Thursday, June 30, 2011

పుష్ప బంధ(న)o


                                                                                                                                                  జ్యేష్ఠ బహుళ దశమి,
                                                                                                                                                  రేపల్లె.

నెచ్చెలీ,
కుశలమా?

నా లేఖ ఆలస్యం అయిందని అలిగి నీ ముద్దుమోము ఎర్రబరుచుకొని, కోలకళ్ళలో కినుక గుప్పించకు. ఇది మామూలు కుశల సమాచారం కాదు. ఆషాఢాన్ని మోసుకుని పుట్టింటికి నువ్వొచ్చాకే చెప్పాలనుకున్న సంగతులన్నీ ముందే లేఖ రాసేస్తున్నా! స్మృతులు నెమరు వేసుకుంటూ, సిగ్గు సగం దాచుకొని, సగం విదిలించుకొని.. మాటల దారం తో సంగతులు హారమల్లి ఇలా లేఖలో చుట్టి పంపే సరికి కూసింత జాగు అయింది. మన్నించూ..!!

నీకు లేఖ రాసేందుకు మంచి చోటు వెతికే సరికే, ఎంత సమయం వృధా అయ్యిందో తెలుసా! గ్రీష్మ తాపం తట్టుకోలేక యమున గట్టున కూర్చున్నాను . ఎక్కడినుండి వచ్చిందో నీటి గాలి! చల్లగా నా నడుముని చుట్టి "ఏం పిల్లా! ఏం రాస్తున్నావ్?' అని ఎంత చనువుగా అడిగిందో! "పోవోయ్, నీకు చెప్పేదేం కాదు. ఎంత చల్లని దానివైనా, నా నేస్తం కరస్పర్శ నీకేదీ?" అని విదిలించుకుని కదంబ వనానికి పరిగెత్తుకొచ్చా. పొన్న చెట్టు మొదట అలా వాలి, సంబోధన దాకా వచ్చానా! సరాసరి నా పయ్యెదపై వాలి ఓ చిలిపి గండు తుమ్మెద కుతూహలంగా తొంగి చూస్తోంది. కళ్ళెర్ర చేసి పొమ్మన్నాను. "గ్రీష్ముడి ధాటికి తోట పూలన్నీఇటొచ్చి నీ గుండెల్లో తలదాచుకున్నయేమో అని వచ్చా. రాధమ్మది చల్లని మనసని అంటారే, అందరూ!" అని  సన్నాయి నొక్కులు నొక్కుతూ కుంటి సాకులు చెప్తోంది. పోనీ గోశాలల వైపు వెళ్దామంటే జన సందోహం ఎక్కువాయె. నీ చెవిలో గుంభనంగా చెప్పాల్సిన ఊసులు, సిగ్గు విడిచి ఉత్తరం రాయడమే చాలు చాలు. రాస్తూన్న తలపులు గుచ్చుకుని ఎర్రబడిన నా మోము గుట్లన్నీ గట్టు దాటించదూ! అలా వెతికి వెతికి వేసారి ఇదిగో, కడిమి చెట్టు కింద ఉన్న తిన్నె మీద స్థిరపడ్డాను. "ఆ వచ్చేదేదో ఇందాకే రావొచ్చు కదా!" అని విసుక్కోకు.ఈ కడిమిని చూస్తే మొన్నటి దాకా బెంగ "కృష్ణుడు గుర్తొస్తాడేమో!" అని. ఈ రోజు సిగ్గు " కృష్ణుడు గుర్తొచ్చి!"

