Friday, February 13, 2015

ఎంతెంత దూరం?? ~ 2

ట్రైన్ దిగి బయటికి వస్తూ జేబులోంచి ఫోన్ తీసి టైం చూసుకున్నాడు హరి.

"ఐదున్నర.. అంటే ఏడవుతుంది ఇండియాలో టైం. ఇంకా నిద్ర లేవలేదా..?" అనుకుంటూండగానే స్కైప్ లో మెసేజ్ పాపప్ అయింది.

"హాయ్, గుడీవినింగ్ హరీ.. "
"గుడ్మాణింగ్..." కోలన్ కి రైట్ పెరాంథిసిస్ తగిల్చి నవ్వాడు.
"కాల్?" అటునుంచి మెసేజ్ 
"రెడీ.." అంటూ హెడ్ ఫోన్స్ సరిచేసుకున్నాడు. 

"దెయ్యం నిద్ర పట్టేసింది హరీ.. అసలు అలారం టోన్ గా  స్కైప్ రింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత నిద్రలో అయినా టక్కున లేచి కూర్చుంటాను. " హరి కాల్ ఆన్సర్ చెయ్యగానే చెప్పింది సుధ.

"అంత ఉదయాన్నే లేచి ఏం చెయ్యాల్లే కానీ, ఏంటి కబుర్లు? కాఫీ అయిందా?"

"ఊ ఊ.. అవుతోంది. లేటయితే నువ్వు ఇంటికెళ్ళి పనుల్లో పడిపోతావు. నేను రెడీ అయి ఆఫీస్ కి వెళ్ళిపోవాలి. చెప్పు చెప్పు.. ట్రైన్ దిగావా?"

"ఆ.. ఇప్పుడే. బిజీ డే.. తల బద్దలవుతోంది. టీ పడితే కానీ.. " ఆఫీస్ కబుర్లు చెప్తూ మైలున్నర నడక మొదలెట్టాడు. ఆరుగురితో  పంచుకుంటున్న ఆ అపార్ట్మెంట్ దగ్గరకి హరి చేరేసరికి సుధ ఆఫీస్ కి వెళ్ళే టైం అయింది.

"హరీ.. సరే అయితే.. నేనింక రెడీ అయి బయలుదేరతానేం.. నువ్వు పడుకునేముందు టెక్స్ట్ చెయ్. అన్నట్టు వంట నీదేనా ఇవాళ?"

"ఊ.. కేబేజ్ ఉంది. బంగాళదుంప, టొమేటో కలిపి కూర చేసేస్తే.. ఫ్రిజ్ లో సాంబారుందిగా.."

గత నాలుగేళ్ళుగా హరి రెండు టైం జోన్లు,చిన్నా చితకా కలిపి ఆరు ఉద్యోగాలు, నాలుగు అపార్ట్మెంట్లు మారాడు. రెండో మాస్టర్స్ సంపాదించుకుంటున్నాడు. హెచ్ వన్ వీసా మాత్రం అందీఅందకుండా ఊరిస్తోంది. స్టూడెంట్ వీసాతో, తుమ్మితే ఊడే ముక్కులాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలతో ఎన్నేళ్ళిలా నెట్టుకురావాలనేది దారితోచని సమస్య.

"ఈ యేడాది హెచ్ వన్ తప్పనిసరిగా వస్తుంది. రావాలి.." అనుకున్నాడు.

సుధ పుట్టినరోజుకి ఐఫోన్ పంపితే తను అన్నమాటలు గుర్తుచ్చాయ్ ఉన్నట్టుండి..

"ఇప్పుడింత ఖర్చు దేనికి హరీ..?"
"దేనికేంటీ.. నువ్వు ఎక్కడున్నా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా మీ పీపింగ్ టామ్ ని తప్పించుకోవచ్చు."
"సరిపోయింది. ఫోన్లోనే కాపురం చేసి పిల్లలని కనే ఫెసిలిటీ కూడా వచ్చేస్తుందేమోలే రేపో మాపో. అన్నట్టు అమ్మ పిన్నింటికి బయలుదేరింది. మరో నెలరోజులు మనం హేపీగా మాట్లాడుకోవచ్చు."

