Thursday, February 10, 2011

చిన్న గీత

మా ఇంట్లో నాకు అసలు నచ్చని గది వంటిల్లు. అది నా అశక్తతని పదే పదే పంటి నొప్పిలా గుర్తు తెస్తూ ఉంటుంది.

"ఓస్.. నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలే కానీ, గరిట పట్టుకోవడం దగ్గరనుంచి సివంగి పులుసు పెట్టడం వరకూ నేర్పే వెబ్ సైట్లు కోకొల్లలు" అని అలా చప్పరించెయ్యకండి. (సివంగి అంటే లేడీ లయన్ అనుకొనేరు. రామ రామ.) నాకు వంట రాదని చెప్పలేదే! అటుకుల ఉప్మా నుంచి అరిసెల దాకా వచ్చు. గత ఏడేళ్ళలో వేడిగా వెచ్చగా వండుకు తిని నేను, నేను వండినవి తిని నా పరివారం తలో __ కేజీ లు పెరిగాం. కనుక వంట రాకపోవడం సమస్య కాదు. వండినవి వంక పెట్టకుండా తినే వాళ్ళున్నారు. 'ఈ రోజు వండను.' అని నేను కనక అంటే "పోన్లే బయట తిందామా? పోనీ నేను వండి పెట్టనా?" అని ఉదారంగా అడిగే వాళ్ళూ ఉన్నారు. 'నస ఆపి చెప్పవమ్మా..!' అని మీరు విసుక్కోక ముందు నా గతం లోకి తీసుకెళ్ళ్తాను రండి.

'అమ్మాయీ, పెళ్ళి చేసుకుంటావా?'
'అదేం భాగ్యం నాన్న గారూ!' ఇరవయ్యేళ్ళ నేను.
'నువ్వు ఒప్పుకోవనుకున్నానే!!! '
'ఏదో మీ అభిమానం.' నునుసిగ్గుతో నేను.
'మరి చదువో?!' తెల్లబోయిన నాన్నగారడిగారు.
'చదువుకున్న వాడినే చూడండి, నాన్నగారూ!' వినయంగా చెప్పాను.

తప్పేదేముందని మా మేనత్తలకి పెళ్ళెళ్ళు అయ్యాక జాజికాయ పెట్టెలో పెట్టి మా తాతగారు అటకెక్కించిన 'గేలాన్ని', మా తమ్ముడి చేత జాగ్రత్తగా కిందకి దింపించారు మా నాన్నగారు. దుమ్ము దులుపుకుంటూ 'కాస్త ఆ మొహానికి తొమ్మిది నలుగులూ పెట్టుకో, ఎర అదేగా' అరిచాడు మా తమ్ముడు. 'దాని మొహానికేంరా? నలకూబరుడే వస్తాడు.' నన్ను వెనకేసుకొచ్చింది నాయనమ్మ. తథాస్తు దేవతలకే పురాణ విజ్ఞానం తక్కువో, మా నాన్నగారి చెవులు దుమ్ముకి దిబ్బెడలేసాయో కాని నలకూబరుడికి బదులు నలుడొచ్చాడు నా జీవితంలోకి.

పెళ్ళయిన కొత్తలో 'దిబ్బరొట్టెలో బెల్లం పాకం వేసుకో', 'ఆవకాయ నంజుకో' అని బలవంతం చేస్తుంటే అత్తవారు మంచివారనుకున్నాను. పెసరట్టుప్మా తిందామని శ్రీవారు షికారుకి తీసుకెళ్తే 'పాపం! తిండి పుష్ఠి ఉన్న బాపతులే మన లాగే. మన రొట్టె విరిగి నేతిలో పడిందని' లొట్టలేసాను. వేరు కాపురం పెట్టిన కొత్తల్లో శనివారం ఫలహారం భర్తా రావుగారు వండి పెడితే, 'నా అదృష్టానికి దిష్టి తగలకుండా నిమ్మకాయలు కట్టాలి' అనుకొనేదాన్ని. రాబోయే ఉత్పాతానికి ఇవి సూచనలని నాకేం తెలుసు! వెర్రి దాన్ని.