నిన్న కృష్ణుడొచ్చాడు. కలా.. నిజమా.. వైష్ణవమాయా.. తరచి తెలుసుకొనేంత విచక్షణ కుదరని విరహంలో మునిగి ఉన్న నన్ను అమాంతం ఆనందడోలలూగించాడు. సరిగ్గా ఇదే మునిమాపు వేళకి ఈ కడిమి చెంతకు దిగాలుగా వచ్చాను. "ముస్తాబయ్యావా?. గోధూళి అంటి, పనులలో సొలసీ చీదరగా ఉన్నావేమో! నేను అక్కడ ఉండి ఉంటే, రాధా! నీ అందానికి నగిషీ చెక్కేదాన్నిగా!" అని నొచ్చుకుంటున్నావేమో! విరహానికి నేను కనుగొన్న చక్కటి మందు అలంకరణ. చెదరిన కురులు, కరిగిన కాటుక సర్దుకుని మరీ సిధ్ధంగా ఎదురుచూసేంత ఆశ ఉంది ఈ రాధ విరహంలో! విరహానికి నేస్తం కన్నీరు కాదు. 'ఇహనో, ఈ క్షణమో వచ్చేస్తాడు.. వస్తాడా..? వస్తాడేమో!' అనే గుంజాటన లోంచి రెపరెపలాడే ఆశ. అదే నీ నేస్తానికి ఇన్నాళ్ళ కృష్ణ వియోగం నేర్పినది, ఊపిరిపోసినదీను.

వేసవి గాడ్పులు నా నిట్టూర్పులతో పోటీ పడి ఓడి చల్లబడసాగాయి. పెయ్యలు బొజ్జల నిండా పాలు తాగి, ఆయాసంతో ఊపిరి తీస్తూ నురగలు గాలిలోకి ఊదుతున్నాయి. పొదుగుల భారం తీరి అమ్మలు నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. చీకటి మధువు తాగి రేపల్లె మత్తుగా సోలుతోంది. యమున నిదానంగా ఆకాశం లో పొడుస్తున్న చుక్కల్ని లెక్కెడుతోంది. కడిమికి ఆవలనున్న చెట్ల కింద ఏదో అలికిడి. "కుందేలేమోలే!" అని ఆశని చటుక్కున చూడబోతున్న నా కళ్ళ కొలకుల్లో నొక్కిపెట్టాను. అకస్మాత్తుగా నా చుట్టూ చందన పరిమళం, శీతల పవనం వందిమాగధుల్లా హడావిడిగా కమ్మేసి "ఓ అమ్మాయీ, లే, లే.. ఏదీ, కాటుక రేఖలు బాగానే ఉన్నాయి కానీ, కస్తూరి కలిపే పెట్టుకున్నావా తిలకం? కుచ్చెళ్ళు సరి చేసుకో! ఇదిగో, పాంజేబు కడియాలు, మువ్వలూ పెట్టుకున్నావా? ఓయ్.. మనలో మనమాట! పాలెల మొలతాడో! అబ్బే! ఈ నీలి చీరె బదులు గంధపు రంగుదైతే ఈ మునిమాపు వేళ,  మహ సొగసుగా ఉండేది. సర్లే, ఎవరొచ్చారో చూడూ! తల అలా గిరుక్కున తిప్పెయ్యకు, వెర్రి దానా! నీ ఆత్రం అంతా కనిపించేస్తుంది. నెమ్మదిగా, నీ సోగ కళ్ళ వైశాల్యం తెలిసేలా, చెక్కిలి నొక్కులు, బెల్లం ముక్క లాంటి గడ్డపు చక్కదనము కనిపించేలా, ముంగురులు అల్లనల్లన ఎగసేలా.. నువ్వలా పక్కకు తిరిగితే నీలో కలవరానికి నీ పయ్యెద రవ్వంత చెదిరేలా చూడు. చిగురు పెదవి వణుకుని అదిమి పెట్టి చూడు" అని హెచ్చరించాయి. నిజం చెప్పొద్దూ, ప్రియంవదా! కృష్ణుడి రాకని గమనించి నువ్వు ఎంత గుట్టుగా నన్ను హెచ్చరించి తప్పుకొనే దానివో గుర్తొచ్చి భలే బెంగొచ్చింది తెలుసా!