సుధ నవ్వుతూనే అన్నా గుచ్చుకుంది. అన్నీ తెలిసి అలా అన్నందుకు గుచ్చుకుంది. ఇంకెన్నాళ్లు.. వీసా వచ్చిన మరుక్షణం వెళ్ళి సుధని పెళ్లిచేసుకు తీసుకొచ్చేయాలనుకున్నాడు.. వెయ్యోసారి. ఉహుఁ.. లక్షోసారి. 

***

"నీకంటే నేనో ఐదారేళ్ళు చిన్నదాన్నైతే బావుండేది కదా.." అడిగింది సుధ.

"ఏం.. మీ అమ్మైవైనా అన్నారా మళ్ళీ?"

"ఉన్న ఆర్నెల్ల తేడా చాలని నువ్వారోజు అందర్నీ కలిపి కడిగేసి విడిచిపెట్టాక కూడా మళ్ళీ ఎవరైనా మాట్లాడగలరా చెప్పు! అమ్మ అప్పటికీ పూర్తిగా ఒప్పుకోలేకపోతోందనుకో.. ఇప్పుడు ఆవిడేం అనలేదులే."

"మరేవైంది?"

"శిరీషకి కూతురు పుట్టింది. నిన్న సాయంత్రం."

"వావ్.. చూశావా పాపని? ఎలా ఉంది శిరీష?"

"ఊ.."

"మనం ఒకేసారి నలుగుర్నో ఐదుగుర్నో కనేద్దాంలే అమ్మాయీ.." సుధ మనసులో మాట చదివినట్టు అనునయంగా అన్నాడు హరి. 

"ఎప్పుడు హరీ..??"

గుండెని పట్టుకు వేలాడే కొక్కేల్లాంటి ఆ ప్రశ్నలకు హరి దగ్గర సమాధానాలు లేవు. నాలుగేళ్ళని నెలలుగా, వారాలుగా.. క్షణాలుగా కొలిచి చూపిస్తున్న ప్రశ్నలే మిగులుతున్నాయతనిదగ్గర.

ఎదురెదురిళ్ళలో పెరిగిన పిల్లలు హరీ, సుధ. ఎమ్మెస్ చేసేందుకు హరి ఒక వారంలో అమెరికా బయలుదేరుతాడనగా సుధకి పెళ్ళిచూపులు కుదిరాయి. వెంటనే తమ మనసులో ఉన్నది చెప్పేశారిద్దరూ. ఒకే వయసు పిల్లలకి పెళ్ళేవిటన్నారు పెద్దవాళ్ళు. తమ నిర్ణయం మారదని తెగేసి చెప్పాడు హరి. చిన్నప్పటి నుండీ చూస్తున్న పిల్లే కోడలవుతుందంటే హరి తలిదండ్రులకి పెద్దగా అభ్యంతరమేం కనిపించలేదు. పిల్లవాడు అమెరికా వెళ్ళి వచ్చేదాకా పిల్లని పెళ్ళి చేయకుండా అట్టేపెట్టుకోవడం సుధ తల్లికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. తన కూతురు హరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వెనకనుంచి ఏదో ఒక పొల్లుమాట అనకుండా ఉండలేదావిడ. 

"ఇరవైయ్యారు పెద్ద వయసేం కాదు... తనకి. ఇరవైయ్యారు సుధకీ పెద్ద వయసేమీ కాదు.. ఇద్దరూ ఒక దగ్గరుంటే.." అనుకున్నాడు హరి.

***

"మన చెట్టు దగ్గరకి వచ్చేసాను. చెప్పు.." హరి లేక్ ఎలిజబెత్ కి చుట్టూ ఉన్న రెండున్నర మైళ్ళ వాకింగ్ ట్రాక్ మీద రెండుసార్లు నడిచాక ఓ చెట్టుకిందున్న బెంచ్ మీద కూర్చున్నాడు. అలవాటైన ప్రదేశమది. శనివారం ఉదయం ఏడున్నరయింది. గంటన్నరై కాల్ సాగుతోంది. రకరకాల టాపిక్స్ మాట్లాడుకున్నారు అప్పటిదాకా.. 