అవి బెంగుళూరు వర్షాలకి నాకు రొంప పట్టిన రోజులు. మా ఇంటికి చుట్టాలొచ్చారు. నాకు జ్వరమొచ్చింది. మా ఆయన చేతికి గరిటొచ్చింది. వంటింటిలోంచి వస్తున్న ఘుమఘుమల ముందు నా రొంప చిత్తుగా ఓడిపోయింది. ముగ్గు ఎగబీలుస్తూ వంటింటి వైపు చూద్దునూ.. టొమాటో- కొత్తిమీర పచ్చడి, కొబ్బరి కాయ పచ్చడి, బంగాళ దుంప మసాలా కూర 'హలో' అని పలకరించి, మా వారి వైపు కళ్ళెగరేస్తూ చూపించాయ్. మేరు నగ ధీరుడిలా నిలబడి ఓ చెయ్యి నడుం మీద వేసుకొని, ఒంటి చేత్తో దోసెలేసేస్తున్నారు. ఆ దోసెలు చూద్దునూ.. బంగారు రంగద్దుకొని పెనం మీదనుంచే  "అందము చూడవయా.. ఆనందించవయా" అని నోరూరించేస్తున్నాయ్.
"గంటలో దోసెల పిండెక్కడిదీ..!" అని విస్తుబోదును కదా.. "అటుకులు నానబెట్టి కలిపి రుబ్బాను పప్పు, బియ్యం తో పాటు." సగర్వంగా చిట్కా అందించారు. చెప్పొద్దూ.. ముచ్చటేసింది. జ్వరం సంగతి పక్కన పెట్టి దోసెలు లాగించా నేను కూడా.

వేరు కాపురం లో మొదటి కృష్ణాష్టమి ఏలా జరుపుకున్నామో చెప్దామని అత్తగారికి ఫోన్ చేద్దును కదా "మా వాడికి అన్నీ వచ్చులే. ఓ ముప్పై రకాల పిండి వంటలైనా వండి ఉంటాడు. ఏం?"  అన్నారావిడ. మా వంటింటి రహస్యాలన్ని ఆవిడకి ముందే ఎరుక. పాపం కదా నేను!

ఆపధ్ధర్మానికి వండే మగాళ్ళని చూసాను. అదే వృత్తి కనుక వండే వాళ్ళనీ చూసాను. సాంబారో, బజ్జీలో సరదాగా వండే వాళ్ళని చూసాను. చిత్ర కారుడు రంగులు కలిపి కొత్త వర్ణం సృష్టించినంత నైపుణ్యంతో, కొత్త రుచులని నా వంటింట్లో పుట్టించేస్తూంటే నేనేంగాను?

"మరీ చోద్యం చెప్తావు నువ్వూ" అని బుగ్గలు నొక్కేసుకోకండి. మనం వండిన టొమాటో రసంలో ఉప్పు, పులుపు, కారం సరిపోతే నెగ్గేసాం అనుకుంటామా? అదే వండి పెడితే వెన్నెల్లా నవ్వేసి, తినేసి.. 'బాగుందా?' అని మీరు అడిగితే "ఓ.. బాగుంది. ఈ సారి పోపులో రెండు మిరియాలు, ఓ లవంగం, చిన్న దాల్చిన చెక్క వేసి చూడు." అని చెప్పారనుకోండి. ఏమంటారు? అలా పోపు వేస్తే మీరు అద్దిరిపోయేంత బాగుందనుకోండి. ఏమైపోతారు?

'ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై నంతై..' అన్నట్టు అతగాడు ఇటాలియన్, మిడిటేరియన్, చైనీస్, థాయ్, ఫ్రెంచ్ క్యులినరీ టెక్నిక్స్ విని, చదివి తెలుసుకొని ప్రయోగాలు చేసి గెలుస్తూంటే.. నేను వండిన గుత్తి వంకాయ కూర ఘటోత్కచుడు యాదవుల పిల్ల పెళ్ళి విందు వదిలేసి, మా వంటింటికి పరిగెట్టుకొచ్చేలా చేసేంత భోగ్యంగా ఉండచ్చుగాక. ఎవడికి కావాలి?  ఇంట గెలవలేకపోయాక.  పెద్ద గీత పక్కన చిన్న గీతనయ్యాక.

