశుల్కం నూట పన్నెండో సారి చదువుకుంటున్నారు మా నాన్నారు. "ఉంకో గులాగీ తెస్సానేం.." అని ఆయనతో చెప్పి, మళ్ళీ వెళ్ళి అడిగినపుడు అమ్మమ్మకి అనుమానం వచ్చింది. "ఏం పిల్లా.. నువ్వే తినేస్తున్నావా? ఏ కాకికైనా తినిపిస్తున్నావా?" అని సందులోకి వస్తూ నోరు జారేసి నాలిక్కరుచుకుంది. యధాలాపంగా ఆవిడ అన్న మాట తన శ్యామలఛ్ఛాయని చూసి వెక్కిరిస్తూ అన్నదేనని చిన్నబుచ్చుకున్నారు ఇంటల్లుడు.

ఇంకో రెండేళ్ళ తరువాత మా అమ్మమ్మగారింటికి ప్రతీ ఏడూ వచ్చినట్టే దసరా పండగ వచ్చింది. దసరా వెళ్ళిన మూడోనాడు అరటి పిలకలు, చేమంతి పువ్వులు కట్టిన ఆటో ఒకటి ముంగిట్లో వచ్చి ఆగింది. ఆకుపచ్చ నేత చీర నడికట్టు కట్టుకుని ఆ ఆటోలోంచి మా అమ్మ దిగింది. అమ్మ చేతిలో కేరు కేరుమంటూ బంతిలా ఓ వస్తువు. పెద మావయ్య చెయ్యి పట్టుకు నిలబడ్డ నాకు, ఆ బ్రహ్మ పదార్ధం ఏంటో అంతు చిక్కలేదు. అమ్మ నన్ను చూసి దూరం నుంచే నవ్వేసి "తల్లీ, ఆం తిన్నావా??" అని అడిగి, చూపులతోనే తడిమేసి ఎందుకు పంపేసిందో అర్ధం కాలేదు. మర్నాడు వచ్చిన నాన్నగారు నన్ను ఎత్తుకొని "అమ్మలూ.. తమ్ముడిని చూసావా?" అని అడిగినప్పుడు బ్రహ్మాండం బద్దలైంది. "తమ్ముడంటే పెద మావయ్య కొడుకులా గునగునా పాకుతూ, మనం పరిగెడుతూంటే మన వెంట పడాలి కానీ కుయ్యో.. అయ్యో అని ఏడవడమేంటి..?!"  అనుకున్నాను.

రెండ్రోజులు విపరీతంగా సహించాక అమ్మమ్మకి చెప్పేసాను. "ఆ ఏడుపు పిల్లాడు నా తమ్ముడేం కాదు" అని. అమ్మమ్మ ఊరుకుంటుందా? "ఎందుక్కాదూ? నువ్వూ చిన్నప్పుడు ఇంతకంటే ఏడ్చేదానివి." అని పెద్దత్త చేత, పిన్ని చేత, మడేలు సూరీడమ్మ చేతా సాక్ష్యం చెప్పించేసింది. అవమానభారంతో సందులో చీమల పుట్టలు చీపురుపుల్లతో పొడుస్తూ చాలా సేపు బాగా ఆలోచించాక, ఓ నిర్ణయానికి వచ్చి మళ్ళీ వెళ్ళి అమ్మమ్మకి చెప్పాను. "ఇంత నల్ల పిల్లాడు తమ్ముడు అయితే నాకు బాగుండదని" వినిపించుకోకుండా ఒక్క కసురు కసిరి తరిమేసారు. గోలు గోలున ఏడుస్తూ కింద పడి కాసేపు దొర్లాక విసుగొచ్చి, పిల్లమూకతో దాగుడు మూతలు ఆడుకునే సందట్లో తాత్కాలికంగా నల్ల బంతి పిల్లాడి విషయం మర్చిపోయాను.