"ఏం..? నిద్దరొస్తోందా?" కూర్చుని అలుపు తీర్చుకుంటూ అడిగాడు హరి.
"ఎప్పుడూ తిండీ, నిద్ర.. తప్పితే ఉద్యోగం. ఇంకేవుంది జీవితంలో.."

సుధ ఇలా పుల్లవిరుపుగా మాట్లాడిందంటే, ఏదో అసంతృప్తి రేగుతోందని అర్ధమైపోతుంది హరికి. ఎక్కడలేని సహనం తెచ్చుకుమాట్లాడుతాడు. ఒక్కోసారి తన నిస్సహాయత వలనో, పని ఒత్తిడి వల్లో తిరిగి ఏమైనా అన్నా.. సుధ ఉదయం నిద్రలేచేదాకా తోచదతడికి. అక్కడ ఆమెకీ అంతేనని తెలుసు.

"ఏమయిందమ్మాయీ.."

"ఏమవుతుంది హరీ.. సమాధానం లేని ప్రశ్నలే అడగాలి. మిస్ అవుతున్నాను.. ఎప్పుడు కలుస్తాం మనం అని.."

"వచ్చేయనా..?"

"ఆశపడి వెళ్ళావు. సగంలో వదిలేసి వచ్చేయమని ఎలా అడుగుతాను?"

"ఏముందిక్కడ? అక్కడ లేనిదేం లేదు నిజానికి.."

"రూపాయి డాలర్ని కొనేసినరోజు అనాలీమాట."

"ఎంతొస్తే తృప్తి? ఎందుకిలా అని అనుకోని క్షణం లేదు. చిరాకొస్తోంది." విసుగ్గా అన్నాడు. 

సుధ మాట్లాడలేదు. 

"చెప్పు సుధా.. వచ్చేయనా? సీరియస్ గా అడుగుతున్నాను."

"ఆ దేశంలో ఏదో ఒక రకంగా అడుగుపెట్టాలని కలలు కంటున్నారందరూ.. ఇన్నాళ్ళున్నాం. ఇంకొక్క ఆర్నెల్లలో ఈ ఏడాది హెచ్ వన్ సంగతి తెలుస్తుందిగా.. అప్పుడు చూద్దాం లే." అతనితో చెప్తూ తనకు తనే సర్దిపుచ్చుకుంది.

మౌనంగా ఉండిపోయారిద్దరూ. గాలికి ఊగుతున్న పేరు తెలీని చెట్లని గమనిస్తూ లేక్ లో తిరుగుతున్న నల్లబాతుల్ని చూస్తున్నాడు. కీచుగా ఉన్న చిన్న కూత వినిపించి.. తలతిప్పి పక్కకి చూసాడు., పొడవైన మెడ, గులాబీరంగు మూతి ముందు జాపుతూ గోధుమరంగు ఊలు బంతిలా, పిల్లి కంటే చిన్నగా ఉన్న వింత జంతువు ఎదురుగా ఉన్న పొద చాటు నుంచి చూస్తోంది. 'ముంగిసా?' అనుకున్నాడు. కళ్ళార్పకుండా తననే చూస్తోంది. సన్నగా విజిలేసాడు. చెంగున ముందుకు దూకిందది. మీద పడుతుందేమో అని చటుక్కున లేచి నిలబడ్డాడు.

"ఇంకేంటి హరీ.. లాండ్రీ చేసుకోవాలా ఇంటికెళ్ళి?" ఆవులిస్తూ అడిగింది సుధ.

"ఇక్కడేదో జంతువు.. ముంగిసలా ఉంది. పొద చాటునుండి చూస్తోంది."

"బాబోయ్.. ముంగిసా! చూసుకో ఏ పాములైనా ఉంటాయేమో. రోడ్డు మీదకి వచ్చేయ్ నువ్వు.." గాభరాగా చెప్పింది.

"పర్లేదు పర్లేదు. నువ్వు పడుకో ఇంక. నేనూ బయల్దేరుతాను. రేపు ఆదివారమేగా. లేవగానే కాల్ చెయ్." ఆమెతో మాట్లాడుతూ ఆ జంతువునే గమనిస్తున్నాడు.

"సరే మరి. లవ్ యూ.. గ్రేట్ డే." సుధ నిద్రకి ఒరుగుతూ చెప్పింది.