నన్ను వదిలి కృష్ణుడు ద్వారకకు వెళ్ళినది మొదలు, "ఎదురు పడనీ.. ఇది అడిగేద్దాం.. అలా నిష్ఠూరాలాడుదాం." అని ఎన్ని అలోచించుకున్నానో! అంతా శూన్యం. పాలిపోయి మంచుబొమ్మలా నిలబడిపోయాను. మోహన వంశీధరుడు  ఓ ముత్యమంత నవ్వు నవ్వాడు. ఏం పలకరించాడో, కుశలమడిగాడో, లేదో, సంజాయిషీ చెప్పుకున్నాడో, మన్నించమని పాదాలే పట్టుకున్నాడో.. ఏమీ తెలియదు నాకు. ఆ భగవంతుని సంకల్పమే మోక్షమట." ఇదిగో, నువ్వింత పుణ్యం చేసావు. నువ్వు నాకు నచ్చావు. నీకు మోక్షం ఇస్తున్నాను. తీసుకో! సిధ్ధపడు!" అని ఇంత లావాదేవీలు, శ్రమ ఉండదట. "ఈ జీవుడికి మోక్షం ఇద్దామా!" అని సంకల్పం పరమాత్మ మనసులో కలిగిన తత్క్షణం జీవుడికి మోక్షం సంప్రాప్తించేస్తుందట. మధ్యలో పంచాయితీలు, విచారణలు, సన్మానాలు, సభలు ఏమీ ఉండవట. అంత నిశ్చింత, అనాయాసమూను మోక్షమంటే! అలాంటి మోక్షం తెలుసా కృష్ణుని కౌగిలి! కృష్ణుడు ఎదురుపడడమే తెలిసింది. కౌగిలించుకోవాలని ఆతడు తలచిన క్షణం నేను ఆతని సుందర బాహువులలో కరిగిపోయాను. మరు క్షణాన్ని గురించి కాని, తరువాతి చర్యను గురించి కాని లేశమాత్రమైన చింతన రానివ్వని కోట ఆ కౌగిలి..

అసలు ఎడబాటు అంటే ఏమిటి? ఎడబాటుని దుఃఖ భరితం చేసి కొలుచుకునేదా ప్రేమ? ఇంత మోహం, బెంగ కలిగిందంటే, అంత ప్రేమ ఉంది అని నిర్ణయించుకోవాలా? కేవలం సాంగత్యమే ప్రేమ ఉనికికి, మనుగడకు ఆధారమా? ప్రేమ నిత్యాగ్నిహోత్రంలా మండేందుకు సన్నిహితంగా ఉండడం, అభిప్రాయాలు కలబోసుకోవడం, "నీకోసం నేను ఇది చేస్తున్నాను చూడూ!" అని నిరూపించుకోవడమే ఉపకరణాలా? అలా అయితే ఎడబాటు చివర కలిసినప్పుడు కలిగే సంతోషం ప్రేమ కాదా? ఎన్ని సందేహాలో తెలుసా! నవ్వుకుంటున్నావా! చెలీ! నీ మనసులో ఉన్నది చెప్పకనే తెలుసుకొని, నువ్వు పట్టలేని ప్రేమ భావనను నీలో పుట్టించే మరో వ్యక్తి ఇలాతలం పై ఉండడమే అరుదు. నీకు కనిపించడమే అదృష్టం. అంత అధ్భుతమే జరిగాక ఇంక శంకలేల? కోరికలేల? కట్టుబాట్లేల? అనాఘ్రాత పుష్పాన్నో, ఎంగిలవ్వని అభిషేక జలాన్నో, ఆటంకం లేని ధూపదీప కైంకర్యాన్నో,గాలి సోకని నైవేద్యాన్నో కోరుకుని ఈశ్వరుడే పొందలేడు. మనమెంత?

నేనేం చదువుకున్న దాన్ని కాదు. నాకేం ఆస్తి పాస్తులు లేవు. అందమా.. మాధవుని చూపు రాజేసిన సౌందర్యమే కాని, ఈ తోలు తిత్తికి సుగంధమెక్కడిదీ? ఇలాంటి నాలో కార్చిచ్చు రగిల్చినట్టు వలపు రగిల్చాడు. నా ఉనికి, నా తపన, నా సౌందర్యము, నా మనసు అన్నీ రాగరంజితం చేసాడు. చాలదా హరినామ సంకీర్తనము, నాకు చాలదా హితవైన చవులెల్ల నొసగ. నేను శ్వాశించేదీ, స్నానమాడేదీ, భుజించేదీ, చలించేదీ, రమించేదీ నా వంశీ మనోహరుని ప్రేమే! అంత అధ్భుతాన్ని ఘడియలతోను, రోజులతోను, కోసుల దూరంతోను, ఏకాంత వేళ పొందే సుఖంతోను కొలుచుకొని పరిమితం చేసుకుంటున్నానా ఇన్నాళ్ళూ! ఎంత వెర్రి దాన్ని. రాధే కృష్ణ స్వరూపమని తెలుసుకోలేకపోయాను. కృష్ణుడే రాధకు రూపమని కానుకోలేకపోయాను.

