Friday, June 24, 2011

ఇస్తినమ్మ వాయినం (నాన్నగారి నోబెల్ శాంతి బహుమతి రెండో భాగం)

"అమ్మాయీ! రేపే నీకు పెళ్ళి చూపులు ." చెప్పారు నాన్నగారు.
"పాట పాడేదా, నాన్నగారూ!"
"తప్పదామ్మా?" బితుకు బితుగ్గా అడిగారు.
"మీరు అంత బతిమాలాలా, తప్పకుండా!" అభయం ఇచ్చాను.
"అహనా పెళ్ళియంట కాదుగా!" దొంగాడా.. కరవకురా.. అన్నట్టు అడిగారు.
"అది నిశ్చితార్ధం అయ్యాక కదా!" అనుమానం వెలిబుచ్చాను.
"హమ్మయ్య..!!" అని గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తూ ఆ రాత్రి గడిపేసారాయన.

చిన్నప్పటి నుంచి నాకు మోళీ చేసే వాళ్ళన్నా, కొబ్బరి చెట్లెక్కే వాళ్ళన్నా, నూతిలో కవ్వు తీసే వాళ్ళన్నా, ఈల వేసే వాళ్ళన్నా భలే ఇష్టం. మా కుటుంబ సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని, నా లిస్టులో వీరిలో అందరినీ కొట్టెయ్యగా ఈల వేసే మొగుడిని మాత్రం తీసుకొస్తానని నాకు మా తండ్రి గారు ఎప్పుడో చిన్నప్పుడే మాటిచ్చారు. అది మొదలు నేను, మా నాయనమ్మ నూతి గట్టు మీద జారి పడినప్పుడూ, ఎదురింటి కుర్రాడు కనిపించినప్పుడు, మా పక్కింటి మాధవి నా కోసం దొంగతనంగా జీడిపప్పు తెచ్చిపెట్టినప్పుడూ ఈలలేస్తూ కాబోయే పతివ్రతనని లోకానికి గుర్తు చేస్తూ వచ్చాను.

పెళ్ళివారొచ్చారు. పెళ్ళికొడుకు ఇంటికి మూడో కొడుకుట. మందీ మార్బలంతో వచ్చిన వారిని చూసి మా తమ్ముడు జాలిగా నవ్వుకుంటూ అహ్వానించాడు. కుశల ప్రశ్నలు, కాజా కారప్పుసలు అయ్యాక నన్ను పిలిచారు. వెళ్ళి కూర్చున్నాను. అవధానం మొదలయింది.

"పేరేంటి?"
చెప్పాను.
"సంగీతం నేర్చుకున్నావామ్మా?"
"చదువు పాడయిపోతుందని నేర్పించలేదండీ." మా నాన్నగారు అందుకున్నారు.
"ఎంత వరకూ చదువుకుందో?"
"అబ్బే, డిగ్రీ అయ్యాక తల్లికి తోడుగా ఇంటి పట్టునే ఉందండీ."
"వంటా వార్పూ.."
"అబ్బే, పిల్లకి ఇంటి పనితో వంటకి ఖాళీ ఏదీ..!"
"ఓహో, అయితే ఇల్లంతా చక్కబెడుతుందన్నమాట."
"చక్కగానే తీర్చి దిద్దుతుందండీ..( తిలకం)"  - అశ్వథ్థామ హతః
"కుట్లూ అల్లికలూ.."
"దండగ ఖర్చు కదండీ? అయినా ఈ రోజుల్లో అన్నీ రెడీమేడ్ కదా!"

.....

"పోనీ, కొంచెం పాడనా?" నెమ్మదిగా కలుగజేసుకొని అడిగాను.
"పిల్ల పాడుతుందిట్రోయ్.. సినిమా లోదామ్మా?"
"ఊ" సిగ్గుగా చెప్పాను.