పెదాలు పూర్తిగా ముడవకుండానే ముద్దు శబ్దం ఇటువైపునుంచి.. ఓ మూడు లవ్ యూ మంత్రాలతో కలిపి.

హెడ్ ఫోన్స్ తీసి జేబులో వేసుకుని, ఫోన్లో కేమెరా ఓపెన్ చేసేదాకా కూడా తాపీగా తననే చూస్తోందా ప్రాణి. మరోసారి విజిల్ వేసాడు. అంతే..! ఉత్సాహంగా పక్కలకి చెంగు చెంగున  గెంతులేయడం మొదలెట్టిందది. ఫోటో మోడ్ ని వీడియో కి మార్చి, అంతే ఉత్సాహంగా విజిలేసాడు. దాని ఒళ్ళంతా ముదురు గోధుమ రంగులో ఒత్తుగా ఉన్న వెంట్రుకలు. పొడవాటి మెడ, నల్లని కుచ్చులాంటి తోకా కదుపుతూ చెంగు చెంగున పక్కలకి స్టెప్ లు వేస్తోంది. మధ్యలో గులాబీ మూతి ముందుకు జాపి "నన్ను చూస్తున్నావా?" అన్నట్టు చూస్తోంది. చిన్న చిన్న కూతలు వేస్తూ, పొదలోకోసారి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తోంది. హరి రెండున్నర నిముషాలపాటు దాని డాన్స్ చూస్తూ ఉండిపోయాడలా..

"కుక్కలూ పిల్లులకంటే ముద్దుగా గెంతులేస్తోంది. ఏవిటో ఇది. చుంచు మూతి, పిల్లి తోక.." అని నవ్వుకుంటూ, వీడియో సుధకి మైల్ చేసి, వెనక్కి తిరిగి చూస్తూ అక్కడ్నుంచి కదిలాడు.

***

"కేలిఫోర్నియా లోను, హవాయీ లోనూ ఫెరెట్స్ పెంచుకోడానికి లా ఒప్పుకోదు. యానిమల్ లవర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారనుకో. కానీ ఇక్కడి ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా లీగలైజ్ కానివ్వడం లేదు. వీటివల్ల రేబిస్ వస్తుందని వద్దంటున్నారు. కొన్ని స్టేట్స్ లో వాటిని న్యూటర్ చేసి పెంచుకోవచ్చు. కేలీ లో మాత్రం కుదరదు. నువ్వు పెంచుకోవచ్చు కావాలంటే.. కానీ అతి రహస్యంగా." గేస్ స్టేషన్ లో కలిసిన ఆండ్రూ చెప్పిన మాటలకి ఏడెన్ కి మతిపోయినట్టయింది.

"నిజానికి నేనూ ఎప్పుడూ ఫెరెట్స్ ని పెంచలేదు. చిన్నప్పుడెప్పుడో మా ఇంట్లో పిల్లి ఉండేదంతే."

"ఒక రకంగా పిల్లికీ ఫెరెట్ కీ ఓ పోలిక మాత్రం ఉంది. లిటర్ బాక్స్ విషయంలో.." ఆండ్రూ నవ్వాడు.

"నీకెలా తెలుసు? నువ్వు పెంచావా?"

"ఉహూ లేదు. నా ఎక్స్ వైఫ్ యానిమల్ లవర్స్ క్లబ్ లో మెంబర్. వాళ్ళ మీటింగ్స్ కి తన కోసం నేనూ వెళ్ళేవాడిని. యూ ఎస్ లో రెండో పాపులర్ పెట్ తెలుసా! నేచురల్ జోకర్ అంటారు దీన్ని.  కానీ దీనికేమాత్రం బాగోకపోయినా కేలిఫోర్నియాలో నీ లైఫ్ మిసరబుల్ అవుతుంది. ఆలోచించుకో." హెచ్చరించాడు.

తలపట్టుకుని కూర్చున్నాడు ఏడెన్. వికా గురించి చెప్పుకొచ్చాడు ఆండ్రూ కి.. విని పగలబడినవ్వాడతను.

