Monday, October 1, 2012

వలపు బిచ్చమొద్దు.. పో.. (నాయికలు - 1 )

మునిమాపువేళలు మహచక్కనైనవి. అందమైన రోజుకి ముక్తాయింపు సాంధ్యరాగాలతో ఇవ్వబూనిన సృష్టికర్త ఎంత నేర్పరి! నారింజవెలుగుల పడుగుకి నీలవర్ణపు పేక కలనేసి, అక్కడక్కడా మినుకు చుక్కల బుటాలు అద్దినట్టున్న సంజె చీర చాటున భూమీ ఆకాశం పెనవేసుకోబోతున్నట్టున్నాయి. ఆ వర్ణచిత్రం ఎంత మనోహరంగా ఉన్నా దానికి నిండు తెచ్చేదైతే ములుగఱ్ఱ చేతపట్టి, మందలను అదలిస్తూ ఇల్లు చేరేందుకు వడివడిగా అడుగులేస్తున్న అతడు. వీధిమలుపు తిరగగానే అతని చూపు వెతికేది ఎవరినో తెలుసా.. కళ్ళవాకిళ్ళలో ఆహ్వానపు దీపాలు వెలిగించి ఎదురుచూస్తున్న ఆమెను!   ఆమే గమ్యం.. అతని నడకకీ, ఆ మాపుకీ.

ప్రతి సాయంత్రం ఇంత మామూలుగా ఉంటే, ప్రతి జంటా ఇంతే పొత్తుగా ఉంటే, ఆపై ప్రతి రేయీ ఇలాగే నల్లేరుమీద బండిలాగా గడిచిపోతే అదిగో.. ఆ గురివింద పొదరింట కువకువలాడుతున్న  దేవలోకపు శారికలకు ముచ్చట్లాడుకోడానికి కబుర్లేముంటాయీ? ఆ గొరవంక జంట తిరిగి వాటి అచ్చర లోకానికి వెళ్ళాక త్రవ్విపోసుకోడానికి కథలేముంటాయీ?

                                                    ***

"అలా తలుపేసేసిందా! నేను నమ్మనుపో.." కుడిరెక్కని ముక్కుతో గీరుకుంటూ కువకువమందా శారిక.
"ఏం.. నన్ను ముక్కుతో పొడిచి తరిమిన రోజులు లేవేమో ఎవరి ఖాతాలోనో! మీ ఆడవాళ్ళకి మామూలేగా.. మూతిముడుపులూ, శాపనార్ధాలూ, వెటకారాలు నూరడాలూ.." అదును చూసుకు అక్కసు తీర్చుకున్నాడా పిట్ట పెనివిటి.
"పోవోయ్, మరీ చెప్తావు. చెట్టంత మగాడిని తలుపు బయట నిలబెట్టి చెరిగేసిందంటే అతగాని తప్పేవీఁ లేకుండానే?!"
"పిట్టంత నువ్వే నమ్మనప్పుడూ.. అతడు ఇక చెట్టంత ఉండీ ప్రయోజనమేముందీ!" నిట్టూర్చాడు.
"ఇలా కాదు కానీ, ఏం జరిగిందో నువ్వు సగం సగం చూసి చెప్పడం, నేను వినడం దేనికీ? పద వెళ్ళి చూసొద్దాం." రెక్కలు టపటపలాడిస్తూ ఆయత్తమైంది.
"ఇదిగో.. లేచిందే ఎగరడమా..? మాయ గోరింకా.. నీకు రాత్రీ పగలూ తేడా లేకపోవడం నాకు చచ్చేచావయ్యింది. ఉండూ.. ఆ దక్షిణం వీధిలో రెండో ఇల్లు." అరుస్తూ అనుసరించాడు.
గోరింకలు జంటగా ఎగిరెళ్ళి ఆ ఇంటి వాకిట్లో విశాలంగా విస్తరించిన చంపకవృక్షపు కొమ్మల్లో చేరాయి. సన్నగా వీస్తున్న పిల్లగాలి ఉండుండీ సంపెగ అత్తరు పూసుకు మత్తెక్కిసోలుతోంది. చీకటి ఆపని కంటిచూపు ఆ గోరువంకల లక్షణం. సూటిగా ఆమె పడకింటి కిటికీ కనిపించేలా ఓ కొమ్మ మీద సర్దుకుని, బయట గుమ్మంలో నిలబడ్డ అతడిని పరికిస్తూ వినసాగాయి.
                                                      ***