అప్పటిదాక ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒక్క క్షణం బిక్కచచ్చి స్థంభించింది. నాన్నగారు మినహా మిగిలిన మా కుటుంబ సభ్యులు మడుగులో జలస్థంభన చేస్తున్న సుయోధనుడిలా మౌనంగా, నవరంధ్రాలు బంధించి యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు. "ఎట్నుంచి ఎటొచ్చినా నేనున్నాననే" కృష్ణ పరమాత్మలా మా నాన్నగారు ప్రథమ చికిత్స ప్రథమంగా ఎవరికి అవసరమవుతుందా అని అలోచించుకుంటూ సిధ్ధమయిపోయారు.

అష్ట దిక్ కుంభి కుంభాగ్రాలపై మన సింహ ధ్వజముగ్రాల చూడవలదె
గగన పాతాళ లోకాల సమస్త భూతకోటులు నాకె మ్రొక్కవలదె
ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదె
"హయ్ హయ్ ఘటోత్కచ"  "జై హే ఘటోత్కచ" అని దేవ గురుడె కొండాడవలదే
ఏనె ఈయుర్వినెల్ల శాశించవలదె
ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె
ఏనె మన బంధుహితులకు ఘనతలన్ని కట్టపెట్టిన ఘనకీర్తి కొట్టవలదే... ఏ .. ఏ..

"సయ్.. సయ్య్.. సయ్య్.. " ఈల వినబడి తన్మయత్వం నుంచి తేరుకొని, ఎస్వీ రంగారావు గారి ఆత్మకి ఉద్యాపన చెప్పి, కళ్ళు తెరిచి చూసాను. మందు తిన్న ఎలకపిల్లల్లా పడ్డవారు పడగా మేరునగ ధీరుడిలా నిఠారుగా నిలబడి పెళ్ళి చూపులకొచ్చిన ఆరడుగుల అబ్బాయి, వారి చెల్లెలు మాత్రం నావైపు చూస్తున్నారు. నాకు వినిపించిన ఈల ని పదే పదే గుర్తు చేసుకుంటూ సిగ్గు ముంచుకు రాగా లోపలికి పరుగు తీసాను.

పడిన వారిపై చెరుకు పానకం కళ్ళాపి జల్లి నిద్రలేపాడు మా తమ్ముడు. శక్తి బారిన పడ్డ లక్ష్మణ స్వామిలా చేష్టలుడిగిన అబ్బాయికి అమృతం లాంటి ఫిల్టర్ కాఫీ వాసన చూపించి మామూలు మనిషిని చేసారు మా నాన్నగారు. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఈల వేసిన పదహారేళ్ళ "సీత" అనబడు, సదరు పిల్లాడి చెల్లెలికి చెయ్యి నూట పదహార్లిచ్చి నా దగ్గరికి పంపేసారు. మూర్చ పోయామని తెలుసుకోలేకపోడానికి పెళ్ళి వారు వెర్రివారు కాదు కానీ, అంతా కృష్ణ మాయ. చూపులకి వచ్చిన అబ్బాయికి నేను తీసిపెట్టుకున్న ఫిల్టర్ డికాషన్ తో కాఫీ చేసిచ్చి జీవితాంతం ఇంత చక్కటి కాఫీ ఉదయాన్నే తాగచ్చని, పుచ్చపువ్వు లాంటి నా మొహం కిటికీ లోంచి చూపిస్తూ, మేడ మెట్ల మీద కూర్చోబెట్టి నచ్చచెప్పారు నాన్నగారు. "గేలం మహత్యం"..రెండు నెలల్లో పెళ్ళి ముంచుకొచ్చేసింది.

పెళ్ళి పీటలమీద కూర్చున్నప్పుడు అబ్బాయిని ఈల వెయ్యమని వేధించకుండా, వేమురి బలరాం గారి పై ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడి తెచ్చి మరీ,,రాబోయే వారం స్వాతి సంచిక తెప్పించి నా మధుపర్కం కుచ్చెళ్ళలో పెట్టి, నా దృష్టి మళ్ళించి పెళ్ళి జరిపించారు మా తండ్రి గారు. ఇప్పటికీ నాకు అర్ధం కాని ఒకే ఒక విషయం ఏమిటంటే, అప్పగింతలు నా బదులు మా ఆయన్ని ఇచ్చారేంటో విచిత్రంగా!

