Tuesday, January 10, 2012

వేడ వచ్చునా మరికొన్ని! ~ కాత్యాయనీ వ్రతం - 27

నెలవంకను పోలిన నుదుటిపై సరాగాలాడుతున్న ముంగురులను, కరకంకణాలు సవ్వడి చేసేలా సుతారంగా సవరించుకుంటూ, కెమ్మోవులపై చెంగలించే చిరు చిరు నగవులతో.. ఆ తిలకినీబృందం కాత్యాయనీ దేవిని అర్చించి, మంగళారతులిచ్చారు. పూజావిధి పూర్తి చేసి యమునాతటి పై కూర్చున్న వారికి ప్రకృతి మనోహరంగా తోచింది. అరుణోదయవేళకు సమాయత్తమవుతున్న తూర్పుకాంత మనోజ్ఞంగా ఉంది.

"చెలీ! ఇంత హాయిని కృష్ణుని సన్నిధిలో తప్ప వేరే వేళా ఎరుగమే! కన్నయ్య ఇక్కడెక్కడైనా ఉన్నాడంటావా?"
సురభి సందేహానికి ఉలిక్కి పడ్డారందరూ! నిన్న చీరలెత్తుకెళ్ళి అల్లరి చేసిన చిత్తచోరుడు అక్కడే ఉన్నాడేమో అనే ఊహ వారి చెక్కిళ్ళలో కెంపులు పూయించింది. తత్తరపడుతున్న నెన్నడుములతో, అందెలు ఘల్లనేలా అటూఇటూ కలియతిరిగారందరూ! ఎపుడొచ్చాడో, ఎటునుంచి వచ్చాడో తెలియదు కానీ, నవ్వుతున్న మోహన మురళీధరుడు తమ మధ్యలో..  మణిహారం మధ్యలో మెరిసే అనర్ఘ రత్నంలా తళుక్కుమన్నాడు. ఒక్కసారి తడబడ్డారు. ఎదురుచూడకనే ఎదురైన ఆనందానికి వారి మోములు దీపాల వలే మెరిసాయి.

"మీకు శ్రమ ఎందుకని నేనే వచ్చాను." కృష్ణుడు పలికాడా? గండు తుమ్మెద ఝుమ్మందా? వారి కనులు కలువలయ్యాయి! శిఖిపింఛాన్నీ, నల్లని ముంగురులనూ, వనమాలనూ, పీతాంబరాన్నీ అల్లరిగా తాకివెళ్తున్న తెమ్మెరపై పట్టలేని ఇడుగడ కలిగింది గోపకాంతలకు.

"పూజ పూర్తి చేసుకున్నారా?"
"ఓ.."
"నా వద్దకేగా బయలుదేరబోతున్నారు!"
"ఊ.. అవును."
"నేనే వచ్చానుగా! చెప్పండి."
"కృష్ణా! ఎంత ఆనందంగా ఉందో!"
"ఊ..."
"ఎంత కష్టపడి తెలవారక మునుపే నిద్రలేచావో! ఇంత దూరం మా కోసం వచ్చావో!"

"మాయ మాటలు మాని ఏం కావాలో చెప్పండి, వయ్యారులూ!"
"ఏం కావాలన్నా ఇస్తావా?"
"నేనేం ఇవ్వడానికి సమర్ధుడనో మీకు తెలియదా!"
"నువ్వు వాసుదేవుడవు! నీకు సాధ్యం కానిది ఉందా?"
"అన్నీ తెలుసుకున్నారు కదా! ఏం కావాలో చెప్పండి మరి!"