కానీ అమ్మ దగ్గరకి వెళ్ళనివ్వట్లేదని ఏడుపొచ్చేది. కలలో అయినా, కళ్ళు తెరిచినా.. నల్లగా పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రటి నోరు, బోలెడు జుత్తు వేసుకొని, బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా ఆ బంతి పిల్లాడు మా అమ్మ పక్కలో కనిపించి నన్ను వీర హింస పెట్టసాగాడు. అసహనం పెచ్చరిల్లి ఆటల్లో దొరికిన వాళ్ళని దొరికినట్టు నా ఉక్రోషానికి బలి చేసినా ఉపయోగం లేకపోయేది. "పోన్లే, చిన్న పిల్లాడు కదా.. తొందరగా వాళ్ళమ్మ కి ఇచ్చి పంపెయ్" అని అమ్మకి గుమ్మంలోంచి చెప్పేసి వచ్చేస్తూంటే, పిన్ని ఓ బాంబు పేల్చింది. "వీడికీ మీ అమ్మే అమ్మ" అని. "ఏం కాదు. అమ్మంటే నాకు అమ్మ. వాళ్ళమ్మకి వాడిని ఇచ్చెయ్యండి." అని చెప్పేసి కళ్ళ నీళ్ళు కుక్కుకుంటూ బయటికి వచ్చేసాను.

అది చూసిన అమ్మమ్మ నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకుని బోలెడు మంచి మాటలు చెప్పానని అనుకుంది. పొర్లుకొచ్చేస్తున్న దుఃఖంలో నాకేమైనా వినిపిస్తేగా! "అమ్మని ఎందుకు ఆటోలో తీసుకెళ్ళావ్. నువ్వే.. నువ్వే చేసావ్. తమ్ముడేం అలా ఉండడు." అని తన్నుకొస్తున్న వెక్కిళ్ళ మధ్యలో అమ్మమ్మ మీద విరుచుకుపడ్డాను. చాలా సేపు నా శోకాలాపనతో విసిగి చివరికి చెప్పింది."పట్నం సంతకి వెళ్ళాం. చింతపండు బేరమాడి డబ్బులిచ్చేసి బుట్ట తీసుకొని ఆటో ఎక్కామా.. బుట్టలో చింతపండుకి బదులు ఇదిగో, ఈ పిల్లాడున్నాడు. డబ్బులిచ్చేసాం కదా అని ఇంటికి తెచ్చేసాం. పాపం ఏడుస్తున్నాడు కదా! మనింట్లోనే ఉంచుకుందాం. మంచి దానివి. అలా ఏడవకూడదు." అని సర్ది చెప్పింది. పక్క గదిలోంచి బయటకు వస్తున్న నాన్నగారి చెవిన పడ్డాయ్ ఈ మాటలు. మరో సారి ఆయన నవజాత సుపుత్ర సమేతంగా వర్ణ వివక్షకి గురయ్యారు.

అది మొదలు చింతపండమ్మే అమ్మి పిల్లాడు కనిపించకపోవడం చూసుకుని, మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వీడిని పట్టుకుపోతుందని, నేను ఆశగా ఎదురు చూస్తూ గుమ్మంలో కూర్చొనేదాన్ని. రావట్లేదని విసుగొస్తే నాన్నగారిని ప్రశ్నలతో వేధించేదాన్ని. అలా ఆయన క్రోధం పెరిగి పెరిగి కట్టలు తెంచుకుని, అమ్మమ్మ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అప్పటి నుంచీ ప్రతి పండగకీ తప్పకుండా అమ్మమ్మగారింటికి వెళ్ళి తీరాలని. ప్రతీ పండగా అంటే ఉగాది మొదలుకొని ప్రభుత్వ సెలవులిచ్చే పండగలు మాత్రమే కాదు, మాస శివ రాత్రి, భగినీ హస్త భోజనం, ఋషి పంచకం, బలిపాడ్యమి, మాఘపాదివారాలు, తిధిద్వయం, బాక్సింగ్ డే మరియు టైలర్స్ డే .. ఇత్యాది పర్వదినాలన్నీ శాస్త్రోక్తంగా పెళ్ళాం బిడ్డలతో సహా పక్కూర్లో ఉన్న అత్తవారింటికి వెళ్ళి జరుపుకొనే వారు. కక్కలేక మింగలేక అమ్మమ్మ కళ్ళ నీళ్ళు కుక్కుకునేది. అవును మరి, "అల్లుడొచ్చాడండీ, సంకష్ట హర చతుర్ధికి" అని ఏం చెప్పుకుంటుంది ఊళ్ళో!! తాతగారికి, నాన్నగారికి ఉమ్మడి కాలక్షేపం చదరంగం కాబట్టి ఆయనకేం ఇబ్బంది ఉండేది కాదు. అల్లుడిలా ఎందుకు పగబట్టాడో అర్ధం కాక అమ్మమ్మే కనీసం నాలుగూళ్ళ అవతల ఉన్న తన పుట్టింటికీ, ఓ పుణ్య క్షేత్రానికి కూడా వెళ్ళలేక మౌనంగా శిక్ష అనుభవిస్తూ ఉండేది.