నేను పెట్టె సర్దుకుంటూ ఉండగా వచ్చి నా తెంపరి తనాన్ని, ముక్కు మీది కోపాన్ని గూట్లోనో, ఉట్టి మీదో వదిలేసి వెళ్ళకపోతే నా మాయా బజార్ డివీడీ ఇచ్చేది లేదని బెదిరించి మాట తీసుకున్నారు నాన్నగారు. ఉదయం స్నానం చెయ్యగానే, సంజె దీపం పెట్టాక విధిగా నేను భక్తితో వల్లె వేసుకొనే పద్యాలను, మనసులోనే పాడేసుకుంటానని కత్తి వీర కాంతా రావు గారి మీద, మధుబాబు షాడో మీద, పనసపొట్టు కూర మీద ఒట్టు వేయించుకున్నారు. నా కొత్త కాపురం ఓ గాడిలో పడేసరికి మా చిన్నాడపడుచు లక్షాధికారిణి అయిపోయి, వైజాగ్ అశీల్ మెట్ట జంక్షన్ లో రెండు షాపులు, ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కొనేస్కుంది. మా నాన్నగారు భారత ప్రభుత్వం దగ్గర అత్యధిక పర్సనల్ లోన్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగిగా రికార్డు సృష్టించారు.

ఈల వేయడం రాని వాడికి ఇచ్చి నా గొంతు కోసినందుకు పరిహారంగా, మా నాన్నగారి చేత అయిదు దినపత్రికలు, పదహారు వార పత్రికలు, ఎనిమిది మాస పత్రికలకి, పన్నెండు అంతర్జాతీయ సైన్సు జర్నళ్ళకి, ఇంటిల్లిపాది పేరా తలా జీవిత చందా కట్టించి నా దఃఖాన్ని దిగమింగి కాపురం చెయ్యసాగాను.

ఓ మూడు కేలండర్లు తిరిగాయ్. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరీ ప్రశాంతంగా ఉన్నట్టనిపించి, "యోగక్షేమం వహామ్యహం" అని అభయ హస్తం చూపించి, నేను పతీ సమేతంగా వలస వచ్చాను. ఏడు వారాల నగల్ని ఓ శనివారం సాయంత్రం దిగేసుకొని వాల్ మార్ట్ కెళ్ళిన నన్ను చూసి "యూ లుక్ ప్రెట్టీ" అని షేక్ హాండ్ ఇచ్చాడో తెల్లబ్బాయి. వాడి ఆత్మీయతకి మురిసి ఈల వేసి, వాడి జబ్బ మీద ప్రేమ గా ఓ చరుపు చరిచానంతే! మరీ సుకుమారం సుమండీ వీళ్ళూ! భూన భోనాంతరాలు దద్దరిల్లేలా ఒక్కరుపు అరిచి గుడ్లనీరు కుక్కుకుంటూ పారిపోయాడు ఆ మాత్రానికే! అయినా వాల్ మార్ట్ కంటే మా ఆయనకి టార్గెట్టే నచ్చుతుండిలెండి.

అప్పట్లోనే, ఇంకోసారి మా ఎదురింటావిడ గోరింటాకు పెడతానందని వెళ్ళాను. ఈనెలు తీగలు వేసి నా చెయ్యంతా ఖరాబు చేసింది. "సరే, తెలియదేమోలే! చందమామ, చుక్కలు చూపిద్దామని" ఆవిడ చేతి మీద పెట్టి చూపించానంతే. ఆవిడకి ఎంత కృతజ్ఞత అంటే, నాలుగు నెలలదాక గోరింటాకు చెరిగిపోతుందని చేతికి క్రేప్ బేండేజ్ తియ్యకుండా తిరిగింది. పైగా అపార్ట్మెంట్స్ లో అందరికీ ఎంత గౌరవంగా పరిచయం చేసేదో నన్ను.

