Tuesday, October 2, 2012

అవియేటి అలకలో! (నాయికలు ~ 2)

జాము రాతిరి వేళ ఆ మిద్దెటింటి అరుగు మీదకి, కడియాలు వింత చప్పుడు చేస్తుండగా తాపీగా నడిచి వస్తున్న ఆమెను చూసి, "ఈమేనా?" అని అడిగింది శారిక. ఆ ఇంటి తోటలో చిక్కగా అల్లుకున్న పొదరింట అమర్చిన తిన్నె మీద వాలి ఉన్నాయా గొరవంకలు.

"కనబడడం లేదా ఏం? చెలికత్తె నీకు యజమానురాలి వలే కనిపిస్తోందటే.. నీ అమరత్వం అటకెక్కిందన్నమాటే! నిజం చెప్పూ.. కళ్ళు ఆనుతున్నాయా?"
"అబ్బ.. పరాగ్గా చూసానూ. నువ్వు మరీ ఆటపట్టించక్కర్లేదు. ఏదో రోజుకో కథ చెప్తున్నావని ఊరుకుంటున్నానే కానీ.."
".. లేదంటే ఉపేక్షించక నా పనిపట్టేదానివే!"
"ఇంతకీ నువ్వు చెప్పిన ఆ వలతి ఎక్కడుందీ?"
"హ్మ్.. చల్లని గాలి..  మత్తుగా తేలివస్తున్న ఈ రేరాణి పరిమళం..  కోడెకాఱునెవరినైనా నిమ్మళంగా ఉండనిచ్చేనా? అయితే జంటగా విహారానికి రావాలేగానీ, ఒంటిగా ఈ గాలికి తిరగగలరా ఎవరైనా..? ఒంటరిరేయిని నిందిస్తూ నడిమింట కూర్చుని ఉంటుంది" 
"పాపం ఆ పిల్ల విరహంలో వేగుతూ ఉంటే ఈమె వీధరుగు ఎక్కి తాపీగా పచార్లు చేస్తోందా? వెళ్ళి ఓ మంచిమాట చెప్పి ఊరడించవచ్చునే! చూడు చూడు.. కూనిరాగాలు తీస్తోంది పైగా." విసవిసలాడింది శారిక.
"అబ్బా.. నీ రొద ఎక్కువైపోతోంది. అన్నీ తెలుసుకోనిదీ అభాండాలు వేసేయడమేనా?" విసుక్కున్నాడు.
"ఆ.. అయినా ఈమెని అనడం దేనికీ? జాము రేతిరైనా ఇల్లు చేరని ఈ ఇంటి మగాడిని అనాలి. ఇంటి గడప దాటారా ఇంక మా గోడు మీకు పట్టేనా? ఎదురుచూసే మా ఊసైనా తలపులోకొచ్చేనా? ఎన్ని రాచకార్యాలో..  ఎన్ని ఇళ్ళుచక్కబెట్టాలో.."
"ఇదిగో ఓయ్.. అందర్నీ ఓ గాటన కట్టేయకు. నిన్నటి కత వేరు."
"మరి ఈ ఇంటి కథేవిటో?"
"చూద్దాం. ఇదిగో.. ఈ తలుపు తీసిపెట్టింది. సడి సేయక లోపలికి పద.."  రివ్వుమని క్షణంలో ఇంట్లోకి దూసుకుపోయాడా మగ గోరింక.
"నీ అసాధ్యం పాడుగానూ.. ఇంట్లోకా..? ఇంట్లోకే!! ఓయ్.. ఆగూ ఆగూ.. "
                                          
                                                     ***

ఉయ్యాలబల్ల మీద పడుకుని వగపులో మునిగిన ఓ పరువంపుకొమ్మ మసకచీకట్లో సైతం వజ్రపుతునకలా మెరిసిపడుతోంది. అలముకోబోతున్న చీకటితో కొడిగట్టబోతున్న దీపం గూట్లోంచే పోరాడుతోంది.  సద్దుచేయకుండా గోరవంకలు ఎగిరొచ్చి క్రీనీడలో ఉన్న ఓ చూరు వెతుక్కుని సర్దుకున్నాయి. నూనె వేసి వత్తి పైకెగదోసి, నెమ్మదిగా ఆ చిన్నారి దగ్గరికి నడుచుకుని వచ్చిందామె చెలి.