"మాకు గాజులు కావాలి."
"పూలచెండ్లల్లే సుకుమారంగా ఉన్న మీ చేతులు సూడిగముల కాఠిన్యానికి నొచ్చవూ!"
"ఇదిగో.. మాయ మాటలొద్దు కన్నా!"
"ఊ.. సరే సరే! గాజులు.. అంతేనా?"
"జుమికీలూ, చెవి తమ్మెట్లకి అలంకరించుకునే పువ్వులూ కావాలి."
"తలిరాకుల చెవులకు పువ్వుల జుమికీలు, చెవాకులు! బాగు బాగు!"
"మరి మా కాళ్ళకు అందెలో!?"
"పదపల్లవాలకు లత్తుక చాలదూ! నూపురాలు ఒత్తుకుని నొచ్చితే, నేనేగా సేవలు చేయాల్సినవాడిని!"
కృష్ణుడి మాటలకు ఉక్రోషపడదామనుకుని ఆగిపోయారు. "చిక్కని పూపొదరింటో, ఏ పొగడ తిన్నె పైనో, మావి కొమ్మ ఊయలలోనో కూర్చున్న తన పాదాలకు నల్లనయ్య మక్కువగా పారాణి అద్దిన నాటి గురుతు" ప్రతి గోపిక మనసులోనూ మెదిలి వాగ్బంధనం చేసింది. చిగురుకటారి కోలలకు విలవిల్లాయి వారి ఎడదలు!

"సూడిగములు, జుమికీలు, చెవి ఆకులు, పాడగములు.. అంతేనా?"
ఇంకా ఏం అడుగుదామని ఒకరినొకరు చూసుకున్నారు. గాజులకి జోడు 'బాహుపురులు' కూడా ఉంటే చేతులు నిండుగా ఉంటాయని అనుకున్నారు.
"కేయూరములు కూడా కావాలి, కన్నా!"
"ఊ.." ఇంకా.. అన్నట్టు చూసాడు.
"ఆడువారికి చీరలంటే ఎంతో ప్రీతి. నీకు తెలిసిందే కదా! మాకు వన్నెల చీరలు కావాలి." తల తాటించి నవ్వాడు.

"ఆడు వారి కోరికలని నవ్వుకుంటున్నావా? మాకు పెద్ద పెద్ద కోరికలేమీ లేవయ్యా! తన అన్న వాలిని చంపమని సుగ్రీవుడు కోరితే కాదన్నావా? తమ్మునితో నేస్తం కట్టి అన్నని చంపావు కదా!" ఒక గోపి నిష్టూరాలు ఆడింది. మారాడక నవ్వాడు నల్లనయ్య.
"శత్రు వర్గం వాడైనా శరణుజొచ్చాడని విభీషణుడిని లంకాధిపతిని చేసావు. మాకు రాజ్యాలక్కర్లేదులే!" ఈ మాటకీ వెన్నలా చల్లని చిరునవ్వే సమాధానం!
"రాముడై ఏం చేసావో ఎందుకిప్పుడు! కృష్ణుడివై పుట్టావు. గోకులాన్ని కాచేందుకు కొండనెత్తావు. గోవిందుడవైనావు. గోవిందా! మాకోసం ఇప్పుడు నువ్వేమీ కొండలు ఎత్తక్కర్లేదయ్యా! కూడదనక మేమడిగిన చిన్ని చిన్ని కోరికలు తీర్చు చాలు!" తన వంతు మాటలు ఇంకో గొల్లెత అనేసింది.
"ఏదో, నీరాడి వచ్చి వ్రతం నోచుకున్న సంతోషంలో అడుగుతున్నామంతే! మా పూజ పూర్తి అయ్యే సమయానికి నువ్వు వచ్చావు. ఎంత ఆనందంగా ఉందో! ఈ ఆనందంలో నీతో కలిసి పాయసం తినాలని ఉంది కన్నా!" అందరి మనసులలోనూ ఉన్న కోరికను ఎరిగినట్టు కమలిని చెప్పింది. అవునన్నట్టు తలలూచారందరూ!
"గోపబాలురతో కలిసి చల్దులు భోంచేసావట! మా అన్నలు తమ్ములూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో.. "కన్నయ్య మా చల్ది తిన్నాడని, మా ఊరుగాయ బాగుందన్నాడనీ! నాకు తినిపించాడనీ, నా చేతి వెన్నముద్ద తిన్నాడనీ" మాకా భాగ్యం కలిగించవూ!" తమ చిరకాల వాంఛ బయటపెట్టారు గోపికలు!