నా కీర్తి ప్రతిష్ఠలు కళ్ళారా చూస్తారని మా తలిదండ్రులని పిలిపించాం. ఈ సందట్లో నాకు సుపుత్రోదయం జరిగింది. మా వారు పేరు ఎంచి పెట్టుకున్నారు. నాకు ఇంకో పేరు నచ్చింది. పతితో జగడమెందుకని, నేను చెప్పిన పేరు పెట్టించకపోతే, ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ఈసారి "ధారుణి రాజ్యసంపద మదంబున.. పాడెద బాలసారెలో..ఓ.. ఓ..ఓ.." అని మా తండ్రి గారికి సవినయంగా మనవి చేసుకున్నాను. తప్పేదేముందని, చుట్టు పక్కల వారిని పిలిచి పిల్లాడి పేరు చీటీలలో రాసి ఓటింగ్ పెట్టించి, దేశ క్షేమాన్ని కోరి రిగ్గింగ్ చేసి మరీ నాన్నారు నన్ను గెలిపించారు.

పిల్లాడు యథాశక్తి గిలక్కాయలు చూపరుల టెంకి పగిలేలా విసురుతూ, ఎత్తుకున్నఇరుగు పొరుగు వారి వేళ్ళను బాల భీముడి బ్రదర్ లా విరిచి ఆడుకుంటూ వాడి అమ్మ కడుపు చల్లగా దిన దిన ప్రవర్ధమానమవుతున్నాడు. మూడో నెల వచ్చిందని, "ముద్దకుడుముల వాయినానికి" ముత్తయిదువులని పిలుద్దామని ఇరుగు పొరుగులకి వెళ్తే, అందరూ "జనవరిలో బిగుసుకున్న నయాగరా చూసేందుకు వెళ్ళాం. ఇంట్లో లేమని" చెప్పారు తలుపు వెనక నుంచి.

ఇన్ని ఆగడాలు భరించిన మా నాన్నగారి అల్లుడు చంగల్పట్టు శాంతారాం, ఇక సహించలేక స్థంభోద్భవ నార సింహుడై రణగోల చేసారు. "ఏం చేస్తారో, తండ్రీ, కూతురు కలిసి ముగ్గురు ముత్తయిదువులను పట్టుకు రండని" నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని శనివారం ఉదయం బాలభోగం వేళకి "శివ విష్ణు టెంపుల్ ఆఫ్ డేటన్" లో దింపి వెళ్ళిపోయారు.

"నాకేల చింత.. పక్కన నాన్నారుండగా!" అని భారం ననుగన్న మా నాన్న మీద వేసి దొరికిన కొబ్బరి ముక్క తింటూ కూర్చున్నాను. పలకరిస్తే జనం పారిపోసాగారు. అలా చాలా మందిని భయపెట్టాక, ఉస్సురంటూ నా పక్కన చతికిల పడ్డారు తండ్రి గారు. దూరంగా జనాలను పలకరించి భయపెడుతున్న ఇంకో ఇద్దర్ని"అమ్మలూ, అదిగో ఇంకో ముద్దకుడుముల వాయినం వాళ్ళే!" అని ఉత్సాహంగా చూపించారు. వారి కదలికలను గమనించి "అబ్బే, కాదని" వారెవరో చెప్పాను. ఓ రెండు క్షణాలు ఆలోచించి, పక్కనున్న "ఆలయానికి దారి" బోర్డు పీక్కొచ్చి దాని మీద రెండు వాక్యాలు రాసి పట్టుకు నిలబడ్డారు నాన్నగారు. అటు వెళ్తూ అది చదివిన ఓ ముగ్గురు ఆడవాళ్ళు మర్నాడు "వాయినం" తీసుకొడానికి మా యింటికి వచ్చి కథ సుఖాంతం చేసారు. ఇప్పుడు చెప్పండి. మా నాన్నగారిని మించిన శాంతి కాముకులు ఎవరుంటారు? ఏంటీ?ఇంతకీ ఆయన రాసిన వాక్యాలేమిటంటారా?