"సఖీ.. రెండో ఝాము దాటిపోతోంది. నిద్రపోమ్మా." లాలనగా పలికింది.
"....." మూగనోము పట్టిందామె. బాలీసు పై ఆన్చిన తల అటువైపు తిప్పుకుంది.
"కాస్తైనా ఎంగిలి పడలేదు. పోనీ, కాసిని పాలు తెచ్చివ్వనా?"
"ఉహూ.."
"ఇలా మాటామంతీ లేకుండా, తిండీతిప్పలూ మానేసి రేయంతా కూర్చుంటావా? ఆరోగ్యం ఏం గాను?"
"...."
"ఇదిగో.. ఏమయ్యిందో సరిగా చెప్పనిదే ఎలా తెలిసేది?"
"చదరంగం.."
"ఊ... చదరంగం..?"
"ఆడుతూంటే కలహం."
"ఓ.. ఆటలో నెగ్గలేదని అలిగావా?"
"కాదు."
"ఊ.. మరి?"
"...."
"ఏమయ్యిందో వివరంగా చెప్పు తల్లీ.. "  స్థంభానికి చేరగిలబడి కూర్చుంటూ అడిగింది.
ఆమె ఉయ్యాల బల్ల మీద నిటారుగా లేచి కూర్చుని జరిగిన విషయం చెప్పనారంభించింది.

"సాయంత్రమనగా వచ్చారు కదా. . ఇంకా బోలెడు పొద్దు ఉందని చదరంగం ఆడుతున్నాం. ఎప్పుడూ నెగ్గేది నేనే. ఈ రోజు ఓడిపోయాను."
"ఈ మాత్రానికేనా అలక?"
"ఉహూ.. ఓడిపోయానని నొచ్చుకున్నాను. పందెం గుర్తుచేసారు. ఓడినవారు గెలిచినవారి మాట వినాలని."
"ఓహో... ఎవరోడినా అతగాడే నీ బానిస కదూ..! ఇంతోటిదానికీ గెలుపోటములెందుకూ?"
"హ్హు.. వినవే ముందూ.  నా మనసు బాధతో బరువెక్కి నన్ను చంపేస్తోంది."
"ఊ.. ఊ.."
"ఓడే జాతి కాదు నాది.  మీరే తొండి చేసారన్నాను. "ఎక్కడైనా చుట్టరికం కానీ వంగతోట దగ్గర కాదూ.. నేనే గెలిచాను. ఓటమినొప్పనన్నారాయన. పైగా ప్రతిసారీ నేనోడి నిన్నుగెలిపిస్తున్నాన"ని కవ్వించారు. అలిగి మోము దాచాను. మాట్లాడను పొమ్మన్నాను."
"మరీ బావుంది. చిలికి చిలికి గాలివాన చేసావే!"
"చెయ్యనూ మరీ.. 'కిందపడ్డా నీదే పైచేయంటావు కదూ.. మంకులాడీ..' అన్నారు."
"అన్నాడే అనుకో.. పరాయివాడా! అరిగిపోతావా? పెనివిటితో కలహం గడపదాటనివ్వకూడదన్న ఇంగితమేమాయె?" బుగ్గలు నొక్కుకుంది.
"ఏమోనే, ఆ మాటనేసరికి ఉడుకుమోత్తనం పట్టలేకపోయాను.. "
"ఆ ప్రథమకోపం విడిచిపెట్టమని ఏనాడో చెప్పాను. చెవిని పెడ్తివి కావు కదా!" .
"ఊ.. నాదే తప్పంటావా?" బేలగా అడిగిందా అమ్మడు.
"తప్పూ ఒప్పూ అని కాదమ్మాయీ. తెగేదాకా లాగకూడదు. సరసం విరసం అయ్యింది చూడూ.."
"అవును.. నాకే అనిపిస్తోంది. ఇంత చిన్న విషయానికి రాధ్ధాంతం చేశానే! అని. మరే.. ఆయన ఇక రారంటావా?" ముంచుకొచ్చేసిన బెంగతో ఆమె నీలాలకనులు నిండిపోయాయి.
"నన్నడుగుతావేం.. ఆ మారాజు విసవిసా నడిచెళ్ళిపోయిన వైనం చూస్తేనే తెలుస్తోంది. ఎంత విసిగించావో!"
"పాపం.. ఎంత బతిమాలారో.. తెలుసా?" వేదనగా అంది.
"ఊ.."
"చిన్న మాటకి అంత కోపమెందుకన్నారు. ప్రియమైనదానివి కనుకే చనువున ఓ మాటన్నాను సఖీ అని బతిమాలారు.. " గొంతు జీరబోయిందామెకు.. అతడిని తలుచుకుని.

