Wednesday, January 4, 2012

నందుని గారాల నందనా! మేలుకో! ~ కాత్యాయనీ వ్రతం - 21

నీలి ముంగురులు గాలికి చెదిరి, వారి ముఖబింబాలకు వింత సోయగాలను అద్దుతున్నాయి. కెమ్మోవులపై చిరునవ్వులు చిందులు వేస్తున్నాయి.  పైట చెంగులు గాలికి రెపరెపలాడుతూండగా గోపకాంతలు పరుగుపరుగున నీల మందిరాన్ని చేరారు. నీల చిరునవ్వుతో ఆహ్వానించింది. స్వామి ఇంకా నిద్దురపోతున్నారన్నట్టు సైగ చేసింది.

"నీలా! నువ్వు మాతో ఉన్నావు కనుక మాకింక భయమేమీ లేదు. కృష్ణుని ఇట్టే నిద్ర లేపుతామని" ధీమాగా పలికారు గోపికలు.
"సరే! వర్షాకాలంలో గుహలో నిద్దురపోతున్న సింహం వలే నిద్రపోతున్న స్వామిని, యోగనిద్ర నుండి నిద్ర లేఫడం బ్రహ్మాదులకే ఒకంతట సాధ్యమైన కార్యం కాదు. అలాంటిది మనం పూనుకున్నాం. ప్రయత్నిద్దాం!" అని చిరునవ్వుతో బదులిచ్చింది నీల. ఆ మాటలకు ఒక్క సారి పాలపొంగు పై నీళ్ళు చిలకరించినట్టు గోపతరుణుల ఉత్సాహం తగ్గింది.
"నిజమే కదూ! 'కృష్ణుడు మాతో కలిసి ఆడాడు, పాడాడు' అనే గర్వంతో అతని సామాన్యుడని తలచి, ఇంకా నిద్దురలేవడం లేదేమని వాపోతున్నాం! మహర్షులకు, యోగసాధకులకు, ఇంద్రాది దేవతలకు చేతకాని పని మా వల్ల అయ్యేనా? వేదవేద్యుడు! అతని కొంగున కట్టుకోవాలని సంకల్పించి నోము నోచుకున్నాం. ఇది జరిగే పనేనా!?" ఇలా సందేహాలతో వారి మనసులు కలవరపడసాగాయి. నీల నవ్వుకుంది.

"చెలియలూ! మీకు స్వామి చిన్ననాటి ఊసులన్నీ తెలుసు. బ్రహ్మగర్వాన్ని భంగపరచిన వృత్తాంతం తెలుసునా?" అని ప్రశ్నించింది.
"లేదు లేద"న్నారు గోపికలు.
"సరే! ఆలకించండని" ఓ ఊయలలో తను కూర్చుని ఎదురుగా ఉన్న తిన్నెలను చూపించింది. కోకిల కంఠంతో నీల చెప్తున్న కథను వినసాగారు గోపబాలలందరూ!

