Monday, January 28, 2013

ఎవరీ పతంజలి!!

అలివిని బలివి కొడితే బలివిని బ్రహ్మదేవుడు కొట్టాట్ట! "నా ఉదయపు కాఫీ కప్పునీ, అర్ధరాత్రి ముసుగేసుక్కూర్చుని చూసే కామెడీ సినిమానీ తప్ప దేన్నీ నేను సీరియస్ గా తీసుకోనండీ!" అని జోకాననుకుని ఎవరితోనో ఇలా ప్రగల్భాలు పోయానో లేదో, అలా ఠపీమని మొట్టికాయ తిన్నాను. అది నాకు కపాల మోక్షాన్నిచ్చినంత పనిచేసిన విధంబెట్టిదనినా..

మా ఇంటి పంచపట్టున గోడకి వేలాడే సన్మానపత్రం చాలా బోలెడు సార్లు చదివుంటాను. పటం కట్టించిన అద్దం వెనక సాలెగూళ్ళని చిత్రంగా చూస్తూ.. కొంచెం కొంచెంగా చెద కొరికేస్తున్న కాగితపు వైభవాన్ని లెక్కేస్తూ.. అటొచ్చీ ఇటు పోయీ ఒక్కో అక్షరం నవులుతూండేదాన్ని. మా తాతగారి పదవీవిరమణ మహోత్సవానికి స్కూలు వాళ్ళిచ్చిన పత్రమది. వందిమాగధులు "రాజాధిరాజ రాజమార్తాండ.. గండరాయవర.." అని ఉబ్బేసినట్టూ సంస్కృతసమాసభూయిష్టమైన సంబోధనలతో హడావిడిగా ఉండే ఆ పత్రంలో.. ఓ పిలుపు మాత్రం మహ నచ్చేసేది. "చతురవచోనిధీ..!"

గురితప్పని చమత్కారబాణాలు సంధించగలిగే విలుదాలుపులెంతమంది!? ఆ పత్రంలో మిగిలిన పిలుపుల్లో, మాటల్లో నిజానిజాలెన్నో కానీ, ఈ పిలుపు మాత్రం పచ్చినిజం. చమత్కారం చెమక్కుమని మెరిసే మాట తీరాయనది. కానివారిపై సుతిమెత్తని వ్యంగ్యాస్త్రాలు సంధించి, వారు "మనమీదేనర్రోయ్!" అని తేలుకుట్టినదొంగల్లా జారుకునేలా చేసే నైపుణ్యం ఆయన సొత్తు. అంతేనా.. కబుర్లు పొడుపుకథల్లా ఉండేవి. భలే బావుండేవి. నిండుసభలో మాట్లాడుకున్నా నర్మభాషణ చేసి విషయం అందజేయగలగడం, శరములవలెనే చతురోక్తులనూ చురుకుగ విసిరే నైజమూ.. ఆషామాషీ యేం కాదు! అలా అని మాట సొగసు.. వసివాడకూడదు. పలుకు పరుషంగా గుచ్చుకోకూడదు. ఆ సమతుల్యం తెలిసిన వారి ఒక్కోమాటా పటం కట్టించుకోదగినదే! అలాంటి మనిషిని మరొకరిని చూశాను. పూర్తిగా కాదు.. మచ్చుకే! పతంజలిని..

