Saturday, July 12, 2014

అప్పుడు పుట్టి ఉంటే

"కృష్ణశాస్త్రి ఒక్ఖ కథో, నవలో రాసి ఉంటేనా!" అని గింజుకున్నాను "అప్పుడు పుట్టి ఉంటే" పూర్తి చేశాక. ముందు మాటలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మాత్రం "కృష్ణశాస్త్రి కథ, నవలల జోలికి పోలేదు. ఆయన రుచే వాటి మీదకు ప్రసరించలేదేమో!" అని ఊరుకున్నారు. తెలుగు సాహిత్యానికి నిజంగా లోటే.. కృష్ణశాస్త్రి కథ లేకపోవడమనేది. ఏడువారాల నగలున్నా మరో ముద్దుటుంగరం చేరినట్టయ్యేది కదా!

ఆమధ్యెప్పుడో శ్రీరమణన్నారు. "దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, ఎస్వీ భుజంగరాయశర్మ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గార్లు.. వీళ్ళందరూ రేడియోకి ఎక్కువగా రాసినవాళ్ళు. కృష్ణశాస్త్రిగారైతే రేడియోకే రాశారు. దీనితో మాట్లాడుతున్నట్టుండే శైలి వీళ్ళకి ఉంటుంది. వీళ్ళెవరూ అనవసరంగా పెద్దమాటలు వేయరు. అవసరమైన చోటే వాడతారు. శబ్దం మీద సాధికారత ఉండటమంటే పెద్దపెద్ద మాటలు కంకర్రాళ్ళలా విసరడం కాదు. మాట డెన్సిటీ తెలిసి ఉండాలి. తూచి వేయాలి." అని. ఆ మాట అక్షరాలా అర్ధమయ్యింది.. కృష్ణశాస్త్రి వచనం చదువుతూ ఉంటే. అద్భుతమైన ఊహ, చక్కని కథన చాతుర్యం, లలిత లలితమైన పదసౌందర్యం. అందుకే అన్నాను. 'కృష్ణశాస్త్రి కథలూ, నవలలూ రాసి ఉంటేనా!' అని. ఆయన ఊహలో పుట్టిన కథ కాని కథే "అప్పుడు పుట్టి ఉంటే"


రాయల వారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని ఈనాటికి చెప్పుకుంటాం. సమర్ధుడైన రాజు పాలనలో ప్రజలెంత సుఖసంతోషాలతో జీవితం గడిపేవారో ఈ కలికాలంలో మనబోంట్ల ఊహలకి అందించేందుకో చిన్న ఉదాహరణ.. విపణి వీధిలో రత్నాల రాశులు! సంపద, భద్రత, విశ్వాసం, సంతోషం.. ఇవన్నీ ఉచ్ఛస్థాయిలో ఉన్న ఆ బంగారు రోజుల్లో.. నిరుపహతి స్థలమూ,  ఊయలమంచమూ, ఆత్మకింపైన భోజనమూ, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెమూ.. లేఖక పాఠకోత్తములూ ఉంటేనే కవిత్వం చెప్తానని పెద్దన గారంటే, రాయలవారింకెంత ఇంపైన సదుపాయాలూ, ఉపాయాలూ చేసి ఉండకపోతే ఆ అల్లిక జిగిబిగి "స్వారోచిష మనుసంభవం" అవుతుంది! మృగమద సౌరభ విభవ ఘనసార వీటీ గంధ స్థగితేతర పరిమళమై.. వరూధిని పొలుపు తెలుపుతుంది! తెలుగు పద్యానికి కస్తూరి పరిమళమద్దుతుంది!

సరే, తొలి తెలుగు ప్రబంధం ఉద్భవించింది. రాయలవారికి అంకితమివ్వబడుతోంది. మరి ఆ వేడుక ఎలా ఉండి ఉంటుంది? కృష్ణశాస్త్రి చెప్తారు.. కాదు కాదు.. చూపిస్తారు.

