Friday, May 27, 2011

తెల్లవారు వచ్చె

"నలుపు నారాయణుడు మెచ్చు" అని నానుడి ప్రత్యేకంగా చెప్పాలి గాని, "తెలుపు నరులెల్లరూ మెచ్చు." అందర్లాగే నాకూ తెల్లని మల్లెలన్నా, తెలతెల్లని మంచు జల్లులన్నా, నేను వలస వచ్చిన దేశపు తెల్లవాళ్ళన్నా మంచి అభిప్రాయమే ఉంది. "స్మిత భాషణం, స్మిత పూర్వభాషణం రాముడి లక్షణాలని వాల్మీకి వర్ణిస్తాడూ.. అవి అమెరికా ప్రజలక్కూడా ఉన్న లక్షణాలోయ్.. " అని మా మాతామహులు వారి అమెరికా ట్రావెలాగ్లో రాసుకున్నారు.  చిన్నప్పుడే నేను  అది చదివి 'అహ్హా.." అని నోరెళ్ళబెట్టి నమ్మేసాను కూడా. గువ్వలన్నీ వాటి గూట్లో అవి ఆనందంగా గడిపేస్తూ ఉన్నాయ్ .

ఇంతలో, ఓ శుభసాయంత్రాన కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన శ్రీవారు చెప్పారు. వారి తెల్ల బాసు, పెళ్ళాం గారు సాపాటికి వస్తారని. వచ్చేసింది. అమెరికా వెళ్ళిన ప్రతి భారత నారికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే రోజు.. తెల్ల వాండ్రకు వండిపెట్టే రోజు. విశేషణాలేం వాడదలచుకోలేదు. అప్పటికే చాలా మంది చెప్పడం వల్లా, చాలా బ్లాగుల్లో తెల్లవారితో మనవారి బంతి భోజనాల ముచ్చట్లు విన్నందువల్లా నేనేం పెద్దగా చలించలేదు.

ఆ రోజు వచ్చింది. మెనూ మీకు చెప్పకపోతే ఎలా? బుట్ట పకోడీ (భయపడకండి. కేబేజీని బుట్ట అని, కాలీ ఫ్లవర్ని పువ్వు అని మా నాయనమ్మ భాషలో పిలుచుదురు.) ఏం చెప్తున్నాను? ఆ.. బుట్ట పకోడీ, మినీ మసాలా దోసె, బాసుపత్నికి ఇష్టమని చెప్పిందని బంగాళదుంప - పువ్వు కూర, (ఆలూ గోబీ), చీస్ లేనిదే వాళ్ళ పొట్ట బరువెక్కించలేం కనుక పనీర్ బటర్ మసాలా, వెజ్ బిర్యానీ, ఆఖరున సేమ్యా పాయసం విత్ వెనిల్లా ఐస్క్రీం. విందుకి పిలిచిన మరో జంట భారతీయులే. ఆవిడ ఈ శతాబ్దపు రుచికరమైన మైసూర్ పాక్ లు చేసి తెచ్చింది.

అనుకున్న సమయానికి అనుకున్నట్టు కేథీ సమేత కెన్ మహాశయులు విచ్చేసారు. అట్టహాసాలు, వావ్ లు.. మా అద్దె గృహమును "వాహ్ టే బ్యూటిఫుల్ కొంపని" మెచ్చి మురిసిపోవడాలు, ఆ రోజు విందుకు విచ్చేసిన మరో ఇండియన్ జంట పిల్లల్ని, నా పిల్లాడిని మెచ్చి ముద్దిచ్చి బొమ్మలిచ్చి ఆనందించడము జరిగింది. తెల్లవారితో కబుర్లలో సాధారణ టాపిక్ లు, మన పెళ్ళిళ్ళు, తలిదండ్రులతో కలిసి ఉండడం, వెజిటేరియనిసం (ఇక్కడా వీగన్ లు ఉన్నప్పటికిన్నీ) ఇలా ఉంటుందని నేను చెప్పక్కర్లేదుగా. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఎలా నడిచిందయ్యా అంటే..