పూల తీగె కాళ్ళకు చుట్టుకుని కారెనుబోతు ఆగిపోయినట్టు ఆ వేణునాదం విని విశ్వనాథం ఆగిపోయాడు.
జనప్రవాహం పై నుంచి వంతెన. దానిమీద రైలు పట్టాలు.
వంతెన గోడ నానుకుని ఒక గుడ్డి మనిషి.
అతని బండపెదవుల నానుకొని ఎప్పుడూ ఒక మురళి..
ఆ మురళి రంధ్రాల నుంచి కాటుక పొగలై, సర్పాలై జరజర పాకివచ్చే పాటలు.
విశ్వనాథానికి మోటరుసైకిలు చప్పుడులో ఆ పాటలు ఎప్పుడూ వినిపించవు.
వంతెన పై నుంచి వెళ్ళిపోయే రైలూ ఆలకించదు.
వంతెన కింద నుంచి ప్రవహించే జనమూ ఆలకించరు. మోటరు సైకిల్ మీద వెళ్ళిపోయే విశ్వనాథం ఎన్నడూ వినలేదు.
గుడ్డివాడి పాటలు గరికపూలై ఆ రోడ్డు నిండా గుట్టలు గుట్టలైతే విశ్వనాథం వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు.
గుడ్డివాడి పాటలు సీతాకోకచిలుకలై మబ్బుల్లాగ వీధినంతా ఆవరిస్తే విశ్వనాథం వాటిని చీల్చుకుని వెళ్ళిపోతాడు.
ఒకరోజు వంతెన దగ్గర అతని మోటరు సైకిల్ ఆగిపోయింది.


ఆపై ఏమయ్యిందో.. అదే కథ. చూపున్న పాట కథ.




ఒక్ఖ కథ చదివి, కొన్ని వ్యాసాలు చదివీ, అతని పై రాయబడిన ఎలిజీలు చదివీ.. ప్రేమించాల్సిన పని లేదు. కానీ.. నా కప్ ఆఫ్ టీ కాని దానిని నా చేత వైనంగా తాగించేసిన అతని చాతుర్యానికి ముచ్చటగా ఉంది. పదిలంగా కాపాడుకొస్తున్న నా సున్నితత్వాన్ని.. ఉహూ సున్నితత్వమనే ముసుగేసుకున్న "లోకాన్ని చూడలేనితనాన్ని" తుత్తునియలు చేసేసి ఏం చూపించేస్తాడో అని భయమేస్తోంది. ఇన్నాళ్ళూ దిగనా, దూకనా అనే సంశయమే.. ఇప్పుడు దబ్బున తోసేశాడు. ఇక ఈదక తప్పదు.

ఇన్నాళ్లూ మురళి అంటే మధుమురళే!

కాలు చల్లదనాలొ!
కనలు తీయదనాలొ!
వలపు పిల్లన గ్రోవి
పిలుపులో! సొలపులో!


అలాంటిది ఇప్పుడు కాటుకపొగలాంటి పాట కమ్మేస్తున్న ఆ గుడ్డివాడి మురళి.. ఆ మురళిలో పతంజలి మ్రోగించిన పాట కూడా వినిపిస్తోందేవిటో! సరే తప్పేదేముంది కనుక!

ఇంతందంగా పఠితను కట్టిపడేయగల కలం.. ప్చ్..  కారణజన్ముడేమో! అనుకుంటూ పతంజలి తలపులు తిరగేసానా.. మొదటి పేజీల్లోనే ఆగిపోవాలనిపించింది. కారణం ఈ వాక్యాలు..

"మరణాలకు ముందు మాటలు వెనకమాటలు అక్కర్లేదు, అవసరమూ కాదు. మరణించినవారిని మాటల్లో, మాటల్తో బ్రతికించుకునే ప్రయత్నమే ఇది. ముందుకు మిగిలాడు పతంజలి. మనం వెనక మిగిలాం అంతే."
~ విశ్వేశ్వరరావు


నా స్వభావసిధ్ధమైన బెరుకు ఆపింది నన్నక్కడ. "పతంజలిని పూర్తిగా చదవకుండా.. ఇవన్నీ చదవాలా!" అని. కానీ కళ్ళు ముందుకు పరిగెట్టాయ్.. అక్కడో అయస్కాంతం ఉందిగా మరీ! "శ్రీశ్రీ సలహా!" విశ్వేశ్వరరావు గారి గొంతు పూడుకుపోయి శ్రీశ్రీ సలహాని కొనసాగింపుగా ఇచ్చారక్కడ!  ఇది పతంజలికే కాదు ఎందరెందరు రచయితలకో, ఉహూ ప్రతీ ఒక్కరికీనేమో..  సలహా! ప్రస్తావించకుండా ఉండలేని వాక్యాలు..

