Saturday, May 21, 2011

పాపాల భైరవుడు, గంగా బొండాం మరియు ఇంకొంతమంది

కుక్కపిల్లకైనా, కాఫీ షాపుకైనా, పుస్తకాలకైనా, బ్లాగు రాతలకైనా, వీటన్నింటినీ ప్రేమించే మనిషన్నవాడికైనా ఓ 'పేరు' కావాలి. ఎదుటివాడు పిలవడానికి, పదిమందిలో ఉదహరించడానికి, ఆ పై ఒళ్ళు మండితే తిట్టుకోడానికీ.

పేర్లు ముఖ్యం గా మూడు రకాలని నేను విభజించాను. మనం పుట్టగానే తేరగా నోరులేని, కాదనలేని, కదిలి పారిపోలేని ప్రాణి దొరికిందని అమ్మో, మేనత్తో, తాతో చంకలు గుద్దుకొని, వాళ్ళ భాషా ప్రావీణ్యం ప్రదర్శించి, వాళ్ళ వాళ్ళ కవి హృదయాలను గోకి నిద్రలేపి మరీ ఓ మూడు నుంచి మున్నూట అరవై అక్షరాల పేరు మన మొహాన తగిలించేస్తారు. బ్రహ్మ ఏం రాసి పంపాడో జాన్తా నహీ కాని, వీరు రాసిన పేరు మనం జీవితమంతా రకరకాల ఫాంట్స్ లో, రకరకాల భావోద్వేగాలతో రాస్తూనే ఉంటాం. అడిగినవాడికి కాదనకుండా కరక్టుగా మనం చెప్పేది మన పేరు మాత్రమే. (అక్రమ కార్య కలాపాలు నడిపే వారికి మరియు బ్లాగు ఓనర్లకు మినహాయింపు కలదు.)

"మా ఇంట్లో పుట్టిన పిల్లలు ఆడైనా, మగైనా "శ్రీ" తో మొదలయ్యే పేరే పెడతామని" ఊసుపోక కొత్త పెళ్ళాంతో చెప్పాడొక శ్రీధరుడు. "అదేం రూలోయ్ ! అన్ని పేర్లకీ "శ్రీ"తో జత కుదురుతుందా! లేక అలా మొదలయ్యే పేరుతో సర్దుకుపోవాలా? అని నెవ్వెరబోయింది ఆ భార్యామణి. "హాత్తెరీ, మా సాంప్రదాయం, గోంగూర" అని గిల్లి కజ్జా పెట్టుకున్నాడతను. మర్నాటి నుంచి పెంపుడు కుక్కపిల్లని "శ్రీ స్నూపీ" అని పిలుస్తున్న భార్య చతురతని, అన్యాపదేశంగా అంటించిన చురకని చూసి నవ్వుకున్నాడో, తేలుకుట్టిన దొంగలా ఊరకున్నాడో మీ ఊహకే వదిలేస్తున్నాను.

పిల్లలకు పెట్టే అర్ధం పర్ధం లేని పేర్లని, అరువు సంస్కృతిని చాకి రేవు పెట్టే పేరా ఈ పోస్టులో లేదు. కాసిని పేర్లు మాత్రం సూచిస్తా. నచ్చితే విచ్చలవిడిగా వాడేస్కోండి. మధుమేహ, ఆవేష్, భవ్క్త్యస్య... ఊ.. ఇంకా.. గూగుల్ కూడా బావుంటుందండోయ్!

పేర్ల లో రెండో రకం అబ్బో.. మీకు చెప్పక్కర్లేదు. ముద్దు పేర్లు.. బుజ్జి, చిట్టీ, లతా మంగేష్కరు, మా హీరోయిన్, మా చంటి వాడు, మా హనీ, స్వీటీ, కుకీ, చెగోడీ, సన్నీ.. "ప్రద్యుమ్న" అని కొడుక్కి పేరు పెట్టుకున్నావిడ, వాడిని 'నందూ' అని ఎందుకు పిలుస్తుందో నాకు అర్ధం కాలేదు. అడిగి తెలుసుకున్నాను లెండి అదో ముద్దు పేరని. ముద్దు పేరు అందమైన నా పేరు కి ప్రత్యామ్నాయం, చిన్నతనం, అనవసరం అని నిర్ణయించుకొని నాకు ముద్దు పేరు నేను పెట్టుకోలేదు. సర్వకాల సర్వావస్థలయందూ భవదీయురాలు అచ్చంగా "కొత్తావకాయే".