మహర్నవమి నాడు రాయల వారు భువనవిజయంలో మనుచరిత్రమందుకుంటున్నారన్న వార్త తెలిసి, అటు కళింగం నుంచీ, గౌతమీ తీరాన్నుంచీ, ఇటు కావేరి, మధుర నుంచీ కవీశ్వరులు, గాయకులూ, విద్వాంసులూ ముందుగానే విజయనగరం చేరుకున్నారట. కవితాగోష్ఠులతో తుంగభద్రా తీరమంతా మారుమ్రోగింది.

వచ్చిన కవులలో సగం మంది పెద్దన్న గారింట్లోనే దిగినప్పటికీ, అప్పాజీ, సాళువ తిమ్మరుసయ్య వంటి సామంతుల గృహాలూ మునుపెన్నడూ లేనంత కోలాహలంగా విడిదిళ్ళయ్యాయి. మహర్నవమి రానే వచ్చింది. పెద్దన్న గారి మనుమడు పింగళి సూరనదే హడావిడంతా!

రాయల వారు స్వయంగా పెద్దన్న గారింటికి వేంచేసి, ఊరేగింపుగా కొలువు కూటం దాకా తీసుకువెళ్తారని వార్త. బంగారు కుండలాలూ, జలతారు సేలువలూ సవరించుకుని కవులూ, పండితులూ రాయలవారి రాకకోసం మొగసాలలో ఎదురుచూస్తున్నారు. మంగళతూర్యధ్వానాల మధ్య "రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వర మూరు రాయరగండ శ్రీ కృష్ణదేవ రాయల వారు", అల్లసాని పెద్దనామాత్యుల ముంగిలికి మంత్రిసామంతులతో వేంచేసారు. 

బంగారపుటడ్డల పల్లకీలో ఆ మహాకవి భువనవిజయానికి చేరుకునే వేడుక, ఆ మహోత్సవం అంతా ఇంతానా! కవిరాజుకి కవిరాజరాజు చేసిన మన్నన ఇంతకు ముందు భోజరాజైనా ఏ కవికీ చేసి ఉండడని కవీశ్వరులందరూ సంతోషించారు. ఇంత సందడిలోనూ పెదవి విరిచి ధుమధుమలాడేవారికీ లోటు లేదు. దృష్టిదోషం తగలకుండా అదీ ఉండాలేమో!

వృధ్ధ తేజస్వి అప్పాజీ, విశాలమైన ఛాతీ, బుజాలూ, బుగ్గమీసాలతో సాళువ తిమ్మరుసయ్య, కోటేరేసిన ముక్కూ, పండు తమలపాకు శరీరచ్ఛాయా, కర్పూరతాంబూలం బుగ్గన ఉంచే.. రాయల వారితో మాట్లాడుతూ నడుస్తున్న నంది తిమ్మన, నిష్కలంకమూ, నిశ్చలమూ అయిన చల్లని ముఖంతో ధూర్జటీ.. ఇక మాదయ గారి మల్లన, రామభద్రుడు, రామరాజ భూషణుడూ, కందుకూరి రుద్రయ్య.. ఆహాహా.. రామలింగ కవి! (వారి వివరమూ, వర్ణన అనుభవేక వేద్యం. అంతే!) వీళ్ళొక్క వైపే.. ఇక చుట్టూ శారదారూపాలకి లోటేవిటి! ఎటుచూసినా ఆయమే! దక్షిణాపథం అంతా ఒక సుందర సంస్కారబంధం కట్టిపెట్టిన స్వర్ణయుగంలో.. ఆంధ్ర, కర్ణాటక, తమిళ కవివరేణ్యులంతా అక్కడే ఉన్నారాయె!

ఊరేగింపు విజయనగర పురవీధుల్లో ఎలా సాగిందో, తోవలో అందుకున్న హారతుల వైభోగమేమిటో, మధ్యలో మజిలీలేమిటేమిటో, భూలోక దేవేంద్రుడు కృష్ణరాయ నృపతి సుధర్మాస్థానంలో పెద్దన గారు మనుచరిత్రమునెలా పఠించారో, ఎక్కడాయన కంఠం రుద్ధమయ్యిందో, నిండు సభ కవితా పితామహునినేమని కీర్తించి సాష్టాంగమందో.. వైన వైనాలుగా పింగళి సూరన వర్ణిస్తూంటే.. అతిథికోటికి వడ్డిస్తూ ఆ ఇంటి ఇల్లాలు కళ్ళనిండా గర్వమూ, సంతోషమూ నింపుకుని మరీ విన్నది. 