"కొండచిలువ రూపంలో వచ్చి ఆలమందలను, గోపబాలురనూ మింగిన అఘాసురుని నోటిలో కృష్ణుడు ప్రవేశించి, క్షణక్షణానికీ పెరుగుతూ ఆ కొండచిలువ నోటిని చీల్చిన విషయం మీకెరుకే కదా!"
"ఊ.. తెలుసు! తెలుసు!"
"ఆ తరువాత.. ఒకనాడు గోవులను మేఫుతూ చెలికాండ్రతో ఆటలాడుతున్న గోపకిశోరుడిని చూసి, చతుర్ముఖ బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. "ఇంత సామాన్యంగా కనిపిస్తున్న ఈ నల్లపిల్లాడు.. భయంకరమైన కొండచిలువ నోట చిక్కిన తన నేస్తాలనూ, ఆలమందలనూ ఎలా విడిపించుకు పోయాడు? నెత్తిన నెమలిపింఛమూ, మెడలో ముత్యాల పేర్లూ వేసుకుని, కొండ గోగుపూల మాలలు, తులసి దండలూ చుట్టుకుని, ధూళి ధూసరితమైన ఒంటితో, ఒక చేత్తో పిల్లనగ్రోవిని ధరించి, మరో చేత్తో చల్దిముద్ద పట్టుకుని పరుగులు పెడుతున్న ఈ గొల్లపిల్లాడు అంత శక్తిశాలా? సరే! పరీక్షిద్దా"మనుకున్నాడు. కన్నయ్య నీరు త్రాగడానికి ఓ కొండవాగువద్దకు వెళ్ళిన సమయంలో ఆలమందలనూ, గొల్లపిల్లలనూ దొంగిలించి తన మాయతో ఓ కొండగుహలో బంధించివేసాడు."
"అవునా!!"
"ఊ.. అవును! వెనక్కి వచ్చిన కృష్ణునికి తన వారెవ్వరూ కనిపించలేదు. గోవులూ కనిపించలేదు. నవ్వుకున్నాడు కన్నయ్య. తానే గోవులయ్యాడు. తానే తన తోటి గోపబాలురయ్యాడు. అన్ని రూపాలూ తానే ధరించాడు. ఇంటికి వెళ్ళాడు. గోవులు క్షీరధారలు కురియనారంభించాయి. పెయ్యలు తాగినవి తాగగా,  పిదుకనవసరం లేకుండా పెట్టిన కడవ పెట్టినట్టు నిండిపోసాగింది! ఏ పిల్లాడిని హత్తుకున్నా వారివారి తల్లులకు పట్టలేని ఆనందం కలిగేది. అక్కడున్నది సాక్షాత్తూ కృష్ణుడేనాయె! రేపల్లెలో మునుపు లేని ఆనందమేదో ఆవరించింది. పిల్లలందరూ మునుపటివలే మామూలుగా ఉండసాగారు. ప్రతి ఉదయం కృష్ణునితో కలిసి ఆలమందలను అడవిలోకి తీసుకుపోయి మేపి, ఇళ్ళకు చేరేవారు. అన్నీ యధాతథంగా జరిగిపోతున్నాయి.

ఇలా ఒకరోజు, రెండు రోజులు కాదు. ఏడాది గడిచింది! ఒక్క బలరామునికి తప్ప వేరెవరికీ జరుగుతున్నది పసిగట్టే శక్తి లేదు. మనుషులకు ఒక యేడాది అంటే బ్రహ్మకు లిప్త కాలం. రేపల్లెలో ఏమవుతోందోనని చూసిన బ్రహ్మకు అంతా మామూలుగా కనిపించింది!! కృష్ణుడు తన చెలికాండ్రతో చల్దులారగిస్తున్నాడు. పశువులు నీడను పరుండి నెమరు వేస్తున్నాయి. ఇది వరకు లేని అందమేదో ఆ అడవి అంతా కమ్ముకుంది. మనోజ్ఞమైన తరువులతో, ఫలాలతో వంగిన కొమ్మలతో, మనోహరమైన పుష్ప సంపదతో నందనవనంలా ఉందా కాననం! ఏమీ అర్ధం కాక బ్రహ్మ తను గోవులనూ, గోపాలకులనూ దాచిన గుహలో చూసాడు. అక్కడ వారందరూ తన మాయకి బధ్ధులై నిద్రపోతున్నారు!