" amway వాళ్ళం కాదు. ముద్దకుడుముల వాయినానికి మా ఇంటికి వస్తారా?"

29 comments:

  1. వీర ఘటొత్కచి గారూ కన్నవారికి కాదు కట్టుకున్నవారికి ఇవ్వాలి ఇస్తే గిస్తే, అబ్బే మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు, నెను ఇక్కడ లేను!!

    కధనం నడక అద్భుతం. Keep it up:)

    ReplyDelete
  2. తోటరాముడి ఈదలేని గోదావరి తరువాత(బహుశా 5,6 మాట్లు చదివుంటాను), ఈ మధ్య కాలం లో, రెండో మాటు నేను చదివిన టపా ఇదే, అదీ ఒక పావుగంటలో. ఇంకెన్ని మాట్లు చదువుతానో.

    నోబుల్ శాంతి బహుమతి మీ నాన్నగార్కి, చంగల్పట్టు శాంతారాం గారికి జాయింట్ గా ఇస్తే బాగుంటుందేమో నని సలహా ఇవ్వ దలచు కున్నాను. మీ సుపుత్రుడి చేత గిలక్కాయలు విసిరిస్తానంటారా, నేను పారి పోతున్నాను.

    ReplyDelete
  3. << ఈల వేయడం రాని వాడికి ఇచ్చి నా గొంతు కోసినందుకు పరిహారంగా>>
    వా వావా... నాకెందుకు ఈల వెయ్యడం గురించి గుర్తు చేసారిప్పుడు... :(( ప్చ్! అయ్యయ్యో ..హత విధీ! అయినా, మన పవిత్ర భారత దేశంలో ఈల వేసే అబ్బాయిలకి కరువెంతో కదా పాపం! :D
    చాలా చాలా బాగా రాశారు.. పొద్దు పొద్దున్నే తెగ నవ్వించారు.. :))

    ReplyDelete
  4. చంపేసారండి. బ్లాగుల్లో మరలా స్వర్ణయుగం మొదలయినట్టుంది.

    ReplyDelete
  5. Maa naanna gaariki NO BELL saanthi bahumathi part one bagundi part two kuuda bagundi mari part three eppudu ... waiting for it ......

    .............Noble santhi graheetha

    ReplyDelete
  6. ఓర్నాయనోయ్.. ఇదేం పోస్టండీ? ఇలా రాసేసారూ? ఆఫీస్ లో బాగోదని ఊరుకున్నా గానీ.. కిం.ప.దొ.న పోస్ట్ అండీ..
    >>అష్ట దిక్ కుంభి కుంభాగ్రాలపై>> ఇక్కడ పిచ్చి పిచ్చి గా నవ్వానండీ..పంచ్ లు ఇరగదీసారు.
    మీ బ్లాగ్ ఇదే మొదటిసారి చూడటం. ఈ ఒక్క పోస్ట్కీ మీకు ఫ్యాన్ అయిపోయాను. త్వరగా మిగిలిన పోస్ట్లన్నీ చదివేస్తా..

    ReplyDelete
  7. కొత్త ఆవకాయ్ గారు మీ నాన్నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ మీరు పంపిన దరఖాస్తు ఇప్పుడే అందింది. మా కమిటీ దీన్ని సీరియస్ గానే పరిశీలిస్తోంది . కొత్త ఆవకాయ ఫోటో చూసి మరి ఇంత పిసినారి తనం ఏమిటి అంత చిన్న పాత్రలో ఆవకాయ అందరికీ సరిపోతుందా ? అని అనుకున్నాను.