పెళ్ళి వారిల్లులా ఉన్న పెద్దన గారింట్లో ఆపై జరిగిన సంబరాలే సంబరాలు. కవి కుమారుల చెణుకో పద్యం, తమలపాకు చిలక చుట్టి బుగ్గన పెట్టుకుంటే పద్యం, దారిన పోయే భామిని వయారం చూసో పద్యం, తుంగ ఒడ్డున ఓ ముద్దుగుమ్మ బిందె ముంచుకుంటే ఓ పద్యం... ఆంధ్రభారతి ఇదో.. ఇలాగే సుసంపన్నమయిందేమో!

ఇంతచక్కని ఊహ మరింత అందగించే ఊహొకటి చేసారు.. కృష్ణశాస్త్రి. "అప్పుడు పుట్టి ఉంటే, ఇవన్నీ చూసేవాణ్ణి కదా. ఎందుకు చూడను? అప్పుడు పుట్టి ఉంటే, నేనే పెద్దన్ననై పుట్టి ఉందును." అన్నారు. 

క్షణకాలపు దిగ్భ్రమ! ఏమా విశ్వాసం!! అప్పుడు గుర్తొచ్చింది కృష్ణపక్షం. అప్పుడు గుర్తొచ్చాడు.. 

గగన పథ విహార విహంగమ పతిని నేను
మోహన వినీల జలధరమూర్తి నేను

అని ధీరగంభీరంగా చెప్పుకున్న స్వేచ్ఛామూర్తి. దేవులపల్లి కృష్ణశాస్త్రి.

(కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసమే కాకుండా మిగిలిన రచనలూ, రేడియో నాటికలూ, అముద్రిత రచనలన్నీ కలుపుకుని "కృష్ణశాస్త్రి సాహితి" ముస్తాబయ్యింది. "అప్పుడు పుట్టి ఉంటే" ప్రస్తుతం లభ్యమవుతున్న "కృష్ణశాస్త్రి సాహిత్యం - 5 " లో ఉంది.)

***

తాజా కలం: కృష్ణశాస్త్రి గారు రాసిన కథలు రెండున్నాయని మిత్రుల ద్వారా తెలియవచ్చింది. ఒక కథ పేరు "కొలను - కోవెల", మరోటి "అవ్వ తిరునాళ్ళలో తప్పిపోయింది". రెండో కథ ఇక్కడ చదవవచ్చు. ఇంకేం! ముద్దుటుంగరాలూ ఉన్నట్టే. పట్టుమని పదైనా ఉంటే బావుణ్ణని ఆశగా ఉన్నప్పటికీ..

8 comments:


  1. కొత్తావకాయ రుచి చూసి (టపాలు చదివి!) చాన్నాళ్ళు అయ్యింది. అమోఘం! కృష్ణ మోహనం!!