బుడ్డోడి పుట్టిన రోజు విందులో వచ్చిన ఆడంగులందరూ రెసిపీలు చెప్పమని తన చుట్టూ మూగినా, మగాళ్ళు రంగుల రంగుల హోమ్మేడ్ ద్రావకాలని అహా ఓహోకారాలతో తాగి తన్మయులైపోతున్నా ఓపికగా భరించాను. సహించాను. అందరూ వెళ్ళాక "నీ చేత్తో కాస్త కాఫీ పోద్దూ. తల బద్దలైపోతోంది. ఎన్ని వండినా డికాషన్ నీలా తియ్యలేను " అని నన్ను జోకొట్టి జోల పాడారు. ఏడుపు ఆపాను. మర్నాడు ఓ వనిత " మీ వారిని అడిగి మంచి స్వీట్ రెసిపీ ఏదైనా చెప్దురూ" అని ఫోన్ చేసి అడిగే దాకా!

నవ్వుకుంటారో.. పెదవి విరుస్తారో.. సలహాలేమైనా ఇస్తారో.. నాకవేం అక్కర్లేదు. నా వంటింటికి అత్తగారి ఎసరు లేదు. తోటికోడలు రాదు. నేను ఉన్నది ఎక్కడో భూగోళానికి రెండో వైపు కనుక. కాని ఆధిపత్యం నాది కాదు. ఇదేమైనా మామూలు కష్టమా? నాకు వంట రాకపోయినా బాగుండును.  పోనీ 'వంటింటిలోకి రావద్దూ.' అని ఆటంకిద్దామా అంటే తను కొనుక్కున్న రకరకాల దేశీ, విదేశీ దినుసులు, పరికరాలు నన్ను జాలిగా చూస్తాయి. నా పోపుల పెట్టే నా మీద ధర్నా చేస్తుంది తెలుసా! ఈ జన్మకి నా వంటని పొగిడే వాళ్ళు లేరు, రారు. నా పాకశాస్త్ర నైపుణ్యం మర్రి చెట్టు నీడలో పిల్ల మొక్క లెక్క.

సర్లెండి. ఎంత చెప్పినా ఇది తీరే బాధ కాదు. ఆర్చే నిప్పు కాదు.
వెళ్ళొస్తా.. హనుమంతులవారు వస్తారు. కుప్పి గెంతులు వెయ్యాలి.
అర్ధం కాలేదా! వంట చెయ్యాలి. టా టా..

                  ************************************************

"మీ భక్తురాలు బాధ పడుతోంది గోవిందా!"
"సో వాట్ అలిమేలూ.. అతడూ నా భక్తుడే కదా?"
"అతడిది మీ పేరేనని మీకు పక్షపాతం."ముక్కు చీదింది మంగతాయారు.
"అతను 10% నా పేర హుండిలో వేస్తాడు తెలుసా?" గొప్పపోయాడు సారు.
"హ్హూ..డబ్బు మనుషులు.డబ్బు దేముళ్ళు."
"పోనీ ఆవిడేం చేస్తోంది నాకోసం చెప్పు?"
"శనివారం ఫలహారం." టక్కున చెప్పింది మేడం.
ముక్కున వేలేసుకొని సదరు మానవుడికి కొత్త ప్రాజెక్ట్ ఎలకేట్ చేయించాడు శ్రీనివాసుడు.
పరిష్కారం లేని సమస్యలకి తాత్కాలిక ఉపశమనం ప్రాప్తిరస్తు.

30 comments:

 1. abba mee adrustam chuste jalouse ga undi. Maa vaaru fever vachina, cheyaleka padipoyinaa oka kappu coffee pettukoru and naku pettivvaru.haaaa... :(

  ReplyDelete
 2. అమ్మో, ఇలా అయితే చాలా కష్టమండీ!
  రాకపోతే రాదంటారు.
  కాస్త బాగా వస్తే, డామినేషన్ అంటారు.