    ReplyDelete
  8. చాలా చాలా బాగుంది

    ReplyDelete
  9. భలే నవ్వించారు :)

    ReplyDelete
  10. అనానిమస్ గారు,
    కట్టుకున్నాయనకి అవార్డులెందుకూ! నేను చాలనా?
    ధన్యవాదాలు.

    @ వేణు శ్రీకాంత్ గారు,
    సంతోషం. ధన్యవాదాలు. :)

    ReplyDelete
  11. @ బులుసు వారు,
    మీ వ్యాఖ్య చదివి భలే ఆనందం అనిపించింది. గిలక్కాయలు మీమీదకి రావని నాదీ పూచీ. మీరు నా బ్లాగు వదలకండి, చాలు. :)
    ధన్యవాదాలు.

    @ మధుర వాణి గారు,
    మీకూ ఈల వేసే అబ్బాయి దొరకలేదా! హాచ్చెర్యం!! సర్లెండి. మన ఈల మనమే వేసేస్కుందాం. ధన్యవాదాలు.

    @ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు,
    ధన్యవాదాలండీ!

    ReplyDelete
  12. @ మురళి గారు,
    మీరు మరీను. మునగచెట్టు ఎక్కిస్తే మహా కష్టమండోయ్.
    సంతోషం. ధన్యవాదాలు.

    @ ముసుగేసుకున్న నాన్నగారు,
    మూడో భాగం అక్కర్లేకుండానే మీకు బహుమతి ఇచ్చేద్దామంటున్నారండోయ్!

    @ మాలా కుమార్ గారు,
    చాలా థాంక్సండీ!

    ReplyDelete
  13. @ రాజ్ కుమార్ గారు,
    మిరు ఇదేనా నా బ్లాగ్ చూడడం. నచ్చినందుకు చాల సంతోషం. కిం. ప. దొ. న. కు ఇంకా సంతోషం. జై జై ఘటొత్కచ!

    @ బుధ్ధా మురళి గారు,
    అయ్ బాబోయ్, "జనాంతికం" మురళి గారా! ఆ రాచ్చిప్ప లో కొత్తావకాయ మీ ఒక్కరికేనండీ! వచ్చిన వారికి వచ్చినట్టు తాజా గా భాండంలోంచి తీసి ఇస్తూంటా! భాండం అక్షయపాత్ర. మరేం పర్లే!

    సీరియస్ గా పరిశీలించి ఆ నొబెల్ ఏదో ఇచ్చేస్తే, నేను ఓ చిన్న జాడీడు ఆవకాయ తో కలిపి గిఫ్ట్ పేక్ చేయించి మా నాన్నారికి పంపేస్తా!

    ReplyDelete
  14. @ రత్న మాల గారు,
    సంతోషం అండీ! ధన్యవాదాలు.

    @ మురారి గారు,
    వచ్చారా! నచ్చిందా? చాలా సంతోషం. ధన్యవాదాలు. :)

    ReplyDelete
  15. హహహ చాలా బావుంది...నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన టపా ఇది. చాలా సున్నితంగా హాస్యాన్ని పండించావు. భేష్!
    పాట పాడమంటే అష్టదిక్కుంభి పాడావా...నాతల్లే :)) అప్పటికీ మీ నాన్నారికి అనుమానమొచ్చింది అహనా పెళ్ళట అంటావేమో అని. పాపం, ఆయన నీ సంగతి గ్రహించుకోలేకపోయారు...ఈ పద్యం మరచిపోయినట్టున్నారు.

    మీ నాన్నారి నోబెల్ బహుమతి సంగతేమోగానీ తమ అరివీర భయంకర ప్రతాపాలన్నీ చదివాక బ్లాగు జనాలు పారిపోతారేమో తస్మాత్ జాగ్రత్త!