ఆంధ్రదేశంలో గొప్పవారు కావడానికి ఒక చిన్న ఉపాయం ఉంది. అది ఎవరూ అమలులో పెడతారనే నమ్మకం లేదు గానీ అయినా బయట పెట్టక తప్పదు. ఆంధ్రదేశంలో నువ్వు గొప్పవాడివి కాదలచుకుంటే ఒక్కటే మార్గం. చచ్చిపో.

అప్పుడు నీకు అఖండ గౌరవం జరిగితీరుతుంది. అదంతా నీకు కనబడదు - నిజమే, కానీ ఏ మృత్యువుకీ లొంగని నీ ఆత్మ ఒకటి ఏడిసింది కదూ! అది కనిబెడుతూనే ఉంటుంది నీకు జరిగే మర్యాదలన్నింటినీ. నీ మరణాన్ని పురస్కరించుకుని టౌను హాలులో జరిగే సానుభూతి సభలో నీ ఆత్మ చూరునుంచి వేళ్ళాడుతూ వినబడని కరతాళధ్వనులు చేస్తుంది.

ఇంకో సంగతి. నువ్వు ఆంధ్రదేశం నుంచి వీలయినంత హెచ్చు గొప్పతనం పిండుకోవాలంటే సాధ్యమైనంత దూరంగా పారిపోయి జీవించవలసిందని నా సలహా. ఎంత దూరం పోతే అంత పొడుగ్గా సాగుతుంది నీ పేరు.

తెలుగు పత్రికలన్నీ నీ మీద సంపాదకీయాలు వ్రాస్తాయి. వాటిని వ్యాస పిండాలని 'ఆరుద్ర ' లాంటి పెంకి పురుగు అంటేనేంగాక? తెలుగు పత్రికలో సంపాదకీయాలకి నీ అకాల మరణం (నువ్వెప్పుడు చచ్చిపోయినా అకాలమరణమే! సకాలంలో ఎవ్వరూ మరణించరనేది అందరికీ తెలిసిన రహస్యం.) కారణం కావడం కంటే నువ్వు కోరుకోదగ్గదేముంది?

బతికివున్న వాళ్ళ లోపాలను ఎంత శ్రద్ధగా స్తనశల్య పరీక్షగా యెంచగలరో, పోయినవాళ్ళ సద్గుణాలను కూడా అంతే నిర్దుష్టంగా నిష్కామకర్మగా బేరీజు వేయగలిగినవారు ఒక్క ఆంధ్రులే అని మరచిపోకు. నీ 'విలువ ' కు తగ్గమూల్యం ఒక్క ఆంధ్రదేశంలోనే లభించగలదని ఘంటాపథంగా చెప్పగలను. కానీ దీనికి ఒకటే షరతు వుంది. చచ్చిపోవాలి.


నవ్వుకుని పుస్తకం మూసేసాను. భలే శ్రీశ్రీ!! ఆరుద్ర - పెంకి పురుగు.. హహ్హహా..

ఈ సారి పుట్టింటికి వెళ్ళాలని ఉవ్విళ్ళూరడానికి కారణాల్లో.. వెంకన్న దర్శనం, వండిపెట్టాలనుకున్న భగినీహస్తభోజనం, నేరుగా అందుకోబోతున్న స్నేహహస్తపు కరచాలనం.. వీటితో పాటూ అక్కడ పొట్లకాయలా పటపట్లాడిపోతున్న తాతగారి చెక్కబీరువాలో మొన్నే వచ్చి చేరి నాకోసం ఎదురుచూస్తున్న "పతంజలి సాహిత్యసర్వస్వం" ఉంది. నా చేత సీరియస్ గా చదివించేసుకోవడానికి "అలమండ రాజుగారి అక్షరాలు" ఠీవిగా కొలువుదీరి ఉన్నాయి.