  పాపం మీ గోవిందుగారు :)

  ReplyDelete
 3. Nice blog susmitha. Busy schedulelo nee blog chadivithe oasis la anipinchindi.

  ReplyDelete
 4. so refreshing.. chichi.. intha chadivina.. telugu lo pogadakapothe, maha papam. anduke -- Chala chala bagundi.. kotha aavakaya la..

  ReplyDelete
 5. Emandee eemadhya malla avakaya pettinattu ledu???

  ReplyDelete
 6. హహహ వింత కష్టాలే నీవి...నీ స్థానంలో నేనుంటే దర్జాగా కాలు మీద కాలేసుకుని అన్నీ చక్కగా లాంగించేద్దును..ఏడుపు మాని నీ అదృష్టానికి మురిసిముక్కలైపో ముందు.

  హాయిగా రకరకాలన్నీ వండించుకుని తిను...నీ జన్మని సార్థకం చేసుకో :)
  చివరిగా తమరు పోస్టు వేసినప్పుడల్లా నాకో ముక్క మైల్ లో కొడితే బావుంటుంది...చదివి తరిస్తాను.

  ReplyDelete
 7. హహ్హహ్హా.. భలే ఉంది మీ బ్లాగు:) చాలా నచ్చింది.. మిగిలిన టపాలు కూడా చదువుతా..

  ReplyDelete
 8. మెచ్చుకున్న వారికి: మంగిడీలు. :)
  @ ఎదురుచూస్తున్న వారికి: ఆవకాయ అంటే మాటలా? భాండం శుధ్ధి చేస్తున్నా.. త్వరలో విందు ఉంది.
  @ సౌమ్య: చేస్తున్న పని అదేమరి. నాన్యః పంథా. కొత్త పొస్టు వెయ్యగానే చెప్తాలే.
  @ రాజా: మీకు వంటొచ్చా మాస్టారూ?

  ReplyDelete
 9. హ్హహ్హహ్హా! ఇన్నాళ్ళూ నేనే అనుకున్నా....నాకు మంచి సరిజోడి దొరికారు! నా ఇస్టోరీ కూడా సేంటుసేం మీదే! ఏదో ఒంట్లో బాగోనప్పుడు వంట చేసిపెడితే ...హమ్మయ్యా అనుకుంటాం...కాని ఇలా వంటగది మీద దాడి చేసి...కొత్తకొత్త రుచులు కనిపెట్టి....మనం చేసే వాటికి అందమైన వంకలు పెట్టి..అలా చేసుంటే అద్దిరిపోయేది తెల్సా! అని అనేవాళ్ళతో ఎలా వేగడమో ఏమో! శ్రీనివాసుడు నన్ను కరుణించనైనా లేదు....నా పరిస్థితి ఏమని చెప్పనూ!!

  ReplyDelete
 10. @ ఇందు: శ్రీనివాసుడి దయకి దగ్గర దారి - శనివారం ఫలహారం (మినప రొట్టె అయితే ఇంకా మంచిది)

  ReplyDelete
 11. chala bagundandi... keep writing...we become fans of 'Kothavakaya', thanks to Govind for introducing..

  ReplyDelete
 12. తలో__కేజీ లు పెరగడం దగ్గర మొదలయి శనివారం ఫలహారం దాకా హాస్యం పండించిన తీరు, రచనా శైలి న భూతో న భవిష్యత్.. ముళ్ళపూడి మళ్ళీ పుట్టినట్టుంది.

  ReplyDelete
 13. మీ బ్లాగు ఇంతకు మునుపు చూశానా? గుర్తు కు రావట్లేదు!!
  అద్భుతంగా రాస్తున్నారు.
  చివర్లో అమ్మవారి అయ్యవారి ఇష్టాగోష్టి విని ఒక ఆలోచన వస్తోంది. ఈ స్టోరీ అయిడియా చూడంది ఓ సారి.