ఇలా ఓ ఏడాది గడిచింది. అప్పటికి మా ఇంట్లో పెరుగుతున్న నల్ల బంతి పిల్లాడు బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ నా వెనక పడేవాడు. నన్ను చూస్తే నవ్వి చేతులిచ్చేవాడు. నేను బడి నుంచి వచ్చేసరికి గుమ్మంలో ఎదురై "క్క్..క్కా..!" అని కేరింతలు కొట్టేవాడు. ముద్దొచ్చి గట్టిగా కావలించుకు నలిపేసినా ఏడ్చేవాడు కాదు. భలే మెత్తగా ఉండేవాడు. వాడికి సిరిలాక్ కలిపినప్పుడు అడిగితే కాదనకుండా అమ్మ నాకూ ఓ రెండు చెంచాలు ఇచ్చేది. చూసారా.. సహనం వల్ల ఎన్ని లాభాలో!!  పోన్లే, ఇదేదో బాగానే ఉంది కదా అని మా నేస్తాలందరితోనూ "వీడే మా తమ్ముడని" చెప్పేసాను.

ఓ రోజు ఉదయాన్నే మా నాలుగో మేనమామ వచ్చాడు. ఉత్తి చేతులతో ఎలాగూ రాడు. ఎప్పుడూ తెచ్చే పనస పండు, చిట్టి గారెలు, సంపెంగ పూవులతో పాటు, ఓ పెద్ద బుట్ట తెచ్చి అమ్మకి ఇచ్చాడు. ఆ బుట్టలో ఏముందో నన్ను చూడనివ్వలేదు. నాయనమ్మ, తాతగారూ, అమ్మ బోలెడు మాట్లాడుకున్నారు మావయ్య వెళ్ళాక.

నాలుగు రోజులు గడిచాక తాతగారి పుస్తకాల గది ఖాళీ చేసారు. ఆ గదిని పంచ గది అంటారు. ఓ పుస్తకాల భోషాణం గోడకి జరిపి చెక్క పెట్టెలు దాని ముందు వేసి తెల్లటి పంచె పరిచారు. మెట్లు మెట్లుగా భలే పేర్చారు అమ్మ, తాతగారూ. ఆ మెట్లు గబగబా ఎక్కుదామని ఉరికిన తమ్ముడిని నా చేతికిచ్చి దూరంగా కూర్చోమన్నారు. వాడిని ఆపేసరికే సరిపోయింది, ఇంక నేనేం ఎక్కుతానా మెట్లు! ప్చ్.. తమ్ముళ్ళతో పాటూ త్యాగం, సహనం కూడా వచ్చేస్తాయనుకుంటా అక్కలకి.

"నాలుగు మెట్లే వచ్చాయి ఎలా చెప్మా..!" అని అమ్మ, తాతగారూ అనుకుంటూ ఉంటే వంటింట్లోంచి కూర్మావతారం చెక్కి ఉన్న పీట తెచ్చి ఇచ్చింది నాయనమ్మ. "ఇదిగో, ఆ పీట మీద నీ పుస్తకాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి, తెలిసిందా?" అని నాకు చెప్పింది. పొద్దుపోయాక నేనూ, తమ్ముడూ ఎప్పటిలాగే పంచలో కూర్చొని భోజనం చేసేసి, పందిట్లో చిన్న పట్టె మంచం మీద పడుక్కున్నాం. చుక్కలు చూస్తూ వాడితో అన్ని కబుర్లు చెప్పేదాన్నా.. ఉదయం లేచేసరికి ఎంచక్కా గువ్వపిట్టలా అమ్మ పక్కన పడుక్కునే వాడు. వాడికి భయమనుకుంటా.. నేనంటే కాదులెండి. చీకటంటే, చీకట్లో నీడ బూచులంటే.