అడవిలో ఎటుచూసినా పరుగులు పెడుతూ ఆడుతూ, నవ్వుతూ గొల్లపిల్లలే! తరచి చూద్దుడు కదా.. గోపాలకులందరూ నీలమేఘశ్యాములయ్యారు. నేలపై నీలిమేఘాలు పరుగులు పెడుతున్నాయేమో అని నెమళ్ళు పురివిప్పి నాట్యమాడసాగాయి. పుష్పవర్షం కురవసాగింది. ఆ బాలురందరూ హారాలతో, కిరీటాలతో, కుండలాలతో, బంగారు అంగుళీయకాలతో, వనమాలికలతో వెలుగొందసాగారు. అందరికీ నాలుగు చేతులు! శంఖ చక్రాలతో గదలతో కమలాలతో నిండి ఉన్నాయి. వక్షస్థలంపై శ్రీవత్సపు చిహ్నమేర్పడింది. పసుపుపచ్చని పట్టు వలువలతో, తెలి వెన్నెల నగవులతో అందరూ శ్రీమన్నారాయణులవలే కనిపించసాగారు! హంస వాహనమెక్కి అవనీతలంపై నిలచిన బ్రహ్మ తన శిరస్సులు వంచి కృష్ణునికి మొక్కాడు. "పరాత్పరా! నీ మాయ ఎరుగని వాడనై, నీ శక్తినే శంకించి నిన్ను పరీక్షిద్దామనుకున్నాను. నువ్విచ్చిన పదవే నాకు గర్వాన్ని తలలకెక్కేలా చేసింది. నేను సృష్టికర్తననుకున్నాను. నన్ను సృష్టించినది నువ్వేనని విస్మరించాను. నీ మోహన రూపం చూసిన నా భాగ్యం ఏమని చెప్పను! క్రొక్కారు మెరుపుతో మేళవించిన మేఘం వలే, ఈ పసుపుపచ్చని ఉత్తరీయం ధరించి వెలుగుతున్నావు. నీ చెవులకు గురివిందలు పొదిగిన కుండలాలు ఎంత రమణీయంగా ఉన్నాయో! నెమలిపింఛంతో ఒప్పారుతున్న నీ నీలాల కురులు చూసిన కొద్దీ మోహాన్ని కలుగచేస్తున్నాయి. వనమాలికలతో అలరారే మనోహరమైన వక్షస్థలముతో, కెందామరల వంటి కరచరణాలతో నీ రూపం.. ఆపాదమస్తకం ఎన్నిమార్లు చూసినా తనివి తీరకున్నది. ఏమి పుణ్యము చేసుకున్నానో!" అని కృష్ణునికి నమస్కరించాడు. మాయను ఉపసంహరించి గోపబాలులను, ఆలమందలనూ కృష్ణునికి అప్పచెప్పాడు.
"అప్పుడేమయింది!?"
"ఏమవుతుంది. మాయ కమ్మిన బాలురకు ఏ మాత్రం తేడా తెలియనివారై మామూలుగా కృష్ణునితో కలిసి మెలగసాగారు. మలిసంజె వేళయిందని ఆలమందలను వాటి ముద్దు ముద్దు పేర్లతో

రా పూర్ణచంద్రిక రా గౌతమీ గంగ రా భాగీరథరాజతనయ
రా సుధాజలరాశి రా మేఘబాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి
రా మనోహారిణి రా సర్వమంగళ రా భారతీ దేవి రా ధరిత్రి
రా శ్రీమహలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి

అని మురిపెంగా పిలుస్తూ ఆలకాపరి, నేస్తాలతో కలిసి రేపల్లెకు చేరాడు."