"ఎన్నేళ్ళయింది మీకు పెళ్ళయి?" బాసిణి ప్రశ్న.
"ఎనిమిది."
"పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా? అలా ఎలా చేసుకుంటారు?"
"అయ్యో రాత. పెద్దలు కుదిర్చినదైనా, మనం కుదుర్చుకున్నదైనా పెళ్ళంటూ అయితే ఆపై అంతా మిధ్య తల్లీ"
"మీ బుడ్డోడికి కూడా మీరే కుదురుస్తారా?"
నోటి దురద ఆపుకోలేక జోకొకటి పేలుద్దామనుకొని అక్కడున్న మన ఇండియన్ జంట మనో భావాలను దెబ్బతీయడం ఇష్టం లేక ఊరుకున్నాను.

ఇక్కడ చిన్న వెనుక వెలుగు. అనగా ఫ్లాష్ బాక్. మా ముత్తవ్వ గారి ముత్తవ్వ గారు మంచి ఎండలో భోజనం వేళకి వచ్చిన ఒక మహామునికి తన వాటా "పణత పొట్లకాయల కూర" తో భోజనం పెట్టారట. ఆ రుచికి, త్యాగానికి మెచ్చిన మునివర్యులు వరమిచ్చారట. ఇంట పుట్టిన ఆడ పిల్లలు ఎదురులేని తేజస్సు గలిగి ఉంటారని. ఆయనే దూర్వాస ముని. ఆ తేజం ముక్కోపం. కట్ చేస్తే నా పెళ్ళిలో ఎదుర్కోలు పానకపు బిందెల దగ్గర మా తండ్రిగారు తినిపించిన లడ్డూని మాత్రమే తిని చెయ్యి భద్రంగా వాపసు ఇచ్చేసిన నా పతిదేవుని భోళాతనానికి మెచ్చి, నా దుర్వాస మానస పుత్రిక అంశను, కోడి గుడ్డుకు ఈకలు పీకే అంశను పుట్టింట్లో ఉట్టి మీద వదిలి వెళ్ళమని నా చేత ప్రమాణం చేయించుకున్నాకే, నన్ను కన్యాదానం చేసారు మా తండ్రిగారు. అప్పటి నుంచి నేను చూసీ చూడనట్టు అన్ని విషయాలు లైట్ తీస్కుంటూ ఉంటాను. నేను మెతకదానినని, అమాయకురాలిననీ, ఏ అభిప్రాయం లేనిదానినని భ్రమించే జనులను చూసి ఆడ 'ఇంద్ర' లా మనసులో "వెర్రి వాళ్ళారా..! " అని నిట్టూరుస్తూ ఉంటాను. ప్రపంచ శాంతి కోసం మా పితృదేవులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యకి కట్టుబడి ఉన్నానన్న మాట.

"మీ తలిదండ్రులు ఎప్పుడూ దెబ్బలాడుకోలేదా? డైవోర్స్ అనే పధ్ధతే లేదా? పెళ్ళయిన రెండు నెలలకు మొగుడు నచ్చలేదనుకో,కరకర ఏం కర చేసేదానివి?" పకోడీ ప్లేట్ చేత ధరించిన బాసు సుందరి మరో ప్రశ్న.
దీన్సిగతరగా.. నా జీవితం గురించి నాకున్న ప్రశ్నలు చాలవా, ఏం?  కానీ అక్కడ మళ్ళీ నోరు పెగలదు నా బోటి వాళ్ళకి.
"Luckily we survived to bug each other.. హిహ్హీ"  ఛీ.. నా జీవితం.
కాసేపు ఈ కబుర్లు, ఆ కబుర్లు చెప్తూ వండినదంతా తోడుకు తినేసామా?
"సో, మీ అమ్మ వాళ్ళూ గుర్తొస్తారా? మిస్ అవరా? మీకు ఇక్కడ నచ్చిందా? ఇండియా బాగుంటుందా?"

పురజనులారా, అర్ధం అయిన వాళ్ళు కాసేపు రామ నామ స్మరణ చేస్కోండి. కానివాండ్ర కళ్ళు తెరిపించాలి నేను.