"రాధా,, తలుపు తీయవే అమ్మీ.."
"అయ్యో దొరవారూ! ఇంకా గుమ్మంలోనే ఉన్నారా? చిత్తగించారనుకున్నానే!" కావలసినంత వెటకారం ప్రతి పలుకులోనూ కూరి కూరి సంధించిందామె.
"కాస్త ఆలస్యమైనందుకే ఇంత కినుకా బంగారూ! ఎలా వెళ్ళనూ.. నిన్ను చూడనిదే ఉండలేనని తెలీదూ! నువ్వు నా ప్రాణానివి.." ఓరగా తెరిచిన కిటికీ కి దీనంగా తల ఆన్చి పిలిచాడు.

శయ్యపైనుండి లేచి కవాటం వైపు నడిచివచ్చిందామె. ఆశగా తలుపువైపో అడుగు వేశాడతడు. కిటికీలోంచే చెయి సాచి ఆతని మెడలో వేలాడుతున్న పున్నాగల మాల పట్టుకు ఆపింది. అనుమానపు కటకటాల అవతల ఆమె, ఇవతల ఆతడు. తీయగా నవ్వి మాయ చేద్దామనుకున్నాడు. టక్కరి వేషాలు పట్టనట్టు అతనిని ఇంకా దగ్గరకి లాగి ఆతని మేను మత్తుగా విరజిమ్ముతున్న పరిమళాన్ని పసిగట్టిందామె.
"చందనం..!" ముక్కు ఎగబీలుస్తూ రోషంగా పలికింది.
"నీ కోసమే! సింగారాలు మగువలకేనా.. మేమూ మిమ్మల్ని మెప్పించద్దూ?"
"మాయమాటలాడకు మురారీ!"
"లేదమ్మీ..నిజం! నమ్మవూ!"
"ఉహూ.. నిన్ను నమ్మమన్నదెవరు? టక్కరివి, జిత్తులమారివి."
"అబ్బా.. రాధా. నా వల్ల కాదీ శిరోవేదన!"
"నేనా! నేనేనా శిరోవేదననీ!"
"ఉహూ.. కాదు కాదు. అపార్ధం అపార్ధం! తలనొప్పి రాధా. లోపలకి రానివ్వవూ.. నీ ఒడిలో తలపెట్టుకు పడుకుని, నీ నాజూకైన వేళ్ళ స్పర్శ తగిలితే కానీ పోదు."
"హ్హు.. నా వేదన ముంది నీదెంత!"
"చందనమద్దుకుంటేనే అనుమానమా! ఇలా సాధిస్తావని తెలిసి ఉంటే చెమట ఒంటితోనే నీ ముంగిట వాలేవాడినిగా! పన్నీట సరిగంగ స్నానాలాడేవాళ్ళం. రాధా.. ఎన్నాళ్ళయ్యిందో మనం జలక్రీడలాడి!" కవ్వించాడు.
కరిగి నీరవబోయేదే.. క్షణంలో ఆమె చూపు సూటిగా ఆతని పెదవులను తాకింది. ఆతని సెలవి నంటిన తమ్ములపు ముద్ర!! ఆమె కంటబడింది.

విసురుగా వెనక్కి తిరిగి, చరచరా శయ్య చేరి కనుకొలకుల జారుతున్న నీరు అటుతిరిగి దాచుకుంది. ఆమె కోమలమైన చేయి పందిరిమంచపు స్థంభం చుట్టూ బిగిసి రక్తవర్ణంలోకి మారసాగింది. పెదవులు అదురుతున్నాయి. చూపు మసకబారి, కాటుక కన్నీట కరిగి గులాబిబుగ్గలను కమ్మేసేందుకు సిధ్ధపడుతోంది. నిస్త్రాణగా వాలిపోతోంది ఆమె తనువు.