"అలా బ్రహ్మకు గర్వభంగం చేసాడన్నమాట! మాకు తెలియదే!" ఆశ్చర్యపోయింది సురభి. అందరి కళ్ళలోనూ అదే ఆశ్చర్యం.
"అవును. మరి దేవేంద్రుని గర్వమణచడం మీకు తెలిసిందే!"
"ఓ.. తెలుసు! చెరువుల్లో, నదుల్లో నీరు తాగిన మేఘాలను అడ్డి, వర్షం కురిపించేది గోవర్ధన గిరేనని, పూజలు దానికే జరగాలని చెప్పాడు కృష్ణుడు. అలాగే చేసామని ఇంద్రుడు కోపగించి ఉరుములూ, మెరుపులతో బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు!" కళ్ళు వెడల్పు చేసి చెప్పింది తరళ.
" ఏనుగులు తొండాలతో జలధారలు చిమ్ముతున్నట్టే! ఏం భీభత్సమైన వర్షమసలు! ఆలమందలనూ, గోపాలకులనూ కాపాడేందుకు గోవర్ధన గిరిని అమాంతం పైకెత్తి, చిటికెన వేలిపై నిలిపాడు కృష్ణుడు!! భయం లేదని నవ్వుతూ పిలిచాడు. ఆ నవ్వులో ఏం మాయ ఉందో! పరుగున వెళ్ళి తలదాచుకున్నాం."అంది కమలిని.
"కృష్ణుడికి తోడుగా మా తాత ములుగఱ్ఱ కొండకి దన్ను పెట్టాడులే!" నవ్వింది సురభి.
"దేవేంద్రుడు ఏడు రోజులకు తెలుసుకున్నాడు! పరుగున వచ్చి "సచ్చిదానంద రూపా! గోవర్ధన గిరిధారీ!" అని పాదాల మీద పడ్డాడు." గర్వంగా చెప్పింది కమలిని.
"అంతేనా! ఆషాఢ మాసం మొదలుకుని రెండునెలలు తనకూ, రెండు నెలలు కృష్ణుడికీ పూజా ఫలం దక్కేలా ఒప్పందం చేసుకున్నాడు. కృష్ణుడు ఉపేంద్రుడయ్యాడు!" సంబరంగా చెప్పింది తరళ.

"బ్రహ్మేంద్రాదులకు సైతం పూజ్యుడు శ్రీ కృష్ణుడు. వేద ప్రమాణానికి మాత్రమే గోచరమయ్యే పరంజ్యోతి స్వరూపుడు. అలాంటి వాడు మనతో మన మధ్య ఉన్నాడంటే, ఎన్ని జన్మలు బంగారు పువ్వులతో పూజలు చేసి ఉంటాం!" అంది నీల.
"నిజమే! ఓ శ్లోకం, ఓ వేదపాఠం ఏదీ తెలియని వెర్రి గొల్ల పిల్లలం! మాకు దక్కే భాగ్యమా చెప్పు! మాకేం చేతనవును!" మళ్ళీ నిస్సహాయత కమ్మేసింది అందరినీ.
"నేను చెప్పేదీ అదే! జపతపాలకు లొంగనివాడు ప్రేమకు లొంగుతాడు. మీ వద్ద ఉన్నదదే!"
"లేదులే నీలా! ఏదో మా వెర్రిగానీ!"
"మహర్షులు సైతం ఎదురుగా కనిపించిన కృష్ణస్వామి కమనీయ రూపానికి వివశులైపోతారట! "జపమముంచత. హోమమముంచత. తపమముంచత..!" అని జపం, తపం, హోమం అన్నీ వదిలి రెప్పవేయకుండా ఆతనిని చూస్తూ పరవశులైపోతారట. అది తప్పు కాదు. భగవదారాధనలో అతి ప్రధానమైన మార్గం ప్రేమ. గోపికల ఆస్తి అదే!" అని చెప్తున్న నీల వైపు అపనమ్మకంగా చూసారు అందరూ.
"నమ్మరా?  రాముడి వెంట అడవులకు వెళ్ళి, అన్నకు నీడలా మసలుకున్న లక్ష్మణుడు ఏ జపమాచరించాడు? ఏ హోమం చేసాడు?  మాధవుడు ప్రేమకి మాత్రమే కట్టుబడేవాడు." చిరునవ్వు వెన్నెలలు కురిపించింది నీల.
"నువ్వే మార్గ దర్శకురాలివి! స్వామిని నిద్ర లేపేందుకు ఏం చెయ్యాలో చెప్పు!" గోపికలు అడిగారు ఏకకంఠంతో.
"పిలవండి. మనసారా పిలవండి. అన్ని శంకలూ మాని పిలవండి. అరిషడ్వర్గాలు అంటని "శుధ్ధ సత్వరూపం" పరమాత్మ! మానవ రూపంలో ఉన్నా ఆయనని కామక్రోధాలు అంటవు. లోభమోహాలు సోకవు. మదమాత్సర్యాలు చేరవు. మనమూ వాటిని విడిచి పిలిస్తే పలుకుతాడు." వారి మనసులో మిగిలి ఉన్న సంశయాన్నీ, బాధనూ తొలిగించింది. నిష్కల్మషమైన మనసుతో కృష్ణుని ముంగిట నిలచి పాడసాగారందరూ!