"నీ గాళ్ ఫ్రెండ్ నీకు భలే పనిష్మెంట్ ఇచ్చింది. ఫెరెట్ ఇన్ కేలీ!! అది కూడా కొత్త ఉద్యోగంలో చేరుతూ.. హ్హహ్హా.." బొజ్జ కదిలేలా నవ్వుతున్నాడు ఆండ్రూ.

"దీని వాసనే నాకు నచ్చలేదు. హౌ టు గెట్ రిడాఫ్ దిస్ నౌ? ఐ లవ్ మై గాళ్ ఫ్రెండ్.. అయినా సరే ఇది పనిష్మెంట్ లాగే ఉంది." మొహం ఎర్రగా చేసుకుని అడిగాడు ఏడెన్.

"యా.. నువ్వేం పెట్టావు దానికి?"

"ఏదీ.. నిద్రపోతూనే ఉంది. లేస్తే కిబిల్స్ పెడదామని కొని ఉంచాను. ఏం.. పెట్టకూడదా?"

"కూడదనేం కాదు. చికెన్ వింగ్స్ కూడా తింటుంది నువ్వు పెట్టాలే కానీ. తినే తిండిని బట్టి దీని చర్మం మీద ఉండే గ్లాండ్స్  వాసనొస్తాయ్. ఫెరెట్స్ కోసం తయారుచేసిన మంచి బేలన్స్ డ్ డైట్ పెట్టాలి. వెరీ ఎక్స్పెన్సివ్ పెట్ ఇది.. బట్ ఫన్." ఆండ్రూ చెప్పుకొచ్చాడు.

"నా లైఫ్ లో ఇంత ఫన్ అక్కర్లేదిప్పుడు. హెల్ప్ మీ ఔట్  ఆండ్రూ.. ఏం చెయ్యాలి దీన్ని?"

"మరి నీ గాళ్ ఫ్రెండ్?"

"ఫస్ట్ థింగ్స్ ఫస్ట్.. ముందు ఈ పిల్లిని ఎవరికైనా ఇచ్చేయాలి."

"పిల్లి కాదిది. ఎలక జాతి.. వీసెల్. ఎవరూ తీసుకోరిక్కడ.. నేను నీకిలాంటి సలహాలివ్వకూడదు. నేనైతే వైల్డ్ లైఫ్ లోకి వదిలేస్తాను."

"వైల్డ్ లైఫా?"

"యెప్. కనీసం ఏ పార్కో.. "

***

"సుధా... అదే ముంగిస!" అరిచినట్టు చెప్పాడు హరి బెంచ్ మీద కూర్చోగానే అటుగా చూసి.

"అవునా!! అదేనా?"

"యెస్.. అదే. బ్రౌన్ కలర్, నల్ల తోక."

"జాగ్రత్త హరీ.."

"ఇదేదో పెంపుడు ముంగిసనుకుంటా.. అస్సలు భయపడ్డం లేదు."గుర్తుపట్టినట్టూ తనవైపుకు దూకుతున్న దానివైపు చూస్తూ చెప్పాడు హరి.

"నువ్వసలు అక్కడ్నుంచి దూరంగా వెళ్ళు.. నాకు భయమేస్తోంది."

"భయం దేనికీ.. అయినా ముంగిసుంటే పాము రాదు కదా." నవ్వాడు.

"పెంచుకుంటారా ముంగిసల్ని ఎవరైనా?!"

"మన దేశంలో అయితే ఏ పాములవాళ్ళో పెంచుకుంటారేమో కానీ, ఇక్కడ ఎవరైనా దేన్నైనా పెంచుకోగలర్లే. వియార్డ్ జనాలు."

అక్కడనుంచి వెళ్తూ వెనక్కి తిరిగిచూశాడు. పక్కకి గెంతి బెంచీని గుద్దుకుని మళ్ళీ రెండో వైపు గెంతి చూస్తోందది. తనని చూసి మూతి ముందుకు కదుపుతూ శబ్దాలు చేస్తున్న దాన్ని చూస్తే చాలా వింతగా అనిపించిందతనికి..

***

"సో.. ఏం పేరు పెట్టావ్?"

"వికా.."

"యూ సిల్లీ.. చెప్పు ఏం పేరు పెట్టావ్?"

"లేదింకా.. ఏదీ వచ్చి సెటిలయ్యానంతేగా.. ఏంటి కబుర్లు?" మాట దాటేసాడు ఏడెన్.