"శ్రీమన్మహారాజ! మార్తాండ తేజా! ప్రియానంద భోజా!  ఏ తల్లి కుమారులో తెలియదు గానీ, ఎంతటి సుకుమారులో తెలుసును నాకు"
ఎర్ర ఓణీ వేసుకొని విరజాజిలా నవ్వుతున్న పూర్ణిమ గుర్తొచ్చిందా? "అహా..ఏం రాసారు మాష్టారూ!" అని వేటూరి ని తలుచుకొని, స్వర్గంలో అమృతం కాఫీ కప్పులో పోసుకు ఆరారా తాగుతున్నాయనకి వెక్కిళ్ళు తెప్పించారా? నాకు మాత్రం "అసలేం రాజయోగం ఆనందరావ్ ది!" అనిపిస్తుంది.

ఈ పాట వింటే మగాడిని పేరు పెట్టి పిలిచే ప్రతి భార్యా గుర్తొస్తుంది. తప్పని కాదు, కూడదని కాదు, ఆయుఃక్షీణమని అసలు కాదు. సమానత్వం వద్దనీ కాదు. " శ్రీవారూ! కరంట్ బిల్ వచ్చింది. ప్రాణ నాధా! తడి టవల్ మంచం మీద పడేస్తే పీక నొక్కుతా!" అనమనీ కాదు. గౌరవం బయటకు చూపించి, చాటున గారాలు పోవడం ఆడదానికి అందం. గంభీరంగా కనిపిస్తూ, మాటుగా మగువ పాదాలైనా ఒత్తడం మనసులేలే దొరల రాచలక్షణం. కొత్తావకాయ కాదు "పాత చింతకాయ పచ్చడి" అని విసుక్కుంటున్నారా? హ్హహ్హాహ్హా.. వంద సార్లు పేరు పెట్టి పిలిచేసుకొని , ముద్దొస్తే ఊరందరూ పిలుచుకునే అదే హనీ, స్వీటీ అని పిలిచేసుకుంటున్నారే.. అయ్యో.. మారు పేర్ల మాధుర్యం మిస్ అయిపోతున్నారేమో అని నా ఘోష. అవడం లేదా..? గుడ్ టు నో.

నాణానికి రెండో వైపు నండూరి వారి ఎంకి మాటల్లో :

ఏకాంతమునైన "ఎంకి" యని పిలువడే
చెప్పన్ని పెర్లెట్టు - చెప్పుకుంటే రట్టు
పక్షి పేరొక మారు, పండు పేరొక మారు
రాలేన ఒక తీరు - పూలేన పలుమారు!

ఏనాటి వరములో ఈ నాగరీకాలు
పాటలో తన పరువె, బతుకులో బరువటే?

(ఇది వెలితా? మురిపెమా? మురిపాలలో వెలితా?)

ముద్దు పేర్ల అంకం దాటి ముందుకొస్తే వ్యవహారిక నామాలు. సదరు వ్యక్తుల వింత చేష్టలు, విచిత్రమైన పోకడలు చూసి, అభిమానం తో, అంతులేని అదో రకం ప్రేమతో ఇచ్చే శాశ్వత విశేషణాలను "బిరుదులు" అంటారు. ఆంగ్లమున "నిక్ నేంస్".