  ReplyDelete
 14. Amma,
  You are very lucky to have pati of this kind,to say being a male even today I am unable to decide either it is a gods gift or punishment,I recollected my late father while reading your Chinna Gita,my father, your hubby,even myself,all are birds from same feather,being from orthodox brahmin family of olden days mother being teacher we all became professionals by that time I was 6 years old,infact it is an art,I hve seen very few females,those who cook very delicious food with out disturbing their make up or show of the kitchen,your narration with good humor resembles that of Mrs. Malati chandoor,god bless you.

  ReplyDelete
 15. I'm flattered. Thanks so much.
  దారానికి అంటిన పరిమళం పువ్వుల సొత్తే. దారపు గొప్పేం కాదు. మహానుభావులను అనుకరించడమో, అనుసరించాలని ప్రయత్నించడమో దుస్సాహసమే కాని, వారి శైలికి ఉన్న సమ్మోహన శక్తి తక్కువేం కాదు.
  ప్రతిబింబించేది సూర్యుడి కాంతి. అద్దం ముక్కదేం లేదు.

  ReplyDelete
 16. @Susmitha,

  వంటొస్తే రాబోయే కాలంలో కాబోయే మా ఆవిడ ఇలా బ్లాగు ప్రెవేటు చెప్పేస్తుందేమోనని భయఫడేసి.. నేర్చుకోలేదు :)

  ReplyDelete
 17. RG has left a new comment on your post "చిన్న గీత":

  @Susmitha,

  వంటొస్తే రాబోయే కాలంలో కాబోయే మా ఆవిడ ఇలా బ్లాగు ప్రెవేటు చెప్పేస్తుందేమోనని భయఫడేసి.. నేర్చుకోలేదు :)

  ReplyDelete
 18. మీ బ్లాగుపోస్టు నిన్న చదివిన నేను మీ హ్యుమర్ ఐక్యూ బాగా నచ్చటంతో, సరదా సమయం కోసం మిగతావి చదువుదామని చూస్తే చాలా ఉన్నాయి. అన్నిటినీ ఓ భరతం పట్టాలి,మెల్లిగా.

  -'మరి చదువో?!' తెల్లబోయిన నాన్నగారడిగారు.
  'చదువుకున్న వాడినే చూడండి, నాన్నగారూ!' వినయంగా చెప్పాను

  అది చదివి పైకే నవ్వేసాను, పక్కన పిల్లలు ఎంటి నాన్నా మాకూ చూపించు అనేలాగా.

  పోతే, మీరు ఓన్లీ హ్యుమరే కాదు.. మీరు చెప్పిన తర్వాత మిలియన్ డాలర్లు ఏం చదివానా అని వెళ్ళి చూస్తే గుర్తొచ్చింది..అక్కడ వావ్ అనిపించింది నాకు, దాంట్లో ఉన్న ఆర్ద్రతకి, ఫిలసాఫికల అండర్ టోన్ కీ.

  గుడ్ బ్లాగ్. థాంక్స్.

  ReplyDelete
 19. >>'అమ్మాయీ, పెళ్ళి చేసుకుంటావా?'
  'అదేం భాగ్యం నాన్న గారూ!' ఇరవయ్యేళ్ళ నేను.
  'నువ్వు ఒప్పుకోవనుకున్నానే!!! '
  'ఏదో మీ అభిమానం.' నునుసిగ్గుతో నేను.
  'మరి చదువో?!' తెల్లబోయిన నాన్నగారడిగారు.
  'చదువుకున్న వాడినే చూడండి, నాన్నగారూ!' వినయంగా చెప్పాను.

  పై లైన్లని మాటిమాటికీ తలచుకొని నవ్వుకుంటున్నా. త్రివిక్రం శ్రీనివాస్‌ లా మీరూ సినిమాల్లో ట్రై చెయ్యొచ్చేమో!..Thanks for the post.

  ReplyDelete
 20. susmithaa
  Murari gaaru cheppinatlu meesaili trivikram srinivas lagaundi. the great Director late sri JANDHYALA garu batikunte eee blogni ayana cenemalo oka part chesi undevaru .....

  may god bless you forever...