"అమ్మీ.. చీకటి! నేనొచ్చి ఝామయ్యింది. కరుణ కరుణ!" పడకటింట ప్రవేశం కోసం జగదేకవీరుడైనా "పాహి..!" అనడానికి సైతం వెనకాడడు మరి!
"ఆ కరుణ దగ్గరకే వెళ్ళు." గద్గద కంఠంతో ఉరిమిందామె.
"ఇంత అనుమానమైతే కష్టం సుమీ.. ఏమయ్యిందిప్పుడూ.."
"బుకాయించకు మాయావీ. నువ్వు కోటి పూవుల వాలే తేటివని ఇన్నాళ్ళూ విన్నానంతే.. ఇప్పుడు సాక్ష్యాలతో కన్నాను. మహా సంతోషంగా ఉంది. కడుపు నిండిపోయింది." వెనుతిరగనైనా తిరగకుండా విసురుగా చెప్పింది.
"అన్యాయం!! నీవే తప్ప ఇతఃపరంబెరుగ.." నమ్మబలికాడు.
ఒక్క విసురున ఇటుతిరిగింది ఆవేశంగా.. వాల్జడ నాగుపామై గాలిలో ఎగిరి ఆమెను చుట్టేసింది.
"అవునేం! నేనే తప్ప వేరే ఇంతిని ఎరుగని వాడివి కదూ! ఆ చందనపు పూత ఏవిటో, ఎవరిదో తమరెరుగరు. కదూ!"
"ఉహూ.. " అనేసి నాలుక కరుచుకున్నాడు.
"అదే అదే.. ఒకరా ఇద్దరా! వెయ్యికి పైగా  ప్రియురాళ్ళు. రేయికి ఝాములు మూడేనాయే! చుక్కల్లో చంద్రుడు నయం! నెలకోమారు అని వంతు ఇవ్వగలడు. తమరికి లెక్క గుర్తుండే అవకాశమేదీ!"
"నీ కోసమని ఇంత దూరం వస్తే.. ఇదా మరియాద?"
"హ్హహ్హా.. నా కోసమా! నమ్మమంటావా?"
"నిజం భామినీ.. నీ కోసమే! నిజం.."
"ఉహూ.. నమ్మనుగాక నమ్మను. దారితప్పే వచ్చావు. చీకటిపడగానే ఏదో మోహయాత్రకి బయలుదేరి ఉంటావు. ఒక ఇంట గంధపు మైపూత పూసి ఉంటుందో చెలి. ఆనక మరో ఇంట వేరే పడతిని కూడి ఆమెను చుంబించి ఉంటావు. ఆమె తాంబూలంతో నీ పెదవి ఎరుపెక్కింది. ఆ తమ్ములపు చారిక నీ పెదవి కొసకు అంటింది. నేను చూడలేదూ! నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా? తాంబూలం పంచుకున్నావంటేనే అర్ధమవుతోంది.. ఆమెకు నీ మనసులో ఎంత చోటిచ్చావో!"
అప్పటిదాకా క్రోధంతో ఎరుపెక్కి ఉన్న ఆమె కళ్ళు హఠాత్తుగా సజలాలైపోయాయి. గొంతు పూడుకుపోతూండగా అంతులేని వేదనతో తడబడుతున్నాయి ఆమె మాటలు.
"ఆ పెదవులు.. నా కాంతుడి పెదవులు.. మరొక పడతి ముద్దాడిందంటే అంతకంటే నన్ను దహించే నరకం మరొకటుంటుందా?"