బంగరు కడవల నిండా పాలు
పొంగి పొరల కురిపించే ఆలు
చాల కలుగు నందుని గారాల నందనా!
ముని హృదయస్యందనా!

వైకుంఠమ్ము విడిచి, లోక
లోకమ్ములు కడచి
మాకోసము దిగివచ్చిన స్వామీ! మేలుకో!
మేలుకో తేజోమయ! నీలాప్రియ! మేళుకో!
మేలుకో భక్తాశ్రితపాళీ సరసిజహేళీ!

వైరులు నీ శౌర్యమ్మునకోడి!
సైరింపక, నీ వాకిట కూడి,
బీరమేది శ్రీపదముల
వారల కొలిచే తీరున,
చేరి మంగళాశాసన
మును చేసి, ముదమ్మున కై
వారమ్ములు చేసి, వచ్చి
నార మయ్య, నిదురమాని మేలుకో!

కృష్ణుడు నిద్రలేవలేదు. అలికిడి చేయలేదు. పిలుపు విని పలుకలేదు.

"కృష్ణా! నందనందనా! నందుని వద్ద ఎన్ని కడవలైనా నింపే క్షీరధారలు గల ఆలమందలు వేలకు వేలున్నాయి. అది నీ మహిమే కదూ! మాకోసం ఎంత భోగ్యమైన వైకుంఠాన్ని వదిలి వచ్చావు! నీ దయ అపారం! తేజోమయా! నీలాప్రియా! మేలుకో! నిన్ను చూడాలని మా మనసు ఉవ్విళ్ళూరుతోంది. నీ శౌర్యానికి ఓడి నీ ముంగిట నిలచిన శత్రువులను సైతం కాపాడే వాడివి. నువ్వే శరణమన్న విభీషణుడిని కాచావు. యుధ్ధభూమిలో విల్లు విరిగి నిలబడిన రావణుని దయతలచి, రేపటి దాకా సమయమిస్తున్నానని కరుణించి మరొక అవకాశం ఇచ్చావు. అంత దయామయుడివి! మాలాంటి గొల్లలకు ఇంత పరీక్ష ఎందుకు పెడుతున్నావో? నిన్నటి వరకూ మేము బాధతో అల్లాడుతున్నామనుకునే వారం. ఈ బాధలో తీపి ఈనాడు తెలిసొచ్చింది. మాదెంత పున్నెమో అర్ధమయింది. కృష్ణుడే మా వద్దకు వస్తాడనుకునే వారం. కానీ స్త్రీలమనే భావన కూడా విడిచి నీకోసం పరుగున వచ్చాం. ఇంక ఆగలేక వచ్చాం. నిన్ను చూడాలి. నీ సాన్నిధ్యం కావాలి. అనే కోరికతో వచ్చాం. మేలుకో!" అని పిలిచారు. ఎదురు చూసి చూసి "సరే! నిద్రపో! రేపు మళ్ళీ వస్తామని" వెనక్కి మరలారు.
"అయ్యో! ఇళ్ళకు వెళ్ళిపోతున్నారా?" అని జాలిపడింది నీల.
"నీలా! మహా లక్ష్మీ! నీ నోట మాధవుని గుణగానం విన్నాం. మాకది చాలు. రేఫు వస్తాం. రిక్కలనైనా లెక్కించవచ్చు. ఇసుక తిన్నెలో రేణువులెన్నున్నాయో గణించవచ్చు. సముద్రంలో నీటి బిందువులెన్నో కనుక్కోవచ్చు. ఆ పరంజ్యోతి, పరమపురుషుడు, కృష్ణుని సుగుణ గణన ఎవరి తరం?! ఎన్ని కథలు చెప్పుకుంటే కరువు తీరుతుంది! ఎన్ని పాటలు పాడితే తనివి తీరుతుంది! ఈ భాగ్యం కోసం ఎన్ని మార్లైనా వస్తాం. సెలవు!" అని వెనుదిరిగారు గోపవనితలు. తృప్తిగా నవ్వుకుంది నీల. వారి మనసులో సంశయం లేదు. బాధ లేదు. ఉన్నది ప్రేమ ఒక్కటే!