నోటి పూత లాగే కొందరు మనుషులకి నోటి దురద ఉంటుంది. అది శాశ్వతమైన జబ్బు కూడా!. చమత్కారానికి నోటి దురద తోడైతే మహా సరదాగా ఉంటుంది, వినేవాళ్ళకి. మా పెదనాన్న ఒకాయనకి ఈ రెండు లక్షణాలు ఉన్నాయ్. శంకరాభరణం బుట్టలు పెట్టుకున్న మా పెద్దమ్మని ఎన్నాళ్ళో " జుంకిణీ" అనేవారాయన. ( జుంకీలు = శంకరాభరణం చెవి లోలకులు) 'నిన్నే పెళ్ళాడతా' సినిమ టీవీ లో వస్తూంటే గిరజాల నాగార్జున ని చూసి "ఒయ్.. ఎవరోయ్ ఈ "గిరజుడు"? మన నాగేస్సర్రావ్ కొడుకేనా?" అని అడిగారు. కొంచెం అందం పాళ్ళు తక్కువున్న ఎవడు కనిపించినా " వీడెవడు? ఝెట్కా వాడిలా ఉన్నాడు? ఆ పిల్లా? ఇత్తడి సిబ్బీ!" అని ఎన్ని వంకలు పెట్టే వారో. తప్పే కానీ ఆయన సందర్భ స్పూర్తి కి నవ్వని వాడు లేడు. ఆయన పెట్టిన పేర్లు మర్చిపోయే వాళ్ళం కాదు. ఉప్మా లో పోపు గింజలు ఎక్కువయ్యాయని "అమ్మలూ! మినప గుళ్లనుకొని ఇనప గుళ్ళేసావే తాలింపులో" అని నవ్వారొక రోజు.  పోపుల డబ్బా చూసిన ప్రతిసారీ ఆయన గుర్తొస్తారు నాకు.

ఇన్ని తాళ్ళను తన్నిన  పెదనాన్న గారిని, తలదన్నే వాడు ఆయన కొడుకు. "తినేస్తున్నాడే బాబు! బాల మిత్ర రాక్షసుడు!" అని చాటుగా తండ్రిని విసుక్కున్నాడొసారి. నిజమే! కోర పళ్ళు, జులపాలు, బాన పొట్ట, నలుపుకి  ఒక్క ఛాయ తక్కువలో, నూరు కేజీలతో అలరారే  పెదనాన్న అచ్చం "బాల మిత్ర ముఖ చిత్ర రాక్షసుడే"!

వీధి చివరి మేడింట్లో మెట్ల మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళతో కబుర్లు చెప్పే అక్కచెల్లెళ్ళ గుంపు ని "సాలభంజిక"లని పిలుచుకునే వాళ్ళం. ఒక సాలభంజిక అలా కుర్చొని కూర్చొని, ఎదురింటి బీఈడీ కుర్రాడితో "కబూతర్ జా.. జా.." పాడేసింది లెండి. అది వేరే కథ.

మా ఇంటికి మా బావ కోసం, ఇద్దరు స్నేహితులు వచ్చేవారు. ఒకతను ఎర్రగా రాజమండ్రి జాంపండులా ఉంటే, ఒకతను నారాయణుడు. అంటే నల్లని వాడు, పద్మ నయనమ్ముల వాడనమాట. వాళ్ళ పేర్లేమిటో ఈ రోజుకి నాకు తెలియదు. వాళ్ళ ని చూడడమే తరువాయి, మా నాయనమ్మ ఒక్క అరుపు అరిచి పిలిచేది మా బావని. " ఒరేయ్ రంగా, ఎర్ర వాడూ, నల్ల వాడూ వచ్చార్రా!" అని. పాపం ఎర్రబ్బాయ్ కేం కానీ, నల్లబ్బాయ్ మాత్రం ఆ మాట వినగానే జేగురు రంగులోకి మారిపోయే వాడు అవమానంతో. పెద్దావిడ పెట్టే జంతికలు, చెగోడీలు తిని ప్రసన్నంగా వెళ్ళేవాడనుకోండి.

మా బంధువొకావిడకి సౌలభ్యం (మాడెస్టీ) పాళ్ళెక్కువ. అదోరకం మాడెస్టీ లెండి. ఎవరు కనిపించినా " నాన్నా! బాగున్నావా! నిన్నే కలలోకొచ్చావు రా! నిన్నే తలుచుకుంటున్నాను!" అని ఎంత ప్రేమ ఒలకబోసేస్తుందో! ప్రేమని తుడిచి పారబొయ్యలేక చచ్చే వాళ్ళం. వరసగా పెళ్ళి పందిట్లో వాళ్ళందరికీ వేరే పనేం లేదా?
"ఆవిడ రోజుకి ఎన్ని గంటలు పడుకుంటుందే!" అడిగాడు ఓ అన్నయ్య నన్ను పక్కకి పిలిచి.
"పోన్లేరా, పెద్దావిడ" అన్నాను నవ్వుతూ.
"ఈ రోజు రాత్రి తొందర గా పడుకోండందరూ! స్లీపింగ్ బ్యూటి కలలోకి కట్టగట్టుకొని వెళ్ళాలి కదా!"
గొల్లుమన్నారు జనాలు. పెళ్ళి అయ్యే దాక ఆవిడ నోరు విప్పి మళ్ళీ ఎవరిని పలకరించలేదు.