"నీకు పిల్లిని పెంచడం వచ్చు కదా.. ఇదీ అంతే. కానీ పేరు పెట్టకపోవడం చూస్తే నాకు అనుమానంగా ఉంది. యూ కిల్డ్ హర్.. డింట్ యూ?"

"నీకు నామీద అంత అనుమానమేంటీ? స్టడ్ అని పెడదామా అని ఆలోచిస్తున్నా.." తిట్టుకుంటూ అబద్ధమాడాడు.

"అస్సలు బాలేదు. షీ ఈస్ ఏ గాళ్. ఇంతకీ ఫర్ ఏ రంగులో ఉంది?"

"బ్లాక్.."

"బ్రౌన్ వస్తుందన్నదే! నాకు పిక్స్ పంపవా ప్లీజ్?"

"క్లోయీ అనే పెడతానైతే. నా పిల్లి పేరు అదే.  ఉహూ నో పిక్స్. మనం కలిసినప్పుడే చూద్దువుగాని." అలవోకగా చెప్పేసాడు.

***

"క్లోయీ ఏం చేస్తోంది?"

"ఆడుతోంది. అన్నట్టు గ్రాంపా కి ఇంకో పెట్ ని ఇచ్చావా మరి?"

"ఉహూ.. నువ్వెళ్ళిన నెక్స్ట్ డే వైరల్ ఫీవర్ వచ్చి తగ్గింది ఆయనకి."

"ఓహ్.. అవునా! ఇప్పుడు ఓకే కదా?

"యా.."

"సరే హనీ. టేక్ కేర్. వెళ్ళాలింక."

***

"లవ్ యూ.." గ్రీటింగ్ కార్డ్ మీద అక్షరాలు, అవి తీసుకొచ్చిన పరిమళం మనసుని తడుముతూండగా ఫోన్లో చెప్పాడు హరి.

"లవ్ యూ.. లవ్ యూ సో మచ్.. హరీ, వచ్చే పుట్టినరోజుకైనా మనం ఒకేచోట ఉండాలి."

మౌనంగా పార్క్ బెంచ్ మీద కూర్చున్నాడు. ఇంకెంత దూరం అనిపించేస్తోంది. ఎలాంటి రోజైనా ఒంటరిగా గడవాల్సిందేనా? 

"ఏయ్.. షర్ట్ వేసుకున్నావా? వీడియో ఆన్ చేద్దామంటే అమ్మ వచ్చి వెళ్తోంది. మళ్ళీ రికార్డంతా వేస్తుంది. ఎందుకొచ్చింది కానీ..  కాసేపున్నాక చూస్తానేం. పోన్లే.. కనీసం ఈ బర్త్ డే అయినా వీకెండ్ వచ్చింది బాబూ.. లాస్ట్ టైం మరీ దారుణం ఆఫీస్ లో. మరేమో.. మిగిలిన రెండు షర్ట్ లు భోగికి, సంక్రాంతికి. వీక్ డే కదా అని ఫార్మల్ తీసుకున్నాను. పండగ వచ్చేవారమే. నేను గుర్తుచేస్తాలే?" చెప్పుకుపోతోంది సుధ.

మాట్లాడకుండా ఫోన్ లో కేమెరా ఓపెన్ చేసాడు.. సెల్ఫీ తీసుకుందామని. ఫ్రేం లో కనిపించిన ఆ జంతువుని చూసి తుళ్ళిపడ్డాడు. చెప్తే సుధ కంగారుపడుతుందనిపించి, అక్కడినుంచి లేచి, గ్రీటింగ్ కార్డ్ బేగ్ లో వేసి దూరంగా నడిచాడు. ఆ పరిసరాలలో ఏదో ఘాటైన వాసన..

(ఇంకొంత దూరం.. )

11 comments:

 1. Inkentha Dooram .. Aaavakaaya garu ..:)

  ReplyDelete
 2. ఓహ్.. మొదటి పార్ట్ లో నేనన్న పాస్తా కామెంట్ ను వెనక్కి తీస్కుంటున్నానండీ :-) మరింత ఆసక్తిని పెంచారు ఏం చేయబోతున్నారా అని.. వెయిటింగ్.గ్.గ్.గ్...