మర్నాడు ఉదయం లేచేసరికి ఆ మెట్ల నిండా రక రకాల బొమ్మలు పేర్చి ఉన్నాయ్. ఎన్ని రకాల బొమ్మలో.. రంగు రంగులవి. నిద్ర కళ్ళు నులుముకుంటూ అబ్బురంగా చూస్తున్న నాతో అమ్మ చెప్పింది. "కిందటేడు రజని బొమ్మల కొలువు చూసి ఆ బొమ్మలు కావాలని ఏడ్చావు కదా.. ఇదిగో, ఇది నీ బొమ్మల కొలువు. ఉదయం, సాయంత్రం పూజ చేసుకోవాలి. తెలిసిందా! నువ్వు పెద్ద దానివి. తమ్ముడు ఆ బొమ్మలు తియ్యకుండా నువ్వే చూసుకోవాలి" అని దొంగ చేతికి తాళాలిచ్చేసింది.

పై మెట్టు మీద రామ పట్టాభిషేకం.. నీలి నీలి రామచంద్రుడు, ఆయనకు ఎడంవైపు ఎర్ర చీర కట్టుకున్న బంగారు బొమ్మ సీతమ్మ, కుడి వైపు అచ్చం పసిమి రామయ్యలా ఉండే లక్ష్మణమూర్తి, పాదాల చెంత అతగాని బంటు రీతి  మారుతి. ఆ మెట్టు మీద పూల గుత్తులు తప్ప వేరే ఏం పెట్టేది కాదు అమ్మ. రెండో మెట్టు మీద అయిగిరి నందిని సింహ వాహిని 'దుర్గ', శుక వారిజ పుస్తక రమ్య పాణి 'వాణి', పద్మోద్భవా పద్మముఖి 'పద్మనాభ ప్రియ' కొలువు తీరే వారు. ఇంక మిగిలిన కొలువులో వెంకన్న, మురళీ మోహనుడు, సిగ్గులొలికే రాధ, కృష్ణ లీలా తరంగిణిలో ఓలలాడుతున్న మీరా, పాల తెల్లని ఆవు - దూడ, వెన్నముద్ద చేతపట్టి పారాడు కన్నయ్య, దీపకన్యలు, మోగని మట్టి 'బొబ్బిలి వీణ' నమూనా, శెట్టయ్య, శెట్టమ్మ, పావడా వేసుకుని తలూచే చారెడేసి కళ్ళ కొండపల్లి బొమ్మాయి, గోళీలకి వైరు అల్లి అమ్మ చేసిన ద్రాక్ష గుత్తులు, పూసలతో అల్లిన కుర్చీలు, డ్రెస్సింగ్ టేబుల్, తిరుపతిలో కొన్న అద్దాల భరిణలు, అద్దాలు అద్దిన ఏనుగు అంబారీ, గడ్డం కింద చేతులు పెట్టుకు కూర్చున్న టోపీ సుబ్బళ్ళు, రంగు నీళ్ళ గిన్నెలోకి నిముషానికోసారి ఊగి తూగి ముక్కు ముంచే గాజు కొంగ, ఒళ్ళో తమ్ముడులాంటి పాపాయిని ప్రేమగా చూసుకుంటున్న అమ్మలాంటి బొమ్మ... నా కళ్ళు ఇలా మూసుకుంటే అలా గుర్తొచ్చి కళ్ళు తడిసేలా చేసేసే నా  బొమ్మలు..

అది మొదలు నవరాత్రులూ తాతగారి నిర్వహణలో "యాకుందేందు తుషార హార ధవళా.. " అని మొదలై
చౌషష్టి విద్యలకు శార్వాణివమ్మ!
బహుశాస్త్ర పుస్తక పాణి నీవమ్మ!
గాన విద్యల కెల్ల కల్యాణివమ్మ!  అని హారతివ్వడంతో  ముగిసే సరస్వతీ పూజ కొనసాగేది.