    జిలేబి

    ReplyDelete
  2. కృష్ణ శాస్త్రి ముందు ప్రాణం...కృష్ణదేవరాయలు మధ్యప్రాణం..అష్ట దిగ్గజాలూ...అష్ట ప్రాణాలు (అందరికీ పంచ ప్రాణాలేమో గాని నాకు మాత్రం ఇలాంటి ప్రాణాలు భోలెడు) ముద్దుభార్య "చిన్నా" మీద రాయలు అలిగిన ఉదంతం...తదుపరి "ముక్కు" (నంది) తిమ్మనాచార్యుని "పారిజాతాపహరణం" భువనవిజయంలో ప్రాణం పోసుకున్న వైనం (కొందరు ఆ కావ్యం పెద్ద భార్య తిరుమల దేవి కోసం రాయబడ్డదని చెబుతారు) ప్రేమైక మూర్తి కృష్ణ భగవానుడు ప్రియ సతి సత్య కాలి తాపును ఆనందంగా తిన్న ఘట్టాన్ని భువన విజయం లో విన్న రోజునే రాయలు అలక మాని చిన్నా (చిన్నాదేవి) దగ్గరకు పరుగు తీసిన మధుర ఘట్టం...ఇత్యాదులన్నీ "భువన విజయం" పుస్తకం లో తొట్టతొలుత చదివి సరిగ్గా ముఫ్ఫై ఐదేళ్లయింది..!! అంతకు ముందే పెద్దనామాత్యుని గురించి మరేదో పుస్తకం చదివాను గాని దాని పేరు మాత్రం గుర్తు లేదు...మళ్లీ ఆ రోజుల్లోకి పరకాయ ప్రవేశం చేయించిందీ "అప్పుడే పుట్టి ఉంటే" ఏ సందర్భంగా ఓ చిన్న పద్యం షేర్ చేసుకుంటా..."వినుడు సురేశ్వరు వనపాలకులార...
    వార్ధిబొడమిన ఈ దివ్య భూరూహమునకింద్రాణి యెవ్వతె..
    ఇంద్రుండునెవ్వండు..
    తోడి ఇందిరను కౌస్తుభమునెవ్వండధిపుడై ధరియించె
    నతడె చేకొనుగాక..
    తెకతేర ఇదియేమి యొకరి సొమ్మె
    ఇదె నాదు విభునిచే నీ వదాన్య
    నగంబునొడియించుకొని యేగుచున్నదాన
    పలుకులేటికి తా వీరపత్నియేని
    మీ శచీదేవి తనదు ప్రాణేశుడైన
    మఘవునిట బంపి
    సత్యభామా విధేయు వలన
    మరలంగ గొనుటపో వాసితనము"
    1976 లో చదివిన ఈ పద్యం ఈనాటికీ ధారావాహికంగా గుర్తుందంటే దాని గాఢత ఎంత గొప్పదో తెలుస్తోంది కదా...:)
    పోతే కొత్తావకాయ్ ఏమీ అనుకోకపోతే ఒక్క చిన్న మాట.."పెద్దననై పుట్టి "ఉందును" అన్నారు కృష్ణ శాస్త్రి..అది "నేనే పెద్దననై ఉండేవాణ్ని" అన్న నమ్మికా విశ్వాసమూ కావు...బలీయమైన ఓ చిన్న కోరిక. "పుట్టి ఉందును" అంటే అర్ధం అదీ...కృష్ణ శాస్త్రికి ఎప్పుడూ అలాంటి వల్లమాలిన విశ్వాసాలు లేవు...అదే శ్రీ శ్రీ అయితే ఖచ్చితంగా "నేనే పెద్దనను" అని ఢంకా బజాయించి ఉండేవాడు... యమునా సైకత స్థలిలో గోగోపగోపికల మధ్య తిరుగుతూ మృదు మధురమైన మురళీనాదామృతాన్ని సాధారణులకు పంచిన అసాధారణుడు కృష్ణభగవానుడు నా బోటి పామరులకు మధుర మధురమైన కవితామృతాన్ని పంచిపెట్టడం కోసం ఎత్తిన పునర్జన్మే కృష్ణశాస్త్రి...గోపికల కాలి దుమ్మును తలదాల్చిన కృష్ణుడి మారు రూపమే కృష్ణశాస్త్రి..:)

    ఏమైనా నొప్పిస్తే క్షమార్పణలు...

    ReplyDelete
    Replies
    1. నాకూ కృష్ణశాస్త్రంటే ఇష్టమేనండీ. ధన్యవాదాలు!

      Delete
  3. Abbaaaa...ennaltikennaaltikee..krishna sastry ni gurthu chesaru. Nijanga vennela kurisinatte vundi.

    ReplyDelete
  4. ఇన్నాళ్ళూ ఈ టపా చదవకుండా యెలా వున్నానో.. ఇప్పుడే చంద్రోదయమైనట్టుంది. చాలా బాగుందండీ కొత్తావకాయగారూ..

    ReplyDelete