ఎన్ని ఝాములు గడిచాయో నాకు తెలియలేదు కానీ, తుమ్మెద తృప్తిగా గ్రోలిన మకరందం లా నా సొగసు మాధవుని కళ్ళలో నిండి ఆతని హృదయాంతరాళాలలోకి వెచ్చగా చేరుకుంది. కౌస్తుభ శోభ కాదది రాధ తళుకు. "హ్మ్మ్.. ఇంకా..!" అన్నాడు తీయతేనియ పెదవులు విచ్చి. అల్లెతాటి ఝంకారంలా మ్రోగి నాలో ప్రకంపనలు పుట్టిస్తుందా స్వరం. హరివిల్లునయ్యాను. రంగులు దోచి తన నలుపులో కలిపేసుకున్నాడు. విరిజల్లునయ్యాను. పూల పాన్పుని చేసాడు. 'వెన్నెల లేదేం?' అని బెంగ లేదు. కర్పూరమంటి రాధను హారతి అందుకున్నాడు. నా చేతి వేళ్ళను అదేదో అమర వాయిద్యం పలికించినట్టు మీటుతాడు. సంగీతం పలుకుతుంది. అవి నా గాజుల గలగలలు కావు. కృష్ణుడు మాయావి అని రేపల్లంతా కోడై కూస్తుందా! యశోద కి అనుమానం రాలేదేమో కానీ, నాకు అప్పుడప్పుడు వస్తుంది సుమా! విచిత్రంగా ఇవే గాజులు కృష్ణుడు చెంత లేనప్పుడు సంగీతం పలకవు. వట్టి గలగలలే!

పొగడలు ఏరుకొచ్చి మాలలు అల్లాను, వేణు గానం వింటూ!
"పొగడ పూల బంధనాలు అల్లుతున్నావ్! నన్ను కట్టేద్దామనే!" మేలమాడాడు.
"కట్టుబడదామనే!" నేనేం తీసిపోయానా?
 "పోనీ నేనే కట్టెయ్యనా!" నర్మగర్భంగా నవ్వాడు.
 "కాదంటానా!" పెదవులు తడారిపోతుండగా పలికాను.

నీలిమేఘం మెరుపు కన్నియను దరి చేర్చుకున్నట్టు నా నలక నడుము ఒక చేత్తో, పొగడ పూల చెండును మరో చేత్తో దరిచేర్చుకున్నాడు. మెరుపు మెరిసింది. పొగడ పూలు నా నెలవంక మెడవంపులో నవ్వాయి. జలజలా నా కళ్ళు ముత్యాలు రాల్చాయి. ఇది సత్కారమేం కాకపోవచ్చేమో! కృష్ణుడికి రాధ పై నున్న అనురాగం. మన ఆత్మకి మనతో, రాధకు మాధవుడితో మెచ్చుకోళ్ళు, గిల్లికజ్జాలు, కవ్వింపులు, కాళ్ళబేరాలు ఇవేవీ కుదరవు. ఇది అతిమానుష సంబంధమో కాదో కానీ, ఆత్మ బంధం.

ఈ కాలం భలే మాయలాడి సుమా! రాబోయే మంచి ఘడియలకి సిధ్ధం కమ్మని చెప్పదు కానీ,  వచ్చిన మధుర క్షణాలను కౌగిట్లోంచి లాక్కొని ఎగరేసుకుపోతుంది. మబ్బులు తొలిగాయి చెలీ! యోగులను, పసిపాపలను సంతోషం వీడనిదెందుకో తెలిసింది. తల్లి కుడి రొమ్ము విడిపించి ఎడమ రొమ్ము అందించే లోపు బిడ్డ ఏడ్చేది ఎడబాటు తోనా? బెంగతోనా? లోటుతోనా? అదో తాత్కాలిక భ్రమ. అలాంటిదే విరహమూను.