దసరా పండగ నాడు అమ్మమ్మ తన కూనల్ని, వాళ్ళ కూనల్నీ వెంటపెట్టుకుని, కదిలే బొమ్మల కొలువులా తరలి వచ్చింది. సాయంత్రం బొమ్మల కొలువుకు హారతిచ్చాక వైరు కుర్చీలో నన్ను, నా ఒళ్ళో తమ్ముడినీ కూర్చోబెట్టి హారతిచ్చారు. మంగళ హారతులు పాడారు. బొమ్మలాంటి బుజ్జి తమ్ముడినీ, కొలువు తీరిన నా బంగారు బొమ్మల కొలువునీ మహా గర్వంగా చూసుకున్న దసరా అది. "బొమ్మల కొలువు కోసమైనా ఇంటికో ఆడపిల్ల ఉండాలి." తృప్తి గా అంది అమ్మ. నా వైపు చూసి "అమ్మమ్మ పంపించిన బొమ్మలు బాగున్నాయని చెప్పావా?" అడిగింది. నేను ఏదో అనేలోపే "బొమ్మల కొలువుకీ, నువ్వు కన్న భడవలకీ కూడా దిష్టి తియ్ మా మందంతా వెళ్ళాక" తమ్ముడిని చంకనేసుకుంటూ అమ్మని ఆప్యాయంగా హెచ్చరించింది అమ్మమ్మ. ఇదంతా చూసి తృప్తి చెందిన నాన్నగారు మనసులోనే అమ్మమ్మని క్షమించేసి, ఓ దణ్ణం పెట్టేసుకున్నారు. అప్పటి నుంచీ ఏ పండగైనా మా ఇంట్లోనే అని మీకు వేరే చెప్పాలా!

అది మొదలూ ప్రతీ దసరా ఎన్నో కొత్త బొమ్మల్ని తెచ్చింది. బొమ్మల కొలువు పక్కన పార్క్ నిర్మాణం కోసం వేసిన ఆవాల మొక్కలు "ఎదిగాయా లేదా?" అని రోజూ నిద్ర లేచి చూసుకున్న ఆత్రుత గుర్తుంది. ఏడ్చి పేచీ పెట్టి కుట్టించుకున్న హంసల అంచు తెల్ల శాటిన్ పరికిణీ ఇంకా నన్ను హత్తుకుని రెపరెపలాడుతున్నట్టే ఉంది.

పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు

అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ, ఎర్ర కాగితం, చెమ్కీలు అంటించిన వెదురు విల్లు, బాణాలు పట్టుకొని వీధుల్లో తిరిగి మా పిల్ల సైన్యం దండిన  పైసలు గుర్తున్నాయ్. దసరా వెళ్ళిన మంగళవారం మా గ్రామదేవత "శ్రీ పైడిమాంబ" సిరిమాను సంబరాలకి సిధ్ధమై కిక్కిరిసిన వీధులూ, బంధువులతో నిండి కళకళ్ళాడిన ఇళ్ళూ గుర్తున్నాయ్. వీధుల్లో బారులు తీరిన జాతర సంబరాలు, పండగ మొదలు సిరిమాను సంబరాలయ్యేదాకా వీధుల్లో డప్పుల మోతల మధ్య ఆట కట్టే పులి వేషాలు, దొంగా పోలీస్ వేషాలు తలుపుల చాటున దాక్కుని, తల మాత్రం బయటకు పెట్టి భయం భయంగా చూడడం గుర్తుంది. పండగ వెళ్ళాక పాత బట్టలు  చుట్టుకుని భద్రంగా చెక్క పెట్టెల్లో మళ్ళీ దసరా కోసం ఎదురు చూస్తూ గడిపే మట్టి బొమ్మలు గుర్తున్నాయ్. పుస్తకాలకు మొక్కి పూసిన పసుపు బొట్లని చూసుకుంటూ, దసరా సరదాలని నెమరేసుకున్న పసిప్రాయం గుర్తుంది.

నులివెచ్చని చెమ్మ కళ్ళలో తేలేలా చేసే ఈ జ్ఞాపకాలు, వెన్ను తన్ని పుట్టిన తమ్ముడు, శరత్కాల చంద్రుడు మాత్రం ఎన్ని దసరాలు వెళ్ళినా, ఎన్ని దేశాలు దాటినా నాతోనే..

మీ అందరికీ దసరా శుభాకాంక్షలు!!
అక్షింతలు తెచ్చుకు రారా, దసరా బుల్లోడా!! జన్మదిన శుభాకాంక్షలు.


28 comments:

  1. My dear kothavakaya...

    Dasaraa puta manchi vindu bagundi mee chintapandu buttani inkaa ammakaniki pettaledaa? nee buttalo apple pallu unnayani (vihaari) garvamaa?
    mee DASARAH BULLODIKI manchi birthday kaanuka.

    Ever your, ENKEETEE.

    ReplyDelete
  2. Kothavakaya kunda says..

    nuvvu tammudi kanna pedda tellaga undeedanivikadu chinnappudu Ippudu nuvvu bettaranuko emaina naa chintapandu naaku muddu. nee apple butta neeku muddu....