"ఓ ప్రభూ, యే ఇంట్లో కోడళ్ళు ప్రాంతీయతా భావాలని తోసిరాజని పుట్టింటి వంటల్ని వండగలరో,
యే ప్రాంతంలో విగ్రహాలు విద్వేషాలకు బలికాకుండా ప్రేమ పాత్రమవుతాయో, గర్వకారణమవుతాయో,
యే రాష్ట్రంలో పూతరేకులు, దం బిర్యానీ సమానంగా ఆదరించబడి ఆనందించబడతాయో,
యే దేశంలో రాష్ట్రాలు తోడేళ్ళు, గురివిందల ప్రమేయంలేకుండా సదుపాయమే ప్రాతిపదికగా విభజించబడతాయో,
యే ప్రపంచంలో తెలివితేటలు అవకాశాలతో పాటు అసూయని కొనితెచ్చి ద్వేషించబడవో,
యే లోకంలో సహనం, గుట్టుగా ఉండడం చవలాయ్ తనం గాను,భావ దారిద్ర్యం/రాహిత్యం గాను పరిగణించబడవో,
యే కుటుంబంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు గిఫ్ట్ గా ఇవ్వబడి, " పోవోయ్, ఇది నీకెందుకూ " అని వెనక్కి తీసుకోబడవో,
అలాంటి ఉదయంలో, అలాంటి ప్రపంచంలో నన్ను, నా ప్రపంచాన్ని నిద్రలేవనీ ప్రభూ.. !

(టాగోర్ కి ప్రేమతో కూడిన క్షమాపణలతో)

P.S. : "Don't you miss your parents? Are you gonna stay or go back?"
"Yeah, I do miss'em but after getting married wherever you be with your kids, that's home. Provided, a husband to pay the bills."

సర్వే జనా సుఖినోభవంతు

12 comments:

 1. Poor husband.. only to pay the bills:)

  గీతాంజలి లో మొదటి వాక్యం అసలు ఒప్పుకోము. భార్య ఇంటి వంటలే భర్తా పిల్లలు తినక తప్పదు.

  ReplyDelete
 2. He he. Speaking of electronic gadgets as gifts...

  When we were kids, my cousin brought us a set of walkie-talkies from US. We were "palletoori-bythulu" at that time and didn't appreciate the awesomeness of that gift. Now I repent, the things we could've done with those things :(

  BTW, I thought americans would be well-acquainted with our ways by now. So, they're still wondering about how arranged marriages work out ?? ;) :) :)

  ReplyDelete
 3. హ హ హ మీ బ్లాగు ఇప్పటివరకీ చూసినట్లు లేను.
  చాలా బాగుంది, నచ్చినవన్నీ పేస్టే చేయట్లేదు లెండి నేనిక్కడ పెద్దదయిపోతుంది:-))

  -నోటి దురద ఆపుకోలేక జోకొకటి పేలుద్దామనుకొని
  మీరా జోక్ చెప్పి తీరాల్సిందే, మాకు :-)

  --యే లోకంలో సహనం, గుట్టుగా ఉండడం చవలాయ్ తనం గాను,భావ దారిద్ర్యం/రాహిత్యం గాను పరిగణించబడవో,

  Awesome.

  ReplyDelete
 4. @ బులుసు వారు,

  అవును. భార్య (పుట్టిన)ఇంటి వంటలే. :)

  @ రాజా,

  హహ్హాహ్హా.. మాకు చిన్నప్పుడూ అలా గిఫ్ట్ లు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు పుట్టిన రోజని, ఆ రోజని, ఈ రోజని, ఆ ఫోను, ఆ పాడ్ కొని తెచ్చి.. తెల్లారి లేచేసరికి "హుష్.. కాకీ" అనేస్తున్నారు. ఘొల్లున ఇలా బ్లాగెక్కి ఏడవడం మినహా ఏం చెయ్యలేకపోతున్నాను. :(

  Americans know our ways very well but they would bring these topics, so that they could make us happy by being over curious. I guess, they think we won't share/have any other topic in common with them like golf, fishing, literature ot steak. :)

  ReplyDelete
 5. @ కుమార్ గారు,

  మీరు నా "మిలియన్ డాలర్ ప్రశ్నలు" చదివారు. మరిచిపోయి ఉంటారు.
  కొత్తావకాయ కి స్వాగతం. :)

  జోకు చెప్పడానికి అభ్యంతరం లేదు కానీ మీరూ భారతీయులేనే!

  ReplyDelete
 6. అవును, మనోభావాలు గాయపడితే పడ్డాయి, ఆ జోకేంటో మీరు చెప్పాల్సిందే!