నిముషాలను గిర్రున వెనక్కి తిప్పే శక్తే ఉంటే అలా బతిమాలుతున్న అతడి పెదాలపై చప్పున మునివేళ్ళు ఉంచి ఆపి, "సర్లెండీ.. తప్పు నాదే!" అనాలనిపిస్తోందామెకు. అతని రూపం, లాలిస్తున్న అతని మాటలు కనుల ముందు కదులుతూ దుఃఖం పట్టలేక మనసు భారమైపోతోంది. 'పనిమాలి తెచ్చుకున్న కలహం కదా..' అని వాపోతోంది.

"అవును మరి! వలచి వచ్చిన వాడు. లాలన తెలిసిన వాడు. అతడు కనుక భరిస్తున్నాడు నీలాంటి తిక్కలపిల్లని.."
"అబ్బా.. నీకు ప్రియంవద అని పేరెవరు పెట్టారే! గాయం మీద కారం జల్లుతావు కదా!" విసుక్కుంది.
"జల్లనూ మరీ.. నీకు తెలిసి రావాలి. అతనేమైనా సామాన్యుడా! జగదేకసుందరుడు. చందమామకైనా మచ్చ ఉంటుందేమో కానీ నీ వలరాయడు పాలతరకే! అందమొక్కటేనా, ఎంత ప్రేమా.. ఎంత మురిపెం నువ్వంటే!  అలాంటివాడు కోరి వచ్చినప్పుడే కొంగున కట్టుకోవాలి."
"ఊ.. " కనులు వర్షించేందుకు సిధ్ధమవుతున్నాయి.
"తప్పు తెలియద్దూ.. ఎవరితోనైనా మంకుతనానికి పోవచ్చేమో కానీ మనసేలే దొరతోనా.. అంతటి యోగ్యుడితోనా! తప్పు అమ్మాయీ.. తప్పు!" సుద్దులు చెప్పింది ప్రియంవద.

పెదవి కొరుకుతూ ధారలుగా చెక్కులని తడిపేస్తున్న కన్నీళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయకుండా నేలచూపులు చూస్తూ కాసేపాగి, "ఎంత మతిమాలిన దాన్ని. నా నాథుడిని ఎంత నొప్పించాను. కోరి కజ్జా తెచ్చుకున్నాను కదా! ఎంత బుజ్జగించారు!"
"ఊ..."
"ఇంత రచ్చ చేసి అలిగిన నన్ను, నాలాంటిదాన్ని సైతం ఎంత ప్రేమించి ఉంటారు! ఇంత జరిగాక కూడా ఏమన్నారో తెలుసా..? కుసుమించని కురవకమైనా నీ దయకు నోచుకుంటుందేమో కానీ.. నేనంత పరాయి వాడినయ్యానా, ప్రియా?" అన్నారు.. చివరి మాటలు దుఃఖంలో కలిసిపోతూండగా.. చెలియలికట్ట దాటిన శోకాన మునిగి ఉయ్యాలలో వాలిపోయి రోదిస్తూ తనను తానే నిందించుకుంటూ పలవరించసాగిందామె.
"మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిందట వెనకటికి నీలాంటిదే.. అప్పుడేమో అలకలూ.. ఇప్పుడు ఉస్సురస్సురులూ.. " సణిగింది చెలియ.

"మనసార వలచి వచ్చినవాడు, నీ రేడు
తొగరేని మించు సోయగము వాడు;
లాలించినాడు, తన్నేలుకొమ్మన్నాడు-
చప్పగా వాయైన విప్పవపుడు.
అవియేటి అలకలో! ఆ మూతి ముడుపులు,
ఆ మొండిపట్టులు, ఆ బిగువులు!
ఇక నిప్పుడోయమ్మ! ఎన్ని నిట్టూర్పులు
అసురుస్సురనుటలు, అలమటలును! 

ఓసి, ఇవియేటి చేతలే బైసి మాలి!
ఏరు విన్నను నవ్వగలరు లె"మ్మ
టంచు చెలి పల్క, తెలివొంది అలవి కాని
వెతల పాలౌచు కలహాంతరిత తపించు.