    బ్లాగరులారా గమనిక:
    ఈ కొత్తవయాకయతో జర భద్రం....తన సంగతి రెండు టపాల్లో చెక్కుచెదరకుండా చెప్పిందిగా....మీరేమైనా వేషాలు వేసారో టెంకి పగిలేలా ఓ టపా విసురుతుంది....జాగ్రత్త! ముందే హెచ్చరిస్తున్నా...తరువాత ఏం జరిగినా నా పూచీ లేదు. ఆ బ్లాగరు సనగతి తెలిసి కూడా మాకు చెప్పావు కాదేం సౌమ్యా అని అడిగితే మాత్రం నాకు కోపమొస్తుంది ఆ. :)

    ReplyDelete
  16. chala baga rasthunnavu. thega navvukuntunnanu.

    ReplyDelete
  17. కొత్తావకాయ గారు మీకు కొంచం నిరాశ, కొంచం సంతోషం కలిగించే రెండు వార్తలు.ముందు ఏది చెప్పమంటారు. సరే రెండు కలిపే చెప్పేస్తాం. మీ నాన్న గారికి నోబెల్ బహుమతి ఇవ్వడం లేదు అయితే మీరు రాసిన విషయాలను క్షున్నంగా అధ్యయనం చేస్తే తేలిందేమంటే.. మీ నాన్న గారు పాతికేళ్ళు భరించినందుకు మీరు నోబెల్ అడగడం న్యాయమే కానీ మరో మూడు పాతికల ఏళ్ళు భరించాల్సిన మీ వారికి నోబెల్ ఇవ్వడం న్యాయం అని మా అభిప్రాయం.

    ReplyDelete
  18. కొత్తావకాయ్..గారండోయ్...
    ఇన్నాళ్ళూ నాక్కనపడకుండా ఏ జాడీలో దాక్కున్నారండీ.....,నసాళానికంటేలా భలే ఘాటుగా, మనసునిండుగా, కమ్మకమ్మగా..చవులూరిస్తూ...యమాగా ఉందీ మీరాత....ఇక నేను మీకు ఫానూ, ఏసీ..అన్నీను.

    ReplyDelete
  19. :))) మీ కుటుంబ సాంప్రదాయాన్ని దృష్టి లో పెట్టుకుని మీరు లిస్టు లోంచి కొట్టేసిన వారు.. LOL. చిన్నప్పుడే మాటిచ్చి తప్పిన తండ్రి :)), కాబోయే పతివ్రత గా ధర్మాన్ని నెరవేర్చిన మీరు.. హిలరియస్!

    ReplyDelete
  20. చక్కని భాష, అంతకంటే చక్కని రచనా శైలి. మళ్ళీ చెప్తున్నానేమో గానీ మీ తెలుగు చాలా బాగుంది.

    ReplyDelete
  21. @ శిశిర గారు! చాల ఓపికగా చదివి వ్యాఖ్యలు రాస్తున్నందుకు ధన్యవాదాలు. So nice of you! :)

    ReplyDelete
  22. చాలా బాగ వ్రాసారు!
    I am feeling privileged to know you

    -sandhya

    ReplyDelete
  23. Idi chaala anyayamandee! Ne raasina comment ippatikee atchu padaleduppatikee atchu padaledu

    ReplyDelete
  24. అయ్యో మీరు చాలా పాపం నాలానే!!!మా ఆయనకీ ఈల వెయ్యటం రాదు.....చాలా బాగుంది మీ నాన్నకి,వారి అల్లుడిగార్కి కలిపి ఇవ్వాలేమో నోబెల్ ...ఆ ఆ ఆ మీకుఇష్టం అయితేనే సుమా!!లేదా అయితే ఒకే>>

    ReplyDelete
  25. అమ్మోఅ నవ్వి నవ్వి పొట్ట నొప్పొచ్చేసింది...మధ్యలో నా roomie వచ్చి అనుమానంగా చూసెళ్ళింది కూడా...

    I agree with subhadra...:)

    ReplyDelete