  టాగోర్ కి మీరు సమర్పించిన పద్యాన్ని (పాటా?) నేను రోజూ లేవగానే చదూకోవాల్సొచేట్టుంది

  మీ ఆవకాయ మరీ ఇంత ఘాటనుకోలేదు.:-)

  ReplyDelete
 7. @ సుజాత గారు,

  "ఏదో సామెత చెప్పినట్టు" అన్నామంటే, అది పదుగురిలో చెప్పే సామెత కానట్టేగా! ఈ జోకూ ఇంచుమించు అలాంటిదే. మిమ్మల్ని, కుమార్ గారిని బజ్జులో కలిసినప్పుడు జోకుతానులెండి.

  టాగోర్ కలలోకి వచ్చి గుబురు గడ్డం చాటున ఓ చిన్ననవ్వు నవ్వుకున్నంత సంతోషం, మీకు ఆ పేరడీ నచ్చినందుకు. :)

  ReplyDelete
 8. హ్హహ్హహ్హ! మీరు మాత్రం సామాన్యులు కారు అని నిరూపించారుగా! ఏం వ్రాశారండీ! ఎన్ని సార్లు నవ్వుకున్నానో! మరీ ముఖ్యంగా కొన్ని ఐతె..టపాకయలే! :))

  >>దీన్సిగతరగా.. నా జీవితం గురించి నాకున్న ప్రశ్నలు చాలవా, ఏం? కానీ అక్కడ మళ్ళీ నోరు పెగలదు నా బోటి వాళ్ళకి.
  "ళుచ్కిల్య్ వె సుర్వివెద్ తొ బుగ్ ఏచ్ ఒథెర్.. హిహ్హీ" ఛీ.. నా జీవితం.
  కాసేపు ఈ కబుర్లు, ఆ కబుర్లు చెప్తూ వండినదంతా తోడుకు తినేసామా?

  'తోడేసుకు తిన్నమా' హ్హహ్హహా....ఏం అన్నారండీ!!

  >>కేథీ సమేత కెన్ మహాశయులు విచ్చేసారు.

  >>బాసిణి,వెనుక వెలుగు. అనగా ఫ్లాష్ బాక్, ఆడ 'ఇంద్ర',బాసు సుందరి

  నాకు ఈ పదాలు భలే నచ్చాయి!!

  మీరు సూపరు..కత్తి...కేక...గునపం...గడ్డపార(బులుసుగారి సౌజన్యంతో)

  ReplyDelete
 9. "దీన్సిగతరగా.. నా జీవితం గురించి నాకున్న ప్రశ్నలు చాలవా, ఏం?"...... హహహ.

  అద్సరేగానీ బానే కోసావ్ కోతలు..ఇంతకి సహనం, గుట్టుగా ఉండడం ఎవరికమ్మా, తమరికా? అబ్బ చా...మా చెవుల్లో బుట్టలేమైనా కనిపిస్తున్నాయా...గంగాబోండం అని ఊరికే అన్నారా నిన్ను!

  ReplyDelete
 10. @ ఇందు గారు,

  టపాకాయలు పేలాయన్నమాట. రక్షించారు. ధన్యవాదాలు :)

  ఓ సౌమ్యా,

  చూసావా! :O నా పూర్వాశ్రమ వైభవం తెలిసిన నువ్వు ఎంత ఆశ్చర్యపోతున్నావో. ఈ లెక్కన ఎంత సహనంగా, మప్పితం గా ఉన్నట్టు నటించాల్సి వస్తోందో చూడు. వివాహం విద్యా నాశాయ అని ఎవరన్నారు? వివాహం "ముట్టె పొగరు" నాశాయ.

  ReplyDelete
 11. టాపిక్స్ మాట్లాడితే మనం సంతోషిస్తామని వాళ్ళకి తెలుసు కాబట్టి అవే ప్రశ్నలు అటు తిప్పీ ఇటు తిప్పీ అడిగి మనని ఖుష్ చేయ్యడం వాళ్ళకి బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్....పోస్ట్ అదుర్స్...

  ReplyDelete
 12. బాగుందండి మీ తెల్లవారు వచ్చె. బాబోయి.. మీ మహిళా మణులందరూ మంచి హాస్యప్రియుల్లా వున్నారు..దంచేస్తున్నారు. జంధ్యాల గారు ఉండుంటే ఎంత ఆనందపడేవారో మీలాంటి రచయత్రులను చూసి. నిజానికి హాస్యం రాయడం చాలా కష్టం.. నావల్ల అస్సల్ కాదు మీరేంటో చాలా సులువుగా రాసిపడేస్తున్నారు ప్చ్

  ReplyDelete