ఆమె వెతలాగే ఆ యింట చీకటి నల్లగా కమ్మేసింది. గోరువంకలు ఇక చూసేదేముందని జారుకుని బయటికొచ్చాయి.
"చూస్తివా.. అతనిదే తప్పంటివి! అన్న చిన్నమాటకి ఎంత యుధ్ధమయ్యిందో చూడు! అందుకే మాట అదుపు, అణకువా ఉండాలి"
"'మీ ఆడంగులకు..' ఊ.. అదేగా మనసులో మాట. అనేయ్.. చల్లకొచ్చి దాపిరాలెందుకూ?" శారిక అనేసి మొహం తిప్పుకుంది. ఇంతలో ఏదో గుర్తొచ్చి పెనివిటివైపు తిరిగి..
"అవునూ.. కుసుమించని కురవకం..!"
"ఊ.. కురవకానికి ఆలింగనమే దోహదం.. ప్చ్.. ప్రేమికుడు.. సరసుడు!" మాట ముగిస్తూ శారిక వైపు చూసాడు సాలోచనగా..
"ఊ.. ఊ.. నేనంత తెలివిమాలినదాన్ని కాదులే! ఇలాంటి కజ్జాలు పెట్టుకోనుగా!" నవ్వింది శారిక.


        
                                         ***

* మరో కథ రేపు..

* దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ""శృంగార నాయికలు"   ఆధారంగా.. కాసింత కల్పన జోడించి..

Monday, October 1, 2012

వలపు బిచ్చమొద్దు.. పో.. (నాయికలు - 1 )

మునిమాపువేళలు మహచక్కనైనవి. అందమైన రోజుకి ముక్తాయింపు సాంధ్యరాగాలతో ఇవ్వబూనిన సృష్టికర్త ఎంత నేర్పరి! నారింజవెలుగుల పడుగుకి నీలవర్ణపు పేక కలనేసి, అక్కడక్కడా మినుకు చుక్కల బుటాలు అద్దినట్టున్న సంజె చీర చాటున భూమీ ఆకాశం పెనవేసుకోబోతున్నట్టున్నాయి. ఆ వర్ణచిత్రం ఎంత మనోహరంగా ఉన్నా దానికి నిండు తెచ్చేదైతే ములుగఱ్ఱ చేతపట్టి, మందలను అదలిస్తూ ఇల్లు చేరేందుకు వడివడిగా అడుగులేస్తున్న అతడు. వీధిమలుపు తిరగగానే అతని చూపు వెతికేది ఎవరినో తెలుసా.. కళ్ళవాకిళ్ళలో ఆహ్వానపు దీపాలు వెలిగించి ఎదురుచూస్తున్న ఆమెను!   ఆమే గమ్యం.. అతని నడకకీ, ఆ మాపుకీ.

ప్రతి సాయంత్రం ఇంత మామూలుగా ఉంటే, ప్రతి జంటా ఇంతే పొత్తుగా ఉంటే, ఆపై ప్రతి రేయీ ఇలాగే నల్లేరుమీద బండిలాగా గడిచిపోతే అదిగో.. ఆ గురివింద పొదరింట కువకువలాడుతున్న  దేవలోకపు శారికలకు ముచ్చట్లాడుకోడానికి కబుర్లేముంటాయీ? ఆ గొరవంక జంట తిరిగి వాటి అచ్చర లోకానికి వెళ్ళాక త్రవ్విపోసుకోడానికి కథలేముంటాయీ?