చిగిర్చిన కడిమి నీడలో, కృష్ణుని ప్రేమలో మునిగి, నీ రాకకై ఎదురుచూస్తూ,

నీ
రాధ.

20 comments:

  1. చదువుతుంటే ఊరిన రసస్పందనని గుండె ఓపలేకపోయింది. కాసేపు ఊపిరిపీల్చుకొని, స్థిమితపడి, మళ్లీ కొనసాగిస్తాను. హృది రేపల్లెగా మారింది.

    ReplyDelete
  2. హాస్య రచనలే మీ ఫోర్టే అనుకున్నాను ఇన్నాళ్ళూ ! వాహ్వ్ !

    ReplyDelete
  3. @ మురారి గారు,
    ఏం చెప్పాలో తెలియడం లేదు. ధన్యవాదాలండీ!

    @ ఫణి బాబు గారు,
    ఏదో లెండి. 'Jack of all trades' అన్నట్టు చిన్న ప్రయత్నం. :) ధన్యవాదాలు.

    ReplyDelete
  4. ఎంత చక్కగా చెప్పారు....
    మాకు తేనె తాగినంత మధురం గా ఉంది...

    --geeta

    ReplyDelete
  5. >>మాటల దారం తో సంగతులు హారమల్లి..

    రాస్తూన్న తలపులు గుచ్చుకుని ఎర్రబడిన నా మోము గుట్లన్నీ గట్టు దాటించదూ!..

    యమున నిదానంగా ఆకాశం లో పొడుస్తున్న చుక్కల్ని లెక్కెడుతోంది.

    ..అలాంటి మోక్షం తెలుసా కృష్ణుని కౌగిలి!

    రాధే కృష్ణ స్వరూపమని తెలుసుకోలేకపోయాను.

    కర్పూరమంటి రాధను హారతి అందుకున్నాడు.

    పొగడ పూలు నా నెలవంక మెడవంపులో నవ్వాయి.

    .. ఇలా ఎన్నని ఏరమంటారు?.. రాధాకృష్ణులిద్దరినీ ఆవహం చేసుకున్నట్లున్నారు.. ఇటు రేపల్లె ప్రకృతీ ముచ్చటగొలిపింది.

    క్లుప్తంగా చెప్పాలంటే- 'సమ్మోహనం!!..'
    చదివాక కూడా సౌరభం వెంటాడుతోంది. I feel more romantic. Thanks :)

    ReplyDelete
  6. హ్మ్...భారమైన నిట్టూర్పు...ఉక్కిరిబిక్కిరయిపోయాననుకో! మధ్యలో నా ఊహలొకటి...ఆయాసమొచ్చింది! :)

    ReplyDelete
  7. రాధా మాధవుల ప్రేమ, పండితులకి, వేదాంతులకి కూడా అర్ధం కాదంటారు. కృష్ణుని తోటి విరహం ఒక్కొక్క కవి ఒకొక రకం గా వ్రాసారు. ఈ కింద ఇద్దరి బాధ మీ టపాలో కొద్ది కొద్దిగా కనిపిస్తోంది అనిపించింది నాకు.

    హృదయములు రెండు ప్రేమచే నేకమైన
    లీల, శ్రుతిలోన వేణువు లీనమయ్యే,
    విశ్వమెల్లను నిండిన ప్రేమ రాగ
    మట్లు, నీ రాగమెల్లర నావహించే !

    ఒక్కపరి కోకిలమ్మటు, లొక్కసారి
    గరుడ గంధర్వ కిన్నరీ గాన ఫణితి,
    బాలపవనుడు పూల నుయ్యాల లూపు
    నట్ల నీ పాట మము నూపె నౌర కృష్ణ !