ఆపలేని కన్నీటి జడివానలో తడిసిముద్దైన మోము, వలిపంపు పయ్యెద.. ఆమె అందాన్ని ద్విగుణం చేసి అతనిని ఇంకా ఆకర్షిస్తున్నాయి. వణికిపోతున్న ఆమెను బిగికౌగిట బంధించి ఓదార్చాలనుకున్నాడు.
"అంత ప్రేమగా నిన్ను మాత్రమే ముద్దాడగలను. రా ప్రియా, కౌగిలీయవూ!"
"అబధ్ధం!" క్రుధ్ధంగా అరిచింది ముకుపుటాలదురుతూండగా..
"..........."
"నువ్వు అబధ్ధం. నీ ప్రేమ అబధ్ధం.. ఫో.. దారితప్పి ఈ వేళ వస్తే వచ్చావు. మరోసారెప్పుడూ ఇటు వచ్చి పరువు పోగొట్టుకోకు. నీ చెలియలెందరో ఎదురుచూస్తూ ఉంటారు. నీకేం లోటూ...?" దుఃఖం వెక్కిళ్ళలోకి మారుతూ ఉండగా తెగిన మణిహారంలా నేలపై పడి, అలకలో కూడా ఆమె సౌందర్యదీపమల్లే ప్రకాశిస్తోంది. చందనగంధ న్యాయం.. ఆమె శోకంలో కూడా ముచ్చటగా ఉంది.

ఆతనికి విసుగు రావడం లేదు. ఆఖరు ప్రయత్నంగా మునివేళ్ళతో తలుపు మీద కొట్టాడతడు.
"వెళ్ళిపో.. నీకు లోటు లేదు. నేను కాకపోతే మరొకరు. కావలసినన్ని కౌగిళ్ళు నీకోసం ఎదురుచూస్తున్నాయి. పో.. నీకిక్కడ చోటు లేదు. ఇది మానవతులుండే ఇల్లు. ఇక్కడ నిన్ను వలపు బిచ్చమడిగే వారెవరూ లేరు. పో.. వెళ్ళిపో.. నష్టపోయింది నేనే కదూ.. నీ ప్రేమను నమ్మి.. " పలవరిస్తూ సోలిపోయిందామె.

విన్నవే ఇన్నాళ్ళు, కన్ను లారగ చూసి
నాను, నే డెంతొ ఆనందమాయె;
ఆ చందనాంకము లా తమ్ములపు ముద్ర
లే లేమవో చెప్పలేరు తామె;
వేయికి పైనాయె ప్రియురాండ్రు, రేయికో
మూడె యామము లాయె - మోహయాత్ర
నేదొ ఈ దారి నూరేగు చుబుసుపోక
వేంచేసినార లీ వేగుబోక;

వలదు విడియగ నిట మానవతులె గాని
వలపు బిచ్చ మాశించెడు వారులేరు,
పిలుచుచున్నవి వేరె కౌగిళులు, వెడలు
మనుచు తెగనాడు 'ఖండిత'యైన రాధ.



గొరవంకలు మొహాలు చూసుకున్నాయి. జాలిగా ఉందామెపై.. అతనిపై ఆమె వేసినవన్నీ అభాండాలే అని తేలి ఇద్దరూ కలిసిపోతే బాగుండుననిపించింది. మౌనంగా ఆ 'ఖండిత నాయిక'ను చూస్తూ నిట్టూర్చి, అక్కడి నుండి తప్పుకున్నాయా పిట్టలు.

"హ్మ్.. గొడవ సుఖాంతమైతే బాగుండును." పలికింది శారిక.
"నీ పలుకు తథాస్తు దేవతలు వింటే బాగుండును." బదులు పలికాడామె పెనివిటి.
"ఇంతేనా.. సుఖంగా గడిపే జంటలు లేవా ఈ ఊళ్ళో..?"
"ఇంటికో కథ. కాసేపు విశ్రమించు.. అన్నీ ఒకే రోజా!" అన్నాడు నవ్వుతూ మగ గోరింక.
                                       
                                                ***

* గొరవంకల కంటపడిన మరో కథ రేపు ..

* దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ""శృంగార నాయికలు"   ఆధారంగా.. కాసింత కల్పన జోడించి..