                                                    ***

"అలా తలుపేసేసిందా! నేను నమ్మనుపో.." కుడిరెక్కని ముక్కుతో గీరుకుంటూ కువకువమందా శారిక.
"ఏం.. నన్ను ముక్కుతో పొడిచి తరిమిన రోజులు లేవేమో ఎవరి ఖాతాలోనో! మీ ఆడవాళ్ళకి మామూలేగా.. మూతిముడుపులూ, శాపనార్ధాలూ, వెటకారాలు నూరడాలూ.." అదును చూసుకు అక్కసు తీర్చుకున్నాడా పిట్ట పెనివిటి.
"పోవోయ్, మరీ చెప్తావు. చెట్టంత మగాడిని తలుపు బయట నిలబెట్టి చెరిగేసిందంటే అతగాని తప్పేవీఁ లేకుండానే?!"
"పిట్టంత నువ్వే నమ్మనప్పుడూ.. అతడు ఇక చెట్టంత ఉండీ ప్రయోజనమేముందీ!" నిట్టూర్చాడు.
"ఇలా కాదు కానీ, ఏం జరిగిందో నువ్వు సగం సగం చూసి చెప్పడం, నేను వినడం దేనికీ? పద వెళ్ళి చూసొద్దాం." రెక్కలు టపటపలాడిస్తూ ఆయత్తమైంది.
"ఇదిగో.. లేచిందే ఎగరడమా..? మాయ గోరింకా.. నీకు రాత్రీ పగలూ తేడా లేకపోవడం నాకు చచ్చేచావయ్యింది. ఉండూ.. ఆ దక్షిణం వీధిలో రెండో ఇల్లు." అరుస్తూ అనుసరించాడు.
గోరింకలు జంటగా ఎగిరెళ్ళి ఆ ఇంటి వాకిట్లో విశాలంగా విస్తరించిన చంపకవృక్షపు కొమ్మల్లో చేరాయి. సన్నగా వీస్తున్న పిల్లగాలి ఉండుండీ సంపెగ అత్తరు పూసుకు మత్తెక్కిసోలుతోంది. చీకటి ఆపని కంటిచూపు ఆ గోరువంకల లక్షణం. సూటిగా ఆమె పడకింటి కిటికీ కనిపించేలా ఓ కొమ్మ మీద సర్దుకుని, బయట గుమ్మంలో నిలబడ్డ అతడిని పరికిస్తూ వినసాగాయి.
                                                      ***

"రాధా,, తలుపు తీయవే అమ్మీ.."
"అయ్యో దొరవారూ! ఇంకా గుమ్మంలోనే ఉన్నారా? చిత్తగించారనుకున్నానే!" కావలసినంత వెటకారం ప్రతి పలుకులోనూ కూరి కూరి సంధించిందామె.
"కాస్త ఆలస్యమైనందుకే ఇంత కినుకా బంగారూ! ఎలా వెళ్ళనూ.. నిన్ను చూడనిదే ఉండలేనని తెలీదూ! నువ్వు నా ప్రాణానివి.." ఓరగా తెరిచిన కిటికీ కి దీనంగా తల ఆన్చి పిలిచాడు.

శయ్యపైనుండి లేచి కవాటం వైపు నడిచివచ్చిందామె. ఆశగా తలుపువైపో అడుగు వేశాడతడు. కిటికీలోంచే చెయి సాచి ఆతని మెడలో వేలాడుతున్న పున్నాగల మాల పట్టుకు ఆపింది. అనుమానపు కటకటాల అవతల ఆమె, ఇవతల ఆతడు. తీయగా నవ్వి మాయ చేద్దామనుకున్నాడు. టక్కరి వేషాలు పట్టనట్టు అతనిని ఇంకా దగ్గరకి లాగి ఆతని మేను మత్తుగా విరజిమ్ముతున్న పరిమళాన్ని పసిగట్టిందామె.
"చందనం..!" ముక్కు ఎగబీలుస్తూ రోషంగా పలికింది.
"నీ కోసమే! సింగారాలు మగువలకేనా.. మేమూ మిమ్మల్ని మెప్పించద్దూ?"
"మాయమాటలాడకు మురారీ!"
"లేదమ్మీ..నిజం! నమ్మవూ!"
"ఉహూ.. నిన్ను నమ్మమన్నదెవరు? టక్కరివి, జిత్తులమారివి."
"అబ్బా.. రాధా. నా వల్ల కాదీ శిరోవేదన!"
"నేనా! నేనేనా శిరోవేదననీ!"
"ఉహూ.. కాదు కాదు. అపార్ధం అపార్ధం! తలనొప్పి రాధా. లోపలకి రానివ్వవూ.. నీ ఒడిలో తలపెట్టుకు పడుకుని, నీ నాజూకైన వేళ్ళ స్పర్శ తగిలితే కానీ పోదు."
"హ్హు.. నా వేదన ముంది నీదెంత!"
"చందనమద్దుకుంటేనే అనుమానమా! ఇలా సాధిస్తావని తెలిసి ఉంటే చెమట ఒంటితోనే నీ ముంగిట వాలేవాడినిగా! పన్నీట సరిగంగ స్నానాలాడేవాళ్ళం. రాధా.. ఎన్నాళ్ళయ్యిందో మనం జలక్రీడలాడి!" కవ్వించాడు.
కరిగి నీరవబోయేదే.. క్షణంలో ఆమె చూపు సూటిగా ఆతని పెదవులను తాకింది. ఆతని సెలవి నంటిన తమ్ములపు ముద్ర!! ఆమె కంటబడింది.