ఓసోస్.. మీ ఊరి వాడనా!? యెస్సెస్.. మా ఊరి వాడే!!
ఆ ఒకే ఒక గురజాడని, ఒక చాసో నీ, ఒక్ఖ రావిశాస్త్రినీ.. ఇచ్చిన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ.
ఒక్ఖ కథ చదివి ఇంతలా ఎలా!? చెప్తాను చెప్తాను..

వంటింటి చూరు కింద కూర్చుని అమ్మ చేత జడ వేయించుకుంటూంటే.. అమ్మమ్మ ఏం చేసేదంటే,  కుంపటి మీద శేరుగిన్నెలో ఎసరు మరగగానే కడిగితెచ్చుకున్న బియ్యం పోసేది. కాసేపున్నాక నేనూరుకోకుండా "కుతకుతశబ్దం కుండకనర్ధం.." అనగానే "ఏడ్సావ్ లేవే! ఇలా వంటింటిలోకి తొంగిచూస్తారనే ఇక్కడ జడల పీఠం పెట్టద్దనేదీ!" అని కసిరి కుంపట్లోంచి నాలుగు బొగ్గులు విసనకర్ర చివరతో బయటికి లాగిపడేసి, గిన్నె మీద ఇత్తడి సిబ్బి ఓరగా పెట్టేది. గుమ్మంలో కూర్చుని ఏ ఆకుకూరో బాగుచేస్తూనో, చిక్కుళ్ళు తుంపుతూనో.. అమ్మతో కబుర్లు చెప్తూ అలా వెనక్కి తిరిగి ఆవిరెలా వస్తోందో చూసి, లేచి వెళ్ళి గిన్నె దింపేసేది. ఇక అమ్మైతే మెతుకు పట్టి చూసేదనుకోండీ. ఆవిరీ చూసాను, మెతుకూ చూశాను.. ఇంకేం కావాలి! అన్నం మల్లెపువ్వల్లే ఉడికే ఉంటుంది.



(పతంజలి సాహిత్యం - అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, కినిగె.కాం లోనూ లభ్యం)

25 comments:

  1. intro adiripoyindandi... mee style lo. urgent gaa konesu kovalanna maaTa.
    thank you very much ;)

    ReplyDelete
    Replies
    1. కొనేసుకోండి వెంటనే. ధన్యవాదాలు. :)

      Delete
  2. పరిచయం చాలా బాగుందండీ..Excellent narration...:-) 

    ReplyDelete
  3. బతికివున్న వాళ్ళ లోపాలను ఎంత శ్రద్ధగా స్తనశల్య పరీక్షగా యెంచగలరో, పోయినవాళ్ళ సద్గుణాలను కూడా అంతే నిర్దుష్టంగా నిష్కామకర్మగా బేరీజు వేయగలిగినవారు ఒక్క ఆంధ్రులే అని మరచిపోకు. నీ 'విలువ ' కు తగ్గమూల్యం ఒక్క ఆంధ్రదేశంలోనే లభించగలదని ఘంటాపథంగా చెప్పగలను. కానీ దీనికి ఒకటే షరతు వుంది. చచ్చిపోవాలి.<<<< యెంత చక్కటి సమీక్ష.ఆవిరి చూసాను,మెతుకు చూసాను ..ఇంకేమి కావాలి..మల్లె లాంటి మీ మనసు చదవటానికి

    ReplyDelete
  4. "నా ఉదయపు కాఫీ కప్పునీ, అర్ధరాత్రి ముసుగేసుక్కూర్చుని చూసే కామెడీ సినిమానీ తప్ప దేన్నీ నేను సీరియస్ గా తీసుకోనండీ!" అని జోకాననుకుని ఎవరితోనో ఇలా ప్రగల్భాలు పోయానో లేదో, అలా ఠపీమని మొట్టికాయ తిన్నాను. "
    :))))))

    అప్పుడప్పుడూ పడాల్సిందేలే.. అయినా ఎవరి దగ్గర్నించి పడ్డాయన్నది ముఖ్యం గదూ! లేకుంటే ఈ పోస్ట్ మాకు దక్కేదా!?