"ఊహకే ఎంత ముద్దుగా ఉంటుందో! ఊరుగాయ నాకుతూ మాటిమాటికీ వేలు మడిచి ఊరించేదొకడు. ఒకని చల్దిముద్ద దొంగలించి గుటుక్కున మింగి "చూడు లేదని!" నోరు చూపునొకడు. ఇద్దరికి కలహం సృష్టించి వారి చల్దులు ఆరగించేవారట మిగిలిన వారు! "కృష్ణా! మా అమ్మ చేసిన భక్ష్యమిదిగో!" అని నీచేత తినిపించేదొకడు. నవ్వే వాడొకడు. నవ్వించేదొకడు. వింత చేష్టల వాడొకడు. వినోదించేవాడొకడు.. ఈ సందడిలో లేగదూడవలే ముద్దొచ్చే నువ్వెంత అందంగా ఉండి ఉంటావో!!

కడుపున దిండుగా గట్టిన వలువలో లాలితవంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును జాఱి రానీక డాంచక నిఱికి
మీగడ పెరుగుతో మేళవించిన చల్దిముద్ద డాపలి చేతమొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగిడీల నడుమ జక్కగ కూర్చుండి, నర్మ భాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుడమరులు వెఱగంద, శైశవంబు మెఱసి చల్ది గుడిచె

వంశీ మోహనా! అల్లరి కన్నయ్యా!! నడుము చుట్టూ కట్టిన ఉత్తరీయం సందున నీ పిల్లనగ్రోవి, ఊదుకునే కొమ్ము బూర, పశువులనదలించే బెత్తం జారకుండా దూర్చుకుని, మీగడపెరుగుతో కలిపిన చల్ది ముద్ద ఎడమ చేత్తో భుజిస్తూ మధ్యలో చెలికాండ్రు తెచ్చిన ఊరుగాయలు వేళ్ళసందుల జిక్కించి నాకుతూ..  బ్రహ్మాదులు వింతగా చూసేలా, అసూయ చెందేలా గొల్లపిల్లలతో కలిసి చల్దులారగించావట! బ్రహ్మ ఆ అసూయతోనే గోపబాలురనూ, గోవులనూ దొంగలించి ఉంటాడు. యాగభోక్తవి! నీతో కలిసి చల్దులు తిన్న ఆ వెర్రి గొల్లలదెంత పున్నెమో! వారెంత ధన్యులో!!

మాకూ నీతో కలిసి బంతిన కూర్చుని పాయసము తాగాలని ఉంది. నేయి, పాలు పోసిన మధురమైన పరమాన్నం తినాలని ఉంది. తింటూ ఉంటే మోచేతి నుంచి నేయి ధారగా కారేలా, నీతో కలిసి భోగ్యమైన పాయసం ఆరగించాలని ఉంది, కన్నా!"

వేడవచ్చునా మరికొన్ని మా
వేడుకకై కొన్ని!
కూడని వారిని ఓడించే
శుభ గుణములు గల గోవిందా!

ఆడువారి కోరికలనుకోకు!
కూడదనకు గోవిందా! నీ
రాడి వచ్చి వ్రతమూనిన ముదమున
అడిగెదమంతే స్వామీ!

సూడిగములు, జుమికీలు, చెవాకులు,
పాడగములు, కేయూరములు,
తొడవులన్ని కయిసేయగవలదో!
తొడగవలదొ పలువన్నెల వలువలు!

ఇంతకన్న శుభవేళ ఏదీ?
ఇంతకన్న ఆనందమేదీ?
బంతులుగా నీతోడ గూడి,
ఇంతులమెల్లరము
నేయి వెన్న మీగడలు
తీయని తీయని పాయసము
చేయిమునుగగా ఆరగింపగా
చేయవా! చిత్తగింపగా!

గోపతరుణులు కోరిన కోరికా, పాడిన పాటా.. పాల పాయసమంత తీయగా ఉంటే గోవిందుడు కాదనగలడా!

"గోప భామలూ! మీ కోరిక సబబైనదే! గొల్లపిల్లలై ఉండీ ఇన్ని రోజులుగా నేయీ, పాలూ లేకుండా వ్రతమొనర్చారు. నన్ను మెప్పించారు. ఈ రోజు మీ కోరికను కాదనను. "అహం అన్నం అహమన్నాదః" అన్నమూ నేనే, అన్నము భుజించేదీ నేనే! మీకు దోషమంటదు. అదిగో.. గోపన్న తెచ్చిన పాయసం ఆరగిద్దాం రండి!" అని అటుగా చేయి చూపాడు.