విసురుగా వెనక్కి తిరిగి, చరచరా శయ్య చేరి కనుకొలకుల జారుతున్న నీరు అటుతిరిగి దాచుకుంది. ఆమె కోమలమైన చేయి పందిరిమంచపు స్థంభం చుట్టూ బిగిసి రక్తవర్ణంలోకి మారసాగింది. పెదవులు అదురుతున్నాయి. చూపు మసకబారి, కాటుక కన్నీట కరిగి గులాబిబుగ్గలను కమ్మేసేందుకు సిధ్ధపడుతోంది. నిస్త్రాణగా వాలిపోతోంది ఆమె తనువు.

"అమ్మీ.. చీకటి! నేనొచ్చి ఝామయ్యింది. కరుణ కరుణ!" పడకటింట ప్రవేశం కోసం జగదేకవీరుడైనా "పాహి..!" అనడానికి సైతం వెనకాడడు మరి!
"ఆ కరుణ దగ్గరకే వెళ్ళు." గద్గద కంఠంతో ఉరిమిందామె.
"ఇంత అనుమానమైతే కష్టం సుమీ.. ఏమయ్యిందిప్పుడూ.."
"బుకాయించకు మాయావీ. నువ్వు కోటి పూవుల వాలే తేటివని ఇన్నాళ్ళూ విన్నానంతే.. ఇప్పుడు సాక్ష్యాలతో కన్నాను. మహా సంతోషంగా ఉంది. కడుపు నిండిపోయింది." వెనుతిరగనైనా తిరగకుండా విసురుగా చెప్పింది.
"అన్యాయం!! నీవే తప్ప ఇతఃపరంబెరుగ.." నమ్మబలికాడు.
ఒక్క విసురున ఇటుతిరిగింది ఆవేశంగా.. వాల్జడ నాగుపామై గాలిలో ఎగిరి ఆమెను చుట్టేసింది.
"అవునేం! నేనే తప్ప వేరే ఇంతిని ఎరుగని వాడివి కదూ! ఆ చందనపు పూత ఏవిటో, ఎవరిదో తమరెరుగరు. కదూ!"
"ఉహూ.. " అనేసి నాలుక కరుచుకున్నాడు.
"అదే అదే.. ఒకరా ఇద్దరా! వెయ్యికి పైగా  ప్రియురాళ్ళు. రేయికి ఝాములు మూడేనాయే! చుక్కల్లో చంద్రుడు నయం! నెలకోమారు అని వంతు ఇవ్వగలడు. తమరికి లెక్క గుర్తుండే అవకాశమేదీ!"
"నీ కోసమని ఇంత దూరం వస్తే.. ఇదా మరియాద?"
"హ్హహ్హా.. నా కోసమా! నమ్మమంటావా?"
"నిజం భామినీ.. నీ కోసమే! నిజం.."
"ఉహూ.. నమ్మనుగాక నమ్మను. దారితప్పే వచ్చావు. చీకటిపడగానే ఏదో మోహయాత్రకి బయలుదేరి ఉంటావు. ఒక ఇంట గంధపు మైపూత పూసి ఉంటుందో చెలి. ఆనక మరో ఇంట వేరే పడతిని కూడి ఆమెను చుంబించి ఉంటావు. ఆమె తాంబూలంతో నీ పెదవి ఎరుపెక్కింది. ఆ తమ్ములపు చారిక నీ పెదవి కొసకు అంటింది. నేను చూడలేదూ! నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా? తాంబూలం పంచుకున్నావంటేనే అర్ధమవుతోంది.. ఆమెకు నీ మనసులో ఎంత చోటిచ్చావో!"
అప్పటిదాకా క్రోధంతో ఎరుపెక్కి ఉన్న ఆమె కళ్ళు హఠాత్తుగా సజలాలైపోయాయి. గొంతు పూడుకుపోతూండగా అంతులేని వేదనతో తడబడుతున్నాయి ఆమె మాటలు.
"ఆ పెదవులు.. నా కాంతుడి పెదవులు.. మరొక పడతి ముద్దాడిందంటే అంతకంటే నన్ను దహించే నరకం మరొకటుంటుందా?"