    పవను కౌగిలి జొచ్చిన పల్లవమ్ము
    లట్టులను, నాలి చింతల నన్ని మరచి
    భవ దమృత వేణు గానాతి పారవశ్య
    మున నచేతనులటు లైతిమోయి! కృష్ణ !

    (శ్రీ బసవరాజు అప్పారావు)

    మ్రోయింపకోయ్ మురళి
    మ్రోయింపకోయ్ కృష్ణ!
    తీయతేనియ బరువు
    మోయ లేదీ బ్రతుకు,
    మ్రోయింపకోయ్ మురళి
    మ్రోయింపకోయ్ కృష్ణ!

    మురళి పాటకు రగిలి
    మరుగు నీ వెన్నెలలు,
    సొగయు నా యెద కేల
    తగని సౌఖ్య జ్వాల!
    ........................
    (శ్రీ కృష్ణ శాస్త్రి)

    ReplyDelete
  8. @ గీత గారు,
    ధన్యవాదాలు. :)

    @ అవినేని భాస్కర్ గారు,
    ధన్యవాదాలండీ.

    @ సుజాత గారు,
    సంతోషం. ధన్యవాదాలు. :)

    ReplyDelete
  9. @ మురారి గారు,
    నాదేం లేదు. మీరు చెప్పినట్టు ఏదో ఆవహించిందేమో! :)
    రాధ సమ్మోహనం. ప్రేమ సమ్మోహనం. అంతే. ధన్యవాదాలండీ.

    @ ఆ. సౌమ్య,
    ఓయ్ పిల్లా, నీకే మాటలు కరువయ్యాయంటే, నేను ధన్యురాలినే! :)

    ReplyDelete
  10. @ బులుసు వారికి,
    అబ్బ, అబ్బ.. ఎంత మంచి గేయాలను గుర్తు తెచ్చారండీ! ధన్యోస్మి. బసవరాజు వారు బాధను తేలిక చేసి, "ఇదిగో ఇదీ, రాధామాధవ తత్వంలో మర్మమని" చెప్పేద్దామని ప్రయత్నిస్తారు. మహ మంచి మనసు వారిది.
    ఇక కృష్ణ శాస్త్రి గారికి విషాద సుఖం అనుభవింపచేసి మన మనసులను ఎత్తుకెళ్ళిపోవడం చిటికెలో పని. "దేవులపల్లి మనసుని గిల్లి వెళ్ళిపోయారు" అంటూ ఉంటాను. వారు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన రచయిత. నా ప్రొఫైల్ లో పుస్తకాలు అనే చోట "తీయతేనియ బరువు.." అదే రాస్కున్నాను చూసారా? అంత ఇష్టం నాకు ఆయనంటే.

    నా రాధ కథలో మీకు వారు రవ్వంత కనిపించారంటే, ఆ మాట చాలు నాకు. ధన్యురాలిని. :)

    ReplyDelete
  11. నెమలికన్ను మురళి గారా? wow!!

    ReplyDelete
  12. కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్..... :D
    భలే భలేగా రాసేసారే! :)
    చదువుతూ ఉన్నప్పుడు, కామెంట్ లో ఈ లైన్ గురించి రాయాలి, ఆ లైన్ గురించి రాయాలి అని ఎన్నానుకున్నానో!! ఇక్కడవన్నీ రాయాలంటే గంపెడంత అవుతుంది. అయినా ఇక్కడ కూడా అవే రాసేస్తే నా స్పందన ఎక్కడ రాసేది? :P అయ్యో రామా.. కొన్నైనా రాయి అంటోంది మనసు....


    >>నన్ను వదిలి కృష్ణుడు ద్వారకకు వెళ్ళినది మొదలు..
    ఈ paragraph నాకు భలే నచ్చింది.
    >>మాధవుని చూపు రాజేసిన సౌందర్యమే కాని, ఈ తోలు తిత్తికి సుగంధమెక్కడిదీ?
    కదా... ఏదీ?
    >>విచిత్రంగా ఇవే గాజులు కృష్ణుడు చెంత లేనప్పుడు సంగీతం పలకవు. వట్టి గలగలలే!

    ఊ...., మరే! మాయలోడు!!!