    .........AMMA.(voy mani)

    ReplyDelete
  3. దసరా శుభాకాంక్షలు.
    అదరగొట్టేశారు, మొత్తానికి మీ బాల్యం పెద్ద బొమ్మల కొలువులాగుందే.
    నా చిన్నప్పుడు ఆయుధ పూజలో పుస్తకాలు పెట్టి ఇవే నీ ఆయుధాలనేవారు. పిచ్చి కోపం వచ్చేది. చీపురుపుల్లలతో విల్లు బాణాలు చేసి, ముంజి కాయలతో చక్రాల బండి చేయించుకుని(పక్కింటాయన ట్రాక్టర్ కి ఆయుధ పూజ చేసేవాడు) ఆయుధ పూజ చేసేవాణ్ణి. తర్వాత్తర్వాత విజయదశమిల్లో ఇంట్లో కొడవలి, కత్తి, కర్రల్లాంటివి పెట్టేవాణ్ణి. ఇప్పటికీ ఆ సరదా పోక అమృత్ సర్ వెళ్లినప్పుడు మాంచి కత్తి కొని తెచ్చుకున్నాను. ఆ కత్తి పెట్టుకుంటున్నాను మా పూజలో.

    ReplyDelete
  4. మీ తమ్ముడిగారికి జన్మదినశుభాకాంక్షలు.బాగుంది మీ బొమ్మల కొలువు.సో పండుగ వస్తే కానీ మీ దగ్గరనుంచి టపా రాదన్నమాట?

    ReplyDelete
  5. చాలా బావుందండి.
    నా తమ్ముడు తెల్లగా ఉంగరాల జుట్టుతో ఉండటం వల్లనేమో ఒక బొమ్మలా ఆడుకునేదాన్ని.
    నిజంగా అక్క అన్న మాట ఎంత సంబరంగా ఉంటుందో పిలిపించుకునే వాళ్ళకి తెలుస్తుంది.
    మీ తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. మధురమైన బాల్యం....మధురాతి మధురంగా చెప్పే విధానం...అద్భుతం. చూపులు అక్షరాల వెంబడి పరిగెత్తి, అంతలోనే అయిపోతాయేమో అని ఆగి ఆగి..ఆ బొమ్మల మధ్య, మీ సందులో, పందిరి మంచం పక్కన తిరిగి...గులాబీలు రుచి చూసి..బుజ్జి బాబును పలకరించి... ఈ దసరా రోజున ఇంత మంచి అనుభూతినిచ్చినందుకు..వదలి వెళ్ళాలంటే బాధగా ఉంది, మళ్ళీ ఓ నెల దాకా కనిపించరేమోనని... ధన్యవాదాలు.

    ReplyDelete
  7. బొమ్మల కొలువు జ్ఞాపకాలు బాగున్నాయి. :-)
    మీకు విజయదశమి శుభాకాంక్షలు.
    మీ తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. కొత్తావకాయగారూ, ఎప్పట్లానే అదరగొట్టేసారు.

    "అవమానభారంతో సందులో చీమల పుట్టలు చీపురుపుల్లతో పొడుస్తూ చాలా సేపు బాగా ఆలోచించాక"
    "మరో సారి ఆయన నవజాత సుపుత్ర సమేతంగా వర్ణ వివక్షకి గురయ్యారు."
    "మాస శివ రాత్రి, భగినీ హస్త భోజనం, ఋషి పంచకం, బలిపాడ్యమి, మాఘపాదివారాలు, తిధిద్వయం, బాక్సింగ్ డే మరియు టైలర్స్ డే"
    "అల్లుడొచ్చాడండీ, సంకష్ట హర చతుర్ధికి"
    ఇవి చదువుతూ పడీ పడీ నవ్వుకున్నా.

    "మోగని మట్టి బొబ్బిలి వీణ" ఇది మాత్రం నా మనసుని గాయపరించింది. బొబ్బిలిలో మట్టి వీణలు చెయ్యరు. షో కేసులో పెట్టడానికైనా సరే చెక్కవే అందంగా చెక్కుతారు. ఇదీ బొబ్బిలివీణకి ఇంకెక్కడో మట్టి తో చేసిన నమూన అంతేగా?