"పాపం, టెంత్ పరిక్షలు రాసాడట కదా! మీ చిన్నవాడు. పాపం రిజల్ట్స్ ఎప్పుడూ? ఫస్ట్ క్లాస్ వచ్చిందా? తెలివైన పిల్లాడే పాపం!" ఇవి పాపాల భైరవుల కబుర్లు.

పేర్లు చేసే మేలు చెప్పనా! నా పెళ్ళయిన కొత్తలో జరిగిన మేనమామ కూతురి పెళ్ళికి పతిని, పట్టు చీరలని ప్రదర్శించే నిమిత్తం హాజరయ్యాను. సందట్లో సడేమిటంటే..
"ఏమే, గంగా బోండాం! ఎప్పుడొచ్చావ్?" అంటూ నా భుజం బద్దలయ్యేలా ఓ చరుపు చరిచి, పలకరించింది మా పెద్దమ్మ కూతురు. పక్కనే కూర్చున్న పతి రాజా వారు ఆశ్చర్యం మేళవించిన అమాయకత్వం నటిస్తూ వినపడనట్టు నా పరువు కాపాడదామనుకున్నారు.
దానితో కబుర్లు చెప్పి పంపేసి, ఇటు తిరిగానా! "ముద్దు పేర్లు లేవన్నావ్, గంగా బోండాం!" వెక్కిరించారు ఇకిలిస్తూ.
"అదా! ముద్దు పేరు కాదు ఘనాపాటి, గండరగండడు లాంటి బిరుదు గంగాబొండాం." అన్నాను.
"అదేంటి?"
"నా చిన్నప్పుడు తోటలో, దింపించిన బొండాలు దింపించినట్టు తాగేస్తోంది మా అక్క. "నాకేవీ" అని అడిగితే ఖాళీ బొండాం చేతిలో పెట్టి పళ్ళికిలించింది. అసలే ముక్కోపినేమో.. బొండాం దాని నెత్తినేసి పగలగొట్టాను. ఆరు కుట్లు పడ్డాయి నడి నెత్తిన. అప్పుడు నా వయసు తొమ్మిదేళ్ళు..." చెప్పుకు పోతున్న నాకు కొంచెం దూరంగా జరిగి భయంతో నిండిన ఆరాధనతో చూసారు పతిదేవుల వారు.
అప్పటి నుంచి నా విలువ వింధ్యాచలంలా భీభత్సంగా పెరిగిపోయిందని వేరే చెప్పక్కర్లేదుగా!

20 comments:

 1. ఎంత బాగా వ్రాసారు! నవ్వుల పువ్వులండి..ఒక పువ్వు మాది కుడా అయినందుకు చాలా సంతొషం :-))

  -sandhya

  ReplyDelete
  Replies
  1. అదరగొట్టేసారు గంగాబొండం(క్షమించాలి సరదాకి..) గారు
   నవ్వాగలేదు..
   "కానీ, నల్లబ్బాయ్ మాత్రం ఆ మాట వినగానే జేగురు రంగులోకి మారిపోయే వాడు"
   కాని జేగురు రంగు ఏంటో తెలియదు, కానీ భావం అర్ధమైంది.
   మీ "హాస్యాసం" చాలా బాగుంది,
   బుజ్జి, (నా ముద్దు పేరు)

   Delete
 2. మీరు తియ్యని వారు. సంతోషం నాదే,నాదే. :)

  ReplyDelete
 3. చక్కటి కవనం. చదువుకోవటానికి హాయిగా ఉన్నది. ధన్యవాదాలు.

  ReplyDelete
 4. @ శివరామ ప్రసాద్ గారు
  సంతోషం. ధన్యవాదాలు.