    పుస్తక ప్రియులు మీ పాటికి మీరు ఇట్లా రాసి పడేస్తారు! ప్చ్, నేనెప్పుడు ఈ పుస్తకాన్ని దొరకబుచ్చుకునేనో.. ఎప్పుడు బుగ్గకి ఆ అట్ట ఆనించుకుని (నీ మాటలే!) మురిసిపోయేనో!? :(

    ReplyDelete
    Replies
    1. మొట్టికాయ మంచిదేనంటావ్! :)

      నన్నా పుస్తకప్రియుల జాబితాలో వేస్తున్నావూ! ఇదేదో దారితప్పిన కామెంట్ లా కనిపిస్తోందే! :D పుస్తకప్రియులంటే నాలా అట్టల్ని కావలించుకుని మురిసిపోయేవాళ్ళు కాదు మరి! చకచకా చదివి ఆకళించుకోగలగాలి. :)

      Delete
  5. <>

    భలే చెప్పారు. ఎందుకంటే అచ్చం అలానే అనిపిస్తుంది ఎవరికైనా పతంజలి ని మొదటిసారి చదవగానే.

    ReplyDelete
    Replies
    1. మీరు రాసిన వాక్యాలు రాలేదండీ! :( ఏదైనా పతంజలి గురించే కనుక ఏకీభవిస్తున్నాను. :)ధన్యవాదాలండీ.

      Delete
  6. అబ్బ ! ఎంత బావుందో ఈ పరిచయం ? వాహ్ !

    ReplyDelete
  7. మీరు, మైత్ర్రీలతగారు -- పరిచయాల్ని కూడా ఇంత బాఘా రాసేస్తే ఎలాగండీ. తిని ఎప్పటికి అరిగించుకుంటామో ఏమో!

    ఆరుద్ర - పెంకి పురుగు.. హహ్హహా..
    :)

    ReplyDelete
    Replies
    1. ఆ కోయిల మరీ వసంతం వచ్చేదాకా కాసుక్కూర్చుంటున్నారు. నేనంతటి దాన్ని కాదులెండి. పికిలిగువ్వ లాగా అడపాదడపా ఏదో ఒకటీ కూసేయడమే! :) ఆరుద్ర పురుగుని పెంకి పురుగు చెయ్యడమెంత బావుందో కదండీ! ఇలాగే వ్యాసపిండాలన్నచోటా చదువుతున్నది గంభీరమైన విషయం అన్నది మర్చిపోయి ఫక్కున నవ్వేసానండీ. ధన్యవాదాలు!

      Delete
  8. చాలా సంతోషంగా ఉందండీ... కించిత్ ఆలస్యం అయితేనేం... పతంజలి తో ప్రేమలో పడిపోయారు మీరు...

    ఓ వీరబొబ్బిలి, ఓ గోపాత్రుడు, ఓ నువ్వేకాదు... వీటిగురించి మీ అక్షరాల్లో చదవాలని ఉంది...

    ReplyDelete
    Replies
    1. అవునండీ. Better late than.. అనేసి సరిపెట్టేసుకోవడమే. ఇప్పటికే చాలా వెనుకంజలో ఉన్నాను. నెమ్మదిగా చదివేయాలందరినీ. నా అక్షరాల్లో పెట్టడమెలా ఉన్నా చదివి ఆస్వాదించదగ్గవెన్నో పరిచయమవుతున్నందుకు, అందుబాటులోకి వస్తున్నందుకూ సంతోషం అంతే. ధన్యవాదాలు.