    ReplyDelete
  9. బావుందండి మీ బొమ్మల కొలువు .... జ్ఞాపకాల తలపుల నెలవు...........

    ReplyDelete
  10. మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు

    ReplyDelete
  11. కొన్ని చోట్ల నన్ను నేను చూసుకున్నాను.. మరీ ముఖ్యంగా చీమల పుట్టల దగ్గర..
    మీ నాన్నగారు పగసాధించిన తీరు మాత్రం అద్భుతంగా ఉందండీ.. మీ టపా గురించి కొత్తగా చెప్పాలంటారా? కొంచం తరచుగా రాస్తూ ఉండండి..

    ReplyDelete
  12. తేనెలో పంచదార కలుపుకొని చెరుకు రసాలతో తింటున్నట్టు ఉన్నాయి మీ ఈ జ్ఞాపకాలు

    ReplyDelete
  13. ఎందుకే ఇలా ఏడిపిస్తున్నావు? దసరాకి బొమల కొలువు ఎప్పుడూ పెట్టలేదు కానీ దసరా బాణాలు మాత్రం నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ బాణాల్లోకి రంగు రంగు కాగితాలు, పువ్వులు, చిన్న చిన్న కాయలు ఏరి తెచ్చుకోవడం ఒక పెద్ద ప్రహసనం. బాణం వదలగానే విరిసిపడే పువ్వులు, కళ్ళల్లో నవ్వులు.....వా ఆ నాకు కావాలి ఆరోజులు నాకు మళ్ళీ కావాలి. :(

    ఈ దసరా, అమ్మవారి పండగ సంబరాలతో పాటు నా పుట్టినరోజు పండగ ఇంకో బోనస్ నాకు. ఈ మూడు కలుపుకుని ఆ నెలంతా సంబరాలే! :)

    ReplyDelete
  14. !)" యధాలాపంగా ఆవిడ అన్న మాట తన శ్యామలఛ్ఛాయని చూసి వెక్కిరిస్తూ అన్నదేనని చిన్నబుచ్చుకున్నారు ఇంటల్లుడు."

    2) ""పట్నం సంతకి వెళ్ళాం. చింతపండు బేరమాడి డబ్బులిచ్చేసి బుట్ట తీసుకొని ఆటో ఎక్కామా, బుట్టలో చింతపండుకి బదులు ఇదిగో, ఈ పిల్లాడున్నాడు.

    3) " మరో సారి ఆయన నవజాత సుపుత్ర సమేతంగా వర్ణ వివక్షకి గురయ్యారు."

    ఏం క్రియేటివిటీ..........

    ReplyDelete
  15. ఏం చెప్పమంటారు? చెప్పడానికి నాకు మాటలు మిగల్లేదు.తెలిసినవన్నీ వాడేశాను. మీ అంత క్రియేటివిటీ లేదు కాబట్టి కొత్తవి కనిపెట్టలేను. బాగుంది టపా మీ బొమ్మల కొలువు లా.

    ReplyDelete
  16. @ ENKEETEE & AMMA: :) ధన్యవాదాలు.

    @ పక్కింటబ్బాయి: అవునండీ!ఆయుధపూజ అని పుస్తకాలతో సరిపెట్టుకోమంటే ఏడుపొచ్చేది. మీరు కత్తి కొనుక్కున్నారా! భలే! ధన్యవాదాలండీ.

    @ సునీత: నాకూ తరచుగా రాయాలని ఉందండీ! కుదరడం లేదు. తప్పక ప్రయత్నిస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.

    @ శైల బాల: సత్యం చెప్పారు. ధన్యవాదాలు.

    @ అవినేని భాస్కర్: :) ధన్యవాదాలండీ!

    @ జ్యోతిర్మయి: నెలలోపు మళ్ళీ వచ్చేందుకు తప్పక ప్రయత్నిస్తానండీ! ధన్యవాదాలు.

    ReplyDelete
  17. @ పద్మవల్లి: ధన్యవాదాలండీ!

    @ MURALI: మోగని వీణ నమూనాయేనండీ! బొబ్బిలిలో చేసినది కాదు. రథయాత్రలో అమ్మేవారు. ధన్యవాదాలు.

    @ Srikanth Eadara: :) ధన్యవాదాలండీ!

    @ Maddy : ధన్యవాదాలండీ!