నూట ఎనిమిది కడవలతో మధురమైన పాయసము సఖులతో కలిసి తెచ్చి గోవిందునికి సమర్పించాడు గోపన్న. ఆశ్చర్యంగా తనని చూస్తున్న చెల్లెలు అమృతని, మిగిలిన గోపబాలలనూ చూసి నవ్వాడు.
"అమ్మాయిలూ! ఇంత దీక్షగా వ్రతం చేస్తున్నారే! మీ కోరిక ఫలించాలని కోరుకుంటూ, కృష్ణ స్వామి మీపై దయ చూపిస్తే పాయసం తినిపిస్తానని మొక్కుకున్నాను. కన్నయ్యతో కూడి ఆరగించండి!" పాలతరగలా నవ్వుతూ చెప్పాడు గోపన్న.

ముత్యాల కోవలా కూర్చున్న గోపికల నడుమ నీలమణి వలే జిగేల్మంటున్న మోహనకృష్ణుడు! వారి మోచేతుల నుండి నేతిధారతో కలిసి కారుతూ కమ్మని తీయ తీయని పాయసం! నారింజ కాంతులు చిమ్ముతూ తూర్పున ఉదయిస్తున్న భాస్కరునికి.. శీతగాలిలో నేతి సువాసనతో కలిసి తేలుతున్న కుంకుమ పువ్వు, యాలకులు, పచ్చకప్పురపు ఘుమఘుమలు నోరూరించే ఉంటాయి!!


* మరి పర వాద్యం సంగతేమిటో!? రేపు చూద్దాం!


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)


6 comments:

 1. "గోపికల నడుమ నీలమణి వలే జిగేల్మంటున్న మోహనకృష్ణుడు"

  **మధ్యే కృష్ణం మరకత మణిచ్ఛాయ మిచ్ఛా విహారం....

  మీ ధనుర్మాస వ్యాస పరంపర చిన్నప్పుడు నేర్చుకుని "బ్రతుకు చదువులో" మరిచిపోయిన "అసలు చదువుని" గుర్తు చేస్తోంది. ఎంత మంచి విషయం కదా...

  ~లలిత

  ReplyDelete
 2. గోపకులతో కలిసి మాగాయా, పెరుగన్నమూ తిన్న నల్లనయ్యను గోప కాంతల సరసన నిలిపి పాయసం భుజింపజేశారా. వెన్నా, నెయ్యీ కలిసిపోయి కృష్ణయ్య మోము జిడ్డెక్కిపోదూ. ఆ... అయినా పరిచర్య చేయడానికి ఎందరు బాలికలు సిద్ధంగా ఉన్నారో కదా...!

  ReplyDelete
 3. @ లలిత: మీరు మరిచిపోలేదని తెలుస్తోంది కదా! నాకు తెలియనివెన్నో మీకు తెలుసనిపిస్తోంది. ధన్యవాదాలు.

  @ puranapandaphani: అవునండీ! గోపీజనమే గోపాలుని ఐశ్వర్యం! ధన్యవాదాలు.

  ReplyDelete
 4. కృష్ణుడు పలికాడా? గండు తుమ్మెద ఝుమ్మందా? !!!

  ReplyDelete
 5. ఒకటి అడుగుదామని చొప్పదంటు ప్రశ్న అవుతుందేమోనని.. ఊరుకున్నాను..

  కాత్యాయనీ వ్రతం నియమాల ప్రకారం నెయ్యిని తాకరాదు అని రాశారు. మరి పొంగలీ,పరమాన్నం...?

  ReplyDelete
 6. @ మురళి: :) ధన్యవాదాలు.

  @ కృష్ణప్రియ: అవునండీ, నిజంగా కాత్యాయనీ వ్రతం చేసేవారికి వ్రతసమయంలో నేయి (పొంగలిలో కూడా), పాలు పనికిరావు. (కాటుక, పూవులు, కొత్తబట్టలు, విలాసాలు కూడదు. ఏకభుక్తం ఉండాలి.) కూడారై నాడు స్వామి వారితో కూడి భుజించాడు కనుక ఆ రోజు మినహాయింపు దోషం అంటదని చెప్తారు.

  ReplyDelete