  ReplyDelete
  Replies
  1. హహ్హా.. ఇంగువపోపు వేసిన పాస్తా అనుకోండీ పోనీ.. :) థాంక్యూ!

   Delete
 3. మొదటి భాగంలో బొత్తిగా పరిచయం లేని స్థలాలు, మనుషులు మరియు జంతువూను.. అందుకేనేమోనండీ పెద్దగా కనెక్ట్ కాలేకపోయాను.. రెండో భాగంలో తెలిసిన మనుషులతో పాటు, ఆ జంతువు మన 'ముంగిస' అని తెలియడంతో కనెక్ట్ అయ్యి, తర్వాతి భాగం కోసం ఎదురు చూస్తున్నా.. కథ రసపట్టులో పడినట్టుంది కదూ..
  అన్నట్టు, ఆంగ్ల సాహిత్యం విస్తృతంగానూ తెలుగు సాహిత్యం పొదుపుగానూ చదివే 'పడమటి' వారిని కూడా మీ రచన ఆకర్షించిందంటే.. మీరు గ్రేటండీ బాబూ.. (పాత ప్లస్ రోజులు గుర్తొచ్చాయిలెండి :))

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండీ. తెలుగు సాహిత్యం విస్తృతంగానూ, ఆంగ్ల సాహిత్యం పొదుపుగానూ చదివే 'తూర్పు ' వారిని కూడా ఎట్టకేలకు ఆకర్షించినందుకు సంతోషంగా ఉంది. :)

   Delete
 4. ఈ ట్విస్ట్ వూహించలేదండోయ్. టూ డైమెన్షనల్ చేసారు. వచ్చే భాగం లో 3D చెయ్యరు కదా :) కథ పాకాన పడుతోంది.

  ReplyDelete
  Replies
  1. ఏంటో మీరు టూడీ, త్రీడీ అని స్పీల్ బెర్గ్ ఎఫెక్ట్ ఇచ్చేస్తున్నారు స్ఫురితగారూ.. :) ధన్యవాదాలు.

   Delete
 5. Interesting...

  రెండు జంటల కధలు సమాంతరంగా నడుస్తున్నప్పుడు వారి జీవితంలో జరిగే సంఘటనలను chronological order లో వ్రాస్తే బాగుంటుందేమో కదండీ!!?? అలాంటప్పుడు, ఆండ్రూ ఆ ఫెరెట్ని ఏదైనా పార్క్ లో వదిలేయమని సలహా ఇచ్చిన తరువాత హరి దాన్ని పార్క్ లో చూడటం జరగాలి కదా (అఫ్కోర్స్, ఆ రెండూ ఒకటే ఫెరెట్ అయితే)??
  కుక్కలు, పిల్లులు, చేపలు ఉండగా ఫెరెట్ యూ ఎస్ లో రెండో పాపులర్ పెట్ ఎలాగో అర్ధం కాలేదు..పాపులర్ కి ఏమైనా గూడార్ధం ఉందా ఇక్కడ? :-)

  ReplyDelete
  Replies
  1. Chronological order.. అనుకున్నానండీ కాస్త కన్ఫ్యూజన్ ఉంటుందని. :) కొత్త పాత్రలని పరిచయం చెయ్యడం కోసం అటుదిటు చేయాల్సివచ్చింది. పాపులారిటీ స్టాట్స్ అయితే ఎప్పటికప్పుడు మారిపోయేవేనండీ. ప్రిన్సెస్ డయానా పెళ్ళికి TV Cables ని లాగినవి ఫెరెట్లే. లీగల్ గానూ, ఇల్లీగల్ గానూ కూడా వర్క్ ఫోర్స్ గా బాగా వాడుకుంటారు. అలా పాపులర్. :) Thank you!

   Delete
  2. కాస్త కన్ఫ్యూజన్ కాదండీ, నేనైతే ఈ భాగం చదివి చివర్లో 'ప్రస్థానం' రేంజ్ లో ట్విస్ట్ ఇస్తారనుకున్నాను :-)) కానీ ఈ ఏడెన్ కి షానన్ లు, టకీలాల మీదే ఎక్కువ మోజు ఉన్నట్టుంది :-(

   Delete