24 comments:

  1. ఇంకో చక్కటి సిరీస్ మొదలుపెట్టారన్నమాట? బాగుంది:))

    ReplyDelete
  2. సింపుల్ గా సూఊఊఊపరు అని ఊరుకోకూడదేమో...
    ఏమో ఇంకేమనాలో తెలియటం లేదండీ ;)

    ReplyDelete
    Replies
    1. హ్హహా.. చాలా సంతోషమండీ. ధన్యవాదాలు!

      Delete
  3. అష్టవిధ నాయికలు!!
    మరో వారం రోజులు మాకు పండుగలన్న మాట అయితే..
    "దుఃఖం వెక్కిళ్ళలోకి మారుతూ ఉండగా తెగిన మణిహారంలా నేలపై పడి, అలకలో కూడా ఆమె సౌందర్యదీపమల్లే ప్రకాశిస్తోంది. చందనగంధ న్యాయం.. ఆమె శోకంలో కూడా ముచ్చటగా ఉంది."
    తెగిన మణిహారం, సౌందర్యదీపం, చందనగంధ న్యాయం... మచ్చుకి ఒక్క వాక్యం ఎంచుకుంటేనే మూడు ముత్యాలు కనబడ్డాయి. ఇక మొత్తం టపా గురించి చెప్పడం సాహసమే అవుతుందండీ...

    ReplyDelete
  4. అష్టవిధ నాయికల్లో మొదటి నాయికనెంత అందంగా రాశారండీ! మీ రచనా శైలికి, పద్యం చుట్టూ మీరల్లిన జోహార్లు!

    మిగిలిని ఏడుగురికై బ్లాగ్ వాకిట్లో ఆహ్వానపు దీపాలు వెలిగించి ఎదురుచూస్తుంటామం :-)

    ఒక్కో నాయికలో ఒక్కో రసం ఉంటుందంటారు; మరి రసాలు తొమ్మిది కదా? మరి నవరసాల్లో మిగిలిన రసానికి నాయిక లేదా అండి?

    ReplyDelete
    Replies
    1. అష్టవిధనాయికలు శృంగారనాయికలేనండీ. మీ ఆదరానికి ధన్యవాదాలు. :)

      Delete
  5. Lovely start! we won't miss the rest :)

    ReplyDelete
  6. Loved it!! Kottavakaya garu next nayika kosam waiting..

    ReplyDelete
  7. Beautiful! మిగతా కథల కోసం ఎదురు చూస్తాం.. :)

    ReplyDelete
  8. చాలా అందంగా వ్రాసారు. ఎనిమిది నాయికలు అయ్యాక వీటి వరకు ఓ e-పుస్తకం చెయ్యండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ. మంచి ఆలోచన! తప్పక ప్రయత్నిస్తాను. :)

      Delete
  9. చాలా బాగా రాసారండి చదువుతుంటే కళ్ళకు కట్టినట్లుగా ఉంది really superb

    ReplyDelete
  10. అబ్బ! కృష్ణశాస్త్రిగారు మళ్ళీ మన తెలుగింటనే పుట్టారు, ఎంతదృష్టం!
    తమ్ములపు తీగలాగితే అష్టవిధ శృంగార నాయికలు కదలివస్తున్నారన్న మాట :) గువ్వజంటల నేపథ్యం బంగారానికి తావద్దినట్లయ్యింది.

    ReplyDelete
    Replies
    1. ధన్యోస్మి!
      తమ్ములపు తీగ మహత్తే మరి! :)

      Delete
  11. good presentation. krishna sastry gari topics tisukodam nijamga sahasamee.. god bless you .... ENKETEEAAR.

    ReplyDelete
  12. రాయడం ఆపేసారేంటండీ కొత్తావకాయ గారు. నేను మీ వీరాభిమానినండీ. మళ్ళీ రాయడం మొదలుపెట్టరూ... ప్లీజ్

    ReplyDelete
  13. ఏదో వెతుకులాట.. మీ బ్లాగు లో ఇంచక్కని రైటప్. చాలా బాగుంది.

    ReplyDelete