* రేపూ కృష్ణుని మేలుకొలుపుదాం!


(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )

(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)



6 comments:

  1. "వారి మనసులో సంశయం లేదు. బాధ లేదు. ఉన్నది ప్రేమ ఒక్కటే!"

    మీ తిరుప్పావై కథలు చదువుతున్నంతసేపూ- అది చాలా కొంచెం సమయమే అయినా ఏదో లోకం లో వున్నట్టు తెలియని ప్రశాంతత. పైన మీరు వ్రాసిన ఆ వాక్యంలో వున్న ఆ సంశయం, బాధ లేని ఏదో భరోసా. ఇలా చెప్తున్నానని అతిశయోక్తి అనుకోకండేం!

    నేను ముందు కథలు చదివి చెప్పినట్టు మనసులోని నలుపుని కడిగేస్తోంది - మీ రేపల్లె పడచుల మధుర భక్తి.

    ~లలిత

    ReplyDelete
  2. కొత్తావకాయ్ గారూ!అద్బుతమైన వర్ణన!
    ఎలా అభినందించాలో తెలియట్లేదు..
    చిన్నవారైతె ఆశీస్సులు..పెద్దవారైతే వందనాలు..

    రమాకుమారి
    balantrapuvariblog.blogspot.com
    stotramalika.blogspot.com

    ReplyDelete
  3. నేలపై నీలిమేఘాలు పరుగులు పెడుతున్నాయేమో అని నెమళ్ళు పురివిప్పి నాట్యమాడసాగాయి. పుష్పవర్షం కురవసాగింది.
    ............మాటల్లేవ్.......

    ReplyDelete
  4. "నేలపై నీలిమేఘాలు పరుగులు పెడుతున్నాయేమో అని నెమళ్ళు పురివిప్పి నాట్యమాడసాగాయి."

    ఈ వాక్యం ఒక మంచి పాటను గుర్తు చేసిందండీ...పి. సుశీల గారు పాడిన "శ్రీ రామ గాన లహరి" అనే ప్రైవేట్ ఆల్బం నుంచి...

    **నీల మేఘ శ్యాముడు నా మ్రోల నిలిచెను
    కాలమెల్ల తనలో దాచు లీల మెరిసెను..
    రాముడు...నీల మేఘ శ్యాముడు నా మ్రోల నిలిచెను

    నెమలులన్నిపురులు విప్పి ప్రమాద నాట్యమాడెను
    వానకారు అవేళలో వచ్చినటుల తోచెను
    మరీ మరీ మబ్బులలో మసలుట చేత
    సూర్యుడే నీలమై సొగసించేనా
    రవిని పదే పదే మూసివేయు ఫలితముగా
    జలదమే ఇన కులమున జనియించెనా
    నీల మేఘ శ్యాముడు నా మ్రోల నిలిచెను

    ReplyDelete
  5. నీలా దేవి గారు పాపం రాత్రే రికమెండ్ చేయవచ్చు కదా.. గోపమ్మలు రోజూ వచ్చి వెళ్తున్నారని :-(

    ReplyDelete
  6. మధుర మనోజ్న మనోహర వన విహార భాగ్యం కలిగించినందుకు
    కృతజ్ఞతలు. ఆనందాన్ని అంబరాన్ని తాకించినందుకు కూడా ...
    మొదటిసారిగా మీ బ్లాగ్ చూశాను. ఏం మిస్సవుతున్నానో
    తెలుసుకున్నాను.
    రమాకుమారి గారన్నట్లు "చిన్నవారైతే ఆశీస్సులు ...
    పెద్దవారైతే వందనాలు ... అభినందన చందనాలు"

    ReplyDelete