    >>విరహానికి నేను కనుగొన్న చక్కటి మందు అలంకరణ.
    ఇలా రహస్యాలన్నీ బయటపెట్టేస్తున్నారే.... ఇది అన్యాయం! :(

    చదువుతూ ఉంటే నా మనసులోని రాధ-మాధవుల చిత్రానికి మీరు కథ రాసారా అనిపించింది.

    Thank you.

    ReplyDelete
  13. మోహనా, ( నేను ఏక వచనంలో పిలవడం లేదు సుమా! అంత చక్కటి మీ పేరు పక్కన 'గారు' బాగులేదు.)

    మీ వ్యాఖ్య చదివి భలే సంబరపడ్డాను. ముఖ్యం గా మీకు నచ్చిన పేరాగ్రాఫే నాకూ అభిమాన పుత్రిక. ధన్యవాదాలు. :)

    ReplyDelete
  14. ఇది చదివాక నాక్కూడా యోగులను, పసిపాపలను, మంచి బ్లాగు రాసేవారికి, చదివే వారికి సంతోషం వీడనిదెందుకో తెలిసింది. ఆసలే బయట ఎండలు మడిపోతున్నాయి. మీ టపా చదివాక నాక్కూడా కొంచం సేద తీరినట్లయింది. Thank you for a wonderful post. యమునా [?] , నువ్వెక్కడ?, నెను వస్తున్నా ;)

    ReplyDelete
  15. "అసలు ఎడబాటు అంటే ఏమిటి? ఎడబాటుని దుఃఖ భరితం చేసి కొలుచుకునేదా ప్రేమ? ఇంత మోహం, బెంగ కలిగిందంటే, అంత ప్రేమ ఉంది అని నిర్ణయించుకోవాలా? కేవలం సాంగత్యమే ప్రేమ ఉనికికి, మనుగడకు ఆధారమా? ప్రేమ నిత్యాగ్నిహోత్రంలా మండేందుకు సన్నిహితంగా ఉండడం, అభిప్రాయాలు కలబోసుకోవడం, "నీకోసం నేను ఇది చేస్తున్నాను చూడూ!" అని నిరూపించుకోవడమే ఉపకరణాలా? అలా అయితే ఎడబాటు చివర కలిసినప్పుడు కలిగే సంతోషం ప్రేమ కాదా? ఎన్ని సందేహాలో తెలుసా! నవ్వుకుంటున్నావా! చెలీ! నీ మనసులో ఉన్నది చెప్పకనే తెలుసుకొని, నువ్వు పట్టలేని ప్రేమ భావనను నీలో పుట్టించే మరో వ్యక్తి ఇలాతలం పై ఉండడమే అరుదు. నీకు కనిపించడమే అదృష్టం. అంత అధ్భుతమే జరిగాక ఇంక శంకలేల? కోరికలేల? కట్టుబాట్లేల? అనాఘ్రాత పుష్పాన్నో, ఎంగిలవ్వని అభిషేక జలాన్నో, ఆటంకం లేని ధూపదీప కైంకర్యాన్నో,గాలి సోకని నైవేద్యాన్నో కోరుకుని ఈశ్వరుడే పొందలేడు. మనమెంత?.........


    కాచివడపోసిన చిక్కని కాఫీ రుచికై అలవాటు లేని వారికి కూడా అర్రులు జాచేలా చేసే సువాసనలా .....ఎంత చక్కని తత్వమో.


    "ఈ లోకంలో ఇంత కూడా నోచుకోని వారు ఎంతమందో" అన్న ప్రియనేస్తం మాటలకు అతి చక్కని వివరణ.....Thanks a lot for reminding.

    ReplyDelete
  16. @ చాతకం, ధన్యవాదాలు.

    @ భావకుడన్, ఈలోకంలో అలా చెప్పే ప్రియనేస్తానికి కూడా నోచుకోని వారెందరో కదా!
    >>> "చిక్కని కాఫీకి అలవాటు కూడా లేని వారికి కూడా అర్రులు జాచేలా.." ధన్యవాదాలు తప్ప ఇంకేం చెప్పగలను!

    ReplyDelete