ఆపలేని కన్నీటి జడివానలో తడిసిముద్దైన మోము, వలిపంపు పయ్యెద.. ఆమె అందాన్ని ద్విగుణం చేసి అతనిని ఇంకా ఆకర్షిస్తున్నాయి. వణికిపోతున్న ఆమెను బిగికౌగిట బంధించి ఓదార్చాలనుకున్నాడు.
"అంత ప్రేమగా నిన్ను మాత్రమే ముద్దాడగలను. రా ప్రియా, కౌగిలీయవూ!"
"అబధ్ధం!" క్రుధ్ధంగా అరిచింది ముకుపుటాలదురుతూండగా..
"..........."
"నువ్వు అబధ్ధం. నీ ప్రేమ అబధ్ధం.. ఫో.. దారితప్పి ఈ వేళ వస్తే వచ్చావు. మరోసారెప్పుడూ ఇటు వచ్చి పరువు పోగొట్టుకోకు. నీ చెలియలెందరో ఎదురుచూస్తూ ఉంటారు. నీకేం లోటూ...?" దుఃఖం వెక్కిళ్ళలోకి మారుతూ ఉండగా తెగిన మణిహారంలా నేలపై పడి, అలకలో కూడా ఆమె సౌందర్యదీపమల్లే ప్రకాశిస్తోంది. చందనగంధ న్యాయం.. ఆమె శోకంలో కూడా ముచ్చటగా ఉంది.

ఆతనికి విసుగు రావడం లేదు. ఆఖరు ప్రయత్నంగా మునివేళ్ళతో తలుపు మీద కొట్టాడతడు.
"వెళ్ళిపో.. నీకు లోటు లేదు. నేను కాకపోతే మరొకరు. కావలసినన్ని కౌగిళ్ళు నీకోసం ఎదురుచూస్తున్నాయి. పో.. నీకిక్కడ చోటు లేదు. ఇది మానవతులుండే ఇల్లు. ఇక్కడ నిన్ను వలపు బిచ్చమడిగే వారెవరూ లేరు. పో.. వెళ్ళిపో.. నష్టపోయింది నేనే కదూ.. నీ ప్రేమను నమ్మి.. " పలవరిస్తూ సోలిపోయిందామె.

విన్నవే ఇన్నాళ్ళు, కన్ను లారగ చూసి
నాను, నే డెంతొ ఆనందమాయె;
ఆ చందనాంకము లా తమ్ములపు ముద్ర
లే లేమవో చెప్పలేరు తామె;
వేయికి పైనాయె ప్రియురాండ్రు, రేయికో
మూడె యామము లాయె - మోహయాత్ర
నేదొ ఈ దారి నూరేగు చుబుసుపోక
వేంచేసినార లీ వేగుబోక;

వలదు విడియగ నిట మానవతులె గాని
వలపు బిచ్చ మాశించెడు వారులేరు,
పిలుచుచున్నవి వేరె కౌగిళులు, వెడలు
మనుచు తెగనాడు 'ఖండిత'యైన రాధ.



గొరవంకలు మొహాలు చూసుకున్నాయి. జాలిగా ఉందామెపై.. అతనిపై ఆమె వేసినవన్నీ అభాండాలే అని తేలి ఇద్దరూ కలిసిపోతే బాగుండుననిపించింది. మౌనంగా ఆ 'ఖండిత నాయిక'ను చూస్తూ నిట్టూర్చి, అక్కడి నుండి తప్పుకున్నాయా పిట్టలు.

"హ్మ్.. గొడవ సుఖాంతమైతే బాగుండును." పలికింది శారిక.
"నీ పలుకు తథాస్తు దేవతలు వింటే బాగుండును." బదులు పలికాడామె పెనివిటి.
"ఇంతేనా.. సుఖంగా గడిపే జంటలు లేవా ఈ ఊళ్ళో..?"
"ఇంటికో కథ. కాసేపు విశ్రమించు.. అన్నీ ఒకే రోజా!" అన్నాడు నవ్వుతూ మగ గోరింక.
                                       
                                                ***

* గొరవంకల కంటపడిన మరో కథ రేపు ..

* దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ""శృంగార నాయికలు"   ఆధారంగా.. కాసింత కల్పన జోడించి..