  @ రాజా
  :)

  ReplyDelete
 5. బాగుందండీ మీ పేర్ల ప్రహసనం. ముద్దు పేర్లు జీవితాంతం వదలవు. తాత గారైనా ఇంకా చంటబ్బాయ్ అనే పిలుస్తారు. గంగా బోండాం పేరు బాగుంది మరి కొత్తావకాయ గా ఎందుకు మార్చుకున్నారో. :):)

  ReplyDelete
 6. @ బులుసు సుబ్రహ్మణ్యం గారు,
  బిరుదులు పెద్ద బేగేజీ కదండీ! ఎవరినైనా భయపెట్టడానికి అప్పుడప్పుడు విష్ణుచక్రంలా వాడుకోవాలి కానీ! అందుకే "గంగాబొండాం" ఇంట్లో దాచేసి కొత్తావకాయగా చలామణీ అయిపోతున్నా. :)
  ఇంతకీ చంటబ్బాయ్ మీరా? మీ తాతగారా?
  కామెంటుకు ధన్యవాదాలు. :)

  ReplyDelete
 7. సుస్మిత నేను మాత్రం ఈ పేరు మీద ఫిక్స్ ఐపోతాను.. చాలా బావుంది..
  అరివీరభయంకర సహోదరీ కపాలమోద గండరగండ గంగాబోండం కొత్తావకాయ

  ReplyDelete
 8. daani baarina padina daanni nenenandi.... chandana

  ReplyDelete
 9. బాగుందండి ముద్దుపేర్ల ప్రసహనం. మీరు తెలుగు లిటిరేచర్ చేశారా..? మీ తెలుగు బ్రహ్మాండంగా వున్నది. నాకయితే ఒక్కటి కూడ ముద్దుపేరు లేదు చిన్నప్పటినుండి హమ్మయ్యా బతికిపోయా

  ReplyDelete
 10. @జ్యోతి గారు

  మీరెలాగంటే అలాగే! మహా భాగ్యం. :)

  @చందనక్కా!

  ష్.. గప్ చుప్

  @కమల్ గారు

  లిటరేచర్ చెయ్యలేదండీ. వంట చేస్తుంటాను.:) ధన్యవాదాలు. కొత్తావకాయకి స్వాగతం.

  ReplyDelete
 11. చక్కని భావ వ్యక్తీకరణ. అవునండి. మీ తెలుగు చాలా బాగుంది.

  ReplyDelete
 12. మీ బ్లాగ్ కొత్తగా కనిపెట్టాను. చాలా ఎంజాయ్ చేస్తున్నాను.

  ReplyDelete
 13. @ శిశిర గారు,
  థాంక్సండీ!

  @ సుజాత గారు,
  అవునా! చాలా సంతోషం. ఆ మధ్య నెమలికన్ను మురళి గారు మీ గురించి రాసిన టపా చదివినప్పటి నుంచీ నేనూ మీ బ్లాగుని వదలడం లేదులెండి. :)

  ReplyDelete
 14. చాలా బాగా వ్రాసారండీ. విచిత్రం ఏమిటంటే, ఈ మూడు రకాల పేర్లు జీవితాంతం భరించేది మనమే అయినా ఇవి పెట్టే వాళ్ళు క్షణమైనా ఆలోచించక కేరెలెస్ గా తీసుకున్న నిర్ణయాలు.
  -- ఒక బుజ్జిగాడు.

  ReplyDelete
 15. Started reading your posts(from the bottom) one after the other after seeing your intro in Jajimalli Blog. All the posts are different and I enjoyed thoroughly. But this post made me laugh. Especially Sri Snoopy and GangaBondam. Thanks for making me laugh.

  -SJ

  ReplyDelete
 16. భామ నామాలు అని నేను ' మిస్సెస్ అండర్ స్టాండింగ్ ' బుక్ లో రాసిన ఓ స్కెచ్ ఈ రచనకి దోస్తే ..
  మంచి సబ్జెక్ట్ పంచ్ తో పంచారు .నాపేరు నా రాజు జపమన్న ' అ ప వా దు ' ఈజనమకే కాదు ఎప్పటికి పోదు అని సణుగుతుంది ఎంకి !!

  ReplyDelete
 17. wow...mee rachanaa saamardyam..nijamghaa..amogham :)....nijamgaa kothavaakayaa..vadagaachina neyyi...vedi vedi annam...anthati anubhuthi..mee kadhalu... :)

  ReplyDelete
 18. morning breakfast,chaalaa fresh gaa vundi!!
  thank you!!

  ReplyDelete