    @ మురళి: మీరూ చీమల పుట్టల దగ్గరే ఆగిపోయారా? బాగుందండీ! :) నాకూ తరచూ రాయాలనే ఉంది కానీ, భవసాగరాలు అడ్డొస్తున్నాయండీ! ధన్యవాదాలు.

    @ శ్రీ: :) అమ్మో, అంత తియ్యదనమే! ధన్యవాదాలు.

    ReplyDelete
  18. @ ఆ. సౌమ్య: నాకు ఏడుపొచ్చి నిన్ను ఏడిపిస్తున్నాను. మళ్ళీ కావాలన్నా రానిదే బాల్యం, పిల్లా! ప్చ్.. ఏం చేస్తాం చెప్పు. నీ పుట్టిన రోజు కూడా ఈ నెలే కదూ!

    @ ఫణిబాబు గారు: :) ధన్యవాదాలండీ!

    @ బులుసు సుబ్రహ్మణ్యం గారు: మీ అభిమానానికి స్పందించేందుకు నాకూ ధన్యవాదాలన్న మాటొక్కటే మిగిలింది, సర్!

    ReplyDelete
  19. ఐ డీప్లీ హర్ట్...మళ్ళీ ఇక్కడ వర్ణ వివక్ష! చ్చ..నా లాంటి వాళ్ళు ఇలా బాధ పడవలసిందేనా...వాఅ..
    http://ennela-ennela.blogspot.com/2010/12/blog-post_19.html

    టపా అదిరిందండీ..మీ తమ్ముడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు...ఆ చేత్తోనే సౌమ్యకి కూడా జన్మ దిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  20. నా దసరా రోజులన్నీ గుర్తు చేసారు...:)
    మొలకలు వచ్చే వరకు నేను కంగారు పడ్తూనే ఉండేదాన్ని..:)
    కొత్త లంగా వేసుకుని మురిసిపోయేదాన్ని...!
    చాలా బాగుంది టపా :)

    ReplyDelete
  21. చాలా బాగుందండీ.. కూసింత ఆలస్యంగా చదివేను.
    దసరా ని ఇంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారని తెలీదు. నా చిన్నప్పుడు జరిగాయో లేదో గానీ..

    అద్భుతం గా రాసేరు.

    ReplyDelete
  22. బాగున్నాయి మీ విజయదశమి ముచ్చట్లు. చాలా బాగా వ్రాసారు.

    ReplyDelete
  23. వావ్! చాలా బాగుంది..

    ReplyDelete
  24. అసలు మీకూ నాకూ ఎన్ని కామన్ పాయింట్లున్నాయో .. ఒకేళ నాకు చెల్లెలిగా పుట్టి తప్పిపోయి విజయనగరంలో అచ్చంగా మా యింటికి మారురూపంగా ఉన్న మరో ఇంటో పెరిగారో ఏవిటో ..

    ReplyDelete
  25. @ ఎన్నెల: మీ టపా చాన్నాళ్ళ క్రితమే చదివానండీ! నలుపు నారాయణుడు మెచ్చు. నాకు నల్లని వాళ్ళంటే ప్రత్యేకమైన అభిమానం. మీరు అసలు నొచ్చుకోకండి. :) ధన్యవాదాలు!

    @ kiran: :) ధన్యవాదాలండీ!

    @ రాజ్ కుమార్: ధన్యవాదాలు!

    @ కృష్ణప్రియ: ధన్యవాదాలు!

    ReplyDelete
  26. @ కొత్తపాళీ: :) అంతేనంటారా? భలే!! మీ పుట్టిన రోజూ దసరానాడేనా ఏంటి? ధన్యవాదాలు!

    ReplyDelete
  27. అద్భుతం గా వున్నాయండీ మీ జ్ఞాపకాలు..ఇంకా ముందు వెనకా మీరు రాసిన టపాలు ఇవాళే చదివాను.

    ప్రతీసారి india వెళ్ళేటప్పుడు నా రాతలని ప్రింటు అవుట్లు తీసి పట్టికెళ్ళి మా నాన్నగారికి ఇస్తూ వుంటాను. ఈ సారి మీవి కూడా తీస్కెళ్తాను...ఆయనకి నారాతల కన్నా మీవే నచ్చేస్తాయన్న భయం వున్నా ఆయన enjoy చేస్తారు....చూసారా ఎంత త్యాగం చేస్తున్నానో :)

    ReplyDelete