      Delete
  9. ఏ వణ్ణం అయినా కొత్తావకాయ రుచి తగిలితే ఆ కమ్మదనమే వేరని మరోసారి నిరూపించారు! :)

    ReplyDelete
  10. పతంజలి రాతల్లో సామాన్యుడి వెతలు కనిపిస్తాయి... కష్టాలూ కన్నీళ్ళను ధిక్కారస్వరంతో ఎదుర్కొనే ధీమా కనిపిస్తుంది. ఆయన రచనలు చదివితే కమ్యూనిస్టేమో అన్న అనుమానం కలుగుతుంది.. ఐతే ఉదయంలో కానీ, సాక్షిలో కానీ పనిచేసినంత కాలం కాంగ్రెస్ లేదా జగన్ పార్టీ అనుకూలుడిగా ఉన్నట్టే ఉంటాడు. ఆ వైరుధ్యాన్ని అర్ధం చేసుకోడం నాకు సాధ్యం కాలేదు. రాజకీయాల సంగతి పక్కన పెడితే రచయితగా పతంజలి ముద్ర వెంటాడుతూనే ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. ఇజాలు, రాజకీయాల సంగతెలా ఉన్నా, చదివించే గుణం పుష్కలంగా ఉన్న శైలి. అది నచ్చిందండీ. మీ స్పందనకు ధన్యవాదాలు!

      Delete
  11. మొదట్నుండి చివరి దాక కష్టపడి చదివేశానండి. సరదాగా పరిచయం చేశారు.

    "...పోయినవాళ్ళ సద్గుణాలను కూడా అంతే నిర్దుష్టంగా నిష్కామకర్మగా బేరీజు వేయగలిగినవారు ఒక్క ఆంధ్రులే అని మరచిపోకు."
    పైకి వ్యంగ్యంగా అన్నా శ్రీశ్రీ మాటల్లో నిజం లేకపోలేదు!

    ReplyDelete
  12. చాలా బాగా రాసారు కొత్తావకాయ గారూ, నా ఇండియా షాపింగ్ లిస్టు లో ఇంకొక పుస్తకం వచ్చి చేరింది

    ReplyDelete
  13. పతంజలి మొట్టదగినవాడే, మనం పడదగిన వాళ్ళమే. ఆయన ఇలా అర్జంటుగా అర్ధాంతరంగా ఎక్కడికో నిచ్చెనేసుకుని వెళ్ళిపోడంవల్ల జరిగిన ఓ లాభమేవిటంటే అమాంబాపతుగా పడున్న ఆయన రచనలన్నీ ఓ గూటికి చేరాయి. ఓరి మన అగాయిత్యం కూలా .. రచనలన్నీ ఓ గూటికిందికి చేర్చుకుందికి అసలు శాల్తీనే లేపెయ్యక్కర్లేదురా నాయనా అంటే .. అది కూడా పతంజలి రచనలాంటి ఐరనీ.
    కోవాతల్లీ, పతంజలిని తొలిసారి చదివిన గగుర్పాటు నాకు ముప్పయ్యేళ్ళ తరవాత మళ్ళీ ఇంకో తరం అలాగే అంత తీవ్రంగానూ అనుభవిస్తోందంటే .. సంతోషవే!

    ReplyDelete
    Replies
    1. ఇంకా ఎందరి రచనలో చెల్లాచెదురై చదవాలంటే దొరకనివెన్నో కదండీ. చాసో, లత.. ఇంకా రావాల్సున్నాయి. ఇప్పుడిప్పుడే పుస్తకంపై మళ్ళీ మమకారం పుడుతున్నట్టూ, ఒక్కో ప్రచురణాలయంవారూ పునర్ముద్రణ బాధ్యతను భుజాలకెత్తుకోవడం అభినందించదగిన పరిణామం.

      మరో ముఫ్ఫై ఏళ్ళకి నాలాగే మరొకరు పతంజలిని చదివి.. 'సమకాలీన రచన!' అనుకోకుండా ఉండరు. అదీ అసలు ఐరనీ.

      Delete