  ReplyDelete
 21. Muraari garu cheppinatlu.... Trivikram srinivas laga undi saili
  HAASYA BRAHMA JANDHYALA bratikunte, ee blog ni aayana cenemalo oka bhagamga chesevadu.


  GOD BLESS YOU FOREVER

  ReplyDelete
 22. మీ రచనా శైలి అద్భుతం. చాలా బాగుంది.

  ReplyDelete
 23. అందరూ చెపిన విషయమే ఐనా మళ్ళీ ఓసారి చెప్పేస్తున్నానండీ.. మీ రచనా శైలి అమోఘం. సునిశితమైన హాస్యం అద్భుతంగా ఉంది.. మీ నాన్నగారు మీ పెళ్ళి గురించి అడిగినట్లు రాసిన సన్నివేశం నేను జన్మలో మర్చిపొలేను.

  ReplyDelete
 24. 'నా అదృష్టానికి దిష్టి తగలకుండా నిమ్మకాయలు కట్టాలి' అనుకొనేదాన్ని. రాబోయే ఉత్పాతానికి ఇవి సూచనలని నాకేం తెలుసు! వెర్రి దాన్ని.

  బాధపడకండి మీకు తోడూ నేను ఉన్నాను మీ శైలి నిజంగా అద్భుతంగా ఉంది. పోస్ట్ చదువుతూ బలే నవ్వుకున్న అంతలోనే పాపం అనిపించింది కూడా

  ReplyDelete
 25. మీరు రాసిన వన్నీ చదివేసాననుకున్నాను. చక్రపొంగలి మిస్ ఆయానని ఇప్పుడే తెలిసింది.

  ఇన్ని కామెంట్ల తరువాత ఇంకా వ్రాసేందుకు ఏముంది.
  అద్భుతం అంతకన్నా పెద్దది నాకు తోచటం లేదు.

  ReplyDelete
 26. అల్టిమేట్ పోస్టండీ.. ఇరగదీశారు{చాలా లేట్ గా చదివానండీ..}
  ఎంతయినా మీరు అదృష్టవంతులండీ.. ;) ;)

  ReplyDelete
 27. "హనుమంతులవారు వస్తారు. కుప్పి గెంతులు వెయ్యాలి.
  అర్ధం కాలేదా! వంట చెయ్యాలి"
  Hilarious.

  I have seen your comments in few blogs but never paid attention until I saw a post on your blog in "Nemalikannu"

  జంధ్యాల గారి సినిమా లో శ్రీలక్ష్మి కామెడీ ని గుర్తుచేస్తున్నారు.

  ReplyDelete
 28. ఇప్పుడే చూసా ఈ పోస్ట్. ఏం ఎంచక్కా వండి పెడితే తినడానికి ఏం రోగమట? ఇంత మంచి మనసున్న మీ కొత్తావకాయుడు ఖచ్చితం గా తూగోజీ వాసై ఉంటారు.(లేకపోతే పూర్వ జన్మలో అయినా సరే ). వారికి నా జోహార్లు.

  ReplyDelete
 29. అబ్బ..చదువుతు౦టేనే నోరీరిపోతూవుంది. మీ అడ్రస్ ఏంటో చెప్తారా? ఆ.. అయినా ఆ వంటల రుచి ఏ పాటిది లెండి, మీ 'కొత్తావకాయ' ముందు. ఏంటో నండీ అదేదో సినిమాలో ఇలియానా లాగా నేనో _ ఏళ్ళు లేటు. లేకపోతే ఇంత మంచి బ్లాగ్స్ ఇంత లేటుగానా చూసేది.

  ReplyDelete
 30. " హనుమంతులవారు వస్తారు. కుప్పి గెంతులు వెయ్యాలి." - ఏం చెప్పారండీ ?? నాకు బాగా నచ్చాయి ఈ వాక్యాలు.ఎన్ని సార్లు నవ్వుకున్నానో!

  ReplyDelete